మోడి విదేశీ విధానం వల్ల ఇండియా సైడ్ ప్లేయర్ గా దిగజారింది -రాహుల్

–

బుధవారం అమెరికాలోని చికాగో నగరంలో విద్యార్ధులతో సంభాషించిన భారత లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధాని మోడి అనుసరిస్తున్న విదేశీ విధానాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు. మోడి ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశీ విధానం వలన భారత దేశం అంతర్జాతీయ వేదికలపైనా, సంబంధాల లోనూ కేవలం ‘సైడ్ ప్లేయర్’ స్థాయికి దిగజారిందని విమర్శించాడు.

“ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విదేశాంగ విధానం వలన ప్రపంచ వ్యవహారాలలో ఇండియా పాత్ర సైడ్ ప్లేయర్ స్థాయికి పడిపోయింది. అదే సమశ్యంలో మన పొరుగు దేశం పాకిస్తాన్, యుద్ధంలో మునిగి ఉన్న అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలకు ఏర్పాట్లు చేస్తూ శాంతికి దోహదం చేసే అంతర్జాతీయ పాత్రలో చురుకుగా వ్యవహరిస్తోంది” అని రాహుల్ గాంధీ ఎత్తి చూపించాడు.

ప్రతి అంశం లోనూ పాకిస్తాన్ తో పోల్చుకుంటూ పొరుగున ఉన్న ముస్లిం దేశం కంటే భారత దేశం ఎంతో ప్రగతి సాధిస్తోందని, పాకిస్తాన్ మాత్రం టెర్రరిస్టు స్పాన్సర్ గా వ్యవహరిస్తూ ఎలాంటి అభివృద్ధికి నోచుకోని దుస్థితిలో ఉన్నదని బి‌జే‌పి నాయకులు, ప్రధాన మంత్రి తరచుగా చెబుతుంటారు. పాకిస్తాన్ తో పోల్చుకునే బి‌జే‌పి నాయకుల మాటలను దృష్టిలో ఉంచుకుని రాహుల్ గాంధీ ఈ పోలిక తెచ్చాడన్నది స్పష్టమే.

“ఇండియా, తన పరిమాణం దృష్ట్యా, సహజంగానే గ్లోబల్ స్థాయిలో తన గొంతు వినపించ గలుగుతుంది. కనుక ప్రపంచ స్థాయిలో జరిగే చర్చలలో, సంభాషణాలలో ఇండియా మరింత చురుకుగా వ్యవహరించాల్సి ఉంది. కానీ నిజం చెప్పాలంటే ఇండియా కేవలం సైడ్ ప్లేయర్ గా మిగిలిపోయింది” అని రాహుల్ గాంధీ విమర్శించాడు. “అమెరికన్ల తోనూ, ఇరానియన్ల తోనూ పాకిస్తాన్ చర్చలు జరుపుతుంటే ఇండియా చూస్తూ ఉండిపోవటం నాకు చాలా షాకింగ్ గా ఉంది” అని రాహుల్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

“దేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత ప్రపంచ వ్యవహారాలలో ఇండియా ప్రముఖ పాత్ర నిర్వహించింది. ముఖ్యంగా అలీన ఉద్యమం ద్వారా ఇండియా ప్రముఖ దేశాల సరసన నిలబడింది. ఇండియా ఎప్పటికైనా అటువంటి స్థాయిని తిరిగి చేరుకోవాలన్నది నా ఆకాంక్ష” అని లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు తన వాంఛను వ్యక్తం చేశాడు.

ప్రధాని మోడి ప్రపంచ దేశాల నాయకులతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లతో సహా, వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండటాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నించాడు. వ్యక్తిగత సంబంధ బాంధవ్యాల ద్వారా రాయబార సంబంధాలు, భౌగోళిక రాజకీయ నిర్ణయాలు నిర్వహించటం సాధ్యం కాదని ఆయన గుర్తు చేశాడు.

“ఫ్రెండ్ షిప్ అనేది అసలు పాయింట్ కాదు. అసలు ఫ్రెండ్ షిప్ ఎవడికి కావాలి? ఫలానా వ్యక్తి నీ మిత్రుడు అయినంత మాత్రాన నీ భౌగోళిక రాజకీయాలు పని చేస్తాయని మీరు నిజంగా భావిస్తారా? ఆయన ఒక వ్యవస్థకు, నిర్మాణానికి నాయకత్వం వహిస్తున్నాడు. మొత్తం ఒక ఆర్ధిక వ్యవస్థ అతని కింద పని చేస్తున్నది. ఈ సంగతి మర్చిపోతే ఎలా?” అని రాహుల్ అన్నాడు. విద్యార్ధులతో రాహుల్ గాంధీ సంభాషణలకు ప్రొఫెసర్ రాబర్ట్ పేప్ మోడరేటర్ గా వ్యవహరించాడు.

“ఆయన (ఒక ప్రపంచ నాయకుడు) మిమ్మల్ని ఇష్ట పడుతున్నాడా లేదా అన్న అంశం బట్టి నిర్ణయాలు చేయబోవటం లేదు. ఇలాంటి కొన్ని అంశాలు నన్ను బాగా వ్యాకుల పరుస్తున్నాయి” అని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే దేశాధినేతలు వ్యక్తిగత స్నేహం నెరపటం పట్ల తనకు వ్యతిరేకత లేదని కానీ దానిపైన ఆధారపడి విధేశీ విధానాన్ని నిర్ణయించలేమని చెప్పాడు. జాతీయ ప్రయోజనాలు, ప్రపంచంలో ఇండియా పొజిషన్ ఇవన్నీ ఇండియా విధేశీ విధానాన్ని నిర్ణయించాలని అన్నాడు.

“మోడి తో స్నేహంగా ఉండటం లేదా ఇతర నాయకులతో స్నేహంగా ఉండటం.. ఇవేమీ సమస్యగా నేను అనుకోవటం లేదు. స్నేహం అంత ముఖ్యం కాదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏమి జరుగుతున్నదో మీకు అర్ధం అవుతోందా, మీరు ఎవరు, మీ స్థానం ఎక్కడ అన్న ప్రశ్నలకు మీ సమాధానం ఏమిటి?”

“తదుపరి గ్లోబల్ ఆర్కిటెక్చర్ కేవలం ఒక నాగరికత ద్వారానే నిర్మితం కాజాలదు. అనేక నాగరికతలు దానిని రూపొందించనున్నాయి. అమెరికా, చైనా, ఇండియా, మధ్య ప్రాచ్యం, రష్యా… ఇలా అన్నీ దేశాలు తమ తమ పాత్ర పోషించనున్నాయి” అంటూ రాహుల్ తన దృక్పధాన్ని వివరించాడు.

ఇండియా-పాకిస్తాన్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే అవకాశాల గురించి ఒక పాకిస్తానీ ప్రేక్షకుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇండియాలో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వటం ప్రోత్సహించటం లాంటి చర్యలను పాకిస్తాన్ నిలిపివేసినట్లయితే, ఇస్లామాబాద్ తో చర్చలు జరపటం సాధ్యమేనని చెప్పాడు.

నరేంద్ర మోడి నాయకత్వంలో బి‌జే‌పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియా దూకుడుగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో సన్నిహిత సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నది ఇండియా. చారిత్రకంగా ఇండియాకు కష్ట సమయాల్లో మద్దతు ఇచ్చిన రష్యా తో మిత్రత్వం బలహీనపడింది. ఇరు దేశాల మధ్య కేవలం వాణిజ్య సంబంధాల వరకే సంబంధాలు కుదించుకుపోయాయి. మరో పక్క వేల యేళ్ళుగా సంబంధాలు కలిగి ఉన్న ఇరాన్ లాంటి దేశాలకు దూరం అవుతూ జాత్యహంకార ఇజ్రాయెల్ కు మరింత చెరువు అవుతోంది ఇండియా. గాజా పై ఇజ్రాయెల్ నరహంతక దాడులను కనీసం ఖండించలేదు. ఈ నేపధ్యంలో ఇండియాకు అంతర్జాతీయ స్థాయిలో, ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాలలో ఉన్న పేరు ప్రతిష్టలు మసకబారాయన్నది ఒక వాస్తవం.

స్పందించండి