
పుస్తకాలు టెర్రరిస్టు నేరస్థులను తయారు చేయవని జమ్మూ, కాశ్మీర్ & లడఖ్ హై కోర్టు ఒక నిందితునికి బెయిల్ మంజూరు చేస్తూ స్పష్టం చేసింది. కాశ్మీర్ కు చెందిన స్మాలర్ షాఫత్ మక్బూల్ వాని వద్ద అభ్యంతరకర పుస్తకాలు ఉన్నాయని, సదరు పుస్తకాలు టెర్రరిజాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ప్రజా భద్రతా చట్టం (పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ -పిఎస్ఏ) కింద గత సంవత్సరం నిర్బంధం లోకి తీసుకుంది. ఆయన అరెస్ట్ చట్ట విరుద్ధం అని నిర్ధారిస్తూ కోర్టు ఆరోపణలను కొట్టివేసింది.
గత సంవత్సరం కాశ్మీరు ఉద్యమాల చరిత్రను వివరించిన 25 పుస్తకాలను జమ్ము&కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం టెర్రరిజం ప్రోత్సహిస్తున్నాయని ఆరోపిస్తూ నిషేధించన నేపధ్యంలో పుస్తకాలు టెర్రరిస్టులను తయారు చేయవని తాజా తీర్పు వెలువడటం విశేషం. ఈ తీర్పు నేపధ్యంలో పుస్తకాలపై ప్రభుత్వాలు కక్ష కట్టటం, వాటిని ప్రచురించకుండా, ప్రచురించిన పుస్తకాలను అమ్మకానికి రాకుండా నిషేధించే ప్రభుత్వాలకు కనువిప్పు అవుతుందేమో చూడాలి.
మక్బూల్ వాని పైన పిఎస్ఏ చట్టం కింద నిర్బంధం లోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అతని తండ్రికి మిలిటెంట్లతో సంబంధాలు ఉన్నాయని, అంతర్జాతీయ అకడమిక్ కాన్వరెన్స్ లలో హాజరు కావటానికి ఆహ్వానాలు అందాయని ఆరోపిస్తూ 1967 నాటి ఉపా చట్టాన్ని కూడా ప్రభుత్వం ప్రయోగించి కేసు నమోదు చేసింది. అలాగే తీవ్రవాద భావజాలం బోధించే పుస్తకాలను ఆయన కలిగి ఉన్నాడని కూడా ఆరోపిస్తూ తీవ్ర నిబంధం చర్యలను ప్రయోగించింది. ఈ ఆరోపణలను హై కోర్టు కొట్టి వేస్తూ తీర్పు చెప్పింది.
“పిటిషనర్ కు వ్యతిరేకంగా విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడినట్టుగా ప్రతివాది (ప్రభుత్వం) ఎలాంటి సాక్ష్యాన్ని కోర్టు ముందు ఉంచలేదు. ప్రభుత్వం, నిందితులను ముందస్తు నిర్బంధం (ప్రివెంటివ్ డిటెన్షన్) లోకి తీసుకునే అవసరం వారికి ఎందుకు కలిగిందో వారు చూపలేదు” అని హై కోర్టు జడ్జి మోక్ష ఖజూరియా కజ్మీ తీర్పులో పేర్కొన్నారు.”
“ఉపా కేసు తో పాటు రాజ్య పాలనకు భంగం కలిగే విధంగా పిటిషనర్ ఏ విధమైన చర్యలకు పాల్పడ్డారు అన్న విషయాన్ని నిరూపించే విధంగా ఏ విధమైన నిర్దిష్ట కార్యకలాపాన్ని డీటైనింగ్ అధికారి కోర్టుకు చూపలేకపోయారు” అని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది.

ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ప్రయోగానికి కారణాలు వివరిస్తూ జమ్ము & కాశ్మీర్ రాష్ట్ర పోలీసులు వాని తండ్రి సెపరేటిస్ట్ భావజాలం కలిగి ఉన్నాడని ఆరోపించారు. వాని తండ్రికి అనేక సార్లు అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ల నుండి ఆహ్వానాలు అందాయని, అదేదో పెద్ద నేరం అయినట్టు ఆరోపించారు. ‘మక్బూల్ వాని’కి చిన్నప్పటి నుండి ఇండియా వ్యతిరేక భావాలను ఆయన తండ్రి నూరిపోశాడని ఆరోపించారు. తండ్రి మాజీ మిలిటెంట్ అనీ, టెర్రరిస్టు సంస్థ ఆల్-బార్క్ సభ్యుడిగా పని చేస్తూ 1990లో ప్రభుత్వానికి లొంగిపోయాడని ఆరోపించారు.
ఈ ఆరోపణల ప్రకారం చూస్తే సో-కాల్డ్ కాశ్మీర్ టెర్రరిస్టులు ప్రభుత్వానికి లొంగిపోయినా సరే వారిని భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వదిలి పెట్టవు. ఆయన పైన టెర్రరిస్టు ఆరోపణలు కొనసాగుతూ ఉంటాయి. అక్కడితో ఆగకుండా ఇరుగు పొరుగు వారికి, తన కొడుకు కూతుళ్లకు, బంధు మిత్రులకు ఇండియా వ్యతిరేక భావాలు నూరిపోస్తూ ఉంటాడని ప్రభుత్వాలు నమ్ముతూ ఉంటాయి. తాను నమ్మిన ప్రకారం కొడుకు మక్బూల్ వాని కి సెపరేటిస్టు భావాలు నూరి పోసి ఉంటాడు కనుక, మక్బూల్ టెర్రరిస్టుగా తయారై ఉంటాడు కనుక అతనిని పిఎస్ఏ యాక్ట్ కింద పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేసి జైలులో కుక్క వచ్చన్నమాట! ఇంతకంటే హాస్యాస్పదమైన ప్రజా వ్యతిరేక భావజాలం, ప్రజల పైన కక్ష పూరితంగా వ్యవరించే ప్రభుత్వ ధోరణి మరి ఉండబోవు.
మక్బూల్ డిటెన్షన్ కు కారణాలు చెబుతూ పోలీసులు “ఆయన మధ్య ప్రాచ్యం, దక్షిణాసియా మరియు ఆఫ్రికన్ స్టడీస్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ లాంటి అనేక అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లకు ఆహ్వానాలు అందాయని ఆరోపించారు. ఎంత విచిత్రం అంటే మధ్య ప్రాచ్యం దేశాలన్నింటితో మోడి ప్రభుత్వం సత్సంబంధాలు కలిగి ఉన్నది. యుఏఈ, ఇరాన్, కతార్, బహ్రెయిన్, ముస్లిం టెర్రరిస్టులను పనిగట్టుకుని ఉత్పత్తి చేసే సౌదీ అరేబియా లాంటి దేశాలతో మోడి ప్రభుత్వం గాఢమైన స్నేహ, వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నది. సౌత్ ఆసియా అంటే ఇండియాతో సహా 7 దేశాలు. వాటిలో పాకిస్తాన్ తప్ప మిగతా అన్ని దేశాలతో ఇండియా వాణిజ్యం, స్నేహం చేస్తుంది. బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్ దేశాల పైన పెత్తనానికి చైనాతో పోటీ పడుతూ ఉంటుంది. ఇక ఆఫ్రికా దేశాలు టెర్రరిస్టు దేశాలు అని బహుశా ఎవరూ అనరు. కానీ ఈ మూడు ప్రాంతాలలో జరిగే అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లకు ఆహ్వానం అందితే గనక అతను టెర్రరిస్టు అవుతాడని ఇప్పుడు కొత్తగా తెలుస్తోంది. ఇక కాశ్మీర్ పౌరులు పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకోవటంతో మొదలు పెట్టి రాత్రి పడుకునే వరకు చేసే ఏ చర్య అయినా భవిష్యత్ లో టెర్రరిస్టు చర్య అవుతుందేమో చూడాలి. మరీ విచిత్రంగా డూబ్లిన్ సిటీ యూనివర్సిటీ జరిగిన 8 వ వార్షిక దక్షిణాసియా కాన్ఫరెన్స్ కి ఆహ్వానం అందుకోవటం కూడా మక్బూల్ వాని చేసిన టెర్రరిస్టు నేరమట!
మక్బూల్ వాని వద్ద యాంటీ-నేషనల్ సాహిత్యం దొరికిందని, అందులో ఆయన రాసిన పుస్తకం కూడా ఒకటని ఆయనని ఏడాది కాలం పాటు నిర్బంధం లో ఉంచటానికి పోలీసులు చెప్పిన కారణాలలో ఒకటి.
మక్బూల్ లాయర్ ఈ ఆరోపణలను తిప్పికొట్టాడు. మక్బూల్ రాశాడని చెప్పిన పుస్తకాన్ని నిజానికి ఆయన రాయలేదని మక్బూల్ తరపున వాదించిన లాయర్ కోర్టుకు చెప్పాడు. మక్బూల్ వాస్తవానికి ఒక విద్యావేత్త అని, స్కాలర్ అనీ, అటువంటి వ్యక్తి వద్ద వివిధ రకాల సాహిత్యం తప్పనిసరిగా ఉంటుందని, స్కాలర్లు ఎవరి వద్దైనా అలాంటి పుస్తకాలు ఉంటాయని కోర్టుకు వివరించాడు. ఒక స్కాలర్ వద్ద ఉండవలసిన వివిధ రకాల సాహిత్యం, రచనలు, చరిత్ర పుస్తకాలు ఉన్నంత మాత్రాన ఆయన పబ్లిక్ సేఫ్టీకి ప్రమాదకారి ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించాడు.

పోలీసుల వాదనలను కోర్టు వ్యతిరేకించింది. మక్బూల్ లాయర్ వాదనలతో ఏకీభవించింది. పుస్తకాలు, సాహిత్యం ఉన్నంత మాత్రాన నేరస్థులు కాబోరని తీర్మానించింది. అసలు పుస్తకాలు నేరస్తులను తయారు చేయజాలవని చెబుతూ పిఎస్ఏ చట్టం ప్రకారం నిందితునిపై మోపిన కేసులను కొట్టివేసింది.
గత యేడు ఆగస్టులో “వేర్పాటు వాద సెంటిమెంట్లు ప్రోత్సహిస్తున్నాయని, తప్పుడు కధనాలను ప్రచారం చేస్తున్నాయని చెపుతూ జమ్ము & కాశ్మీర్ ప్రభుత్వం 25 పుస్తకాలను నిషేధించింది. రాష్ట్ర ప్రభుత్వం అంటే అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నాయకత్వంలో ఉన్న నామమాత్ర ప్రభుత్వం కాదు. జమ్ము & కాశ్మీర్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నది. ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ పాత రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మోడి ప్రభుత్వం విడగొట్టింది. ఈ నిర్బంధ చట్టాలను ప్రయోగిస్తున్నది మోడి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వమే. కాశ్మీర్ లోని 25 పుస్తకాలను రద్దు చేశాక కేంద్రం దేశం లోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, పబ్లిక్ లైబ్రరీలు మొ.న వాటికి ఆదేశాలు ఇచ్చింది: మీ దగ్గర ఉన్న అన్ని పుస్తకాలు, పత్రికలలో అనుచితమైనవి, అభ్యంతరకరమైనవి ఉన్నట్లయితే వాటిని తొలగించడి అని.
కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం పుస్తకాలు, పత్రికలకు కూడా భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే అనుచితమైన పుస్తకాలు, సాహిత్యం అంటే ఏమిటో కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పి ఉండాల్సింది. జమ్ము-కాశ్మీర్ హై కోర్టు ప్రకారం కాశ్మీర్ చరిత్ర పుస్తకాలు అనుచితం కావని తేలిపోయింది. అంతవరకైనా కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా?