
–
చీఫ్ ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ పని పూర్తయ్యాక ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోమ్ మంత్రి అమిత్ షా లపై చర్యలు తప్పవని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హెచ్చరించాడు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ప్రతిపక్ష కూటమి జరిపిన భారీ ర్యాలీలో ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ ఈ హెచ్చరిక జారీ చేశాడు.
ప్రతిపక్ష పార్టీల కూటమి I.N.D.I.A ఆధ్వర్యంలో ఈ రోజు ఢిల్లీ, రామ్ లీలా మైదానంలో జరిగిన ర్యాలీలో దేశంలో నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యారని పత్రికలు తెలిపాయి. ర్యాలీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం లోని కొన్ని ముఖ్యాంశాలు:
- దేశంలో ప్రజాస్వామ్యం అంతరించి పోవటానికి INDIA కూటమి అనుమతించే ప్రశ్నే లేదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ ను త్వరలో ఆ పదవి నుండి తప్పించటం తధ్యం. గ్యానేష్ కుమార్ ని తప్పించటమే దేశాన్ని తిరిగి గాడిలో పెట్టే క్రమంలో తీసుకునే మొట్ట మొదటి చర్య.
- ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోమ్ మంత్రి అమిత్ షా ద్వయం పైన చట్టబద్ధ చర్యలు తప్పవు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఎక్కడికీ పారిపోలేడు. గ్యానేష్ కుమార్ పైన చర్య తర్వాత మేము మీ కోసమే వస్తాం (మోడి ఎక్కడికీ వెళ్ళడం లేదన్న అమిత్ షా వ్యాఖ్యను ఉద్దేశిస్తూ). మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మీరు ఎక్కడికీ పోలేరు.
- ఈ ప్రజలు మోడి, షా లకు సందేశం ఇచ్చేందుకే ఇక్కడికి వచ్చారు. ఇది ఒక రాజకీయ పార్టీ గొంతుక కాదు. భారతీయ యువత, రైతులు మరియు ప్రజలకు చెందిన గొంతుక ఇది.
- 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత దేశంలో 13.5 కోట్ల మంది వోటర్ల పేర్లను వోటర్ల జాబితా నుండి కొట్టివేశారు. అంటే ప్రతి ఏడుగురిలో ఒకరి వోటు. లేదా 15 శాతం వోట్లు రద్దు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాల కంటే ఎన్.డి.ఏ వోట్లు కేవలం 3 శాతం మాత్రమే ఎక్కువ. అనగా గత ఎన్నికలు చట్ట విరుద్ధం. అది దొంగిలించబడిన తీర్పు.
- ఈ మాట నేను చెప్పటం లేదు. భారత ఎన్నికల కమిషనే స్వయంగా చెబుతోంది. వోటర్ల జాబితా నుండి తొలగించిన వోట్ల సంఖ్య ఎలక్షన్ కమిషన్ ఇచ్చినదే.
- ఇది ఎప్పుడూ జరిగే మామాలు దొంగతనం కాదు. లేదా షాపు నుండి ఒక వస్తువు దొంగిలించటంతో సమానం కాదు. ఈ దేశంలో ప్రతి ఒక్కరి గొంతుక ను దొంగిలించటం. అడుదైన వాటిల్లోకెల్లా అరుదైన చోరీ ఇది. దేశ ద్రోహంతో సమానం. సిఈసి గ్యానేష్ కుమార్ జైలుకు వెళ్ళటం ఖాయం.
- గ్యానేష్ కుమార్ లేకుండా నరేంద్ర మోడి ప్రధాన మంత్రి అయి ఉండేవాడు కాదు; అమిత్ షా హోమ్ మంత్రి అయి ఉండేవాడు కాదు.
- దేశంలోని ప్రతి ఒక్క ప్రజాస్వామిక వ్యవస్థను ఆర్ఎస్ఎస్ ఆక్రమించుకుంది. ఈ వ్యవస్థలు ఆర్ఎస్ఎస్, బిజేపి ల జేబు సంస్థలు కావు, అవి ప్రజలకు చెందిన వ్యవస్థలు.
- బిజేపి/ఎన్డిఏ ప్రభుత్వం కొద్దిమంది వ్యాపార సంస్థలకు అనుకూలంగా పని చేస్తున్నది.
- దేశంలోని డబ్బు అంతా అదాని, అంబానీ లాంటి కొద్దిమంది చేతుల్లోకే వెళుతోంది. వారి అప్పులను మాఫీ చేస్తున్నారు. కానీ ఒక రైతు కొడుకుకు డబ్బు అవసరమైతే, వారు అప్పు తిరిగి చెల్లించలేకపోతే, వాళ్ళని జైల్లో పెడుతున్నారు.
- దేశంలోని ప్రతి ఒక్కటీ అదాని కి మాత్రమే అప్పగించే దేశం మాకు వద్దు.
- ఒక రైతు వొళ్లు వొంచి రేయింబవళ్లు కష్టపడితే అతను తన కలను నెరవేర్చుకో గలగాలి. ఒక విద్యార్ధి రోజులో 18 గంటలు కష్టపడి చదివితే అతనికి తగిన ప్రతిఫలం ఉండాలి.
- నేను మోడి లేదా షా లేదా గ్యానేష్ కుమార్ లను ద్వేషించటం లేదు. మేము ఆర్ఎస్ఎస్ లేదా బిజేపి వాళ్ల పైన దాడులు చేయబోము. వాళ్లని చంపబోవటం లేదు.
- మాకు మతం కంటే ప్రజల గొంతుక ముఖ్యమైనది. మీ మతం ఏమిటని నన్ను ఎవరైనా అడిగితే “మా ప్రజల గొంతుకే మా మతం” అని చెబుతాను. బిజేపి, ఆర్ఎస్ఎస్ లు విద్వేషాన్ని వ్యాపింపజేసి దేశానికి తీవ్ర హాని చేశారు.


