
–
యుగాల క్రితమే చనిపోయిన ఔరంగజేబును మామూలుగా అయితే ఎవరూ తలుచుకోరు. ఆయన వంశాంకురాలు కూడా ఆయన్ని సంవత్సరానికి ఓసారి తలచుకుంటారేమో గానీ అనునిత్యం తలచుకోవటం మాత్రం చెయ్యరు. కానీ భారత దేశంలో ఔరంగజేబును అనునిత్యం తలుచుకునే గుంపు ఒకటి ఉంది. అదే హిందూత్వ గుంపు!
[సింహాసనం కోసం ఔరంగజేబు కుటుంబంలో అందరినీ చంపేశాడు. జబ్బు పడ్డ తండ్రిని చనిపోయే వరకు 8 యేళ్ళు జైల్లో బంధించాడు. పెద్దన్నని యుద్ధంలో ఓడించి చంపాడు. ఇంకో అన్నని ప్రవాసం పంపి చంపేశాడు. మరో అన్నని రాజద్రోహం (ఇప్పుడు దేశద్రోహం అయింది) మరణ శిక్ష వేసి చంపేశాడు. వృద్ధాప్యంలో తన కొడుకులు కూడా తనను అలాగే చంపేస్తారన్న భయంతో వాళ్లని వివిధ పనులతో రాజ్యం నలుమూలలకి పంపి చేసిన పాపాలకు తీవ్రంగా చింతిస్తూ నరకం తనకోసం ఎదురు చూస్తోందని భయపడుతూ తన శవాన్ని పూడ్చేందుకు రాజ్యం ఖజానా నుండి చిల్లి గవ్వ కూడా తీయొద్దని ఆదేశించి తాను టోపీలు కుట్టి సంపాదించిన కొద్ది పాటి రూపాయల ఖర్చుతో మట్టి గుంట తవ్వి పూడ్చాలని ఆదేశించి చనిపోయాడు. ఆనాటి మధ్య ఆసియా రాచరిక సాంప్రదాయం ప్రకారం కొడుకులు అందరికీ రాజ్యం వారసత్వ హక్కు ఉంటుంది. ‘అయితే రాజ్యం లేదా మరణం’ అనే నానుడి కూడా ఉంది. అందుకే సింహాసనం కోసం అన్నదమ్ములు, తండ్రీ కొడుకులు చంపుకుంటారు. ఔరంగజేబు పశ్చాత్తాపం కుటుంబాన్ని చంపినందుకు కాదు, ప్రజల్ని వేధించినందుకు!]
[ఈ ఆర్టికల్ తో పై పేరాకు సంబంధం లేదు.]
అయితే ఆనాటి ఔరంగజేబు గురించి మనం మాట్లాడుకోవటం లేదు. వర్తమాన కాలంలో పాకిస్తాన్ లోనే ఔరంగజేబు పేరుతో ఒక మంత్రి ఉన్నాడు. ఆయనే జాతీయ సంపద మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ఔరంగజేబ్ ఖాన్ ఖిచి. యూరేసియన్ కూటమి షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) సమావేశాల్లో భాగంగా నవంబర్ 20-21 తేదీలలో న్యూ ఢిల్లీలో జరగనున్న సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం లో పాల్గొనేందుకు ఇండియా రావలసిందిగా భారత ప్రభుత్వం ఔరంగజేబుకు ఆహ్వానం పంపింది.
మే 2025 లో ఆపరేషన్ సిందూర్ దరిమిలా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాక పాకిస్తాన్ కు చెందిన ఒక సీనియర్ మంత్రిని ఇండియాకు ఆహ్వానించటం ఇదే మొదటి సారి కావచ్చు. పహల్గాం టెర్రర్ దాడి జరిగిన కొద్ది రోజులకు ఇండియా, ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఫైటర్ జెట్ విమానాలతో ఆ దేశం లోకి చొరబడిన సంగతి తెలిసిందే. మిసైల్ దాడుల్లో లోలోపలి టెర్రరిస్టు స్థావరాలను కూడా నాశనం చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
నాలుగు రోజులకే యుద్ధం ఆపేద్దామని పాకిస్తాన్ కోరటం, అందుకు ఇండియా అంగీకరించి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవటం తెలిసిందే. తన వల్లనే యుద్ధం ఆగిందని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ చెబుతూనే ఉన్నాడు. ఇండియా ఆయన్ని నేరుగా ఖండించకుండా పరోక్షంగా తాము ఇరువురం ఒకరినొకరం చర్చించుకుని యుద్ధం విరమించాం తప్ప మూడో పక్షం పాత్ర లేదని చెప్పింది. ఐనా ట్రంప్ తన గొప్పలు ఆపలేదు.
గతంలో గోవాలో జరిగిన ఎస్సిఓ విదేశీ మంత్రుల సమావేశం కోసమే మే 2023 లో పాకిస్తాన్ విదేశీ మంత్రి బిలావాల్ భుట్టో ను చివరిసారి ఇండియా ఆహ్వానించింది. ఆ తర్వాత పాక్ మంత్రి ఇండియా రావటం ఇదే.
ఎస్సిఓ సమావేశాలకు ఆతిధ్య దేశంగా సభ్య దేశాల అతిధులను ఆహ్వానించే బాధ్యత ఇండియా పైన ఉంటుంది. పైగా SCO సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం కు ఆతిధ్యం ఇస్తానని ఇండియాయే గత సంవత్సరం కోరింది. ఇంకా చెప్పాలంటే సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం ఏర్పాటును ప్రతిపాదించింది నరేంద్ర మోడియే కావటం గమనార్హం. తదుపరి సంవత్సరం అంటే 2027 లో ఈ సమావేశాలకు పాకిస్తాన్ ఆతిధ్యం ఇవ్వనుంది.

ఇండియా-పాక్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 2016 నుండి స్తంభించి పోయి ఉన్నాయి. 2016లో పఠాన్ కోట్, యూరీ దాడుల తర్వాత ఇండియా సంబంధాలను స్తంభింపజేసింది. బహుళ పక్ష సమావేశాలలో తప్ప పాకిస్తాన్ తో కలిసి ఇండియా ద్వైపాక్షికంగా వేదికను పంచుకోవటం లేదు.
ఆర్ఎస్ఎస్ హస్తం
ఎస్సిఓ యూరేసియన్ కూటమికి అనుబంధంగా సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం ఏర్పాటు చేయాలన్న నరేంద్ర మోడి ప్రతిపాదన వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హస్తం ఉండటం బహుశా ఎవరినీ ఆశ్చర్య పరచదు. సెప్టెంబర్ 2025 లో తీయాంజిన్ (చైనా) లో జరిగిన ఎస్సిఓ సభల వేదిక పైన నరేంద్ర మోడి దీనిని అధికారికంగా ప్రతిపాదించినప్పటికీ ఈ ప్రతిపాదన రూపు దిద్దుకోవటంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల మేధో మధనం ఉన్నది.
డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రీసర్చ్ ఫౌండేషన్ (SPMRF) ఈ ప్రతిపాదనకు మద్దతుగా అనేక విశ్లేషణలను, వ్యాఖ్యానాలను ప్రచురించి ప్రచారం చేసింది. ఎస్సిఓ లాంటి సంస్థలను కేవలం ఆర్ధిక, భద్రతా కోణం లోనే కాకుండా సభ్య దేశాల సాంస్కృతిక వారసత్వాలను సెలబ్రేట్ చేసుకోవాలన్న పేరుతో ఈ ప్రతిపాదనను ఎస్సిఓ దేశాల ముందు ప్రవేశ పెట్టింది మోడి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం. ప్రతిపాదన వెనుక ప్రభుత్వం తరపున భారత విదేశీ శాఖ, సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా కృషి చేశాయి.
వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (VIF), ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల్లో మరొకటి. ఈ సంస్థ సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం అవసరాన్ని హైలైట్ చేస్తూ వివిధ విశ్లేషణలను దృక్కోణాలను వివరిస్తూ నోట్ లు తయారు చేసి ప్రచురించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని “గ్లోబల్ స్టేట్స్ మేన్” గా ప్రస్తుతిస్తూ దేశానికి సివిలైజేషనల్ ఐడెంటిటీ సమకూర్చిన విజనరీగా ప్రచారం చేసి పెట్టింది. తద్వారా ఆర్ఎస్ఎస్ మూల సాంస్కృతిక ప్రాపంచిక దృక్పధాన్ని భౌగోళిక రాజకీయాల ప్రధాన స్రవంతి లోకి చొప్పించేందుకు కృషి చేసింది.
పధకం అమలులో ఆర్ఎస్ఎస్ పాత్ర ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు నరేంద్ర మోడి ప్రతిపాదనను నేరుగా అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రాలతో ముడి పెట్టారు. ఉదాహరణకి ఆర్ఎస్ఎస్ కి చెందిన అఖిల్ భారతీయ ప్రచార ప్రముఖ్ అయిన సునీల్ అంబేద్కర్, కిర్ఘిస్తాన్ రాజధాని బిష్కెక్ లో మానస్-మహాభారత సెంటర్ ను ప్రారంభించాడు. ఇలాంటి కేంద్రాలు సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం యొక్క విజన్ తో చక్కగా అమరుతాయని (align) అసలు విషయాన్ని నేరుగానే డొంక తిరుగుడు లేకుండా చెప్పేశాడు.
ఆర్ఎస్ఎస్ సంస్థ, స్థాపన నాటి నుండి చెబుతూ వస్తున్న సైద్ధాంతిక లక్ష్యాలనే ఎస్సిఓ సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నది. ఉదాహరణకి ఈ ఫోరం “ప్రాచీన నాగరికతలు, కళలు, సాహిత్యం, మరియు సాంప్రదాయాలను సెలబ్రేట్ చేస్తుంది” అని ప్రకటించారు. భారత ప్రాచీన నాగరికత అంటే నిజానికి సింధు నాగరికత, హరప్పా-మొహంజొదారో నారికత, ద్రావిడ నాగరికత లాంటివి ప్రస్తావనకు రావాలి. ఆ నాగరికతల ప్రాశస్త్యం గురించి చెప్పుకోవాలి. అలాగే సాంప్రదాయం అంటే ఆస్తికతను నాస్తికతలను సమానంగా ఆదరించిన భారత దేశ సహనశీల నాగరికత ప్రశంసలకు నోచుకోవాలి. తగిన గుర్తింపు పొందాలి.
కానీ ఆర్ఎస్ఎస్ దృష్టిలో ప్రాచీన నాగరికత అంటే భగవద్గీత, మహాభారతం, రామాయణం, భాగవతం, ఇంకా అనేకానేక పురాణాలలోని ప్లాస్టిక్ సర్జరీతో సమానమైన వినాయకుడి జన్మ వృత్తాంతం, మట్టి కుండలో మనుషులకు ప్రాణం పోసిన టెస్ట్ ట్యూబ్ బేబీ శాస్త్రాల ప్రాశస్త్యం… ఇలాంటివి. సాంప్రదాయం అంటే చాతుర్వర్ణ వ్యవస్థ పేరుతో కుల వ్యవస్థకు దైవ బోధనల మద్దతు తెచ్చుకుని, మునులు, ఋషులు, గడ్డాల గురువులు మొ.న వారు భారత సామాజిక వ్యవస్థను ఎంత క్రమశిక్షణతో కట్టుదిట్టం చేసి అభివృద్ధి చేశారో, కర్మ సిద్ధాంతం, కుల వ్యవస్థ ద్వారా ఎంత చక్కగా శ్రమ విభజనను కావించి గ్రామాలను స్వయం సమృద్ధం కావించిందో… ఇవే భారతీయ సాంప్రదాయ వారసత్వం.
ఆర్ఎస్ఎస్ తత్వం లోని మరో భావం ‘వసుధైవ కుటుంబం’. ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రపంచ వ్యాపిత ఆదరణ సంపాదించే లక్ష్యం ఈ నినాదం వెనుక ఉన్నది. విశ్వ ఐక్యతను వ్యాప్తి చెందించటానికి మానవతా రాయబారం మరియు సాంస్కృతిక సామరస్యత లను సాధించే పేరుతో ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రపంచం అంతా వ్యాపింప జెసేందుకు లేదా ప్రపంచం ఆమోదం పొందేందుకు సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం ను ఒక ఉపకరణంగా, పరికరంగా ఆర్ఎస్ఎస్ పరిగణిస్తున్నది. నిజంగా ఈ ఫోరం ద్వారా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి విదేశాల్లో, కనీసం ఎస్సిఓ సభ్య దేశాల్లో ఆదరణ, ఆమోదం లభిస్తాయా అన్నది వేరే సంగతి.
చైనా ఓ పక్క ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు చేస్తూ, ఏఐ ద్వారా దేశ ఉత్పాదకతను మరింత వృద్ధి చేసుకుంటూ, సైన్స్&టెక్నాలజీ, రీసర్చ్&డవలప్మెంట్, సెమీ కండక్టర్ చిప్స్ తయారీ, క్వాంటమ్ ఫిజిక్స్, అమోఘమైన ఇన్ఫ్రా నిర్మాణాలు మొ.న రంగాలలో వేగంగా దూసుకు పోతుంటే, భారత ప్రభుత్వం గత కాలపు గొప్పలను వర్తమానంలో చొప్పిస్తూ, భవిష్యత్ కి కూడా అవే మార్గదర్శనం అని ప్రబోధిస్తున్నది. విదేశాలు కూడా అదే భారత్ గొప్పదనం అని చాటేందుకు వృధా ప్రయత్నాలు చేస్తోంది, కోట్లు క్కుమ్మరిస్తోంది.
ఈ విచిత్రమైన RSS-BJP విజన్ మును ముందు దేశాన్ని ఏ చీకటి గుహల్లోకి, ఏ యే ర్యాబిట్ హోల్ లోనికి నెట్టివేస్తుందో ఊహించుకుంటేనే భయాందోళనలు ముప్పిరి గొంటున్నాయి. రానున్న తరానికి కూడా ఇది అందుబాటులో ఉంటే ఏఐ జోలికి ఆ తరం వెళ్లే అవకాశం ఉంటుందా అన్నది అనుమానమే!


