అరాచకం నుండి ఇండియాను కాపాడమని కంఫర్ట్ కోసం దేశం విడిచిన ఫేక్ దేశభక్తుల ఫేక్ ఆందోళన!

–

ఇండియన్ ఆరిజన్ స్టూడెంట్స్ పేరుతో విదేశాల్లో సెటిలైన 400 మందికి పైగా వివిధ ప్రైవేటు విదేశీ యూనివర్సిటీల విద్యార్ధులకు అకస్మాత్తుగా దేశం బాగోగులు గుర్తుకు వచ్చాయి. వాళ్ళకు దేశం ప్రజాస్వామ్య విలువలు భంగం కాకుండా సుభిక్షంగా కొనసాగుతున్నాయా లేదా అన్న విషయం పైన హఠాత్తుగా ఆందోళన పుట్టుకు వచ్చింది. ఇన్నాళ్లూ దేశం భవిష్యత్తు పట్ల వాళ్ళ ఆవేదన, ఆందోళన ఎక్కడ దాక్కున్నాయో తెలియదు గాని ఇప్పుడు తన్నుకుంటూ బైటికి వచ్చి 400 మంది భారతీయ మూలాల విద్యార్ధులు, విద్యావేత్తలు ఎలక్షన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనను తమ లేఖ ద్వారా ఖండించే రూపంలో వ్యక్తం అయింది.

27 దేశాలలోని యూనివర్శిటీలలో చదువుకుని బయిటకు వచ్చిన వాళ్లు, అల్యూమ్ని పేరుతో ఒక గ్రూపుగా ఏర్పడి రాసిన లేఖలో ఆందోళనకారులను అరాచకవాదులుగా తప్పుపట్టారు. భారత దేశ నగరాలలో వీధుల వెంట తిరుగుతూ ఆందోళనలు చేస్తూ రాజ్యాంగానికి భారతీయ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అనుమాన బీజాలు నాటుతున్నారని ఆరోపించారు. “భారతదేశాన్ని అరాచక వాదం లోకి జారిపోకుండా దాని మానాన దానిని వదిలెయ్యండి” అని తమ లేఖ ద్వారా కోరుతున్నారు.

“భారత ప్రజాస్వామ్యం పట్ల అనుమాన బీజాలు నాటేందుకు, కోర్టు విచారణలో ఉన్న అంశాలను ఆయుధంగా మార్చుకుంటూ మనస్సాక్షి లేని మరియు మోసపూరితమైన ఒక పధకం రచించబడింది. చారిత్రకంగా మరియు తాత్వికంగా ఏ నాడూ రాజ్యాంగబద్ధ రూపం లోని ప్రభుత్వ పాలన పైన నమ్మకం లేని అరాచక శక్తులపై ఆధారపడి రోడ్లమైన మరింత భారీ రూపంలో ఈ పధకాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని రక్షించే పేరుతో జరుగుతోంది” అని విదేశీ యూనివర్శిటీలలోని ఈ 400 మంది సో-కాల్డ్ విద్యార్ధులు, విద్యావేత్తల గుంపు రాసిన లేఖ ఆరోపించింది.

“ఇందులోని వక్రోక్తి (Irony) బహు ఆశ్చర్యజనకమైనది. కానీ అంతకంటే ముఖ్యంగా, ఈ దేశ భవిష్యత్తులో వాటా కలిగి ఉండి సంపూర్ణ సమాచారం తెలిసి ఉన్న వారుగా మరియు ‘ఇండియన్లుగా’ గుర్తింపు పొందుతూ ప్రపంచం అంతా ప్రయాణిస్తున్న మాకు ఈ పరిణామాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి” అని విదేశాల్లోని భారతీయుల పేరుతో ఒక సెక్షన్ రాసిన లేఖ అంటోంది.

వీళ్ళు ఓ పక్క దేశ ప్రజాస్వామ్య నిశ్చలతా శక్తి పదునైనదని అంటూనే ఎన్నికల ఫలితాలను తిరస్కరించే ఉన్మాదం, రాజ్యాంగ సంస్థలను తెంపు లేకుండా ప్రశ్నించే తెంపరితనం, పార్లమెంటు కంటే వీధులకు ప్రాధాన్యత ఇవ్వటం.. ఇత్యాది అంశాలు కొందరిని పట్టి పీడిస్తున్నాయని తీర్పు ఇచ్చేశారు. “ప్రతికూల ఎన్నికల ఫలితాలు, (ప్రజాస్వామ్య) ప్రక్రియల సమగ్రతను ప్రశ్నించటానికి దారి తీస్తున్నాయి. ప్రతికూల తీర్పులు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను నిలదీసే ప్రశ్నలను రెచ్చగొడుతున్నాయి. చివరికి రాజకీయాలతో ఏ సంబంధమూ లేని సాయుధ బలగాలను కూడా పాక్షిక రాజకీయ ప్రయోజనాల రొంపిలోకి లాగుతున్నారు” అని విదేశాలలో సెటిల్ అయిన విద్యార్ధులు, విద్యావేత్తలు ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోవటం వలన, కోర్టుల్లో కేసులు ఓడిపోవటం వలన ఆందోళనకు ఒడిగట్టారన్నది వీరి ఆరోపణ!

అసమ్మతి ప్రజాస్వామ్యానికి అత్యవసరం అని అంగీకరిస్తూనే “ఆ ముసుగులో ప్రజాస్వామిక పనిముట్లను విధ్వంసం చేయటానికి మౌన సాక్షులుగా ఉండేందుకు నిరాకరిస్తున్నాం” అని స్వశీలయుత స్వలక్ష ప్రకటన కావించారు. ఇంకా విచిత్రంగా “వాద-ప్రతివాదన, చర్చ, సంభాషణ, అసమ్మతి ల ద్వారా సామాజిక మరియు రాజకీయ శక్తులు తమ విభేదాలను పరిష్కరించుకోవలసిందిగా కోరుతున్నాం” అని బోధించారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం వీళ్ళంతా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుకె, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, సింగపూర్ మొదలైన 27 దేశాలలో చదువుకున్నారు. మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ యూనివర్సిటీలు, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మొ.న ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో చదువు పూర్తి చేసుకున్నవారు.

ఈ దేశాల్లో, యూనివర్శిటీలలో చదివిన వాళ్ళలో అత్యధికులు అమెరికా, బ్రిటన్, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో శాశ్వత నివాసం ఏర్పరచుకుని సెటిల్ అయిన వాళ్లు. వీళ్లు తాము చదివిన యూనివర్శిటీలతో పాటు ఏయే దేశాలలో పౌరసత్వం తీసుకుని సెటిల్ అయ్యారో కూడా చెప్పి ఉంటే వీళ్ల దేశభక్తి, భారత ప్రజాస్వామ్యం పట్ల ఉన్న ఆవేదన ఏపాటిదో తెలుసుకునే అవకాశం ఉండేది.

బి‌జే‌పి వచ్చే యాభై యేళ్ళ వరకు దేశాన్ని ఏలుతుందని ప్రధాని నరేంద్ర మోడి, హోమ్ మినిస్టర్ అమిత్ షా లు అనేకసార్లు తమ పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు చెప్పారు. భారత దేశంలో పాలకవర్గాలు కాంగ్రెస్ లోనే ప్రధానంగా ఇమిడి ఉన్నంత కాలం తప్ప, పోటీగా కాంగ్రెస్సేతర ప్రాంతీయ, కేంద్ర పార్టీల ప్రభుత్వాలు ఏర్పడటం మొదలైనప్పటి నుండి ఏ పార్టీ ప్రభుత్వం ఒక సారికి మించి, మహా అయితే రెండు సార్లకు మించి వరుసగా ఎన్నికలు నెగ్గిన ఉదాహరణలు లేవు. యాంటీ-ఇంకుంబెన్సీ భారత రాజకీయాల్లో అంత ఠంచన్ గా పని చేస్తుంది.

ఎందుకంటే ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల్లో మెజారిటీ అయిన పేదలు, మధ్య తరగతి, కార్మికులు, రైతుల కోసం పని చేసిన చరిత్ర లేదు. చేతికి ఎముక లేకుండా వాగ్దానాలు చేసి అధికారం చేజిక్కించుకున్నాక మొండి చెయ్యి చూపటం అన్ని రాజకీయ పార్టీలు చేశాయి. అందుకే 5 యేళ్లకే నిజం తెలుసుకుని ప్రభుత్వ వ్యతిరేకతతో పాత వెధవే బెటర్ అనుకుని ఉన్న వాళ్లనే మార్చి మార్చి నెత్తికి ఎక్కించుకుంటారు భారత ప్రజలు.

కానీ మోడి ప్రభుత్వం ప్రజలకు, ముఖ్యంగా రైతులు, కార్మికులు, భూమి లేని పేదలు, దిగువ మరియు మధ్య తరగతి ప్రజలకు (కాంగ్రెస్ ప్రభుత్వాలకు మించి) వీసమెత్తు అదనపు ప్రయోజనం చేయకపోయినా అత్యధిక సంఖ్యలో ఉండే శ్రామిక వర్గాలకు వ్యతిరేకమైన నష్టకరమైన విధానాలు అమలు చేసినా కూడా మూడు టర్మ్స్ వరుసగా ఎలా గెలిచింది? రాహుల్ గాంధీ వేసిన ఈ ప్రశ్న సహజమైనది, సరైనది, హేతుబద్ధమైనది.

టెర్రరిస్టులకు ఫైనాన్సింగ్ రద్దు కోసం, నల్ల డబ్బు నిర్మూలన రద్దు కోసం అని నమ్మించి డీమానిటైజేషన్ తో ప్రజల డబ్బుని చెత్త కాగితాలుగా మార్చారు. తద్వారా భూమి లేని పేద రైతులు, రైతులు, కార్మిక వర్గాల నడ్డి విరిచి, వేల మంది పెద్ద క్యూలలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంత చేసినా ఉన్న నోట్లన్నీ ఆర్ బి ఐ కి చేరాయి. టెర్రరిజం కొనసాగుతూనే ఉంది. ఒక్క పైసా నల్ల డబ్బు తేలలేదు. చిట్ట చివరికి “చెల్లింపులను డిజిటలైజ్ చేయటానికే డీమానిటైజేషన్” అని చావు కబురు చల్లగా చెప్పారు. అదనంగా కాంగ్రెస్, ఎస్.పి లాంటి పార్టీలు కూడబెట్టిన నల్ల డబ్బు వల్ల ప్రయోజనం లేకుండా చేశారు. ఎన్నికల్లో అవి ఖర్చు పెట్టకుండా నిరోధించ గలిగారు.

అప్పటి వరకు గంటల తరబడి క్యూల్లో చనిపోయిన వందలమంది కుటుంబాల గురించి ఒక్క సానుభూతి ముక్కా ప్రధాని మోడి చెప్పలేదు. పైగా ఆర్ధిక వ్యవస్థ నడక మందగించింది. మన్మోహన్ చెప్పినట్లు 2% తో ఆగకుండా అంతకు పైగానే జి‌డి‌పి పడిపోయింది. 2016 లో 8.26% జి‌డి‌పి వృద్ధి రేటు నమోదైతే 2017, 18, 19 లలో వరుసగా 6.8%, 6.45% , 3.87% వృద్ధి రేటు నమోదయింది. అంటే ప్రజల ఆదాయాలు, వినియోగం పడిపోయాయి. మోడి ఐనా వరుసగా గెలుస్తూనే ఉన్నాడు. ఎలా?

కోవిడ్-19 అన్నదే జనం నెత్తిన ఒక పెద్ద పిడుగులా పడింది. దెబ్బ పైన దెబ్బ గా రైళ్లు, బస్సులు రద్దు చేసి, సకల ఉత్పత్తి కార్యకలాపాలు స్తంభింపజేస్తే లక్షలాది మంది వలస కూలీలు వేల కిలో మీటర్లు కాలి నడకన నడిచి పోతుంటే వారికి సహాయం అందించింది తోటి ప్రజలే గానీ నరేంద్ర మోడి ప్రభుత్వం కాసింత ఊరట కూడా ఇవ్వలేకపోయింది. ఇక జి‌డి‌పి పెరగటానికి బదులు 5.78% కుచించుకుపోయింది. జి‌డి‌పి పెరగటానికి బదులు తగ్గిపోయింది. దానర్ధం కోట్లాది కూలీలు పని లేక, ఆదాయం లేక పసులు పడుకున్నారని. ఐనా మోడి గెలుస్తున్నాడు. ఎలా? తమ జీవితాలను నాశనం చేసినా కూడా మోడియే బెటర్ అని ప్రజలు నమ్మారా?

అధికారం చేపట్టాక ఒక్కటన్నా స్వంత విధానాన్ని మోడి అమలు చేయలేదు. మన్మోహన్/కాంగ్రెస్ తెచ్చిన నూతన ఆర్ధిక విధానాలను రెట్టింపు వేగంతో అమలు చేశాడు. కార్మికుల హక్కులు నామమాత్రం చేశాడు. రైతులను ఢిల్లీ రోడ్లకు ఈడ్చాడు. గ్యాస్ సబ్సిడీ తగ్గిస్తూ వచ్చాడు. మహాత్మా గాంధీ రోజ్ గార్ యోజన పేరులో రాముడు పేరు ఇరికించి మరీ దళితులకు, భూమి లేని పేదలకు ఉపయోగపడుతున్న పధకానికి తూట్లు పొడిచాడు. (రామాయణం లోని శంభూకుని వధని దళితులకు మళ్లీ గుర్తు చేశారు.) నిధులు తగ్గించేసి పని దినాలు పెంచి కూలీల బ్రతుకులతో పరిహాసమాడాడు. తగ్గించిన కేటాయింపులతో పెంచిన రోజులకు పని ఎలా ఇస్తాడో చెప్పలేదు. అయినా మోడి గెలుస్తున్నాడు. ఎలా?

2019 పార్లమెంటు జనరల్ ఎన్నికల్లో యుపి, బీహార్ లలో ప్రతిపక్ష పార్టీలు మెజారిటీ అసెంబ్లీ స్థానాలు పొందిన సంగతి స్పష్టంగా కనపడింది. కానీ 2022లో ఆ రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విచిత్రంగా బి‌జే‌పి అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది! అది ఎలా జరిగింది? ఎలా సాధ్యపడింది?

దళితుల పైన దాడులు జరుగుతాయి, ముస్లింల పైన లించింగ్ దాడులు జరుగుతాయి, జంతువుల తోలు వొలిచే పనిని దళితులకు అప్పగించింది వీళ్ళు చెప్పే హిందూ మతమే. కానీ చనిపోయిన ఆవు తోలు వొలిచినందుకు, గో హత్య నేరాన్ని బనాయించి కట్టేసి కొట్టేదీ వీళ్ళే! ‘మాకు వారికి సంబంధం లేదు” అని బిజెపి-ఆర్ఎస్ఎస్ చెబితే దాన్ని ఎలా నమ్ముతారు? కొట్టిన వారిని, చంపిన వారిని విచారించి శిక్షించటమే కాక, అవి పునరావృతం కాకుండా మోడి, షా, మోహన్ భగవత్ ల నోటి నుండి స్పష్టమైన ప్రకటన వెలువడితే, కనీసం నిలదీసే వారికి ఒక అవకాశం ఉంటుంది. కోర్టులకు ధైర్యం వస్తుంది. అసలా అడిగే అవకాశం లేకుండా చేసేందుకే ఒక్క మాటా చెప్పకుండా, ఒక్క ఖండనా చేయకుండా దాటేస్తారు. ఐనా మోడి-షా-భగవత్/బి‌జే‌పి గెలుస్తారు. ఎలా?

సీట్లు బాగా తగ్గిపోయి బొత్తిగా మెజారిటీ లేని రాష్ట్రాల్లో కూడా సంవత్సరం తిరిగేసరికి బి‌జే‌పి యే అధికారం చేపడుతుంది! ఇడి, సిబిఐ, ఐటి, ఏ‌సి‌బి ల దాడులు చేయిస్తామని బెదిరిస్తారు, వినకపోతే నిజంగానే కేసులు పెడతారు, కేసు పెట్టి దాడి చేయటం అరెస్ట్ చేయటం కాకుండా అరెస్టు చేశాక నేరం కోసం వెతుకుతారు. ఫలితంగా మందలు మందలుగా బి‌జే‌పి లోకి వలసలు జరుగుతాయి. బలం తారుమారు అవుతుంది. బి‌జే‌పి అధికారం లోకి వస్తుంది. ఇది ప్రజాస్వామ్యమా?

చెట్టు నుండి యాపిల్ పండు రాలితే నేల మీద పడుతుందా లేక ఆకాశం వైపు పై పైకి ప్రయాణిస్తుందా? కానీ మోడి-షా పాలనలో యాపిల్ పండు పైకే ఎగిరిపోతోంది. ఎలా సాధ్య పడింది? ఇన్సైడర్ లు లేకుండా అది సాధ్యపడుతుందా?

సుప్రీం కోర్టు తీర్పులు, హై కోర్టుల తీర్పులు వరుస పెట్టి బాధితులకు వ్యతిరేకంగా, న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వస్తుంటే, లించింగ్ దాడి ఎదుర్కొన్న వారి పైనే కేసులు నమోదు అవుతున్నా కోర్టులు నోరు మూసుకుంటుంటే, న్యాయ మూర్తులు కోర్టుల్లో భగవద్గీత శ్లోకాలతో, మను స్మృతి ఉటంకనలతో తీర్పులు ఇస్తుంటే, బహిరంగంగానే ప్రధాని మోడి పైన ప్రశంసలు కురిపిస్తుంటే, న్యాయ సూత్రాల మేరకు అణచివేతకు గురవుతున్న దళితులు, స్త్రీలు, మైనారిటీల పక్షాన నిలబడటం మానేసి వారి చర్యలలోనే తప్పులు వెతుకుతూ సరికొత్త బాధిత-వ్యతిరేక తీర్పులు ప్రకటిస్తుంటే, రాజ్యాంగ విరుద్ధ వ్యాఖ్యలు చేస్తుంటే భారత సో-కాల్డ్ ప్రజాస్వామ్యం పని చేస్తున్నట్టా లేక బొంద పెడుతున్నట్టా?

బెంగాల్ ఎన్నికల సందర్భంగా 40 లక్షల మంది వోటు హక్కు రద్దవుతోంది, వోటు వేయలేరు అని విన్నవిస్తే ఈ ఎన్నికల్లో కాకుంటే వచ్చే ఎన్నికల్లో వోటు వేయొచ్చులెండి అని వోటర్ల వోటు హక్కు గురించి అత్యంత తేలిక భావన వ్యక్తం చేసే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి! ఉప ఎన్నికలు వచ్చాయి, ఇప్పుడన్నా వోటు హక్కు పునరుద్ధరించండి అని కోరితే ఉప ఎన్నికలే కదా అంటూ ఈసడింపు! ఇలాంటి న్యాయమూర్తి కింద నడిచే న్యాయ స్థానాలు రాజ్యాంగానికి ప్రజాస్వామిక భాష్యం (ఇంటర్ ప్రేటేషన్) చెప్పగలరా?

12 యేళ్ళ అరాచక పాలనతో, శాంతి భద్రతలకు పెను ప్రమాదం ఏర్పడ్డ పరిస్ధితులతో, బలహీన వర్గాల ప్రజల మాన-ప్రాణాలకు ముప్పు ఏర్పడ్డ నేపధ్యంలో, తాను వేసే ఓటు తాను వేసిన అభ్యర్ధికే పడిందా లేదా అన్న అనుమానాలు పెరిగిపోయినా కూడా ఆ అనుమానాలను నివృత్తి చేసే నిజాయితీ ప్రయత్నం ఒక్కటి కూడా లేని రాజకీయ పరిస్ధితుల్లో, భారత దేశ గణాంకాలు నమ్మటానికి వీలు లేదు, మ్యానిపులేషన్ జరుగుతోంది అని సాక్షాత్తు ఐఎంఎఫ్ చెబుతున్న నేపధ్యంలో ప్రజలు విసిగి వేసారి పోయారు. గో వధ నిషేధం అని సుద్దులు చెప్పే బి‌జే‌పి పాలనలోనే బీఫ్ ఎగుమతులు పెరుగుతూ పోతున్న మోసపూరిత విధానాల నేపధ్యంలో ప్రజలు, విద్యార్ధులు, యువకులు, మహిళలు విసిగిపోయి రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు తప్ప అది వారికి సరదా కాదు. విదేశాల నుండి మద్దతు వచ్చే లగ్జరీ కూడా భారత ప్రజలకు లేనే లేదు.

సి‌జే‌పి కాదు, బి‌జే‌పి కే విదేశీ మద్దతు అందుతోంది!

ఆ మాటకొస్తే 2014 పార్లమెంటు ఎన్నికలలో అమెరికాలోని బడా బడా వాల్ స్ట్రీట్ ఫైనాన్స్ కంపెనీల నుండి నరేంద్ర మోడి, బి‌జే‌పి పార్టీలకు సానుకూల మైన మద్దతు, రిపోర్టులు, రివ్యూలు అందాయి. గుజరాత్ లో మోడి పాలన పైన ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పారు. “Modi-fying India” పేరుతో యూ‌పి‌ఏ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తూ గుజరాత్ విధానాలు ఇండియాను ఎక్కడికో తీసుకెళ్తాయని డప్పు కొట్టారు. బడా బహుళజాతి ద్రవ్య కంపెనీలైన గోల్డ్ మేన్ సాక్స్, నొమురా (జపనీస్), బార్ క్లేస్ (ఫ్రెంచ్), సిటీ గ్రూప్, HSBC, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిల్ లించ్ ఇత్యాది ఎం‌ఎన్‌సి లు ఇందులో ఉన్నాయి. మోడి విజయం సాధిస్తే ఇండియా జి‌డి‌పి పరుగు పెడుతుందని, విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ఇవి నివేదికలు ప్రచురించి ప్రచారం చేసి పెట్టాయి.

అంతే కాదు, బి‌జే‌పి పార్టీయే విదేశీ లాబీ కంపెనీలను ఎన్నికల వ్యూహాల రచన కోసం తెచ్చుకున్నది. “వైబ్రెంట్ గుజరాత్” పేరుతో రాష్ట్ర ఎన్నికల్లో అక్కడ లేని మాయా ప్రపంచాన్ని సృస్టించి చూపించిన “APCO వరల్డ్ వైడ్ అనే లాబీ కంపెనీయే ఇండియాలో మోడి బ్రాండ్ కోసం అనేక కధలు సృష్టించి ప్రచారం చేసింది. అతి పెద్ద టెక్ కంపెనీలైన ఒరాకిల్ (అమెరికా), ఎస్‌ఏ‌పి (జర్మనీ) లు రంగం లోకి దిగి అత్యాధునిక డేటా టూల్స్ ని ఉపయోగించి సోషల్ మీడియాలో మోడి అనుకూల సెంటిమెంట్ ను సృష్టించి కృత్రిమంగా అనేక రెట్లు పెరిగేలా చేశాయి. ఇండియాలో లేని మోడి వేవ్ ను కృత్రిమంగా సృష్టించి పెట్టాయి. ఇక ఫేస్ బుక్ అయితే మామూలు సహాయం చేయలేదు. వాళ్ళ సొంత సిబ్బందితో ఒక బృందాన్ని ఏర్పరిచి ఇండియాలోని బి‌జే‌పి ప్రచార బృందంతో కలిసి పని చేస్తూ మోడి వేవ్ గరిష్టం అయ్యేలా చూశాయి.

కాబట్టి విదేశాల నుండి సహాయం అందుతున్నది సి‌జే‌పి కి కాదు; బి‌జే‌పి యే విదేశాల నుండి సహాయ సహకారాలు పొందుతున్నది. లేకపోతే ఇండియా పైన అనేక రెట్లు టారిఫ్ లు ప్రకటిస్తున్న అమెరికాతో తలపడటం మానేసి, సొంత వనరులను సృస్థించుకునే పని మానేసి, అమాంతం 500 బిలియన్ డాలర్ల మేరకు అమెరికాలో పెట్టుబడులు పెడతామని ఇండియా తరపున మోడి ఎలా ఇవ్వగలడు? మనకే డబ్బు లేదని చెప్పి ప్రజలు నిర్మించుకున్న ప్రభుత్వరంగ కంపెనీలను అయినకాడికి అమ్ముతున్న మోడి ప్రభుత్వం అమెరికాలో 500 బిలియన్ డాలర్లు ఎక్కడి నుండి తెచ్చి ఇస్తుంది, భారతీయుల కడుపులు మాడ్చకుండా? అమెరికా ఒత్తిడికి లొంగి చౌకగా లభిస్తున్న రష్యన్ చమురు దిగుమతి నిలిపేసే నిర్ణయం ఎవరు చేస్తున్నారు? అమెరికా ఆంక్షలు ఎత్తివేసి, అనుమతి ఇస్తే తప్ప రష్యా దగ్గరకి వెళ్లలేని బలహీన విదేశీ విధానాన్ని ఎవరు అమలు చేస్తున్నారు? సి‌జే‌పి యా లేక బి‌జే‌పి యా?

తమ కుటుంబ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ఆదాయం తద్వారా లభించే సౌకర్యవంతమైన జీవనం కోసం వీళ్లు విదేశాలకు వెళ్ళిపోయారు. చదువు పేరు చెప్పి వెళ్లి డాలర్ల వేట సాగించి అక్కడే స్థిరపడి మాతృ భూమిని మర్చిపోయిన వాళ్ళే వీళ్ళంతా! భారత ప్రజల శ్రమలతో పన్నులతో కట్టిన స్కూళ్ళు, ల్యాబరేటరీలు, ల్యాబరేటరీ పరికరాలు, స్కూల్ భవనాలు, కాలేజీలలలో అత్యంత తక్కువ ఫీజులతో విద్యాబుద్ధులు గడించి ఆ జ్ఞానాన్ని దేశానికి ఉపయోగ పెట్టడం మాని విదేశీ బహుళజాతి కంపెనీలకు పరాయి నేల మీద ఊడిగం చేస్తున్నవాళ్లు వీళ్లు! విదేశాల్లో సౌకర్యాల మధ్య జీవిస్తున్న ఈ భారతీయ విదేశీయులకు, ఈ దేశంలోని ప్రతి ఒక్క లేమినీ, కలిమినీ, బాధ-సంతోషాలను తమవిగా చేసుకుని బ్రతుకుతున్న ప్రజలు తమ ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు చేస్తున్న పాలకులపై ప్రజాస్వామిక, న్యాయబద్ధ నిరసనలు తెలియజేస్తుంటే వారిని అదేదో కుట్ర, పధకాలు పన్నుతున్నారని ఆరోపించే హక్కు అవకాశం లేనే లేవు.

సౌకర్యాల కోసం, వీళ్లు పరాయి నేలను ఆశ్రయించారు. సౌకర్యాలు ఇవ్వవలసిన పాలకులు మొండి చేయి చూపిస్తూ మోసపూరితంగా ఎన్నికల ఫలితాలను కూడా హైజాక్ చేస్తున్న పరిస్ధితిని స్వయంగా అనుభవిస్తున్న వాళ్ళు ఇక్కడి భారతీయులు! ఈ భరత గడ్డపై పుట్టటమే కాక, గిట్టటానికి కూడా సిద్ధపడి, ‘మా ఖర్మ’ అనుకోకుండా పాలకులను సరిదిద్దేందుకు నడుం బిగిస్తే అదే నిజమైన ప్రజాస్వామ్యం. ప్రజలు దశాబ్దాల తరబడి సాధించుకున్న హక్కులను సంస్కరణల పేరుతో రద్దు చేసి, విదేశీ పర్యటనల్లో మా భారత దేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటూ డొల్ల కబుర్లు చెప్పటం ప్రజాస్వామ్యం కానే కాదు. డొల్ల ప్రజాస్వామ్యాన్ని కూల్చివేసి ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన పని చేసే సేవక ప్రభుత్వం కోసం ప్రజలు ఉద్యమాలు చేస్తే వాటిని గౌరవించటమే నిజమైన దేశ భక్తి! మిగిలినదంతా ఫేక్ దేశ భక్తి!

స్పందించండి