ఇండియాలో డిజిటల్ హెల్త్: టెక్నాలజీ, వర్గం & అసమానతల నూతన నమూనా

Digital Health Workshop conducted by Harward University in Karnataka

–

— డి.రాహుల్

[ఈ ఆర్టికల్ న్యూ డెమోక్రసీ అనే ఆంగ్ల మాస పత్రికలో ప్రచురించ బడింది. ఈ పత్రిక ఢిల్లీ నుండి వెలువడుతుంది. ఆర్టికల్ నిడివి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ పూర్తిగా చదవగలిగితే ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆంగ్లం నుండి తెలుగులోకి అనువాదం చేసి అందిస్తున్నాను. -విశేఖర్]

ఉపోద్ఘాతం

ఆధునిక జీవనం లోని ప్రతి రంగం లోకి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం చొరబడింది. ఆరోగ్య సంరక్షణ కూడా అందుకు మినహాయింపు కాదు. టెలి మెడిసిన్ మరియు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల నుండి మొబైల్ హెల్త్ అప్లికేషన్లు, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) ఆధారిత రోగ నిర్ధారణ, శరీరానికి ధరించే ఎలక్ట్రానిక్ పరికరాలు (స్మార్ట్ వాచ్, ఫిట్‌నెస్ ట్రాకర్లు, స్మార్ట్  రింగ్), డిజిటల్ మందుల షాపులు, ప్రోగ్రామ్ అల్గారిధమ్ లపై ఆధార పడిన వ్యాధి పర్యవేక్షణ… ఇలా అనేక అంశాలతో కూడిన “డిజిటల్ ఆరోగ్యం” తాలూకు పరిభాష భారత దేశపు ఔషధాల భవిష్యత్తుకు కేంద్రంగా అవతరించింది.

డిజిటల్ ఆరోగ్య రంగం ఇస్తున్న హామీ అపరిమితం. ఒక మారుమూల గ్రామం లోని రోగి వందల కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయకుండానే ఒక మెట్రోపాలిటన్ నగరం లోని స్పెషలిస్టు డాక్టర్ ని సంప్రదించవచ్చు. ఆరోగ్య పత్రాలను పోగొట్టుకునే అవకాశం డిజిటల్ హెల్త్ రికార్డ్ విషయంలో లేదు. రోగాలను కనిపెట్టడంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, వైద్యులకు సహాయం చెయ్యగలదు. మొబైల్ అప్లికేషన్ల ద్వారా రోగులు డాక్టర్ల వద్ద అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు, రోగ పరీక్షల రిపోర్టులు పొందవచ్చు, ఔషధాలను పొందవచ్చు. డిజిటల్ వేదికలు ఆరోగ్య సంరక్షణ వేగవంతం, మరింత సమర్ధవంతం అవుతుంది మరియు మరింత అందుబాటు లోకి వస్తుంది.

ఆరోగ్య సంరక్షణను ప్రజలకు చేరువ చేయటాన్ని డిజిటల్ టెక్నాలజీలు నిజంగానే మెరుగుపరుస్తాయి. కొన్ని నిర్దిష్ట భౌగోళిక అడ్డంకులను అవి తగ్గించగలవు, మెడికల్ రికార్డుల నిర్వహణను బలీయం చేయగలవు, హెల్త్ వర్కర్ల పనిలో మద్దతుగా ఉండగలవు. అత్యవసర పరిస్ధితుల్లో రోగులకు డాక్టర్లకు మధ్య టెలి మెడిసిన్ ఒక ముఖ్యమైన లంకెగా పని చేయగలదు. సమగ్రంగా రూపొందించబడిన ప్రజారోగ్య వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణను మెరుగైన రీతిలో సమన్వయ పరిచి రోగులకు అందుబాటులోకి తేగలుగుతుంది. కానీ సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) అన్నది సమాజానికి ఆవల ఉండలేదు. నిర్దిష్ట ఆర్ధిక, రాజకీయ సంబంధాల పరిధిలో మాత్రమే అది పని చేస్తుంది. కాబట్టి, సమస్య కేవలం ఇండియా డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను స్వీకరించాలా లేదా అన్నది కాదు. అంతకంటే మించిన మౌలిక ప్రశ్న ఏమిటంటే -డిజిటల్ మౌలిక నిర్మాణాలకు సొంతదారు ఎవరు? సమాచారం (డేటా) ను ఎవరు నియంత్రిస్తారు? టెక్నాలజీ ఎవరికి అందుబాటులో ఉన్నది? డిజిటల్ హెల్త్ అభివృద్ధిని ఎవరి ఆరోగ్య అవసరాలు నిర్ధారిస్తున్నాయి? ఆరోగ్య సంరక్షణ స్మార్ట్ ఫోన్ ల పైన, ఇంటర్నెట్ కనెక్టివిటీ పైన, డిజిటల్ అక్షరాస్యత పైన, ప్రైవేటు డిజిటల్ కంపెనీ వేదికల పైనా ఎక్కువగా ఆధారపడం అంతకంతకూ పెరిగిపోతే ఎవరి ఆరోగ్య సంరక్షణ దాని నుండి మినహాయింపుకు గురవుతుంది?

ఈ ప్రశ్నలు ముఖ్యంగా సంపద, ఆదాయం, కులం, జెండర్, భౌగోళిక పరిసరాలు, ప్రభుత్వ సేవల అందుబాటు మొ. అంశాలలో భారీ అసమానతలు నెలకొన్న ఇండియాలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ప్రపంచంలో అత్యున్నత స్థాయికి అభివృద్ధి చెందిన ప్రైవేటు వైద్య సౌకర్యాలను ధనిక వర్గం ఇప్పటికే నిరాటంకంగా చేరువ కాగల స్థితిలో ఉండగా, మిలియన్ల మంది కార్మికులు, రైతు కూలీలు, అసంఘటిత రంగ కూలీలు మరియు పేద కుటుంబాలు కనీసం ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ పొందలేనటువంటి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను ప్రవేశ పెడుతున్నారు.

కాబట్టి మార్క్సిస్టు దృక్పథంలో డిజిటల్ హెల్త్ ను తటస్థ సాంకేతిక పరివర్తనగా చూడటం సాధ్యం కాదు. విస్తృత భారత రాజకీయార్ధిక వ్యవస్థ పరిధిలో మాత్రమే దానిని సరిగ్గా అర్ధం చేసుకోగలుగుతాము. బ్యూరోక్రటిక్ పెట్టుబడిదారీ విధానం కింద సాంకేతిక పరిజ్ఞానం పురోభివృద్ధి అన్నది ఒకే సారి సామాజిక ఉత్పాదకతను పెంచటంతో పాటు సామాజిక అసమానతలను మరింత బలోపేతం చేస్తుంది. మానవ సంక్షేమాన్ని మెరుగుపరచగల అదే టెక్నాలజీ పెట్టుబడి సంచయానికి, పౌరులపై నిఘాకు, ఆరోగ్యాన్ని సరుకుగా మార్చటానికి, లాభాల సంపాదనకు సాధనంగా పని చేస్తుంది.

ఇండియాకు సంబంధించి డిజిటల్ హెల్త్ లో ఈ వైరుధ్యం ఉన్నది. ఆరోగ్య సంరక్షణను ప్రజాస్వామికీకరించగల శాంతి డిజిటల్ హెల్త్ కు ఉన్నది. కానీ ప్రైవేటీకరణ, వాణిజ్యీకరణ, అసమాన అందుబాటు లాంటి పరిస్ధితుల మధ్య అది రెండంతస్థుల డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను సృష్టిస్తుంది. డబ్బు, ఎలక్ట్రానిక్ వస్తు పరికరాలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటల్ అక్షరాస్యత మున్నగునవి అందుబాటులో కలిగి ఉన్న వారికి ఒక అంతస్థును అందుబాటులో ఉంచితే మరో పక్క, ఏ ఆధునిక సాంకేతిక మౌలిక వ్యవస్థ పైన అయితే అంతకంతకూ ఎక్కువగా ఆరోగ్య సంరక్షణ ఆధారపడుతున్నదో వాటి నుండి దూరంగా ఉంచబడిన వర్గాల ప్రజలకు మరొక అంతస్థు ను అందుబాటులో ఉంచుతున్నది.

డిజిటల్ హెల్త్ మరియు సాంకేతికత పురోభివృద్ధికి హామీ

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏ‌బి‌డి‌ఎం) ద్వారా నేషనల్ డిజిటల్ హెల్త్ ఆర్కిటెక్చర్ నిర్మించటానికి భారత ప్రభుత్వం భారీ ప్రయత్నాలను చేపట్టింది. డిజిటల్ హెల్త్ గుర్తింపులు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు, ఆరోగ్య సంరక్షణ వృత్తి నిపుణులు మరియు ఆరోగ్య వసతులు రిజిస్ట్రీలు, పరస్పరం అంతర్గత నిర్వహణా వ్యవస్థల ద్వారా ఆరోగ్య సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోగల వసతి అందుబాటులో ఉన్నట్లుగా ఈ కార్యక్రమం ఆశిస్తుంది. ఉదాహరణకి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) అన్నది వ్యక్తులు పరస్పరం హెల్త్ రికార్డులు మార్చుకోగల ఏకైక డిజిటల్ హెల్త్ గుర్తింపుదారు (ఐడెంటిఫైయర్) గా రూపొందించబడింది. అధికారిక ఏ‌బి‌డి‌ఎం ఫ్రేమ్ వర్క్ లో ఆరోగ్య వసతుల రిజిస్ట్రీ (ఆసుపత్రులు, పి.హెచ్.సి, డిస్పెన్సరీలు మొ.వి), ఆరోగ్య సంరక్షణ నిపుణుల రిజిస్ట్రీ (వైద్యులు, సర్జన్ లు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు మొ.) వీరందరిని ఒక వేదిక మీదికి చేర్చే ఏకీకృత హెల్త్ ఇంటర్ ఫేస్ (మొబైల్/కంప్యూటర్ అప్లికేషన్)… ఇవన్నీ ఉంటాయి. తద్వారా వైద్య సేవలు, అపాయింట్^మెంట్ బుకింగ్‌, ఫోన్ లేదా లైవ్ వీడియో ద్వారా కన్సల్టింగ్ సౌకర్యం కల్పించే టెలీకల్సల్టేషన్ సౌకర్యాలను ఈ వేదికపై కల్పించబడతాయి.

ఉదాహరణకి బీహార్ నుండి ఢిల్లీకి వచ్చిన ఒక వలస కూలీని తీసుకుందాం. తరచుగా అతను తన వ్యక్తిగత శాశ్వత వైద్య రికార్డులను తనతో పాటు పట్టుకొని రాడు. ఢిల్లీలోని వైద్యుడు రోగి అనుమతితో అతని మెడికల్ రికార్డులను డిజిటల్ వ్యవస్థను ఉపయోగించి చూడ గలడు. మారుమూల ప్రాంతంలో ఉన్న గర్భిణీ స్త్రీ అక్కడి నుండే టెలీ కన్సల్టేషన్ ద్వారా స్పెషలిస్టు వైద్య సలహా పొందగల వసతి ఉంటుంది. ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (పి.హెచ్.సి) డిజిటల్ వ్యవస్థలను ఉపయోగించి రిఫరల్ (మెరుగైన వైద్యం కోసం ఒక డాక్టర్, మరో నైపుణ్య డాక్టర్ ను సంప్రదించమని కోరటం) డాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ వైద్యం అందించగలదు. ఒక మొండి జబ్బుతో బాధపడుతున్న రోగి మళ్ళీ మళ్ళీ అవే పరీక్షలు జరిపించుకునే అవసరం లేకుండా (డాక్టర్లు, ఆసుపత్రులు మారినప్పటికీ) ఒక క్రమంలో వరుస వైద్య సేవలు పొందగలడు.

నిజం చెప్పాలంటే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని సోషలిస్టు సిద్ధాంత దృక్పథంలో ఉపయోగించుకున్నట్టయితే శాస్త్ర, సాంకేతిక రంగాలను ప్రజా ఆరోగ్య వ్యవస్థను సమర్ధవంతంగా అభివృద్ధి చేయవచ్చు. కానీ ఇక్కడ టెక్నాలజీతో ఎలాంటి సమస్యా లేదు. ఆ టెక్నాలజీని నియంత్రించే సామాజిక సంబంధాలతోనే అసలు సమస్య. నిజాయితీతో కూడిన నిజమైన ప్రజారోగ్య దృక్పథంతో కూడిన ప్రజా వైద్య సేవల వ్యవస్థ కింద ప్రజా ఆసుపత్రులు, వాక్సినేషన్ కార్యక్రమాలు, ప్రజా తాగు నీటి వ్యవస్థ మొదలైన వాటికి మల్లేనే డిజిటల్ వైద్య వ్యవస్థలను కూడా మరొక ప్రజోపయోగ వ్యవస్థగా ఉపయోగించుకోవచ్చు. దానిని ప్రాధమికంగా వాణిజ్య లాభాల కోసం కాకుండా సామాజిక అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) పాత్ర

ఐతే డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి మార్గం, అంతకంతకూ ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ కంపెనీలు, టెక్నాలజీ కంపెనీలు, డిజిటల్ ప్లాట్ ఫారంలు, రోగ నిర్ధారణ వ్యవస్థలు, ఇన్సూరెన్స్ వ్యవస్థలు మరియు డేటా పైన ఆధారపడి నడిచే వ్యాపారాలతో ముడి పడి ఉంటున్నది. అధికారిక ఏబిడిఏం ఆర్కిటెక్చర్ ప్రకారం ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆరోగ్య వసతులు రెండు ఉమ్మడిగా సంప్రదించుకోవటం ద్వారా ఒక క్రమబద్ధమైన వ్యవస్థను తయారు చేయాలని, అందులో డిజిటల్ ఆరోగ్య పరిష్కారాలను అందించే నిపుణులు మరియు హెల్త్-టెక్ కంపెనీలు పాల్గొని పని చేయాలని అధికారిక ఏబిడిఏం ఆర్కిటెక్చర్ ఆశిస్తున్నది. ఆసుపత్రులు, క్లినిక్ లు, రోగ నిర్ధారణ ల్యాబొరేటరీలు, ఇమేజింగ్ (స్కానింగ్) సెంటర్లు, ఫార్మసీలు… వీటన్నింటి సమాచారం ఒకే చోట లభించేలా “హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ” డిజైన్ చేయబడింది. ఈ వ్యవస్థలో రిజిస్టర్ చేసుకోవటం ద్వారా వివిధ ఆరోగ్య సంస్థలు ఈ విశాలమైన డిజిటల్ హెల్త్ ఎకోసిస్టం కు అనుసంధానమై (కనెక్ట్ అయి) ఉంటాయి. కనుక ప్రభుత్వం నిర్మిస్తున్న డిజిటల్ మౌలిక నిర్మాణం కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రభుత్వ ఆరోగ్య సేవల వరకే పరిమితం కాదు; విశాల స్థాయిలో ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే సంస్థలన్నీ ఒక ఉమ్మడి జాతీయ డిజిటల్ నెట్ వర్క్ లో సమగ్రంగా అనుసంధానమై ఉంటాయి.

ప్రైవేటు టెక్నాలజీ కంపెనీలకు అప్పగించబడిన పాత్ర మరింత స్పష్టంగా ఉన్నది. నేషనల్ హెల్త్ అథారిటీ సంస్థ, “హెల్త్ టెక్నాలజీ కంపెనీల” కోసమే అంకితం కావించబడిన ఎబిడిఎం ప్రోగ్రాం ని కలిగి ఉన్నది. డిజిటల్ వేదికలను (platforms) ఆరోగ్య సంరక్షణ కేంద్రాలుగా మలచటం కోసమే హెల్త్ టెక్ కంపెనీలను ఆహ్వానిస్తున్నామని అది స్పష్టంగా పేర్కొన్నది. హెల్త్-టెక్ సంస్థల కోసం నిర్దిష్ట ప్రయోజనాలను ఎబిడిఎం వెబ్ సైట్ గుర్తించింది. ఎబిడిఎం నిర్దేశిత ప్రమాణాలతో కూడిన ఆసుపత్రులకు మరియు ఆరోగ్య-నిర్వహణ సమాచార వ్యవస్థల కోసం పెరుగుతున్న డిమాండ్ ని హెల్త్-టెక్ కంపెనీలకు అందుబాటులోకి వస్తుంది; ఎబిడిఎం సర్టిఫికేషన్ ద్వారా వాటికి మెరుగైన విశ్వసనీయత చేకూరుతుంది; మెరుగు పరచ బడిన సులభతర వ్యాపార సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ప్రైవేటు టెక్నాలజీ కంపెనీలు, డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ను పరోక్షంగా ఉపయోగించుకునే వాడుకరులు గా మాత్రమే ఉండరు; ప్రభుత్వం నిర్మించే డిజిటల్ హెల్త్ ఎకోసిస్టం లోకి టెక్నాలజీ ప్రదాతలుగా, సొంత (వాణిజ్య) సేవలు అందజేసే మధ్యంతర సంస్థలుగా ప్రత్యక్షంగానే చొప్పించబడుతున్నాయి.

విస్తారమైన ప్రైవేటు డిజిటల్ సేవల కోసం ఎబిడిఎం ఫ్రేమ్ వర్క్ లో సాంకేతిక చోటు (technical space) ను ప్రభుత్వం కల్పిస్తున్నది. ప్రభుత్వం ప్రకటించిన సొంత ఎఫ్ఎక్యూ ల ప్రకారం ఎబిడిఎం కోర్ మాడ్యూళ్లతో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ (ఎపిఐ – యాప్ లను ఇన్^స్టాల్ చేసే సాఫ్ట్ వేర్) ద్వారా టెలి మెడిసిన్ (ఇంటర్నెట్ ద్వారా ఔషధాలు తెప్పించుకుంటే అదే టెలి మెడిసిన్) సరఫరాదారు కంపెనీలు అనుసంధానం కావచ్చు; తద్వారా రోగులు, టెలి మెడిసిన్ సరఫరాదారులను, డాక్టర్లను తామే ఎంపిక చేసుకోవచ్చు. ఆసుపత్రి సమాచార వ్యవస్థలు, ఆసుపత్రి నిర్వహణ సమాచార వ్యవస్థలు ఈ తరహాలోనే ఎబిడిఎం తో అనుసంధానం కావచ్చు. అలాగే డిజిటల్ హెల్త్ రికార్డు, “హెల్త్ లాకర్ల” సరఫరాదారులు కూడా రోగుల హెల్త్ ఐడి లతో సంబంధం ఏర్పరచుకుని (కనెక్ట్ అయి) రోగులు తమ మెడికల్ రికార్డ్ లను దాచుకోవటానికి, అవసరమైనప్పుడు ఇతరులతో (డాక్టర్లతో) తమ రికార్డ్ లను పంచుకోవటానికి అవసరమైన వసతులను అందజేయవచ్చు. కాబట్టి ప్రైవేటు ఆసుపత్రులు, టెలి మెడిసిన్ కంపెనీలు, హెల్త్-రికార్డ్ కంపెనీలు, డిజిటల్ హెల్త్ ప్రొవైడర్లు మొ.న వారు ప్రభుత్వ కేంద్ర డిజిటల్ మౌలిక నిర్మాణ వ్యవస్థను ఉపయోగించుకునే నెట్ వర్క్ గా ఏర్పడాలని ప్రభుత్వం ఆశిస్తున్నది. (ఇంకో విధంగా చెప్పాలంటే ప్రభుత్వం ఒక కేంద్ర డిజిటల్ వ్యవస్థను నిర్మించి ఇస్తే దాన్ని ఉపయోగ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ భారతీయ రోగులకు సేవలు అందించవచ్చని లేదా లాభాలు జుర్రుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నది).

డిజిటల్ ఆరోగ్య ప్రోత్సాహక పధకం (డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ -డి.హెచ్.ఐ.ఎస్) విషయానికి వస్తే, వాణిజ్య ప్రయోజనాల కోణం మరింత స్పష్టంగా వెలుగులోకి వస్తుంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆరోగ్య సంస్థలు, ఎబిడిఎం లో రిజిస్టర్ అయి డిజిటల్ సొల్యూషన్ కంపెనీలు, మరియు అర్హత పొందిన ప్రైవేటు వ్యక్తిగత హెల్త్ రికార్డులు లేదా హెల్త్ లాకర్ యాప్ లు ప్రభుత్వ ఫ్రేమ్ వర్క్ లో పాల్గొనేందుకు అర్హత కలిగిన సంస్థలలో ఉంటాయని ప్రస్తుతం నేషనల్ హెల్త్ అథారిటీ రూపొందించిన మార్గదర్శక పాఠంలో సూచించబడింది. నిర్దిష్ట డిజిటల్ ట్రాన్సాక్షన్ లకు ఆర్ధిక ప్రోత్సాహకాలను ఈ పధకం అందిస్తుంది: రోగి నుండి ఆమోదం పొంది హెల్త్ రికార్డ్ లను అందుబాటులోకి తెచ్చిన హెల్త్ సమాచార వినియోగదారు 10 ప్రోత్సాహక పాయింట్లు పొందుతారు; హెల్త్ సమాచార సరఫరాదారు లేదా ప్రైవేటు హెల్త్ లాకర్ కంపెనీ 5 ప్రోత్సాహక పాయింట్లు పొందుతారు; నిర్దిష్ట స్థాయికి మించిన స్కాన్ & పే ట్రాన్సాక్షన్లు జరిపిన ఆరోగ్య సంస్థలకు ప్రతి అదనపు ట్రాన్సాక్షన్ కు 5 ప్రోత్సాహక పాయింట్లు లభిస్తాయి; డిజిటల్ సొల్యూషన్ కంపెనీలకు 1 పాయింట్ లభిస్తుంది. ఈ ప్రోత్సాహకాలకు ప్రజారోగ్యం కోసం అంటూ సమర్థించుకున్నప్పటికీ, భారతీయ నేషనల్ డిజిటల్ హెల్త్ వ్యవస్థకు చెందిన ఆర్ధిక నిర్మాణం లోకి ప్రైవేటు డిజిటల్ మధ్యంతర సంస్థలను చొప్పిస్తున్నారని స్పష్టంగా అర్థమయ్యే సంగతి.

డిజిటలైజేషన్ ద్వారా డేటా ఆధారిత పెట్టుబడి సంచయానికి కొత్త అవకాశాలు

ఎబిడిఎం ఇన్ఫ్రా^స్ట్రక్చర్ భారీతనం కూడా గణనీయమైనది. 20 జులై 2026 నాటికి 94.87 కోట్ల ఎబిహెచ్ఎ ఐడి లు నమోదయ్యాయని, రోగ హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీలో 5.36 లక్షల ఆరోగ్య సంస్థలు రిజిస్టర్ అయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆసుపత్రులు, క్లినిక్ లు, ఔషధాల షాపులు, బ్లడ్ బ్యాంక్ లు, ఇంకా అనేక ఇతర రోగ సంరక్షణ సంస్థలు హెచ్ఎఫ్ఆర్ జాబితాలో ఉన్నాయి. ఈ గణాంకాలను బట్టి ఎబిడిఎం ఎంత మాత్రం చిన్న పైలట్ ప్రాజెక్టు కాదని, జాతీయ స్థాయి డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గా అది మారిపోయిందని, భారీ సంఖ్యలో ఉన్న జనాభాను మరియు విస్తారమైన ఆరోగ్య సంరక్షణ సంస్థల నెట్ వర్క్ ను అనుసంధానిస్తున్నదని అర్ధం అవుతోంది. ఈ నెట్ వర్క్ ఎంత భారీగా ఉంటే సాఫ్ట్ వేర్ అభివృద్ధి, ఆసుపత్రుల సమాచార వ్యవస్థలు, టెలీ మెడిసిన్ సేవలు మరియు ఇతర డిజిటల్ సాధనాలను అభివృద్ధి చేసే ప్రైవేట్ కంపెనీల ప్రాముఖ్యత అంతగా పెరుగుతుంది. కాబట్టి డిజిటల్ ఆరోగ్యంలో కేవలం ప్రైవేటు కంపెనీలు పాల్గొంటున్నాయన్న అంశం మాత్రమే ప్రధాన సమస్యగా ఉండబోదు. ప్రభుత్వం నిర్మించిన డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ మరియు టెక్నాలజీ సంస్థల వ్యాపారాల నిర్వహణలకు పునాదిగా మారిన తర్వాత ఎలాంటి ఆర్ధిక సంబంధాలు ఏర్పడతాయి అన్నది మరింత లోతైన సమస్యగా అవతరిస్తుంది. డిజిటల్ ఆర్కిటెక్చర్ లో అత్యధిక భాగం నిర్మించి, ప్రమాణీకరించేందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంటే, ప్రైవేటు ఆసుపత్రులు, రోగ నిర్ధారణ ప్రయోగశాలలు, ఔషధ సంస్థలు, టెలీ మెడిసిన్ కంపెనీలు, హెల్త్-టెక్ కంపెనీలు తమ తమ సేవలను ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తో అనుసంధానం చేసుకుంటాయి. ఈ అమరిక ద్వారా ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థలు ఒకదానిపై ఒకటి ఆధారపడే సరికొత్త రూపం నిర్మాణం అవటమే కాకుండా ఇందులో ప్రభుత్వ పెట్టుబడులు మరియు ప్రభుత్వ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లు ప్రైవేటు పెట్టుబడి సంచయానికి దారి తీసే పరిస్ధితులను సృష్టిస్తుంది. ఇది మరింత మౌలిక సమస్యను రేకెత్తిస్తుంది- డిజిటలైజేషన్ ప్రక్రియ వాస్తవంగా రోగ సంరక్షణ విషయంలో సామాజిక హక్కులను విస్తరిస్తుందా లేయ ఆరోగ్య సంరక్షణను సరుకుగా మార్చే సరికొత్త క్షేత్రాలను స్తృష్టిస్తుందా? ప్రస్తుతం ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటన్నది స్పష్టమే.

ఆరోగ్య సంరక్షణను డిజిటలైజేషన్ కావించే ప్రక్రియ కేవలం దానిని సరుకుగా మార్చేందుకు అవసరమైన అవకాశాలను మాత్రమే మరింత విస్తృతం చేస్తుంది. రోగ సంరక్షణ కార్యకలాపాలు, రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాలు, మందు చీటీలు (ప్రిస్క్రిప్షన్ లు), డాక్టర్ అపాయింట్‌మెంట్ లు, రోగుల రోగాల చరిత్రలు మున్నగు అంశాలు అంతకంతకూ ఎక్కువగా డిజిటల్ ప్లాట్^ఫారం ల ద్వారా నిర్వహించబడుతున్నప్పుడు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఆర్ధికంగా మరింత విలువైన నూతన సమాచార ప్రసారాలను ఉత్పత్తి చేయటమే కాకుండా డిజిటల్ ప్లాట్^ఫారం ఆధారిత సేవలకు మరిన్ని కొత్త అవకాశాలు సృష్టించబడతాయి. రోగి ఇక ఆరోగ్య సంరక్షణ ను పొందే వారుగా మాత్రమే ఉండరు; వారు సమాచారం (డేటా), డబ్బు చెల్లింపులు మరియు వాణిజ్య విలువలను సృష్టించే వాణిజ్య సాధనాలుగా మారి పోతారు. అప్పుడు ఒక రాజకీయార్ధిక ప్రశ్న ఉదయిస్తుంది: రోగుల సమాచారాన్ని ప్రాసెస్ చేసే సాంకేతిక సామర్ధ్యాన్ని ఎవరు సొంతం చేసుకుంటారు, ఆ సమాచారం కదిలే ప్లాట్^ఫారం లను ఎవరు నియంత్రిస్తారు, మరియు డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ ఉత్పత్తి చేసే ఆర్ధిక విలువ నుండి అంతిమంగా ఎవరు లబ్ది పొందుతారు?

భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో నెలకొన్న విస్తృత అసమానతల నమూనా నుండి ఈ ప్రశ్నకు వచ్చే సమాధానాన్ని విడదీసి చూడలేము. ఒక స్మార్ట్ ఫోన్, నమ్మకమైన ఇంటర్నెట్ కనెక్షన్, ప్రైవేట్ కంపెనీల ఇన్సూరెన్స్, కార్పొరేట్ హెల్త్ కేర్ ఖర్చును భరించే సామర్ధ్యం కలిగిన సంపన్న రోగి మాత్రమే డిజిటల్ ప్లాట్^ఫారంలు కల్పించే సమగ్ర సౌకర్యాల నుండి లబ్ది పొందగలడు. అటువంటి రోగి మాత్రమే ప్రైవేటు ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు, టెలీ కన్సల్టేషన్ సేవలు మరియు ఔషధ సేవల మధ్య సాపేక్షికంగా తేలికగా సంచరించ గలడు. అదే ఒక పేద కార్మికుడయితే మౌలిక అడ్డంకులైన ఖర్చు, దూరం, వేతన నష్టం, అయోగ్యమైన ప్రభుత్వ హెల్త్ కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లను అధిగమించలేడు. డాక్టర్ లేని పరిస్ధితిని ఒక డిజిటల్ రికార్డు పరిహరించటం సాధ్యం కాదు; అద్భుతంగా పని చేసే ఒక ఆసుపత్రిని ఒక ఆన్ లైన్ అపాయింట్‌మెంట్ పూడ్చలేదు; ఎమర్జెన్సీ వైద్య చికిత్స స్థానాన్ని ఒక టెలీ కన్సల్టేషన్ భర్తీ చేయలేదు.

డిజిటల్ హెల్త్ వర్గ స్వభావం

సంపన్న వర్గాలకు కార్పొరేట్ ఆసుపత్రులు, స్పెషలిస్టు డాక్టర్లు, ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలు, ప్రైవేట్ ఇన్సూరెన్స్, అంతర్జాతీయ వైద్య నైపుణ్యం.. ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. చికిత్స కోసం వారు దూరాలు ప్రయాణం చేయగలరు, రెండో వైద్యుని అభిప్రాయం పొందగలరు, అధునాతనమైన మెడికల్ ప్రొసీజర్ ల ఖర్చులు చెల్లించగలరు. కానీ శ్రామిక పెదాలు తరచుగా దీనికి పూర్తిగా వ్యతిరేక వాస్తవాలను అనుభవించి ఉంటారు.

ఒక నిర్మాణ కూలీ, ఇంటి పని వాళ్లు, వ్యవసాయ కూలీలు లేదా వీధి వ్యాపారులు… వీళ్లు వైద్య చికిత్స తీసుకోవటం అంటే ఒక రోజు వేతనాన్ని వదులుకోవటమే. వలస వచ్చిన కూలీలకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళటం అంటే గణనీయమైన ఖర్చులు వివిధ రూపాల్లో చేయవలసి ఉంటుంది. ఒక గ్రామీణ కుటుంబానికి అతి దగ్గరి స్పెషలిస్టును సంప్రదించటం అంటే కొన్ని కిలో మీటర్ల దూరం ప్రయాణించవలసి రావచ్చు. మిలియన్ల మందికి హెల్త్ యాప్ లేకపోవటం సమస్య కాదు; ఒక డాక్టర్, నర్స్, పని చేసే ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, అందుబాటులో ఉండే ఔషధ ఖర్చులు లేదా ఆధారపడ దగిన అంబులెన్స్ సౌకర్యం.. ఇవే నిజమైన సమస్యలు.

ఇటువంటి అసమాన ఆరోగ్య సేవల వ్యవస్థ లోకి డిజిటల్ హెల్త్ ప్రవేశిస్తున్నది. మధ్య తరగతి మరియు సంపన్న వర్గాలకు డిజిటలైజేషన్ ప్రక్రియ అదనపు సౌకర్యం కావచ్చు. అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునేందుకు, స్పెషలిస్టులను సంప్రదించేందుకు, మెడికల్ రికార్డ్ లను అప్ లోడ్ చేసేందుకు ఔషధాలు కొనుగోలు చేసేందుకు, రోగ నిర్ధారణ పరీక్షల రిపోర్టులు పొందటానికి వారు స్మార్ట్ ఫోన్ వినియోగించగలరు. ప్రైవేటు ఆసుపత్రులు మరియు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని డిజిటల్ సేవలతో అనుసంధానం చేసుకోగలరు. కానీ పేద పౌరులకు మాత్రం డిజిటలైజేషన్ మరొక ఆటంకం అవుతుంది. డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అనేక భౌతిక వనరులు రోగులకు అప్పటికే అందుబాటులో ఉన్నట్లు భావిస్తుంది: స్మార్ట్ ఫోన్, ఆధారపడదగిన మొబైల్ కనెక్షన్, డేటా, విద్యుత్, డిజిటల్ అక్షరాస్యత, తగిన మొబైల్ యాప్ ని వినియోగించగల పరిజ్ఞానం, భాష నైపుణ్యం, వివిధ ఆన్ లైన్ మాధ్యమాలను (ఇంటర్‌ఫేస్) సులభంగా వినియోగించే సామర్ధ్యం.. ఇవన్నీ రోగులు అందరికీ అందుబాటులో ఉన్నట్లు భావిస్తుంది. కానీ ఇవి రోగులకు సమాన స్థాయిలో అందుబాటులో లేవు. ఇది పేదలు కేవలం “డిజిటల్ విభజన” వల్ల మాత్రమే బాధపడుతున్నట్లు అమూర్తంగా (abstract sense) భావించటం కాదు. డిజిటల్ విభజన అన్నది దానికదే వర్గ సంబంధాలలో భాగంగా వ్యక్తం కావటమే మనం గ్రహించాలి.

కాబట్టి, ఒక ఆరోగ్య సంరక్షణ సేవ, భౌతిక కౌంటర్ నుండి డిజిటల్ ప్లాట్^ఫారం లోకి మారినప్పుడు సదరు ఆరోగ్య సేవ కేవలం మరింత సమర్ధవంతంగా మారటంగా చూడాలా లేదా అన్నది సమస్య కాదు; ఒక పేద రోగి స్మార్ట్ ఫోన్ లేకపోవటం వలన అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోలేని పరిస్ధితిలో ఉండటం అంటే అది ప్రభుత్వ/ప్రైవేటు సేవ నుండి ఆమెను/అతడిని నెట్టి వేయటమే. ఈ తేడా అత్యంత కీలకమైనది.

డిజిటల్ హెల్త్ మరియు భారత అసమాన భౌగోళిక పరిస్ధితి

డిజిటల్ హెల్త్ యొక్క వర్గ స్వభావాన్ని భారత భౌగోళిక పరిస్ధితుల్లో కూడా చూడగలం. స్పెషలిస్టులు, కార్పొరేట్ ఆసుపత్రులు, రోగ నిర్ధారణ పరీక్షల ప్రయోగశాలలు, మెడికల్ కాలేజీలు, టెక్నాలజీ కంపెనీలు.. ఇవన్నీ మెట్రోపాలిటన్ నగరాల లోనే కేంద్రీకృతం అయి ఉన్నాయి. అందుకు విరుద్ధంగా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలు తరచుగా డాక్టర్లు, నర్సులు, స్పెషలిస్టులు, పని చేసే మౌలిక ఆరోగ్య నిర్మాణాల కొరతల సమస్యలలో మునిగి ఉంటాయి.

ఈ తరహా భౌగోళిక అసమానతలకు డిజిటల్ టెక్నాలజీయే పరిష్కారంగా కొన్ని సార్లు చెబుతూ ఉంటారు. ఉదాహరణకి టెలీ మెడిసిన్ ద్వారా గ్రామీణ రోగులు నగరాల లోని స్పెషలిస్టులతో కనెక్ట్ అయి సంప్రదించ గలుగుతారు. కానీ టెలీ మెడిసిన్ దూరం నుండి సర్జరీలను నిర్వహించలేదు. పని చేసే ఆసుపత్రి స్థానాన్ని అది భర్తీ చేయలేదు. అంబులెన్స్ సౌకర్యం లేని చోట ఎమర్జన్సీ ప్రసూతి వైద్యాన్ని అందించలేదు. సిబ్బంది తగినంతగా లేని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సుశిక్షితులయిన నర్సు స్థానాన్ని భర్తీ చేయలేదు.

భౌతిక ప్రభుత్వ మౌలిక సౌకర్యాలను నిర్మించకుండా తప్పించుకోవటానికి డిజిటల్ హెల్త్ ను ఒక సాకుగా చూపించే ప్రమాదం పొంచి ఉన్నది. ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణలో ఉపాధి సౌకర్యాలను విస్తరించటానికి బదులుగా శాశ్వత హెల్త్ వర్కర్ల స్థానంలో డిజిటల్ హెల్త్ ప్లాట్^ఫారం లను ప్రోత్సహించే అవకాశం ఉన్నది. అసమాన ఆరోగ్య సంరక్షణ లను ఉత్పత్తి చేసే డిజిటల్ ప్లాట్^ఫారంలు వ్యవస్థాగత అసమానత్వాన్ని పరిష్కరించటం సాధ్యం కాదు. ఆసుపత్రుల లేమి సమస్యను ఒక డిజిటల్ యాప్ పరిష్కరించటం సాధ్యం కాదు.

సరికొత్త పెట్టుబడి సంచయ క్షేత్రంగా హెల్త్ డేటా

డిజిటల్ ఆర్ధిక వ్యవస్థలో డేటాను తరచుగా వ్యూహాత్మక వనరుగా పరిగణిస్తారు. వ్యాధి, ఔషధాల వినియోగం, ఆరోగ్య/అనారోగ్య ప్రవర్తనల యొక్క నమూనాలను వెల్లడి చేస్తుంది కాబట్టే హెల్త్ డేటా ప్రత్యేక విలువ కలిగి ఉంటుంది. మిలియన్ల సంఖ్యలోని హెల్త్ రికార్డులను డిజిటల్ ఐడెంటిటీలతో అనుసంధానం కావించి పరస్పరం వివరాల (డేటా) మార్పిడి చేసుకోగలిగినట్లయితే అటువంటి వ్యవస్థ విస్తారమైన సమాచార నిలువ వ్యవస్థలను సృష్టిస్తుంది. ఇలా సమగ్రం కావించబడిన సమాచారాన్ని ప్రభుత్వ ఆరోగ్య పధకాల కోసం రాజ్యం వినియోగించవచ్చు. కానీ, అదే ఎకోసిస్టం సాఫ్ట్ వేర్ అభివృద్ధి, ఇన్సూరెన్స్, మరియు వాణిజ్య ఆరోగ్య సేవల కంపెనీల అభివృద్ధికి కూడా అవకాశాలను సృష్టిస్తుంది.

ఇది వ్యక్తులకు మరియు ఆరోగ్య/అనారోగ్య డేటాను ప్రాసెసింగ్ చేసే సామర్ధ్యం కలిగిన సంస్థలకు మధ్య ఒక అసమాన సంబంధాలను సృష్టిస్తుంది. ఒక నిర్దిష్ట వైద్య కారణాల కోసం తన ఆరోగ్య రికార్డ్ ను పంచుకునేందుకు ఒక రోగి తన అనుమతిని ఇవ్వవచ్చు. కానీ ఇలాంటి వ్యవస్థ చుట్టూ ఉండే విస్తృతమైన సమాచార ఆర్ధిక వ్యవస్థను అర్ధం చేసుకోగల సాంకేతిక సామర్ధ్యాన్ని కలిగి ఉండటం చాలా అరుదు. కాబట్టి, రోగినుండి తన డేటాను ఇచ్చేందుకు  అనుమతి పొందారా లేదా అన్నది సమస్య కాదు; సదరు రోగి ఆరోగ్య/అనారోగ్య సమాచారాన్ని సేకరించి, ప్రాసెస్ చేసి, ఒక విలువను సంపాదించే సంస్థల పైన ఆ రోగికి/వ్యక్తికి అర్థవంతమైన అధికారం ఉన్నదా లేదా అన్నదే సమస్య!

వ్యాధి పర్యవేక్షణ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరియు ఆరోగ్య సంరక్షణ నిర్వహణ లాంటి వాటిలో అజ్ఞాత ఆరోగ్య వివరాలను ఉత్పత్తి చేసేందుకు మరియు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేథస్సు) అప్లికేషన్ లకు (యాప్ లకు) మద్దతు కల్పించే విషయంలో డిజిటల్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కు గల శక్తియుక్తులను ప్రభుత్వమే స్వయంగా గుర్తించి పధక రచన చేసినందు వలనే ఈ సమస్యకు మరింత ప్రాముఖ్యత వచ్చి చేరింది. ప్రజా ఆరోగ్య వివరాల సేకరణ ద్వారా విస్తృత సౌకర్యాలు కల్పించవచ్చు అన్నది వాస్తవమే, కానీ, శక్తివంతమైన ప్రజాస్వామిక ఆరోగ్య పాలన అవసరం కూడా అంతే వాస్తవం. హెల్త్ డేటాను ఎవరు నియంత్రిస్తారు అన్న ప్రశ్న అంతిమంగా సామాజిక అధికారానికి సంబంధించిన ప్రశ్న.

డిజిటల్ క్లెయిమ్ లు, ఇన్సూరెన్స్ ద్వారా ఆరోగ్య సంరక్షణ యొక్క ద్రవ్యీకరణ (financialization)

మరొక ముఖ్యమైన పరిణామం ఏమిటంటే డిజిటల్ హెల్త్ రికార్డులు, ఇన్సూరెన్స్ మరియు డిజిటల్ క్లెయిమ్ ల మధ్య ఏకీకరణ (convergence -అన్నీ ఒక చోట కలవటం) జరగటం. ఒకసారి మెడికల్ రికార్డులు, రోగుల ఐడెంటిటీలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ వ్యవస్థలు పరస్పరం కలిసి పని చేయటం అంటూ జరిగితే, ద్రవ్య సంస్థలు, ఇన్సూరెన్స్ సంస్థలతో పాటు వైద్య సంబంధ వ్యవస్థల ద్వారా, అంతకంతకూ ఎక్కువగా ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాలను కూడా నిర్వహించటం సాధ్యం అవుతుంది. విస్తృత ఎబిడిఎం ఎకోసిస్టం లో నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్ఛేంజి (జాతీయ ఆరోగ్య క్లెయిమ్ ల పరిష్కార వ్యవస్థ) కూడా ఒక భాగంగా రూపొందించారు. తద్వారా ఆరోగ్య సేవలను, క్లెయిమ్ ల పరిష్కారాలను డిజిటల్ ప్రమాణాల ద్వారా అనుసంధానించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామన్న సంకేతం కూడా ప్రభుత్వం ఇచ్చింది.

సంపన్నులకు, అర్బన్ మధ్యతరగతి వర్గానికి ఈ తరహా సమన్వయం వలన ఇన్సూరెన్స్ ఆధారిత ఆరోగ్య సంరక్షణ మరింత సౌకర్యవంతం కావిస్తుంది. శ్రామిక వర్గ కుటుంబాలకు మాత్రం ప్రత్యక్ష మరియు పరోక్ష ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తాము భరించ గలమా లేదా అన్నదే ప్రధాన సమస్యగా ఉంటుంది. డిజిటల్ మార్గంలో క్లెయిమ్ ల చెల్లింపులు వేగవంతంగా జరగొచ్చు గానీ దాని వలన వైద్య చికిత్స ఖర్చు భరించ శక్యంగా చేయవచ్చని కాదు. కాబట్టి ఆరోగ్య సంరక్షణ ఖర్చుల చెల్లింపులో డిజిటల్ సామర్ధ్యంను, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను ఎవరు భరిస్తారన్న సామాజిక సమస్యను మార్క్సిస్టు దృక్పథం వేరు చేసి చూస్తుంది.

ఇన్సూరెన్స్ పధకాల ఖర్చును ప్రభుత్వమే భరించే వ్యవస్థ పరిధిలో ప్రైవేటు ఆసుపత్రుల విస్తరణకు కూడా ఇదే ప్రశ్న వర్తిస్తుంది. ఫిబ్రవరి 2026 నాటికి ప్రభుత్వం నిధులు సమకూర్చే హెల్త్ ఇన్సూరెన్స్ పధకం అయిన ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జాన్ ఆరోగ్య యోజన (ఎబి-పిఎంజెఎవై) కింద, 36,229 ఆసుపత్రులను చేర్చినట్టు ప్రభుత్వం వెల్లడి చేసింది. ఇందులో 19,483 ప్రభుత్వ ఆసుపత్రులు కాగా 16,746 ప్రైవేటు ఆసుపత్రులు. ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు దాదాపు సమాన స్థాయిలో ఉండటం బట్టి ఎంత భారీ స్థాయిలో ప్రభుత్వ నిధుల సరఫరా మరియు ప్రైవేటు ఆరోగ్య సేవల బట్వాడా పరస్పరం సంగమిస్తున్నాయన్న వివరాలు తెలియజేస్తున్నది. లబ్దిదారులు, ఆసుపత్రులు, రోగుల రికార్డులు మరియు క్లెయిమ్ లను అనుసంధానిస్తున్న డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ సంబంధాన్ని మరింత సమర్ధవంతం చేయవచ్చు, కానీ, ప్రభుత్వ డబ్బు ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సామర్ధ్యాన్ని శక్తివంతం చేస్తున్నదా లేక అంతకంతకూ ఎక్కువగా ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ మార్కెట్ల ద్వారా అది ప్రవహిస్తున్నదా అన్న రాజకీయ సమస్యను కూడా రేకెత్తిస్తున్నది.

డిజిటల్ హెల్త్ మరియు శ్రమ ప్రక్రియ (labour process)

ఆరోగ్య సంరక్షణ ను సాంఖ్యీకరణ (డిజిటలైజ్) చేయటం వలన శ్రమ ప్రక్రియలు పరివర్తనకు గురవుతున్నాయి. డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్ లైన్ లో ఉండి పని చేసే హెల్త్ వర్కర్లు అంతకంతకూ ఎక్కువగా కంప్యూటర్లలో డేటా టైప్ (ఎంటర్) చేయటానికి డిజిటల్ రికార్డులు నిర్వహించటానికి, సాఫ్ట్ వేర్ లను ఉపయోగించటానికి, అల్గారిధమిక్ రిపోర్టింగ్ వ్యవస్థలను అనుసరించటానికి తమ శ్రమను కేటాయించ వలసి వస్తున్నది. కొన్ని పరిస్ధితుల్లో ఈ పరికరాలు పేపర్ వర్క్ ను తగ్గిస్తుంది; కానీ ఆ పరికరాలు అడ్మినిస్ట్రేటివ్ శ్రమను అప్పటికే పని భారం ఎదుర్కొంటున్న వర్కర్ల పైకి మరింత పని భారం మోపుతున్నాయి. “స్వయం చాలక” (ఆటోమేటెడ్) పేరుతో ప్రవేశ పెడుతున్న  వ్యవస్థలు క్లర్కులు చేసే శ్రమను నర్సులు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, డాక్టర్ల మీదికి నెడుతున్నాయి.

డిజిటల్ పర్యవేక్షణ అన్నది డిజిటల్ పర్యవేక్షణ అంటే మేనేజింగ్ కంట్రోల్ గా మారిపోతుంది. రిజిస్ట్రేషన్లు, కన్సల్టేషన్లు, అప్ లోడ్లు, టార్గెట్ల పరిపూర్తి మొ.న అంశాలు ఉద్యోగి పనితనానికి సూచికలుగా అవతరిస్తాయి. ఈ పద్ధతి వలన సంక్లిష్ట సామాజిక మరియు వైద్య పరమైన వాస్తవ మానవీయ కార్యకలాపాలు డిజిటల్ పరిభాషలో కొలవగల పనులుగా లెక్కించే అవకాశాలను సృష్టిస్తుంది. ఫలితంగా డిజిటలైజేషన్ ప్రక్రియ ఆరోగ్య సంరక్షణ పనిని, మరిన్ని లెక్కించగల, ఒక దానితో ఒకటి పోల్చగల పనులుగా పరివర్తన చెందిస్తుంది. దరిమిలా శ్రమ సరుకీకరణ మరింత తీవ్రమై యాజమాన్య కాపలాలకు అనువుగా మారుతుంది.

ఆరోగ్య సంరక్షణ డిజిటల్ వేదికలుగా పరివర్తన

డిజిటల్ హెల్త్ అంటే కేవలం ఇప్పటికే ఉనికిలో ఉన్న మెడికల్ రికార్డులను డిజిటలైజ్ చేయటం ఒక్కటే కాదు. అది ఆరోగ్య సంరక్షణను డిజిటల్ వేదికల లోకి పరివర్తన చెందిస్తుంది. ఈ డిజిటల్ ప్లాట్ ఫారంలు రోగి – డాక్టర్, రోగి – ఔషధాల కంపెనీ, రోగి – రోగ నిర్ధారణ ప్రయోగశాల, రోగి – ఇన్సూరెన్స్ కంపెనీ సంబంధాలను నిర్వహించటం అంతకంతకూ పెరుగుతోంది. ఆరోగ్య సంరక్షణ తాలూకు చెల్లింపులను నిర్వహించే మధ్యంతర వ్యవస్థలుగా ఈ ప్లాట్ ఫారంలు మారుతున్నాయి.

మార్క్సిస్టు దృక్పథంలో, ఇది కూడా సరికొత్త పెట్టుబడి సంచయ క్షేత్రంగా అవతరిస్తుంది. ఈ ప్లాట్ ఫారంలు తమంతట తామే ఔషధాలను ఉత్పత్తి చేయటం గానీ లేదా వైద్య చికిత్సా సేవలను అందజేయటం గానీ చేయదు; కానీ రోగులు వైద్య సేవలను అందించే వారిని వెతకటంలో, అపాయింట్‌మెంట్ లు చేసి పెట్టటంలో, రికార్డులను ఒకరి నుండి మరొకరికి అందజేయటంలో, సేవలకు చెల్లింపులు చేయటంలో నిమగ్నమయ్యే డిజిటల్ ఇంటర్‌ఫేస్ ను నియంత్రిస్తుంది. ఆరోగ్య సేవల కార్యకలాపాలు డిజిటల్ ప్లాట్ ఫారం ల గుండా నడవటం పెరిగే కొద్దీ సాఫ్ట్ వేర్, డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వినియోగదారులు వినియోగించే అప్లికేషన్లు.. వీటన్నింటి పైనా నియంత్రణ చెలాయించే కంపెనీల ప్రాముఖ్యత పెరుగుతూ పోతుంది.

జూన్ 2026 లో ఎబిడిఎం లో సేవల వ్యవస్థగా ప్రవేశ పెట్టిన యూనిఫైడ్ హెల్త్ ఇంటర్‌ఫేస్ (యుహెచ్ఐ) ను గమనిస్తే ఈ ప్రయాణం ఎటు వైపు వెళ్తున్నదో అర్ధం అవుతుంది. యుహెచ్ఐ అందరికీ అందుబాటులో ఉంటూ సాధారణ సాంకేతిక ప్రమాణాలతో కూడిన ఒక బహిరంగ నెట్ వర్క్ అనీ, ఒకే ఒక అప్లికేషన్ లేదా యాప్ ను అంటి పెట్టుకుని ఉండటానికి బదులు అది రోగులు, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే కంపెనీలు అందరినీ వివిధ డిజిటల్ ప్లాట్ ఫారంల ద్వారా అనుసంధానించే వ్యవస్థ అనీ ప్రభుత్వం చెబుతోంది. పరస్పరం ఒకదానికొకటి అంతర్గతంగా అనుసంధానం చేసుకునే అవకాశం ఉంటే ఒకే ప్లాట్ ఫారం కు కట్టివేసే అవకాశాన్ని తగ్గించే మాట నిజమే. ఐతే ఆరోగ్య సంరక్షణలో మధ్యంతర డిజిటల్ కంపెనీలు మరియు నెట్ వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాముఖ్యతను కూడా ఇది మరింత పెంచుతుందన్న మాట కూడా నిజమే. కాబట్టి ఈ నెట్ వర్క్ లు నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉంటుందా లేక వాటి పైన వాణిజ్య ప్లాట్ ఫారం లు అసమాన నిష్పత్తిలో నియంత్రణ పొందుతాయా అన్నది రాజకీయ సమస్య అవుతుంది.

ముగింపు

కనుక ఇండియాలో డిజిటల్ ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ప్రధాన వైరుధ్యం సంప్రదాయానికి టెక్నాలజీకి మధ్య కాకుండా సామాజిక సంబంధాలకు మరియు సాంకేతిక పరిజ్ఞాన సామర్ధ్యానికి మధ్య నెలకొని ఉంటుంది. సాంకేతిక అనుసంధానం (కనెక్టివిటీ) తనంతట తానుగా సామాజిక అసమానతను సృష్టించదు. ప్రైవేటు పెట్టుబడి సంచయం, వాణిజ్య సమాచార సంగ్రహం మరియు అసమాన కొనుగోలు శక్తి అంశాల చుట్టూ డిజిటల్ ఆరోగ్య సంరక్షణ మౌలిక వ్యవస్థలను (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) నిర్వహించటం వలన అది పాత వర్గ విభజనలను కొత్తగా డిజిటల్ రూపంలో పునరుత్పత్తి చేస్తుంది. దానికి బదులు ప్రజా వినియోగం నిమిత్తం సార్వజనీన ఆరోగ్య సంరక్షణ తో అనుసంధానించి ప్రజాస్వామిక నియంత్రణలో నిర్వహిస్తే అది సామాజిక పురోగతికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. దరిమిలా, విప్లవకర వామపక్షాల కర్తవ్యం డిజిటలైజేషన్ ను విమర్శనా రహితంగా సంబర పడటం కాదు. లేదా స్వతహాగా అభివృద్ధి నిరోధక స్వభావంతో నిరాకరించటం కూడా కాదు. డిజిటల్ ఆరోగ్య సంరక్షణ పైన యాజమాన్యం, పాలన, లక్ష్యాల గురించి పోరాడటమే వామపక్ష కర్తవ్యం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను ఎవరు నియంత్రిస్తారు, సమాచారానికి (డేటా) సొంతదారు ఎవరు, శ్రమించేది ఎవరు, అంతిమ లబ్దిదారులు ఎవరు, ఈ వ్యవస్థకు బయట ఉండేది ఎవరు? ఇవే అసలైన ప్రశ్నలు. ఆరోగ్య సంరక్షణ అన్నది సార్వజనీన సామాజిక హక్కు; మార్కెట్ అవకాశాల కోసం తయారు చేసినది కాదు; పెట్టుబడి సంచయానికి బదులు సామాన్య ప్రజల ఆరోగ్యం మరియు ప్రతిష్ఠల పరిరక్షణ కోసమే సాంకేతిక పరిజ్ఞానం సేవలు అందించాలి.. ఈ సూత్రాల కేంద్రంగా మాత్రమే నిజాయితీతో కూడిన ప్రజాస్వామిక డిజిటల్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించాలి.

Leave a Reply