ఇరాన్ సీజ్ ఫైర్ చర్చలు -నోట్స్ & అప్ డేట్స్ 9


SHIPS STRANDED IN STRAIT OF HORMUZ

27/04/2026

ప్రపంచానికి కనిపించటం లేదు గానీ, ఈ యుద్ధం, చర్చలు, అన్నింటి వెనక చైనా తన వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నది. చైనా ఉంది గనకనే జెనీవా బదులు ఇస్లామాబాద్ లో చర్చలు జరుగుతున్నాయి. బహుశా ఇస్లామాబాద్ చర్చలు నూతన ప్రపంచ వ్యవస్థ (New World Order) ఏర్పడి పాతుకుపోతున్న క్రమంలో వైరి పక్షాల మధ్య జరుగుతున్న ప్రథమ చర్చలు కావచ్చు. మౌలిక మార్పులు జరుగుతున్నపుడు, అవి గుణాత్మక మార్పుకు గురైనట్లు స్పష్టంగా మనకు కనిపించటానికి చాలా ముందే అవి మొదలైపోయి ఉంటాయి. అలా సమూల మార్పులు మొదలై పాతుకు పోతున్న క్రమంలో ఇస్లామాబాద్ చర్చలు మొదటి కొబ్బరి కాయ కొట్టారు అనటానికి సూచన కావొచ్చు.

ఎందుకంటే ట్రంప్ కి లేదా అమెరికాకి ఏం చేయాలో పాలుపోవడం లేదన్న సంగతి ట్రంప్ ప్రకటనల ద్వారా అర్ధం అవుతోంది. యుద్ధం తర్వాత ఇరాన్ ఇప్పుడు ఒక కొత్త శక్తి గా అవతరించింది. ఆ శక్తితో రాజీ పడటానికి ఇజ్రాయెల్ కొండలా అడ్డం ఉంది. అమెరికాలో యూదు లాబీ ని కాదని ఏ అధ్యక్షుడు ఏమీ చేయలేరు. యూదు లాబీ కంట్రోల్ లో అతి పెద్ద ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. అణు పరిజ్ఞానం, మిసైల్ ఆయుధాల గురించి చర్చించేది లేదు పొమ్మని ఇరాన్ తెగేసి చెప్పింది. ఆ సంగతి స్పష్టం చేయటానికే ఇరాన్ విదేశీ మంత్రి ఇస్లామాబాద్, ఒమన్, మాస్కో వెళ్ళాడు. ఒమన్ ఎందుకంటే హార్ముజ్ జలసంధి దక్షిణ తీరం ఆ దేశానిదే మరి. ఇరాన్ మాట వినక తప్పని పరిస్థితి లో ఒమన్ ఉన్నట్లు కనిపిస్తున్నది. అమెరికా, ఐరోపా లకు ఒమన్ మిత్ర దేశమే అయినప్పటికీ ఆ దేశానికి సాయం చేసే స్థితిలో ఇప్పుడు అవి లేవు.

అంటే మూడో ప్రపంచ యుద్ధం ముగిసి ప్రపంచ మార్కెట్ల పునః పంపిణీ ప్రారంభం అయిందేమో అన్నట్లుగా ఉన్నది. ఇరాన్ ఆత్మ విశ్వాసం చూస్తుంటే అలానే ఉంది. సంధి షరతులు అమెరికా బదులు ఇరాన్ చేతుల్లోకి వచ్చాయి. ఇంతకు ముందు ఎస్కలేషన్ ల్యాడర్ గురించి ఈ బ్లాగ్ లోనే చెప్పటం జరిగింది. అది ఇరాన్ గుప్పిట్లోకి వచ్చేసింది.

ఇరాన్ అంటే ఒక్క ఇరాన్ ని మాత్రమే ఇక్కడ చూడ కూడదు. చైనా కి చెందిన సప్లై చెయిన్, చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్ఐ) రష్యా ఇరాన్ లలో ఉన్న విస్తారమైన సహజ వనరులు, చైనా అంతర్జాతీయ పేమెంట్స్ వ్యవస్థ అయిన CIPS, బలం పుంజుకుంటున్న పెట్రో యువాన్ ఇవన్నీ ఇరాన్ వెనుక ఒక వ్యవస్థ (న్యూ వరల్డ్ ఆర్డర్) గా పని చేస్తున్నట్లు కనిపిస్తున్నది.

ఇది స్పష్టంగా కాకపోయినా నిర్దిష్ట పరిణామాల రూపం లో అయినా సరే కనిపించే వరకూ అది ఏమిటి అన్నది నిర్ధారించి చెప్పటం లేదా స్పష్టంగా చూడగలగడం సాధ్యం కాకపోవచ్చు.

అమెరికా, పశ్చిమ ఐరోపాల ఆధిపత్యం యుద్ధం, దాడులు, వాల్ స్ట్రీట్, ద సిటీ ఆఫ్ లండన్, జర్మన్ మాన్యుఫాక్చరింగ్ ఇత్యాదులతో కూడినది కాగా, నూతన వ్యవస్థ ఆధిపత్యం చైనా ఏర్పాటు చేసిన సప్లై చెయిన్ మౌలిక నిర్మాణాలు (పోర్టులు, వంతెనలు, రోడ్లు, ఎక్స్ ప్రెస్ వే లు, ఎయిర్ పోర్టులు, సముద్ర మార్గాలు మొ.వి) ముడి సరుకుల సప్లై పైన ఆధిపత్యం మొదలైన వాటితో కూడిన వ్యవస్థపై ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తోంది.

బహుశా కమ్యూనికేషన్ టెక్నాలజీ అనూహ్య స్థాయిలో అభివృద్ధి చెందటం, మౌలిక నిర్మాణ వ్యవస్థలు సమస్తం కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ల నియంత్రణ లోకి వెళ్ళటం, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సకల రంగాలకు వ్యాప్తి చెందుతుండటం, ఎకనమిక్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ సహితం సాఫ్ట్ వేర్ మరియు ఏఐ ల నియంత్రణ లోకి వెళ్ళటం… వీటన్నింటి వలన భారీ స్థాయిలో సముద్రాల పైనా, కందకాలు తవ్వుకుని సంవత్సరాల తరబడి యుద్ధాలు చేసుకుని తద్వారా అవతలి పక్షం పైన ఆధిపత్యం సాధించాల్సిన అవసరం తప్పిపోయింది.

రానున్న కొత్త వ్యవస్థలో యుద్ధాలకు సెకండరీ స్థానం ఉండవచ్చు. గతంలో యుద్ధం ఫలితం మార్కెట్ల పునః పంపిణీని నిర్ణయించింది. ఇప్పుడు ఒక హార్ముజ్ కంట్రోల్ తో ఇరాన్, అమెరికా పీక పట్టుకుని ఆడిస్తోంది.

హార్ముజ్ కంట్రోల్ అంటే సప్లై లైన్ పైన కంట్రోల్ అని సైద్ధాంతికంగా భావించాలి. ఇక్కడ ఒక్క చమురు, గ్యాస్ రవాణా మాత్రమే జరగదు. అనేక ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, ఏ ఐ రంగాలకు హీలియం కావాలి. వ్యవసాయానికి హార్ముజ్ గుండా వచ్చే ఎరువులు కావాలి. మెడికల్ రంగంలోని టెక్నాలజీ కి పెట్రోలియం ఉప ఉత్పత్తులు కావాలి. అనేక పరిశ్రమలకు గ్యాస్ కావాలి. కనుక హోర్ముజ్ రవాణాని నియంత్రిస్తే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ, వాణిజ్య వ్యవస్థలు స్తంభించిపోయే పరిస్ధితి ఏర్పడింది. చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ ని ఈ కోణంలో నుండి చూస్తే గనక చైనా చేతిలో ఎంత శక్తి పేరుకు పోతున్నదో అర్ధం చేసుకోవచ్చు.

28/04/2026

ఎన్ బి సి న్యూస్ ప్రకారం పర్షియన్ గల్ఫ్ ప్రాంతం లోని అమెరికా అనుకూల గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా మిలటరీ స్థావరాలు ఇరాన్ దాడిలో ముందు అనుకున్న దాని కంటే విస్తృతంగా నష్టాలు ఎదుర్కొన్నాయి. మిలటరీ స్థావరాలను రిపేర్ చేసి తిరిగి వాడుకలోకి తెచ్చేందుకు కొన్ని బిలియన్ల డాలర్లు అవసరం అవుతుందని అమెరికాకి చెందిన ముగ్గురు అధికారులు ఎన్.బి.సి న్యూస్ కి చెప్పారు.

ఫిబ్రవరి 28 తేదీన అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ పై దాడి చేసి ఖమేనీ, ఐ.ఆర్.జి.సి నాయకత్వాన్ని చంపేసిన కొద్ది గంటల లోనే తేరుకుని ఇరాన్ అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలపై ప్రతి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్ దాడుల్లో ఆయుధాల గిడ్డంగులు, కమాండ్ హెడ్-క్వార్టర్లు, కమ్యూనికేషన్లకు సంబంధించిన మౌలిక వ్యవస్థలు, మిలటరీ విమానాల రన్ వే లు, అత్యున్నత స్థాయి రాడార్ వ్యవస్థలు, డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు నాశనం అయ్యాయని అమెరికా అధికారులు ధృవీకరించారు. అమెరికన్ ధింక్ ట్యాంక్ ‘అమెరికన్ ఎంటర్ ప్రైజ్ ఇనిస్టిట్యూట్’ కూడా ఈ సంగతి ధృవీకరించింది.

అమెరికా ఇంతవరకు చెప్పని విషయం ఏమిటంటే ఇరాన్ కు చెందిన ఎఫ్-5 ఫైటర్ జెట్, కువైట్ గగన తలం లోకి దూసుకుని వెళ్లటమే కాకుండా, కువైట్ లో ఉన్న అమెరికన్ బేస్ క్యాంప్ (బ్యూరింగ్) పైన గ్రావిటీ బాంబులు జార విడిచింది. ఈ దాడిలో 6 గురు అమెరికా సైనికులు చనిపోయారు. ఎలాంటి గైడెన్స్ వ్యవస్థలు లేకుండా కేవలం భూమ్యాకర్షణ వలన విమానం నుండి భూమి పైకి వదిలే బాంబులను గ్రావిటీ బాంబులు అంటారు. ఈ బాంబులు వేయాలంటే శత్రు దేశం గగన తలం లోకి వెళ్లి, శత్రు దేశం లోని మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ నుండి వచ్చే మిసైళ్ల దాడులను తప్పించుకుంటూ దాడి చేయాలనుకున్న ఏరియాకి సరిగ్గా పై నుండి బాంబులు వదలాలి. 1950 లలో జరిగిన కొరియా యుద్ధం తర్వాత ఈ తరహాలో అమెరికా మిలటరీ స్థావరం పైకి వెళ్లి గ్రావిటీ బాంబులు వేయటం ఇంతవరకు జరగలేదు. అమెరికా కూడా అలాంటి సాహసానికి దిగలేదు.

రష్యా కి చెందిన ఫ్యాబ్ – 500 బాంబుని ఇలా కువైట్ గగన తలం లోకి చొచ్చుకెళ్లి ఇరాన్ ఎఫ్-5 ఫైటర్ జెట్ జారవిడిచింది. కువైట్ శిథిలాల్లో ఫ్యాబ్-500 బాంబు శిథిలాలు ఉన్న సంగతిని అప్పటి ఫోటోల ద్వారా రష్యన్ మిలటరీ విశ్లేషకులు గుర్తించి వెల్లడి చేశారు కూడా.

విదేశీ మంత్రి అబ్బాస్ అరాఘ్చి నాయకత్వంలో సోమవారం ఇస్లామాబాద్ వెళ్ళిన ఇరాన్ బృందం కొత్త ప్రతిపాదనను పాకిస్తాన్ కు ఇచ్చింది. దీని ప్రకారం ఆరంభ దశలో మూడు అంశాల పైన ఒప్పందానికి ఇరాన్ ఓ కె చెప్పింది. మొదటి దశలో ఇరాన్ అణు శుద్ధి సామర్ధ్యం, శుద్ధి చేసిన యురేనియం అంశాల పై చర్చించేందుకు ఇరాన్ నిరాకరించింది. మూడు అంశాలు ఏమిటన్నదీ స్పష్టంగా బైటకి రాలేదు. బహుశా అమెరికా బ్లాకేడ్, ఇరానియన్ హోర్ముజ్ నిబంధనల సడలింపు లాంటి అంశాలు మొదటి విడతగా జరిగే చర్చల్లో ఉండవచ్చని భావిస్తున్నారు.

చర్చల పట్ల తమకేమీ తొందర లేదని, తాము ఆతృతగా ఉన్నామనటం నిజం కాదని, ఇరాన్ తమతో చర్చించాలి అనుకుంటే “మాకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు” అని ట్రంప్ సోమవారం ఆర్భాటంగా ప్రకటించాడు కదా. కానీ రాయిటర్స్ ప్రకారం అమెరికా అధ్యక్షుడే ఇరాన్ చర్చలు జరపాలని అడుక్కున్నాడు. సోమవారం రష్యా (మాస్కో) వెళ్ళిన అబ్బాస్ ఆరాఘ్చి అక్కడ విలేఖరులతో మాట్లాడుతూ చర్చలు జరపాలని ట్రంప్ నుండి విజ్ఞప్తి అందిందని ఆయన విజ్ఞప్తిని తాము పరిశీలిస్తున్నామని చెప్పాడు. అమెరికా యుద్ధం ద్వారా ప్రకటిత లక్ష్యాల్లో ఒక్క దాన్ని కూడా సాధించలేక పోవటంతో చర్చల కోసం ట్రంప్ విజ్ఞప్తి చేస్తున్నట్లు భావిస్తున్నామని అరాఘ్చి చెప్పాడు.

వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ప్రకారం ట్రంప్, అతని నేషనల్ సెక్యూరిటీ టీం కి ఇరాన్ ఇచ్చిన ప్రతిపాదన పట్ల అనుమానంతో ఉన్నారు. ఇరాన్ ప్రతిపాదనని ట్రంప్ మొత్తంగా తిరస్కరించలేదు. అయితే ఇరాన్ ప్రతిపాదన నిజాయితీతో కూడుకున్నదేనా అన్న అనుమానం ఆయనకి ఉన్నదట. అయినప్పటికీ ఇరాన్ తో చర్చలు జరపటం అమెరికా కొనసాగిస్తుందని అమెరికా అధికారులను వాల్ స్ట్రీట్ జర్నల్ ఉటంకించింది. ఇరాన్ ప్రతిపాదన పైన అమెరికా స్పందన ఏమిటన్నదీ కొద్ది రోజుల్లో వైట్ హౌస్ తెలియజేస్తుంది.

అమెరికా, గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో విధించిన బ్లాకేడ్ ని ఎత్తివేయాలని, ప్రతిగా హోర్ముజ్ జలసంధి బ్లాకేడ్ ని తాను ఎత్తివేస్తానని ప్రతిపాదించిందని, అణు చర్చలు మాత్రం వాయిదా వేయాలని ఇరాన్ కోరిందని ట్రంప్ తన అధికారులకు చెప్పాడు. అణు చర్చల వాయిదా ను కోరటం పట్ల ట్రంప్ అసంతృప్తిగా ఉన్నాడని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.

లాండ్రీలో మంటలు చెలరేగాయంటూ రిపేర్ల కోసం వెళ్ళిన అమెరికా విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, మళ్ళీ పర్షియన్ గల్ఫ్ కి వచ్చింది. ఐతే ఇరాన్ మిసైల్ దాడికి అందకుండా ఇరాన్ తీరానికి 350 కి.మీ దూరంలో నిలబడి పోయింది. “మేము వెనకడుగు వేయలేదు” అని చెప్పుకోవటానికా అన్నట్లుగా పర్షియన్ గల్ఫ్ కి వచ్చిందని, కానీ ఇరాన్ దాడికి భయపడి దూరంగా ఉండిపోయిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇంకా అదనంగా మరొక విమాన వాహక నౌక సమీపంలోకి వచ్చిందని అమెరికా మళ్లీ దాడులు చేయొచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు.

ఇరాన్ మిసైల్ దాడికి కూలిపోయిన ఎఫ్-15 ఫైటర్ జెట్ విమానం నుండి ఇద్దరు పైలట్లు ఎజెక్ట్ అయ్యారని ఒక పైలట్ కువైట్ లో దిగగా, మరొక పైలట్ ఇరాన్ లో దిగాడని ఇరాన్ లో దిగిన పైలట్ ని అమెరికా బృందం వీరోచితంగా ఇరాన్ లో చొరబడి అతన్ని రక్షించి వెనక్కి తిరిగి తెచ్చిందని పశ్చిమ పత్రికలు, డొనాల్డ్ ట్రంప్ లోకానికి చెప్పిన సంగతి తెలిసిందే. సాధారణంగా అలాంటి పైలట్ ని తమ సాహసత్వానికి ప్రతీకగా టి.వి కెమెరాల ముందు ప్రదర్శిస్తారు. తమ పైలట్లు సాహస వీరులు అని చాటుతారు. కానీ ఇంతవరకు తాము ఇరాన్ నుండి రక్షించి తెచ్చామని చెప్పిన పైలట్ గురించి అమెరికా ఇంతవరకు చెప్పలేదు. చూపించలేదు.

వ్యాఖ్యానించండి