ఇండియా తలసరి జిడిపి: మోడికి ముందు తర్వాత!

–

తన నేతృత్వంలోని బిజెపి హయాంలో భారత దేశం స్థూల జాతీయోత్పత్తి అనేక రెట్లు పెరిగిందని, తన కింద ఇండియా శర వేగంతో అభివృద్ధి చెందిన దేశంగా మారుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తరచూ చెప్పుకుంటూ ఉంటారు. ప్రధమ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ ప్రధాన మంత్రులను విమర్శిస్తూ ఎగతాళి చేస్తూ తన ముందు వాళ్లు ఎన్ని విధాలుగా దిగదుడుపో వివరించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తన దివ్యమైన పాలన పుణ్యమా అని భారతదేశం సకల రంగాల్లో వెలిగిపోతోందని చెబుతూ ఉంటారు.

నిజానికి ద్రవ్యోల్బణం వల్ల అయితేనేమీ, ఇతరరేతర కారణాల వల్లనైతేనేమీ స్థూల జాతీయోత్పత్తిని సూచించే అంకెలు మామూలుగానే పెరుగుతూ ఉంటాయి. మోడి హయాం ప్రారంభమయిన గత 12 యేళ్ల కాలంలో మోడి ప్రభుత్వం రెండు సార్లు జిడిపి అంకెలను లెక్కించే పునాది సంవత్సరాన్ని (బేస్ ఇయ్యర్) మార్చింది.

మొదటి సారి అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే అనగా 2015 లో పునాది సంవత్సరాన్ని 2004-05 నుండి 2011-12 సంవత్సరానికి మార్చారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2026 లో బేసి సంవత్సరాన్ని 2011-12 నుండి 2022-23 కు మార్చారు. ఈ మార్పుల ద్వారా జిడిపి వృద్ధి రేటు, జిడిపి, తలసరి జిడిపి మొదలైన మేక్రో ఎకనమిక్స్ సూచికలను కృత్రిమంగా పెంచి చూపించింది మోడి ప్రభుత్వం.

జిడిపి పర్ కేపిటా పోలిక

అయినప్పటికీ 2014 మరియు 2026 లలో ఇండియా తలసరి జిడిపి, బంగ్లాదేశ్ తలసరి జిడిపి తో పోల్చితే తగ్గిపోయిన విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ -ఐఏంఎఫ్) ప్రచురించిన వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ లో వెల్లడి చేసింది.

2014 లో ఇండియా తలసరి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జిడిపి) 1.573 డాలర్లు ఉండగా బంగ్లాదేశ్ తలసరి జిడిపి కేవలం 1,118 డాలర్లు మాత్రమే. అంటే ఇండియా తలసరి జిడిపి, బంగ్లాదేశ్ తలసరి జిడిపి కంటే 40 నుండి 45 శాతం ఎక్కువగా నమోదు అయింది.

కానీ 12 యేళ్ళ పాటు నరేంద్ర మోడి పరిపాలన సాగిన తర్వాత ఈ పరిస్ధితి తిరగబడింది. బంగ్లాదేశ్ తలసరి జిడిపి ఇండియా తలసరి జిడిపి ని దాటి పోయింది. 2026 సం.లో బంగ్లాదేశ్ తలసరి జిడిపి 2,911 డాలర్లు నమోదు కాగా ఇండియా తలసరి జిడిపి 2,812 డాలర్లుగా నమోదయింది.

12 యేళ్ల తర్వాత ఓడలు బళ్లయ్యాయి, బండ్లు ఓడలయ్యాయి. 2014 లో బంగ్లాదేశ్ తలసరి జిడిపి కంటే ఇండియా తలసరి జిడిపి 40 నుండి 45 శాతం ఎక్కువ నమోదు చేస్తే, 2026 కి వచ్చేసరికి బంగ్లాదేశ్ దేశమే ఇండియా కంటే 3.5 శాతం ఎక్కువ తలసరి జిడిపి ని నమోదు చేసింది.

ఆబ్సల్యూట్ అంకెల్లో చూస్తే ఇండియా నమోదు చేసే జిడిపి అంకెలు పెద్దవిగా ఉండొచ్చు. కానీ ఒక దేశం యొక్క ఆర్ధిక గణాంకాల పస ఏమిటి అన్నది మరో దేశంతో పోల్చినప్పుడే తెలుస్తుంది. ముఖ్యంగా తన కంటే పెద్ద, బలమైన ఆర్ధిక వ్యవస్థలతో పోల్చినపుడే ఒక దేశం యొక్క ఆర్ధిక ప్రగతి తెలుస్తుంది. కానీ ఇక్కడ బలమైన దేశానికి బదులు బలహీనమైన దేశంతో పోల్చి చూసినా కూడా ఇండియా ఆర్ధిక పరిస్ధితి బలహీనంగా ఉండటం గమనార్హం.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తరచూ పాకిస్తాన్ తో ఇండియా ప్రగతిని పోల్చుతూ ఉంటారు. పాక్ కంటే ఇండియా ఎంత ప్రగతి సాధించిందో చెబుతూ ఉంటారు. ఇండియా నుండి విడిపోయిన ఒక ముస్లిం దేశంతో ఇండియా ప్రగతిని పోల్చాలన్న ఉబలాటం ఇందులో వ్యక్తం అవుతుంది.

స్పందించండి