సిజెపి కా, బి‌జే‌పి కా? విదేశీ కంపెనీల మద్దతు ఎవరికి అందుతోంది?

Protesters chant slogans as they take part in a flag rally by the Cockroach Janta Party (CJP) seeking the resignation of India’s Chief Election Commissioner Gyanesh Kumar, in New Delhi, India, October 16, 2026. REUTERS/Bhawika Chhabra

–

అక్టోబర్ 19 తేదీన భారతీయ విదేశీ విద్యార్ధుల పేరుతో ఒక గ్రూపు, కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలో గ్యానేష్ కుమార్ పాల్పడినట్టు భావిస్తున్న ఎన్నికల జాబితా అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్ధులు, యువకులు చేస్తున్న నిరసనలను విమర్శిస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేసింది. లేఖలో వాళ్లు భారత విద్యార్ధుల, యువకుల నిరసనలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు తెస్తున్నాయని ఆక్రోశించారు.

400 మందికి పైగా ఈ లేఖ రాశారని పత్రికలు చెప్పాయి. వీళ్ళంతా అమెరికా, బ్రిటన్, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియా లాంటి 27 దేశాలలోని ఎంఐటి, కేంబ్రిడ్జి, హార్వర్డ్, ఆక్స్ ఫర్డ్, స్తాన్ ఫర్డ్, ఎల్ఎస్ఇ మొ.న ప్రైవేటు యూనివర్శిటీలలో చదువుకున్నారట! వారికి భారతదేశ భవిష్యత్తులో వాటా ఉన్నదట! అందుకని భారత ప్రజాస్వామ్యాన్ని Gen Z ఆందోళనలు నాశనం చేస్తున్నాయన్న ఆందోళన కలిగిందట!

వీళ్లు తమను తాము ‘ఇండియన్లు’ గా గుర్తింపు పొందుతున్న ప్రపంచ ప్రయాణీకులం అని లేఖలో చెప్పుకున్నారు. భారతదేశం లోని నగరాలలో జరుగుతున్న పరిణామాలు వీరికి ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలలో ఓడిపోయిన వారు దేశంలోని ప్రజాస్వామ్య ప్రక్రియలను ప్రశ్నిస్తున్నారని, కోర్టులో పిటిషన్లు వేసి ఓడిపోయిన వారు న్యాయ వ్యవస్థ నిస్పాక్షికతను ప్రశ్నిస్తున్నారని వీళ్లు ఆరోపించారు.

వీరు పేరు చెప్పనప్పటికీ కాంగ్రెస్, ఎస్.పి తదితర ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి ఎన్నికల్లో ఓడిపోయిన వారు అని సంభోదించారని అర్ధం అవుతోంది. ప్రజాస్వామ్యం పట్ల అంతగా ఆందోళన చెందుతుంటే, ప్రతిపక్ష పార్టీల ఎం‌ఎల్‌ఏ ల కొనుగోలుతో అడ్డగోలుగా బి‌జే‌పి ప్రభుత్వాలు ఏర్పరచటం, ప్రతిపక్ష నేతలపై ఈ‌డి, సి‌బి‌ఐ, ఐ‌టి సంస్థలతో దాడులు చేయించటం ద్వారా ఎం‌ఎల్‌ఏలు, ఎం‌పి ల వలసలు ప్రోత్సహించటం, అవినీతి ఎం‌ఎల్‌ఏ, ఎం‌పి లపై కేసులు వాళ్లు బి‌జే‌పి లోకి దూకటం తోనే రద్దయి పోవటం లేదా బలహీన పడిపోవటం… ఇత్యాది పరిణామాలు జరిగినప్పుడే ఆందోళన ప్రకటించి ఉండాలి. కానీ అలా జరగలేదు.

ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ సైతం నాగపూర్ లో విజయదశమి ప్రసంగం చేస్తూ “ఇండియాను లొంగ దీసుకోవాలని కాంక్షించే విదేశీ శక్తులు (గ్లోబల్ పవర్స్) విద్యార్ధి-యువకుల నిరసన ప్రదర్శనల వెనుక పని చేస్తున్నాయని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని” దేశ ప్రజలను హెచ్చరించాడు. విచిత్రంగా ఆందోళనకారులను విభజన వాదులుగా (డివైజివ్ ఫోర్సెస్) ఆర్‌ఎస్‌ఎస్ నేత పేర్కొన్నారు. ముస్లిం లకు వ్యతిరేకంగా హిందూ ప్రజలను రెచ్చగొట్టటమే ఏకైక వ్యూహంగా అమలు చేసి వోట్లు సంపాదించేందుకు అలవాటు పడ్డ బి‌జే‌పి, ఆర్‌ఎస్‌ఎస్ లు అణచివేత విధానాలను ప్రశ్నిస్తున్న విద్యార్ధులు-యువకులను విభజన వాదులుగా ఆరోపించటం ఒక వింత, మరియు హిపోక్రసీ!

ఆర్ఎస్ఎస్ నేత మాత్రమే కాదు, బి‌జే‌పి నాయకులు, పార్టీ స్పోక్స్ మెన్/విమెన్ కూడా నిరసనకారులపైన ఇదే ఆరోపణ చేశారు. వారి వెనుక విదేశీ శక్తులు పని చేస్తున్నాయని ఆరోపించారు. ఇంకొందరు జార్జి సొరోస్ లాంటి విదేశీ బిలియనీర్లు ఉన్నారని నేరుగా ఆరోపించారు.

నిజంగా విదేశీ మద్దతు పొందింది, పొందుతున్నది ఎవరు? విదేశీ వ్యూహ రచనా కంపెనీల సాయం పొందాక వాటికి అనుకూలమైన నూతన ఆర్ధిక విధానాలను అత్యంత వేగంగా, అగ్రెసివ్ గా అమలు చేసి వారి మెప్పు పొందుతున్నది ఎవరు?

2014 పార్లమెంటు ఎన్నికలలో అమెరికాలోని బడా బడా వాల్ స్ట్రీట్ ఫైనాన్స్ కంపెనీల నుండి నరేంద్ర మోడి, బి‌జే‌పి పార్టీలకు సానుకూల మైన మద్దతు, రిపోర్టులు, రివ్యూలు అందిన విషయం ఈ సో-కాల్డ్ విద్యార్ధులు, విద్యావేత్తలు మరిచారా? ఈ కంపెనీలే గుజరాత్ లో మోడి పాలన పైన ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పాయి. “Modi-fying India” పేరుతో యూ‌పి‌ఏ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తూ గుజరాత్ విధానాలు ఇండియాను ఎక్కడికో తీసుకెళ్తాయని డప్పు కొట్టి చాటింపు వేశాయన్న సంగతి వీరికి తెలుసా?

బడా బహుళజాతి ద్రవ్య కంపెనీలైన గోల్డ్ మేన్ సాక్స్, నొమురా (జపనీస్), బార్ క్లేస్ (ఫ్రెంచ్), సిటీ గ్రూప్, HSBC, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిల్ లించ్ ఇత్యాది ఎం‌ఎన్‌సి లు ఇందులో ఉన్నాయి. మోడి విజయం సాధిస్తే ఇండియా జి‌డి‌పి పరుగు పెడుతుందని, విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ఇవి నివేదికలు ప్రచురించి ప్రచారం చేసి పెట్టాయి. ఎఫ్‌డి‌ఐ లు రావటమే దేశ అభివృద్ధికి చిహ్నం అన్నట్టుగా వాతావరణం కల్పించి ఈ ప్రచారం చేశారు.

2013 చివరి నెలల్లో గోల్డ్ మేన్ సాక్స్ అనే వాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఇండియా ఈక్విటీల రేటింగ్ పెంచి, “ఏజెంట్ ఆఫ్ ఛేంజ్” ఐన మోడి తమ రేటింగ్ అప్ గ్రేడ్ కు కారణంగా చెప్పి తద్వారా మోడి వేవ్ సృష్టికి బీజాలు నాటింది. (సెక్స్ ట్రేడ్ లో పెట్టుబడులు పెట్టి అప్రతిష్ట సంపాదించిన బ్యాంక్ ఇది).

మరో ఇన్వెస్ట్-మెంట్ బ్యాంక్మోర్గాన్ స్టాన్లీ, హాంగ్ కాంగ్ (చైనా) కు చెందిన మరో ఇన్వెస్ట్-మెంట్ బ్యాంక్ మరియు బ్రోకర్ కంపెనీ సి‌ఎల్‌ఎస్‌ఏ (క్రెడిట్ లియోనీస్ సెక్యూరిటీస్ ఏసియా).. ఇవి క్రమం తప్పకుండా మోడి-వేవ్ అంటూ చిలవలు పలవలు చేస్తూ మోడి, బి‌జే‌పి లు ఖచ్చితమైన మెజారిటీ సాధిస్తే ఆర్ధిక వ్యవస్థాగత సంస్కరణలు వేగవంతం కానున్నాయని, వ్యాపార-అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీతో దూసుకుపోతాయని అంచనాలు రూపొందించి ప్రచారంలో పెట్టాయి.

అంతే కాదు, బి‌జే‌పి పార్టీయే విదేశీ లాబీ కంపెనీలను ఎన్నికల వ్యూహాల రచన కోసం తెచ్చుకున్నది. “వైబ్రెంట్ గుజరాత్” పేరుతో 2014 కు ముందే గుజరాత్ రాష్ట్ర ఎన్నికల్లో అక్కడ లేని మాయా ప్రపంచాన్ని సృస్టించి చూపించిన “APCO వరల్డ్ వైడ్” అనే లాబీ కంపెనీ ఇండియాలో మోడి బ్రాండ్ కోసం అనేక కధలు సృష్టించి ప్రచారం చేసింది. ఈ సంస్థను గుజరాత్ ప్రభుత్వం అధికారికంగా హైర్ చేసుకోవటం కొసమెరుపు.

అతి పెద్ద టెక్ కంపెనీలైన ఒరాకిల్ (అమెరికా), ఎస్‌ఏ‌పి (జర్మనీ) లు రంగం లోకి దిగి అత్యాధునిక డేటా టూల్స్ ని ఉపయోగించి సోషల్ మీడియాలో మోడి-అనుకూల సెంటిమెంట్ ను సృష్టించి కృత్రిమంగా అనేక రెట్లు పెరిగేలా చేశాయి. ఇండియాలో లేని మోడి వేవ్ ను కృత్రిమంగా సృష్టించి పెట్టాయి.

మోడి పక్షపాత ఫేస్ బుక్

ఇక ఫేస్ బుక్ అయితే మామూలు సహాయం చేయలేదు. కంపెనే సీనియర్ నాయకత్వం సొంత సిబ్బందితో ఒక బృందాన్ని ఏర్పరిచి ఇండియాలోని బి‌జే‌పి ప్రచార బృందంతో కలిసి పని చేస్తూ మోడి వేవ్ గరిష్టం అయ్యేలా చూసింది.

ఫేస్ బుక్ మోడి పక్షపాతానికి నాయకత్వం వహించిన వ్యక్తి అంఖి దాస్ అనే ఒక మహిళ. ఆమె ఫేస్ బుక్ ఇండియా శాఖ లో పబ్లిక్ పాలసీ విభాగానికి అధిపతి. మోడి, బి‌జే‌పి అభ్యర్ధిగా ప్రకటించాక ఆయన ఫాలోయింగ్ పెరిగేందుకు ఆమె అన్ని ప్రయత్నాలు చేసింది. 2014 ఎన్నికల్లో బి‌జే‌పి/మోడి నెగ్గిన తర్వాత ఆమె “ఆయన సోషల్ మీడియా ప్రచారానికి మనం అగ్గి రాజేశాం. ఇక తర్వాత జరిగినదంతా మీకు తెలిసిన చరిత్ర!” (టైమ్స్ ఆఫ్ ఇండియా, సెప్టెంబర్ 1, 2020) అని వ్యాఖ్యానించి మోడి గెలుపు వెనుక ఫేస్ బుక్ చేసిన కృషి ఏమిటో తెలియజేసింది.

Ankhi Das

అంఖి దాస్, కాంగ్రెస్ కు బద్ధ వ్యతిరేకి కూడా. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆమె, “చివరికి ఇండియా నుండి స్టేట్ సోషలిజం ను పారద్రోలటానికి 30 సంవత్సరాల పాటు చేసిన గ్రాస్ రూట్స్ వర్కు దోహద పడింది” అని ఫేస్ బుక్ లో వ్యాఖ్యానించింది. ప్రభుత్వ రంగ కంపెనీలను అభివృద్ధి చేయటమే ఇండియాలో స్టేట్ కేపిటలిజం. ఇండియాకు గర్వకారణమైన ఎల్‌ఐ‌సి, ఎస్‌బి‌ఐ, బి‌ఈ‌ఎల్, డి‌ఆర్‌డి‌ఓ లాంటి అతి పెద్ద ప్రభుత్వరంగ కంపెనీలకు ఆమె వ్యతిరేకం అన్నమాట! మోడి వస్తే అవన్నీ ప్రైవేటు కంపెనీలకు అమ్మేస్తాడని ఫేస్ బుక్ ప్రచారం చేసింది. మోడి చేసింది, చేస్తున్నది కూడా అదే. మన బంగారం మంచిది కానప్పుడు…?!

“కాంగ్రెస్ నడ్డి విరగ్గొట్టిన బలవంతుడు నరేంద్ర మోడి!” అని కూడా అంఖి దాస్ ప్రశంసలు కురిపింది కూడాను (వాల్ స్ట్రీట్ జర్నల్). ఆమె ఒక వోటర్ గా మోడికి మద్దతుదారుగా ఉండవచ్చు. కానీ ఫేస్ బుక్ అనే విదేశీ టెక్ కంపెనీని మోడి గెలుపుకు ఉపయోగించటమే నేరపూరితం! ఫేస్ బుక్ యాజమాన్యం విధాన, వాణిజ్య మద్దతు లేకుండా ఆమె ఇదంతా చేయగలిగి ఉండేది కాదన్నది స్పష్టమే.

ఫేస్ బుక్ పాలసీ ప్రకారం ఫేస్ బుక్ లో పోలిటికల్ యాడ్స్ ఇచ్చే సంస్థలు వారి వెనుక ఏ వ్యక్తులు సంస్థలు ఉన్నాయో వెల్లడి చేయాలి. బి‌జే‌పి తన పేరుతో యాడ్స్ ఇస్తూనే వేరే పేర్లతో కూడా పోలిటికల్ యాడ్స్ ను ఫేస్ బుక్ లో కొనుగోలు చేసింది. ఇది వెల్లడి అయినా కూడా వాటిపై ఫేస్ బుక్ చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకుంటే ఇక ముందు ఫేస్ బుక్ లో యాడ్స్ బిజినెస్ పడిపోతుందని వాదించి అంఖి దాస్, చర్యలు తీసుకోకుండా నివారించింది.

తమ కంపెనీ రాజకీయ పార్టీలకు బాగా ఉపయోగపడుతుందని ఫేస్ బుక్ రాజకీయ పార్టీలకు చెబుతూ ఉండేది. దానిని రుజువు చేసేందుకు అది బి‌జే‌పి తో పాటు ఇతర రాజకీయ పార్టీల కార్యకర్తలకు కూడా శిక్షణ ఇచ్చింది. ఆ శిక్షణను ఉపయోగించుకోవటంలో మోడి/బి‌జే‌పి పై చేయి సాధించిందని ఇప్పుడు అర్ధమయ్యే విషయం.

కాబట్టి భారత ప్రజలు అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే విదేశీ బ్యాంకులు, ద్రవ్య కంపెనీలు, టెక్ కంపెనీలు, దేశ ఎన్నికలను, రాష్ట్రాల ఎన్నికలను ప్రభావితం చేయటంలో నిండా మునిగి ఉన్నాయని. సోషల్ మీడియాలో వచ్చే ప్రచార వీడియోలు, ప్రకటనల వీడియోలు వొట్టి మోసం అని. ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నా కూడా వాటిని నమ్మరాదు అని. రాజకీయ పార్టీలకు అనుకూలంగా అనేక కంప్యూటర్ బాట్ లు (సాఫ్ట్ వేర్ తో సృష్టించిన రోబోట్ ప్రోగ్రామ్ లు. ఇవి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడతాయి. పార్టీలకు అనుకూలంగా, ప్రతికూలంగా కామెంట్స్ పెడతాయి. లైక్ లు, అన్ లైక్ లు చేస్తాయి. కామెంట్ లకు, పోస్ట్ లకు, నాయకులకు రేటింగ్ లు ఇస్తాయి. ఇంకా చాలా చేస్తాయి).

కేంబ్రిడ్జ్ ఎనలిటికా అని ఇంకో సలహా సంస్థ కూడా బి‌జే‌పి కి, కాంగ్రెస్ కి కూడా సలహాలు అందజేసింది. ఎస్‌సి‌ఎల్ గ్రూపు కంపెనీలలో భాగం. “పోలిటికల్ కేంపయిన్ నిర్వహణ” లో ఈ కంపెనీకి చాలా అనుభవం ఉన్నది. అనేక దేశాల్లో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిన ఘనత తమ సొంతం అని కేంబ్రిడ్జ్ ఎనలిటికా సి‌ఈ‌ఓ అలెగ్జాండర్ నిక్స్ స్వయంగా ప్రకటించాడు. (ఆ ప్రకటనతో కంపెనీ ఆయనను పదవి నుండి తొలగించింది. కంపెనీ రహస్యాలు అలా బహిరంగం చేయకూడదు కదా మరి!)

Alexander Nix -Cambridge Analytica

–

2016 అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసిందని ఇది ఆరోపణలు ఎదుర్కొన్నది. ఇండియాతో పాటు యూరప్, కీన్యా, నైజీరియా, మెక్సికో, బ్రెజిల్, మలేషియా దేశాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన చరిత్ర దీనికి ఉన్నది. “ఇండియాలో బి‌జే‌పి కి అనుకూలంగా 4 ఎన్నికలను మా సంస్థ విజయవంతంగా మేనేజ్ చేయగలిగింది” అని ఈ సంస్థ ఇండియా విభాగం వైస్ ప్రెసిడెంట్ హిమాంషు శర్మ LinkedIn లో సగర్వంగా ప్రకటించుకున్నాడు.

కాబట్టి విదేశాల నుండి సహాయం అందుతున్నది సి‌జే‌పి కి కాదు; బి‌జే‌పి యే విదేశాల నుండి సహాయ సహకారాలు పొందుతున్నది. లేకపోతే ఇండియా పైన అనేక రెట్లు టారిఫ్ లు ప్రకటిస్తున్న అమెరికాతో తలపడటం మానేసి, సొంత వనరులను సృస్థించుకునే పని మానేసి, అమాంతం 500 బిలియన్ డాలర్ల మేరకు అమెరికాలో పెట్టుబడులు పెడతామని ఇండియా తరపున మోడి ఎలా హామీ ఇవ్వగలడు?

మనకే డబ్బు లేదని చెప్పి ప్రజలు నిర్మించుకున్న ప్రభుత్వరంగ కంపెనీలను అయినకాడికి అమ్ముతున్న మోడి ప్రభుత్వం అమెరికాలో 500 బిలియన్ డాలర్లు ఎక్కడి నుండి తెచ్చి పెట్టుబడి పెడుతుంది, భారతీయుల కడుపులు మాడ్చకుండా? అమెరికా ఒత్తిడికి లొంగి చౌకగా లభిస్తున్న రష్యన్ చమురు దిగుమతి నిలిపేసే నిర్ణయం ఎవరు చేస్తున్నారు? అమెరికా ఆంక్షలు ఎత్తివేసి, అనుమతి ఇస్తే తప్ప రష్యా దగ్గరకి వెళ్లలేని బలహీన విదేశీ విధానాన్ని ఎవరు అమలు చేస్తున్నారు? సి‌జే‌పి యా లేక బి‌జే‌పి యా?

సి‌జే‌పి వెనుక విదేశీ శక్తులు ఉన్నట్టయితే ఆ సంస్థలో ప్రజలు ఉండవలసిన అవసరం లేదు. అందులో సందేహం లేదు. కానీ సి‌జే‌పి పైన విచారణ జరిపే అవకాశం మోడి ప్రభుత్వానికి ఉన్నది. బైటపెట్టాలనే ప్రజలు కోరుతున్నారు. అంతవరకు ఆరోపణలు కట్టిపెట్టాలి. ఆరోపణల నేపధ్యంలో సి‌జే‌పి ని ప్రజలు, ఆందోళనకారులు వేయి కళ్ళతో గమనించాలి కూడా. కానీ సి‌జే‌పి వెనుక విదేశీ శక్తులు ఉంటే, ఆందోళనకారుల వెనుక కూడా విదేశీ శక్తులు ఉన్నట్టు కాదు. ఆందోళనకారుల ఆగ్రహం, ఆవేశం, ఆందోళనలు సహేతుకం, సకారణం మరియు ఆర్గానికల్!

స్పందించండి