చర్చల నాటకంతో ఆందోళనను బలహీన పరిచేందుకు ప్రభుత్వం కుట్ర -అభిజిత్


ప్రతిపక్ష పార్టీలు గెలిచిన చోటల్లా ఆ పార్టీల ఎం.ఎల్.ఏ లు, ఎం.పి లను బెదిరించి లేదా ప్రలోభ పెట్టి వారిలో చీలికలు తెచ్చి ప్రభుత్వాలను పడగొట్టి, వారి అవినీతిని వాషింగ్ మిషన్ లో వేసి కడిగి శుభ్రం చేసి సొంతగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం గత కొన్నేళ్లుగా బిజెపి పార్టీ చేస్తున్న ఘనకార్యం!

ఇదే తరహా మోసపూరిత ఎత్తుగడలను తన పాలనలో ఉన్న విద్యార్ధులు, యువకుల పైన కూడా బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని సిజెపి పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే మాటలను బట్టి స్పష్టం అవుతోంది.

చర్చలతో పేరుతో ప్రభుత్వ ప్రతినిధి జె పి నడ్డా ను తమ వద్దకు పంపటం ద్వారా ప్రభుత్వం మోసపూరిత ఎత్తుగడకు పాల్పడిందని దిప్కే ఆరోపించాడు. చర్చల పేరుతో నాయకత్వాన్ని ఒక గదిలో ఉంచేసి బైట మాత్రం ఆందోళనకారుల పైకి పోలీసులను ఉసిగొల్పి ఆందోళనకారులు, నాయకత్వం మధ్య కమ్యూనికేషన్ లేకుండా ప్రభుత్వం చేసిందని ఆయన ఆరోపించారు.

ఓ పక్క నాయకులతో చర్చల పేరుతో మాట్లాడుతూ మరో పక్క ఆందోళన చేస్తున్న విద్యార్ధులపై పోలీసుల చేత అమానుషంగా లాఠీ చార్జి చేయటం ఏమిటని దిప్కే ప్రభుత్వాన్ని నిలదీశాడు. చర్చల నాటకంతో తమ సమయాన్ని ప్రభుత్వం వృధా చేసిందని అభిజిత్ దిప్కే ఆరోపించాడు.

జంతర్ మంతర్ వద్ద సహ ఆందోళనకారులతో మాట్లాడుతూ అభిజిత్ దిప్కే ప్రభుత్వం తమను ఎలా మోసగించినదీ వెల్లడి చేశాడు. సిజెపి ప్రధాన నాయకులను ఉద్దేశ్యపూర్వకంగా జెపి నడ్డాతో సమావేశంలో ఇరుక్కుని ఉండేలా చేసి ప్రదర్శనకారుల పైకి పోలీసులను పంపారని, దానితో క్లిష్టమైన సమయంలో ఆందోళనలో ఉన్న విద్యార్ధులకు నాయకత్వం నుండి తగిన సూచనలు అందకుండా ప్రభుత్వం అడ్డుకున్నదని, నాయకులకు విద్యార్ధులకు మధ్య కమ్యూనికేషన్ లేకుండా నివారించిందని దిప్కే ఆరోపించాడు.

“ప్రభుత్వం మా సమయాన్ని వృధా చేసింది. మా ప్రతినిధుల్ని వారు ఆహ్వానించారు. వారి మొబైల్ ఫోన్ లను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్ లు ఒక విధంగా జె పి నడ్డా ఇంటిలో హౌస్ అరెస్ట్ లో ఉన్నారు” అని దిప్కే ఆరోపించాడు.

సౌరవ్, అశుతోష్ ల వద్ద ఉన్న మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకోవటం ద్వారా ప్రభుత్వం మోసపూరిత ఉద్దేశ్యాలు ఏమిటన్నది స్పష్టం అవుతున్నది. నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు నమ్మించారు. కానీ బైట విద్యార్ధులపై పోలీసులు అమానుషంగా లాఠీ చార్జి జరుగుతున్న సంగతి లోపల ఉన్న నాయకులకు తెలియకుండా వారి ఫోన్ లు వారి వద్ద లేకుండా చేశారు. అసలు చర్చలకు ఆహ్వానించిన వారి నుండి ఫోన్ లు ఎందుకు లాక్కున్నట్లు? అది మంత్రి గారి ఇల్లే కదా? మంత్రి గారి ఇంట్లో నాయకుల వద్ద ఫోన్లు ఎందుకు ఉండకూడదు?

ఇంతా చేసి “మాకు లభించిన ఏకైక హామీ ఏమిటి అంటే ఆయన తమ నాయకత్వంతో మాట్లాడి ఏ నిర్ధారణకు వచ్చింది తర్వాత సమాచారం ఇస్తామని చెప్పటం మాత్రమే” అని చర్చలలో పాల్గొన్న ఆశుతోష్ రంకా పిటిఐ కి చెప్పాడు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తో సహా, నిరసనకారుల డిమాండ్లను ప్రభుత్వం చర్చిస్తుందని ప్రభుత్వం సిజెపి ప్రతినిధులకు జెపి నడ్డా ద్వారా హామీ ఇచ్చింది.

దీక్ష విరమణకు సోనమ్ అంగీకారం, పోలీసు హింసతో మళ్ళీ దీక్షలోకి!

అభిజిత్ దిప్కే ప్రకారం ఆమరణ నిరాహార దీక్షను విరమించటానికి సిజెపి నాయకులు కార్యకర్తలు సోనమ్ వాంగ్ చుక్ కు నచ్చజెప్పి ఒప్పించారు. ఆయనను ఒప్పించటానికి వాళ్ళు చాలా కష్టపడవలసి వచ్చింది. కానీ నిరసనకారుల పైన పోలీసులు అమానుషంగా విరుచుకుపడటంతో ఆయన దీక్షను విరమించటానికి నిరాకరించాడు.

“సోనమ్ వాంగ్ చుక్ సార్ నిన్నటితో తన ఆమరణ దీక్షను విరమించేందుకు అంగీకరించారు. మేము చాలా కష్టపడి ఆయనను ఒప్పించాం. ఆయన ప్రాణం మాకు విలువైనదని, దీక్ష విరమించాల్సిందేనని గట్టిగా విజ్ఞప్తి చేశాం. ఎలాగోలా ఆయన ఒప్పుకున్నాడు. కానీ పోలీసుల క్రూరత్వాన్ని చూశాక తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం” అని దిప్కే వివరించాడు. సోనమ్ నిరాహార దీక్ష ఇప్పుడు తక్షణ సమస్య అయింది దిప్కే ఆందోళన వ్యక్తం చేశాడు.

“ఆయన శరీరం 20-21 రోజుల నిరాహారాన్ని మాత్రమే తట్టుకోగలుగుతుంది. ఆ తర్వాత ఆయన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంది. మరో మూడు నాలుగు రోజులు దీక్ష కొనసాగితే ఆయన లోపలి అవయవాలు దెబ్బ తింటాయని డాక్టర్లు చెప్పారు. ఆయనను అరెస్టు చేసి నాలుగు రోజులైంది. ఆయన దీక్ష కొనసాగించటం మాకు ఇష్టం లేదు” అని దిప్కే ఆందోళన వ్యక్తం చేశాడు.

కాగా, సోమవారం పోలీసులు ఆందోళనపై దమనకాండ నిర్వహించినప్పటికీ జంతర్ మంతర్ వద్ద మళ్ళీ ఆందోళనకు విద్యార్ధులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. పోలీసులు టెంట్ లను కూల్చేసి, వస్తువులను ఛిన్నాభిన్నం చేసిన ప్రాంతాన్నే మళ్ళీ శుభ్రం చేసి, వస్తువులను సమకూర్చుకుని ఆందోళనలో పాల్గొంటున్నారు.

కొందరు డాక్టర్లు స్వచ్ఛందంగా లాఠీ చార్జి లో గాయపడ్డ వారికి చికిత్స, ఔషధాలు అందజేశారు. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సిజెపి నాయకులు పునరుద్ఘాటించారు.

వ్యాఖ్యానించండి