ఇరాన్ ముందు అమెరికా లొంగుబాటు ఎలా సాధ్యపడింది?


సెంట్రల్ ఇజ్రాయెల్ పైకి దూసుకు వస్తున్న ఇరాన్ మిసైల్!

– – – – రచన: సుమన, 17/06/2026

ఫిబ్రవరి 28 తేదీ నుండి అమెరికా, ఇజ్రాయెల్ దేశాల వలన ప్రపంచానికి పట్టిన చమురు దరిద్రం తాత్కాలికంగా ఐనా సరే వదిలింది. వరుసగా ప్రపంచ మరియు, (పశ్చిమాసియా) ప్రాంతీయ పెత్తందారు, యూదు జాత్యహంకారి అయిన అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చివేసి, కీలు బొమ్మ ప్రభుత్వాన్ని స్థాపించి ఆ దేశ చమురు, గ్యాస్ వనరులను స్వాధీనం చేసుకునే ప్రకటిత లక్ష్యంతో ఇరాన్ పైన దురాక్రమణ దాడికి దిగి 40 రోజుల నిరంతరాయ దాడుల తర్వాత కూడా ఏమీ సాధించలేక చతికిల పడ్డ ఫలితమే జూన్ 15 తేదీన ఇరు శిబిరాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం లేదా మెమోరాండం ఆఫ్ అండర్^స్టాండింగ్!

ఫిబ్రవరి 28 తేదీకి (యుద్ధానికి) ముందు, యుద్ధం జరుగుతున్నంత కాలం, ఇరాన్ ని ఏమీ చేయలేక యుద్ధంలో అలసిపోయి, సాలిపోయి, ‘ఇక చర్చించుకుందాం!’ అని దొంగచాటుగా పాకిస్తాన్ తో కబురు పంపి ‘కాల్పుల విరమణ’ ప్రకటించిన తర్వాత కూడా అమెరికా అధ్యక్షుడు వివిధ రకాలుగా ఇరాన్ ని బెదిరించి దారిలో తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేశాడు. ఇరాన్ ప్రభుత్వంలో వివిధ గ్రూపుల మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం చేసి వారిలో వారికి చీలికలు తెచ్చేందుకు విఫల యత్నం చేశాడు. ‘ఇక ఊరుకునేది లేదు, ఇరాన్ నాగరికతను అంతం చేసేస్తా, లొంగిపోతారా లేదా అని బెదిరించాడు. అంతలోనే చర్చలు జరుగుతున్నాయి, రేపే ఒప్పందం కుదరబోతోంది అంటూ రెండు రోజులకొక మాట చెబుతూ స్టాక్ మార్కెట్ లో కృత్రిమ హెచ్చు తగ్గులను ప్రేరేపించి తన వ్యాపార సామ్రాజ్యానికి మిలియన్ల కొద్దీ డాలర్ల లాభాలను ఆర్జించి పెట్టాడు.

ఇరాన్ ప్రజల స్థిర చిత్తం!

ఇంకో పక్క ఇజ్రాయెల్ చేత లెబనాన్ పైన దాడులను కొనసాగింపజేసింది అమెరికా! లెబనాన్ సున్నీ ప్రధాన మంత్రి నవాఫ్ సలాం, సౌదీ అరేబియా, అమెరికా దేశాలకు తొత్తు కాగా, మెరోనైట్ క్రిస్టియన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ఇజ్రాయెల్, అమెరికాలకు తొత్తు పాలకుడు. లెబనాన్ ప్రజల మీద, వారి ఇళ్ల పైనా ఇజ్రాయెల్ తెంపు లేకుండా హంతక దాడులు చేస్తున్నప్పటికీ వాళ్లు ఇజ్రాయెల్ చర్యలకు మద్దతు ఇవ్వటం లోనే బిజీగా గడిపారు తప్ప దేశ ప్రజల కోసం పని చేయలేదు. క్రైస్తవులు, సున్నీలు, షియాలు అన్న తేడా లేకుండా లెబనాన్ ప్రజలందరి రక్షణ కోసం పని చేసిన సంస్థ షియా మిలీషియా అయిన హిజ్బొల్లా మాత్రమే.

అటువంటి హిజ్బొల్లా మిలీషియా నుండి ఆయుధాలు స్వాధీనం చేసుకుని దేశం నుండి వెళ్లగొట్టాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తే అందుకు లెబనాన్ ప్రభుత్వం లోని సున్నీ, క్రిష్టియన్ ఫ్యాక్షన్ లు సిగ్గు లేకుండా అంగీకరించాయి. కానీ హిజ్బొల్లా ను నిరాయుద్ధం చేయగల దమ్ము, ధైర్యం, సామర్ధ్యం లెబనాన్ జాతీయ సైన్యానికి కూడా లేదు. దశాబ్దాల తరబడి లెబనాన్ పైన ఇజ్రాయెల్ సాగిస్తూ వచ్చిన దురాక్రమణ దాడులను నిరంతరాయంగా ఎదుర్కొంటూ రాటు దేలిన సైన్యం హిజ్బొల్లా! హిజ్బొల్లా ను నిరాయుధం చేయాలన్న తన డిమాండ్ ను నెరవేర్చటం లేదన్న కక్షతో ఇజ్రాయెల్ సైన్యం, లెబనాన్ జాతీయ సైన్యం పైకి విచక్షణా రహితంగా దాడులు చేసి హతమార్చుతుంటే వారిని రక్షించే బాధ్యత నెత్తిన వేసుకుని, రక్షించింది కూడా హిజ్బొల్లా మిలిటెంట్లే అన్న సంగతి తెలుసుకుంటే లెబనాన్ లో హిజ్బొల్లా నిర్వహిస్తున్న సమున్నతమైన పాత్రం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.

ఇజ్రాయెల్ లక్ష్యం గ్రేటర్ ఇజ్రాయెల్ ని స్థాపించటం! దక్షిణ లెబనాన్, పశ్చిమ సిరియా, గాజా, వెస్ట్ బ్యాంక్, ఈజిప్టుకు చెందిన సినాయ్ ద్వీప కల్పం తో పాటు ప్రధాన ఈజిప్టు లోని కొంత భాభాగాన్ని కూడా కలుపుకుని విశాలమైన యూదు రాజ్యాన్ని స్థాపించాలన్నది ఇజ్రాయెల్ పాలకుల కల! సదరు కలను సాకారం చేయటానికి ఇదే సరైన సమయం అని గత 15 యేళ్లుగా ఇజ్రాయెల్ ను ఏలుతున్న ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యాహు భావించాడు. ఆ వ్యూహంతో, ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ఇదే సరైన సమయం అని ఇజ్రాయెల్, అమెరికాని లేదా ట్రంప్ ని ఒప్పించి ముగ్గులోకి దించింది. అమెరికాని ఇజ్రాయెల్ ఒప్పించింది అన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రధాన దోషిగా కనిపిస్తుంది. కానీ వాస్తవం ఏమిటంటే ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో తనకు అప్పజెప్పిన పాత్రను నిర్వహించటంలో భాగంగా అమెరికా ముందు తన పధకాన్ని ఉంచింది.

హోర్ముజ్ జల సంధి

ఐతే ఇరాన్ కేవలం ముల్లాల రాజ్యం అని అమెరికా, ఇజ్రాయెల్ లు తక్కువ అంచనా వేశాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో, పరిశోధనా రంగాల్లో ఇరాన్ సాధించిన ప్రగతిని గుర్తించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దురహంకారం అడ్డు వచ్చింది. మిసైల్ పరిజ్ఞానం లోనూ, మిసైల్ డిఫెన్స్ పరిజ్ఞానం లోనూ ఇరాన్ పెద్ద పెద్ద అంగలతో అభివృద్ధి చెందిన సంగతిని అవి చూడలేకపోయాయి. ఇరాన్ సాధించిన సూపర్ సోనిక్ (శబ్ద వేగంతో ప్రయాణించగల మిసైళ్లు), హైపర్ సోనిక్ (శబ్దవేగం కంటే 5 రెట్లు లేదా అంతకు మించిన రెట్ల వేగంతో ప్రయాణించగల మిసైళ్లు) పరిజ్ఞానాన్ని అమెరికా, ఇజ్రాయెల్ లు కూడా ఇంతవరకు అందుకోలేక పోయాయన్న విషయాన్ని గుర్తిస్తే ఇరాన్ ప్రగతి సామర్ధ్యం ఎంత ఉన్నతమైనదో అర్ధం అవుతుంది.

అయినప్పటికీ అమెరికా వద్ద ఉన్న మిలటరీ సామర్ధ్యం అపారమైనది. సాధారణ దృక్పధంలో చూసినప్పుడు ఇరాన్ ని ఓడించటం అమెరికాకు చిటికెలో పని అని అందరికీ అనిపిస్తుంది. అయితే భౌగోళిక నిర్మాణం రీత్యా, పర్షియన్ అఖాతం పైన ఇరాన్ దేశానికి ఉన్న స్థానిక పట్టు రీత్యా స్థానికంగా ఇరాన్ దేశానికి అనేక సానుకూలతలు (అడ్వాంటేజెస్) ఉన్నాయి. ముఖ్యంగా ఆధునిక యుద్ధ వ్యవస్థలలో ఎసిమెట్రిక్ వార్ (అసమాన యుద్ధం), అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి ఒక విధంగా గ్లోబల్ స్థాయిలో పెద్ద, బలమైన దేశం పైన చిన్న, బలహీన దేశం చేసే గెరిల్లా యుద్ధం లాంటిది అని చెప్పవచ్చు.

గెరిల్లా యుద్ధంలో ఒక ప్రధాన యుద్ధ తంత్రం ఏమిటంటే “శత్రువు బలంగా ఉండి వెంట తరుముతున్నపుడు రక్షణ తీసుకోవాలి. శత్రువు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అడపా దడపా దాడులు చేసి శత్రు సైన్యానికి చికాకు కలిగించాలి. శత్రువు పారిపోతున్నప్పుడు వెంటపడి తరుముతూ గరిష్ట నష్టాన్ని కలిగించాలి.” రెండు దేశాల జాతీయ సైన్యాల మధ్య జరిగే యుద్ధానికి ఈ సూత్రాన్ని యధాతధంగా అనువదించటం సాధ్యం కాదు. కానీ ఈ సూత్రం వెలుగులో తగిన ఎత్తుగడలను చిన్న, బలహీన దేశం అవలంబించి, సానుకూలంగా ఉన్న తమ భౌగోళిక నిర్మాణాన్ని, భౌగోళిక స్థానాన్ని అనువుగా ఉపయోగిస్తూ బలమైన శత్రువుని తీవ్రంగా నష్టపరచటం సాధ్యం అవుతుంది. అయితే అందుకు తగిన సామర్ధ్యం నాయకత్వానికి, నాయకత్వాన్ని అనుసరించే సైన్యానికి ఉండటం ఇందులో ప్రధాన షరతు.

47 యేళ్ల అవమానకర, అమానుషమైన అంతర్జాతీయ స్థాయి వాణిజ్య, రాజకీయ, ఆర్ధిక, రాయబార షరతులను పశ్చిమ దేశాల నుండి ఎదుర్కొంటున్న ఇరాన్ పాలకులకు, ప్రజలకు అసమాన యుద్ధంలో ఆరితేరటం, ఎటువంటి కష్టభూయిష్టమైన పరిస్ధితులనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండటం పెద్ద విషయం కాలేదు. మీ విద్యుత్ కేంద్రాలను, అణు పరిశ్రమలను, బ్రిడ్జిలను, ప్రజా నిర్మాణాలను నాశనం చేస్తానని, మీ నాగరికతను అంతమొందిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించినప్పుడు, ఇరాన్ ప్రభుత్వం పిలుపు మేరకు ఆ దేశ ప్రజలు మిలియన్ల మంది వీధుల్లోకి వచ్చి విద్యుత్ కేంద్రాలు, బ్రిడ్జిలు, అణు కేంద్రాల చుట్టూ చిక్కనైన మానవహారాలు నిర్మించి “బాంబులు వేయండి, చావటానికి మేము సిద్ధం” అని ఇరాన్ ప్రజలు సవాలు విసిరాక అమెరికా చేష్టలుడిగి నిలుచుంది. దాడి చేస్తే ఇరాన్ ప్రజలు చనిపోతారని అమెరికా భయపడలేదు. లక్షల మంది పౌరులు చనిపోతే అంతర్జాతీయ న్యాయ స్థానంలో దొషులుగా నిలబడాల్సి వస్తుందన్న భయంతోనే అమెరికా అత్యున్నత సైన్యాధికారులు తోకముడిచారు.

ప్రజలు & సాంకేతిక పరిజ్ఞానం

ఇరాన్ ప్రభుత్వానికి ఇరాన్ ప్రజల స్థిర చిత్తం, ప్రభుత్వంపైన విశ్వాసం, వారి ధైర్య సాహసాలు.. ఇవే అత్యంత విలువైన బలంగా నిలిచాయి. ఇరాన్ ప్రజల అండదండలు లేకపోతే, వారి బేషరతు మద్దతు లేకపోతే ఇరాన్ విజయం సాధ్యం అయ్యేది కాదు. ఆ తర్వాత ఆర్ధికంగా, వాణిజ్యపరంగా అత్యంత గడ్డు పరిస్ధితుల్లో కూడా ఇరాన్ సాధించిన శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన ప్రగతి వారికి కొండంత బలాన్ని ఇచ్చింది. అంటే పరిమితంగా ఉన్న ఆర్ధిక వనరులను సరిగ్గా ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు చేశారు. లంచాలు, అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ బడులు, కాలేజీలు, యూనివర్శిటీలను ప్రజలకు అందుబాటులో ఉంచటంతో పాటు అతి ముఖ్యమైన పరిశోధన & అభివృద్ధి (Research & Development -R&D) రంగాల్లో విశేషమైన కృషి చేసేందుకు తగిన ప్రాధాన్యం ఇచ్చింది ఇరాన్! ముందు చెప్పుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వ రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, సైన్యాధికారులు మొ.న వారి విద్యార్హతలు చూస్తే ఈ సంగతి చక్కగా అర్ధం అవుతుంది.

ఎన్ని ఉన్నా దేశ రాజకీయ నాయకత్వానికి జాతీయ భావనలకు సంబంధించిన నిబద్ధత లేనట్లయితే ప్రజల విజ్ఞానం, సామర్ధ్యం అన్నీ విదేశాల పాలవుతాయి (భారత మేధావులు డాలర్ల వేటలో పశ్చిమ దేశాలకు క్యూ కట్టినట్టు). ఎవరి వల్లనైతే దేశం వెనకబడి ఉన్నదే వారి దేశాల కంపెనీలకే తమ జ్ఞానాన్ని ధారపోస్తూ సేవలు చేసే పరిస్ధితి ఏర్పడుతుంది.

జాతీయ భావనలు ఉండటం అంటే ఇండియాలో జరుగుతున్నట్లు క్రికెట్ స్టేడియంలలో కూర్చొని ఇండియా, ఇండియా అంటూ కేకలు వేస్తూ ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లను గేలి చేయటం కాదు, మన దేశంలో పుట్టింది అని చెబుతూ మతతత్వ భావనలను రెచ్చగొడుతూ అదే జాతీయత అనీ అదే దేశభక్తి అనీ తప్పుడు భావనలు, భావోద్వేగాలు రెచ్చగొట్టి, ప్రజల్లో ఒక సెక్షన్ ని మరో సెక్షన్ పైన కుత్తుకలు ఉత్తరించుకునేలా రెచ్చగొడితే అది దేశ భక్తి కాదు, జాతీయత అంతకంటే కాదు. లేదా ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకు వెళ్తే ‘జనగణమన’ గీతాన్ని వినిపిస్తూ లేచి నిలబడని వాళ్ళ పైకి అదేదో పవిత్ర కర్తవ్యంలా వెళ్లి గొడవ చేయటం, బూతులు తిట్టిపోయటం… ఇవి కూడా దేశ భక్తి కాదు.

మహాకవి గురజాడ అప్పారావు గారు దేశమంటే ఏమిటో, దేశభక్తి అంటే ఏమిటో శతాబ్దం క్రితమే చెప్పారు, ఎవరికైనా గుర్తుంటే…

దేశమంటే మట్టి కాదోయ్… దేశమంటే మనుషులోయ్!

ఆయన ఇంకా ఏమన్నారో చూడండి!

చెట్టపట్టాల్‌ పట్టుకొని దేశస్థులంతా నడువవలెనోయి

అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నియు మెలగవలెనోయి

మతం వేరైతేను యేమోయి? మనసు లొకటై మనుషులుంటే

జాతమన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయి!

గురజాడ, శ్రీ శ్రీ లాంటి మహాకవుల రచనలు కాలాతీతంగా ఉంటాయి అనటానికి ఈ గేయం ఒక రుజువు. పై పాదాలు చూసినట్లయితే సరిగ్గా భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులకు అద్దం పడుతున్నట్టే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన ఉన్నత స్థానాల్లో ఉన్న ఇప్పటి రాజకీయ తరానికి ముందు చూపుతో గడ్డి పెట్టినట్టే లేదూ!

గమనిస్తే గనక గురజాడ ఉపదేశాల గురించి తెలియని ఇరాన్ పాలకులు, ప్రజలు సరిగ్గా వాటిని తు.చ తప్పకుండా పాటించినట్టే ఉన్నది. ఇరాన్ పాలకులు తమ దేశం లోని చమురు, సహజ వాయువు సంపదలు కేవలం ఇరాన్ ప్రజలకు కనీసం ఇరాన్ పెట్టుబడిదారులకు మాత్రమే చెందాలని కోరుకున్నారు. కోరుకోవటమే కాదు దానికోసం గట్టిగా నిలబడ్డారు. దేశంలోని సహజ వనరులను తమకు అప్పగించకుండా ఉన్నందుకే ఆ దేశం పైన అమెరికా, ఐరోపా రాజ్యాలు కత్తిగట్టి ఆంక్షలు అమలు చేశాయి.

దేశ భక్తి, జాతీయత పేరుతో ఇరాన్ ప్రజలు కుర్డులు, సున్నీలు లాంటి మైనారిటీ ప్రజలను వెంటాడి వేధిస్తూ హత్యలు చేయలేదు. కుర్డులు, సున్నీలు లాంటి మైనారిటీ జాతుల ప్రజలకు దేశంలో తగిన ఆర్ధిక వనరులను అందుబాటులో ఉంచుతూనే అన్ని జాతులు, మతాల ప్రజలకు గౌరవ ప్రదంగా జీవించే అవకాశాలను కల్పించారు. అలాంటి పాలనలో ఉన్నారు గనుకనే, ప్రజల్లో నిజమైన దేశభక్తిని పెంపొందింప జేశారు గనకనే వాళ్లు బేషరతుగా యుద్ధానికి మద్దతు ఇవ్వటమే కాకుండా స్వయంగా సామ్రాజ్యవాద ప్రతిఘటనా కార్యకలాపాల్లో పాల్గొన్నారు.

దేశ ప్రజల దేశ భక్తిని, మతంతో సంబంధం లేని జాతీయతను ఎన్ని మిసైళ్లు, ఎన్ని బి-2 బాంబర్లు, ఎన్ని ఎఫ్-35 ఫైటర్ జెట్లు మూకుమ్మడిగా దాడి చేసినా నాశనం చేయలేరు. అందుకే అమెరికా ఆయుధ బలగం ఇరాన్ ప్రజలను గాయపరిచింది, చంపింది గానీ ఓడించలేకపోయింది, లొంగదీయలేకపోయింది. ఏళ్లతరబడి ఆంక్షలు అమలు చేస్తే ప్రజలు విసిగిపోయి తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తారన్న అమెరికా, ఇజ్రాయెల్ దేశాల కుట్రపూరిత ఎత్తుగడలను ఇరాన్ ప్రజలు చిత్తుగా ఓడించారు. అందుకే ఇరాన్ చరిత్ర గుర్తు పెట్టుకునేలా అసమాన యుద్ధంలో అసామాన్యమైన విజయాన్ని సాధించింది.

సీజ్ ఫైర్ పరిణామాలు, అదృశ్య పరిస్థితులు: గ్యాసోలిన్ ధరలు

పై అంశాలన్నీ ప్రపంచ ప్రజల కంటికి స్పష్టంగా కనిపించేవి. ఇరాన్ సైన్యం, ప్రజల సాహసాన్ని కంటి ముందు ప్రత్యక్షంగా ఉంచేవి. అమెరికా లేదా డొనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయెల్ లేదా బెంజిమన్ నెతన్యాహు లు ఎదుర్కొన్న కంటికి కనపడని, తెరవెనుక పరిణామాలను కూడా గుర్తించాల్సి ఉన్నది.

అమెరికా / ట్రంప్ లొంగుబాటుకు కారణమైన అంశాల్లో ఒకటి: అమెరికా చమురు నిల్వలు నానాటికీ తగ్గిపోతుండటం. యుద్ధం దరిమిలా హోర్ముజ్ జలసంధి పైన ఇరాన్ బ్లాకేడ్ విధించగా, అందుకు ప్రతీకారంగా ఇరాన్ పోర్టుల పైన అమెరికా సొంత బ్లాకేడ్ విధించింది. అమెరికన్ బ్లాకేడ్ ని దాటుకుని కొన్ని డజన్ల చమురు ట్యాంకర్లు చైనా, ఇండియా లాంటి ఆసియా దేశాలను చేరినప్పటికీ ప్రపంచ చమురు ధరలను స్థిరంగా ఉంచేందుకు అవి సరిపోవు. ఫలితంగా ప్రపంచ స్థాయిలో చమురు సరఫరా తగ్గిపోతూ వచ్చింది. ఐరోపా దేశాలకు హోర్ముజ్ గుండా చమురు సరఫరా కావటం గగనంగా మారింది. అమెరికా నుండి ఐరోపా దేశాలకు చమురు అందినప్పటికీ అది బాగా ఖరీదైనది, పైగా తగిన ఉత్పత్తి చేయగల సామర్ధ్యం అమెరికాకు లేదు. ఫలితంగా చమురు ధరలు బ్యారేల్ కు 60 డాలర్ల నుండి 120 డాలర్ల వరకు పెరిగాయి.

దానితో అమెరికా తన వ్యూహాత్మక చమురు నిల్వలను గ్యాస్ నిల్వలను మార్కెట్ లోకి విడుదల చేయాల్సి వచ్చింది. అలాగే ఇతర జపాన్, జర్మనీ లాంటి దేశాల వ్యూహాత్మక నిల్వలను కూడా విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. ఫలితంగా అమెరికా వ్యూహాత్మక చమురు నిల్వల అత్యంత కనిష్ట స్థాయికి చేరాయి. సిఎన్ఎన్ ప్రకారం గత 40 యేళ్లలోనే అత్యంత కనిష్ట స్థాయికి అనగా 340.3 మిలియన్ల బ్యారెళ్ళ కు అమెరికా వ్యూహాత్మక నిల్వలు పడిపోయాయి. రొనాల్డ్ రీగన్ పాలన తర్వాత ఈ స్థాయిలో ఎన్నడూ పడిపోలేదు. పైగా అప్పుడే అమెరికా వ్యూహాత్మకంగా చమురు నిలవ చేయటం ప్రారంభించింది. అంటే చమురు చరిత్రలో ఇలాంటి అధమ స్థాయికి చమురు నిల్వలు చేరటం ఇదే ప్రధమం.

అమెరికా 2026 లో రోజుకు 20 నుండి 21 మిలియన్ బ్యారెళ్ళ వరకు చమురు వినియోగిస్తుంది. అంటే అమెరికా చమురు నిల్వలు జూన్ 16 తేదీ నుండి మరో 17 రోజులు మాత్రమే వస్తాయి. అంటే జులై 1 తేదీ వరకు మాత్రమే అమెరికా చమురు నిల్వలు వస్తాయి. ఆ తర్వాత జీరో నిల్వలు అమెరికా చమురు గిడ్డంగుల్లో ఉంటాయి. ఈ పరిస్ధితుల్లో అమెరికాలో వాహనాలకు ఉపయోగించే గ్యాసోలిన్ (ద్రవ రూపంలో ఉన్న గ్యాస్) ధరలు లీటర్ కు 5 డాలర్లకు చేరింది. లీటర్ కు 5 డాలర్లు అంటే అమెరికా ప్రజల ఆర్ధిక సహన శక్తిని తాకినట్లే లెక్క!

ఎంత పిచ్చోడు అనుకున్నా జులై 1 నాటికి గ్యాసోలిన్ ఇక అమెరికా ప్రజలకు అందుబాటులో ఉండదు అన్న పరిస్ధితి ట్రంప్ కి అర్ధం కాకుండా ఏమీ ఉండదు. నవంబర్ నెలలో జరగనున్న సెనేట్, హౌస్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తీవ్రంగా నష్టపోయే పరిస్ధితిని ఎదుర్కునేందుకు ట్రంప్ సిద్ధంగా లేడు.

తీవ్రంగా నష్టపోయిన అమెరికా సైనిక స్థావరాలు!

ఇరాన్ కు అమెరికా 7 వేల 200 మైళ్ళ దూరంలో ఉన్నది. కాబట్టి అమెరికాలో ఉంటూ ఇరాన్ పైన యుద్ధం చేయటం వీలు కాదు. ఖచ్చితంగా ఇరాన్ కి దగ్గరలోని గల్ఫ్ మిత్ర దేశాలు కేంద్రంగా చేసుకుని యుద్ధం నడపాల్సి ఉంటుంది. లేదా ఐరోపా లోని జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్ లాంటి మిత్ర దేశాల నుండైనా యుద్ధ విమానాలు నడపాల్సి ఉంటుంది. జూన్ 2025 లో జరిగిన 10 రోజుల యుద్ధంలో, ఫిబ్రవరి 28, 2026 తేదీ నుండి జరిగిన 39 రోజుల యుద్ధంలో ఇరాన్ చేసిన దాడుల దరిమిలా గల్ఫ్ దేశాల్లోని సైనిక, వైమానిక స్థావరాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. దానితో సమర్ధవంతంగా ఇరాన్ పైన దాడి చేసే పరిస్ధితి అమెరికాకు బాగా తగ్గిపోయింది.

అయినప్పటికీ జూన్ 9, 10 తేదీల్లో మళ్ళీ అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ పైన మిసైల్ దాడులు చేశాయి.ఈ దాడులకు ప్రతీకారంగా జరిగిన ఇరాన్ దాడుల్లో అమెరికా, ఇజ్రాయెల్ సమీప భవిష్యత్తులో కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నాయి. ఇరాక్ లో కుర్దులకు మద్దతుగా సిఐఏ ఏర్పాటు చేసిన బేస్ క్యాంపులు ఇరాన్ ప్రతీకార దాడుల్లో సర్వ నాశనం అయ్యాయి. కువైట్ లోని అలీ ఆల్ సలేం వైమానిక స్థావరం, ఈశాన్య కువైట్ లోని క్యాంప్ బ్యూహ్రింగ్, షుయిబా సివిలియన్ పోర్ట్ సమీపంలో ఉన్న తాత్కాలిక ఆపరేషన్స్ సెంటర్ లు ఇరాన్ మిసైల్ దాడుల్లో దెబ్బ తిన్నాయి.

సౌదీ అరేబియా విషయానికి వస్తే రాజధాని రియాద్ పక్కనే ఉన్న ప్రిన్స్ సాద్ వైమానిక స్థావరం దాదాపు పనికి రాకుండా పోయింది. అలాగే జోర్డాన్ లోని మౌవాఫాక్ ఆల్ సాల్టీ వైమానిక స్థావరాన్ని కూడా ఇరాన్ గట్టి దెబ్బ తీసింది. అత్యంత తీవ్ర స్థాయిలో జరిగిన నష్టాలను బట్టి చైనా సరఫరా చేసిన మిసైళ్లను ఇరాన్ ప్రయోగించినట్లుగా కొందరు అంచనా వేస్తున్నారు. అయితే మళ్ళీ దాడి చేస్తే ఇంతవరకు ప్రయోగించని అధునాతన మిసైళ్లతో ప్రతి దాడి చేస్తామని ఇరాన్ ముందే హెచ్చరించిన నేపధ్యంలో చైనా సహాయం చేసిందన్న అంచనా సరైనది కాకపోవచ్చు.

వణికిపోయిన గల్ఫ్ దేశాలు

యుద్ధానికి ముందు ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు గల్ఫ్ లోని అరబ్ దేశాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. గల్ఫ్ రాజ్యాల్లో ఇరాన్, ఇరాక్ లలో షియా ప్రజలు మెజారిటీ సంఖ్యలో ఉండగా బహ్రెయిన్ తప్ప ఇతర గల్ఫ్ దేశాలన్నింటిలో సున్నీ ప్రజలదే మెజారిటీ. బహ్రెయిన్ పాలకుడు సున్నీ కాగా, ప్రజలు ప్రధానంగా షియా గ్రూపుకు చెందిన వారు. యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, కతార్, బహ్రెయిన్ దేశాల పాలకులు (అందరూ ఫ్యూడల్ రాజులే) ఇరాన్ వినాశనానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ దేశాలు అందజేసిన నిధులు, సరఫరా చేసిన ముస్లిం ఛాందసవాద టెర్రరిస్టులు (ఐఎస్ఐ) ను ఉపయోగించి అమెరికా పశ్చిమ రాజ్యాలు మరియు ఇజ్రాయెల్ సిరియాలో బషర్ అస్సాద్ నేతృత్వంలోని సెక్యులర్ ప్రభుత్వాన్ని డిసెంబర్ 2024 లో కూల్చి వేశాయి.

పర్షియన్ అఖాతం (Purisian Gulf)

ఎందుకంటే మధ్య ప్రాచ్యంలో అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని ఇజ్రాయెల్ జాత్యహంకార ప్రాంతీయ ఆధిపత్యాన్ని ఎదిరించి ప్రతిఘటించటంలో ఇరాన్ కు సిరియా, లెబనాన్ (హిజ్బొల్లా), యెమెన్, ఇరాక్ (పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్) ఒక కూటమిగా సహకరించి పనిచేస్తున్నాయి గనక! ముస్లిం ప్రపంచం పైన ముఖ్యంగా ప్రపంచం లోని సున్నీ ఇస్లాం ప్రజలకు నాయకత్వ స్థానాన్ని చేజిక్కించుకోవటానికి సౌదీ అరేబియా, యుఏఈ, కతార్ లు తమలో తాము పోటీ పడుతూనే ఇరాన్ ని బలహీనపరిచి కూల్చేందుకు అమెరికా, ఇజ్రాయెల్ లకు సహకరిస్తాయి.

కానీ యుద్ధం మొదలైనాక ఇరాన్ అనూహ్య రీతిలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాల పైనా, ఇజ్రాయెల్ పైనా అధునాతన మిసైళ్లు, డ్రోన్ లు, సముద్ర గర్భ మైన్ లు, స్పీడ్ బోట్ లతో విరుచుకు పడటంతో వాటికి ఇరాన్ వద్ద ఉన్న యుద్ధ వినాశక శక్తికి ఎంత పదును ఉన్నదో తెలిసి వచ్చింది. అప్పటి వరకు తమకు అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ తయారు చేసిన ఐరన్ డోమ్ లాంటి మిసైల్ రక్షణ వ్యవస్థలు శక్తివంతమైన రక్షణ కల్పిస్తాయని ఆశించిన గల్ఫ్ దేశాలు, చివరికి అవే సైనిక స్థావరాలు శాపంగా పరిణమించటంతో కళ్లు తెరిచాయి. ఇరాన్ తో శతృత్వం కంటే మిత్రత్వమే మేలన్న నిర్ణయానికి వచ్చాయి.

గల్ఫ్ రాజ్యాల్లో యుఏఈ, ఇజ్రాయెల్ కు అత్యంత దగ్గరి మిత్ర దేశంగా గుర్తింపు పొందింది. అమెరికా మధ్యవర్తిత్వం లో సెప్టెంబర్ 2020 లో యుఏఈ, బహ్రెయిన్ దేశాలు ఇజ్రాయెల్ తో సంబంధాలను సాధారణీకరిస్తూ (normalise) “అబ్రహాం ఎకార్డ్స్” పేరుతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా మంత్రసాని పని నిర్వర్తించాడు. ఇతర గల్ఫ్ దేశాలు, ముస్లిం దేశాలు కూడా యుఏఈ, బహ్రెయిన్ లను అనుసరించేందుకు అమెరికా పధక రచన చేయగా ఈ లోపు అక్టోబర్ 7, 2023 తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ నిర్మించిన కంచె దాటుకుని ఇజ్రాయెల్ పైకి దాడి చేసి డజన్ల మంది యూదు ప్రజలను కిడ్నాప్ చేశారు.

అమెరికా సామ్రాజ్యవాద ప్రతిఘటన, ఇజ్రాయెల్ యూదు జాత్యహంకార ఆధిపత్య ప్రతిఘటన అక్టోబర్ 7, 2023 తేదీన మొదలై 2025 ఫిబ్రవరి 28 నాటికి ఇరాన్ పై దురాక్రమణ దాడి వరకు ప్రయాణించింది. అక్టోబర్ 7 దాడి కాకతాళీయంగా జరిగినది కాదు. ఇజ్రాయెల్ తో నార్మలైజేషన్ ప్రక్రియను అమెరికా ప్రారంభించిన నేపధ్యంలో పాలస్తీనా సమస్యను ప్రపంచం మర్చిపోతున్న పరిస్థితుల్లో తమ సమస్యను తిరిగి ప్రపంచ భౌగోళిక రాజకీయాల ఎజెండా లో చొప్పించేందుకే ఈ దాడి జరిగిందన్న సంగతి గమనంలో ఉంచుకోవాలి.

[అలాగే ఆ రోజు హమాస్ మిలిటెంట్లు యూదుల ఇళ్లలోకి చొరబడి పౌరులను చంపారని, ఊచకోత కోశారని, మహిళల పైన అత్యాచారాలు జరిపారని, పిల్లలని కూడా చూడకుండా కాల్చి చంపారని… ఇలా అనేక అబద్ధాలు, పుకార్లు పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ప్రచారంలో పెట్టాయి. అవన్నీ వాస్తవాలు కావు. నిజానికి ఆ రోజు చనిపోయిన యూదుల్లో అనేక మంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కి చెందిన మిలటరీ హెలికాప్టర్ కాల్పుల్లో, ట్యాంకుల దాడిలో చనిపోయారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది అనేందుకు పలు సాక్షాలను విలేఖరులు కొందరు వెల్లడించారు.]

ఇరాన్ లో మిలటరీ టార్గెట్లు కాకుండా అణు కర్మాగారాలు, చమురు క్షేత్రాలు, గ్యాస్ క్షేత్రాల పైన అమెరికా, ఇజ్రాయెల్ లు దాడులు చేయటంతో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని చమురు, గ్యాస్ క్షేత్రాల పైనా, అమెరికా సైనికులు ఉంటున్న పెద్ద పెద్ద హోటళ్ల పైనా దాడులు చేయటం మొదలు పెట్టింది. చమురు బావులు, గ్యాస్ ఫీల్డ్ ల నుండి నిరంతరం చమురు, గ్యాస్ ఉత్పత్తి తీస్తూ ఉంటేనే అవి పని చేస్తాయి. ఉత్పత్తిని ఆపినా, రిపేర్ కి వచ్చినా, దాడుల్లో దెబ్బ తిని యంత్ర సామాగ్రి నస్టపోయినా మళ్లీ చమురు ఉత్పత్తి తీయటం వెంటనే సాధ్యం కాదు. యంత్రాలను బాగు చేయటం ఒక పనైతే, తిరిగి చమురుని వెలికి తీయటం భారీ పని అవుతుంది. కంప్యూటర్ ని బూట్ చేసి పని మొదలు పెట్టేందుకు సమయం పట్టినట్టే, చమురు బావిని తిరిగి ఉత్పాదక భావిగా మార్చటానికి అనేక యంత్ర వ్యవస్థలను మొదలెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇరాన్ దాడుల వలన గల్ఫ్ దేశాల ఆర్ధిక వ్యవస్థలు ఆదాయం లేక కుదేలు అయ్యే పరిస్ధితి నెలకొంది.

యుఏఈ ఒకే దేశం కాదు. అది ఏడు చిన్న రాజ్యాల (దుబాయ్, అబుదాబి, షార్జా, రస్ ఆల్ ఖైమా, అజ్మన్, ఉమ్ ఆల్-కువైన్, ఫుజైరా) తో కూడిన ఫెడరల్ దేశం. వీటిలో దుబాయ్, అబుదాబి లు సంపన్నవంతమైనవి. ముఖ్యంగా దుబాయ్ ఒక ముఖ్యమైన ఫైనాన్షియల్ సెంటర్ గా మారింది. దుబాయ్, అబుదాబి లలో స్థానికులు కేవలం 10 నుండి 20 శాతం మాత్రమే ఉంటారు. ఉదాహరణకి 2017 లో యుఏఈ జనాభా 91.2 లక్షలు ఉంటే అందులో యుఏఈ జాతీయులు కేవలం 9.6 లక్షల మంది. మిగిలిన వాళ్లలో ఇండియన్లు ఎక్కువ మంది ఉంటారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆసియన్లు, యూరోపియన్లు కూడా ఉన్నారు కానీ తక్కువ మంది. వీళ్లంతా తమ తమ దేశాల్లో వివిధ పద్ధతుల్లో ఆర్జించిన సొమ్ముని దుబాయ్ బ్యాంకుల్లో పెట్టి, అక్కడే ఉంటూ లగ్జరీ జీవితం అనుభవిస్తూ ఉంటారు. కనుక యుఏఈ రాజుల సంగతి అటుంచి ప్రజల్లో కూడా జాతీయ భావనలు ఉండే అవకాశం లేదు.

ఇరాన్ దాడులు మొదలు పెట్టాక దుబాయ్, అబు దాబి ల నుండి విదేశీయులు (భారతీయులతో సహా) పెట్టె బేడా సర్దుకుని బ్రతుకు జీవుడా అంటూ సొంత దేశాలకు వెళ్ళిపోయారు. కొందరు తమతో పాటు తమ సొమ్ముల్ని కూడా తీసుకెళ్లారు. ఫలితంగా యుఏఈ లో ఆర్ధికంగా చితికిపోయే పరిస్ధితి ఏర్పడింది.

దరిమిలా యుఏఈ అనివార్యంగా ఇరాన్ తో సంధికి సిద్ధపడింది. బహిరంగంగా చెప్పుకునే సంధి కాకుండా ఇరాన్ తో ఏప్రిల్ నెలలోనే అంతర్గతంగా ఒప్పందానికి వచ్చింది. రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం యుఏఈ బ్యాంకుల్లో స్తంభింప జేసిన ఇరాన్ నిధులను విడుదల చేసేందుకు ఒప్పందంలో భాగంగా యుఏఈ అంగీకరించింది. దుబాయ్ అధికారులు అందజేసిన సమాచారం ప్రకారం ఏకంగా 10 బిలియన్ డాలర్లు ఇరాన్ కు తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకుంది. అందులో 3 బిలియన్లు ఇప్పటికే ఇచ్చేసిందని కొన్ని పత్రికలు చెప్పాయి. రెండో విడత నిధులు కూడా ఒక ప్రత్యేక నౌకలో జూన్ రెండో వారంలో అందజేసినట్లు పశ్చిమ వార్తా సంస్థలు చెప్పాయి. కొన్ని పత్రికలైతే 20 బిలియన్ డాలర్లు విడుదల చేసేందుకు యుఏఈ అంగీకరించిందని రాశాయి. ఇరాన్ నిధులు విడుదల చేసినందుకు ప్రతిఫలంగా యుఏఈ పైన దాడులు చేయటం నిలిపివేయాలి. ఏప్రిల్ చివరి నాటికి యుఏఈ పైన ఇరాన్ దాడులు నిలిచిపోవటం గమనార్హం.

ఇరాన్ తో రహస్య ఒప్పందం కుదిరిందన్న వార్తలను యుఏఈ విదేశాంగ శాఖ ఖండించింది. ఇరాన్ నిధులను తాము విడుదల చేశామన్న వార్త నిజం కాదని చెప్పింది. కానీ యుఏఈ నుండి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఒకటి ఇరాన్ వెళ్లి అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపిన మాట మాత్రం నిజం. ఇజ్రాయెల్ కు దగ్గరి మిత్రుడుగా పేరు పొంది, ఇజ్రాయెల్ కు బద్ధ శత్రువుగా పరిగణించే ఇరాన్ పైన యుద్ధం చేస్తున్న సమయంలో యుఏఈ అధికార బృందం ఇరాన్ వెళ్లి అక్కడి ప్రభుత్వంతో చర్చలు చేయటం అంటే అదేదో ఉబుసుపోకకు జరిగే వ్యవహారం కాదు కదా! అదీ కాక అమెరికా, ఇజ్రాయెల్ ల ప్రతిష్టకు భంగం కలిగించే వార్త, నిజం కాకపోతే పశ్చిమ పత్రికలు ప్రచురించవు కూడా. నిజానికి అమెరికా అనుమతితోనే యుఏఈ బృందం ఇరాన్ వెళ్లి ఉన్నా ఆశ్చర్యం లేదు. అమెరికా కూడా గడ్డు పరిస్ధితిలో ఉండటమే అందుకు కారణం.

కతార్ నుండి కూడా ఉన్నత స్థాయి అధికారిక ప్రతినిధి బృందం జూన్ 10 తేదీన ఇరాన్ రాజధాని టెహ్రాన్ వెళ్లి ద్వైపాక్షిక సంబంధాల పైన చర్చలు జరిపింది. ప్రాంతీయంగా జరుగుతున్న పరిణామాలు, ఇరాన్-అమెరికా మధ్య ఘర్షణకు ముగింపు పలికేందుకు చేయవలసిన రాయబార ప్రయత్నాల గురించి కూడా కతార్ బృందం ఇరాన్ తో చర్చించింది. ఓ పక్క అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలను ముందుకు సాగకుండా ఇరాన్ అడ్డుకుంటున్నదని ఆరోపిస్తూ తగిన ఫలితాన్ని అనుభవిస్తుందని హెచ్చరిస్తుండగానే కతార్ బృందం టెహ్రాన్ లో దిగటం గమనార్హం. ఫ్రాన్స్ కి చెందిన ఏ.ఎఫ్.పి వార్తా సంస్థ ప్రకారం అమెరికా అనుమతి తోనే అమెరికా – ఇరాన్ చర్చల క్రమంలో ఇరాన్ వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేసి ఇరు దేశాల (అమెరికా, ఇరాన్) మధ్య తలెత్తిన తేడాలను పరిష్కరించే కృషిలో భాగంగానే కతార్ బృందం ఇరాన్ కు వెళ్లింది.

అనగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైకి చూసేందుకు ఇరాన్ కు రోజువారీ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, ఇరాన్ ను శాంతింప జెసేందుకు, ఏదో విధంగా ఇరాన్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆతృతగా ఉన్నాడని, అందుకోసం ఒక్క పాకిస్తాన్ పైనే ఆధార పడకుండా యుఏఈ, కతార్ లను కూడా చర్చలకు పురమాయించాడని అర్ధం అవుతున్నది.

గల్ఫ్ స్థావరాలను అమెరికా ఖాళీ చేస్తుందా?

ఇరాన్ నాయకత్వంలో పశ్చిమ దేశాలలో ఉన్న షియా ప్రజలు అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయెల్ జాత్యహంకార వలస వాదం లకు వ్యతిరేకంగా ప్రారంభించిన సామ్రాజ్యవాద వ్యతిరేక, జాత్యహంకార వలసవాద వ్యతిరేక మహా యజ్ఞం మహా విజయం వైపుగా పయనిస్తున్న సూచనలు వెలువడుతున్నాయి. ప్రపంచ వ్యాపితంగా మూడో ప్రపంచ దేశాలతో పాటు పశ్చిమ సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ దేశాలలో సైతం జరుగుతున్న కార్మికవర్గ పోరాటాలకు బలమైన ఊపుని ఇచ్చే పరిణామం ఇది అనటంలో ఎలాంటి సందేహం లేదు.

పాకిస్తాన్ కి చెందిన ఒక సీనియర్ అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం ఇరాన్, అమెరికా దేశాల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించటం కాకతాళీయంగా జరిగిన పరిణామం కాదు. కొంతమంది వాదిస్తున్నట్లు అంతర్జాతీయ రంగంలో ప్రతిష్ట కోసం పాకిస్తాన్ పడుతున్న పాకులాటగానే ఆదేశ మధ్యవర్తిత్వాన్ని కొట్టిపారేయటం కూడా సరైనది కాదు. ప్రచ్చన్న యుద్ధంలో పాకిస్తాన్ అమెరికా పక్షం వహించటంతో పాటు, చైనాతో కూడా సన్నిహిత సంబంధాలు నిర్వహించింది. అంతే కాక, ఇండియా క్రమంగా అమెరికాకు దగ్గరవుతున్న నేపధ్యంలో పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా రష్యాతో స్నేహ, వ్యాపార సంబంధాలను పెంపొందించుకుంటోంది.

అమెరికా కోరిక మేరకు పాకిస్తాన్ రంగంలో దిగినప్పటికీ ప్రధానంగా చైనా, రష్యా దేశాల పురమాయింపు, ప్రోత్సాహం పాకిస్తాన్ రంగం లోకి దిగటం వెనుక పని చేసినట్లుగా పాక్ సీనియర్ అధికారి ఇచ్చిన సమాచారం ద్వారా అర్ధం అవుతోంది. చైనా, రష్యాల ప్రోత్సాహంతో పాకిస్తాన్, సౌదీ అరేబియా, కతార్ లతో కూడా చర్చలు జరిపి ఇరాన్ తో సంబంధాలకు ఆ రెండు దేశాలు ప్రయత్నాలు ప్రారంభించేందుకు దోహదం చేసింది. అంతే కాదు, అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే అమెరికా మిలటరీ స్థావరాలను సౌదీ అరేబియా, కతార్ ల నుండి ఖాళీ చేయించేందుకు పాకిస్తాన్ చర్చలు జరుపుతున్నది. పైగా ఈ చర్చలు పురోగతి సాధిస్తున్నాయని కూడా తెలుస్తున్నది.

“ప్రాజెక్ట్ ఫ్రీడం” పేరుతో గల్ఫ్ దేశాల చమురు ట్యాంకర్ నౌకలు ఒక్కుమ్మడిగా లేదా మూకుమ్మడిగా హూర్ముజ్ జలసంధిని అమెరికా డిస్ట్రాయర్ నౌకల సహాయంతో దాటించేందుకు అమెరికా ఒక పధకం రచించి అమలు చేసింది. కానీ ఈ పధకాన్ని ముందే గ్రహించిన ఇరాన్, హూర్ముజ్ జలసంధికి పశ్చిమాన ఉన్న యుఏఈ పోర్టుల పైకి మిసైళ్లతో దాడి చేసి ధ్వంసం చేయటంతో అది బెడిసి కొట్టింది. ఈ పధకంలో పాల్గొనేందుకు, అందుకు సౌదీ అరేబియా గగన తలాన్ని అమెరికా ఉపయోగించేందుకు సౌదీ అరేబియా, అమెరికాకు గట్టిగా “నో” చెప్పింది. “ప్రాజెక్ట్ ఫ్రీడం” లో పాల్గొనేందుకు సౌదీ అరేబియా నిరాకరించటం వెనుక, పైన చెప్పినట్లు రెండు దేశాలతో (సౌదీ, కతార్) పాకిస్తాన్ చర్చలు జరుపుతుందడమే కారణం అని రాయబార పరిణామాల ద్వారా అర్ధం అవుతున్నది.

ఒకటి రెండు నెలల్లోనో లేదా ఆరేడు నెలల్లోనో గల్ఫ్ స్థావరాల నుండి అమెరికా సైన్యం, యుద్ధ విమానాలు ఖాళీ చేయటం జరక్కపోవచ్చు. కానీ ఇరాన్ నాయకత్వంలో యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ లకు నిర్ణయాత్మకమైన గట్టి ప్రతిఘటన ఇస్తున్న నేపధ్యంలో పర్షియన్ అఖాతం చుట్టూ ఉన్న గల్ఫ్ అరబ్ దేశాల్లో ఆ దిశలో పరిణామాలు జరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది. ఇరాన్ ప్రజలు, పాలకులు తమ ప్రాణాలకు లెక్క చేయకుండా దశాబ్దాల తరబడి చేసిన, చేస్తున్న పోరాటాలే అమెరికా సామ్రాజ్యవాదం అనే మట్టి కాళ్ళ మహా రాక్షసి ఈ ప్రాంతంలో ఉనికి చాలించుకునే దశలోకి జారిపోవటానికి కారణం.

ఇరాన్ సుప్రీం నేత అయితుల్లా అలీ ఖమెనీ, యుద్ధం సమీపిస్తున్నప్పటికీ, బంకర్ లో రక్షణ పొందాలని ప్రభుత్వ నేతలంతా విజ్ఞప్తి చేసినప్పటికీ, సామాన్య ప్రజలందరికీ బంకర్ల రక్షణ అందుబాటులో ఉన్నపుడు మాత్రమే తాను బంకర్ లో రక్షణ పొందేందుకు అంగీకరిస్తానని చెప్పటమే కాకుండా యుద్ధం మొదటి రోజునే పలువురు మిలటరీ, ప్రభుత్వ అధికారులతో సహా అమెరికా, ఇజ్రాయెల్ హంతక దాడిలో ప్రాణ త్యాగం చేయటం ద్వారా ఇరాన్ ప్రజలకు ఒక దేదీప్యమాన స్ఫూర్తిగా, ఒక ఉదాహరణగా నిలిచి దారి చూపిన సంగతి విస్మరించరాదు.

వస్తు సంపదలను చుట్టూ పేర్చుకుని, సకల సౌకర్యాలను అనుభవించగల లగ్జరీని తృణప్రాయంగా త్యజించి ప్రాణత్యాగం చేసిన ఇరాన్ సుప్రీం నాయకుడు, ఇరానియన్ అత్యున్నత మిలటరీ మరియు ప్రభుత్వ అధికారుల ముందు ఈనాటి మూడో ప్రపంచ దేశాల అధినేతలు, అధ్యక్షులు, ప్రధాన మంత్రులు మరుగుజ్జులుగా కనిపిస్తే అది దృష్టి దోషం కాదని గ్రహించాలి. తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పే కోట్లాది మంది శ్రమ జీవులను ఆకలి మంటలకు, దారిద్రానికి, ఉపాధిరాహిత్యానికి గురి చేస్తూ అవినీతితో, నగ్న దోపిడీలతో కొల్లగొట్టిన బిలియన్ల కొద్దీ డబ్బు రాశుల్లో, సుఖభోగాల్లో మునిగి తేలుతున్న మూడో ప్రపంచ దేశాల, పెట్టుబడిదారీ పశ్చిమ రాజ్యాల నేతలు, బ్యూరోక్రాట్లు ఇరాన్ ప్రభుత్వ నాయకుల వద్ద హార్వర్డ్, ఆక్స్ ఫర్డ్, శాన్ జోస్, ఎంఐటి లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో కూడా లభించని పాఠాలను నేర్చుకోవచ్చు.

మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్!

ఇరు దేశాల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరినట్లు డొనాల్డ్ ట్రంప్ ఆతృతగా ప్రకటించాడు గాని ఒప్పందంలోని అంశాలు ఏమిటో వెల్లడి చేయలేదు. ఇరాన్ ప్రభుత్వం అయితే ఒప్పందం లోని 14 అంశాలను తమ సెమీ-అధికార వార్తా సంస్థ ద్వారా (అనధికారికంగా?) ప్రకటించింది. ప్రస్తుతానికి డిజిటల్ సంతకాలు జరిగాయని జూన్ 19 తేదీన స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో ఒప్పందం పైన అధికారికంగా సంతకాలు జరుగుతాయని ఆ తర్వాతే ఒప్పందం అంశాలు వెల్లడి అవుతాయని ట్రంప్ చెప్పాడు. బహుశా ఇజ్రాయెల్ ఆది లోనే ఆటంకాలు పెట్టకుండా ఉండేందుకు అమెరికా ఈ జాగ్రత్త తీసుకున్నట్లు పత్రికలు ఊహాగానాలు చేశాయి.

ఊహించినట్లు గానే అమెరికా-ఇరాన్ ల మధ్య ఒప్పందంలో తమ పాత్ర లేదని, దక్షిణ లెబనాన్ మరియు ఆ దేశ రాజధాని బీరుట్ లపై తమ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబనాన్, యెమెన్, గాజా లు కూడా ఒప్పందంలో భాగమని ఇరాన్ స్పష్టం చేసింది. కనుక ఇప్పటి అవగాహనా ఒప్పందం ఆచరణలో అమలు అవుతుందా లేదా అన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. అనుమానాలకు ప్రధాన కారణం ఇజ్రాయెలే అయినప్పటికీ అమెరికా నుండి ఇజ్రాయెల్ చర్యలను విడదీసి చూడటం వాస్తవిక పరిశీలన కాజాలదు. ఇజ్రాయెల్, అమెరికా చేతిలోని బలమైన పాచిక, ఆయుధం, స్పాయిలర్, గేట్ క్రాషర్… ఇలా ఎన్ని పేర్లతోనైనా పిలవొచ్చు.

పశ్చిమాసియాలో అమెరికా ఉనికికే ఎసరు వస్తున్న ప్రమాదం ఎదురు కావటం, నవంబర్ నెలలో సెనేట్ మరియు హౌస్ ఎన్నికలు సమీపిస్తుండటం, రిపబ్లికన్ పార్టీ తో పాటు ట్రంప్ ప్రతిష్ట కూడా అట్టడుగు స్థాయికి చేరటం, అమెరికాలో గాసోలిన్ ధరలు లీటర్ కు 5 డాలర్ల మార్క్ ను చేరిన దరిమిలా ద్రవ్యోల్బణం ప్రమాదం ముంచుకు రావటం… ఇవన్నీ అమెరికా, డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలు. పైన వివరించిన బాహ్య పరిస్ధితులు కూడా అమెరికాపై తీవ్రమైన ఒత్తిడికి గురి చేయటంతో అనివార్య పరిస్ధితుల్లో మాత్రమే ఇరాన్ ముందు అమెరికా సాగిలపడి నిలబడింది. కింద పడ్డా పై చేయి నాదే అని హుంకరించటానికి అలవాటు పడ్డ అమెరికా తన సామ్రాజ్యవాద దురహంకార పూరిత అణచివేత రాజకీయాల చరిత్రలో మొదటి సారి ఒక మూడో ప్రపంచ దేశం ముందు కాల్పుల విరమణ ఒప్పందం కోసం అడుక్కుంటూ నిలబడింది.

ఇరాన్ అంత తేలికగా ఒప్పందాన్ని అమెరికాకి అప్పగించలేదు. కాల్పుల విరమణ రోజున ఏ అంశాలనైతే షరతులుగా అమెరికా ముందు ఉంచిందో ఆ అంశాల నుండి ఒక్క అంగుళం కూడా ఇరాన్ వెనక్కి జరగలేదు. కొద్ది రోజుల క్రితం ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు మొజ్తబా హొసెనీ ఖమెనీ విడుదల చేసిన సిద్ధాంత పత్రం, అమెరికా పట్ల ఎలాంటి నమ్మకాన్ని గానీ, ఆశలను గానీ వ్యక్తం చేయలేదు. అమెరికా సామ్రాజ్యవాద దురహంకార పూరిత ఆధిపత్యాన్ని సరిగ్గానే అది గుర్తించింది. అవగాహనా పత్రంలోని అంశాల పైన రానున్న 60 రోజుల్లో జరగనున్న చర్చల పైన కూడా సదరు పత్రం ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. మరో యుద్ధం, మరో దురాక్రమణ దాడి తధ్యం అన్న అవగాహన తోనే ఇరాన్ ప్రభుత్వం ఉన్నది. మరో యుద్ధానికి తన ప్రజలను ఇరాన్ సిద్ధం చేసే ఉంచిందని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రకటించిన సైద్ధాంతిక అవగాహనా పత్రం ద్వారా స్పష్టం అవుతున్నది.

రష్యా, చైనాల స్థానం ఎక్కడ?

యుద్ధంలో చైనా, రష్యాల గురించి కొంత చెప్పుకోవాలి. ఇరాన్ కు రష్యా, చైనాల నుండి అధునాతన ఆయుధాలు సరఫరా అయ్యాయని పశ్చిమ వార్తా సంస్థలు పుంఖాను పుంఖాలుగా వార్తలు ప్రచురించాయి. కానీ అందుకు సాక్షాలు మాత్రం అవి ఇవ్వలేకపోయాయి. 2025 లో జరిగిన 12 రోజుల యుద్ధంలో కూడా రష్యా నుండి యుద్ధానికి అవసరమైన ఇంటలిజెన్స్ సమాచారం అందిందని ప్రచారం జరిగింది. అలాంటి సహాయం ఏదీ అందలేదని ఇరాన్ స్పష్టం చేయగా, తమ సహాయం తీసుకునేందుకు ఇరాన్ నిరాకరించిందని పుతిన్ చెప్పాడు.

కానీ 2022 నుండే ఇరాన్ కు సరఫరా చేస్తామన్న ఎస్-400 మిసైల్ రక్షణ వ్యవస్థలు ఇప్పటి వరకు అందనే లేదు. నిజానికి బషర్ ఆల్-అస్సాద్ నేతృత్వం లోని సిరియా ప్రభుత్వం 2024 లో వేగంగా కూలిపోవటానికి మౌనంగా సహకరించిన రష్యా పైన ఇరాన్ కు పెద్దగా నమ్మకం లేదన్న సంగతి వివిధ సందర్భాల్లో వెల్లడి అయింది. చైనా నుండి ఎలాంటి సహకారం, ఆయుధాలు, ఇంటలిజెన్స్ సమాచారం అందింది అన్నది వివరాలు ఏవీ వెల్లడి కాలేదు.

బహుళ ధృవ ప్రపంచ అభివృద్ధికి రష్యా, చైనా, ఇరాన్ దేశాల మధ్య మౌలికంగా ఏకాభిప్రాయం ఉన్నది. కానీ చైనా-ఇరాన్ మధ్య గానీ, రష్యా-ఇరాన్ ల మధ్య గానీ ఫెవికాల్ బంధం లాంటిది ఏమీ లేదు. ఈ మూడు దేశాలు పెట్టుబడిదారీ దేశాలు. తమ సొంత ప్రయోజనాల కోసం అవి కట్టుబడి ఉన్నాయి. మూడింటిలో మిగిలిన రెండు దేశాల కోసం తమ ప్రయోజనాలు వదులుకునే త్యాగానికి ఏ ఒక్క దేశము సిద్ధంగా లేదు. ఇరాన్ దేశం చేస్తున్నది ప్రతిఘటన! రష్యా కూడా అమెరికా, ఐరోపా లను ప్రతిఘటిస్తున్నప్పటికీ ఇరాన్ ప్రతిఘటనకూ, రష్యా ప్రతిఘటనకూ మౌలిక విభేదాలు ఉన్నాయి.

అమెరికాలో ఉన్నట్లే రష్యాలో కూడా ఇజ్రాయెల్ కోసం తపించే బలమైన యూదు లాబీ ఉన్నది. ఇజ్రాయెల్ లో మిలియన్ పైగా రష్యన్ యూదులు ఉన్నందున ఇజ్రాయెల్, దాదాపు రష్యాతో సమానం అని ప్రకటించటం ద్వారా పుతిన్ రష్యాలోని యూదు లాబీని సంతృప్తి పరిచాడు. లెబనాన్, గాజా లపై ఇజ్రాయెల్ దాడులను నిలువరించేందుకు గట్టి ప్రయత్నం రష్యా ఎప్పుడూ చేయలేదు. ఐరాస భద్రతా సమితిలో ఇరాన్ వ్యతిరేక, పాలస్తీనా వ్యతిరేక తీర్మానాలను కొన్ని వీటో చేసినప్పటికీ రష్యా తటస్థంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అనగా ఒక సైద్ధాంతిక అవగాహనలో భాగంగా పాలస్తీనా, లెబనాన్, ఇరాన్ లపై అణచివేతను వ్యతిరేకించే దృష్టి కోణం రష్యాకు ఏ కోశానా లేదు.

పశ్చిమాసియా, గల్ఫ్ దేశాలతో చైనాకు బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ లో భాగంగా చైనా అనుకూల ప్రపంచ వాణిజ్యంలో గల్ఫ్ దేశాలు భాగస్వాములుగా ఉన్నందున ఇరాన్ వ్యతిరేక ఆంక్షలను, అణచివేతను చైనా కూడా స్పష్టంగా ఖండించిన ఉదాహరణ లేదు. తన వాణిజ్య సంబంధాలలో ఎలాంటి అప్రభ్రంశాన్ని, ఆటంకాన్ని సైద్ధాంతిక అవగాహనలో భాగంగా చైనా అంగీకరించే పరిస్ధితి లేదు. తమ సొంత ప్రయోజనాలను కాపాడుకునే లక్ష్యంలో భాగంగా మాత్రమే చైనా, ఇరాన్-లెబనాన్-గాజా-యెమెన్ అక్షానికి సహాయం చేస్తుంది. అంతకు మించి ముందుకు ఒక్క అడుగు కూడా చైనా వేయబోదు.

చైనా, రష్యాలకు అమెరికా పట్ల కూడా బద్ధ వ్యతిరేకత గానీ, అమెరికా దాష్టీకాన్ని మొదలంటా తుంచి వేయాలన్న నిబద్ధత గానీ లేవు. తమతో పాటుగా మరొక ప్రపంచ శక్తిగా అమెరికాను గుర్తించేందుకు రష్యా, చైనాలకు ఎలాంటి అభ్యంతరం లేదు. అమెరికాతో ఇచ్చి పుచ్చుకునే సమంధాలను అవి ఆశిస్తున్నాయి తప్ప అమెరికాను ఓడించి దాని మార్కెట్ లను కైవశం చేసుకునే జీరోసమ్ ఆట ఆడటం ఆ దేశాల లక్ష్యం కాదు.

కనుక చైనా, రష్యా, ఇరాన్ దేశాల మధ్య స్నేహ, వాణిజ్య, రాజకీయ, సైనిక సంబంధాలకు పరిమితులు ఉన్నాయి. సొంత పెట్టుబడిదారీ లాభార్జనా లక్ష్యాలే ఆ పరిమితులు. కానీ పెట్టుబడిదారీ దేశాల మధ్య మిత్ర వైరుధ్య సంబంధాలు తాత్కాలిక దశగా ఉంటాయి తప్ప శాశ్వత సత్యంగా ఉండజాలవు. కనుక ఈ మూడు దేశాల మధ్య ద్వైపాక్షికంగా శత్రుత్వం అభివృద్ధి కాదన్న గ్యారంటీ లేదు.

కార్మికవర్గ విప్లవానికి ప్రత్యామ్నాయం లేదు!

దశాబ్దాల తరబడిన రాజకీయ, ఆర్ధిక, వాణిజ్య, రాయబార అణచివేత అనుభవం నుండి ఒక మత సిద్ధాంత రాజ్యాధినేతలు, అధికార గణాలు కూడా మిలిటెంట్ ప్రతిఘటన అభివృద్ధి అయేందుకు అవకాశాలు ఉన్నాయని ఇరాన్ వీరోచిత ప్రతిఘటన నిరూపిస్తోంది. ఇరాన్ ప్రతిఘటన అత్యవసరంగా, వాస్తవంగా జాతీయవాద ప్రయోజనాలకు సంబంధించిన ప్రకటన. ఈ ప్రయోజనాల పరిధిలో దేశీయంగా కార్మికవర్గ అణచివేత, పెట్టీ బూర్జువా బలహీన ప్రతిఘటన, రైతాంగం అవకాశవాద ఊగిసలాట… ఇవన్నీ అనివార్యమైన అంతర్భాగంగా ఉంటాయి.

అందులో భాగంగానే ఇరాన్-అమెరికా అవగాహనా ఒప్పందానికి వ్యతిరేకంగా, ఇరాన్ విదేశీ మంత్రి మరియు స్పీకర్ లకు వ్యతిరేకంగా వివిధ ఇరానియన్ నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అందులో భాగంగానే ఇరాన్ విదేశీ మంత్రిని ప్రతిఘటనలో చొరబడ్డ దళారీగా నిరసనకారులు అభివర్ణించారు. అందులో భాగంగానే ఇరాన్ లోని వివిధ పాలక గ్రూపుల మధ్య నిరంతరం విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. కానీ అమెరికా, ఇజ్రాయెల్ దేశాల అత్యంత అనాగరిక దురాక్రమణ దాడి వారిని ఏకం చేసింది.

అందుకే కార్మికవర్గ సిద్ధాంతానికి, కార్మికవర్గం నాయకత్వంలో జరగవలసిన విప్లవ తిరుగుబాటుకు ప్రాసంగికత నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఆయా దేశాల లోని అంతర్గత పరిస్ధితులు, అభివృద్ధి దశలకు తగ్గట్టుగా విప్లవ దశలను నిర్ధారించుకుని ప్రజలను విప్లవాలకు సిద్ధం చేయాల్సిన కర్తవ్యం కార్మికవర్గం పైన కొనసాగుతూ ఉంటుంది. ఇందులో ఎలాంటి అనుమానాలు అనవసరం.

వ్యాఖ్యానించండి