నార్వేలో అమెరికా మిసైళ్లు, రష్యా వార్నింగ్!


Mk-41 launcher system

ఓ పక్క ఇరాన్, ఇతర ఇరాన్ మిత్ర పక్ష గ్రూపుల పైన అమెరికా తీవ్ర స్థాయిలో మిసైల్ మరియు డ్రోన్ ఆయుధాలతో యుద్ధం చేస్తూనే మరో పక్క రష్యాను భవిష్యత్తులో ఎదుర్కొనే లక్ష్యంతో రష్యా పక్కనే ఉన్న నార్వే దేశంలో సరికొత్త మిసైళ్ల వ్యవస్థను నిర్మిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని వెంటనే ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని రష్యా, అమెరికాను గట్టిగా హెచ్చరించింది.

రష్యా, అమెరికా దేశాల మధ్య అణ్వస్త్ర వ్యూహాత్మక స్థిరత్వం నెలకొల్పేందుకు చర్చలు జరగవలసి ఉన్నది. ఉన్నత స్థాయి చర్చల కోసం ఇరు దేశాల అధికారుల మధ్య ప్రాధమిక చర్చలు జరగవలసి ఉండగా, దానిని పక్కన బెట్టి మరిన్ని రెచ్చగొట్టే చర్యలకు అమెరికా పాల్పడటాన్ని రష్యా తప్పు పట్టింది.

నార్వేలో అమెరికా నెలకొల్పిన మిసైల్ ప్రయోగ వ్యవస్థ, Mk-41 లాంచర్ వ్యవస్థలను ఉపయోగించనుందని తెలుస్తోంది. ఈ లాంచర్ లు ఒకే రకం మిసైళ్లను కాకుండా వివిధ రకాల మిసైళ్లను ప్రయోగించగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. తోమహాక్ క్రూయిజ్ మిసైళ్లను కూడా ఈ లాంచర్లు ప్రయోగించగలవని తెలుస్తున్నది. ఈ తరహా వ్యవస్థల నుండి పేల్చే మిసైళ్లకు యూరోపియన్ రష్యా భాగంలో విస్తృతమైన ప్రాంతాలను చేరగల సామర్ధ్యం ఉంటుందని, రష్యా రాజధాని మాస్కో కూడా వీటి పరిధిలోకి వస్తుందని రష్యా ఆరోపించింది.

సెప్టెంబర్ 7 తేదీన రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ రెచ్చగొట్టే చర్యలను విడనాడాలని అమెరికాను హెచ్చరించింది. భూమిపై నుండి పేల్చే మధ్యంతర దూరాల మిసైళ్లను ఐరోపా దేశాల్లో నెలకొల్పడం వలన రష్యా, అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక సమస్యల గురించి జరగవలసిన చర్చలకు విఘాతం ఏర్పడుతుందని హెచ్చరించింది.

Missiles deployments eliminated by INF treaty

“అమెరికా, తన భూమి-ఆధారత మధ్యంతర దూరాల మిసైళ్లను ఐరోపా దేశాలలో నెలకొల్పడం వలన రష్యన్ ఫెడరేషన్ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుంది. చర్చలను పునఃప్రారంభించే అవకాశాలకు గండి పడుతుంది. అమెరికాతో వ్యూహాత్మక చర్చలు దుస్సాధ్యం అవుతాయి. చర్చలకు అవసరమైన సానుకూల వాతావరణం నాశనం అవుతుంది” అని రష్యా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

కొత్త మిసైల్ లాంచ్ వ్యవస్థలను అమెరికా గత ఆగస్టు నెలలో నార్వేలో నెలకొల్పిందని అమెరికా మీడియా వార్తలు ప్రసారం చేసింది. వైవిధ్యమైన మిసైళ్లను ప్రయోగించగల ఎం‌కే-41 లాంచర్లు రష్యా లోతట్టు ప్రాంతాల్లోని లక్ష్యాలను ఛేదించే శక్తితో మిసైళ్లు ప్రయోగించగలవని నిపుణులు నిర్ధారించారు.

నిజానికి అమెరికా, రష్యా దేశాల వూహాత్మక అణ్వస్త్రాల సమతుల్యత సాధించే విషయమై మధ్య ఎప్పటి నుండో జరుగుతున్న చర్చలను గత బైడెన్ ప్రభుత్వం రద్దు చేసింది. అంతకు ముందు ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీ కాలంలో అత్యంత ముఖ్యమైన ఐఎన్ఎఫ్ (ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్) ట్రీటీ ని రద్దు చేసేశాడు. 1987లో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం 500 కి.మీ నుండి 5,500 కి.మీ దూరం లోని లక్ష్యాలను ఛేదించే మిసైళ్లను ఉత్పత్తి చేయకూడదని ఇరు దేశాలు అంగీకరించాయి.

సుదూర లక్ష్యాలను ఛేదించే మిసైళ్లు కేవలం వ్యూహాత్మక ప్రయోజనాలకు మాత్రమే ఉద్దేశించినవి. వీటిని కేవలం శత్రు దేశాలను హెచ్చరించే లక్ష్యంతో తయారు చేసి నిల్వ చేసుకున్నాయి, అమెరికా, రష్యాలు. ఇవి కాకుండా మధ్యంతర దూరాలను ఛేదించే అణ్వస్త్ర మిసైళ్లు టాక్టికల్ ప్రయోజనాల కోసం రష్యా, అమెరికాలు ఉత్పత్తి చేసుకున్నాయి. వీటి వలన తక్షణ ప్రమాదం నెలకొని ఉంటుంది. పైగా నిరంతరం వీటిని అప్ గ్రేడ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండేలా తయారు చేసుకున్నాయి.

INF treaty signing in 1987

ఐఎన్ఎఫ్ పరిధిలోకి కేవలం భూ ఉపరితలం పై నుండి ప్రయోగించే మధ్యంతర క్షిపణులు మాత్రమే వస్తాయి. గాల్లో నుండి లేదా సముద్ర ఉపరితలం నుండి ప్రయోగించే మధ్యంతర క్షిపణులు ఈ ఒప్పందం పరిధిలో లేవు. 1991 నాటికి అప్పటి వరకు తయారు చేసిన భూ-ఉపరితల మధ్యంతర క్షిపణులను ఇరు దేశాలు 2,692 వరకు నాశనం చేశాయి. ఇరు దేశాల ప్రతినిధుల సమక్షంలో ఈ ధ్వంసం చేసే ప్రక్రియ జరిగింది.

ఈ ఒప్పందం ద్వారా రష్యా, అమెరికాలు వేలాది మిసైళ్లను భారీ ఖర్చులు చేసి అప్ డేట్ చేసే అవసరాన్ని తప్పించుకున్నాయి. ఖజానాపై భారాన్ని దించుకున్నాయి. పైకి, అణ్వస్త్రాలను తగ్గించే బృహత్తర కర్తవ్యం కోసమే ఈ ఒప్పందం చేసుకున్నామని అమెరికా, రష్యా చెప్పినప్పటికీ వారి అసలు లక్ష్యం ఖర్చుల భారం తగ్గించుకోవటమే.

కానీ 2019లో ఐఎన్ఎఫ్ ట్రీటీని ఏక పక్షంగా రద్దు చేయటంతో భూమండలానికి అణ్వస్త్ర యుద్ధ ప్రమాదం పెరిగిందని ప్రపంచ దేశాలు, సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఒప్పందం రద్దు తర్వాత కొత్తగా అణ్వాయుధాలను రష్యా, అమెరికా దేశాలు తయారు చేస్తున్నాయని అనుమానాలు రేకెత్తాయి.

ఐఎన్ఎఫ్ ట్రీటీ రద్దు చేయకముందే ఇంటర్మీడియట్ రేంజ్ మిసైళ్లను రష్యా ఉత్పత్తి చేసిందని అమెరికా ఆరోపించింది. ఐఎన్ఎఫ్ నుండి వైదొలగినాక రష్యా కూడా అధికారికంగా ఐఎన్ఎఫ్ నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించింది.

అనంతరం రష్యా, అమెరికాలు రెండూ ఇంటర్మీడియట్ రేంజ్ మిసైళ్ల ఉత్పత్తిని వేగవంతం చేశాయి. రష్యా 9M729 కోడ్ నేమ్ గల ఒరేష్నిక్ క్షిపణిని తయారు చేసింది. ఈ క్షిపణిని అణ్వస్త్రాలు లేకుండా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఒకే ఒక్కసారి ప్రయోగించింది. ఈ క్షిపణి సృష్టించిన పెను విధ్వంసంతో రష్యా ఆయుధ శక్తి పాటవం ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఈ క్షిపణి భూమిని తాకే ముందు 6 ఉప క్షిపణులుగా విడిపోయి ఆ తర్వాత మరిన్ని ఉప క్షిపణులుగా విడిపోయి విస్తారమైన ప్రాంతంలో అత్యంత లోతుగా విధ్వంసం సృష్టించటంతో ప్రపంచం నివ్వెరపోయింది.

అమెరికా విషయానికి వస్తే W76-2 కోడ్ నేమ్ తో ఇంటర్మీడియట్ రేంజ్ క్షిపణులను ఉత్పత్తి చేసింది. అణ్వాయుధాలతో, అణ్వాయుధాలు లేకుండా కూడా ప్రయోగించగలవిగా వీటిని అమెరికా తయారు చేసింది. ఇవి కాకుండా సబ్ మెరైన్ నుండి ప్రయోగించగల లో-యీల్డ్ (తక్కువ విధ్వంసం సృష్టించే) అణ్వాయుధాలను కూడా అమెరికా ఉత్పత్తి చేసింది. లో-యీల్డ్ అణ్వస్త్రాలను ఇరాన్ పై ప్రయోగించేందుకు ట్రంప్ చర్చలు జరిపినట్టు, ఆయన ప్రతిపాదనను అమెరికా మిలటరీ తిరస్కరించినట్టు కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చాయి.

ఇరాన్, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) సభ్య దేశంగా ఉంటూ అణ్వస్త్రాల ఉత్పత్తికి వ్యతిరేకంగా ఫత్వాకూడా జారీ చేసుకుని ఉన్నప్పటికీ అమెరికా, ఐరోపా, ఇజ్రాయెల్ లు ఇరాన్ పైన తీవ్ర స్థాయిలో వాణిజ్య, ఆర్ధిక, రాయబార ఆంక్షలు విధించటమే కాకుండా ఆ దేశం పైన 6 నెలలుగా దురాక్రమణ యుద్ధం చేస్తున్నాయి.

మరోపక్క అత్యంత చిన్న దేశమైన ఉత్తర కొరియా అణు బాంబులు నిర్మించుకోవటంతో ఆ దేశం పైన వేలు పెట్టి చూపేందుకు కూడా పశ్చిమ దేశాలు సాహసించలేక పోతున్నాయి. ఈ నేపధ్యంలో, అమెరికా, ఐరోపా దేశాల పెత్తనం, ఆధిపత్య వాణిజ్య విధానాల నుండి బైట పాడాలంటే తాము కూడా అణ్వస్త్రాలను ఉత్పత్తి చేసుకోవాలన్న ఆలోచనలో అనేక దేశాలు పడిపోయాయి. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్టు లాంటి దేశాలు ఈ తరహా ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

ఈ పరిస్ధిటిల్లో అమెరికా, ఆర్కిటిక్ ధృవానికి అతి సమీపంలో ఉన్న నార్వే లాంటి దేశాల్లో క్షిపణి వ్యవస్థలను నెలకొల్పడం, ఆ దేశం రష్యా పొరుగునే ఉండటంతో ప్రపంచం మరోసారి అణు ప్రమాదం ముంగిట ఉన్నదన్న భయాలు రేకెత్తుతున్నాయి.

వ్యాఖ్యానించండి