
నవంబర్ 22 తేదీన భారత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సంస్థ బిస్లరీ ఇంటర్నేషనల్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీ పైన ప్రాసిక్యూషన్ నడిపేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీకి చెందిన బాటిల్డ్ వాటర్ లో అనుమతించిన మోతాదుకు మించి బ్రోమైట్, పాలీ న్యూక్లియర్ ఆరోమేటిక్ హైడ్రో కార్బన్స్ (పిఏహెచ్) లు ఉన్నట్టు ల్యాబొరేటరీ పరీక్షల్లో తేలటంతో కంపెనీని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది.
ఈ అనుమతి ఆధారంగా, ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థకు, బిస్లరీ కంపెనీ పైన కేసు నమోదు చేసి విచారణ చేసే అధికారం లభించింది.
బిస్లరీ కి చెందిన గోవా ఫ్యాక్టరీ నుండి FSSAI 6 శాంపిళ్లను సేకరించి సంవత్సరం పైనే (సెప్టెంబర్ 30, 2025) అయింది. ఇందులో ఒక శాంపిల్ లో (శాంపిళ్లు అన్నీ ఒకే బ్యాచ్ కి చెందినవి) బ్రోమైట్ అనే రసాయనం మోతాదుకు మించి ఉందని మొదట ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రకటించింది. దీనిని బిస్లరీ కంపెనీ సవాలు చేసింది. దానితో మరో శాంపిల్ ని పరీక్షించాలని ఇండిపెండెంట్ ల్యాబ్ లను కోరింది. రెండో సారి పరీక్షల్లో బ్రోమైట్ పరిమాణం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నదని, నిర్దేశిత మోతాదు ను మించలేదని తేలింది. అయితే ఈ సారి బ్రోమైట్ కు బదులు పాలీన్యూక్లియర్ ఆరోమేటిక్ హైడ్రో కార్బన్ పరిమాణం మోతాదుకు మించి అనేక రెట్లు ఎక్కువగా ఉన్నదని తేలింది.
ఈ నేపధ్యంలో బిస్లరీ కంపెనీని ప్రాసిక్యూట్ చేసేందుకు FSSAI ఉన్నత నాయకత్వం, శాంపిళ్ళు సేకరించి ఏడాది కి పైన రెండు నెలలు గడిచిన తర్వాత నవంబర్ 22, 2026 తేదీన అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది. 14 నెలల గ్యాప్ తర్వాత ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఈ ప్రకటన ఎందుకు వెలువడింది అన్న ప్రశ్న జోలికి ప్రజల్లో ఎవరూ వెళ్లలేదు. కానీ ఇలాంటి కార్పొరేట్ పరిణామాలను నిశితంగా పరిశీలించే వారికి ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చిన రోజే జరిగిన మరో పరిణామాన్ని వెంటనే గుర్తించారు.
అదేమిటి అంటే, సరిగ్గా ఆ రోజుకు, అనగా నవంబర్ 22 తేదీకి ముందు రోజే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు గ్రామంలో భారత దేశ నెంబర్ వన్ ధనికుడు ముఖేష్ అంబానీ నిర్మించిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించింది (కార్పొరేట్ భాషలో కమిషన్ చేశారు). అంబానీ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న సరికొత్త బాటిల్డ్ వాటర్ పేరు ‘క్యాంప సూర్’! ఇండియాలోని వాటర్ బాటిలింగ్ కంపెనీలలో ఇది అతి పెద్ద కంపెనీ కూడా.
రిలయన్స్ గ్రూప్ లోని ‘రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) రు 8,000 కోట్ల భారీ పెట్టుబడితో క్యాంప కోలా అనే కూల్ డ్రింక్ మరియు డ్రింకింగ్ వాటర్ ఫ్యాక్టరీల నెట్ వర్క్ ని నిర్మిస్తున్నది. అందులో మొదటి ఫ్యాక్టరీ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించారు.
ఓర్వకల్లులో నిర్మించిన క్యాంప కోలా మరియు క్యాంప సూర్ ఫ్యాక్టరీ ని నవంబర్ 21, 2026 తేదీన అధికారికంగా కమిషన్ చేశారు. ఏకంగా 80 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫ్యాక్టరీలో అత్యున్నత స్థాయిలో ఆటోమేటీకరించబడిన 10 ప్రొడక్షన్ లైన్ లు పని చేయటం మొదలు పెట్టాయి.
ఓర్వకల్లు ఫ్యాక్టరీ అత్యల్ప కాలంలో అతి వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోవటం విశేషం. కేవలం 12 నెలల క్రితమే పునాది రాయి పాతిన ఈ ఫ్యాక్టరీ ఏడాది తిరిగేసరికల్లా ఉత్పత్తి మొదలు పెట్టింది. ఈ ఫ్యాక్టరీలో క్యాంప కోలా, క్యాంప సూర్ తో పాటు పళ్ల రసాలు (ఫ్రూట్ జ్యూస్ లు) కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి అతి త్వరలో అతి తక్కువ ధరలకు మార్కెట్లను ముంచెత్తనున్నాయి.
ముఖేష్ అంబానీ లేదా రిలయన్స్ కంపెనీ ఎప్పటి లాగే అగ్రెసివ్ ధరల ఎత్తుగడలను కూల్ డ్రింక్, వాటర్ బాటిల్, ఫ్రూట్ జ్యూస్ ల అమ్మకాలలో అనుసరించనున్నాడని పత్రికలు ఘోషిస్తున్నాయి. అగ్రెసివ్ ధరల ఎత్తుగడలు అంటే, మరేం లేదు, ఇప్పటికే మార్కెట్ లో అందుబాటులో ఉన్న కూల్ డ్రింక్, వాటర్ బాటిల్స్, ఫ్రూట్ జూస్ లతో పోల్చితే అతి తక్కువ ధరలకు తమ ఉత్పత్తులను అందుబాటులోకి తేవటమే అగ్రెసివ్ ధరల ఎత్తుగడ!
ఈ ఎత్తుగడలో తమ వద్ద భారీ మొత్తంలో పేరుకు పోయి ఉన్న పెట్టుబడిని ఫణంగా పెడతారు. నష్టాలు వచ్చినప్పటికీ పోటీ కంపెనీల కంటే అతి తక్కువ ధరకు సరుకులు అందుబాటులోకి తెస్తారు. తక్కువ ధరల వలన వారి ఉత్పత్తులు మార్కెట్ లను ఆక్రమించేస్తాయి. పోటీ ఉత్పత్తుల అమ్మకాలు క్రమంగా తగ్గిపోతాయి. తీవ్ర నష్టాలు ఎదుర్కొని పోటీలో నిలబడలేక ఫ్యాక్టరీలు మూసుకోవటమో, ఇంకొకరికి అమ్ముకోవటమో చేస్తారు. వారు అమ్మకానికి సిద్ధపడినప్పుడు వీళ్ళే రంగం లోకి దిగి వాటిని కొనేస్తారు. ఆ విధంగా మార్కెట్ లో పోటీ పడే ఉత్పత్తులు అన్నీ ఒకే కంపెనీ యజమాని చేతిలోకి వచ్చేస్తాయి. మార్కెట్ మొత్తం ఆ విధంగా రిలయన్స్ కంపెనీ చేతికి వచ్చేస్తుంది.
అగ్రెసివ్ ధరలతో పాటు పోటీని తప్పించటానికి ఇంకా అనేక అనైతిక పద్ధతులకు కార్పొరేట్ కంపెనీలు పాల్పడతాయి. అందులో ఒకటి ప్రత్యర్ధి కంపెనీ పైన దుష్ప్రచారం చేయటం. లేదా ఇండస్ట్రియల్ సాబోటేజ్ కి పాల్పడటం. కిరాయి మనుషులను దింపి ప్రత్యర్ధి కంపెనీలోకి చొప్పించి వారి ద్వారా పోటీ ఉత్పత్తుల నాణ్యతను దెబ్బ తీస్తారు.
దానికంటే ముందు తేలికగా ఉండే ఎత్తులు వేయవచ్చు. ఉదాహరణకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడిపే రాజకీయ పార్టీలకు వాళ్ళు అప్పటికే పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ ఉంటారు కాబట్టి ప్రభుత్వాల ద్వారా తప్పుడు కేసులు పెట్టించి, తప్పుడు విచారణలు చేయించవచ్చు.
బిస్లరీ వాటర్ కంపెనీ విషయంలో ఇదే జరిగి ఉండొచ్చని కొందరు పరిశ్రమ నిపుణులు అనుమానిస్తున్నారు. బిస్లరీ నుండి సేకరించిన శాంపిళ్లలో కిరాయి మనుషులు బ్రోమైట్ ఎక్కువ ఉండేలా చర్యలకు పాల్పడి ఉన్నా, ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. అయితే బిస్లరీ విషయంలో అలా జరిగిందా లేదా అన్నది ఖచ్చితంగా చెప్పటానికి ఇప్పటికైతే ఆధారాలు లేవు.
బిస్లరీ వాటర్ లో రసాయనాలు మోతాదుకు మించి ఉన్నందున కంపెనీని ప్రాసిక్యూట్ చేయటానికి, దానికి ఒక రోజు ముందే రిలయన్స్ కంపెనీకి చెందిన క్యాంప సూర్ డ్రింకింగ్ వాటర్ ఉత్పత్తి ప్రారంభం కావటానికి మధ్య సంబంధం ఉందని చెప్పేందుకు ఎలాంటి అధికారిక ఆధారం ఇప్పటివరకు లేదు. ఒకవేళ ఉన్నా, అటువంటి ఆధారాలు బైట పడే అవకాశం చాలా చాలా తక్కువ.
ఒక్క ఓర్వకల్లు లోనే కాదు, కర్ణాటక లోని విజయపుర లో, కాంగ్రెస్ ప్రభుత్వం హయాం లోనే నవంబర్ 16 తేదీన ములావాడ్ పారిశ్రామిక ప్రాంతంలో మరొక రిలయన్స్ బెవరేజస్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగింది. ఈ ఫ్యాక్టరీని 109 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ బెవరేజ్ హబ్ గా ఈ ప్రాంతాన్ని మార్చుతామని రిలయన్స్ ప్రకటించింది. క్యాంప బ్రాండ్ కింద అనేక ఉత్పత్తులను ఇక్కడ తయారు చేయనున్నారు.
ఈ ప్రాంతంలో విస్తారంగా లభించే నీటి వనరులను, స్థానిక పంటల ఉతత్తులను ఉపయోగించి బెవరేజెస్ (కూల్ డ్రింక్, డ్రింకింగ్ వాటర్, ఫ్రూట్ జ్యూస్ లాంటి డ్రింక్ ఉత్పత్తులు) తయారు చేస్తామని రిలయన్స్ హామీ ఇచ్చింది. తద్వారా తమ కంపెనీ వలన స్థానిక ప్రజలకు తాగు నీటి కరువు ఏర్పడబోదని, పైగా స్థానికుల పంటలకు తమ ఫ్యాక్టరీ వలన అధిక ధరలు లభిస్తాయని కంపెనీ పరోక్షంగా హామీ ఇస్తోంది.
అస్సాం, గౌహతి లో 6 లక్షల అడుగుల విస్తీర్ణంలో RCPL కంపెనీ ఒక భారీ బాటిలింగ్ కంపెనీని 250 కోట్ల రూపాయలతో ఇప్పటికే నిర్మించి నడుపుతోంది. ఈ ఫ్యాక్టరీకి ఏడాదికి 18 కోట్ల లీటర్ల తాగు నీరు సరఫరా చేసే సామర్ధ్యం ఉన్నది. అస్సాం, ఉత్తర బెంగాల్, ఇతర ఈశాన్య రాష్ట్రాలకు వివిధ పేర్లతో బాటిల్డ్ వాటర్ సరఫరా చేస్తోంది ఈ ఫ్యాక్టరీ.
అగ్రెసివ్ ప్రైసింగ్ తో పాటు స్థానిక వాటర్ ప్లాంట్ లతో కలిసి ఉమ్మడిగా ఉత్పత్తి చేసే ఎత్తుగడను కూడా ఆర్సిపిఎల్ అనుసరిస్తున్నది. ప్రస్తుతం ప్రతి చిన్నా, పెద్దా పట్టణాలలో నీటిని లీటర్, అర లీటర్, పావు లీటర్ బాటిళ్లలో, బబుళ్ల లో ఇళ్లకు, షాపులకు, హోటళ్ళకు సరఫరా చేసే వాటర్ బాటిలింగ్ కంపెనీలు పని చేస్తున్నాయి. ఈ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని ఉమ్మడిగా ఉత్పత్తి చేసే ఎత్తుగడను ఆర్సిపిఎల్ అనుసరిస్తోంది.
నిజానికి స్థానిక కంపెనీల స్వతంత్రతను కాపాడుతూ వ్యాపార ఒప్పందం చేసుకుంటే అదొక రకం. కానీ సాధారణంగా జరిగేది వేరు. స్థానిక కంపెనీలు బాటిలింగ్ చేస్తే, ఆ బాటిళ్ళకు తమ బ్రాండ్ లేబుళ్లను తగిలించటమే తరచుగా జరుగుతుంది. కిన్ లే, బిస్లరీ, లాంటి కంపెనీలు ప్రస్తుతం అదే చేస్తున్నాయి. స్థానికులకు తమ బ్రాండ్ తగిలించటం ద్వారా భారీ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఖర్చులను పెద్ద కంపెనీలు తప్పించుకుంటాయి. అవసరం అయితే మిషనరీలు, ఇన్వెస్ట్మెంట్ సౌకర్యాలు కూడా స్థానికులకు పెద్ద కంపెనీలు అందిస్తాయి. స్థానికుల వాటా తక్కువే ఉన్నా, మార్కెట్ పెరగటం వలన వారు తక్కువ వాటాతో సరిపుచ్చుకుంటారు.
వ్యాపారం కోసం పెద్దా, చిన్నా తాగు నీరు కంపెనీలు ఏమి చేసినా అంతిమంగా ప్రజలు నష్టపోవటం తధ్యంగా జరిగే ప్రక్రియ. నీరు అన్నది ప్రకృతి సహజంగా లభ్యం అయ్యే వనరు. ఈ బాటిలింగ్ కంపెనీలు రాక ముందు కూడా ప్రజలు నీళ్లు తాగారు, కానీ ఉచితంగా తాగారు. నేరుగా ప్రకృతి నుండే తాగారు. ఆ రోజుల్లో చిన్నా, పెద్దా ఎవరైనా సరే, దారి వెంట నడిచి వెళ్తూ ఏ ఇంటి ముందైనా ఆగి కాసిని నీళ్లు ఇవ్వమంటే లేదు అనకుండా ఇచ్చేవాళ్లు. ఇళ్లేమి ఖర్మ, వ్యాపారం చేసే హోటల్స్ కి వెళ్లి ఓ గ్లాస్ నీళ్లు ఇవ్వమని అడిగినా శుభ్రంగా ఇచ్చేవాళ్లు.
నీటికి ధర పెట్టిన తర్వాత సహజసిద్ధమైన నీటి వనరులను భారీ పరిశ్రమాధిపతులు ఆక్రమించటం మొదలు పెట్టారు. అదేదో తామే నీటిని ఉత్పత్తి చేస్తున్నట్టు ఫోజు పెడుతూ నీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఒకప్పుడు చెరువుల్లో నీటిని తాగకుండా దళిత కులాల వాళ్ళను అడ్డుకున్న వాళ్ళే ఇప్పుడు నీటి వనరులను ఆక్రమించి అమ్మకం సాగిస్తున్నారంటే అతిశయోక్తి కాబోదు. కాకపోతే ఇప్పుడు డబ్బు లేని పేద వాళ్ళందరూ దళితులుగా (సింబాలిక్) ప్రకృతి వనరులకు దూరం చేయబడుతున్నారు. “దేశభక్తికి మేమే చిరునామా, భారత సంస్కృతికి మేమే వారసులం” అని చెప్పుకుంటూ అధికారం లోకి వచ్చిన శక్తుల పాలనలో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కావటమే ఈ కధలో అండర్ లైన్ చేయాల్సిన విషయం.

