
–
బిజేపి నాయకులకు మెదడు కనీసం చీమ తలకాయంతైనా ఉంటుందా అన్న అనుమానం తరచుగా కలుగుతుంది. దీపావళి సందర్భంగా వాతావరణ కాలుష్యానికి దోహదం చేసే టపా కాయలు కాకుండా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని తద్వారా వాతావరణం మెరుగుపడేందుకు ప్రభుత్వాలకు సహాయ పడాలని కోరుతూ బాలీవుడ్ నటి దియా మీర్జా, నవంబర్ 2 తేదీన ఒక వీడియోలో కనపడి విజ్ఞప్తి చేస్తే ఆమె ముస్లిం కనుక, హిందూ వ్యతిరేకి అనీ ఆమె హిందువులకు కాలుష్యం గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని పరుషంగా వ్యాఖ్యానించి తన ఆజ్ఞానాన్ని వెళ్ళగక్కాడు ముంబై నగర బిజేపి నాయకుడు!
పదే పదే అరిగిపోయిన రికార్డు లాగా హిందూ హిందూ అని కలవరిస్తూ ముస్లింలు ఏం చేసినా దేశ ద్రోహులనీ, హిందూ ద్వేషులనీ తిట్టిపోస్తే అదే రాజకీయంగా బిజేపి పార్టీ మార్చివేసింది. ముఖ్యంగా నరేంద్ర మోడి 2014 లో ప్రధాన మంత్రి అయ్యాక ఈ ధోరణి ముదిరి వెర్రితలలు వేయటం మొదలయింది. చివరికి తాము ఏం మాట్లాడుతున్నామో, ఏమి చేస్తున్నామో తెలియని మత పిచ్చిలో పడి ప్రజల దైనందిన కార్యకలాపాలను, సజీవ జీవన సంబంధాలను కూడా మతంతో నింపి కలుషితం చేస్తున్నారీ నాయకులు.
ఇంతకీ సదరు వీడియో, దియా మీర్జా తన సొంత చొరవతో తయారు చేసి పబ్లిష్ చేసింది కాదు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లు అడిగితేనే ఆమె వీడియో సందేశాన్ని రికార్డు చేసింది. అది కూడా ఏ మాత్రం రుసుము వసూలు చేయకుండా మున్సిపల్ అధికారుల లక్ష్యానికి సహాయం చేసే ఉద్దేశంతో చేసిన వీడియో మాత్రమే అది. ఇంకా చెప్పుకుంటే బొంబే హై కోర్టు ఆదేశాల మేరకు సెలబ్రిటీలతో దీపావళి కాలుష్యం గురించి ప్రజలను హెచ్చరించే ఉద్దేశ్యంతో ముంబై కార్పొరేషన్ వాళ్లు తయారు చేసిన వీడియో అది.
బిజేపి నాయకుడు “దియా మీర్జా దీపావళి పండగ ఎలా జరుపుకోవాలో హిందువులకు చెప్పనవసరం లేదు. కాలుష్యం లేకుండా దీపావళి జరుపుకోవటం హిందువులకు బాగానే తెలుసు” అని వ్యాఖ్యానించాడు. ఆ వెంటనే బిజేపి పార్టీకే చెందిన ముంబై కార్పొరేషన్ మేయర్ కూడా రంగంలోకి దిగి దియా మీర్జాను “హిందూ వ్యతిరేకి” గా ముద్రవేసి ఆమెను దూషించి ఆమె హిందువులకు నీతులు చెప్పవలసిన అవసరం లేదంటూ తిట్టి పోసింది. దియా మీర్జా ప్రతిపక్ష పార్టీలకు మద్దతుదారు అని కూడా ఆక్షేపించింది. ఇంకా రాణేతో పాటు పలువురు పేరు మోసిన బిజేపి, శివసేన (షిండే) నాయకులు కూడా దియా పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇద్దరు బిజేపి నాయకులు అభ్యంతరం చెప్పటంతోటే ముంబై కార్పొరేషన్ హడావుడిగా దియా మీర్జా వీడియోను ఫేస్ బుక్, ఎక్స్ ల నుండి తొలగించింది. నిజానికి కార్పొరేషన్ నలుగురు సెలబ్రిటీలతో (దియా మీర్జా, మాధురీ దీక్షిత్, నిషిగంధ వాద్, క్రికెటర్ అజింక్య రహానే లతో అదే సందేశంతో వీడియోలు తయారు చేసి సోషల్ వెబ్ సైట్ లలో ఉంచింది. బిజేపి నాయకుల మతిలేని అభ్యంతరంతో బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ వెంటనే దియా మీర్జా వీడియో తొలగించి మిగతా వీడియోలను కొనసాగించింది.
ఈ పరిణామాలతో బొంబే హై కోర్టు తనంత తానుగా స్పందించింది. తమ ఆదేశాల మేరకు సెలబ్రిటీలను క్రాకర్స్ కాలుష్యానికి వ్యతిరేకంగా కార్పొరేషన్ ఉపయోగించిందని, ఇది ఏ ఒక్క మతానికో లేక రాజకీయ పార్టీకో సంబంధించిన విషయం కాదని ప్రకటించింది. కాలుష్యం పెరిగితే అది ప్రజలంతా పార్టీతో, మతంతో సంబంధం లేకుండా అనుభవించాలని, ఒక మంచి ఉద్దేశ్యంతో చేపట్టిన చర్య లోనికి ఏవేవో సంబంధం లేని అంశాలు ఎందుకు తెస్తున్నారని తీవ్రంగా ప్రశ్నించింది. అంతటితో ఆగకుండా తొలగించి దియా వీడియోను వెంటనే మళ్ళీ అప్ లోడ్ చేయాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది.
మతిలేని వివక్షా పూరిత అభ్యంతరాలు
బిజేపి ముంబై చీఫ్ అమిత్ సతాం మొదట ఈ ప్రహసనం మొదలు పెట్టాడు. దియా మీర్జా వీడియోను ఉద్దేశిస్తూ ఆయన ఎక్స్ లో రాస్తూ “దీపావళి ఎలా జరుపుకోవాలో @deespeak మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. మా సంప్రదాయాలు మా సంస్కృతిలో లోతైన పునాదులు కలిగి ఉన్నాయి” అని పోస్ట్ చేశాడు.
ఆ వెంటనే అమిత్ కు కార్పొరేషన్ మేయర్ రీతూ తవాదే ఆయనకు మద్దతు వస్తూ అవాకులు చవాకులు మాట్లాడింది. కార్పొరేషన్ చేస్తున్న క్రాకర్స్ వ్యతిరేక ప్రచారంలో దియా మీర్జా కూడా ఉందన్న సంగతి తనకు తెలియదని లెంపలు వేసుకుంటూ “హిందూత్వను వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మేము వ్యతిరేకించి తీరుతాం. ఇకముందు పబ్లిక్ ప్రకటన ఇచ్చేముందు నా అనుమతి తీసుకోవాలి” అని ఆదేశించింది.
ఇంకా మాట్లాడుతూ ఆమె, “మీర్జా తన అభిప్రాయాలని తన సొంత సోషల్ మీడియా ఖాతాల్లో స్వేచ్ఛగా వ్యక్తం చేసుకోవచ్చు. ముంబై కార్పొరేషన్ అధికారిక హ్యాండిల్స్ లో ఆమె కంటెంట్ పోస్ట్ కావాలంటే మాత్రం పాలక పార్టీ అనుమతి తీసుకోవాలి” అని హుకుం జారీ చేసింది. ముంబై కార్పొరేషన్ కేవలం మేయర్ ఎన్నికల్లో గెలిచిన పార్టీకి చెందినది కాదని, ఒకసారి ఎన్నికయ్యాక నగర మేయర్ నగర పౌరులందరి తరపున పని చేయాలన్న సంగతి రీతూ తవాదే కు తెలుసా తెలియదా? ఎన్నికలు పూర్తయి గెలిచిన పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వారి పార్టీ, ప్రభుత్వం పూర్తిగా వేరు వేరవుతాయి. పార్టీ ఆదేశాలు ఉంటే అవి అంతర్గతంగా ఉంచుకోవాలి తప్పితే బహిరంగంగా మా పార్టీ ఆదేశాల ప్రకారమే పాలన చేస్తాం అంటే అది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది. ఈ సంగతి తెలియని వాళ్లు మేయర్ కావటమే ముంబై ప్రజల దౌర్భాగ్యం.
బిజేపి నేతలకు కోర్టు పాఠాలు
ఈ నేపధ్యంలో ఆ మరుసటి రోజే (నవంబర్ 3) బొంబే హై కోర్టు స్పందించింది. బిజేపి నేతల వ్యాఖ్యానాలను తీవ్రంగా తప్పు పట్టింది. “ఈ పరిణామాలు కోర్టును తీవ్రంగా గాయపరిచాయి” అని వ్యాఖ్యానించింది. జస్టిస్ గిరీష్ కులకర్ణి, జస్టిస్ నీలా గోఖలే లతో కూడిన బెంచి తనకు తానుగా ముందుకు వచ్చి (సుమోటు గా స్వీకరించి) దియా మీర్జా వీడియో ను తిరిగి వెబ్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించింది.
“కొద్ది మంది వ్యక్తుల కొద్ది బుద్ధులు (పెట్టీ మైండ్ సెట్) వలన ముఖ్యంగా సాధారణ ప్రజలకు ప్రతినిధులుగా వ్యవహరించ వలసిన ప్రజా ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయ”ని కోర్టు ఆక్షేపించింది.
“వాతావరణం పరిరక్షణ గురించి, గాలి మరియు శబ్ద కాలుష్యం గురించి అవగాహన కలిగించేందుకు, విజ్ఞాన వ్యాప్తి కోసం తయారు చేసిన వీడియోను ఈ తరహా రంగును అంటించాలని చూడటం అత్యంత దురదృష్టకరం” అని బొంబే హై కోర్టు వాపోయింది.
సెలబ్రిటీలను ఎంపిక చేసిన బిఎంసి (బృహన్ముంబై మునిసిపల్ కమిషనర్) కమిషనర్ నిర్ణయానికి హై కోర్టు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అవగాహన కలిగించేందుకు సెలబ్రిటీలు ముందుకు వచ్చిన సంగతి విస్మరించి అనవసరమైన అంశాలను రంగం మీదికి తీసుకొని రావటం అత్యంత దురదృష్టకరం అని కోర్టు తప్పు పట్టింది. తొలగించిన దియా మీర్జా వీడియోను వెంటనే అప్ లోడ్ చేయాలని ఆర్డర్ వేసింది.
అలాగే ముంబై మునిసిపల్ కమిషనర్ ఎంపిక చేసిన సెలబ్రిటీల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నవారికి హెచ్చరిక జారీ చేసింది. నగర ప్రజా సమూహంలో ప్రతి ఒక్కరి పట్ల గౌరవ భావం కలిగి ఉండాలని, వారి మతం, కులం లాంటి మరే ఇతర అంశాలకు అతీతంగా ప్రజల పట్ల గౌరవం కలిగి ఉండాలని కోరింది.
“ప్రజల మధ్య లౌకిక వాద చైతన్యం ఉండాలి. పౌరులు లౌకిక భావనలు కలిగి ఉండాలని రాజ్యాంగం కూడా బోధించింది. వీడియో క్లిప్ ని తొలగించినట్లయితే దానిని మళ్లీ అప్ లోడ్ చేయటం సరైన చర్య అవుతుంది. ముంబై లాంటి నగరం ‘మనం అంతా’ అన్న భావన కలిగి ఉంటేనే బతికి ఉండగలుగుతుంది, సమాజానికి చెందినవారం అన్న బలమైన భావనను కలిగిస్తుంది. ఎటువంటి “అనాలోచిత వ్యాఖ్యలు” (loose comments) ముంబై వాతావరణాన్ని పాడు చేయటానికి వీలు లేదు” అని కోర్టు బిజేపి కి గట్టిగా బుద్ధి చెప్పింది.
“నిన్న ఏ ఒక్క రాజకీయ నాయకుడు గాని, వ్యక్తి గాని క్రాకర్ల కాలుష్యం గురించి అవగాహన కలిగించే వీడియో లను పోస్ట్ చేయగా మేము చూడలేదు. మనది లౌకిక దేశం. ఈ వ్యాఖ్యలు మమ్మల్ని నిజంగా బాధించాయి. ఈ సమస్య ఒకరి మతం, కులం లకు అతీతంగా వాతావారణానికి, ప్రతి ఒక్కరికీ సంబంధించినది. అందరూ అదే గాలిని పీల్చుతున్నారు.
“ప్రజా పదవుల్లో ఉన్న వ్యక్తుల నుండి ఇలాంటి వ్యాఖ్యలను ఊహించలేము. బిఎంసి కూడా వివాదం రేపిన వెంటనే మీర్జా వీడియో ను తొలగించకుండా ఉండవలసింది. ఈ చర్యను వెంటనే సరిదిద్దు కోవాలి. ఇటువంటి అనాలోచిత స్పందనలు కనీసంగానైనా ఆహ్వానించదగినవి కావు. వీడియో ఇచ్చిన సందేశం వివిధ విభజనలకు అతీతంగా అందరి మంచి కోసం ఇచ్చినదే కదా!
“పబ్లిక్ రోడ్ల పైనా, వీధుల పైనా సంవత్సరం అంతటా టపా కాయలను పేల్చటాన్ని నిషేధిస్తూ కోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగానే బిఎంసి ఈ చర్య తీసుకుందని గుర్తు పెట్టుకోవాలి. కోర్టు ఆదేశాలు కేవలం ఒక పండుగను ఉద్దేశించి ఇచ్చినవి కావు. ఇప్పుడు దీపావళి పండుగ దగ్గరలో ఉండటం కేవలం యాదృచ్ఛికం మాత్రమే.
“పెళ్లిళ్లలో, ఊరేగింపులలో, ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు, క్రికెట్ మ్యాచ్ ల తర్వాత… ఈ అన్ని సందర్భాలలో ఫైర్ క్రాకర్స్ పేలుస్తూ ఉంటారు. మా ఆదేశాలు 365 రోజులకు వర్తిస్తాయి. ఇక్కడ ప్రధాన మైన లక్ష్యం పర్యావరణం మరియు గాలి-శబ్ద కాలుష్య నియంత్రణ మాత్రమే.
అవగాహన కలిగించటానికి అధికారులు ఫలానా సెలబ్రిటీని మాత్రమే ఎందుకు ఎంపిక చేశారు అని ఏ ఒక్కరూ ప్రశ్నించటానికి ఇక్కడ వీలు లేదు.
“మేము తీవ్రంగా బాధపడుతూ మా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాము. దీనికంతటికీ వేరే రంగును ఎందుకు పులుముతున్నారు? ప్రతి ఒక్కరి పట్లా మాకు అమితమైన గౌరవం ఉన్నది. కానీ నిన్న జరిగిన దాని పట్ల మాకు ఎంత మాత్రం సానుకూలత కలగలేదు. పర్యావరణం గురించి ఏ మానవుడైనా ముందుకు వచ్చి ప్రచారం చేయవచ్చు. వ్యక్తివాదానికి ఇక్కడ అవకాశం లేదు. మనమందరం అనే చైతన్యం చాలా అవసరం.
“పర్యావరణం విషయానికి వచ్చినపుడు అందరిలోనూ సానుకూల భావన, సదభిప్రాయం, ఐక్య భావన, అందరం ఒకే సామాజిక సమూహం అనే భావనలు కలగాలి. కానీ ఇవేం కొద్ది బుద్ధులు (పెట్టీ మైండ్ సెట్)? మేము దీనిని ఆమోదించటం లేదు. ఎవరో ఒకరు సద్భావనతో ముందుకు వస్తారు, ఆనక ఒక వ్యక్తిని అకారణంగా తెగనాడుతారా?!” అని కోర్టు బిజేపి నాయకులకు చీవాట్లు పెట్టింది.
దియా ముస్లిం కాదు
ఇంతా చేసి దియా మీర్జా ముస్లిం కాదు. ఆమె తండ్రి జర్మనీకి చెందిన ఫ్రాంక్ హేండ్రిక్ కాగా ఆమె తల్లి దీప బెంగాలీ వ్యక్తి. తల్లి దండ్రులు ఇద్దరు తమ తమ రంగాలలో నిపుణులే కాకుండా సామాజిక సేవలో గడిపిన వాళ్లే. దియా చిన్నతనం లోనే, నాలుగున్నరేళ్ల వయసులో తల్లి దండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత దియా తల్లి ముస్లిం అయిన అహ్మద్ మీర్జా ను వివాహం చేసుకుంది.
తనను చిన్నప్పటి నుండి ప్రేమగా సాకి పెంచి పెద్ద చేసిన అహ్మద్ మీర్జా అంటే దియా కు అమిత గౌరవం. ఆయన 2003లో చనిపోయారు. ఆయన పైన గౌరవంతో స్టెప్ ఫాదర్ ఇంటి పేరును తన ఇంటిపేరుగా స్వీకరించింది. దియా స్కూల్, కాలేజ్ రికార్డుల్లో ఆమె మతం ఏమిటన్నది రికార్డు చేయలేదు. ఆ కాలంలో ఖాళీ గా ఉంచారు.
కనుక దియా మీర్జాకు అధికారికంగా (స్కూల్ రికార్డుల ప్రకారం) మతం లేదు. మిస్ ఆసియా పసిఫిక్, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, మిస్ అవోన్, మిస్ ఇండియా పోటీల్లో మిస్ క్లోజప్ స్మైల్… ఇలా వివిధ టైటిల్స్ గెలవటం ద్వారా మోడలింగ్ రంగం, ఆ తర్వాత బాలీవుడ్ లు ఆమెను ఆహ్వానించాయి.
