
–
ఒక పక్క ఎన్నికల ఫలితాలను రిగ్గింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ అవే ఎన్నికల్లో క్రమం తప్పకుండా పాల్గొనటం ఏమిటని కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజిత్ దిప్కే ప్రశ్నించాడు. నిజంగా ఎన్నికలను రిగ్గింగ్ చేయటం ద్వారా గెలుస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నట్లయితే అలాంటి ఎన్నికలలో పాల్గొనకుండా బహిష్కరించాలని సిజెపి పార్టీ నాయకుడు అభిజిత్ దిప్కే ప్రతిపక్ష పార్టీలకు వినూత్న పిలుపు ఇచ్చాడు.
ఎన్నికల ఫలితాలను రిగ్గింగ్ చేస్తున్నారని అధికార పార్టీ అయిన బిజెపి పైన ఆరోపణలు చేస్తూ ఆ ఎన్నికల్లో పాల్గొనటం వల్ల ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికలను న్యాయబద్ధంగా జరిగినవే అన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగిస్తున్నారని దిప్కే వివరించాడు.
“అవును. ఎన్నికలను రిగ్గింగ్ చేయటం వాస్తవమే. కానీ రిగ్ అయిన ఎన్నికల్లో పాల్గొనటాన్ని కొనసాగించటం ద్వారా ఆ ఎన్నికలను న్యాయబద్ధం కావిస్తూ ఎన్నికలు స్వేచ్చాయుతంగా, న్యాయబద్ధంగా జరిగాయన్న భ్రాంతిని కలిగిస్తున్నారు” అని అభిజిత్ దిప్కే ట్విటర్ ద్వారా ప్రకటించాడు. “ఎన్నికల్లో పాల్గొనటం కొనసాగించకపోతే అసలు తమ ఉనికే అదృశ్యం అవుతుందని భయపడుతున్నారా?” అని దిప్కే ప్రతిపక్ష పార్టీలను సూటిగా ప్రశ్నించాడు.
“కానీ మీకు పడే వోట్లను దొంగిలిస్తున్నప్పుడు, మీ ఎంఎల్ఏ లు, ఎంపి లను వాళ్లకి అవసరం అయినప్పుడల్లా లాక్కుంటున్నపుడు, మీ పార్టీలను చీల్చుతున్నపుడు అది ఎలాంటి మనుగడ అవుతుంది? అది రాజకీయ మనుగడ అవుతుందా? ఏ వ్యవస్థ అయితే మిమ్మల్ని బలహీనం చేస్తున్నదో అందులోనే జీవించి ఉండటానికి మీరు ప్రయత్నించటం సరైందేనా? ఈ విధంగా ఎన్నాళ్లు మనుగడ సాగించగలరు?” అని దిప్కే ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించాడు.
మీకు అనువుగా ఉన్నప్పుడే రిగ్గింగ్ ఆరోపణలు చేయటం కరెక్టేనా?
ప్రతిపక్ష రాజకీయ పార్టీల హిపోక్రసీని కూడా అభిజిత్ దిప్కే తీవ్రంగా ఎండగట్టాడు. రాష్ట్రాన్ని బట్టి, నష్టం ఎదుర్కొన్న రాజకీయ పార్టీలను బట్టి రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్నారని ప్రతిపక్షాలను దిప్కే విమర్శించాడు. “మీకు అవసరం ఉన్న రాష్ట్రాలలో జరిగిన రిగ్గింగ్ లను మాత్రమే మీరు ప్రశ్నించటం, ఇతర చోట్ల జరిగే రిగ్గింగ్ లను ప్రశ్నించకుండా గమ్మున ఊరుకోవటం సబబు కాదు. ఏ రాష్ట్రంలో రిగ్గింగ్ జరిగినా, ఏ పార్టీ నష్టపోయినా ఖండించటంలో, ప్రశ్నించటంలో అన్ని పార్టీలు ముందుండాలి” అని దిప్కే స్పష్టం చేశాడు.
“అలాగే మీరు ఆటలో పాల్గొంటూనే ఆటను రిగ్ చేశారని ఆరోపించలేరు. మీరు పాల్గొనటం వల్ల ఎన్నికలకు న్యాయబద్ధత వచ్చేస్తోంది. సొంత రాజకీయ మనుగడ కోసమే కాదు, దేశం గురించి, ప్రజాస్వామ్యం గురించి కూడా మీరు ఆలోచించాలి. ఒక నిర్ణయం తీసుకుని రిగ్గింగ్ అవుతున్న ఎన్నికల్లో పాల్గొనటం ఆపండి” అని అభిజిత్ దిప్కే ఒక అద్భుతమైన పిలుపు ఇచ్చాడు.
రిగ్గింగ్ అవుతున్న ఎన్నికలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్నికలను బహిష్కరించాలని అభిజిత్ దిప్కే ఇస్తున్న పిలుపు నిజానికి అత్యంత విలువైనది, సంచలనాత్మకమైనది. ఇటువంటి ఆలోచన భారతదేశంలో ఇంతవరకు ఏ ప్రధాన స్రవంతి పార్లమెంటరీ రాజకీయ పార్టీకి వచ్చిందో లేదో తెలియదు.
ఇతర దేశాల్లో అనేక చోట్ల సైన్యాన్ని, పోలీసులను ఉపయోగిస్తూ ఏకపక్షంగా ఎన్నికలను ముగించేస్తున్న చోట్ల ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. మియాన్మార్, ధాయిలాండ్ లాంటి సైనిక పాలనా దేశాల్లో ప్రతిపక్షాలు అనేకమార్లు ఎన్నికలను బహిష్కరించాయి. అనేక లాటిన్ అమెరికా దేశాల్లో ఎన్నికలను బహిష్కరించిన ఉదాహరణలు ఉన్నాయి. కానీ పార్లమెంటరీ పార్టీలు ఎన్నికలను బహిష్కరించిన ఉదాహరణ, కనీసం అలాంటి ఆలోచన చేసిన ఉదాహరణ కూడా ఇండియాలో ఇంతవరకు లేదు.
క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్టే…
కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దిప్కే, క్రికెట్ మ్యాచ్ ను ఎన్నికలను పోల్చటం ద్వారా విషయాన్ని మరింత అర్ధవంతంగా వివరించాడు. ఫిక్స్ చేసిన మ్యాచ్ కూడా ఏకపక్షంగా ఉండబోదని, మ్యాచ్ పోటా పోటీగా జరిగినట్టు ప్రజలకు కనపడేలా ఎత్తుగడలు వేస్తారని గుర్తు చేశాడు. “ఫిక్స్ అయిన క్రికెట్ మ్యాచ్ లో, ప్రతి క్యాచ్ ని వదిలి పెట్టటం జరగదు. కొన్ని క్యాచ్ లు పట్టుకుంటారు. చివరి ఓవర్ ద్వారా మ్యాచ్ ని తీసుకెళ్లటం ద్వారా పోటా పోటీగా ఆడిన భ్రమ కలిగిస్తారు” అని వివరించాడు.
“అదే తరహాలో మీకు కొన్ని చోట్ల విజయాలను అందిస్తారు కూడా. మీరు ఎన్నికల్లో పాల్గొనటం కొనసాగించటానికి, నిజమైన పోటీ జరిగిందని ప్రజలని నమ్మించటానికి కొన్ని విజయాలని మీ చేతికి ఇస్తారు. మీరు ఆటలో కొనసాగేందుకు మీకు ఇచ్చే రొట్టె ముక్కల్లాంటివి ఆ విజయాలు. తద్వారా మొత్తం ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరిగినట్టుగా చూపిస్తారు” అని దిప్కే గీతోపదేశం చేశాడు.
దిప్కే ఇచ్చిన వివరణ నిజానికి ప్రతిపక్ష పార్టీలకు తెలియనిది కాదు. కర్ణాటకలో జరిగిన ఎస్ఐఆర్ ను కాంగ్రెస్ నియమించిన బృందం పరిశోదించి లోపాలను వివరిస్తూ నివేదిక తయారు చేసింది. ఈ నివేదిక లోని అంశాలను వెల్లడి చేస్తున్నప్పుడు పత్రికలు రాహుల్ గాంధీని “మీరు కూడా కొన్ని రాష్ట్రాల్లో విజయం సాధించారు కదా, అక్కడ రిగ్గింగ్ జరిగిందని ఎస్ఐఆర్ ద్వారా మతలబు జరిగిందని ఆరోపిస్తున్నారా?” అని అడిగాయి. దానికి రాహుల్ గాంధీ, అభిజిత్ దిప్కే వివరించిన అంశాన్నే ఇతర మాటల్లో చెప్పాడు. “వాళ్ళు వ్యూహాత్మకంగా ఎన్నికలను మ్యానిపులేట్ చేస్తున్నారు. ఒకటి రెండు రాష్ట్రాలను ప్రతిపక్షాలకు వదిలేస్తూ మొత్తంగా తమ అధికారం చేజారకుండా వ్యూహాత్మక రిగ్గింగ్ చేస్తున్నారు” అని రాహుల్ సమాధానం ఇచ్చాడు.
ఐనా సరే, ఎన్నికలను బహిష్కరించాలన్న ఆలోచన కాంగ్రెస్ తో సహా ఏ పార్లమెంటరీ రాజకీయ పార్టీకి కూడా రాలేదు. అందుకు కారణం ఈ రాజకీయ పార్టీలకు ఉన్న హ్రస్వ దృష్టి, స్వార్ధ ప్రయోజనాలపై ఉన్న శ్రద్ధ, దేశ ప్రజల ప్రయోజనాల పట్ల, సో-కాల్డ్ ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగింపు పట్ల ఎలాంటి ఆసక్తి, నిబద్ధత లేకపోవటమే.
భారతదేశం లోని పార్లమెంటరీ రాజకీయ పార్టీలన్నీ కేవలం ధనికుల ప్రయోజనాల కోసం పని చేసే పార్టీలే. ఇంకా చెప్పాలంటే దేశంలోని సమస్త వ్యవస్థలను కంట్రోల్ చేస్తున్న బడా భూస్వాములు, బడా పెట్టుబడిదారుల కనుసన్నల్లో రాజకీయ పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి.
18 సం.లు దాటిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉన్నందు వలన మాత్రమే రాజకీయ పార్టీలు పేదలు, కార్మికులు, భూమి లేని రైతులు, చిన్న వ్యాపారులు, మధ్య తరగతి ప్రజల వద్దకు వస్తాయి. వారి పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తాయి. సంక్షేమం పేరుతో రెండు మూడు ఉచిత గ్యాస్ బండలు, వెయ్యో రెండు వేలో పెన్షన్, అక్కడా ఇక్కడా కొద్ది పాటి సబ్సిడీలు విసిరేస్తారు. కానీ ఆసలైన బడ్జెట్ కు వచ్చేసరికి కేటాయింపులు అన్నీ బడా భూస్వామ్య బడా పెట్టుబడిదారీ వర్గాలకే వెళ్తాయి.
అన్నీ ధనిక వర్గాలకు సేవ చేసే పార్టీలే
సంక్షేమ పధకాలకు కాస్త ఎక్కువ ఇస్తే స్టాక్ మార్కెట్లు దఢేల్ మని పడిపోతాయి. ప్రభుత్వం పాపులర్ పధకాలకు డబ్బు వృధా చేస్తోందని పత్రికలు, వ్యాపారులు, కార్పొరేట్ లు దాడి చేస్తాయి. వ్యవస్థలన్నీ ధనికుల కోసమే పని చేస్తున్న సంగతిని చాటుతాయి. అసలు అదే సరైన విధానం అని ధృవీకరించేస్తారు. ఈ వార్తా విశ్లేషణలు చదివి వంటబట్టించుకున్న విద్యార్ధి, ఉపాధ్యాయ, గుమాస్తా, డాక్టర్, ఇంజనీర్… ఇత్యాధి మేధో బుద్ధి జీవులు అదే జ్ఞానం అని నమ్మేసి నెత్తికి ఎక్కించుకుని ప్రచారం చేసి పెడతారు. ఆ విధంగా ప్రజల కోసం పని చేయవలసిన ప్రజాస్వామ్యం కాస్తా ప్రజలకు వ్యతిరేకంగా పని చేస్తుంటే మేధావులు దానికి మద్దతు ఇస్తుంటారు.
ఏ రాజకీయ పార్టీ, పార్టీల కూటమి అధికారం లోకి వచ్చినా సరే, వారి విధానాలను డిక్టేట్ చేసేది టాటా, అదాని, అంబానీ, ఇత్యాధి సూపర్ ధనిక వర్గాలే తప్ప ఎన్నికల మ్యానిఫెస్టోలు కాదు. ఏ రాజకీయ పార్టీకైనా సరే, అదాని, అంబానీలే చందాలు ఇవ్వాలి. అధికారం వచ్చాక వారికోసమే పని చేయాలి. అలాంటి వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఏ పార్టీకి కావాలి? వ్యవస్థ ఎటుపోతే ఎవరికి కావాలి? ప్రతిపక్ష పార్టీల పోరాటం అంతా అధికారం కోసమే తప్ప ప్రజాస్వామ్యం కోసమో, వ్యవస్థలను ప్రజల కోసం పని చేసేలా శాసించేందుకో, నేరాల నుండి, దోపిడీల నుండీ ప్రజలను రక్షించేదుకో కానే కాదు.
ఇటువంటి పరిస్ధితులలో కాక్రోచ్ జనతా పార్టీ అవతరించింది. ప్రభుత్వాల నుండి జవాబుదారీతనం కావాలని డిమాండ్ చేస్తోంది. వేడి నెత్తురు ఉరకలు వేసే యువతరంతో నిండి ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ కి వ్యవస్థ లోతు పాతులు సహజంగానే ఇంకా వంట బట్టలేదు. రాజకీయ పార్టీలకు ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్ప బడుతున్న వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్నది అనవసరం అన్న సంగతి సిజెపి నాయకులకు, క్యాడర్ కు ఇంకా తెలియదు. అందుకే వారి డిమాండ్లలో, నినాదాలలో నిజాయితీ కనిపిస్తోంది. కాస్త చిత్తశుద్ధి కనిపిస్తున్నది. ఆ చిత్త శుద్ధి నుండే “ఎన్నికల బహిష్కరణ” నినాదం పుట్టింది.
సిఇసి గ్యానేష్ కుమార్ చట్టవిరుద్ధ ఎస్ఐఆర్
ముఖ్యంగా ఎన్నికల కమిషన్ లోని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన గ్యానేష్ కుమార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో చేస్తున్న కార్యక్రమంలో అనేక విధాలుగా చట్ట విరుద్ధ నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న సంగతిని గత బుధవారం, సెప్టెంబర్ 23 తేదీన ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక సంచలనాత్మకమైన పరిశోధనాత్మక కధనాన్ని ప్రచురించిన నేపధ్యంలో అభిజిత్ దిప్కే ‘ఎన్నికల బహిష్కరణ’ పిలుపు వెలువడింది.
ఎస్ఐఆర్ వాస్తవానికి రాజ్యాంగబద్ధమైన సూత్రాలలో ఉన్న అంశం కాదని, కేవలం ఒకే ఒక్క సారి జరిపే చర్యగా మాత్రమే అమలు చేస్తున్నారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పరిశోధన వెల్లడి చేసింది. కనీసం 14 సార్లు, 14 నిర్ణయాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లను సంప్రదించకుండా, వారికి చెప్పకుండా ఎస్ఐఆర్ నిర్ణయాలు తీసుకున్నాడని వెల్లడి అయింది.
బెంగాల్ లో రాజ్యాంగ బద్ధ అధికారం ఉన్న జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి ఎన్నికల అధికారులు జాబితాలో కలపటానికి విచారణ చేయాలని సుప్రీం కోర్టు నియమించిన జ్యుడీషియల్ ట్రిబ్యునల్స్ ముందు ప్రతిపాదించిన 16 లక్షల మంది వోటర్ల వోటు హక్కు రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ పిటిషన్ దాఖలు చేసిందని వెల్లడి అయింది.
ఇలా 16 లక్షల వోటర్లను జాబితా నుండి తొలగించాలని ఎన్నికల కమిషన్ స్వయంగా పిటిషన్ దాఖలు చేసిన నిర్ణయం సంగతి తమకు తెలియనే తెలియదని కమిషన్ లోని ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం రికార్డ్ చేసిన సంగతి వెల్లడి అయింది. అసలు ఈ పిటిషన్ దాఖలు చేసింది ఎవరో కూడా ఇంతవరకు తెలియని సంగతి వెల్లడి అయింది.
ఆ విధంగా ప్రతి ఒక్క వోటు హక్కు కాపాడవలసిన ఎన్నికల కమిషన్, ఏకపక్షంగా 16 లక్షల వోటర్ల తొలగింపుకు పిటిషన్ దాఖలు చేయటం ఒక భారీ స్కామ్ కాగా దీనికి సమాధానం ఇంతవరకు లభించకపోవటం సదరు స్కామ్ యొక్క తీవ్రతను తెలియజేస్తోంది.
గోవాలో 97 వోట్లు న్యాయబద్ధమైనవి అని నిర్ధారించిన స్థానిక నియోజకవర్గ ఎన్నికల అధికారులు నిర్ణయించి కొత్తగా రూపొందించిన ECINET సాఫ్ట్ వేర్ ద్వారా వోట్లను పునరిద్ధరించాలని ప్రయత్నిస్తే అసలు అక్కడ వోట్ల పునరుద్ధరణకు అవకాశమే ఇవ్వలేదని వెల్లడి అయింది. అనగా కొత్త వోటర్ల చేర్పుకు నియోజకవర్గ స్థాయి అధికారికి ఉన్న రాజ్యాంగ అధికారాన్ని సాఫ్ట్ వేర్ లో మార్పులు చేయటం ద్వారా తొలగించారని వెల్లడి అయింది. ఈ సంగతి కనీసం 8 సార్లు సిఇసి ఆఫీస్ లోని ఐ.టి ఉన్నత అధికారికి చెప్పినా కూడా పునరుద్ధరించే అవకాశం ఇవ్వలేదని వెల్లడి అయింది.
ఈ విధంగా కొత్త వోటర్లను జాబితాలో కలిపే అధికారాన్ని స్థానిక ఎన్నికల అధికారుల నుండి రాజ్యాంగ విరుద్ధంగా లాక్కునే అధికారం ఏ ఒక్కరికీ రాజ్యాంగం ఇవ్వలేదని, ఐనా సరే దీన్ని ఇంతవరకు సవరించలేదని స్థానిక అధికారులు, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాన్ని రికార్డు చేసినా కూడా దానిని సవరించని సంగతి వెల్లడి అయింది.
అత్యంత ఘోరమైన విషయం ఏమిటంటే ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ల ప్రశ్నలకు, అబ్జెక్షన్ లకు సిఇసి నుండి ఇంతవరకు సంతృప్తికరమైన సమాధానం లేదు. చర్చల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయి గానీ నిర్ణయాలు ఏకాభిప్రాయంతో తీసుకున్నవే అని చెప్పి ఊరుకున్నాడు తప్ప అసలైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. బిజెపి ప్రతినిధి ఒకడు “భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం అంటే ప్రజాస్వామ్యం పని చేసినట్టే” అని చెప్పి మాయం అయ్యాడు. ఇతర నాయకులు బుర్ర బుద్ధి లేకుండా “రాహుల్ గాంధీకి మైండ్ లేదు” అంటూ వాగుతున్నారు తప్ప గ్యానేష్ చట్ట విరుద్ధ నిర్ణయాల గురించి ఏమీ చెప్పలేకపోయారు. వారి వద్ద సమాధానం లేదు కాబట్టే, కన్నంలో వేలితో దొరికిపోయారు కాబట్టే అర్ధవంతమైన వివరణ ఇవ్వలేకున్నారు.
సిజెపి పిలుపుని అందుకుని ఆచరించగలిగితే కొన్ని సంచలనాత్మక పరిణామాలు దేశంలో చోటు చేసుకుంటాయి అనటంలో సందేహం లేదు. సదరు పరిణామాలు దేశంలో నిజమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించే అవకాశం లేనప్పటికీ కొంతలో కొంత పరిస్ధితి మెరుగయేందుకు, కోర్టుల్లో కొందరు జడ్జిలు ఐనా పరిస్ధితి తీవ్రత గ్రహించి దిద్దుబాటు చర్యలు కొన్నైనా తీసుకునేందుకు, కొద్దిమంది బ్యూరోక్రాట్లు కాస్త ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడవచ్చు.
బొత్తిగా నిరాశావాహ పరిస్ధితి, ప్రగతి నిరోధక కుల-మత శక్తుల స్వైర విహారం, హిందూత్వ శక్తులకు రాజ్యాంగ సంస్థల దాసోహం… ఈ పరిస్ధితులు నెలకొన్న తరుణంలో కాసిన్ని సానుకూల పరిణామాలు కూడా కొండంత ఆశావాహ పరిస్ధితిని కల్పిస్తాయి. రాజకీయ పార్టీల సంగతి అలా ఉంచి కనీసం దేశం కోసం, దేశ ప్రగతి కోసం ఆలోచించే ప్రజలు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు లేవనెత్తుతున్న ప్రశ్నలను, ఆలోచనలను, ఐడియాలను పరిగణనలోకి తీసుకోవాలి.



బీహార్ లో సర్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నప్పుడు దానిని సరి చేయాలనీ , లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని RJD అధినేత బెదిరించాడు ! ఆ బెదిరింపును తన మిత్ర పక్షాలు అంగీకరించలేదు!