ఇరాన్ యుద్ధ తంత్రానికి ప్రశంసలు -నోట్స్ & అప్ డేట్స్ 10


Germany Chancellor Frederick Merz sits with high school students

29/04/2026

జర్మనీ ఛాన్సలర్ (ఆ దేశ అధ్యక్షుడితో సమానం) ఫ్రెడరిక్ మెర్జ్ ఇరాన్ – అమెరికా యుద్ధం గురించి వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఆయన నిజానికి అమెరికాకి పక్కా అనుకూలుడు. కానీ పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ అనుసరించిన ఎత్తుగడలను పొగడకుండా ఉండలేకపోయాడు. యుద్ధం అనంతర చర్చల్లో ఇరాన్, అమెరికా ప్రతినిధులకు గర్వభంగం కావించిందని మొహమాటం లేకుండా చెప్పాడు. జర్మనీ లో ఒక కాలేజీ విద్యార్థులతో మాట్లాడుతూ యుద్ధం ఎలా ముగించాలో అమెరికాకి తెలియటం లేదని వ్యాఖ్యానించాడు. యుద్ధంలోకి దిగేముందే యుద్ధ నుండి ఎలా బైటపడాలో అన్న విషయంలో కూడా నిర్దిష్ట అవగాహన ఉండాలని కానీ అమెరికా అదేమీ లేకుండా యుద్ధం లోకి దిగిందని ఎత్తిపొడిచాడు. “చర్చల్లో ఇరాన్ ప్రతినిధులు చాలా నైపుణ్యంతో వ్యవహరిస్తున్నారు. నిజానికి ఎంతో నైపుణ్యంతో వాళ్లు చర్చలు జరపకుండానే చర్చలు చేస్తున్నారు” అన్నాడు.

మెర్జ్ ఉద్దేశ్యం ఏంటంటే ఇరాన్, అమెరికాతో చర్చలు చేస్తూనే చర్చలు జరపని ఫలితాన్ని రాబడుతోంది అని. అమెరికా డిమాండ్ చేస్తున్న అంశాలను చర్చలోకి రాకుండా అమెరికాయే ఇరాన్ సృష్టించిన అంశాల చుట్టూ చర్చలను తిప్పటం ఇరాన్ సాధించిన విజయం. యుద్ధానికి ముందు హోర్ముజ్ జలసంధి శుభ్రంగా తెరుచుకునే ఉంది. వాణిజ్య నౌకలు బ్రహ్మాండంగా హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణం చేశాయి. యుద్ధం విరమణ జరిగే సరికి హోర్ముజ్ జలసంధి ఒక పెద్ద సమస్యగా అమెరికా, ప్రపంచం ముందు నిలబడి ఉంది. అంటే అమెరికా యుద్ధ లక్ష్యాలను ఫలితాలుగా రాబట్టలేకపోగా కొత్త సమస్యను తెచ్చుకుంది. పైగా ఇరాన్ బ్లాకేడ్ ని ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ తానే ఇంకొక బ్లాకేడ్ విధించింది. అమెరికా బ్లాకేడ్ ఉన్నప్పటికీ ఇరాన్ చమురు తీసుకెళ్లే 130 వరకు ట్యాంకర్లు బైటికి వెళ్ళినట్లు అమెరికా పత్రికలే రాశాయి.

“మొత్తం అమెరికా దేశానికే ఇరాన్ గర్వభంగం కలిగిస్తున్నది” అని జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ స్పష్టం చేశాడు. ఇరాన్ పైన అమెరికా చేస్తున్న యుద్ధం వలన జర్మనీ, ఐరోపా దేశాలు పెద్ద మొత్తంలో నష్టపోతున్నాయి అని వాపోయాడు కూడా. జర్మనీ జిడిపి పైన ఇరాన్ యుద్ధం ప్రభావం నేరుగా పడుతోందన్నాడు. హోర్ముజ్ జలసంధి పాక్షికంగా మూసుకోవటం వలన అధిక ధరలకి ఐరోపా దేశాలు చమురును కొంటున్నాయి.

ఇరాన్ పైన ట్రంప్ దాడి చేయటాన్ని జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యుకె దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు ఫిబ్రవరిలోనే ఖండించారు. అలాగని వాళ్ళు ఇరాన్ కి మద్దతు ఇచ్చారని అర్ధం కాదు. వాళ్ళని సంప్రదించకుండా, నాటో కూటమికి చెప్పకుండా, అందరితో కలిసి పధక రచన చేయకుండా దాడి చేశాడన్నది వారి ఆరోపణ. మొదట ఇరాన్ యుద్ధాన్ని ఖండించిన జర్మన్ ఛాన్సలర్, మార్చి నెల మధ్యకి వచ్చేసరికి “ఈ సమయంలో అమెరికాకి లెక్చర్ ఇవ్వటం సరైనది కాదు. అణు విధానంతో ప్రపంచానికి చేటు తెస్తున్న ఇరాన్ ను శిక్షించవలసిందే” అని ప్రకటించాడు. అదే మెర్జ్ ఇప్పుడు ఇరాన్ యుద్ధతంత్రాన్ని పొగుడుతున్నాడు.

యూరోపియన్ కమిషన్ అధికారిక అంచనా ప్రకారం యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు యూరోపియన్ యూనియన్ లోని సభ్య దేశాలు కేవలం ఆయిల్, గ్యాస్ ల కోసమే మొత్తం 30 బిలియన్ డాలర్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది.

ట్రంప్ పుణ్యాన అంతర్జాతీయ బలా బలాల సమతూకం లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయని, ఈ నేపథ్యంలో యూరోపియన్ దేశాల మధ్య మరింత లోతైన సమగ్రమైన ఐక్యత సాధించాలని ఐరోపా దేశాలు భావిస్తున్నట్లుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.

2009 నుండి దాదాపు ఐదారేళ్ల పాటు ఐరోపాను కుదిపేసిన రుణ సంక్షోభం కాలంలో యూరోపియన్ యూనియన్, యూరో జోన్ లు విచ్చిన్నం అవుతాయా అన్న వాతావరణం ఏర్పడింది. అందుకు తగ్గట్లు బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుండి బైటికి వెళ్లిపోయింది కూడా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా, ఐరోపా దేశాలపై టారిఫ్ లు మోపి, నాటో ను అమెరికా బహిష్కరిస్తుంది అని బెదిరిస్తూ ఉండడంతో యూరోపియన్ యూనియన్ మరింత ఐక్యం కావాలని ఐరోపా నేతలు పిలుపు ఇస్తున్నారు. ఇంతలో ఎంత తేడా?!

యూరోపియన్ యూనియన్ దేశాలు గట్టిగా ఐక్యం కావాలని జర్మనీ ఛాన్సలర్ ఈ సందర్భంగా హితబోధ చేశాడు. అమెరికా కంటే యూరోపియన్ యూనియన్ జనాభా 100 మిలియన్లు ఎక్కువని చెబుతూ, ఐరోపా దేశాలు కలిసి మెలిసి పనిచేస్తే అమెరికాతో సమానంగా శక్తివంతం కాగల సామర్థ్యం ఉన్నదని, అటువంటి కృషిలో ఇయు కు జర్మనీ యే నాయకత్వం వహిస్తుందని జర్మనీ ఛాన్సలర్ వ్యాఖ్యానించాడు.

జర్మనీ ఛాన్సలర్ వ్యాఖ్యలు అమెరికా నాయకత్వం లోని పాత ప్రపంచ వ్యవస్థ అంతర్ధానమై సరికొత్త ప్రపంచ వ్యవస్థ (New World Order) రూపుదిద్దుకుంటున్నది అన్న సంగతిని మరోసారి రుజువు చేస్తున్నాయి.

ఇక ట్రంప్ యధావిధిగా జర్మనీ నేత పైన ఎలా స్పందిస్తాడని అనుకుంటామో సరిగ్గా అలానే స్పందించాడు. జర్మనీ ఛాన్సలర్ పైన వెక్కిరింపులతో విరుచుకు పడ్డాడు. “మెర్జ్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు” అని ఎగతాళి చేశాడు. ఇరాన్ అణ్వాయుధం తయారు చేసుకుంటే ప్రపంచానికి మంచిదే అని ఆయన ఉద్దేశమా అని ప్రశ్నించాడు. ఇరాన్ అణ్వాయుధం జోలికే ఇంతవరకు వెళ్లలేదు అన్నది వేరే విషయం.

రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇరాన్ పైన ప్రశంశలు కురిపించాడు. ఇరాన్ విదేశీ మంత్రి అబ్బాస్ అరాగ్చి మాస్కో వచ్చినపుడు ఆయన “ఇరాన్ ప్రభుత్వం, ఇరాన్ ప్రజలు తమ స్వాతంత్రం, సార్వభౌమాధికారం కోసం అమెరికా, ఇజ్రాయెల్ లతో వీరోచితంగా పోరాడారు” అని ప్రశంసించాడు. పుతిన్ ప్రశంసలలో ఎంతో వాస్తవం ఉన్నది. 40 ఏళ్ళకు పైగా అమెరికా ఆధిపత్యంతో, ఇజ్రాయెల్ జాత్యహంకారంతో తలపడుతూ సవా లక్షా ఆంక్షలకు ఎదురీదుతూ ఎన్ని కష్టాలు ఎదురైనా ఇరాన్ ప్రభుత్వం పక్షాన మద్దతుగా నిలబడి ప్రత్యక్ష పోరాటం చేసిన ఇరాన్ ప్రజలు బహుధా అభినందనీయులు. ప్రజలకు ధీటైన నాయకత్వం అందించిన అయితుల్లా ఆలీ ఖమెనీ ప్రశంసనీయుడు.

TOPSHOT – Russian President Vladimir Putin shakes hands with Iranian Foreign Minister Abbas Araghchi during their meeting at the Boris Yeltsin Presidential Library in Saint Petersburg on April 27, 2026. (Photo by Dmitry LOVETSKY / POOL / AFP via Getty Images)

ఇరాన్ కి అవసరమైనంత సహాయం రష్యా అందజేస్తుందని పుతిన్ ఇరాన్ బృందానికి హామీ ఇచ్చాడు. ఈ హామీని పట్టుకుని “ఇరాన్ కు రష్యా బహిరంగంగానే మద్దతు ప్రకటించింది. ఇక రష్యా కూడా రంగం లోకి దిగుతుందా?” అంటూ పశ్చిమ పత్రికలు గాలి మూటలు పోగు చేశాయి. ఏ context లో మద్దతు (support) పదాన్ని ప్రయోగించాదో విస్మరించాయి.

ఇరాన్ తో రష్యా వ్యూత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని పుతిన్ స్పష్టం చేశాడు. గత ఏడు ఇరాన్, రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఇది 20 ఏళ్ల పాటు కొనసాగేలా ఇరు దేశాలు ఒప్పందానికి వచాయి. ఒప్పందం ఉన్నప్పటికీ రష్యా నుండి ఇరాన్ కు అందిన ఆధునిక ఆయుధ సహాయం తక్కువే. ఇరాన్ ప్రధానంగా స్వదేశీ పరిజ్ఞానం పైనే ఆధారపడి అమెరికా, ఇజ్రాయెల్ లతో తలపడింది. ఇంకా చెప్పాలంటే రష్యా గతంలో ఎప్పుడో సరఫరా చేసిన యుద్ధ విమానం (ఫైటర్ జెట్) తో అమెరికా అత్యాధునిక మిసైల్ రక్షణ వ్యవస్థ కళ్లుగప్పి కువైట్ గగనతలం లోకి చొచ్చుకెళ్లి 7 గురు అమెరికా సైనికులను చంపింది కూడాను. నేరుగా అమెరికా సైనిక స్థావరం పైనే గ్రావిటీ బాంబులు జారవిడిచి ఈ ఫలితం సాధించింది.

మలేషియా, ఇండోనేషియా దేశాలతో అమెరికా ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ ఒబ్బందాల ద్వారా మలక్కా జలసంధి (అండమాన్ నికోబార్ ద్వీపాల సమీపంలో ఉంటుంది) ని నియంత్రణ లోకి తెచ్చుకోవాలని అమెరికా ప్రయత్నాలు చేస్తున్నది. చర్చలు ఏ దశలో ఉన్నదీ వివరాలు వెల్లడి కాలేదు. మలేషియా, ఇండోనేషియా దేశాల అవగాహన ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది. అమెరికా ఇందులో అనుకున్న విధంగా సక్సెస్ అయితే చైనా వాణిజ్యం, వాణిజ్య రూట్లకు గట్టి ఆటంకాలు ఎదురవుతాయి.

ఇరాన్ – అమెరికా యుద్ధం దరిమిలా జరుగుతున్న చర్చల పట్ల ఇండియా పాలకుల స్పందన దౌత్య నీతికి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇరాన్ – అమెరికా చర్చలలో శాంతిని నెలకొల్పే మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తున్నట్లు పాకిస్తాన్ పేరు సంపాదించింది. కానీ భారత ఇంటలిజెన్స్ వర్గాలు పాక్ కి ఆ క్రెడిట్ ఇవ్వటానికి వీల్లేదు అంటున్నాయి. పాక్ – యుఎస్ చర్చలకి పాక్ మధ్యవర్తిత్వం వహించటం అంటే అది సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టే అని వాళ్ళు కొట్టిపారేశారు. పాక్, అమెరికా కు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాయని ఇండియా ఇంటలిజెన్స్ ఈ మాటల ద్వారా చెప్పినట్లయింది. టెర్రరిస్టు పాకిస్తాన్ కి “పీస్ బ్రోకర్” పాత్ర పోషించే అర్హత లేదని, టెర్రర్ నెట్ వర్క్ ను నిర్మూలిస్తే శాంతి దానంతట అదే వస్తుందని వాళ్ళు అన్నారని నూస్ వీక్ పత్రిక తెలిపింది. ఇరాన్ కూడా ఇండియా అభిప్రాయంతో ఏకీభవిస్తుందని కూడా వాళ్ళు చెప్పుకున్నారు.

పాకిస్తాన్ కి మధ్యవర్తిత్వం అప్పగించి ఇరాన్, అమెరికా రెండూ “సెల్ఫ్ గోల్” చేసుకున్నట్లు ఇండియా భావిస్తున్నట్లు చెప్పటమే కాకుండా దానికి ఇరాన్ ను కూడా మద్దతు తెచ్చుకోవటం కనీస దౌత్య మర్యాదలకు విరుద్ధంగా ఉంది. అమెరికా శిబిరం ఇరాన్, దాని మిత్రులను (హిజ్బొల్లా, హమాస్, హుతీస్) టెర్రరిస్టులు అని చెబుతుంది. పత్రికలన్నీ అదే రాస్తాయి. ఇప్పుడు ఇండియా, టెర్రర్ నెట్ వర్క్ ను అంతం చేస్తే శాంతి దానంతట అదే వస్తుందని చెప్పటం అంటే ఇరాన్ ను అంతం చేయమని చెప్పిన అర్ధం వస్తుంది. శాంతి విఘాతానికి ఇరాన్ దేశమే కారణం అని చెప్పినట్లు పరోక్ష అర్థం వస్తుంది. ఈ అబ్జర్వేషన్ ద్వారా ఇండియాయే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు కనిపిస్తోంది.

పశ్చిమాసియాలో వివిధ స్థావరాల్లో ఉన్న అమెరికన్ మెరైన్ సైనికుల వ్యక్తిగత వివరాలు తమ చేతిలో ఉన్నట్లు “హందాల” అని పేరు గల ఒక హ్యాకర్ గ్రూపు ప్రకటించింది. ఈ గ్రూపు కి ఇరాన్ ప్రభుత్వ మద్దతు ఉందని భావిస్తున్నారు. కొందరు మెరైన్ సైనికుల వివరాలను వాట్సప్, టెలిగ్రామ్ యాప్ గ్రూపులలో ప్రచురించినట్లు కూడా తెలుస్తోంది. ప్రాథమిక పరిశోధన అనంతరం హ్యాకింగ్ నిజమే అని అమెరికా వర్గాలు నిర్ధారించాయి. 2000 మంది అమెరికన్ మెరైన్ సైనికుల వివరాలు లీక్ కి గురైనాయని అమెరికా వర్గాలు గుర్తించాయి. ఎంతమేరకు హ్యాకింగ్ జరిగిందో గుర్తించే పనిలో అమెరికా పరిశోధక సంస్థలు ఉన్నాయి. ఇరాన్ ప్రభుత్వ మద్దతు ఈ హ్యాకర్లకు ఉంటే గనక ఇరాన్ – అమెరికా + ఇజ్రాయెల్ యుద్ధ ఘర్షణలో ఇరాన్ మరొక ఫ్రంట్ ను తెరిచినట్టే.

వ్యాఖ్యానించండి