
–
అవినీతికి అనర్హమైన రంగం ఈ భూమండలంలో ఏదీ లేదు. సకల రంగాల్లోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే కాంట్రాక్టులు అవినీతికి ప్రధాన వనరు. కాగా అక్రమార్కులు, అవినీతి రాజులు, అత్యాశాపరులు, దురాశాపరులు దేశంలో జరుగుతున్న లక్షల కోట్ల రూపాయల అవినీతిలో ప్రధాన భాగస్వాములు. కార్పొరేట్ కంపెనీలు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ అధికారులు, అవినీతిలో మెజారిటీ (కనీసం 90 శాతం) భాగాన్ని వశం చేసుకోగలుగుతున్నారు.
తాజాగా E20 ఇంధనం ద్వారా కొత్త రంగంలో అవినీతికి ప్రభుత్వాలు మార్గాలు తెరిచాయి. ఆయిల్ రిఫైనరీ కంపెనీలతో పాటు, బంకుల యజమానులు, సరఫరాదారులు వక్రమార్గాల్లో లాభాలు పొందే అవకాశం కల్పించబడిందని పరిణామాలు తెలియజేస్తున్నాయి.
E20 పేరుతో కొత్తరకం ఇంధనాన్ని మోడి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశంలో అన్ని పెట్రోల్ బంకుల్లో రెండు రకాల పెట్రోల్ లు అందుబాటులో ఉంచారు. ఒకటి: ఇప్పటివరకు సరఫరా చేస్తూ వచ్చిన సాధారణ పెట్రోల్ ను లీటర్ కు 130 రూపాయలకు పైగా ధర పెంచి అమ్ముతున్నారు. రెండు: E20 పెట్రోలు. పెట్రోలులో 20 శాతం వరకు మొక్కజొన్న, బియ్యం, చెరకు లాంటి కమోడిటీ ల నుండి ఉత్పత్తి చేసిన ఇధనాల్ ను కలిపి, దానిని లీటర్ 118 రూపాయలకు అమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం రెండింటి ధర ఒకటే అని చెబుతోంది. వాస్తవంలో సాధారణ పెట్రోలు కోరే వాహనదారులు ఎక్కువ మొత్తం చెల్లించవలసి వస్తోంది.
పెట్రోల్ లో 20 శాతనం ఇధనాల్ కు బదులు అంతకు మించి కలుపుతున్నారని అనేకమంది వాహనదారులు ఫిర్యాదు చేయటంతో కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుతం విచారణ నిర్వహిస్తోంది. E20 ఇంధనంలో 20 శాతం కంటే ఎక్కువగా, అనగా 30.5 శాతం నుండి 31.2 శాతం వరకు ఇధనాల్ ను కలిపి అమ్ముతున్నారని విచారణ కమిటీ వెల్లడి చేసిన మొదటి నివేదిక తెలియజేసింది. దానితో కర్ణాటక ప్రభుత్వం విచారణ పరిధిని మరింత విస్తృతం చేసింది.
కాంగ్రెస్ పాలిత కార్ణాటక ప్రభుత్వం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసిఎల్), మరియు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) కంపెనీలు రెండూ ప్రభుత్వం అనుమతించిన 20 శాతం కంటే ఎక్కువగా ఇధనాల్ ను పెట్రోల్ లో కలుపుతున్నారని విమర్శించింది. ఆయిల్ కంపెనీలు ఈ ఆరోపణను తిరస్కరిస్తూనే పరీక్షలు జరిపిన ప్రైవేటు ల్యాబొరేటరీల విశ్వసనీయత పైన అనుమానాలు వ్యక్తం చేశాయి. శాంపిల్ సేకరణ, టెస్టింగ్ లలో కర్ణాటక ప్రభుత్వం అనుసరించిన మెధడాలజీ గురించి కూడా ప్రశ్నించాయి.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రకారం కర్ణాటక ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మంత్రి రిజ్వాన్ అర్షాద్ శుక్రవారం పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కర్ణాటకలో సేకరించిన పెట్రోల్ శాంపిల్స్ పరీక్షలలో ఐఓసిఎల్ కంపెనీ 31.2 శాతం ఇధనాల్ ను పెట్రోల్ లో కలుపుతుండగా, హెచ్పిసిఎల్ కంపెనీ 30.5 శాతం ఇధనాల్ కలుపుతోందని తేలిందని చెప్పాడు. ఇవి రెండూ ప్రభుత్వం నిర్ణయించిన 20 శాతం ఇధనాల్ పరిమితిని దాటాయని చెప్పాడు.
మంత్రి ఇచ్చిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాపితంగా వివిధ ప్రాంతాల నుండి 63 శాంపిల్స్ ను కర్ణాటక లీగల్ మెట్రాలజి డిపార్ట్మెంట్ ద్వారా సేకరించగా, ప్రతి 5 శాంపిల్స్ లో నాలుగు శాంపిల్స్ 20 శాతం కంటే మించి ఇధనాల్ కలిపినట్టు తేలింది. అయితే ఆయిల్ కంపెనీలు తమ పరీక్షల వివరాలు ఇవ్వకపోవటం గమనార్హం. “కేంద్ర ప్రభుత్వం నుండి మేము పారదర్శకతను డిమాండ్ చేస్తున్నాం. పరిమితికి మించి ఇధనాల్ కలుపుతున్న కంపెనీలపై చర్య తీసుకుని నష్టపోయిన వాహనదారులకు నష్టపరిహారం చెల్లించాలి. పెట్రోల్ బంకుల వద్ద ఇధనాల్ శాతాన్ని బహిరంగంగా ప్రదర్శించాలి” అని కర్ణాటక మంత్రి డిమాండ్ చేశాడు.
పలు వాహనాలను వాహనాల తయారీదారులు ప్రభుత్వం నిర్దేశించిన E20 ఇంధనానికి తగినట్టుగా ఇంజన్లలో మార్పులు చేశారు. పరిమితికి మించి ఇధనాల్ కలిపితే వాహనాల ఇంజన్ల సామర్ధ్యం పడిపోయి త్వరలోనే వాటి జీవితకాలం ముగిసిపోతుంది. వాహనాల పనితనం తగ్గిపోతుంది. అదీకాక E20 ద్వారా కూడా 1 శాతం నుండి 10 శాతం వరకు ప్రస్తుత వాహనాల సామర్ధ్యం తగ్గిపోతుందని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. కొన్ని వాహనాలు E20 ఇంధనానికి పనికి రావని కూడా ప్రభుత్వం చెప్పింది.
“E20 వలన నిర్దిష్ట వాహనాల సామర్ధ్యం తగ్గిపోతుందని కేంద్రమే చెప్పింది. ఇధనాల్ భాగం 30 శాతం మించితే వాహనాల నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారు? అదనపు ఖర్చులు ఎవరు భరిస్తారు? సాధారణ మోటారు వాహనాల యజమానులు ప్రభుత్వ వైఫల్యాల భారాన్ని ఎందుకు మోయాలి?” అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డా. జి పరమేశ్వర ప్రశ్నించాడు.
“కర్ణాటక రైతులు ఇప్పటికే తీవ్ర కరువు ఎదుర్కొంటున్నారు. ఈ దశలో పరిమితికి మించి ఇధనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకానికి అనుమతించటం ద్వారా కేంద్ర ప్రభుత్వం చెరకు రైతులకు ముఖ్యమైన చెరకు-ఆధారిత ఇధనాల్ మార్కెట్ ను అందుబాటులో లేకుండా చేస్తోంది. రైతులకు హామీ ఇచ్చిన లాభాలు ఎక్కడ? ఇది రైతులను, వినియోగదారులను ఇరువురిని మోసం చేయటం కాదా?” అని ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించాడు.
కర్ణాటక ప్రభుత్వం తాము సేకరించిన ఇధనాల్ శాంపిళ్లను ఐఓసిఎల్, బిపిసిఎల్ కంపెనీలకు కూడా పంపింది. కానీ వారి పరీక్షల ఫలితాలను వెల్లడి చేయలేదు; కర్ణాటక ప్రభుత్వానికి కూడా చెప్పలేదు. దానితో రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్ సర్టిఫై చేసిన ప్రైవేటు లేబొరేటరీలకు శాంపిళ్లను పంపించారు. పెట్రోల్ లో 30 శాతం పైన ఇధనాల్ కలిపినట్టు అవే తెలిపాయి.
కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు IOCL, BPCL, HPCL లు కర్ణాటక ఆరోపణలను తిరస్కరించాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) నిర్దేశించిన ప్రమాణాలను తాము పాటిస్తున్నట్టు చెప్పాయి. కర్ణాటక తమ శాంపిళ్లు పరీక్షించేతప్పుడు తమ కంపెనీల ప్రతినిధులు అక్కడ ఉండాలని, అలా అయితేనే పరీక్షల ఫలితాలను ఆమోదిస్తామని స్పష్టం చేశాయి. పరీక్షలకు సంబంధించి పూర్తి రికార్డులు తమకు అందజేయాలని కోరాయి.
తాము కేంద్రంతో కలిసి ఉమ్మడిగా పెట్రోల్ క్వాలిటీ ని పర్యవేక్షించామని, ఉన్నత స్థాయి టెక్నాలజీతో పరీక్షలు జరిపించామని దేశ వ్యాపితంగా 896 శాంపిళ్లు (కర్ణాటక నుండి 56 శాంపిళ్లు) సేకరించి పరీక్షలు జరిపామని అందులో 19-21 శాతం వరకు ఇధనాల్ ఉన్నట్టు తేలిందని చెప్పాయి. కర్ణాటక శాంపిళ్లలో 19.3 శాతం ఇధనాల్ కలిసి ఉన్నట్టు తమ పరీక్షల్లో తేలిందని చెప్పాయి.

ఈ నేపధ్యంలో కర్ణాటక ప్రభుత్వం శాంపిళ్ల సేకరణను కేవలం ఔట్ లెట్ (పెట్రోల్ బంకులు) వరకే పరిమితం చేయకుండా విస్తృతం చేయాలని నిర్ణయించింది. ఇంధనం పంపిణీ చేసే కేంద్రాలు, బ్లెండింగ్ ఏజన్సీల నుండి కూడా శాంపిళ్లు సేకరించాలని నిర్ణయించింది. ఆయిల్ కంపెనీల నుండి పెట్రోల్ బంకులకు ఆయిల్ చేరే లోపు మధ్యలో ఉన్న సంస్థలు ఇధనాల్ బ్లెండింగ్ లో అక్రమాలకు పాల్పడుతున్నారేమోనన్న అనుమానంతో ఈ చర్యలు చేపట్టింది. వివిధ దశలలోని సంస్థల రికార్డులు, డాక్యుమెంట్ లు కూడా సేకరిస్తున్నది. తద్వారా సమగ్ర దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతోంది.
“పెట్రోల్ పంపుల దగ్గరే కాకుండా ఇధనాల్ బ్లెండింగ్ వివిధ రకాల ఇతర దశల్లో కూడా జరుగుతున్నది. అన్నీ చోట్లా మేము తనిఖీలు చేస్తున్నాము. ఎక్కడ, ఎలా బ్లెండింగ్ జరుగుతున్నదో వివరాలు తెలియజేసే పత్రాలను కూడా సేకరిస్తున్నాము” అని ముఖ్యమంత్రి డి కె శివకుమార్ పత్రికలతో మాట్లాడుతూ చెప్పాడు. సోమవారం (నవంబర్ 9 తేదీ) వివరణాత్మక నివేదికను ఆహార & పౌర సరఫరాల మంత్రి రిజ్వాన్ అర్షద్ వెలువరిస్తారని ముఖ్యమంత్రి తెలిపాడు.
అధిక నిష్పత్తిలో ఇధనాల్ ను మిశ్రమం చేయటం ద్వారా అక్రమంగా లాభాలు అర్జించే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి మాటల ద్వారా అర్ధం అవుతోంది. “కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తన బాధ్యత నుండి తప్పించుకోజాలదు. ఇధనాల్ తక్కువ ధరకు లభిస్తున్న నేపధ్యంలో అధిక నిష్పత్తిలో ఇధనాల్ కలపటం ద్వారా అక్రమ లాభాలు ఆర్జించాలని ప్రయత్నిస్తున్నారు. తద్వారా వాహనదారులకు నష్టపరుస్తున్నారు” అని ముఖ్యమంత్రి చెప్పటం గమనార్హం.
పెట్రోల్ లో ఇధనాల్ ను కలపటం ద్వారా రైతుల పంటలకు డిమాండ్ పెరిగి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి ఇధనాల్ విధానాన్ని ప్రకటిస్తూ చెప్పారు. అయితే ఇధనాల్ ను పెట్రోల్ ను కలిపే విధానం మొదలైన తర్వాత కూడా రైతులు పండిస్తున్న మొక్కజొన్న, వరి, చెరకు లకు ధరలు పెరిగిన జాడ లేదు. పెరిగిన లాభాలు మళ్ళీ దళారుల జేబుల్లోకే వెళుతున్నాయి తప్ప రైతులకు చేరటం లేదు. అసలు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర అయినా తమకు ఎవరూ చెల్లించటం లేదని, ఇక ఇధనాల్ ద్వారా పెరిగిన ధరలు తమకు అందె మార్గం లేదని రైతులు పెదవి విరుస్తున్నారు.
తాము ఎప్పుడో ప్రకటించిన మద్దతు ధరలు కూడా రైతులకు చేరువ చేయటంలో ఎలాంటి శ్రద్ధా చూపని కేంద్ర ప్రభుత్వం, ఇధనాల్, పెట్రోల్ బ్లెండింగ్ ద్వారా పెరిగిన లాభాలను రైతులకు చేరవేయటంలో శ్రద్ధ చూపిస్తుందని ఆశించటం శుద్ధ దండగ! శ్రామిక వర్గాలకు ఖాళీ వాగ్దానాలు, కార్పొరేట్ వర్గాలకు అవసరానికి మించిన రాయితీలను పంపిణీ చేయటంలో మోడి ప్రభుత్వం గత 12 యేళ్లలో రాటుదేలింది. పార్లమెంటులో, బహిరంగ సభల్లో పేదలకు, రైతులకు, కార్మికులకు అనుకూలంగా ఉపన్యాసాలు దంచి కొట్టి ఆచరణకు వచ్చేసరికి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన విధానాలను అమలు చేయటమే మోడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం!
