ఐరోపా, రష్యాల మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం!


LEIPJIG AIRPORT DRONE INCIDENT IN GERMANY

జర్మనీ నాయకత్వం లోని ఐరోపా మరియు రష్యా దేశాల మధ్య శతృత్వం నానాటికీ తీవ్రం అవుతున్నది. ఇది కాస్తా యుద్ధానికి దారి తీసే అవకాశాలు ప్రస్ఫుటం అవుతున్నాయి. ఉక్రెయిన్ పైన రష్యా కొనసాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్ తరపున ఐరోపా దేశాలు గరిష్ట స్థాయిలో ఆయుధాలను సరఫరా చేయటంతో పాటు, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలు తమ స్పెషల్ మిలటరీ సిబ్బందిని ఉక్రెయిన్ లో ప్రవేశ పెట్టి శిక్షణ ఇస్తున్నాయి.

ఈ ఘర్షణ లోకి అమెరికాను కూడా దించాలని ఐరోపా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియని డొనాల్డ్ ట్రంప్, పశ్చిమ ఆసియాలో ఇరాన్ పైన దురాక్రమణ ఆధిపత్య ఘర్షణలో మునిగి ఉండటం, ఐరోపా దేశాలకు మిలటరీ ఆయుధాలను అమ్మటం తప్ప స్వయంగా రష్యా వ్యతిరేక జోక్యం చేసుకునేందుకు పూర్తి ఆసక్తి లేని నేపధ్యంలో ప్రస్తుతానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి అమెరికా కనీసం బహిరంగంగానైనా కాస్త దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నది.

రష్యా మరియు పశ్చిమ ఐరోపాల మధ్య ఘర్షణ వాతావరణం అనాదిగా కొనసాగుతున్నప్పటికీ 1990 లో సోవియట్ రష్యా కూలిపోయిన దరిమిలా ఇరు శిబిరాల మధ్య అమెరికా నాయకత్వంలో సర్దుబాటు వాతావరణం ఏర్పడింది. అత్యధిక ధనిక దేశాలతో కూడిన జి7 గ్రూపులో రష్యాను కలుపుకుని జి8 పేరుతో మరొక తాత్కాలిక గ్రూపును కూడా ఏర్పాటు చేసుకున్నారు.

యెల్టిసిన్ అధ్యక్షుడుగా ఉన్నంత కాలం రష్యా, అమెరికా-పశ్చిమ ఐరోపా దేశాల ప్రయోజనాలకు లొంగి పని చేసింది. ఈ కాలంలో రష్యా వనరులను కొల్లగొట్టేందుకు అమెరికా, ఐరోపా దేశాలు తగిన విధానాలు అమలు చేశాయి. రష్యా ధనిక వర్గాలను తమ ప్రభావం కిందకు తెచ్చుకున్నాయి. దరిమిలా రష్యాలో గణనీయ మొత్తంలో అమెరికా, ఐరోపా అనుకూల విధానాలు అవలంబించటం ద్వారా లబ్ది పొందే ధనిక వర్గ లాబీ అక్కడ ఏర్పడింది.

కానీ 2001 సం.లో వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్ష పదవీ పగ్గాలు చేపట్టిన తర్వాత నుండి ఆ దేశం పశ్చిమ దేశాలపై ఆధార పడటం బాగా తగ్గిపోయింది. స్వతంత్ర విధానాలను అవలంబించేందుకే రష్యా మొగ్గు చూపింది. తమ పాత అణ్వాయుధ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోయటంతో పాటు అత్యాధునిక ఆయుధాలను అభివృద్ధి చేసుకోవటం పైన దృష్టి పెట్టింది. మరో పక్క అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు నాటో మిలటరీ కూటమి లోకి తూర్పు ఐరోపా దేశాలను చేర్చుకోవటం ద్వారా నాటో ను తూర్పు వైపుకు అనగా రష్యా దిశలో విస్తరించటం మొదలు పెట్టింది. చివరికి రష్యా పశ్చిమ సరిహద్దుల వరకు నాటో కూటమి చొచ్చుకు వచ్చేసింది.

ఈ క్రమంలో నాటో కూటమి తూర్పు విస్తరణకు రష్యా గట్టిగా అభ్యంతరం చెబుతూ వచ్చింది. రష్యా అభ్యంతరాలను అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ తదితర నాటో దేశాలు లెక్క చేయలేదు. రష్యాను ఆనుకుని ఉండే చిన్న దేశాలైన బాల్టిక్ రిపబ్లిక్ లను (లాత్వియా, లిధుయేనియా, ఎస్తోనియా) కూడా నాటో లోనూ, యూరోపియన్ యూనియన్ లోనూ కలుపుకోవటమే కాక, సగం మందికి పైగా రష్యన్ జాతీయులు ఉండే ఉక్రెయిన్ ను కూడా ఇయు, నాటో లలో చేర్చుకునేందుకు పశ్చిమ దేశాలు పావులు కదపడంతో దానికి వ్యతిరేకంగా రష్యా గట్టిగా హెచ్చరించింది.

దరిమిలా 2014లో, నయా నాజీ శక్తులకు ఆయుధాలు సరఫరా చేయటం ద్వారా రష్యా అనుకూల ప్రభుత్వాన్ని అత్యంత క్రూరమైన హింసతో అమెరికా, ఐరోపా దేశాలు కూల్చివేశాయి. ఐరోపా దేశాల జోక్యాన్ని పెత్తనాన్ని తూర్పు యూరప్ లోని స్లావ్ జాతి ప్రజలు గట్టిగా వ్యతిరేకించారు. తూర్పున ఉన్న డాన్ బాస్ రాష్ట్రాలు ఉక్రెయిన్ నుండి స్వతంత్రం ప్రకటించుకుని విడిపోవటంతో ఉక్రెయిన్ వాటిపై యుద్ధం ప్రకటించింది. 2014 నుండి 2022 వరకు డాన్ బాస్ లో 14,000 మందికి పైగా ప్రజలను అమెరికా, ఇయు దేశాలు జరిపిన ప్రాక్సీ యుద్ధంలో చనిపోయారు.

ఘర్షణను తప్పించి యూరోపియన్ యూనియన్ తో సర్దుబాటు చేసుకోవటానికి రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు గ్యారంటర్లుగా మిన్స్క్స్ 1, మిన్స్క్ 2 ఒప్పందాలను చేసుకున్నప్పటికీ వాటిని ఇయు, అమెరికాలు అమలు చేయకుండా ఉల్లంఘించి డాన్ బాస్ రాష్ట్రాలైన లుగాన్స్క్, డొనేట్స్క్ లపై భీకర అణచివేత యుద్ధం సాగించాయి. ఈ లోపు నల్ల సముద్రంలో క్రిమియా ద్వీప కల్పాన్ని ఫ్లెబిసైట్ ద్వారా రష్యా తనలో కలుపుకుంది. నాటో కూటమి డాన్ బాస్ పై పరోక్ష యుద్ధాన్ని తీవ్రం చేయటంతో 2022 ఫిబ్రవరి లో రష్యా, ఉక్రెయిన్ పైన స్పెషల్ మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది.

గత నాలుగున్నర సంవత్సరాలలో రష్యా, డాన్ బాస్ రాష్ట్రాలతో పాటు దక్షిణాన ఝాపోరెజ్జియా, ఖేర్సన్ రాష్ట్రాలలో మెజారిటీ భూభాగాలను రష్యా వశం చేసుకుంది. డోనెట్స్క్ రాష్ట్రంలో కొద్ది భూభాగం మాత్రమే రష్యాకు ఆవల ఉండగా, సుమీ, ఖార్కివ్, నీప్రో-పెట్రోవ్స్క్, మైలకోవ్ రాష్ట్రాల భూభాగాలను కూడా రష్యా తన అదుపులోకి తెచ్చుకుంది. అక్కడితో ఆగకుండా దక్షిణ ఉక్రెయిన్ లో కీలకమైన పోర్టు నగరాన్ని కలిగి ఉన్న ఒడెస్సా రాష్ట్రంను కూడా బాంబు దాడుల పరిధిలోకి రష్యా తెచ్చుకుంది. దరిమిలా ఉక్రెయిన్ కు నల్ల సముద్రంతో సంబంధాలు తెగిపోయాయి.

రష్యాతో ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నది ఉక్రెయిన్ ప్రజలే అయినప్పటికీ అంతిమంగా యుద్ధ ఫలితాన్ని దక్కించుకునేది మాత్రం నాటో కూటమి మరియు యూరోపియన్ యూనియన్ దేశాలే. నాటో కూటమి మిలటరీ పరంగా ఫలితం దక్కించుకుంటే యూరోపియన్ యూనియన్ మరియు యూరో జోన్ లు ఆర్ధిక, వాణిజ్య పరంగా లబ్ది పొందేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఉక్రెయిన్ ను కూడా నాటో కూటమిలో కలుపుకుంటే రష్యాకు తక్షణ ప్రమాదకారిగా అవతరించ వచ్చని, రష్యాను అదుపు చేయవచ్చని అమెరికా, ఐరోపాలు ఆశిస్తున్నాయి.

ఉక్రెయిన్ లో రష్యా పై చేయి సాధించే కొద్దీ ఐరోపా, అమెరికా ప్రభుత్వాలలో అసహనం, ఆందోళన తీవ్రం అవుతోంది. ఉక్రెయిన్ వనరుల పైన తాము తల పెట్టిన ఆధిపత్యం దక్కించుకోలేమన్న ఆదుర్దా ఆ దేశాలకు కలుగుతోంది. అమెరికా, ఐరోపా దేశాల లోని వివిధ భారీ బహుళజాతి కంపెనీలు ఉక్రెయిన్ బలగాలకు అధునాతన ఆయుధాలను సరఫరా చేసి, అందుకు బదులుగా ఉక్రెయిన్ భూమి వనరులను, ఖనిజ, రవాణా మార్గ వనరుల పైన ఆధిపత్యం సంపాదించాయి. అనగా ఉక్రెయిన్ సార్వ భౌమాధికారం సంపూర్ణంగా అమెరికా, ఇయు దేశాల ఆధీనం లోకి వెళ్లిపోయింది.

మరో పక్క అమెరికా, ఐరోపా దేశాలు రష్యా పైన అనేక ఆర్ధిక, రాజకీయ, రాయబార ఆంక్షలను అమలు చేశాయి. రష్యా చమురు వాణిజ్యం పైన తీవ్రమైన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. రష్యన్ చమురు ట్యాంకర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యాలు అందకుండా ఆంక్షలు అమలు చేస్తున్నది. క్రమ క్రమంగా ఉక్రెయిన్ యుద్ధంలో ప్రత్యక్ష పాత్ర పోషించేందుకు బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు ఉద్యుక్తం అవుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ఆరంభంలో పొలండ్, మూడు బాల్టిక్ దేశాలు రష్యాపై దాడికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ యుద్ధ తీవ్రత పెరగటంతో ప్రస్తుతం గమ్మున ఉండిపోయాయి.

కాగా ఉక్రెయిన్ క్రమంగా రష్యా లోని లోతట్టు ప్రాంతాల లోకి చొచ్చుకు వచ్చి డ్రోన్ లతో బాంబు దాడులు చేయటం తీవ్రం చేసింది. మాస్కో, సెయింట్ పీటర్స్ లాంటి ముఖ్య నగరాల మీద కూడా డ్రోన్ దాడులు చేస్తున్నది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాల సాంకేతిక సహాయం లేకుండా రష్యా లోపలికి చొచ్చుకు వెళ్ళి దాడి చేయగల సామర్ధ్యం ఉక్రెయిన్ కు లేదని రష్యాకు తెలుసు.

పైగా ఇన్నాళ్లు బహిరంగంగా యుద్ధం ప్రకటించకుండా పరిమిత స్థాయిలో మిలటరీ కాంట్రాక్టర్లు, స్పెషల్ మిలటరీ సిబ్బందిని ప్రత్యక్షంగా ప్రవేశ పెట్టి యుద్ధ నడిపిస్తున్న జర్మనీ, బ్రిటన్ దేశాలు ఇప్పుడు బహిరంగంగానే ముందుకు వస్తున్నాయి. ఇటీవల మాస్కో నగరం పైన బ్రిటన్ కు చెందిన స్టార్మ్ షాడో లాంటి సుదీర్ఘ దూరాల లక్ష్యాలను ఛేదించగల మిసైళ్లతో ఉక్రెయిన్ దాడులు నిర్వహించడం వెనుక తమ సహాయ సహకారాలు ఉన్నాయని బ్రిటన్ బహిరంగంగా ప్రకటించింది. దానితో ముసుగులో గుద్దులాట కాస్తా బహిరంగ గుద్దులాటగా మారింది.

లీప్జిగ్ ఘటన – రష్యాపై అనుమానం

ఈ పరిస్ధితుల నేపధ్యంలో ఆగస్టు 4-5 తారీఖుల్లో జర్మనీలోని లీప్జిగ్ నగరంలో రష్యన్ డ్రోన్ లను కనుగొన్నట్టు జర్మనీ ప్రకటించింది. లీప్జింగ్ ఎయిర్ పోర్ట్ నుండి ఉక్రెయిన్ కు ఆయుధాలు మోసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న ఒక కార్గో విమానం వద్ద పేలుడు పదార్ధాలతో కూడిన డ్రోన్ విమానాన్ని ఎయిర్ పోర్ట్ ఉద్యోగి ఒకరు కనుగొన్నట్టుగా ఐరోపా, అమెరికా పత్రికలు ఇల్లెక్కి కూయటం మొదలు పెట్టాయి. మరొక చోట బోయింగ్ 757 ప్రయాణీకుల విమానం వద్ద మరొక డ్రోన్ బైటపడినట్టు, దరిమిలా విమాన సర్వీసులు దెబ్బతిన్నట్టు చెప్పారు. దానికి సమీపంలో పేలుడు పదార్ధాలతో నిండిన మరొక డ్రోన్ ని పరిశోధకులు కనుగొన్నట్టు పశ్చిమ పత్రికలు ప్రకటించాయి.

ఆ వెంటనే ఈ డ్రోన్ విమానాల వెనుక రష్యా హస్తం ఉందని అమెరికా అధికారులు నిర్ధారించేశారు. రష్యన్ మిలటరీ ఇంటలిజెన్స్ సంస్థ GRU, ఉక్రెయిన్ కు ఆయుధాలు అందకుండా నిరోధించేందుకు కుట్ర చేసి డ్రోన్ దాడులు తలపెట్టిందని అమెరికా నిర్ధారించిందని, ఉక్రెయిన్ కార్గో విమానాన్ని పని చేయకుండా నిరోధించటమే ఈ డ్రోన్ విమానాల లక్ష్యం అని అమెరికా ప్రకటించింది.

ఈ నేపధ్యంలో జర్మనీ కూడా లీప్జిగ్ ఘటనకు రష్యాను బాధ్యురాలిని చేస్తూ జర్మనీ అధ్యక్షుడు (ఛాన్సలర్) ఫ్రెడరిక్ మెర్జ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలిటికో పత్రిక (అమెరికా) ఆగస్టు 29 తేదీన వెల్లడి చేసింది. లీప్జిగ్ లో డ్రోన్ విమానాలతో దాడి చేసేందుకు రష్యా ప్రయత్నించినందున ఆ దేశంపై ప్రతీకార చర్యలను జర్మనీ ఛాన్సలర్ త్వరలో ప్రకటించనున్నట్లు పత్రిక తెలియజేసింది. విస్తృతమైన ప్రత్యక్ష ఆర్ధిక ప్రతీకార చర్యలను జర్మనీ ప్రకటించనున్నాడని, రష్యా సంస్థలు ఈ ఆంక్షలకు లక్ష్యంగా ఉంటాయని చెబుతున్నారు.

జర్మనీ ఆంక్షలతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా రష్యాను శిక్షించేందుకు సమాంతర చర్యలు ప్రకటించనుందని తెలుస్తున్నది. ఐర్లాండ్ లో జరుగుతున్న ఇయు విదేశీ మంత్రుల సమావేశం అనంతరం జర్మనీ ఛాన్సలర్, అరివీర భయంకర ఆంక్షలు ప్రకటిస్తాడని రాయిటర్స్ లాంటి ఐరోపా పత్రికలు ప్రకటించాయి. ప్రతీకార చర్యల ప్రకటనలతో ప్రస్తుత అమెరికా, ఐరోపా దేశాల పత్రికలు కాకి గోల చేస్తూ హడావుడి చేస్తున్నాయి.

ఐతే రష్యా పైన అమెరికా, ఇయు దేశాలు ఆంక్షలు అమలు చేయటం ఇదేమీ కొత్త కాదు. ఇప్పటికే డజన్ల సార్లు రష్యా ప్రభుత్వం పైనా, ప్రభుత్వ సంస్థల పైన, ప్రైవేటు కంపెనీలు మరియు ప్రైవేటు వ్యక్తుల పైన అనేక మార్లు ఆంక్షలు ప్రకటించి అమలు చేశాయి అమెరికా, ఇయులు. ఈ ఆంక్షలు ఎంత తరచుగా మారాయంటే వాటిని పట్టించుకోవటం అమెరికా, ఐరోపా ప్రజలు కూడా మానేసేంతగా.

డ్రోన్ ల బాధ్యత రష్యాదేనా?

ఇంకో సంగతి స్పష్టంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సుదీర్ఘ దూరాలలోని లక్ష్యాలను ఛేదించగల డ్రోన్ లను ప్రయోగించటం రష్యాకు కొత్త కాదు. రష్యా వద్ద ఇరాన్ సరఫరా చేసిన డ్రోన్ లతో పాటు, ఇరాన్ డ్రోన్ లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా జోడించి మరింత శక్తివంతంగా నిర్మించిన డ్రోన్ లు కూడా రష్యా వద్ద ఉన్నాయి. ఒక వేళ రష్యా జర్మనీ నగరం లీప్జిగ్ ఎయిర్ పోర్ట్ పైన డ్రోన్ లతో దాడి చేసిందే అనుకుందాం. ఆ డ్రోన్ లు ఎయిర్ పోర్ట్ లో కార్గో లేదా పాసింజర్ విమానాలకు గానీ, భవనాలకు గానీ ఎలాంటి నష్టం జరపకుండా ఎందుకు ఉండిపోయాయి. అసలా డ్రోన్ లు చెక్కు చెదరకుండా ఎందుకు ఉన్నాయి?

మరొక అనుమానం: సదరు డ్రోన్ లను జర్మనీ కి చెందిన మిసైల్ రక్షణ వ్యవస్థలు (రాడార్ లు) ఎందుకు నాశనం చేయకుండా ఉన్నాయి? డ్రోన్ లు రష్యా నుండి జర్మనీ వరకు ప్రయాణించాలంటే పోలాండ్ మీదుగా ఎత్తుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కనీసం పోలండ్ మిసైల్ రక్షణ వ్యవస్థలైనా ఆ డ్రోన్ లను కనిపెట్టి నాశనం చేసి ఉండవచ్చు. అదీ జరగలేదు.

ముఖ్యంగా డ్రోన్ లను రష్యా ప్రయోగిస్తే గనక వాటిని లీప్జింగ్ ఎయిర్ పోర్ట్ లో ఎలాంటి దాడి చేయకుండా, పేలకుండా సురక్షితంగా దిగి ప్రత్యేకంగా పరిశోధకులు వెతికి పట్టుకోవలసింత మరుగున దాక్కుని ఉండేలా రష్యా ఎందుకు ప్రయోగిస్తుంది? డ్రోన్ ప్రయోగిస్తే ఏదో ఒక నష్టం చేసేందుకే ప్రయోగిస్తారు కదా. అలా ఎందుకు జరగలేదు?

ఎందుకంటే సదరు డ్రోన్ లను రష్యా నిజంగా ప్రయోగించలేదు కనుక. అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలకు ఫాల్స్ ఫ్లాగ్ చర్యలకు పాల్పడటం ఒక రొటీన్ కార్యక్రమం. ప్రత్యర్ధి దేశం ఒక దాడి చేసినట్టు చూపించి, ఆ దాడి సాకుతో ప్రతీకార చర్యలు ప్రకటించటం లేదా ప్రత్యర్ధిని బలాన్ని బట్టి మిసైల్, బాంబు దాడులు చేయటం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలకు ఇదే కొత్త కాదు, ఆఖరూ కాదు.

ఈ తరహా కుట్రలను ఈ పశ్చిమ దేశాలు కొన్ని వందల సార్లు అమలు చేశాయి. లిబియా, సూడాన్, ఇరాక్, ఇరాన్, గాజా, లెబనాన్ ఇలా అనేక దేశాలలో తామే టెర్రరిస్టులను ప్రవేశ పెట్టి వారికి అన్ని రకాల ఆయుధాలు సరఫరా చేసి, వారి చేత దొంగ చాటుగా హత్యాకాండలు గానీ లేదా కెమికల్ దాడులు గాని చేయించి ఆ నెపాన్ని ప్రత్యర్ధి దేశం పైకి నెట్టి ఆ వంకతో ఆ దేశంపై మిసైల్, వాయు దాడులతో విరుచుకు పడటం వారికి అలవాటు.

ఉక్రెయిన్ యుద్ధంలో చురుకైన పాత్ర నిర్వహించేందుకు ప్రస్తుతం ట్రంప్ సానుకూలంగా లేడు. ఇరాన్ యుద్ధం వలన ఆయుధాలు, మిసైల్ రక్షణ వ్యవస్థల నిల్వలు అమెరికా వద్ద తగ్గిపోయాయి. ఇప్పటికీ అమెరికా మిలటరీ సలహాదారులు, స్పెషల్ ఫోర్స్ బలగాలు ఉక్రెయిన్ సైన్యానికి శిక్షణ, సహాయం అందిస్తున్నప్పటికీ మునుపటి స్థాయిలో ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా పాత్ర ఉండటం లేదు. నాయకత్వ పాత్రను ఐరోపా దేశాలకే ట్రంప్ అప్పగించాడు. నోబెల్ శాంతి బహుమతి లక్ష్యంగా ఉక్రెయిన్ యుద్ధం విరమించేందుకు ట్రంప్ కొన్ని ప్రయత్నాలు చేసినట్టు కనిపించినప్పటికీ అవేవీ సఫలం కాలేదు.

పైగా ఉక్రెయిన్ యుద్ధాన్ని విరమింపజేసేందుకు తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని ట్రంప్ ఇటీవలే ప్రకటించాడు. ఆగస్టు నాలుగో వారంలో సిఐఏ డైరెక్టర్ జాన్ ర్యాట్ క్లిఫ్ హుటాహుటిన మాస్కో సందర్శించి రష్యా ప్రభుత్వ అధికారులతో చర్చించాడు. మూడు బాల్టిక్ రిపబ్లిక్ లపై రష్యా దాడి చేయకొండా హెచ్చరించేందుకే ఆయన మాస్కో వెళ్లాడని కొందరు అమెరికా అధికారులు చెప్పినట్లు పశ్చిమ పత్రికలు ఊదరగొట్టాయి. కాదు, కాదు ఇరాన్ కు ఎలాంటి సహాయం చేయొద్దని హెచ్చరించేందుకు ర్యాట్ క్లిఫ్ మాస్కో వెళ్లాడని ఇంకొన్ని పత్రికలు ఊహాగానాలు చేశాయి.

ఇవేవీ కారణాలు కాదని స్పష్టం చేయటం గమనార్హం. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగటం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదని. యుద్ధ విరమణకు నచ్చజెప్పేందుకే సిఐఏ డైరెక్టర్ మాస్కో వెళ్లాడని ట్రంప్ స్పష్టంగా ప్రకటించాడు. ఒక రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యుకె పైన రష్యా దాడి చేయటం ద్వారా నాటో కూటమి శక్తియుక్తులను పరీక్షించే పనికి పూనుకోవద్దని పుతిన్ ని హెచ్చరించేందుకు సిఐఏ డైరెక్టర్ మాస్కో వెళ్లాడని వచ్చిన వార్తలను ట్రంప్ ఖండించాడు. “ఇది సెమీ-రొటీన్ సందర్శన” అని ట్రంప్ చెబుతూ జనాన్ని డిసప్పాయింట్ చేస్తున్నందుకు ఆపాలజీ చెబుతూ ఉక్రెయిన్ యుద్ధాన్ని విరమించేందుకు తాను కట్టుబటి ఉన్నానని స్పష్టం చేశాడు.

ఐతే రష్యాతో ఘర్షణను మరో అడుగు పైకి తీసుకెళ్ళేందుకు ఐరోపా దేశాలు ఆతృతగా ఉన్నట్లు జర్మనీ, యుకె దేశాల ప్రభుత్వాల ప్రకటనలు తెలియజేస్తున్నాయి. మరిన్ని కఠిన చర్యలు తీసుకోవటానికి ఉపలాటంగా ఉన్నట్టు ఆ దేశాల అధ్యక్షులు ప్రధాన మంత్రులు చేస్తున్న ప్రకటనలు తెలియజేస్తున్నాయి. ఐతే రష్యాతో నేరుగా తలపడేందుకు ఐరోపా దేశాలు సిద్ధంగా ఉన్నాయా లేదా అన్నది ఒక అనుమానం.

ఎందుకంటే రష్యా ఆయుధ శక్తి ముందు ఐరోపా దేశాల సంయుక్త ఆయుధ శక్తి దిగ దుడుపే. కనుక రష్యాతో తలపడాలంటే అమెరికా సహాయం తప్పనిసరి. అమెరికా (ట్రంప్) అందుకు సిద్ధంగా లేదు. కనుక మరిన్ని ఆర్ధిక, రాయబార, వాణిజ్య ఆంక్షలను ప్రకటించటం వరకే అవి పరిమితం అయే అవకాశం కనిపిస్తుంది. కేవలం డబ్బా చప్పుళ్లు చేస్తూ ఆ చప్పుళ్లనే బాంబు దాడులుగా చాటుకునే అవకాశం కనిపిస్తుంది. మరో పక్క రష్యా-ఐరోపా శిబిరాల మధ్య శతృత్వ వాతావరణం మునుపటి కంటే తీవ్రం అవటం వాస్తవం.

వ్యాఖ్యానించండి