మరోసారి ఇరాన్, అమెరికా పరస్పర దాడులు


Iran Boats Near Larak Island

అమెరికా, ఇరాన్ లు మరోసారి ఒకరి పైన ఒకరు దాడులు చేసుకున్నాయి. ఆదివారం నాడు అమెరికా సైన్యం ఇరాన్ కు చెందిన లారక్ ద్వీపంలోని మిసైల్, రాకెట్ లాంచింగ్ పరికరాలపై దాడులు చేసింది. అమెరికా దాడికి బదులిస్తూ ఇరాన్ సైన్యం జోర్డాన్, యుఏఈ దేశాలలో అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైళ్లను తమ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలు గాలిలోనే అడ్డుకున్నాయని జోర్డాన్, యుఏఈ లు ప్రకటించాయి.

ఇరాన్ దక్షిణ తీరంలోనూ, హోర్ముజ్ జలసంధి లో ఉన్న ద్వీపాల లోనూ తన యుద్ధ వ్యవస్థలను నెలకొల్పింది. దక్షిణ భాగంలోనే కాకుండా దేశం నలుమూలలా ఇరాన్ మిలటరీ రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ అమెరికా స్థావరాలపై యుద్ధానికి ప్రస్తుతం దక్షిణ తీరంలోని యుద్ధ వ్యవస్థలను మాత్రమే ఉపయోగిస్తున్నది. ఆదివారం (ఇండియాలో సోమవారం) నాడు హోర్ముజ్ జలసంధిలోని లారక్ ద్వీపం లో ఇరాన్ నెలకొల్పిన మిసైల్ ప్రయోగ వ్యవస్థల పైన దాడులు జరిపింది అమెరికా.

ప్రతీకారంగా జోర్డాన్ లోని అమెరికా మిలటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు నిర్వహించింది. ఇరాన్ నుండి వస్తున్న 8 మిసైళ్లను తమ రక్షణ వ్యవస్థలు గాలిలోనే ఛేదించామని జోర్డాన్ ప్రకటించింది. జోర్డాన్ ప్రకటన ఎంత వరకు నిజమో తెలియదు. ఎందుకంటే ఇరాన్ మిసైళ్లు అమెరికా లక్ష్యాలను ఛేదించిన సంగతిని గల్ఫ్ లోని అమెరికా మిత్ర రాజ్యాలు యుద్ధం జరిగిన గత 6 నెలల్లో ఇంతవరకు ఎన్నడూ అంగీకరించలేదు. అయినప్పటికీ జోర్డాన్, కువైట్, కతార్, యుఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాల్లోని అమెరికా సైనిక, నౌకా స్థావరాలు తీవ్రంగా నష్టపోయాయి.

జోర్డాన్ తో పాటు యుఏఈ లోని అమెరికా మిలటరీ స్థావరం పైన కూడా ఇరాన్ దాడులు నిర్వహించింది. యుఏఈ మాత్రం తమ దేశం పైన ఎలాంటి దాడి జరగలేదని చెబుతున్నది. ఇరాన్ మిసైళ్లు సముద్ర జలాలను దాటి తమ భూభాగం పైకి రాక ముందే గాలిలో ఛేదించామని యుఏఈ చెప్పింది.

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పైన ఆధిపత్య యుద్ధాన్ని ప్రారంభించి ఆగస్టు 28 తేదీతో ఆరు నెలలు పూర్తయ్యాయి. రెండు మూడు వారాల్లో ఇరాన్ ను లొంగదీసుకోవచ్చన్న ఇజ్రాయెల్ సమాచారాన్ని నమ్మి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తో యుద్ధానికి దిగాడు. కానీ ఆరు నెలలు గడిచినప్పటికీ ఇరాన్ లొంగి రాకపోగా తామే భారీ నష్టాలను ఎదుర్కోవలసి రావటంతో అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఫ్రస్టేషన్ లో మునిగిపోయాడు.

ఆదివారం ఇరాన్ పై చేసిన దాడులు ఇసుమంత ప్రభావం కూడా చూపకపోవటంతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) తో ఇరాన్ ద్వీపాలు నాశనం అయినట్లు కృత్రిమ వీడియోలు ప్రచురించి సంతృప్తి పొందుతున్నాడు.

ట్రంప్ డిజిటల్ యుద్ధం

ఆదివారం రాత్రి ఏఐ వీడియోను ట్రూత్ సోషల్ లో ప్రచురిస్తూ డొనాల్డ్ ట్రంప్ “ఇరాన్ కు చెందిన ఖార్గ్ ద్వీపం అమెరికా మిసైల్ దాడిలో ఛిన్నాభిన్నం అయింది” అని ప్రకటించాడు. వీడియోలో ఇరాన్ ద్వీపాలలో భారీ యెత్తున విధ్వంసం జరిగినట్టు చిత్రీకరించి వాటినే నిజంగా జరిగినట్టు అభివర్ణిస్తూ ట్రూత్ సోషల్ గొప్పలు పోయాడు డొనాల్డ్ ట్రంప్! ఇరాన్ ను ఎంత ఘోరంగా దెబ్బ తీశామో చిలవలు పలవలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచురించాడు.

ఇరాన్ ద్వీపం పైన దాడి ఎక్కుపెట్టే ముందే దాడి గురించి ట్రంప్ ప్రకటనలు చేయటంతో పత్రికలు వాస్తవానికి, యుద్ధరంగంలో జరిగిందానికి తేడా ఉండటంతో జర్నలిస్టులు మొదట అయోమయానికి లోనయ్యారు. ట్రంప్ దాడి ప్రకటనను నిర్ధారించటానికి పెంటగాన్ (అమెరికా మిలటరీ విభాగం) నుండి కూడా సరైన సమాచారం అందలేదు.

అయితే ట్రంప్ ని ఎవరూ ఆపలేరు. “ఇరాన్ ఒక విఫల దేశం. కేవలం అమెరికా నుండి వెలువడే ఫేక్ న్యూస్ మాత్రమే దానిని బ్రతికిస్తున్నాయి. అమెరికా పత్రికలు అమెరికా సాధించిన అద్భుతమైన విజయాన్ని నమ్మెందుకు నిరాకరిస్తున్నాయి… ఇరాన్ ఇక చచ్చినట్టే! వాళ్లకి నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, కరెన్సీ లేదు (కరెన్సీ విలువ లెక్కించలేనంతగా పడిపోయిందని అర్ధం), వాళ్ళ సైనికులకు, పోలీసులకు వేతనాలు కూడా చెల్లించలేకపోతోంది. ద్రవ్యోల్బణం 300 శాతం కి చేరింది.

“వారి నాయకత్వానికి ఎటూ పాలుపోవటం లేదు. దేశానికి సమర్ధవంతగా ప్రాతినిధ్యం వహించలేని పరిస్ధితిలో ఇరాన్ నాయకులు ఉన్నారు. వాళ్లకి ఉన్నదల్లా అమెరికా నుండి వెలువడే ఫేక్ న్యూస్ మాత్రమే. సొంత నిరసనకారులను చంపటానికి కూడా వారు వెనకాడటం లేదు. ఇప్పటికి లక్షకు పైగా చనిపోయారు. యుద్ధ నేరాలు చేసీ చేసీ అలసిపోయి ఉంటారు” అని తన ఫ్రస్ట్రేషన్ ని ట్రూత్ సోషల్ లో కుమ్మరించాడు ట్రంప్. అమెరికా పత్రికలు క్రమ క్రమంగా మెల్ల మెల్లగా యుద్ధంలో అమెరికా ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్ధితి గురించి తెలియజేస్తుండటంతో ఆ పత్రికలను, చానెళ్లను ఫేక్ న్యూస్ అని ట్రంప్ తిట్టిపోస్తున్నాడు.

నిజానికి ఇరాన్ ప్రభుత్వం, మంత్రులు, అధ్యక్షుడు ఎక్కడికీ పోలేదు. వారంతా తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అమెరికా నుండి తీవ్ర దాడులు ఎదుర్కొంటూనే ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు. చమురు వాణిజ్యాన్ని వివిధ మార్గాల ద్వారా నిర్వహిస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పేజెష్కియాన్ కిర్ఘిస్తాన్ లో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశాల్లో బిజీగా ఉన్నాడు.

కాగా ట్రంప్ మానసిక రోగిగా మారాడని అమెరికా రాజకీయ నాయకులే విమర్శిస్తున్నారు. ఇరాన్ నాయకులు డొనాల్డ్ ట్రంప్ కి మతి చలించిందని వెక్కిరిస్తున్నారు. కాలిఫోర్నియాకు చెందిన రాష్ట్ర సెనేట్ సభ్యుడు టెడ్ ల్యూ ట్రంప్ ని విమర్శిస్తూ “అమెరికా ప్రధాని కొద్ది కాలంగా మానసికంగా ఆరోగ్యవంతంగా లేడు. ఇరాన్ కు చెందిన ఖార్గ్ ద్వీపాన్ని పేల్చి వేసినట్లు ఊహించు కుంటున్నాడు. వాస్తవంలో అలాంటిది ఏమీ జరగలేదు. ట్రంప్ చెబుతున్నట్టు హోర్ముజ్ జలసంధి పూర్తిగా అమెరికా ఆధీనంలో ఉన్నట్టయితే ఖార్గ్ ద్వీపాన్ని పేల్చివేయాల్సిన అవసరం ఏముంది? ఖార్గ్ ద్వీపంలో ఇరాన్ కార్యకలాపాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి కదా?” అని ప్రశ్నించాడు.

Iran Rocket Launchers Attacked in Larak Island

ట్రంప్ వదరు బోతు మాటలకు భిన్నంగా ఇరాన్ ప్రభుత్వం నిర్విఘ్నంగా యుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. తాము విజయం సాధించేశామని అమెరికా చెప్పుకుంటుంటే ఇరాన్ మాత్రం అమెరికా దాడులను తిప్పి కొడుతూ ప్రతి దాడులను కొనసాగిస్తున్నది. వివిధ దేశాలతో రాయబార కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. చైనా, రష్యా దేశాలతో ఆర్ధిక సంబంధాలను కొనసాగిస్తున్నది.

సమస్యల్లో అమెరికన్ మిలటరీ

ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా రక్షణ శాఖ వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నది. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలు ఇరాన్ నుండి వరుస దాడులు ఎదుర్కోవటంతో అక్కడ స్థావరాలను కొనసాగించటం తలకు మించిన భారం అయింది. యుద్ధం కొనసాగించటం పట్ల అమెరికా సీనియర్ కమాండర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. రక్షణ మంత్రి పీట్ హెగ్ సెత్ యుద్ధ పధకాలతో ఏకభవించలేక పోతున్నట్టు అనేక మంది 4 స్టార్ కమాండర్లు, సీనియర్ అడ్మిరల్స్ “అసమ్మతి” (non-concurs) రికార్డు చేశారు.

ఇరాన్ యుద్ధాన్ని దీర్ఘ కాలం కొనసాగించటం వల్ల అమెరికా బలగాలలో సంసిద్ధత పైన తీవ్ర భారం, ఒత్తిడి పడుతున్నాయని వారు ఆరోపించారు. రక్షణ మంత్రి పీట్ ఇప్పటికే అనేక మంది సీనియర్ మిలటరీ నాయకులను పదవుల నుండి తప్పించాడు. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ర్యాండి జార్జ్ ని కూడా ఆయన తొలగించాడు. పీట్ అమలు చేసిన తొలగింపుల వల్ల అనేక సీనియర్ మిలటరీ స్థానాలు ఖాళీగా పడి ఉన్నాయి. పీట్ హెగ్ సెత్ స్వయంగా డొనాల్డ్ ట్రంప్ నుండి పలు మార్లు తిట్లు, శాపనార్ధాలు ఎదుర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ నేపధ్యంలో ట్రంప్ కు ఏఐ వీడియోలు కాస్త స్వాంతన అందిస్తున్నట్లు కనిపిస్తోంది.

వ్యాఖ్యానించండి