
ఇరాన్ అభివృద్ధిని అణగదొక్కి, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ను తిరుగులేని శక్తిగా అవతరింప జేయాలన్న కాంక్షతో అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన ఇరాన్ యుద్ధం సత్ఫలితాలను ఇవ్వటం లేదని పశ్చిమ దేశాల కార్పొరేట్ పత్రికలు మొత్తుకుంటున్నాయి.
ఇరాన్ అణు విధానంను సాకుగా చూపిస్తూ ఇరాన్ తన చమురు అమ్ముకోనివ్వకుండా అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు 45 యేళ్లుగా ఆంక్షలు విధించి అమలు చేస్తున్నాయి. ప్రపంచ అణు పెత్తనం కోసం అమెరికా, ఐరోపా లు ఏర్పాటు చేసిన అంతరాతీయ అణు ఇంధన సంస్థ (Internationa Atomic Enerty Agency – IAEA) అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల తరపున ఇరాన్ దేశం అణు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి సాధించకుండా సహకరిస్తూ వచ్చింది.
ఇరాన్ అభివృద్ధి నిరోధించటానికి ఇరాన్ చమురు అమ్మకాలపై ఆంక్షలు విధించటం ప్రధాన అస్త్రంగా అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు అమలు చేస్తున్నాయి.
“చమురు అమ్మకాలు లేకపోతే ఇరాన్ ఆర్ధిక వృద్ధి కుంటుబడుతుంది. ప్రజల ఆర్ధిక కార్యకలాపాలు బలహీన పడతాయి. ఇరాన్ ఆర్ధిక వ్యవస్థ బలహీన పడుతుంది. ఫలితంగా ఇరాన్ ప్రజల్లో ఇరాన్ ను పాలిస్తున్న ఇస్లామిక్ రివల్యూషనరీ ప్రభుత్వం పైన అసమ్మతి పెరుగుతుంది. అసమ్మతి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు దారి తీస్తుంది. చివరికి ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఇరాన్ ప్రజలు తిరుగుబాటుతో కూల్చివేస్తారు. అప్పుడిక తమకు అనుకూల ప్రభుత్వాన్ని ప్రతిష్టించి ఇరాన్ చమురు సంపదనను తనివి తీరా ఆరగించవచ్చు”
ఇదీ అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల (ప్రధానంగా యుకె, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ) దుర్మార్గమైన ఎత్తుగడ! ఈ ఎత్తుగడతోనే ఇరాన్ బైటి నుండి ఇరాన్ లోపల ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ ఐరోపా దేశాలు రెచ్చగొడుతూ వచ్చాయి. కానీ అవేవీ సఫలం కాలేదు.
సఫలం కాకపోగా గట్టి ప్రయత్నంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పైన యుద్ధం ప్రారంభించాయి. కానీ ఇరాన్ ప్రభుత్వం బలహీనం కావటానికి బదులు మరింత బలపడుతున్నది. ఇరాన్ చమురు ఆదాయం తగ్గకపోగా యుద్ధ కాలంలో రెట్టింపు అయిందని యుకె కు చెందిన ది ఎకనమిస్ట్ పత్రిక నెత్తీ నోరు బాదుకుంటోంది.
6 వారాల పాటు ఎడతెరిపి లేకుండా ఇరాన్ పైన మిసైళ్ల వర్షాన్ని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కురిపించాయి. ప్రజల ఆస్తులను, నిర్మాణాలను నాశనం చేశాయి. రోడ్లు, వంతెనలను కూల్చేశాయి. యుద్ధం మూలంగా హోర్ముజ్ జలసంధి మూసివేతకు గురయింది. పర్షియన్ అఖాతం, హోర్ముజ్ జలసంధి ల ద్వారా గల్ఫ్ దేశాల నుండి చమురు రవాణా బంద్ అయింది. అంటే కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యుఏఈ, కతార్ దేశాల నుండి కూడా చమురు, గ్యాస్ ల రవాణా ఆగిపోయింది. గల్ఫ్ దేశాల ఆర్ధిక కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.
కానీ ఇరాన్ చమురు ఎగుమతి మాత్రం కొనసాగింది. పైగా యుద్ధం వలన చమురు ధరలు పెరగడంతో ఇరాన్ చమురు ఆదాయం యుద్ధం ముందరి కంటే పెరిగింది. ఇరాన్ చమురు, గ్యాస్ ఆదాయం రెట్టింపు అయిందని ది ఎకనమిస్ట్ పత్రిక లెక్కలు వేసి తేల్చింది.
ది ఎకనమిస్ట్ ప్రకారం ఇరాన్ ప్రస్తుతం రోజుకు 2.4 నుండి 2.8 మిలియన్ బ్యారెళ్ళ ఆయిల్ ఎగుమతి చేస్తున్నది. ఇందులో రోజుకు 1.8 మిలియన్ బ్యారెళ్ళు క్రూడాయిల్ ఉన్నది. యుద్ధానికి ముందు ఇరాన్ చమురు ఎగుమతి రోజుకు 1.1 నుండి 1.18 మిలియన్ బ్యారెళ్ళు మాత్రమే జరగడం గమనార్హం.
యుద్ధ కాలంలో ఇరాన్ చమురు ఎగుమతి పెరగటానికి ప్రధాన కారణం చైనా దిగుమతి పెరగడమే అని తెలుస్తున్నది. చైనాతో పాటు చుట్టు పక్కల దేశాల్లో చిన్న చిన్న రిఫైనరీలు ఇరాన్ చమురు ను ఇబ్బడి ముబ్బడిగా కొనుగోలు చేశాయి. యుద్ధం కారణంగా ఏర్పడిన అనిశ్చిత పరిస్ధితుల వలన చమురు ధరలు బ్యారేల్ కు 65 డాలర్ల నుండి 115-120 డాలర్ల వరకు పెరగడంతో ఇది ఇరాన్ కు కలిసి వచ్చింది. యుద్ధానికి ముందు అమెరికా, ఐరోపా ఆంక్షల వలన తన చమురును రాయితీ ధరలకు అమ్ముకోవలసి వచ్చేది.
- చైనా చమురు దిగుమతులు పెరగడం
- యుద్ధ కాలపు పరిస్ధితి ఇరాన్ చమురు ఎగుమతికి అనుకూలంగా మారటం
- ఆసియా మార్కెట్లకు ఎగుమతులు పెంచటం లాంటి ప్రత్యామ్నాయ ఎత్తుగడలను ఇరాన్ అనుసరించటం
- టీపాట్ రిఫైనరీలకు (చిన్న చిన్న స్వతంత్ర రిఫైనరీలు) చమురు సరఫరా పెరగటం
- రాయితీ ధరలకు బదులు పెరిగిన గ్లోబల్ మార్కెట్ ధరలకు ఇరాన్ చమురు సరఫరా కావటం
ఈ కారణాలతో యుద్ధ కాలంలో ఇరాన్ చమురు ఆదాయం రెట్టింపు అయింది. యుద్ధం ఫలితాలు ఎప్పుడూ అనుకున్నట్లుగా ఉండబోవని ఇరాన్ యుద్ధం మరోసారి రుజువు చేసింది.
ప్రపంచంపై వాణిజ్య, రాజకీయ పెత్తనం సాగిస్తున్న బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ దేశాలను ఓడించి ప్రపంచ పెత్తనాన్ని వశం చేసుకుందామని రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించిన హిట్లర్ నేతృత్వం లోని జర్మనీ, జోసెఫ్ స్టాలిన్ నాయకత్వం లోని సోవియట్ రష్యా దెబ్బకు చతికిల బడి సర్వ శక్తులూ కోల్పోయి రెండు జర్మనీలుగా ఉనికి కొనసాగించాల్సిన పరిస్ధితి ఏర్పడింది.
డాలర్లకు బదులు యూరో చెల్లింపులతో చమురు అమ్మకాలు చేయాలన్న సద్దాం హుస్సేన్ పధకంతో బెదిరిపోయి ఇరాక్ దేశం పై హంతక దురాక్రమణ యుద్ధానికి తలపడిన అమెరికా మరి కొన్ని సంవత్సరాల్లోనే ఇరాక్ ప్రజల ప్రతిఘటన ధాటికి తోకముడిచి ఆ దేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయింది. ఇంకోపక్క తాలిబాన్ ను అణచివేస్తానని చెబుతూ ఆఫ్ఘనిస్తాన్ పై దురాక్రమణ యుద్ధానికి తెగబడి రెండు దశాబ్దాల పాటు యుద్ధం చేసినా కూడా తాలిబాన్ ని ఓడించలేక, అదే తాలిబాన్ కి అధికారం అప్పగించి జారిపోతున్న పంచె ఎగలాక్కుంటూ ఆఫ్ఘనిస్తాన్ నుండి పారిపోయింది అమెరికా.
తగుదునమ్మా అంటూ ఇరాన్ ని మట్టి కరిపిస్తానని ప్రగల్భాలు పలికి ఆరు వారాల పాటు దాడులు చేసినా ఆ దేశం లొంగకపోవటంతో పాకిస్తాన్ తో కబురు పంపి సీఫ్ ఫైర్ కోసం బ్రతిమిలాడింది అమెరికా. పైకి మాత్రం ఇరాన్ ను క్షమించేది లేదని గొప్పలు పోతూ ఇరాన్ తో చర్చల నుండి, యుద్ధం నుండి ఎలా బైట పడటమా అని అమెరికా ఇప్పుడు దారి కోసం వెతుక్కుంటోంది.
ఇరాన్ మాత్రం హోర్ముజ్ జలసంధి పైన పట్టు బిగించి, అంతర్జాతీయ చమురు రవాణా ట్యాంకర్ల నుండి టోల్ ట్యాక్స్ వసూలు చేసేందుకు మార్గం ఏర్పరుచుకుని, అమెరికా వ్యతిరేక-ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రతిఘటన ను మరింత బలోపేతం చేసుకుని, చమురు ఆదాయం రెట్టింపు చేసుకుని చిద్విలాసంగా ఫాసిస్టు జియోనిస్టు సామ్రాజ్యవాద కూటమికి సవాలు విసురుతోంది.