
–
అర్నబ్ తుఫాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. బుధవారం, అక్టోబర్ 28 తేదీన బాపట్ల, విశాఖపట్నం ల మధ్య తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ చెప్పింది. ఇది క్రమంగా పెను తుఫానుగా మారనుందని చెబుతూ 18 జిల్లాలకు ఎరుపు మరియు నారింజ రంగు హెచ్చరికలను జారీ చేసింది.
అధికారులు డిసాస్టర్ రెస్పాన్స్ టీం లను సిద్ధం చేశారు. కొన్ని బృందాలు ఇప్పటికే రంగం లోకి దిగాయి. షెల్టర్ లను సిద్ధం చేశారు. భద్రతా సూచనలు జారీ చేశారు. చేపల వేట రద్దు చేశారు. బొట్లన్నీ వొడ్డుకు చేరాయి. తుఫాను తీరం దాటేప్పుడు గంటకు 140 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు.
ఐఎండి ప్రకారం: తుఫాను తీరం దాటిన తర్వాత, అంటే బుధవారం (28 తేదీ) 6 జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. బుధవారం ఉదయం వైజాగ్, బాపట్ల మధ్య యానాం సమీపంలో తుఫాను తీరం దాటవచ్చు. 115-125 kmph వేగంతో గాలులు వీస్తాయి. గరిష్టంగా 140 kmph వేగం తాకవచ్చు.

స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్ఈఓసి) ప్రకారం: 18 జిల్లాల్లోని 2,700 గ్రామాలకు చెందిన 7 లక్షల కుటుంబాలు తుఫాను తాకిడికి గురవుతారని అంచనా. వారికోసం 1,900 షెల్టర్లను తుఫాను పీదుతుల కోసం గుర్తించారు.
ఇంకా, స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు 12 ఉండగా వాటిలో 9 బృందాలను రంగంలోకి దించారు, మిగతా మూడింటిని స్టాండ్ బై లో ఉంచారు. నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రాష్ట్రంలో 10 ఉండగా వాటిలో 7 బృందాలను రంగంలోకి దించారు, 3 బృందాలు స్టాండ్ బై లో ఉంచారు.
ఇంకా, ఒడిశా కు చెందిన మరో 4 ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రాష్ట్రానికి రానున్నాయి. ఫైర్ డిపార్ట్-మెంటు వద్ద 115 వుడ్-కటింగ్ బృందాలు, 13 బోట్ రెస్క్యూ టీం లు, 853 లైఫ్ బుడగలు, 1,328 లైఫ్ జాకెట్లు సిద్ధంగా ఉన్నాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండమని, ప్రభుత్వ సలహాలు పాటించమని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్డిఎంఏ) చెప్పింది. 7 జిల్లాల్లో ఇప్పటికే స్కూళ్లకు అక్టోబర్ 27-28 తేదీల్లో సెలవులు ప్రకటించారు. టోల్ ఫ్రీ హెల్ప్ లైన్లు: 112, 1070, 1800-425-0101.
ఆంధ్ర ప్రదేశ్ కి 12 జిల్లాల్లో 1,000 కి.మీ తీర ప్రాంతం ఉన్నది. ఇందులో 500 గ్రామాలు సముద్ర చేపల వేట సాగిస్తారు. వారికి 30,043 ఫిషింగ్ బోట్లు ఉన్నాయి. బోట్ల కోసం 350 ల్యాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. వేటకు వెళ్లొద్దని వారందరికి ఆదేశాలు ఇచ్చారు. సముద్రం మీద ఉన్నవారిని వెనక్కి రమ్మని సందేశం పంపారు. బోట్లు తుఫాను గాలికి, సముద్ర అలలకు కొట్టుకు పోకుండా సురక్షితంగా కట్టేసి ఉంచమని చెప్పారు.

ఆక్వా కల్చర్ సాగు చేసే రైతులకు 460 హేచరీలు (రొయ్య పిల్లల పెంపకం కేంద్రాలు) ఉన్నాయి. తుఫాను వల్ల నష్టం జరగకుండా నివారణ చర్యలు తీసుకోమని వారికి తెలియజేశారు. చెరువు గట్టులు తెగకుండా, పిల్లలు చనిపోకుండా చూసుకోమని చెప్పారట. వరద, భారీ వర్షం వచ్చినపుడు విద్యుత్ సరఫరా బంద్ చేయాలట.

