
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నెత్తిన పిడుగు లాంటి వార్తను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జార విడిచాడు. కేంద్రం లోని నరేంద్ర మోడి ప్రభుత్వంలో పని చేస్తున్న 200 మందికి పైగా బ్యూరోక్రాట్ అధికారులు, 50 మందికి పైగా పోలీసు అధికారులు తనతో టచ్ లో ఉన్నారని రాహుల్ గాంధీ వెల్లడించాడు. వారంతా గ్యానేష్ కుమార్ వ్యతిరేక ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని ఆయన వెల్లడించాడు.
“ఇది వింటే మీరు షాక్ తింటారు. మోడీజీ! నేను మీకు చెబుతున్నాను వినండి. మీ ప్రభుత్వంలో పని చేస్తున్న 200 మందికి పైగా అధికారులు నాతో నిరంతరం టచ్ లో ఉన్నారు. ఎన్-ఫోర్స్-మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), విదేశాంగ మంత్రిత శాఖ ల్లో పని చేస్తున్న అధికారులు నాకు సమాచారం అందిస్తున్నారు” అని రాహుల్ గాంధీ బాంబు లాంటి వార్తను దేశ ప్రజల చెవిన, ప్రధాని మోడి చెవిన వేశారు. “మీకు ఇష్టం వచ్చింది మీరు చేసుకోవచ్చు. కానీ నిజాలు నా చేతుల్లో ఉన్నాయి” అని రాహుల్ గాంధీ ప్రకటించాడు.
“వివిధ పోలీసు విభాగాల అధికారుల్లో ఖచ్చితంగా 50 శాతం మంది మేము చేస్తున్న ఆందోళన సరైందే అని కితాబు ఇస్తున్నారు. మీరు ఆందోళన కొనసాగించండి అని మద్దతు ఇస్తున్నారు. పోలీస్, ఇండియన్ టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సి.ఆర్.పి.ఎఫ్), ఒక పక్కన ఉంటే నరేంద్ర మోడి, అమిత్ షా, అజిత్ దోవల్, గ్యానేష్ కుమార్, ఇంకా ‘వోట్ చోరీ’ కి మార్గం సుగమం చేస్తున్న నలుగురు లేదా ఐదుగురు ఎన్నికల కమిషన్ అధికారులు మొ.న వాళ్ళంతా మరొక పక్క ఉన్నారు. ఈ విభజనను మేము మరింత విస్తృతం చేస్తున్నాము” అని రాహుల్ గాంధీ ప్రకటించాడు.
ఇది నిజమే అయితే చీఫ్ ఎన్నికల కమిషనర్ కు మూడినట్టే. ఎందుకంటే ప్రభుత్వంలో అంతర్గతంగా జరిగే నిర్ణయాలు, వాటికి వ్యతిరేకంగా వ్యక్తం అయ్యే అభ్యంతరాలు, సదరు అభ్యంతరాలను బెదిరించి భయపెట్టి తొక్కి పెట్టే మంత్రులు మరియు అధికారులు ఇత్యాది సమాచారం పూర్తిగా కాకపోయినా, కొంత అయినా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేతిలో ఉన్నట్టు లెక్క.
అవినీతి నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు, వాటి పర్యవసానాల నుండి రాజకీయ నాయకులైన మోడి, అమిత్ షా లు ఎలాగో తప్పించుకోగలరు. కానీ గ్యానేష్ కుమార్ కు అంత సౌకర్యం అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రభుత్వ నిర్ణయాలు, ఆదేశాలు ప్రధానంగా వివిధ సెక్రటరీల సంతకాలతోనే వెలువడుతాయి. మంత్రుల నిర్ణయాలు ప్రభుత్వ కేబినెట్ ఉమ్మడి నిర్ణయాలుగా చెలామణి అవుతాయి తప్ప వ్యక్తిగత నిర్ణయాలుగా ఉండబోవు; ఆర్ధిక అవినీతిలో దొరికితే తప్ప!
గ్యానేష్ కుమార్ నుండి కూడా తనకు రెగ్యులర్ గా సందేశాలు వస్తున్నాయని అర్ధం వచ్చేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించాడని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక చెబుతోంది. ఇవి ఏ విధమైన సందేశాలు అన్నది సమాచారం ఇవ్వలేదు. ఎన్నికల అక్రమాలపై ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్న నేపధ్యంలో గ్యానేష్ కుమార్ నిద్ర లేని రాత్రులు గడుపుతున్న సంగతి తనకు తెలుసని, ఆయన పదవి నుండి దిగేలా తాము అన్ని చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ విలేఖరులతో అన్నాడు.
సిఈసి గ్యానేష్ కుమార్ తో మీరు మాట్లాడారా అన్న విలేఖరుల ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాహుల్ గాధి “నాకు క్రమం తప్పకుండా సందేశాలు వస్తున్నాయి” అని జవాబిచ్చాడు. గ్యానేష్ నుండి సందేశాలు వస్తున్నాయా లేక గ్యానేష్ గురించి ఇతరుల నుండి సందేశాలు వస్తున్నాయా అన్న సంగతి రాహుల్ నుండి వివరణ లేదు.
గ్యానేష్ కుమార్ కు మీరు సందేశం ఇస్తారా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు “మీరు నేరం చేశారు. అయితే మీరు ప్రధాన నేరస్థులు కాదు. మీరొక తప్పు చేశారు, కానీ ఆ తప్పు వెనక మీ మైండ్ లేదు. మీరు చేసిందానికి వెనుక ఎవరు ఉన్నారో వారే మా లక్ష్యం. ప్రధాన మంత్రి, అమిత్ షా, అజిత్ దోవల్ లు బలవంత పెట్టి మీ చేత ఈ పనులు చేయించారు” అని రాహుల్ గాంధీ బదులిచ్చాడు.
“పోలీసు ఉన్నతాధికారులు, ఇతర పోలీసుల నుండి మాకు రిపోర్ట్ లు వస్తున్నాయి. పోలీసుల్లో అనేక మంది ఒత్తిడిలో ఉన్నారని, బాధలో ఉన్నారని తెలుస్తున్నది. ఎందుకంటే పిల్లలను యువకులను లాఠీలతో చితకబాదాలని వారికి ఆదేశాలు వస్తున్నాయి. మరో పక్క ఆర్ఎస్ఎస్ సభ్యులకు స్వేచ్ఛగా సంచరిస్తూ వారు చేస్తున్నదాన్ని చేయనివ్వాలని ఆదేశాలు వారికి వస్తున్నాయి. అనేక మంది పోలీసు అధికారులు తమ ఆందోళన కొనసాగించాలని కోరుతున్నారు.” అని రాహుల్ గాంధీ వెల్లడించాడు.
కాగా ఈ రోజు (అక్టోబర్ 12 తేదీ) ప్రతిపక్ష పార్టీల పార్లమెంటు సభ్యులు, ఆందోళనకారులతో కలిసి సుప్రీం కోర్టుకు ప్రదర్శనగా వెళ్లాలని ప్రతిపక్ష పార్టీల కూటమి INDIA నిర్ణయించింది. ఈ ఆందోళన ప్రదర్శనలో పాల్గొనాలని ప్రజలందరికీ రాహుల్ విజ్ఞప్తి చేశాడు. ఈ నేపధ్యంలో కనీసం ఆరు మెట్రో స్టేషన్లను పోలీసులు మూసివేశారు. వాస్తవంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కు ఎన్నికల అక్రమాలపైన మెమోరాండం ఇవ్వాలన్నది ప్రతిపక్షాల పధకం. కానీ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలపై పోలీసులు విరుచుకు పడటం, ప్రతిపక్ష రాజకీయ పార్టీల ఆందోళనలు, ఎస్.ఐ.ఆర్ అక్రమాలపై తాను చేస్తున్న విచారణ… ఇన్ని అంశాల మధ్య తాను ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడటం చట్ట రీత్యా వీలు కాదని చెబుతూ ప్రతిపక్షాలతో చర్చలకు చీఫ్ జస్టిస్ నిరాకరించాడు. అయినప్పటికీ సుప్రీం కోర్టుకు ప్రదర్శనగా వెళ్తామని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి


