ఇద్దరు EC లు ఫిర్యాదు చేసిన అధికారిపై చర్య అనుచితం -కేబినెట్ సెక్రటరీ వింత వాదన!

Cabinet Secretary Swaminathan

–

భారత దేశ అత్యున్నత మంత్రి మండలిని కేబినెట్ అంటారు. ప్రధాన మంత్రి దీనికి నాయకుడు. ఈ కేబినెట్ వ్యవహారాలను పర్యవేక్షించటానికి నియమించబడే బ్యూరోక్రాట్ అధికారిని కేబినెట్ సెక్రటరీ అంటారు. ప్రతి మంత్రిత్వ శాఖకు ఒక సెక్రటరీ ఉంటే సకల కేబినెట్ మంత్రుల శాఖలను పర్యవేక్షించటం కేబినెట్ సెక్రటరీ పని. ప్రతి మంత్రిత్వ శాఖ సెక్రటరీ పైన ఈ కేబినెట్ సెక్రటరీకి డైరెక్ట్ అజమాయిషీ ఉండదు. కానీ కేబినెట్ మంత్రిత్వ శాఖల కార్యదర్శుల పనులను కో-ఆర్డినేట్ చేసే అధికారం, పాలనాపరమైన అధికారం, వారందరికీ సలహాలను ఇచ్చే ప్రత్యేక అధికారాలను కేబినెట్ కార్యదర్శి కలిగి ఉంటాడు.

ప్రస్తుతం కేబినెట్ సెక్రటరీగా టివి స్వామినాధన్ పని చేస్తున్నారు. భారత ఎన్నికల కమిషన్ లోని ఒక అధికారి ముగ్గురు సభ్యులతో కూడిన ఎన్నికల కమిషన్ లోని ముగ్గురు కమిషనర్లకు తెలియకుండా అక్రమ చర్యలకు పాల్పడిన సంగతిని కమిషన్ లోని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి లు విడి విడిగా జులై 29 తేదీన ఫిర్యాదు చేసి తగిన చర్య తీసుకోవాలని కోరిన సంగతిని ఇండియన్ ఎక్స్ ప్రెస్ సరిగ్గా నెల రోజుల క్రితం సెప్టెంబర్ 23 తేదీన బట్ట బయలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఫిర్యాదు లేఖలకు స్పందించి అక్రమాలకు పాల్పడిన అధికారి పైన చర్యలు చేపట్టడానికి బదులు, సదరు అధికారి పైన చర్యలు తీసుకుంటే గనక అది “అనుచితం, అసంబద్ధం” అవుతుందని, అంతే కాకుండా స్వతంత్ర ఎన్నికల కమిషన్ సంస్థ వ్యవహారాల లోకి ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లు అవుతుందని కేబినెట్ సెక్రటరీ స్వామినాధన్, ఫైల్ నోటింగ్స్ లో రాసినట్టు ఒక ఆర్‌టి‌ఐ రిప్లై ద్వారా వెల్లడి అయింది.

పారదర్శకత (ట్రాన్సఫరెన్సీ) ప్రచార ఉద్యమకారుడు లోకేష్ కె బాత్రా (రిటైర్డ్) ఇద్దరు ఎన్నికల కమిషన్ ఫిర్యాదుల గురించిన సమాచారం ఇవ్వాలని కోరుతూ ఆర్‌టి‌ఐ దరఖాస్తు చేయగా ఎన్నికల కమిషన్, లేఖతో సమాధానం ఇచ్చింది. దాని ప్రకారం ఇద్దరు ఎన్నికల కమిషనర్లు విడి విడి గా కేబినెట్ సెక్రటరీకి కి “సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనీష్ గార్గ్” అనే అధికారి పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఆర్.టి.ఐ ఎంక్వైరీకి ఇచ్చిన సమాధానం ప్రకారం, ఇద్దరు కమిషనర్ల ఫిర్యాదులు తమకు అందాయని ఎక్నాలెడ్జ్ చేస్తూనే, అక్రమానికి పాల్పడిన డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనీష్ గార్గ్ పైన చర్య తీసుకుంటే గనక అది ఎలక్షన్ కమిషన్ అనే రాజ్యాంగ సంస్థ సొంత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని, చర్య తీసుకోవటం అనుచితం అవుతుందని కేబినెట్ సెక్రటేరియట్ భావించిందట!

అదీ సంగతి! అవసరం అయినప్పుడు రాజ్యాంగ సంస్థల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చు. సిబిఐని ప్రత్యర్ధి పార్టీల నేతలపై ఉసిగొల్పవచ్చు; ఇడి చేత మొదట ప్రత్యర్ధిపై దాడి చేసి, అరెస్ట్ చేసి ఆ తర్వాత ఏ కేసు పెట్టాలా అని వెతుకులాట సాగించ వచ్చు. సివిసి, ఎన్‌హెచ్‌ఆర్‌సి, లోక్ పాల్, లోకాయుత, మొ.న అవినీతి నిరోధక సంస్థలను నామమాత్రం చేయొచ్చు. చివరికి సుప్రీం కోర్టు జడ్జిల నియామకాలలో తస్మదీయుల నియామకాలను ఏళ్ల తరబడి నాన్చవచ్చు.

ఒక వేళ సదరు రాజ్యాంగ సంస్థలు తమ కోసం అక్రమాలకు పాల్పడితే గనక అప్పుడు అసలు రాజ్యాంగ సూత్రాలను ఉపయోగించి చర్య తీసుకోకుండా తప్పుకోవచ్చు. చర్య తీసుకోలేదేమిటని అడిగితే “అది స్వతంత్ర సంస్థ. రాజ్యాంగం దానికి స్వతంత్ర అధికారాలు అప్పగించింది. అందులో జోక్యం చేసుకుంటే, అది అక్రమ చర్యలకు తమకు అప్పగించిన రాజ్యాంగ విధులకు విరుద్ధంగా చర్యలకు పాల్పడినా సరే, అది స్వతంత్ర సంస్థ గనుక చర్యలు తీసుకోకుండా ఆగిపోవచ్చు. ఎందుకంటే చర్యలు తీసుకుంటే తమకు ఒరిగే రాజకీయ ప్రయోజనాలకే ఎసరు వస్తుంది గనుక!

ఆర్.టి.ఐ రిప్లై లో ఫైల్ నోటింగ్స్ వివరాలను కేబినెట్ సెక్రటేరియట్ అందజేసింది. వాటి ప్రకారం అడ్మినిస్ట్రేషన్ కి ఒరిజినల్ ఇన్-చార్జ్ గా ఉన్న డెప్యుటీ ఎలక్షన్ కమిషనర్ యేటూరు భాను ప్రకాష్, జులై 27 నుండి ఆగస్టు 9 వరకు సెలవులో వెళ్ళాడు. ఆయన స్థానంలో మరో డెప్యుటీ ఇసి మనీష్ గార్గ్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. చార్జ్ తీసుకున్న కొన్ని గంటల్లోనే, జులై 28 తేదీన కొత్త వర్క్ ఎలోకేషన్ (ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వహించాలి) మనీష్ గార్గ్ ఆర్డర్ జారీ చేశాడని ఇద్దరు ఇసి లు ఫిర్యాదు చేశారు. “అత్యున్నత అధికారులైన ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ లతో అసలు చర్చించకుండా, వర్క్స్ ఎలోకేషన్ వివరాల గురించి వారికి కనీసం సమాచారం ఇవ్వకుండా ఈ ఆర్డర్ ను మనీష్ గార్గ్ జారీ చేశాడని ఫిర్యాదు చేశారు. వివేక్ జోషి అదే అంశాలతో వేరే లేఖ రాస్తూ “నేను సంబంధిత ఫైల్ ఇవ్వాలని కోరినప్పటికీ అడ్మినిస్ట్రేషన్ డివిజన్ ఇవ్వటానికి నిరాకరించింది” అని ఫిర్యాదు చేశాడు.

అత్యున్నత స్థాయి రాజకీయ నాయకుల మద్దతు లేకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోని రెండో స్థాయి అధికారులు ఈ విధంగా అగ్ర స్థాయి అధికారులైన ఎన్నికల కమిషనర్ ల డైరెక్ట్ ఆదేశాలను ఇంత పచ్చిగా ఉల్లంఘించటం సాధ్యం కాదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు తక్కువా కాదు, ఎక్కువా గాడు. 2023 లో మోడి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్నికల కమిషన్ చట్టమే ఈ సంగతి స్పష్టం చేసింది. చట్టం ప్రకారం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, తన నిర్ణయాలను వీలైనంత వరకు ఏకాభిప్రాయంతో చేయాలి. విభేదాలు తలెత్తితే మెజారిటీ నిర్ణయాన్ని అమలు చేయాలి. ఈ సూత్రం వల్ల సమస్య తలెత్తినపుడు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్న ఇద్దరు కమిషనర్లకు అసలు సమాచారమే ఇవ్వకుండా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నాడని స్పష్టం అవుతోంది.

కేబినెట్ సెక్రటేరియట్ ఫైల్ నోటింగ్స్ ప్రకారం, ఇద్దరు ఇసి ల ఫిర్యాదుపై అంతర్గత చర్చ మొదట ఆగస్టు 3, 4 తేదీల్లో జరిగింది. ఆగస్టు 5 తేదీన ఫిర్యాదు అందినట్టు ఇద్దరు ఇసిలకు ఎక్నాలడ్జ్ మెంట్ పంపారు. అందులో సిఇసి గ్యానేష్ కుమార్ కు, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కు కాపీలు పంపినట్టు తెలుస్తోంది.

మొదటి నోటింగ్ ఇలా పేర్కొంది: “డిఇసి (అడ్మిన్) లింక్ ఆఫీసర్ గా చార్జ్ తీసుకున్నాక శ్రీ గార్గ్, ఉన్నత అధికారులు కమిషనర్ లతో చర్చించకుండా రివైజ్డ్ వర్క్ ఎలోకేషన్ గురించిన ఆర్డర్ జారీ చేశాడు. కమిషన్ లో ముదస్తు చర్చ, కమిషన్ ఆమోదం లేకుండా, ఇటువంటి చర్యలు తీసుకోవద్దని అనేకసార్లు, పదే పదే సంబంధిత అధికారులందరికి నోటి మాట ద్వారా, రాతపూర్వక సూచనల ద్వారా ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇది జరుగుతూనే ఉన్నదని ఇద్దరు ఇసి లు ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అభిప్రాయం ఏమిటో తెలియజేయాలని మేము కోరుతున్నాము. తదనుసారం డ్రాఫ్ట్ డిఓ ను ఆమోదం కోసం తయారు చేస్తున్నాము.”

మరో నోటింగ్ లో ఈ విషయం సారాంశం రాస్తూ ఈ అంశాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు DoPT ల నోటీస్ కు తీసుకు రావాలని నిర్ణయించబడింది. కేబినెట్ సెక్రటేరియట్ ఆగస్టు 4 తేదీన “ఈ విషయం కమిషన్ లో కేబినెట్ అపాయింట్ మెంట్స్ కమిటీ నియమించిన అధికారి యొక్క ప్రవర్తనకు సంబంధించినది. ఎలక్షన్ కమిషన్, చట్టం ప్రకారం బహుళ సభ్యుల రాజ్యాంగ సంస్థగా పని చేస్తుంది. అది వీలైనంత వరకు ఏకాభిప్రాయంతో లేదా మెజారిటీ నిర్ణయం తో పని చేయాల్సి ఉన్నది.”

“కమిషన్ ఒక రాజ్యాంగ సంస్థ. అందులో ఎగ్జిక్యూటివ్ (కేంద్ర ప్రభుత్వం) జోక్యం చేసుకునే వీలు లేకుండా చట్టం రూపొందించబడింది. తద్వారా అది స్వతత్రంగా, పారదర్శకంగా పని చేయాలని చట్టం భావించింది… పై లేఖలు ఇద్దరు ఇసి లు వ్యక్తిగత కమిషనర్ హోదాలో రాశారు. లేఖలను తగిన ప్రాముఖ్యత ఇస్తూనే, ఎలక్షన్ కమిషన్ ఏక మొత్తంగా (ఉమ్మడిగా) రాసిన లేఖలుగా పరిగణించలేము” అని కేబినెట్ సెక్రటేరియట్ నోట్ చేసింది.

సదరు నోట్ ఇంకా ఇలా పేర్కొంది: “హిమాచల్ ప్రదేశ్ కి చెందిన ఐఏఎస్ కేడర్ ఐన గార్గ్ ను కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ నియమించినప్పటికీ, ఆయన ఇప్పుడు భారత ఎలక్షన్ కమిషన్ లోని ఒక అధికారి. ఆయన ప్రవర్తనను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కు చెందిన నియమ నిబంధనకు మరియు మార్గదర్శక సూత్రాలే నియంత్రిస్తాయి… తగిన చర్య కోసం ఇద్దరు ఇసి లు ఈ ల్ఖలు రాశారు. కానీ కమిషన్ అధికారిక ఉమ్మడి నిర్ణయం కానందున ఈ దశలో చర్య తీసుకోవటం అనుచితం కాగలదు. రాజ్యాంగబద్ధ సంస్థ వ్యవహారాల్లో అనుచిత జోక్యం గా కూడా అది పరిగణించబడవచ్చు. కనుక ఇద్దరు ఇసిలకు ఎక్నాలడ్జ్ మెంట్ పంపుతూనే సిఇసి కి కాపీ పంపాలి.” ఇది కేబినెట్ సెక్రటేరియట్ తీసుకున్న నిర్ణయం.

సిఇసి గ్యానేష్ ఆదేశాల మేరకే డిప్యుటీ సిఇ మనీష్ గార్గ్ సరికొత్త వర్క్ ఎలోకేషన్ చేశాడు. ఆ సంగతి ఇద్దరు ఇసి లకు చెప్పలేదు. అప్పటికే అనేకసార్లు వాళ్ళు సిఇసి చేసిన ఎస్‌ఐ‌ఆర్ నిర్ణయాలను వ్యతిరేకించినందున ఈ వర్క్ ఎలొకేషన్ నిర్ణయాన్ని అంగీకరించే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళకు చెప్పకపోవటమే మంచిది. ఇదీ మోడి అభిమాని, సిఇసి అయిన గ్యానేష్ ఆలోచనా ధార. కానీ వాళ్ళు అనుకోకుండా కేబినెట్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్నది కూడా మనవాళ్లే కదా. ఎవరైతే అక్రమాన్ని సరిచేయాలని ఇద్దరు ఇసి లు భావించారో/కోరారో, వాళ్ళే తిరిగి అసలు సూత్రధారి గ్యానేష్ కే పరిష్కారాన్ని అప్పజెప్పారు. ఇంతా చేసి ఇద్దరు ఇసి లు ఎక్కడ బయలుదేరారో మళ్ళీ అక్కడికే రావలసి వచ్చింది.

స్పందించండి