దీపావళి టపాలు కాల్చితే జబ్బులు నయమవుతాయి -బి‌జే‌పి బెంగాల్ ఎం‌ఎల్‌ఏ

BJP MLA Papiya Adhikar

–

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఎన్నికల్లో బి‌జే‌పి గెలవటానికి దోహదం చేశాడన్నది ఎంతవరకు నిజమో తెలియదు గానీ బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ లు విరజిమ్ముతున్న ఆజ్ఞానానికి ఇండియా గుప్తుల కాలం నాటి అంధకార యుగం లోకి తొందరలోనే జారిపోవటం ఖాయంగా కనిపిస్తోంది.

లేకపోతే, దివాళి నాడు అతిగా టపా కాయలు పేల్చటం ద్వారా రసాయనాలతో గాలి కలుషితం కాకుండా చూసుకోండి అని ఓ పక్క సుప్రీం కోర్టు, హై కోర్టులతో పాటు వివిధ పోలీసు, ప్రభుత్వ శాఖలు చెవిన ఇల్లు కట్టుకుని పోరుతున్నా కూడా బి‌జే‌పి నాయకులు ఈ రకంగా తమ ఆజ్ఞానాన్ని ప్రజల పైన రుద్దాలని చూడటం ఏమిటి?

మూఢ భక్తి ప్రపత్తులతోనో లేక బి‌జే‌పి, ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలన్న విపరీతమైన వాంఛ వల్లనో హిందూత్వ ఎం‌ఎల్‌ఏలు, పార్టీ నాయకులు ఏమి మాట్లాడుతున్నామో కూడా తెలియని పారవశ్యంలో పడిపోయి నోటికి వచ్చిందల్లా వాగుతున్నారు. తమ పిచ్చి ప్రేలాపనల వలన ప్రజల్లో పలచన అవుతామన్న కనీస తెలివిడి కూడా ప్రదర్శించలేని మూఢత్వంలో మునిగి తేలుతున్నారు.

పాపియా అధికారి, పశ్చిమ బెంగాల్ లో బి‌జే‌పి టికెట్ తో గెలిచిన ఎం‌ఎల్‌ఏ. సినిమా నటిగా ఉంటూ రాజకీయాల్లోకి దూకిన పాపియా, కాళీ మాత దర్శనం చేసుకుని ఆనక “దీపావళి క్రాకర్స్ కాల్చటం వలన మన చుట్టూ ఉండే క్రిములు, వైరస్ లు దెబ్బకు చచ్చిపోతాయి. మన వొంటిలో ఉన్న అనేక జబ్బులు కూడా ఇట్టే మాయమవుతాయి” అని ప్రకటించి తన తెలివికి తానే మురిసిపోయింది.

టోలీ గంజ్ నియోజకవర్గంలో శనివారం కాళీ పూజ మండపాన్ని ప్రారంభించిందామె. ఆ తర్వాత స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ “దీపావళి రోజున టపా కాయలు కాల్చటం వెనుక ఒక సైంటిఫిక్ సూత్రం కూడా ఉంది. టపా కాయలు కాల్చితే అనేక రకాల జబ్బులు నయమవుతాయి” అని చెప్పింది. ఆమె మాటలకు అక్కడ ఉన్న జనం ఎలా రియాక్ట్ అయ్యారో పత్రికలు చెప్పలేదు. ప్రజల రియాక్షన్ ని రికార్డ్ చేసినట్టయితే ఎం‌ఎల్‌ఏ కంటే ప్రజలే శాస్త్ర విజ్ఞానంలో ఎంత ముందు ఉన్నారో తెలిసి ఉండేది.

“ఫైర్ క్రాకర్స్ కాల్చటం ద్వారా అనేక జబ్బులు నయం కావటం మీరు చూసి ఉంటారు. మన ముఖ్యమంత్రి దీపావళి టపా కాయలు కాల్చి తీరతామని ప్రకటించారు. గ్రీన్ (?) క్రాకర్స్ కాల్చకుండా అసలు కాళీ పూజ ఎలా పూర్తవుతుంది? మనం ఖచ్చితంగా గ్రీన్ ఫైర్ క్రాకర్స్ కాల్చి తీరతాము” అని టపా కాయల్ని పేల్చటం పైన వస్తున్న విమర్శలను ఉద్దేశిస్తూ చెప్పారామె.

ముంబైలో గాలిలోకి ఎగిరే తారా జువ్వలు కాల్చటం వలన అవి ఇళ్లపైనా, రోడ్డు పక్క షాపుల పైనా పడి 137 చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. దానితో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు గాలిలోకి ఎగిరే రాకెట్లు, అలాంటి ఇతర క్రాకర్లు కాల్చకుండా నిషేధం విధించారు.

మొదట ధానే మున్సిపాలిటీ నవంబర్ 25 వరకు ఫైర్ క్రాకర్లు కాల్చకుండా నిషేధం ప్రకటించింది. ఆ తర్వాత బృహన్ముంబై కార్పొరేషన్ నిషేధాన్ని ముంబైకి కూడా విస్తరించింది. ఆదివారం ముంబైలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో 96 శాతం దీపావళి టపా కాయల వలన జరిగాయని తెలుస్తోంది. ఫైర్ డిపార్ట్ మెంట్ కి దీపావళి రోజున 142 అగ్ని ప్రమాదాల కాల్స్ వస్తే అందులో 137, దీపావళి సంబరాల వలన చెలరేగిన అగ్ని ప్రమాదాలే.

ఈ నిషేధంతో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో అత్యధిక భాగం రాకెట్స్ పేలుళ్ళ పైన నిషేధం అమలవుతున్న ఏరియా గా మారింది. ధానే జిల్లా అధికారులు 2027 జనవరి వరకు నిషేధం ప్రకటించినట్టు తెలుస్తోంది. ఆదేశాలను ఉల్లంఘిస్తే, ఉల్లంఘించిన వారికి ఏకంగా 6 నెలల పాటు జైలు శిక్ష విధిస్తామని ప్రకటించటం విశేషం. ఇది సంవత్సరం పాటు కొనసాగే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరించారు.

పాపియా అధికారి

ఈ పరిస్ధితుల్లో దీపావళి టపా కాయల వలన అనేక జబ్బులు నయమవుతాయని బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ బోధించటం ని ఎలా అర్ధం చేసుకోవాలి? పైగా తన వ్యాఖ్యలను విమర్శించిన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలను తిట్టిపోయటం మొదలు పెట్టింది. తాను ఏం చెప్పినా విమర్శించటం లిబరల్ పార్టీలకు, సెక్యులర్ పార్టీలకు, కమ్యూనిస్టులకు అలవాటుగా మారిందని వాపోయింది.

“నేను ఎప్పుడు ఏది చెప్పినా నా శత్రువులు దానిని తమ టి‌ఆర్‌పి రేటింగ్ పెంచుకోవటానికి ఉపయోగించుకుంటారు. నేను దగ్గినా, తుమ్మినా సేకు-మాకు (బెంగాలీ లో సెక్యులర్ మరియు మార్క్సిస్టులు) లు దానిని అందిపుచ్చుకుని వివాదం చేస్తుంటారు” అని ఆరోపించింది.

“నేను చెప్పిన అంశానికి అర్ధం ఏమిటంటే, దివాలి-కాళీ పూజ జరిగే రాత్రి పూట టపా కాయలు కాల్చినట్లయితే క్రిములు ఆ రాత్రి చనిపోతాయని మన అమ్మమ్మలు, తాతలు మనకు బోధించారు. ఆ రోజు రాత్రి పూట దీపాలను వెలిగిస్తే దుష్ట శక్తులు కూడా దూరంగా పారిపోతాయని మన పెద్దలు బోధించారు. పెద్దల బోధనలను మనం తప్పనిసరిగా పాటించాలి” అని నమ్మ బలికింది.

ఆ తర్వాత బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ పైన అన్ని వైపుల నుండి విమర్శలు వెల్లువెత్తాయి. బహుశా బి‌జే‌పి పెద్దల నుండి కూడా అక్షింతలు పడ్డాయేమో తెలియదు కానీ, ఆ తర్వాత ఆమె అపాలజీ ప్రకటించింది. “ఈ సంప్రదాయాల గురించి మన పూర్వీకుల ద్వారా ఒక నానుడి ప్రచారంలో ఉంది. సారాంశం ఏమిటంటే ఇది దీపాల వెలుగుకు సంబంధించిన పండగ. సామాజిక చెడుగులను దూరం చేసే పండుగ.

“గతంలో పూజా క్రతువుల ద్వారా అనేక చెడుగులను పారద్రోలే వారు. అయితే ఇప్పుడు మనం ఫైర్ క్రాకర్స్ యుగంలో జీవిస్తున్నాం. సైన్స్ కూడా చాలా అభివృద్ధి చెందింది. గతంలో ఉన్న దృక్పధం బహుశా ఇప్పుడు మారిపోయి ఉండవచ్చు” అని తాను చెప్పిన దానికి కొన్ని సవరణలు చేసి సమర్ధించుకునే ప్రయత్నం చేసింది.

“ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరుతున్నాను. నా ప్రకటనను ఉపసంహరించుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. వెనక్కి తీసుకున్నాననే అనుకోండి. కానీ నా మూల భావన మాత్రం అలాగే ఉన్నది: అలాంటి సామాజిక చెడుగులు నశించేవి, ఇప్పుడు కూడా వాటిని నిర్మూలించవచ్చు” అని తన స్టేట్మెంట్ ని సవరించుకున్నారు పాపియా అధికారి.

ఒకప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుండి, పారిశ్రామిక ఉత్పత్తిలోనూ ముందున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఇప్పుడు ఈ పరిస్ధితిలో చూడవలసి రావటం నిజంగా బాధకరమైన సంగతి! ఇంతకీ మూడు దశాబ్దాల పాటు సాగిన లెఫ్ట్ ఫ్రంట్ పాలనలో పశ్చిమ బెంగాల్ ప్రజలు ఏమి నేర్చుకున్నట్టు?

స్పందించండి