
–
సెంట్రల్ ఢిల్లీలో బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించామని అందుకే అనుమతి లేకుండా అక్టోబర్ 10 తేదీన నిరసనలో పాల్గొన్న విద్యార్ధులు, యువకులను అరెస్టు చేశామని పోలీసులు చెబుతూ వచ్చారు. కానీ అదే ఢిల్లీ వీధుల్లో అదే BNSS సెక్షన్ 163 అమలులో ఉన్న సెంట్రల్ ఢిల్లీలో లాఠీలు ధరించి గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రదర్శనకారులను ఒంటరిగా దొరికినప్పుడల్లా దాడులు చేస్తూ, ఆడ పిల్లలు అని కూడా చూడకుండా కొడుతూ తన్నుతూ రక్తం వచ్చేలా కొడుతున్నప్పటికీ పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారే తప్ప వారిని ఆపే ప్రయత్నం గానీ, దెబ్బలు తింటున్న వారిని రక్షించే ప్రయత్నం గానీ చేయ లేదు.
సెంట్రల్ ఢిల్లీ లోనే హిందూత్వ గూండాలు హిందూ రక్షా దళ్ పేరుతో ఒక కారులో వెళుతుండగా విలేఖరులు ఆ కారులో లాఠీలు, కర్రలు, ఇనుప రాడ్లు గుట్టలుగా ఉండడాన్ని చూశారు. వెంటనే అక్కడే ఉన్న పోలీసులను అప్రమత్తం చేశారు. కారులో పెద్ద సంఖ్యలో కర్రలు, రాడ్లు ఉన్నాయని వారికి ఫిర్యాదు చేశారు. విలేఖరుల మాటలు విని ప్రదర్శనకారులు కారును చుట్టుముట్టారు. కారు తలుపులు తెరవాలని, డిక్కీ తెరిచి చూడాలని పోలీసులను డిమాండ్ చేశారు. కారును చెక్ చేయటానికి బదులు పోలీసులు కారు అక్కడి నుండి వెళ్లిపోవటానికి మార్గాన్ని సుగమం చేయటం మొదలు పెట్టారు. కారుకు అడ్డంగా ఉన్న విలేఖరులను పక్కకు నెట్టారు. కారును వెంటాడుతున్న ప్రదర్శనకారులను అడ్డుకుని పక్కకు తోసేశారు. పోలీసులు అందరినీ పక్కకు నెట్టాక కారు వేగంగా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇది అక్టోబర్ 11 తేదీన జరిగింది.
అక్టోబర్ 10 తేదీన హిందూ రక్షా దళ్ పేరుతో నలుగురు గూండాలు ఒక యువకుడు, యువతి పైన దాడి చేశారు. యువకుడి చొక్కాను చించేశారు. యువతి (నిండా 19-20 సం.లు కూడా ఉండవు) ని కిందకు పడదోశారు. ఆ అమ్మాయి భయంతో కేకలు వేస్తున్నా వదల కుండా మోకాలితో కిందకు తొక్కి పెట్టి పిడి గుద్దులు గుద్దారు. ఇంతలో సిజెపి కార్యకర్తలు, విలేఖరులు పరుగెత్తుకుంటూ అక్కడికి చేరుకుని హిందూత్వ గూండాలతో తలపడ్డారు. వారిని పక్కకు లాగారు. యువతి, యువకుడిని రక్షించారు. ఆ గూండాలు తాము సనాతన ధర్మం రక్షించడం కోసం రంగంలోకి దిగామని, సనాతన ధర్మాన్ని ఎవరు కించపరిచినా వారి పైన దాడులు చేస్తామని హెచ్చరిస్తూ నినాదాలు చేయటం మొదలు పెట్టారు.

రాహుల్ గాంధీ తో పాటు పలు ఛానెళ్లు యువతి, యువకుడి పైన హిందూ రక్షా దళ్ పేరుతో ఉన్న గూండాల దాడులను ఎత్తి చూపిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులకు ట్యాగ్ చేశారు. చట్టం వారికి ఎందుకు వర్తించలేదని ప్రశ్నించారు. అన్ని వైపుల నుండి ప్రశ్నలు, దాడులు ఎదురు కావటంతో పోలీసులు నలుగురు హిందూ రక్షా దళ్ గూండాలను వెతికి పట్టుకున్నామని చెప్పారు. అరెస్ట్ చేశామని చెబుతూ వారి పేర్లు వెల్లడి చేశారు. రామన్ సైని (50), వివేకానంద్ వివేక్ (32), కపిల్ కుమార్ (27), రవీందర్ సింగ్ అలియాస్ గోవింద్ హిందూ (35) వారి పేర్లు అని వెల్లడి చేశారు. అయితే వీరిలో గోవింద్ హిందూ అనే వ్యక్తి మళ్ళీ అక్టోబర్ 11 తేదీన కూడా ఢిల్లీ వీధుల్లో ప్రత్యక్షం అయ్యాడు. లాఠీలు ధరించిన ఒక గుంపును వెంట బెట్టుకుని పోలీసులతో కలిసి తిరుగుతూ కనిపించాడు. తాము సనాతన ధర్మాన్ని కాపాడే లక్ష్యంతో ఉన్నామని కెమెరాల ముందు ప్రకటిస్తూ తిరిగాడు.
రాహుల్ గాంధీ ఎత్తి చూపిన నలుగురు తమ కార్యకార్తలే అని హిందూ రక్షా దళ్ ప్రకటించింది. ఆదివారం అక్టోబర్ 11 తేదీన హిందూ రక్షా దళ్ సభ్యులు పలువురు రంగంలోకి దిగారని దళ్ నేత గర్వంగా ఎక్స్ లో ప్రకటించాడు. తమ ప్రకటనను ఆయన ప్రధాన మంత్రి, ఢిల్లీ పోలీస్ కమిషనర్ లకు ట్యాగ్ చేశాడు కూడా.
పిటిఐ వార్తా సంస్థ కూడా హిందూ రక్షా దళ్ గూండా చర్యలను రికార్డు చేసి వెల్లడి చేసింది. సెంట్రల్ ఢిల్లీ లోని కన్నాట్ ప్లేస్ లో ప్రదర్శనలు జరుగుతున్న చోట వారు లాఠీలు చేబూని ప్రదర్శకులను బెదిరిస్తూ తిరిగారని, సెంట్రల్ ఢిల్లీలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పటికీ వారు అక్కడ స్వైర విహారం చేశారని తెలిపింది. వాళ్ళు ప్రదర్శకులను బెదిరించినప్పటికీ పోలీసులు చూస్తూ ఉన్నారు తప్ప నిరోధించే ప్రయత్నం చేయలేదని తెలిపింది. కొన్ని చోట్ల పోలీసులు జోక్యం చేసుకున్నప్పటికీ నిరసనకారులను నెట్టటమే తప్ప లాఠీలు ధరించిన గూండాలు తమతో ఉన్నా కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదని ఇతరవార్తా సంస్థలు తెలిపాయి.
వాళ్ళలో కొందరు తాము ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కి మద్దతుగా వచ్చామని చెప్పారు. తమను పోలీసులు నిర్బంధించినా పట్టించుకునేది లేదని చెప్పారు. నిరసనకారులు “జాతీయ (నేషనల్) వ్యతిరేక, మోడి వ్యతిరేక నినాదాలు” ఇస్తున్నారని “కాబట్టి దాడి చేసేందుకు వారు అర్హులే” అని ప్రకటించారు. “ఢిల్లీ పోలీసులూ లాఠీలు ప్రయోగించండి, మేము మీతో ఉన్నాం” అంటూ హిందీలో నినాదాలు ఇచ్చారు.
ఒక విలేఖరి వారిని యాంటీ నేషనల్, యాంటీ ఇండియా అంటే ఏమిటని ప్రశ్నించారు. వాళ్లు “హిందూత్వకు వ్యతిరేకంగా ఉంటే యాంటీ-హిందూ అనీ, మోడి కి వ్యతిరేకంగా ఉంటే యాంటీ నేషనల్ అనీ నిర్వచనం ఇచ్చారు. ఆ విలేఖరి నవ్వు ఆపుకుంటూ పక్కకు వెళ్లవలసి వచ్చింది. సనాతన వాదుల బుర్రలు ఎందుకు అంత ఇరుకుగా ఉంటాయో బహుశా ఆ విలేఖరికి అర్ధం అయి ఉండాలి.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ సిజెపి అక్టోబర్ 11 తేదీన వరుసగా రెండవ రోజు ఛలో జంతర్ మంతర్ పిలుపు ఇచ్చిన నేపధ్యంలో ఆదివారం నాడు కూడా ఢిల్లీ వీధులు నిరసనకారులతో నిండి పోయింది. నేహా బోరా, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా లను ఆరంభం లోనే పోలీసులు అరెస్ట్ చేసినట్టు కనిపిస్తోంది. నిరసన ప్రదర్శకులకు నాయకత్వం అంటూ ఎవరూ లేరు. కేవలం సిజెపి పిలుపు అందుకుని వివిధ రాష్ట్రాల నుండి ఢిల్లీ చుట్టూ పక్కల నుండి విద్యార్ధులు, యువకులు నిరసనలో పాల్గొనేందుకు వచ్చారు.
కాగా హిందూ రక్షా దళ్ నాయకుడు పేరుతో పింకీ చౌదరి అనే వ్యక్తి లాఠీలు ధరించిన వారంతా తమ వారియర్స్ అని ప్రకటించాడు. సనాతన ధర్మ రక్షకులు అని చాటాడు. రాజకీయాలతో తమకు పని లేదని సనాతన ధర్మం ప్రమాదంలో పడితే తాము రంగం లోకి దిగి రక్షించటమే తమ కర్తవ్యం ప్రకటించాడు.

