బిస్లరీ, ఇతర నీటి కంపెనీలపై దేశ వ్యాపిత తనిఖీలు!

–

దేశ వ్యాపితంగా ఉన్న నీటి శుద్ధి మరియు బాటిలింగ్ కంపెనీలపై తనిఖీలు జరపాలని FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా) నిర్ణయించింది. బాటిళ్ల ద్వారా సరఫరా చేస్తున్న మంచి నీరు నిర్ణయించబడిన ప్రమాణాల మేరకు క్వాలిటీ ఉండేలా తయారు చేస్తున్నదీ లేనిదీ ఈ తనిఖీలలో పరిశీలించ నున్నారని FSSAI సి‌ఈ‌ఓ రజిత్ పున్హానీ చెప్పారు.

వివిధ ఆహార కేటగిరీలను నిర్దేశిత ఆరోగ్య ప్రమాణాల మేరకు నిర్వహిస్తున్నదీ లేనిదీ దేశ వ్యాపితంగా తనిఖీలు చేస్తున్నామని, అందులో భాగంగానే మంచి నీరు బాటిళ్ల సరఫరా కంపెనీలను కూడా తనిఖీ చేస్తామని FSSAI చెబుతోంది. “ప్రాసెస్ ని ఇప్పటికే ప్రారంభించాం. దీనిని దేశం అంతా చేస్తున్నాం. ఫలితాలు వెలువడేందుకు కనీసం ఒకటి నుండి రెండు నెలల కాలం పడుతుంది” అని ఆయన చెప్పాడు.

ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీలను తనిఖీ కోసం ఎంపిక చేయటానికి నిర్దిష్ట కారణం ఏమీ లేదని FSSAI యేటా ఈ విధమైన నిఘా కార్యకలాపాలు నిర్వహిస్తుందని, అందులో భాగంగానే ఈ సారి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తనిఖీలు చేస్తున్నామని పున్హానీ చెప్పాడు. “గత యేడు డైరీ, గుడ్లు, గోధుమ, ఎనర్జీ డ్రింక్ లు, తీపి పానీయాలు మొ.న ఉత్పత్తుల పైన తనిఖీలు నిర్వహించాం. ఇప్పుడు తాగు నీరు తనిఖీలు మొదలు పెట్టాం. ఇదంతా రొటీన్ లో భాగం” అని పున్హానీ వివరించారు. కేవలం చట్టపరంగానే కాకుండా నైతిక అంశాల రీత్యా కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పాడు.

బిస్లరీ వివాదం

గత కొద్ది రోజులుగా బిస్లరీ వాటర్ బాటిళ్లలోని నీటి కాలుష్యం, క్వాలిటీ పైన వివాదం నడుస్తోంది. గోవాలో బిస్లరీ ఇంటర్నేషనల్ కంపెనీ కి చెందిన మంచి నీటి శుద్ధి కంపెనీ అందిస్తున్న నీటిలో మోతాదుకు మించి కలుషితాలు ఉన్నట్టు శాంపిల్ పరీక్షలలో తేలింది. బ్రోమైట్ అనే రసాయనం అనుమతించిన మోతాదుకు మించి బిస్లరీ వాటర్ బాటిళ్లలో ఉన్నట్టు తేలింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 ప్రకారం బిస్లరీ బాటిల్ నీళ్లు బ్రోమైట్ ఉనికి వలన ఆరోగ్యానికి ప్రమాదకరం అని తేల్చారు.

బ్రోమైట్ రసాయనం మోతాదుకు మించి నీటి ద్వారా శరీరంలో ప్రవేశించటం ప్రమాదకరం. పరిమితికి మించిన మోతాదులో బ్రోమైట్ కలిసి నీరు తాగితే బ్లడ్ ప్రెజర్ బాగా పడిపోతుంది. ఫలితంగా మెదడు కు వెళ్ళే రక్తనాళాలలో ఆక్సిజన్ తగిన మొత్తంలో అందక మెదడు తీవ్రంగా దెబ్బ తింటుంది. కనుక బ్రోమైట్ పరిమాణం తాగు నీటిలో మోతాదుకు మించి ఉండటానికి వీలు లేదు.

ఈ నేపధ్యంలో బిస్లరీ కంపెనీని ప్రాసిక్యూట్ చేసేందుకు FSSAI సంస్థ తగిన అనుమతిని నవంబర్ 23 తేదీన మజూరు చేసింది. ఐతే FSSAI, బిస్లరీ కంపెనీ నుండి సేకరించిన నీటి శాంపిళ్లలో బ్రోమైట్ రసాయనం మోతాదుకు మించి ఉందన్న ఆరోపణను బిస్లరీ కంపెనీ తిరస్కరించింది. కంపెనీ పై తనిఖీ చేయాలన్న ఆదేశానికి వ్యతిరేకంగా అప్పీలుకు వెళ్లింది.

బిస్లరీ కంపెనీ అప్పీలుకు వెళ్లటంతో అదే శాంపిల్ ను మరోసారి పరీక్షలు జరిపేందుకు రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీలకు కూడా తనిఖీల నిమిత్తం పంపించారు. ప్రైవేటు ల్యాబొరేటరీల పరీక్షల్లో కూడా బ్రోమైట్ కు బదులు పాలిన్యూక్లియర్ ఆరోమేటిక్ హైడ్రో కార్బన్ లు అనుమతికి మించిన మోతాదులో ఉన్నట్టు తేలింది. దానితో బిస్లరీ కంపెనీకి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది.

ఐతే తాము తనిఖీలు చేసిన శాంపిళ్లు కేవలం ఒకే ఒక బ్యాచ్ కి సంబంధించినవనీ తాము కూడా ఆ ఒక్క శాంపిల్ విషయంలోనే కంపెనీ పైన చర్యలు తీసుకున్నామని FSSAI ప్రకటించింది. సదరు బ్యాచ్ నెంబరు GO 270 అని తెలిపింది. దక్షిణ గోవా లోని వెర్ణా ఎలక్ట్రానిక్ సిటీ లోని బిస్లరీ ప్లాంట్ నుండి ఈ నీటి శాంపిళ్లు సేకరించామని తెలిపింది.

ప్రారంభంలో అనగా 1965 లో బిస్లరీ కంపెనీ ఇటలీ కి చెందిన కంపెనీ కాగా ప్రస్తుతం చౌహాన్ కుటుంబం ఈ కంపెనీని నిర్వహిస్తున్నది. ఇండియాలో ఉచితంగా లభించే భూగర్భ జలవనరులు, సహజ నీటి చెలమల నుండి లభించే నీటి వనరులను ఉపయోగించేందుకు ప్రభుత్వం నుండి లైసెన్స్ పొంది అనేక యేళ్లుగా వందల కోట్లు గడిస్తున్న వాటర్ బాటిలింగ్ కంపెనీలు దేశ ప్రజలకు తీరని నష్టం చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు వారికి మద్దతుగా నిలుస్తున్నాయి.

ఇలాంటి కంపెనీల పైన FSSAI లాంటి ప్రభుత్వ నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవటం అన్నది కల్ల. ఈ కంపెనీలు ఎన్ని అనైతిక చర్యలకు పాల్పడినప్పటికీ చట్టం నుండి తేలికగా తప్పించుకోగలవు.

స్పందించండి