పాకిస్తాన్ ని ఏలిన చివరి హిందూ రాజులు, హిందూ షాహీ


Mari-Indus temple constructed by Hindu-Shahi dynasty

ప్రస్తుతం పాకిస్తాన్ గా ఉన్న ప్రాంతం హిందూయిజం పుట్టిన చోట్లలో ఒకటి అని తెలిస్తే ‘అవునా?!’ అని అనుకోకుండా ఉండలేము. ప్రసిద్ధ యువ బ్రిటిష్ చరిత్ర కారుడు, ఆర్ట్ హిస్టారియన్, పలు అవార్డులు గెలుచుకున్న “షాటర్డ్ ల్యాండ్స్” పుస్తక రచయిత అయిన శ్యామ్ డ్యాల్ రింపిల్ ఈ విషయాన్ని అదే పుస్తకంలో వెల్లడించాడు.

అంతే కాదు, పురాతన భారతీయ జ్ఞాన సంపదగా చెప్పుకునే వేదాలలో మొట్ట మొదటిదయిన ఋగ్వేదం మొదటి సారి పురుడు పోసుకున్నది కూడా అప్పటి భారత ఉపఖండంలో భాగంగా ఉన్న ఇప్పటి పాకిస్తాన్ లోనే అని సామ్ చెబుతున్నాడు. ఈయన వెల్లడించిన చారిత్రక వాస్తవాలు అక్కడితో ఆగిపోలేదు. ప్రముఖ ప్రాచీన సంస్కృత భాషావేత్త, సంస్కృత వ్యాకరణ పితామహుడు అయిన పాణిణి, పురాతన సంస్కృత భాషా వ్యాకరణా సూత్రాలను పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ శివారు ప్రాంతాల్లోనే మొదటిసారి రచించారట.

అలాగే ఉపఖండంలో అత్యంత ముఖ్యమైన హిందూ దేవాలయాల్లో కొన్ని ప్రముఖమైనవి కూడా పాకిస్తాన్ ఉన్న ప్రాంతంలో నిర్మించబడ్డాయి. ఉదాహరణకి కాశ్మీర్ లోని శారదా పీఠం, బలోచిస్తాన్ లోని శక్తి పీఠం (హింగ్లాజ్ మఠం) ఇప్పటి పాకిస్తాన్ లోనే ఉన్నాయి.

అటువంటి పాకిస్తాన్ తో పాటు ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని కూడా కలుపుకుని ఉమ్మడిగా పాలించిన చిట్ట చివరి హిందూ రాజులు ఎవరై ఉంటారన్న ప్రశ్న ఆసక్తికరమైంది అనటంలో సందేహం లేదు.

A Gandharan Image of Greek Godess Athena

ఇప్పటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలు అప్పట్లో గాంధార ప్రాంతంగా పిలిచేవారు. ఇక్కడే పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ లను పాలించిన చిట్ట చివరి హిందూ రాజ వంశం ఉద్భవించింది. సదరు రాజవంశం పేరు “హిందూ షాహీ”. క్రీస్తు పూర్వ కాలంలో భౌద్ధ మతం పరిఢవిల్లిన ప్రాంతాలలో గాంధార ప్రాంతం కూడా ఒకటి.

క్రీస్తు పూర్వం 327 లో ఈ ప్రాంతాన్ని గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్ గాంధార ప్రాంతాన్ని జయించి తన ఇండో-గ్రీక్ సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. ‘గ్రీకు చక్రవర్తి’ జయించిన ‘భారత ఉపఖండం’ లోని భాగం కనుక, అలాగే భౌద్ధం కూడా గాఢంగా అల్లుకున్న ప్రాంతం కనుక ఇక్కడ శివుని విగ్రహంతో పాటు గ్రీకు దేవతలైన ఎధెనా, హెర్క్యూల్స్ లు, భౌద్ధ ప్రముఖులైన బుద్ధుడు, హరితి లు పూజలకు నోచుకున్నారు.

హిందూ షాహీ చక్రవర్తులకు అంతిమ దుర్గంగా నిలిచిన ప్రాంతం పేరు నందన. నందన కోట పాకిస్తాన్ తూర్పు ప్రాంతంలో అత్యంత ఎత్తైన సాల్ట్ పర్వత శ్రేణుల్లో నెలకొని ఉంటుంది.

హిందూ షాహీ వంశం క్రీస్తు శకం 822 నుండి క్రీ.శ 1026 వరకు వర్ధిల్లింది. హిందూ షాహీ వంశాన్ని కాలరపాల క్రీ.శ 822 లో స్థాపించాడు. టర్క్ షాహీ వంశ రాజు లగాతుర్మాన్ ని ఓడించి హిందూ షాహీ వంశ పాలనను కాలరపాల స్థాపించాడు. ఆయన వారసుడు సామంత దేవ కొద్ది కాలం పాటు కాబూల్ నగరాన్ని సఫారీద్ (ఇప్పటి తూర్పు ఇరాన్ ని పాలించిన అప్పటి పాలకులు) రాజులకు కోల్పోయినప్పటికీ ఆయన తర్వాత రాజ్యం చేపట్టిన లల్లియ కాబూల్ ని తిరిగి వశం చేసుకున్నాడు.

రాజు లల్లియ, కాబూల్ ని వశం చేసుకోవడంతో పాటు ఇప్పటి ఆగ్నేయ ఇరాన్ ప్రాంతం అయిన అప్పటి జబూలిస్తాన్ ను కూడా ఆక్రమించాడు. అప్పట్లో కాశ్మీర్ ని పాలిస్తున్న ఉత్పల పాలకులతో కూడా తలపడ్డాడు రాజు లల్లియ.

హిందూ షాహీ వంశంలో పేరు పొందిన పాలకుడు భీమదేవ. భీమదేవ వారసుడు జయపాల, ఘజ్నవిడ్ వంశ పాలకుల నుండి ఘర్షణలను ఎదుర్కొన్నాడు.

A Temple at Nandana Fort built by Hindu-Shahis

ప్రఖ్యాత పర్షియన్ బహుళ శాస్త్ర పండితుడు అబు రహ్మాన్ ఆల్-బిరూని రచనల్లో హిందూ షాహీ వంశ పాలన గురించిన వివరాలు కొంచెం కొంచెం గా ఇవ్వబడ్డాయి. నందన కోట పై నుండి చుట్టు పక్కల ప్రాంతాన్ని, ముఖ్యంగా పంజాబ్ ప్రాంతాన్ని వీక్షించిన ఆల్-రూబిన్ భూమి చుట్టు కొలతను అంచనా వేశాడని ప్రతీతి.

అమెరికన్ నావికుడు కొలంబస్ మొదట భూమి గుండ్రంగా ఉందని అంచనా వేశాడని పశ్చిమ చరిత్రకారులు గొప్పలు చెప్పుకున్నప్పటికీ వాస్తవంగా అంతకు రెండు వేల సం.ల పూర్వమే పైధాగరస్, అరిస్టాటిల్ లాంటి వాళ్ళు భూమి గుండ్రంగా ఉందని అంచనా వేశారు. కొలంబస్ కి 500 యేళ్ళ క్రితం జీవించిన పర్షియన్ శాస్త్రకారుడు అబు రహ్మాన్ ఆల్-రూబిన్ కూడా భూమి గుండ్రంగా ఉందని అంచనా వేశాడు.

ఇంకా చెప్పాలంటే కొలంబస్ పుట్టక మునుపే అమెరికా ఖండంలో ప్రజలు నివసించారు. మంగోలాయిడ్లు అయిన రెడ్ ఇండియన్ లు చరిత్ర పూర్వ కాలం నుండే అమెరికా ఖండంలో నివసించగా 15 వ శతాబ్దంలో పుట్టి గతించిన కొలంబస్ అమెరికా ని కనిపెట్టాడని పశ్చిమ దేశాలు చెప్పటం లేని ఖ్యాతిని దక్కించుకునే ప్రయత్నమే.

మన ప్రాధమిక పాఠశాలల్లోని పాఠ్య గ్రంధాలు కూడా అదే విధంగా చెప్పటం, ఈ అంశాన్ని భారత పాలకులు కూడా అనుమతించటం ఏమిటో బొత్తిగా అర్ధం కాని విషయం. బ్రిటిష్ వాడు వచ్చి వాడి పాలనకు అనుగుణంగా భారత దేశ చరిత్రను హిందూ, బౌద్ధ, ముస్లిం కాలాలుగా విభజించి చెప్పినా మన పాలకులు సహించటమే కాక తమదిగా స్వీకరించటం అంటే పశ్చిమ కాల్పనిక కధలను వాస్తవాలుగా అంగీకరించటమే.

ఆల్-బిరూని నందన కోటను సందర్శించటానికి కొంత కాలం ముందు అదే హిందూ షాహీల పాలనకు రాజధానిగా ఉండేది. ఆల్-బిరూని సందర్శన నాటికి నందన కోట శిధిలం కావటం ప్రారంభం అయింది.

“హిందూ షాహీ వంశం ఇప్పుడు అంతరించింది. ఈ మొత్తం కోటలో వారి ఉనికిని తెలియజేసే ఏ ఒక్క సాక్షం కూడా ఇక్కడ లేకుండా పోయింది. ఏది మంచో, ఏది ఉత్తమమో అది చేయటానికి హిందూ షాహీ వంశం ఏనాడూ వెనకడుగు వేయలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. వాళ్లు ఉదాత్తమైన ఆలోచనలు, వ్యక్తిత్వం కలిగిన పాలకులు” అని ఆల్-రుబిని తన రచనల్లో పేర్కొన్నాడు.

Nandana Fort, the Final Capital of the Hindu Shahis

వ్యాఖ్యానించండి