
–
—-సుమన, 25-07-2026
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దేశంలోని నిరుద్యోగులు, విద్యార్ధులు, యువత పట్ల పరోక్షంగా మరోసారి ఏవగింపు ప్రకటించి తప్పుడు కారణాలతో వార్తలకెక్కారు. న్యాయం కోరుతూ రోడ్డెక్కిన విద్యార్థులపై అత్యంత క్రూరంగా లాఠీ చార్జ్ చేసిన వీడియోలు ఉన్నాయని చెప్పిన పిటిషనర్లతో “వీడియోలు చూసేందుకు మాకు సమయం లేదు” అంటూ తమ పిటిషన్ ను అర్జెంటుగా చేపట్టాలన్న విజ్ఞప్తిని మొరటుగా తిరస్కరించారు.
బుధవారం నాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, జస్టిస్ సూర్యకాంత్ ముందు విద్యార్థులపై పోలీసులు అవసరానికి మించిన బల ప్రయోగం చేశారన్న విషయాన్ని సిజెపి తరపు లాయర్ ప్రస్తావించారు. పరిస్థితి తీవ్రత రీత్యా విద్యార్ధుల పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చేయాలని పిటిషనర్ల తరపు లాయర్ విజ్ఞప్తి చేశాడు. సుప్రీం కోర్టు ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ తో పాటు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన లు కూడా ఆసీనులై ఉన్నారు.
పిటిషనర్ వినతికి చీఫ్ జస్టిస్ అనూహ్య రీతిలో తన పదవికి తగని విధంగా స్పందించి పలువురి నిరసనకు కారణం అయ్యారు. “వీడియోలు చూడటానికి మాకు సమయం లేదు. మా సమయం వృధా చేయొద్దు. మీ సమయం కూడా వృధా చేసుకోవద్దు” అని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.
చీఫ్ జస్టిస్ పరిధిలో విస్తృత రాజ్యాంగ బాధ్యతలు
భారతదేశ రాజ్యాంగం దృష్టిలో కోర్టులు మరియు న్యాయమూర్తులకు అత్యంత గురుతర బాధ్యత అప్పగించబడింది. అటు న్యాయాన్ని పరిరక్షించటంతో పాటు ఇటు రాజ్యాంగ బాధ్యతలను ప్రభుత్వం సక్రమంగా నిర్వహిస్తున్నదా లేదా అన్న కాపలా బాధ్యతను కూడా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్వర్తించ వలసి ఉన్నది.
ఆర్టికల్ 124 నుండి ఆర్టికల్ 147 వరకు సుప్రీం కోర్టు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్వర్తించ వలసిన బాధ్యతాయుత కర్తవ్యాలను రాజ్యాంగం నిర్దేశించింది. ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తి మాస్టర్ ఆఫ్ రోస్టర్ గా వివిధ కేసుల విచారణను వివిధ బెంచి లకు, న్యాయమూర్తులకు అప్పగించాల్సి ఉంటుంది. కేసుల కేటాయింపు అధికారం చీఫ్ జస్టిస్ కే రాజ్యాంగం కట్టబెట్టింది. జడ్జిల నియామకం, వారి బదిలీలు కూడా ఆయనే చూస్తారు. సుప్రీం కోర్టులో పాలనా (అడ్మినిస్ట్రేషన్) బాధ్యత కూడా ఆయన చూస్తారు. సుప్రీం కోర్టు, హై కోర్టు లకు జడ్జిలను నియమించే కొలీజియం కు ఆయనే అధిపతి.
రాజ్యాంగ సూత్రాలకు, రాజ్యాంగం లోని వివిధ ఆర్టికల్స్ ను భాష్యం చెప్పే (interpret) ప్రధాన బాధ్యత సుప్రీం కోర్టు పరిధిలో ఉండగా, సదరు బాధ్యతను చూసే న్యాయమూర్తులను నియమించే బాధ్యత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి నిర్వర్తిస్తారు. అలాగే కేసుల తీవ్రత, విస్తృతి మరియు అవి భవిష్యత్తులో పడవేయనున్న ప్రభావం రీత్యా, ముఖ్యమైన కేసుల (రాజ్యాంగం లోని ఆర్టికల్స్ ను తాజాగా మరోసారి భాష్యం చెప్పవలసిన అవసరం ఏర్పడిన కేసులు) విచారణకు 5 గురు లేదా అంతకు మించి రాజ్యాంగ ధర్మాసనం లను ఏర్పాటు చేసే అధికారాన్ని కూడా చీఫ్ జస్టిస్ కే రాజ్యాంగం కట్టబెట్టింది. రోజువారీ పని విధానం, సిబ్బంది నియామకం, కోర్టులు సమస్యలు లేకుండా పని చేసేలా చూడటం… ఇవన్నీ చీఫ్ జస్టిస్ చేతుల్లో ఉన్నాయి. తాత్కాలిక జడ్జిలను నియమించాలన్నా, రిటైర్ అయిన జడ్జిల సహాయం కోరాలన్నా అలాంటి నిర్ణయం చేసే అధికారం కూడా చీఫ్ జస్టిస్ దే.
ఇంతటి మహత్తర బాధ్యతను కలిగి ఉన్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తమ పైన పోలీసులు అవసరానికి మించి లాఠీ చార్జి చేసి, డజన్ల మందిని ఆసుపత్రుల పాలు చేశారని, పోలీసుల దాష్టీకాన్ని నిలువరించి, వారిని అందుకు పురిగొల్పిన ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలన్న భావంతో కోర్టును ఆశ్రయించిన విద్యార్ధుల గోడు వినటానికి తనకు సమయం లేదని చెప్పి నిరాకరించటం ద్వారా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, భారత దేశ న్యాయ పాలనా వ్యవస్థ లోనే కనీ వినీ ఎరుగని రీతిలో ప్రతీకార ధోరణికి (punitive outlook) శ్రీకారం చుట్టారు.
విద్యార్థులపై ప్రతీకారమా?
“న్యాయం చెయ్యటంతో పాటు న్యాయం చేసినట్టు కనిపింఛాలి కూడా” అన్నది ప్రపంచ వ్యాపితంగా కోర్టులు, న్యాయమూర్తులు తరచుగా వల్లె వేసే సూత్రం. ఈ సూత్రాన్ని జస్టిస్ సూర్యకాంత్ గారు విస్మరించారా అన్న అనుమానం అనేక మందికి కలుగుతోంది. ఐపిఎల్ లాంటి ధనికుల వివాదాలను విచారించేందుకు రాత్రికి రాత్రి కోర్టులు విచారణ చేపట్టటం చూశాము. దేశ భవిష్యత్తులో భాగం వహించే విద్యార్ధులు న్యాయం కోరి వస్తే వారు ఎదుర్కొన్న దురన్యాయాన్ని పోలీసు దాడిని చూపించే వీడియోలు చూసేందుకు తమకు సమయం లేదని దులపరించటం ద్వారా చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ ఏ సందేశం దేశానికి ఇవ్వదలిచారు?
ఛలో సంసద్ పిలుపు మేరకు విద్యార్ధులు, యువకులు జంతర్ మంతర్ నుండి పార్లమెంటుకు మార్చ్ జరిపేందుకు సిజెపి నిర్ణయించిన నేపధ్యంలో నిరసనకారులు పెద్ద సంఖ్యలో జులై 20 తేదీన పార్లమెంటుకు తరలి వెళ్ళటానికి సిద్ధపడిన సంగతి తెలిసిందే. మార్చి జరిగేందుకు కొద్ది క్షణాల ముందు ఓ వైపు సిజెపి నాయకులను చర్చలకు ఆహ్వానించి, మరోవైపు ఆందోళనకారుల పైకి పోలీసులను ఉసిగొల్పటం ద్వారా ఊరేగింపుకు దారీ తెన్ను లేకుండా చేశారు. నాయకుల నుండి తగిన ఆదేశాలు అందకుండా అల్లకల్లోలం సృష్టించారు. ఫోన్లు వశం చేసుకోవటం ద్వారా ఉద్దేశ పూర్వకంగా నాయకులకు విద్యార్ధులకు మధ్య కమ్యూనికేషన్ లేకుండా తప్పుదారి పట్టించారు.
ఫలితంగా విద్యార్థులపై లాఠీ చార్జీతో పోలీసులు విరుచుకుపడటంతో వందకు పైగా విద్యార్ధులకు మహిళలకు గాయాలయ్యాయి. ముళ్లు, మేకులు అమర్చిన లాఠీలతో కుళ్ల పొడవటంతో బాధితులకు లోతైన గాయాలయ్యాయి. ప్రమాదకరమైన పిల్లెట్ గన్ లను పోలీసులు ప్రయోగించటంతో కొందరి కళ్ళు దెబ్బ తిని చూపు కోల్పోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. విధుల్లో ఉన్నప్పుడు తమ పేరు, ర్యాంక్ తెలిపే బ్యాడ్జిలు ధరించాల్సి ఉండగా అనేకమంది పోలీసులు అవి లేకుండా నిరసనకారులపై బలప్రయోగం చేశారు. ఊరేగింపును స్వయంగా దగ్గరుండి చూసిన ఒక రాష్ట్ర న్యాయమూర్తి ప్రకారం ప్రదర్శనకారుల లోకి బైటి వ్యక్తులు చొరబడి పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. అలాగే బైటి వ్యక్తులు కొందరు ఖాకీ యూనిఫారంలు వేసుకుని ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థినులు, మహిళలను ఎవరినీ వదల కుండా తీవ్రంగా కొట్టారని పలువురు విద్యార్ధులు ఆరోపించారు.
ఈ ఆరోపణల్లో నిజా నిజాలు తేల్చవలసిన బాధ్యత కోర్టుల పైన ఉన్నది. కోర్టుల బాధ్యత అంటే అది చివరికి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ వద్దకు వెళ్ళి ఆగుతుంది. ఆయనకు పైన ఇంకెవరూ ఆదేశాలు ఇచ్చే వాళ్లు లేరు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారే, ఈ విధమైన కంచే చేను మేసిన కేసుల్లో, బాధితులకు న్యాయం జరిగేలా బాధ్యత చేపట్టి అమలు చేయాల్సి ఉంటుంది. ప్రజల రక్షణ బాధ్యత చూసే పోలీసులే విద్యార్ధులను చితకబాదుతూ ప్రభుత్వం వద్దకు వెళ్లకుండా నిరోధిస్తే, అలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలను నివారించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చీఫ్ జస్టిస్ చూడాల్సి ఉండగా, అసలు వారి గోడు వినేందుకు, చూసేందుకు సమయం లేదని హుంకరించటం చీఫ్ జస్టిస్ కు తగునా?

కాక్రోచ్ జనతా పార్టీ, తన పేరును ప్రధాన న్యాయమూర్తి అసందర్భంగా నిరుద్యోగులను ఏవగించుకుంటూ చేసిన వ్యాఖ్యల నుండే తీసుకోవటం ద్వారా చీఫ్ జస్టిస్, జస్టిస్ సూర్యకాంత్ కు ఆయన దూషణలను ఆయనకు తిరిగి అప్పజెప్పింది. అందుకే చీఫ్ జస్టిస్ గారు సిజెపి కార్యకర్తలపై అమానుషంగా లాఠీ ఛార్జీ చేసి గాయ పరిచిన వీడియోలను చూసేందుకు నిరాకరించారా?
వ్యవస్థాగత నేపధ్యం!
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, మరొక కేసు విచారణ సందర్భంగా నిరుద్యోగ యువత పై చేసిన వ్యాఖ్యలను చూస్తే ఎవరైనా ముక్కున వేలు వేసుకోక మానరు. “బొద్దింకలలాంటి యువకులు కొందరు ఉన్నారు. వారికి ఎలాంటి ఉపాధి లభించదు. వృత్తిలో వారికి ఎలాంటి స్థానమూ ఉండదు. వారిలో కొందరు మీడియాగా మారుతారు, కొందరు సోషల్ మీడియాలో ప్రవేశిస్తారు, వారిలో కొందరు ఆర్.టి.ఐ కార్యకర్తలుగా అవతరిస్తారు, ఇంకొందరు ఇతర కార్యకర్తలుగా మారుతారు. ఇక వాళ్ళు ప్రతి ఒక్కరి పైనా దాడి చేయటం మొదలు పెడతారు. వీళ్ళు బొద్దింకలలాంటి వాళ్ళు, పరాన్న జీవులు.” ఇవీ చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు!
చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలకు ప్రతి స్పందనగా అభిజిత్ దిప్కే అనే ఐ.టి ఉద్యోగి వెంటనే స్పందించి కాక్రోచ్ జనతా పార్టీ ని ప్రకటించాడు. నిజానికి ఈ పార్టీ ప్రకటన, చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల్లో నిరుద్యోగుల పట్ల ఆయన వ్యక్తం చేసిన ఏవగింపుకు వ్యతిరేకంగా వ్యక్తం అయిన నిరసనకు భౌతిక రూపం! ఇది ఒకానొక సమయంలో అదాటుగా వ్యక్తం అయిన భావనే అయినప్పటికీ, ఆ భావన చుట్టూ నిరుద్యోగులు, యువకులు, విద్యార్ధులు మిలియన్ల సంఖ్యలో ఫాలోయర్లుగా తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవటంతో ఒక ఉద్యమంగా అవతరించింది.
చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు యథాలాపంగా వ్యక్తం అయినవి కావు. ఆయన వ్యాఖ్యలకు స్పందనగా అవతరించిన కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు కాకతాళీయమే అయినప్పటికీ మరో ముఖ్యమైన దృక్కోణంలో దశాబ్దాల తరబడి ఈ దేశం లోని యువకులు, విద్యార్ధులు ఎదుర్కొంటున్న మొండి సమస్యలైన నిరుద్యోగం, పాక్షిక నిరుద్యోగం (అండర్ ఎంప్లాయ్‌మెంట్), కొనుగోలు శక్తి క్షీణత, అందుబాటులో లేని ఉన్నత విద్య, స్వయం ఉపాధికి కూడా అవకాశాలు లేకుండా స్వయం ఉపాధి మార్గాలన్నింటినీ విదేశీ కార్పొరేట్ రిటైల్ మార్కెట్ కంపెనీలకు అప్పజెప్పటం, ఇల్లు దాటితే రోడ్డు తప్ప మరో తావు లేని పరిస్ధితిలో యువత మగ్గవలసి రావటం. అనేక మందికి ఇల్లు అని పిలుచుకునేందుకు తగిన తావు లేని అధ్వాన్న పరిస్ధితుల్లో ఉండటం.. పోటీ పరీక్షల ఫలితాలను కూడా పాలకులు అమ్ముకుంటున్న దుర్గతిని నిరుద్యోగులకు రుచి చూపటం… ఇత్యాది సమస్యలు పెను భూతాలై యువకుల ముందు నిలబడి ఉన్న నేపధ్యంలో వారి పరిస్ధితిని ఛీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు నిందా స్తుతిగా అయినా సరే, అద్దం పట్టాయి.
ఏ సమస్యలైతే భారత దేశ యువతను దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్నాయో, ఏ సమస్యల పరిష్కారంలో అయితే భారత పాలకవర్గాలు, పాలక పార్టీలు విఫలమయ్యాయో, ఏ సమస్యలనయితే సృష్టించి అవి పరిష్కారం కాకుండా జాగ్రత్తగా ప్రభుత్వాలు కాపాడుతూ వస్తున్నాయో, ఆ ప్రభుత్వాలను నిలదీసి భారత రాజ్యాంగబద్ధ పాలనకు కాపలాదారుగా నిలబడి ఉండవలసిన కోర్టులకు నాయకత్వం వహించే అత్యున్నత సుప్రీం కోర్టుకు అత్యున్నత అధిపతి అయిన ప్రధాన న్యాయమూర్తి తన రాజ్యాంగ బాధ్యతను విస్మరించాడు. సదరు సమస్యలకు బాధితులుగా ఉన్న యువతనే సమస్యలకు బాధ్యులుగా మార్చేసి బొద్దింకలుగా, పరాన్న జీవులుగా ప్రధాన న్యాయమూర్తి స్వయంగా తూలనాడిన అత్యంత విషమ పరిస్ధితిలో ఒక బలమైన నిట్టూర్పుగా, అదాటుగా ఈ దేశ నిరుద్యోగి గొంతు నుండి వెలువడిన మూలుగుగా బొద్దింకల జనతా పార్టీ మూర్తీభవించి పాలకుల ముందు, చీఫ్ జస్టిస్ ముందు నిలబడింది.
బొద్దింకల జనతా పార్టీ ఏర్పడటానికి కారకులు ఎవరు? దశాబ్దాలుగా సమస్యలను మురగబెట్టి, ఆ సమస్యలే పెట్టుబడిగా అత్యంత చౌకగా సదరు సమస్యల బాధితుల శ్రమను విదేశీ ఫైనాన్స్ కంపెనీలకు అందుబాటులో ఉంచుతున్నది ఎవరు? భారతీయ నిరుద్యోగుల శ్రమను, మేధస్సును ఇన్ఫోసిస్, విప్రో, టిసిఎస్, టెక్ మహీంద్రా, హెచ్ సి ఎల్, ఎల్.టి.ఐ మైండ్ ట్రీ లాంటి దేశీయ దళారీ ఐ.టి కంపెనీల ద్వారా ట్రిలియన్ల రూపాయలను లాభాలుగా విదేశీ కార్పొరేట్ టెక్ కంపెనీలైన గూగుల్, మైక్రో సాఫ్ట్, ఒరాకిల్, మెటా, ఐబిఎం లకు అప్పనంగా అప్పగిస్తున్నది ఎవరు? దేశ ఉపాధి వనరులను విదేశీ కంపెనీలకు అమ్మేసింది ఎవరు?
ఇంకా ప్రశ్నించాలంటే ఈ దేశ సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు, 25 హై కోర్టుల్లోని న్యాయమూర్తులకు, గంటకు కోట్ల రూపాయల చొప్పున కేసులు వాదించే బిలియనీర్ లాయర్‌లకు భారత దేశ దళారీ కార్పొరేట్ కంపెనీల్లో, విదేశీ టెక్నాలజీ కంపెనీల్లో, వాల్ స్ట్రీట్-లండన్-ఫ్రాంక్ ఫర్ట్ ఇత్యాది బహుళజాతి గుత్త ఫైనాన్స్ కంపెనీల్లో వాటాలు (షేర్లు) లేవా?
ఏ భారతదేశ యువతనయితే బొద్దింకలుగా, పరాన్నభుక్తులుగా ప్రధాన న్యాయమూర్తి తూలనాడాడో ఆ యువత శ్రమను చౌకగా గుంజుతూ ట్రిలియన్ డాలర్ల లాభాలు పట్టుకుపోతున్న విదేశీ ఫైనాన్స్ గుత్త కంపెనీలు పోతూ పోతూ కాసిన్ని గింజలను వాటాలుగా మీ దళారీ సేవలకు విదిలించి వెళుతున్నారు మహాశయా! ఆ ఎంగిలి మెతుకుల కోసం అంగలార్చుతూ సదరు మెతుకులు మీ గొంతుల్లో పడటానికి మూల కారణంగా ఉన్న దేశీయ యువతను బొద్దింకలనీ, పరాన్నభుక్తులు అనీ తూలనాడే వరకు భారతదేశ ధనిక దళారీ వర్గం దిగజారింది.

ఈ దళారీ వర్గం భారత దేశ ప్రజానీకానికి న్యాయం అందించే రూపంలో ఉంటూ న్యాయం అందించే కర్తవ్యాన్ని విడనాడి అన్యాయాల పీడితులను బొద్దింకలుగా, పరాన్నభుక్తులుగా నిందిస్తోంది. ఎన్నికల నాడు హామీలు గుప్పించే ఖద్దరు టోపీలను, ఇప్పుడు కొత్తగా కాషాయ కండువాలు ధరించిన దళారీ ఆ బొద్దింకలు, పరాన్నభుక్తుల పైకి ఖాకీ మూకల్ని ఉసిగొల్పింది. దళారీల చూరు పట్టుకు వెళ్లాడే గూండా మూకలు సైతం ఖాకీ ముసుగు వేసుకుని భారత యువత పైకి లంఘిస్తున్న దృశ్యాలను చూసేందుకు ప్రధాన న్యాయమూర్తికి సమయం ఉంటే ఆశ్చర్యం గానీ లేకుంటే ఆశ్చర్యం ఎందుకని జులై 20, 21 తేదీల్లో బొద్దింకలకు జ్ఞానోదయం అయి ఉండాలి.
నిరంకుశ రాజ్యం
సిజెఐ, దేశ యువత పైకి యథాలాపంగా విసిరినట్లు కనిపిస్తున్న దూషణల్లో ఆర్.టి.ఐ చట్టం, పిఐఎల్ (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ – ప్రజా ప్రయోజన వ్యాజ్యం) చట్టం ఎందుకు ప్రస్తావనకు వచ్చాయి? భారత దేశ ప్రభుత్వాల విధానాల రూప కల్పన మరియు పాలన పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో ఐక్య రాజ్య సమితి నిర్దేశించిన విధంగా భారత ప్రభుత్వం, సమాచార హక్కు చట్టంను రూపొందించి అమలు చేయక తప్పలేదు. మానవ ప్రపంచాన్ని ఏలుతున్న దేశాల ప్రభుత్వాలను మరింత బాధ్యతాయుతంగా, నాగరికంగా మార్చుకునే లక్ష్యంతో ఐక్య రాజ్య సమితి సమాచారం, పర్యావరణం లాంటి అనేక అంశాలలో అభివృద్ధికర చట్టాలను చేయాలని సభ్య దేశాలను కొన్నేళ్ళ క్రింద నిర్దేశించింది. అటువంటి మహత్తర లక్ష్యంతో రూపొందిన సమాచార హక్కు చట్టం ప్రధాన న్యాయమూర్తికి యువతను దూషించే దూషణ సాధనంగా ఎందుకు మారింది?
సమాచార హక్కు చట్టం గత యుపిఏ ప్రభుత్వం చేసిన చట్టాల్లో ఒకటి. ఇదే కాకుండా ప్రజలకు కొద్దో గొప్పో ఉపయోగపడే పలు చట్టాలను యుపిఏ ప్రభుత్వం ఉనికిలోకి తెచ్చింది. అటవీ వనరుల నుండి గిరిజనులకు జీవన వనరులు పొందే హక్కులను గ్యారంటీ చేసే అటవీ హక్కుల చట్టం (ఫారెస్ట్ రైట్స్ యాక్ట్), ధనికులకు మాత్రమే అవకాశం కల్పించే అనేక ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం పేదల పిల్లలకు ప్రవేశం కల్పించే విద్య హక్కు చట్టం, రైతులు మరియు గ్రామస్తుల భూములను వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం వశం చేసుకునే ముందు ఆయా గ్రామ పంచాయితీలు తీర్మానం చేసి ఆమోదించి తీరాలన్న షరతుతో పాటు, న్యాయబద్ధమైన పరిహారం పొందేందుకు రైతులకు హక్కు కల్పించిన న్యాయబద్ధమైన పరిహారం మరియు పారదర్శకత హక్కులతో కూడిన భూసేకరణ చట్టం (Right to Fair Compensation and Transparency in Land Acquisition Act, 2013), కనీసం వంద రోజుల పాటు పేద కూలీలకు ఉపాధిని గ్యారంటీ చేసే గ్రామీణ ఉపాధి హక్కు చట్టం (MGNREGA), మొదలైన చట్టాలు ఇందులో ఉన్నాయి.
2014 లో నరేంద్ర మోడి – అమిత్ షా ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే భూసేకరణ చట్టానికి ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన సవరణలు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. జాతీయ అవసరాల పేరుతో 5 రకాల ప్రాజెక్టుల నిమిత్తం రైతుల భూముల సేకరణకు రైతుల అనుమతి తీసుకోవాలన్న షరతును రద్దు చేయటం, భూసేకరణ వల్ల కలిగే సామాజిక దుష్ప్రభావాలను అంచనా వేయాలన్న నిబంధన రద్దు చేయటం, బహుళ పంటల భూముల సేకరణ పైన విధించిన పరిమితులను తొలగించటం, భూసేకరణలో తప్పిదాలకు నేరాలకు పాల్పడిన అధికారుల విచారణకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న నిబంధన విధించటం, సేకరించిన భూములను ఉపయోగించకపోతే వాటిని రైతులకు వెనక్కి ఇచ్చేయాలన్న నిబంధనను రద్దు చేయటం… ఇలాంటి సవరణలను మోడి – షా ప్రభుత్వం ప్రతిపాదించింది.
సవరణల ఆమోదానికి ప్రతిపక్షాలు తిరస్కరించటంతో పార్లమెంటులో తగిన బలం లేక బిల్లు ఆమోదం పొందటంలో మోడి ప్రభుత్వం విఫలం అయింది. దానితో మోడి ప్రభుత్వం డిసెంబర్ 2014 సవరణలతో ఆర్డినెన్స్ తెచ్చి మొండిగా అమలు చేసింది. ఆర్డినెన్స్ గడువు ముగిశాక మళ్ళీ రెండు సార్లు ఏప్రిల్ 2015, మే 2015 నెలల్లో ఆర్డినెన్స్ ను పొడిగించింది. చివరికి తప్పనిసరై సవరణలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.
భూసేకరణ చట్టం సవరణలో విఫలమైన అనుభవంతో మోడి ప్రభుత్వం ప్రజా ప్రయోజన చట్టాలను పరోక్షంగా సవరించే పని చేపట్టింది. ఉదాహరణకి అటవీ హక్కుల చట్టం కోసం రూపొందించిన నిబంధనల్లో మార్పులు చేసింది. అడవికి ఇచ్చిన చట్టబద్ధ నిర్వచనంలో మార్పులు చేసి గ్రామ సభల అనుమతి అవసరాన్ని కత్తిరించింది. పరిశ్రమల అవసరానికి అటవీ భూముల తరలింపుకు అవకాశం కల్పించుకుంది. గ్రామ సభల అనుమతి నిబంధనను రద్దు చేసి అధికారుల అనుమతి తీసుకుంటే చాలంది. తద్వారా గ్రామ సభల వీటో అధికారం రద్దు చేసింది. విద్య హక్కు చట్టంలో 5, 8 తరగతులకు డిటెన్షన్ విధానం తిరిగి ప్రవేశ పెట్టింది. బడ్జెట్ లో క్రమంగా విద్య రంగానికి నిధుల కేటాయింపులో కోత పెట్టింది. విద్యా రంగాన్ని రాష్ట్రాల జాబితా నుండి తప్పించి క్రమంగా కేంద్రం పరిధిలోకి తెచ్చే నిబంధనలను 2020 ఎన్.ఈ.పి ద్వారా తెచ్చింది.
ముఖ్యమైన సమాచార హక్కు చట్టంను బలహీన పరిచే లక్ష్యంతో సమాచార కమిషనర్ లకు నిర్దిష్ట వేతనం, 3 సం.ల తప్పనిసరి ఉద్యోగ కాలపరిమితి లను 2019 సవరణల ద్వారా మోడి ప్రభుత్వం రద్దు చేసింది. కమిషనర్ ల వేతనాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దయా దాక్షిణ్యాలపై ఆధారపడేలా సవరణ చేసింది. 2023 డిజిటల్ డేటా ప్రొటెక్షన్ చట్టం చేసి, “వ్యక్తిగత సమాచారం” పేరుతో ప్రజా ప్రయోజనాల నిమిత్తమైనా సరే సమాచారం పొందే హక్కును నిషేధించింది. సమాచార కమిషనర్ ల పోస్టులను యేళ్ల తరబడి ఖాళీగా అట్టి పెట్టటం మొదలు పెట్టింది. వివిధ సమాచారం ప్రజలకు అందకుండా చేసేందుకు కమిషనర్ లు పెద్ద మొత్తంలో పెనాల్టీ చెల్లించే విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ సవరణలతో ఆర్.టి.ఐ చట్టం నిరుపయోగం కావటంతో పాటు కమిషనర్ లు తమ అధికారాలను ఉపయోగించేందుకు భయపడే వాతావరణం ఏర్పడింది.
ప్రజా ప్రయోజన వ్యాజ్యం (Public Interest Litigation) ను సుప్రీం కోర్టు ద్వారానే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వాలు చేసిన చట్టం ద్వారా వచ్చింది కాదు. ప్రజల న్యాయమూర్తులుగా పేరు పొందిన జస్టిస్ వి ఎన్ భగవతి, జస్టిస్ వి. ఆర్. కృష్ణయ్యర్ లు పిఐఎల్ ను ఆచరణలోకి తేవటం ద్వారా బాధితులు మాత్రమే కోర్టులను ఆశ్రయించాలన్న నిబంధన నుండి మినహాయింపు ఇచ్చారు. ప్రజల తరపున, దోపిడీ అణచివేతలకు గురవుతున్న పీడితుల తరపున ఎన్.జి.ఓ లు, ఆదర్శ భావాలు గల వ్యక్తులు, ప్రజల కోసం స్వార్ధ రహితంగా పని చేసే కార్యకర్తలు పిఐఎల్ ను నేరుగా సుప్రీం కోర్టులో దాఖలు చేయటం ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను జవాబుదారీగా చేసే లక్ష్యంతో పిఐఎల్ ను వారు 1979-80 ప్రాంతంలో అందుబాటులోకి తెచ్చారు.
అప్పటి నుండి నిజాయితీ గల లాయర్లు, వ్యక్తులు, హక్కుల కార్యకర్తల చేతుల్లో ఇది అనేక పరిమితుల్లోనైనా ఒక ఆయుధంగా ఉపయోగపడింది. రిజర్వేషన్ చట్టాలు, పని స్థలాల్లో మహిళలపై లైంగిక వేధింపులు మొ.న అంశాల్లో కొంతమేర ప్రగతిశీల చట్టాలు తయారు కావటానికి పిఐఎల్ దోహద పడింది. ప్రశాంత్ భూషణ్ లాంటి సుప్రీం కోర్టు లాయర్లు ప్రజా సమస్యల పరిష్కారం, అవినీతి నిరోధం లాంటి అంశాల పరిష్కారం కోరుతూ పిఐఎల్ పిటిషన్లు దాఖలు చేసేందుకే ఒక ఎన్.జి.ఓ ను స్థాపించి పని చేసేందుకు ఇది స్ఫూర్తినిచ్చింది.
2014 లో మోడి-షా నేతృత్వంలో ఆర్ఎస్ఎస్ – బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పాక్షికంగానైనా ప్రగతి శీలంగా పని చేస్తున్న ఈ చట్టాల పట్ల ప్రభుత్వాల దృక్పథం అకస్మాత్తుగా తలకిందులయింది. విద్య హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం, ఉపాధి హామీ చట్టం లాంటి చట్టాలు ప్రజోపయోగ చట్టాలుగా మంత్రులు, ఎంపి లు మంచి చట్టాలని కనీసం నటన కోసమైనా చెప్పేవారు. వాటిని ఉపయోగించుకోవాలని బోధించేవారు. బిజెపి ప్రవేశంతో ఈ చట్టాల పైన మంత్రులు, ఎంపి లు, ఉన్నతాధికారులు బహిరంగంగానే సమస్యాత్మక చట్టాలుగా చెప్పటం మొదలు పెట్టారు.
ఉపాధి హామీ చట్టం గురించి ప్రధాన మంత్రి కాక ముందు నుండే మోడి విమర్శలు సాగించాడు. ఈ చట్టాన్ని మోడి రద్దు చేయటం ఖాయం అని అప్పట్లో పరిశీలకులు భావించారు. కానీ ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్న భయంతో ఆ సాహసం చేయలేకపోయాడు. మొదటి సారి పార్లమెంటులో మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీ యొక్క మాన్యుమెంటల్ వైఫల్యానికి ప్రతీకగా చూపేందుకైనా ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగిస్తున్నా”నని ప్రకటించాడు. కానీ ఆచరణలో ఈ చట్టం కోసం బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తూ వచ్చాడు. చివరికి చట్టాన్ని సవరించి పేరు కూడా మార్చి, అనేక కోతలు విధించి “విబి-జి రామ్ జి” గా జులై 1 2026 నుండి అమలు చేస్తున్నారు.

సవరించిన చట్టం ద్వారా ఉపాధి హామీ చట్టం భారాన్ని 40 శాతం రాష్ట్రాల పైకి నెట్టేసింది మోడి ప్రభుత్వం. పని దొరికినంత మేర నిధులు విడుదల చేసే వసతిని రద్దు చేసి నిర్దిష్ట మొత్తం లోనే నిధులు విడుదల చేయనున్నారు. గతంలో బడ్జెట్ కేటాయింపులకు మించి కూలీలు పని చేస్తే సవరణ అంచనాల ద్వారా కేటాయింపులకు మించి నిధులు విడుదల చేసే వీలు ఉండగా ఆ సౌకర్యం ఇప్పుడు రద్దయింది. అనగా పనికి డిమాండ్ ఉన్నప్పటికీ నిధులు అందుబాటులో లేకపోతే పని ఇవ్వటం ఇక ఉండదు. ప్రజల అవసరాలని అపహాస్యం చేసేలా పని రోజులను 100 నుండి 125 రోజులకు పెంచారు. కానీ తగ్గిన నిధులతో పెంచిన పని రోజులకు వేతనాలు చెల్లించే మంత్రదండం ఏమిటో మోడి ప్రభుత్వం చెప్పలేదు.
కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత న్యాయ స్థానాల్లో న్యాయ మూర్తులు కూడా క్రమంగా తమ దృక్పథాలలో మార్పులు చూపించటం మొదలు పెట్టారు. బిజెపి-ఆర్ఎస్ఎస్ మతతత్వానికి అనుగుణంగా జడ్జిలు తమ భావాలు సవరించుకున్నారు. లేదా తమ అసలు రంగు బైట పెట్టుకోవడం మొదలు పెట్టారు. ప్రజా జీవనంలో ఏ మాత్రం పాత్ర లేని గుళ్లు, గోపురాలు, మసీదుల చుట్టూ కోర్టుల్లో విచారణలు కేంద్రీకరించటం ఎక్కువయింది.
ప్రజలు సమస్యల పరిష్కారం కోసం నేరుగా సుప్రీం కోర్టు తలుపు తట్టేందుకు ఆర్టికల్ 32 ఏర్పాటు చేయగా, సరిగ్గా ఆర్టికల్ 32 కింద కేసుల స్వీకరణ తగ్గించటం తన లక్ష్యంగా చీఫ్ జస్టిస్ (జస్టిస్ ఎస్. ఏ. బాబ్డే) కోర్టులోనే ప్రకటించే వరకు పరిస్థితి వెళ్లింది. ఆర్టికల్ 19 కింద బావ ప్రకటన, శాంతియుత కూడిక, యూనియన్ల ఏర్పాటు, నివాసం, లాంటి 6 ప్రధాన స్వేచ్ఛా హక్కులను రాజ్యాంగం కల్పించింది. ఈ హక్కులు నిరాకరించబడినప్పుడు కూడా ప్రజలు నేరుగా సుప్రీం కోర్టు తలుపు తట్టే అవకాశం రాజ్యాంగం ఇచ్చింది. బిజెపి-మోడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ వైపు ఈ హక్కుల కోసం సుప్రీం కోర్టు మెట్లు ఎక్క వలసిన అవసరం పెరగగా, మరో వైపు ఈ స్వేచ్ఛల రక్షణ కోసం వచ్చే కేసులను న్యాయమూర్తులే స్వయంగా నిరుత్సాహ పరచటం కూడా ఎక్కువయింది.
అనగా మారిన ప్రభుత్వ విధానాలకు, మితవాద ఫిలాసఫీకి అనుగుణంగా సుప్రీం కోర్టు లోని అత్యున్నత న్యాయమూర్తులు తమ దృక్పథాలను సవరించుకుంటున్నారు. న్యాయమూర్తుల ఎంపికలోనే మోడి ప్రభుత్వం తమకు అనుకూలంగా తీర్పులు ప్రకటించే వారిని ఎంచుకుంటోంది. ఒకరిద్దరు చీఫ్ జస్టిస్ లు తాము ఎంపిక చేసిన జడ్జిలను నియమించటంలో నెలలు, సంవత్సరాల తరబడి తాత్సారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పైన బహిరంగంగానే నిరసన ప్రకటించాల్సి వచ్చింది. మితవాద భావాలతో కూడిన జడ్జిల ఎంపిక ఇప్పుడు అమలవుతున్నది. అవకాశవాద జడ్జిలు తమ ప్రగతిశీల తీర్పులు మానేసి ఏలిన వారికి నచ్చే తీర్పులు ఇస్తున్నారు. రాజ్యాంగం బదులు భగవద్గీత సూత్రాలను ఉటంకిస్తూ తీర్పులు ఇస్తున్నారు.
ప్రస్తుత చీఫ్ జస్టిస్, జస్టిస్ సూర్యకాంత్ ఇస్తున్న తీర్పులు ప్రజా ప్రయోజనాలను గౌరవించే బదులు విస్మరిస్తున్నాయి. ప్రజల ప్రయోజనాలను గౌరవించటానికి బదులు పాలకుల ప్రయోజనాలకు కట్టుబడి ఉంటున్నట్లు వారి నిర్ణయాలు తెలియజేస్తున్నాయి. అందులో భాగంగానే విద్యార్ధులు మరియు నిరుద్యోగ యువత గురించి ప్రధాన న్యాయమూర్తి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను పరిగణించాల్సి ఉన్నది.
సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన తర్వాత దేశ వ్యాపితంగా పలువురు ఔత్సాహిక యువకులు చట్టాన్ని ఉపయోగిస్తూ ప్రభుత్వ అవినీతి కార్యకలాపాల పైన కాపలా పెట్టడం మొదలు పెట్టారు. ప్రభుత్వ నిర్ణయాల గురించిన సమాచారాన్ని సేకరిస్తూ అవినీతి ఒప్పందాల గుట్టు వెల్లడి చేస్తున్నారు. అంబానీ, అదాని, టాటా లాంటి సూపర్ ధనిక వర్గాలు, వారి కంపెనీలు నిర్వర్తించే కార్యకలాపాలపై పరిమితంగానైనా నిఘా పెడుతున్నారు. బొగ్గు గనుల కేటాయింపు లాంటి భారీ అవినీతి కార్యకలాపాలను సైతం వారు వెలుగులోకి తెస్తున్నారు. ఈ కృషిలో నిమగ్నమై వారు మాఫియా గ్రూపుల చేతుల్లో హత్యలకు గురవుతున్నారు.
అలాగే ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని శక్తివంతంగా ఉపయోగించటం ద్వారా ప్రశాంత్ భూషణ్ లాంటి వారు పలుమార్లు న్యాయ వ్యవస్థ ఆగ్రహానికి గురయ్యారు. మోడి-అమిత్ షా ప్రభుత్వం అలాంటి వారి పైన ప్రత్యేకంగా కక్ష గట్టి బూటకపు కేసులు బనాయిస్తూ జైళ్ల పాలు చేస్తున్నారు. చట్టాలను ఉపయోగిస్తూ గిరిజనుల హక్కుల కోసం పోరాడటంలో తమ జీవితాలను పణంగా పెట్టిన వారి పైన ఉపా కేసులు మోపి మూకుమ్మడిగా జైళ్లలో పెట్టేందుకు కేంద్రం వెనుదీయటం లేదు.
నిరుద్యోగులైన యువకులు, ఏ వృత్తిలోనూ స్థానం సంపాదించలేని వాళ్లు ఆర్.టి.ఐ కార్యకర్తలు గా అవతరిస్తున్నారని, వీళ్ళు బొద్దింకలని, పరాన్న జీవులని చీఫ్ జస్టిస్ నిందిస్తున్నది ఈ కార్యకర్తలనే. మోడి-షా లేదా ఆర్ఎస్ఎస్ – బిజెపి నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంటే నిరుద్యోగులు, విద్యార్ధులు ఆర్.టి.ఐ, పిఐఎల్, విద్య హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం లాంటి చట్టాలను దుర్వినియోగం చేస్తూ విజిల్ బ్లోయర్లు గా దేశాభివృద్ధిని ఆటంకపరుస్తున్నారని జస్టిస్ సూర్యకాంత్ లాంటి వారు ఆరోపిస్తున్నారు.
అభివృద్ధి గురించిన వారి దృక్పథం పూర్తిగా ఏకపక్షం. అభివృద్ధి అంటే వారి దృష్టిలో ప్రధాని నరేంద్ర మోడీకి అంతర్జాతీయంగా వస్తున్న పేరు ప్రతిష్టలు, దేశ జీడీపీ పెరుగుతూ పోవటం. వారి దృష్టిలో దేశానికి పేరు ప్రతిష్టలు రావటం అంటే నరేంద్ర మోడి ని గొప్ప చాణక్యుడిగా, అత్యున్నత దౌత్యవేత్తగా, వాస్తవిక వాదిగా అమెరికా అధ్యక్షుడు, ఐరోపా దేశాల నేతలు పొగడ్తలు కురిపించటమే. భారత ప్రజల ప్రయోజనాలను, సహజ వనరులను విదేశీ కంపెనీలకు అత్యంత చౌకగా అప్పగిస్తున్న ఫలితంగానే నరేంద్ర మోడి పైన ప్రశంసలు కురుస్తున్నాయన్న సంగతిని వారు విస్మరిస్తున్నారు.
మోడి నేతృత్వంలో ఇండియా కుదుర్చుకుంటున్న ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ఫలితంగా భారత రైతులు, ఉత్పత్తిదారులు, చిన్న వ్యాపారులు, దళిత బహు జన ముస్లిం వర్గాలు తీవ్రంగా నష్టపోతున్న సంగతి వారు విస్మరిస్తున్నారు. దళారీ కార్పొరేట్ కంపెనీల్లో వారి వాటాల విలువ పెరుగుతూ పోతుంటే వారి దృష్టిలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తున్నట్లు అర్ధం. వారి వాటాల (షేర్ల) విలువ పడిపోతే దేశాభివృద్ధి కుంటుబడుతున్నట్లే! మోడి విధానాలు కార్పొరేట్ కంపెనీల లాభాల వృద్ధికి అనుకూలంగా ఉంటాయి కనుక ఆయన విధానాలకు షేర్ మార్కెట్లు కృత్రిమంగానైనా పెరుగుతాయి.
రాష్ట్ర మరియు దేశ ఎన్నికల ఫలితాల్లో గాని, కోర్టు తీర్పుల్లో గానీ మోడీకి విరుద్ధంగా ఫలితం వెలువడితే షేర్ మార్కెట్లు పతనం అవటం అందుకే. అంటే మార్కెట్లు, దోపిడీ వర్గాలు, కంపెనీల వ్యక్తిగత వాటాదారులు (అత్యున్నత బ్యూరోక్రాట్ అధికారులు, న్యాయ వ్యవస్థలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, సూపర్ ధనిక వర్గాలు మొ.) మోడి ప్రభుత్వ విదేశీ కంపెనీ అనుకూల విధానాలతో మమేకమై ఉన్నారు. సంస్కరణల విధానాలు వేగం పుంజుకుంటే దేశం అభివృద్ధి పథంలో సాగిపోతుందని అందులో భాగంగానే తమ షేర్ మార్కెట్ల వాటాల విలువ పెరుగుతుందని వారి నమ్మకం!
రాజకీయంగా చూస్తే వారి నమ్మకం మోడి ప్రభుత్వ మితవాద విధానాలకు మద్దతుగా రూపాంతరం చెందుతుంది. మోడి మతతత్వ విధానాలు భారతదేశ సంస్కృతి పరిరక్షణగా కనిపిస్తాయి. హిందూ సంప్రదాయ విధానాలను సైంటిఫిక్ సూత్రాలుగా మోడి ప్రభుత్వం వల్లె వేస్తుంటే అది భారతదేశ చారిత్రక వారసత్వ పరిరక్షణగా కనిపిస్తుంది. దళితులు, మూల వాసులు, మైనారిటీ మతస్థులు ఈ అభివృద్ధి యజ్ఞంలో నష్టపోతున్నప్పటికీ అది అభివృద్ధిలో సహజంగా కనిపిస్తుంది తప్ప దేశ పౌరుల్లోని మెజారిటీ వర్గం ఎదుర్కొంటున్న నష్టంగా వారికి కనిపించదు. దేదీప్యమానమైన వెలుగు వెంట నీడ కూడా ఉంటుందని అభివృద్ధి కావాలంటే కొంత నష్టం తప్పదని వారి తాత్విక నమ్మకం కూడా.
అందుకే యువకులు, విద్యార్ధులు ఆర్.టి.ఐ చట్టం ఉపయోగిస్తూ ప్రభుత్వ విధానాల్లో అవినీతిని ఎండగడితే వారు అభివృద్ధిని ఆటంకపరిచే బొద్దింకలుగా, దేశ ఆర్ధిక వ్యవస్థను అంటి పెట్టుకున్న పరాన్న జీవులుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిందిస్తున్నారు. విద్యార్ధులకు అత్యున్నత విద్య సౌకర్యాలను అందుబాటులో ఉంచటమే కాకుండా వారికి ఉపాధి కల్పించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం పై ఉంటుందన్న సహజ సూత్రాన్ని సైతం తిరస్కరించే విపరీత దశకు ఈ దేశ అత్యున్నత న్యాయమూర్తులు చేరుకున్నారు. “కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పరిపాలన” అన్న మోడి ప్రవచిత సూత్రాన్ని వారు వంటబట్టించుకుని నిరుద్యోగుల ఉపాధి డిమాండ్ ను పరాన్నభుక్తుల డిమాండ్ గా వారు పరిగణిస్తున్నారు. కనిష్ట ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగాలను వీలైనంత కుదించటం అనీ అది అంతిమంగా కార్పొరేట్ ఫైనాన్స్ పెట్టుబడి దోపిడీకి సహకరిస్తుందని గ్రహిస్తే మోడి సూత్రం అంతరార్ధాన్ని గ్రహించవచ్చు.
జస్టిస్ సూర్యకాంత్, నిరుద్యోగ యువత పై ప్రకటించిన ఏవగింపు ఆచరణలో మోడి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటు కార్పొరేట్ కంపెనీ అనుకూల నయా ఉదారవాద విధానాలకు ఇస్తున్న బేషరతు మద్దతు. కింది కులాలపై పెద్ద కులాల ఏవగింపు; మైనారిటీ మతాలపై మెజారిటీ మతం ఏవగింపు; పాలితులపై పాలకుల ఏవగింపు; అభివృద్ధికర భావజాలంపై సాంప్రదాయ మతతత్వ భావజాల ఏవగింపు, పీడిత వర్గాలపై ఆధిపత్య వర్గం ఏవగింపు… ఇవన్నీ ఒక తాను లోని ముక్కలే.
అందుకే కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు ఓపెన్ కేటగిరీ కులాల వాళ్లు మద్దతు నిరాకరించాలని ట్విట్టర్, ఫేస్ బుక్ లలో పిలుపులు ఇవ్వబడుతున్నాయి. (ఈ పిలుపులను వాళ్లు ఇసుమంత కూడా పట్టించుకోకుండా కుల వాదులకు బుద్ది చెప్పారు) ఆందోళన పై ఎన్.ఐ.ఏ విచారణ జరపాలని, ఉపా కేసు నమోదు చేయాలని పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఎన్.ఐ.ఏ విచారణ, ఉపా చట్టం బనాయింపు లాంటి నిర్బంధాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సిజెపి నాయకులు జంతర్ మంతర్ వేదిక నుండి ప్రకటించారు కూడా. ఈ నేపధ్యంలో సిజెపి ఆందోళనకు విప్లవ ప్రజా సంఘాలు క్రియాశీలక మద్దతు ఇవ్వటమే కాకుండా ఆందోళనను ఎన్.జి.ఓ లు హైజాక్ చేయకుండా చూడాలి.