అక్రమ యూదు సెటిల్మెంట్లపై బ్రిటన్ ఆస్ట్రేలియా ఆంక్షలు!

Right extremist leader Daniella Weiss (2d from right)

–

వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెల్ అక్రమంగా నిర్మిస్తున్న యూదు సెటిల్మెంట్ లను వ్యతిరేకిస్తూ ఆస్ట్రేలియా, నవంబరు 18 తేదీన ముగ్గురు ఇజ్రాయెలీ వ్యక్తుల పైనా, అక్రమ సెటిల్మెంట్లను ప్రోత్సహిస్తూ పాలస్తీనా అరబ్బుల పైన హత్యలు, హింసాకాండ సాగిస్తున్న నాలుగు యూదు తీవ్ర వాద సంస్థల పైనా ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించింది.

అక్రమ నిర్మాణ కార్యకలాపాలు మరియు యూదు తీవ్రవాద చర్యలు రెండు రాజ్యాల (ఇజ్రాయెల్, పాలస్తీనా) ఏర్పాటు పరిష్కారాన్ని అసాధ్యం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆస్ట్రేలియా ఈ ఆంక్షలను ప్రకటించింది. ఆంక్షలకు టార్గెట్ గా ఉన్న వ్యక్తులు, సంస్థలు కొత్త సెటిల్మెంట్ల నిర్మాణాలలో చురుకుగా వ్యవహరిస్తున్నారని, నిధులు సమకూర్చటం, వాలంటీర్లను రిక్రూట్ చేసుకోవటం, హింసకు పాల్పడుతున్న యూదు సెటిలర్ లకు సహాయ సహకారాలు అందజేయటం చేస్తున్నారని ఆస్ట్రేలియా ఆరోపించింది.

యూదు సెటిలర్ ఆర్గనైజేషన్ ‘నచాల’ నాయకురాలు డేనియెల్లా వీఎస్ ఆంక్షలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరు. గాజా నుండి పాలస్తీనీయులను తరిమి కొట్టాలని ఆమె బలంగా వాడిస్తుంది. మరొక వ్యక్తి ఎలియావ్ లిబి, తన కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా వెస్ట్ బ్యాంక్ లో అక్రమ సెటిల్మెంట్ల నిర్మాణాన్ని విస్తరిస్తున్నాడు. ఆస్ట్రేలియా విధించిన ఆంక్షల ప్రకారం ఆంక్షలు విధించబడిన ఇజ్రాయెల్ వ్యక్తులు మరియు సంస్థలతో వ్యాపారాలు చేయటం, వారికి మద్దతు ఇవ్వటం లాంటివి ఆస్ట్రేలియన్లు మరియు ఆస్ట్రేలియన్ వ్యాపార కంపెనీల చేయరాదు.

“మేము ఆంక్షలు ప్రకటించిన వ్యక్తులు, సంస్థలు సెటిల్మెంట్ల నిర్మాణాల ప్లానింగ్, సమన్వయం, కొత్త సెటిల్మెంట్ల రూపకల్పన మొ.న కార్యకలాపాల్లో చురుకుగా నిమగ్నమై ఉన్నారు. వాటికి నిధులు సమకూర్చుతున్నారు. పాలస్తీనా అరబ్బులపై హంతక దాడులు, గృహ దహనాలు, పంటల నాశనం, నీటి వనరుల దురాక్రమణ మొ.న కార్యకలాపాలకు మద్దతు అందిస్తున్నారు” అని ఆస్ట్రేలియా విదేశీ మంత్రి పెన్నీ వాంగ్ ఆరోపించింది.

“ఇటీవల ఊపందుకున్న E1 సెటిల్మెంట్ ప్రాజెక్టు రెండు-రాజ్యాల పరిష్కార సాఫల్యానికి ప్రమాదకరంగా మారింది. ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న వెస్ట్ బ్యాంక్ ను ఈ E1 ప్రాజెక్టు రెండుగా విభజిస్తుంది. తూర్పు జెరూసలేం ను వెస్ట్ బ్యాంక్ నుండి వేరు చేస్తుంది. ఫలితంగా పాలస్తీనా ప్రజలు తమ భవిష్యత్తు దేశంగా భావిస్తున్న భూభాగాలను ముక్కలు ముక్కలుగా అవతరించే ప్రమాదం ఏర్పడింది” అని పాలస్తీనా విదేశీ మంత్రి ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ వారం ఇజ్రాయెలీ సెటిలర్ తీవ్రవాదులు 72 యేళ్ళ పాలస్తీనా మహిళన కాల్చి చంపారు. వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తీనా నగరం జెరికో లో సెటిలర్లు అనేక పాలస్తీనీయుల ఇళ్లను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఇళ్ళలో నివశిస్తున్న అరబ్ ప్రజలను కొట్టి, తన్ని, కాల్పులు జరిపి అక్కడి నుండి వెళ్లగొట్టారు. ఇలా పాలస్తీనా అరబ్బుల ఇళ్లపై దాడులు చేయటం, ఎలక్ట్రానిక్ వస్తువులను ధ్వంసం చేయటం, ఇళ్లను బుల్ డోజర్లతో కూలగొట్టటం, అడ్డు వచ్చిన అరబ్బుల పైన బుల్ డోజర్లను నడిపి చంపటం ఇది ఆరంభము కాదు, అంతము కాదు.

–

ప్రపంచం లోని అనేక దేశాల ప్రజలు గాజా యుద్ధం అక్టోబర్ 7, 2023 నాటి హమాస్ దాడితోనే ప్రారంభం అయిందని భావిస్తారు. కానీ దశాబ్దాలుగా గాజా, వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తీనా అరబ్బుల పైన యూదులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అనేక యూదు తీవ్రవాద సంస్థలు ఏర్పడి పని చేస్తున్నాయి. ఈ సంస్థలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం నేరుగా మద్దతు ఇస్తుంది. అవసరం అయితే పోలీసు, మిలటరీ మద్దతు సమకూర్చుతుంది. అక్కడితో ఆగకుండా ప్రభుత్వమే స్వయంగా మిలటరీ చర్యలకు దిగి వారి ఇళ్లను, ప్రభుత్వ నిర్మాణాలను ధ్వంసం చేస్తుంది. తద్వారా పాలస్తీనా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ, వారికి ‘సెటిల్ అయ్యామ’న్న భరోసా కలగకుండా చేస్తుంది.

భవిష్యత్తులో పాలస్తీనా అరబ్బులకు స్వతంత్ర దేశంగా ఏర్పడనున్న ప్రాంతాలుగా పరిగణిస్తున్న ఏరియాలో యూదు తీవ్రవాదులు అక్రమ సెటిల్మెంట్లు నిర్మించటం దశాబ్దాలుగా ఒక అంతర్జాతీయ సమస్యగా నానుతోంది. గాజా, వెస్ట్ బ్యాంక్ లను పాలస్తీనా దేశంగా ఏర్పడేందుకు బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న కాలంలో ఇజ్రాయెల్, పి‌ఎల్‌ఓ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం మేరకు ‘పాలస్తీనా ఆధారిటీ’ పేరుతో పాలస్తీనా ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఈ ఒప్పందాన్ని ఓస్లో ఒప్పందం గా చరిత్రలో రికార్డ్ అయింది. కానీ ఒప్పందం జరిగిన మరుసటి రోజు నుండే ఇజ్రాయెల్, ఒప్పందాన్ని కాలరాయటం మొదలు పెట్టింది.

తూర్పు జెరూసలేం రాజధానిగా పాలస్తీనా స్వతంత్ర దేశం ఏర్పడవలసి ఉండగా తూర్పు జెరూసలేంతో పాటు వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెల్ ప్రభుత్వం అక్రమంగా, అంతర్జాతీయ ఒప్పందాలకు, ముఖ్యంగా ఓస్లో ఒప్పందానికి, విరుద్ధంగా సెటిల్మెంట్లు (నివాస కాలనీలు) నిర్మించటం మొదలు పెట్టింది. వాస్తవానికి 1967 నాటి ఇజ్రాయెల్-అరబ్ యుద్ధం నాటి అంతర్జాతీయ సరిహద్దులకు అనుగుణంగా పాలస్తీనా ఏర్పడవలసి ఉండగా, అక్రమ యూదు సెటిల్మెంట్ల నిర్మాణం అందుకు ప్రధాన అడ్డంకిగా మారింది.

Jewish extremist leader Daniella Weiss

–

గత పదేళ్లుగా వెస్ట్ బ్యాంక్ లో అక్రమ సెటిల్మెంట్ల నిర్మాణం వేగం పుంజుకుంది. ముఖ్యంగా బెంజమిన్ నెతన్యాహు ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుండి విచ్చలవిడి నిర్మాణాలు జరుగుతూ వస్తున్నాయి. ఓ వైపు గాజా పైన అవకాశం వచ్చినప్పుడల్లా, ఏదో ఒక వంకతో హంతక దాడులు సాగిస్తూ మరో పక్క పి‌ఎల్‌ఓ (పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్) పాలనలో ఉన్నట్టు చెబుతున్న వెస్ట్ బ్యాంక్ లో వివిధ దేశాల నుండి యూదులను రప్పించి, ఒక పద్ధతి ప్రకారం సెటిల్మెంట్లు నిర్మిస్తున్నారు.

అక్రమ సెటిల్మెంట్ నిర్మాణాలు చట్ట విరుద్ధం అని ఐక్య రాజ్య సమితి క్రమం తప్పకుండా ఖండిస్తుంది. ఐరాస భద్రతా సమితిలో తీర్మానాలు ఆమోదిస్తూ ఉంటారు. అమెరికా, ఐరోపా రాజ్యాలు కూడా అక్రమ సెటిల్మెంట్లు నిర్మించవద్దని ఇజ్రాయెల్ కు హితబోధ చేస్తూ ఉంటాయి. కానీ నిర్మాణాలు మాత్రం జరిగిపోతూ ఉంటాయి.

ఆ ముందు రోజే అనగా మంగళవారం, నవంబర్ 17 తేదీన బ్రిటన్ కూడా ఇజ్రాయెల్ కు చెందిన 8 కన్స్ట్రక్షన్ కంపెనీల పైన ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో సెటిల్మెంట్ల నిర్మాణం వెంటనే ఆపాలని కోరింది. అయితే అమెరికా తర్వాత ఇజ్రాయెల్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చే దేశం బ్రిటన్. నిజానికి పశ్చిమాసియాలో అరబ్బులకు, యూదులకు మధ్య ఘర్షణ రగిల్చి, ఆ ఘర్షణ దశాబ్దాల పాటు మండుతూ ఉండేలా కుట్రకు పాల్పడిన దేశం బ్రిటన్. బ్రిటన్, ఫ్రాన్స్ లు తమ సొంత భౌగోళిక ప్రయోజనాల కోసం, మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఒట్టోమన్ సామ్రాజ్యం (టర్కీ) నుండి స్వాధీనం చేసుకున్న అరబ్ భూభాగాలను చిత్తానుసారం విభజించి, అరబ్బు దేశాల మధ్య యూదు రాజ్యాన్ని స్థాపించటానికి కుట్ర చేసి అమలు చేశాయి.

రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ సామ్రాజ్యవాదం బాగా బలహీన పడటంతో ప్రపంచ పెత్తనం బ్రిటన్ చేతుల్లో నుండి అమెరికా చేతులకు మారింది. అమెరికా, ఐరోపా దేశాలు పశ్చిమాసియా లోని అరబ్బు దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం కొంసాగినంత వరకు అక్కడ శాంతి స్థాపన జరగటం, పాలస్తీనా స్వతంత్ర రాజ్యం ఏర్పడటం అసాధ్యం. పశ్చిమాసియా నుండి అమెరికా, ఐరోపా రాజ్యాలను వారి మిలటరీ స్థావరాలను తరిమి వేసే లక్ష్యంతోనే ఇరాన్, గాజా లోని హమాస్, యెమెన్ లోని హుతీ, దక్షిణ లెబనాన్ లోని హిజ్బొల్లా, ఇరాక్ లోని పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ కృషి చేస్తున్నాయి. పశ్చిమాసియా నుండి అమెరికా, ఐరోపా రాజ్యాలను వెళ్లగొడితే, ఒక్క అరబ్బు రాజ్యాల ప్రజలే కాదు, ప్రపంచ దేశాల ప్రజలకు కూడా యుద్ధాల నుండి విముక్తి లభిస్తుంది.

స్పందించండి