
–
అది 2003 వ సంవత్సరం.
అసలు అక్కడ ఉనికిలో లేని “సామూహిక విధ్వంసక మారణాయుధాలు” ఉన్నాయని చెబుతూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మిత్ర రాజ్యాలను వెంట బెట్టుకుని ఇరాక్ పైన విధ్వంసక దాడి చేసింది.
ఇది ఊహించి చెప్పింది కాదు; రికార్డులకు ఎక్కిన వాస్తవం.
గూఢచార సమాచారాన్ని వక్రీకరించారు లేదా తారుమారు చేశారు.
కృత్రిమ కేసు సృష్టించారు.
కృత్రిమంగా కేసుని సృష్టించిన వారికి అది కృత్రిమ కేసు అని స్పష్టంగా తెలుసు.
అది కృత్రిమ కేసే అని వారిలో కొందరు తమ జ్ఞాపక వృత్తాంతాల్లో (మెమోయిర్) అధికారికంగా (రికార్దెడ్ గా) చెప్పారు. యుద్ధం అవసరమని ప్రజలను నమ్మిన పత్రికలే ఆ జ్ఞాపకాల పుస్తకాల గురించి సానుకూలంగా సమీక్షించి పెట్టాయి.
మిలియన్ (పది లక్షల) మంది జనం చనిపోయారు.
ఆ దేశం మొదలంటా సర్వ నాశనం అయింది. మౌలిక నిర్మాణాలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు, దేశ సామాజిక నిర్మాణం… అన్నీ ధ్వంసం అయ్యాయి.
ఖాళీ అయిన అధికార స్థానాలను ఐఎస్ఐఎస్ (ఐసిస్) ఆక్రమించి భర్తీ చేసింది.
ఈ ప్రాంతం ఎంతగా అస్థిరం అయ్యిందంటే ఇప్పటికీ అక్కడ శవాలు కుప్పలు పడుతూనే ఉన్నాయి.
కానీ ఒక్క దోషి కూడా ఇంతవరకు జైలుకి వెళ్లలేదు.
–

యుద్ధ నిర్ణయానికి ప్రాణం పోసిన వ్యూహకర్తలు అందరూ ఇప్పుడు మేధో సంస్థలలో (ధింక్ ట్యాంక్) సీనియర్ ఫెలో లు గా అవతరించారు.
వాళ్లు పుస్తకాలు రాశారు. జ్ఞాపక వృత్తాంతాల పేరుతో రచనలు చేసి అమ్ముకున్నారు.
వాళ్లు తెలివిజన్ తెరల పైన “సునిశిత విదేశీ విధాన గొంతుకలు” గా ప్రత్యక్షం అయ్యారు.
వాళ్లలో కొందరు ఇప్పుడు ట్రంప్ వ్యతిరేక శిబిరంలో “హేతుబద్ధ గొంతుకలు” గా జనం ముందు నిలబెట్టబడుతున్నారు.
చరిత్ర పునరావృతం అవుతున్నది. అదే ప్రభుత్వం, అదే వ్యవస్థాగత పాత్రలు విదేశీ ప్రమాదం వచ్చి పడిందని, మిలటరీ ప్రయోగంతో స్పందించక తప్పదని చెబుతున్నారు.
ప్రపంచాన్ని అణ్వాయుధంతో నాశనం చేసేందుకు ఇరాన్ తయారుగా ఉందని నమ్మబలుకుతున్నారు.
ప్రజలు, కనీసం మెజారిటీ ప్రజలు, వాళ్ల మాటలను మళ్లీ నమ్ముతున్నారు.
ఈ జనం బుర్రలు ఏ పదార్ధంతో తయారు చేయబడ్డాయి? వారి ఆలోచనా శక్తిని ఎలా నిర్వహించాలి?
ఇది కేవలం అబద్ధం మాత్రమే కాదు.
ఇది ప్రభుత్వం చెబుతున్న అబద్ధం.
అమెరికా ప్రభుత్వం నిర్భీతిగా పదే పదే తిరిగి తిరిగి మళ్లీ మళ్లీ చెబుతున్న అబద్ధం.
జనం నమ్ముతూనే ఉన్నారు.
అడుగు భాగం అన్నది లేని, ఎప్పటికప్పుడు తాజాగా సిద్ధంగా ఉండగల, అబద్ధాన్ని ఇష్ట పూర్వకంగా నమ్మేందుకు తయారుగా ఉండే జనం సంసిద్ధతను ఏమని నిర్వచించాలి?
