లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహోల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎం.పి లు అనూహ్య రీతిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇంటి ముందు రెండు గంటలకు పైగా ధర్నా నిర్వహించారు. ప్రధాని ఇంటి ముందు ధర్నా నిర్వహించబోతున్న సంగతిని కాంగ్రెస్ పార్టీ చివరి వరకు రహస్యంగా ఉంచింది. చివరికి పోలీసులు హుటా హుటిన వచ్చి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ తదితర నాయకులను అరెస్ట్ చేయటంతో ధర్నా ముగిసినట్లు తెలుస్తున్నది.
సోమవారం నాడు సిజెపి నాయకత్వంలో విద్యార్ధులు, యువకులతో సహా వేలాదిమంది ఛలో పార్లమెంటు పేరుతో జంతర్ మంతర్ నుండి ప్రదర్శన నిర్వహిస్తుండగా పోలీసులు విరుచుకు పడి లాఠీ చార్జి చేయటంతో అనేక మంది ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు లాఠీలతో విరుచుకు పడటంతో పాటు మహిళలు, ఆడ పిల్లలు అన్న విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో ప్రదర్శనకారులు తిరగబడి పోలీసులపై రాళ్ళ దాడికి పాల్పడ్డారు. దానితో జంతర్ మంతర్ ప్రాంతం రణ భూమిగా మారిపోయింది.
విద్యార్ధులపై లాఠీచార్జిని నిరసిస్తూ రాహుల్ గాంధీ నాయకత్వంలో మోడి ఇంటి ముందు ధర్నా నిర్వహించేందుకు నిర్ణయించింది. అయితే ధర్నా గురించి ముందే ప్రకటించకుండా కాంగ్రెస్ జాగ్రత్త వహించినట్లు తెలుస్తోంది. ముందే ప్రకటించినట్లయితే పోలీసులు అడ్డంకులు నిలుపుతారన్న ఆలోచనతో ధర్నా సమాచారాన్ని చివరి వరకు వెల్లడి చేయకుండా జాగ్రత్త పడ్డారు.
మొదట పోలీసు దాడిలో గాయపడ్డ విద్యార్ధులు, యువకులను పరామర్శిందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక తదితర ప్రతిపక్ష నేతలు, ఎం.పి లు రామ్ మనోహర లోహియా ఆసుపత్రి సందర్శించారు. అనంతరం ప్రధాని ఇంటి ముందు ధర్నాకు వెలుతున్న సంగతిని పార్టీ నాయకులు ఇతరులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. మంగళవారం మధ్యాహ్నానికి లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాన మంత్రి నివాసానికి నేరుగా వెళ్ళి అక్కడే ధర్నా ప్రారంభించారు.
ప్రధాన మంత్రి, హోమ్ మంత్రి ల దూతగా బిజెపి కి చెందిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ధర్నా ప్రాంతాన్ని సందర్శించారు. ఆయనతో పాటు హోమ్ కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా ప్రభుత్వ దూతగా ధర్నా చేస్తున్న నాయకులను సందర్శించారు. వారి డిమాండ్లు ఏమిటో చెప్పాలని కోరారు. రాహుల్ గాంధీ రెండు డిమాండ్లను కేంద్ర మంత్రి, హోమ్ కార్యదర్శి ల ముందు ఉంచినట్లు తెలుస్తోంది.
- నీట్ పరీక్ష, మరియు సిజెపి నిరసన కార్యక్రమం గురించి పార్లమెంటులో చర్చలకు అనుమతించాలి.
- నీట్ ప్రశ్న పత్రం లీక్ కు బాధ్యత వహించి విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
మొదటి డిమాండ్ కు అంగీకరించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, విద్యా మంత్రి రాజీనామాకు అంగీకరించకుండా అక్కడి నుండి వెనుదిరిగి వెళ్లారు. ఆ తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ జితేంద్ర సింగ్, రాహుల్ గాంధీ తన డిమాండ్లను మార్చుతూ పోయారని, ప్రతిపక్ష నాయకుడి స్థాయిలో ఉన్న వ్యక్తి మాటలు మార్చటం తగదని విమర్శించాడు. నీట్ పరీక్ష, సోమవారం జరిగిన లాఠీ చార్జి గురించి పార్లమెంటు లో చర్చించేందుకు తాను అంగీకారం తెలిపానని, కానీ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మరో డిమాండ్ జత చేశారని ఆరోపించారు.













“నిన్న యువ విద్యార్ధులపై పోలీసులు పాల్పడిన క్రూరత్వానికి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మేము ప్రధాన మంత్రి మోడి ఇంటి వద్దకు మార్చి నిర్వహించాము. భారతదేశ యువతకు భవిష్యత్ నాశనం చేసిన ప్రధాన మంత్రి, హోమ్ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి” అని రాహుల్ కోరారు.
“ప్రతి దేశభక్తిపరుడు తమ ఆందోళనలో జత కలవాలి” అని ప్రధాన మంత్రి ఇంటి ముందు నిలబడి రాహుల్ పిలుపు ఇచ్చాడు. “విద్యార్ధులపై దాడి అంటే అది ప్రతి భారతీయుడి కుటుంబం పైన చేసిన దాడి. ప్రజలకు సమాధానం ఇవ్వకుండా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోకుండా తప్పించుకోవచ్చని ప్రధాన మంత్రి మోడి భావిస్తున్నాడు. ఆయన అలా తప్పించుకోలేడు. ఈ సారి అది సాధ్యం కాదు. మన విద్యార్ధులకు న్యాయం పొందే అర్హత ఉందని భావించే ప్రతి భారతీయుడు ప్రధాన మంత్రి ఇంటి ముందు జరుగుతున్న ధర్నాలో పాల్గొవాలి” అని రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చాడు. భారత విద్యార్ధుల గొంతుక మూగబోవటానికి వీలు లేదని ఆయన కోరాడు.
అంతకు ముందు పార్లమెంటులో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం పై దాడి ఎక్కు పెట్టాడు. “యువకుల పట్ల వ్యవహరించే పద్ధతి ఇది కానే కాదు. అనేక మంది గాయపడ్డారు. వారికి దేశంలో ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయి. తలుపులు అన్నీ మూసుకుపోయాయి. తెరిచి ఉన్న ఒకే ఒక్క తలుపు -పోటీ పరీక్షలు. ఇప్పుడు ఆ తలుపుని కూడా నాశనం చేసేశారు. కేవలం విద్యా వ్యవస్థ గురించి మాత్రమే ఈ విద్యార్ధులు ఫిర్యాదు చేయటం లేదు; తమ భవిష్యత్తు గురించే వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు” అని రాహుల్ గాంధీ పార్లమెంటులో విమర్శించారు.
“ఇది విద్య కంటే మించిన పెద్ద సమస్య. ఇండియాలో తమకు భవిష్యత్తు లేదని యువకులు ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళనలో న్యాయం ఉన్నది. విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తాం అని నమ్మకం ఇవ్వటానికి బదులు, పరీక్షల వ్యవస్థను బాగు చేస్తామని హామీ ఇచ్చే బదులు విద్యార్ధులపైకి పోలీసులను ఉసిగొల్పారు. ప్రధాన మంత్రి ఏమి చేస్తున్నారో నాకు తెలియదు. ఆయన రాజీనామా చేయాలి. విద్యార్ధుల పైకి పోలీసులను పంపింది ధర్మేంద్ర ప్రధాన్ కాదు; హొ మంత్రి ఆ పని చేశాడు. కాబట్టి హోమ్ మంత్రి రాజీనామా చేయాలి; హోమ్ మంత్రి ప్రధాని కింద పని చేస్తారు, కనుక ప్రధాన మంత్రి లాఠీ చార్జికి బాధ్యత వహించి రాజీనామా చేయాలి” అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశాడు.
మెడికల్ సీట్ల అభర్ధులు తమ ఇల్లు కాలిపోయినందుకు దుఃఖంలో మునిగి ఉండగా ఏఏపి పార్టీ బొగ్గులు ఏరుకునే పనిలో పడిపోయింది. సిజెపి పార్టీ నిర్వహిస్తున్న ఆందోళనను హైజాక్ చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, తన ఇంటి ముందు రాహుల్ గాంధీని కూర్చోబెట్టాడని ఆ పార్టీ ట్విట్టర్ లో వ్యాఖ్యానించింది. సిజెపి ఈ వ్యాఖ్యను ఖండించింది. ఇలాంటి దుష్ప్రచారం చేయొద్దని కోరింది. ప్రతిపక్ష నాయకుడు తమ ఆందోళనకు మద్దతు ఇస్తున్నాడని, ఆయన మద్దతును తాము ఆహ్వానిస్తున్నామని సిజెపి స్పష్టం చేసింది.