
–
ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల్లో జగన్ నాయకత్వం లోని వైఎస్‌ఆర్ పార్టీ కి తీవ్ర స్థాయిలో ఆశాభంగం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి విజయానికి ఈవిఎం ల మ్యానిపులేషన్ ప్రధాన కారణమని వైఎస్ జగన్ ఆరోపించాడు. కానీ బ్యాలెట్ పత్రాలతో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రదర్శన పేలవంగా ఉండటం వైసిపి పార్టీ నేత ఆరోపణలను అనుమానంలో పడేసింది.
టిడిపి, జేఎస్‌పి, బిజేపి పార్టీలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి బ్యానర్ కింద పోటీ చేశాయి. ఉమ్మడిగా పోటీ చేయటం వలన అవి లాభపడినట్టు బ్యాలట్ పోలింగ్ ఫలితాలు తెలియజేస్తున్నాయి.
మొత్తం 582 జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్శీస్ (జెడ్‌పిటిసి) లకు ఎన్నికలు జరగగా అందులో టిడిపి కి 406 స్థానాలు, జనసేన పార్టీకి 73 స్థానాలు, బిజేపి కి 20 స్థానాలు దక్కాయి. ఎన్‌డిఏ కూటమికి మొత్తం 499 స్థానాలు దక్కాయి. కాగా ఒంటరిగా పోటీ చేసిన వైఎస్‌ఆర్‌సిపి కి 76 జెడ్‌పిటిసి స్థానాలు దక్కాయి.
రాష్ట్రంలో మొత్తం 7,768 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు (ఎంపిటిసి) ఎన్నికలు జరిగాయి. టిడిపి 4,806 ఎంపిటిసి స్థానాలు గెలుచుకుంది. దాని మిత్రపక్షం జనసేన పార్టీ 938 ఎంపిటిసి లు గెలుచుకోగా, బిజేపి 117 ఎంపిటిసి లలో విజయం సాధించింది.
వైఎస్‌ఆర్‌సిపి కాస్త మెరుగుగా 1,711 ఎంపిటిసి స్థానాలు దక్కించుకుంది. కాగా సిపిఐ(ఎం) పార్టీ 15 ఎంపిటిసి లలోనూ, కాంగ్రెస్ పార్టీ మరీ ఘోరంగా 9 ఎంపిటిసి లలోనూ, బహుజన్ సమాజ్ పార్టీ 3 స్థానాల్లోనూ విజయం సాధించింది. CPI(M), CPI పార్టీలతో అవగాహన కారణంగా ఎంపిటిసి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి లాభపడినట్టు కనిపిస్తోంది.
ఎన్నికలకు ముందు నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు అనేక చోట్ల టిడిపి కార్యకర్తలు, వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధులు నామినేషన్ వేయకుండా అడ్డుకోవటం, నామినేషన్ పత్రాలు లాక్కొని పరుగెత్తడం లాంటి ఘటనలు జరిగాయి. కొన్ని చోట్ల కొట్టడం కూడా జరిగింది. ఈ దృశ్యాలు అనేకం యూ ట్యూబ్ చానెళ్లలో ప్రసారం అయ్యాయి.
కొన్ని చోట్ల వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధులు “ఎందుకు ఇలా గూండా చర్యలకు పాల్పడుతున్నారు?” అని ప్రశ్నించినపుడు, టిడిపి నాయకులు, కార్యకర్తలు “ఐదేళ్ల క్రితం మీరు చేసింది కూడా ఇదే కదా!” అని ఎదురు ప్రశ్నించటం వినిపించింది. దొందూ దొందే అన్నమాట!
నెల్లూరు జిల్లాలో అయితే ఇంకా ఘోరం. మంత్రి నారాయణకు చెందిన నారాయణ కాలేజీల నుండి విద్యార్ధులను బస్సులలో తరలించి వారిచేత దొంగ వోట్లు వేయించే ప్రయత్నాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. బస్సుల్లో విద్యార్ధులు, విద్యార్ధినులు వచ్చిన దృశ్యాలైతే యూ ట్యూబ్ ఛానళ్ళు ప్రసారం చేశాయి. వారు వోటు వేసింది లేనిదీ తెలియనప్పటికీ ఒక రాష్ట్ర మంత్రి ఈ స్థాయికి దిగజారడం బట్టి “Politics is last resort to scoundrels” అన్న ఓ పెద్దాయన మాట ఎంత నిజమో అర్ధం అవుతోంది.
ఆ పెద్దాయన ఆస్కార్ వైల్డ్ అని కొందరు, జార్జ్ బెర్నార్డ్ షా అని ఇంకొందరు చెప్పబోతారు. కానీ అసలు చెప్పింది, వాళ్ళిద్దరూ కాదు. ఇంగ్లండ్ కవి, రచయిత, సాహితీ విమర్శకుడు శామ్యూల్ జాన్సన్ 1775 లో ఈ మాట చెప్పాడు. అది కూడా ఆయన చెప్పింది పాట్రియాటిజం గురించి తప్ప పాలిటిక్స్ గురించి కాదు. “Patriotism is the last refuge of a scoundrel” అని ఆయన చెబితే దానిని ఇలా మార్చి చెప్పుకుంటున్నారు.
ప్రజాస్వామ్య ప్రక్రియ గా చాటింపు వేసుకునే ఎన్నికలను టిడిపి, వైసిపి ఇరు పార్టీలూ, ఒక ప్రహసనంగా మార్చి వేశాయి. రాజకీయ పార్టీలన్నింటికీ ఈ నేరంలో భాగస్వామ్యం ఉన్నది. ఒక పార్టీ మరొక పార్టీని నిందించి ప్రయోజనం లేదు. ఎటొచ్చీ ప్రభుత్వ ఉద్యోగులైన పోలీసులు అధికార పక్షం వహించటమే కొట్టొచ్చినట్టు కనిపించిన భీతావహ దృశ్యం. పోలీసులను ఈ స్థితికి దిగజార్చిన నేరం కూడా రాజకీయ పార్టీల పైనే ఉన్నది.
గ్రామ పంచాయితీ ఎన్నికలు
రాష్ట్ర ఎన్నికల కమిషన్, గ్రామ పంచాయితీలకు కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు జరపనున్నట్టు కమిషన్ ప్రకటించింది. నవంబర్ 26, నవంబర్ 29, డిసెంబర్ 2 తేదీలలో పంచాయితీ ఎన్నికలను కమిషన్ నిర్వహించనుంది.
ఈ ఎన్నికలకు వరుసగా జవంబర్ 13, 16, 19 తేదీలలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు కమిషన్ తెలిపింది. అలాగే అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలు ముగిసినందున 100 అర్బన్ ప్రాంతాలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ఎత్తివేసినట్టు కూడా కమిషన్ ప్రకటించింది.
గ్రామ పంచాయితీ ఎన్నికలు జరగనున్నందున గ్రామాలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు అమలులో కొనసాగుతాయి. ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల కంటే మించి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మరిన్ని హింసాత్మక సంఘటనలు, రిగ్గింగ్ లు, బూత్ ఆక్రమణలు, కొట్లాటలు చెలరేగే అవకాశం ఉన్నది.

