హోర్ముజ్ జలసంధి తెరిచేందుకు అమెరికాయే ఆటంకం!


An Oil Tanker in Hormuz Strait

హోర్ముజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అమెరికా సైంధవుడిలా అడ్డు పడుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు హోర్ముజ్ జలసంధి తెరవాలని ఇరాన్ కు పదే పదే ఫర్మానాలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు జలసంధిని ఇరాన్ తెరిచినప్పటికీ హోర్ముజ్ జలసంధికి ఆవల అమెరికా విధించిన బ్లాకేడ్ ని ఎత్తివేసేందుకు ససేమిరా అంటున్నాడు.

విచిత్రం ఏమిటంటే అమెరికా నావల్ బ్లాకేడ్ తొలగించేందుకు మొండిగా నిరాకరిస్తున్న అమెరికా అధ్యక్షుడు అదే నోటితో సీజ్ ఫైర్ గురించి, యుద్ధ విరమణ గురించి, సీజ్ ఫైర్ విషయంలో ఇరాన్ విధించిన నిబంధనల గురించి పచ్చి అబద్ధాలను ప్రకటిస్తున్నాడు. ఇరాన్ ‘యెస్’ అన్న చోట, ఇరాన్ “నో” అన్నది అని చెబుతున్నాడు. ఇరాన్ “నో” అన్న చోట ఇరాన్ “యెస్” అని అంగీకరించింది అని చెబుతున్నాడు.

ట్రంప్ అబద్ధాల చిట్టా!

  1. “హోర్ముజ్ జలసంధి విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన పూర్తిగా తొలగిపోయింది. హోర్ముజ్ జలసంధిని ఇక ఎప్పటికీ మూసి వేయ బోము అని హామీ ఇచ్చింది. హోర్ముజ్ జలసంధి ఇప్పుడు పూర్తిగా తెరుచుకుంది. వాణిజ్యానికి, ప్రయాణానికి అది సిద్ధంగా ఉన్నది” అని ట్రంప్ ట్రూత్ సోషల్ లో చెప్పాడు. కానీ ఇరాన్ అలాంటి హామీ ఏమీ ఇవ్వలేదు. పైగా అమెరికా యుద్ధ నౌకలే జలసంధి కి అవతల చమురు రవాణా చేస్తున్న నౌకలను అడ్డుకుంటున్నాయి.
  2. “గత నెలలో హోర్ముజ్ జలసంధిలో వదిలిన మైన్ లను అమెరికా సహాయంతో ఇరాన్ తొలగించటం మొదలు పెట్టింది” అని ట్రంప్ ప్రకటించగా వాస్తవంలో అలాంటి ఒప్పందం అసలు జరగనే లేదు. అసలు ఇస్లామాబాద్ చర్చల నుండి లేచిపోయి, అమెరికా వెళ్ళిపోయి, వెర్రి మొర్రి షరతులు ప్రకటించిన అమెరికాతో కలిసి మైన్ లు తొలగించే పనికి ఇరాన్ ఎందుకు పూనుకుంటుంది?
  3. “నా డిమాండ్లలో దాదాపు అన్నింటినీ ఇరాన్ ఒప్పుకుంది. తన అణు కార్యక్రమానికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడతానని చెప్పింది” అని ట్రంప్ చెప్పగా ఇరు దేశాల చర్చల్లో ఈ అణు కార్యక్రమం దగ్గరే అమెరికా మడత పేచీ పెడుతోంది. ఓ పక్క పేచీ పెడుతూ మరో పక్క పేచీ ఏమీ లేదని అబద్ధాలు చెబుతోంది.
  4. “యుద్ధం దాదాపు ముగియ వచ్చింది. అంతిమ ఒప్పందం త్వరలో జరుగుతుంది. దాదాపు అన్ని అంశాలని చర్చించాం” అని ట్రంప్ ట్రూత్ సోషల్ లో ప్రకటించగా వాస్తవంలో ఒప్పందం కుదరటం తర్వాత సంగతి ఒప్పందం అంశాలలో ఒక్క దానికి కూడా ఏకాభిప్రాయం లేదు. పైగా అమెరికాయే గడియ గడియ కి మాట మార్చుతూ ఏమి జరుగుతున్నదో తెలియని అయోమయ పరిస్ధితిలోకి అందరినీ నెట్టేసింది.
  5. గత శుక్రవారం “హోర్ముజ్ జలసంధి పై విధించిన దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నాం” అని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ దిగ్బంధనం ఎత్తివేసే వరకు బ్లాకేడ్ విధిస్తున్నాం అని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడేమో ఇరాన్ తన బ్లాకేడ్ ఎత్తివేసినప్పటికీ అమెరికా బ్లాకేడ్ ఎత్తివేయటానికి ట్రంప్ నిరాకరించాడు. “ఇరాన్ దిగ్బంధనంతో సంబంధం లేకుండా అమెరికా బ్లాకేడ్ కొనసాగుతుంది” ట్రంప్ శనివారం స్పష్టం చేశాడు. దానితో ఇరాన్ మళ్ళీ హోర్ముజ్ పైన బ్లాకేడ్ విధించింది.
  6. “ఇరాన్ కి ఆయుధాలు సరఫరా చేయకూడదని నేను చైనాను కోరాను. అందుకు చైనా ఒప్పుకుంది” అని ట్రంప్ చెప్పగా చైనా నుండి అలాంటి ప్రకటన ఏదీ లేదు. “ఆ సంగతి మాకు తెలియదు” అని చైనా ప్రతినిధి చెప్పాడు. ఇంకో పక్క నాటో కూటమిని ‘పేపర్ టైగర్’ అంటూ తిట్టిపోశాడు.
  7. యుద్ధంలో అమెరికా తన మిలటరీ లక్ష్యాలను పూర్తి చేయటమే కాకుండా ఇంకా అంతకు మించి సాధించింది” అని ట్రంప్ ప్రకటించాడు. “ఇరాన్ నూతన ప్రభుత్వం గతం కంటే తక్కువ తీవ్ర భావాలు కలిగినది, తెలివైనది కూడా” అని రాశాడు. కానీ వాస్తవంలో ఇరాన్ లో అసలు ప్రభుత్వం మారనే లేదు. అదే అధ్యక్షుడు ఇంకా పని చేస్తున్నాడు. పైగా కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమెనీ తన తండ్రి కంటే హార్డ్ లైన్ ను అనుసరిస్తాడన్న పేరు ఉన్నది.

ఇరాన్ సమాధానం

ట్రంప్ అబద్ధాలను చూశాక ఇరాన్ తప్పని సరై తమ అవగాహనను ప్రకటించ వలసి వచ్చింది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఎం బి ఘాలీబాఫ్, ట్విట్టర్ లో ప్రకటన విడుదల చేస్తూ 6 అంశాలను స్పష్టం చేశాడు.

  1. అమెరికా అధ్యక్షుడు ఒక గంటలో 7 అంశాలు ప్రకటించి తాము అన్నీ సాధించినట్లు చెప్పాడు. కానీ ఆయన చెప్పిన 7 అంశాలలో ఒక్కటీ నిజం కాదు. అన్నీ అబద్ధాలే.
  2. ఈ అబద్ధాలతో వాళ్ళు యుద్ధాన్ని గెలవలేదు. ఇక చర్చల విషయంలో వాళ్ళు ఖచ్చితంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
  3. అమెరికా బ్లాకేడ్ కొనసాగుతున్నందున హోర్ముజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేదు.
  4. ఇరానియన్ అధికార సంస్థల ఆమోదం మేరకు, “నిర్దిష్ట రూట్ లను” అనుసరించి మాత్రమే హోర్ముజ్ జలసంధి లో ప్రయాణించటం సాధ్యపడుతుంది.
  5. జలసంధి తెరుచుకుంటుందా లేక మూసివేయబడి ఉంటుందా అన్నది గానీ లేదా ఏయే నిబంధనలకు లోబడి హోర్ముజ్ గుండా రవాణా జరుగుతుంది అన్నది గానీ కేవలం హోర్ముజ్ జలసంధి వద్ద ఉన్న పరిస్ధితి పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది తప్ప సోషల్ మీడియా లో ప్రకటనల పైన ఆధారపడి ఉండదు.
  6. మీడియా యుద్ధం, ప్రజాభిప్రాయాన్ని మేనిపులేట్ చేయటం అన్నవి యుద్ధంలో భాగంగా జరుగుతున్నాయి. ఇలాంటి ట్రిక్కు ల తో ఇరాన్ దేశాన్ని మభ్య పెట్టలేరు. ఇటీవల ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇచ్చిన ఇంటర్వ్యూ నుండి చర్చల గురించిన నిజా నిజాలు ఏమిటన్నది తెలుసుకోవచ్చు.
A Govt Supporter in Tehran

ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ప్రకటనను బట్టి ట్రంప్, సోషల్ మీడియా లో రాస్తున్నవన్నీ అబద్ధపు రాతలు తప్ప వాస్తవాలు కాదని అర్ధం అవుతుంది. పైగా సోషల్ మీడియాలో రాస్తున్న వాటికి పూర్తి భిన్నంగా ట్రంప్ ఆచరణ ఉన్నదని అమెరికా చర్యలు తెలియజేస్తున్నాయి.

సోమవారం చమురు రవాణా చేస్తున్న ఇరాన్ చమురు ట్యాంకర్ ఒక దానిని అమెరికా యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు వెంటబడి మరీ నిలిపివేసినట్లు వార్తల ద్వారా తెలుస్తున్నది. అమెరికా సైనిక నౌక ఇరానియన్ ట్యాంకర్ ప్రోపల్షన్ సిస్టమ్ పైకి కాల్పులు జరిపి ట్యాంకర్ ని కదలకుండా చేసి ట్యాంకర్ పైకి ఎక్కినట్లు తెలుస్తున్నది. ట్రంప్ కూడా ఈ సంగతి సోషల్ మీడియా లో ధృవీకరించాడు.

అమెరికా ప్రవర్తనను ఇరాన్ ప్రభుత్వం గట్టిగా ఖండించింది. పాకిస్తాన్ ప్రధాన మంత్రికి ఫోన్ చేసి అమెరికా రౌడీ బిహేవియర్ గురించి తెలియజేసింది. ఇటువంటి ప్రవర్తన ద్వారా చర్చలు జరగకపోగా పరిస్ధితి మరింత క్లిష్టం అవుతుందని హెచ్చరించింది.

కాగా అమెరికా నుండి మరింత మంది సైనికులు పశ్చిమాసియా లోని వివిధ గల్ఫ్ దేశాలకు ఇంకా చేరుకుంటున్నట్లు తెలుస్తున్నది. సోషల్ మీడియాలో చర్చలు త్వరలో జరగనున్నాయని, ఈ వారాంతంలో జరుగుతాయి అని ప్రకటనలు గుప్పిస్తున్న ట్రంప్ వాస్తవంలో ఇరాన్ పైన మరోసారి దాడికి సంసిద్ధం అవుతున్నట్లు తెలుస్తున్నది.

ఇరాన్ నాయకులు కూడా యుద్ధానికి సిద్ధం అన్నట్లు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. యుద్ధం కావాలంటే యుద్ధం, చర్చలు కావాలంటే చర్చలు దేనికైనా తాము సిద్ధమే అని ఇరాన్ స్పష్టం చేస్తున్నది.

డొనాల్డ్ ట్రంప్ మాటల్ని నమ్మిన స్టాక్ మార్కెట్ల సూచికలు లాభాలు నమోదు చేశాయి. చమురు ధరలు కొద్ది మేరకు తగ్గాయి. వాస్తవ పరిస్ధితి ఇరాన్ ప్రకటించిన నేపధ్యంలో స్టాక్ మార్కెట్లు మళ్ళీ పతనం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

వ్యాఖ్యానించండి