190 అణ్వాయుధాలతో పాక్ ని దాటిన ఇండియా!

ప్రస్తుతం ఇండియా వద్ద 190 అణ్వాయుధాలు (న్యూక్లియర్ వార్ హెడ్స్) ఉన్నాయని అమెరికా కు చెందిన ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్ఏఎస్) సంస్థ అంచనా వేసింది. పాకిస్తాన్ కంటే 20 అణ్వాయుధాలు ఎక్కువగా ఇండియా వద్ద ఉన్నట్టు దీని అర్ధం. త్వరలో ఇండియా వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్య యునైటెడ్ కింగ్డం ని మించిపోతాయని ఎఫ్ఏఎస్ అంచనా వేసింది.

ఎఫ్ఏఎస్ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ సిస్టం – 2026 నివేదికను ఎఫ్ఏఎస్ డైరెక్టర్ హాన్స్ క్రిస్టెన్సన్ రచించినట్లు పత్రికలు తెలిపాయి. ఈ నివేదికలు భారత అణు రంగం వివరాలు, ఆయుధాలు, అణ్వాయుధ డెలివరీ వ్యవస్థలు, ఆయుధ-గ్రేడు ప్లుటోనీయం ఉత్పత్తి మొదలైన అంశాలను వెల్లడించాయి.

ప్రస్తుతం 9 రకాల అణు సామర్ధ్యంతో కూడిన వ్యవస్థలను ఇండియా నిర్వహిస్తున్నట్లు ఎఫ్ఏఎస్ నిపుణులు అంచనా వేశారు. రెండు విమానాలు, ఆరు భూఉపరితల-ఆధారిత బాలిస్టిక్ మిసైళ్లు, ఒకటి జల(సముద్ర)-ఆధారిత బాలిస్టిక్ మిసైల్ లను అణ్వాయుధాలతో ప్రయోగించగల సామర్ధ్యం ఇండియా కలిగి ఉన్నదని నివేదిక తెలిపింది. అణ్వాయుధ ప్రయోగ సామర్ధ్యం కలిగిన మరో రెండు వ్యవస్థలను ఇండియా నిర్మిస్తున్నదని అవి త్వరలో పూర్తవుతాయని తెలుస్తున్నది.

ఇండియా సైనిక బలగాలు కనీసం 160 అణ్వాయుధాలను ప్రయోగించగలవని మేము అంచనా వేస్తున్నాము. అవి కాకుండా ఇంకా 60 అదనపు అణ్వాయుధ సామర్ధ్యం కలిగిన మిసైళ్లను ఇండియా ఉత్పత్తి చేస్తున్నది. వాటితో కలిపి ఇండియా వద్ద 190 అణ్వాయుధాలు కలిగి ఉన్నట్టు లెక్క” అని ఎఫ్ఏఎస్ నివేదిక పేర్కొన్నది. మరిన్ని అణ్వాయుధాలు ఇండియా ఆయుధాగారంలో చేరానున్నాయని దరిమిలా ఇండియా అణ్వాయుధాల సంఖ్య యుకె వద్ద ఉన్న సంఖ్యను దాటిపోనున్నాయని తెలిపింది.

పాకిస్తాన్ వద్ద 170 అణ్వాయుధాలు ఉన్నట్టు అణచనా వేస్తున్నారు. కాగా యునైటెడ్ కింగ్డం వద్ద 225 అణ్వాయుధాలు ఉన్నాయి. కాబట్టి మరో, యుకె కంటే 35 న్యూక్లియర్ వార్ హెడ్లు వెనకబడి ఉన్నది.

ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు రష్యా వద్ద ఉన్నాయి. 5,420 అణ్వాయుధాలతో రష్యా అగ్రస్థానంలో ఉండగా అమెరికా వద్ద 5,042 అణ్వాయుధాలు ఉన్నాయి. అంటే అమెరికా, రష్యాలు రెండు ఉమ్మడిగా ప్రపంచంలో అణు ఆయుధాలలో 86 శాతం సొంతం చేసుకుని ఉన్నాయని స్టాక్ హోమ్ పీస్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ వెల్లడి చేసింది.

620 అణ్వాయుధాలతో చైనా మూడవ స్థానంలో ఉండగా 370 అణ్వస్త్రాలతో ఫ్రాన్స్ 4వ స్థానంలో ఉన్నది. 225 అణ్వస్త్రాలతో బ్రిటన్/యుకె ఐదవ స్థానంలో ఉన్నది. దక్షిణాసియాలో ఇండియా, పాకిస్తాన్ లు మాత్రమే అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి.

ఇజ్రాయెల్ వద్ద కనీసం 90 అణు వార్ హెడ్స్ ఉన్నాయని అంచనా. కానీ తనవద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ అంగీకరించదు. అలాగని అణ్వాయుధాలు లేవని కూడా ఇజ్రాయెల్ చెప్పాడు. ఇలా ఏమీ చెప్పకపోవటాన్ని “వ్యూహాత్మక సంశయం” (స్ట్రేటజిక్ యాంబిగ్యుటీ) గా ఇజ్రాయెల్ చెప్పుకుంటుంది. నిజానికి సంశయం లేదా అనుమానం అన్నది అనవసరం. ఏమీ చెప్పకపోవటాన్ని బట్టే ఆ దేశం అణ్వాయుధాలు తయారు చేసుకున్నట్టు అర్ధం అవుతుంది. ఇలా ఇజ్రాయెల్ చెప్పకుండానే ఆ దేశం వద్ద అణ్వాయుధాలు ఉన్నట్టు ప్రపంచ దేశాలు భావించాలన్నదే ఇజ్రాయెల్ ఉద్దేశం కూడా.

తన వద్ద 90 అణ్వాయుధాలు ఉంచుకుని కూడా ఇరాన్ అణు విధానం పట్ల శత్రు వైఖరిని ఇజ్రాయెల్ చూపిస్తుంది. అణ్వాయుధాలు తయారు చేసుకోకూడదని ఇరాన్ సుప్రీం లీడర్ ఫత్వా జారీ చేసినా కూడా ఇజ్రాయెల్, ఇరాన్ పైన విష ప్రచారం మానదు. అణ్వాయుధాలు తయారు చేసుకోవటానికి ఇరాన్ ప్రయత్నిస్తున్నదని, ఆ దేశం తలచుకుంటే కొద్ది రోజుల్లో అణ్వాయుద్ధం తయారు చేసుకోగల సామర్ధ్యం కలిగి ఉన్నదని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. ఈ ప్రచారాన్ని అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు నెత్తిన పెట్టుకుని ప్రచారం చేస్తాయి.

ఇరాన్ టెర్రరిస్టు దేశమని, అణ్వాయుధాలు తయారు చేసుకుంటే ఆ దేశం వలన ప్రపంచానికి ప్రమాదం ఉన్నదని ఇజ్రాయెల్, అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు ఆరోపిస్తూ, తమ ఆరోపణలను పదే పదే ప్రచారం చేస్తూ ఇరాన్ పైన 40 యేళ్ళ నుండి వాణిజ్య, రాజకీయ, ఆర్ధిక, రాయబార ఆంక్షలను అమలు చేస్తున్నాయి. మొన్నటి వరకు ఇరాన్ అణు విధానాన్ని నాశనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 28 నాటి దాడుల నుండి ఆ దేశం వద్ద సాంప్రదాయ బాలిస్టిక్ మిసైల్ సామర్ధ్యం కూడా ఉండకుండా నాశనం చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికాలు చేస్తున్న యుద్ధానికి లక్ష్యాలలో ఇది కూడా ఒకటి.

తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్ కి ఉందని అమెరికా, ఐరోపా దేశాలు వాదిస్తాయి. కానీ పశ్చిమాసియాలో జరిగిన ప్రతి యుద్ధాన్ని ప్రారంభించింది ఇజ్రాయెల్ దేశమే. పశ్చిమాసియా దేశాలకు ప్రధాన ప్రమాదం ఇజ్రాయెల్, అమెరికా దేశాలే. ఆ రెండు దేశాలు చేసినన్ని అరాచకాలు, సాగించినన్ని హంతక దాడులు, ప్రపంచ చట్టాల అతిక్రమణ మరే దేశమూ చేయలేదు. చమురు సంపదలతో కూడిన పశ్చిమాసియా దేశాలపై ఆధిపత్యం సాధించే ప్రధాన లక్ష్యంతో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపించే కుట్రకు బ్రిటన్ తెర తీయగా దానిని అమెరికా కొనసాగించింది. ఇజ్రాయెల్, అమెరికా దేశాల గుండాయిజాన్ని, ఆధిపత్య దురహంకారాన్ని ఎదుర్కొంటున్న దేశం ఇరాన్ ఒక్కటే. కాగా పాలస్తీనా సంస్థ హమాస్, లెబనాన్ లోని హిజ్బొల్లా, యెమెన్ లోని హుతీ (అన్సరల్లా) లు ఇరాన్ కు సహకరిస్తున్నాయి. తమ ఆధిపత్యాన్ని తిరస్కరిస్తున్నందుకే ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ ఐరోపా దేశాలు కక్ష కట్టాయి.

ప్లుటోనియం నిల్వలు

ఇండియా వద్ద ప్లుటోనియం కనీసం 730 కిలో గ్రాములు ఉంటుందని ఎఫ్ఏఎస్ అంచనా వేస్తోంది. ఇందులో 170 కిలోల ప్లుటోనియమ్ నిలువ ధృవీకరణ కాలేదు. అంటే 560 కిలోల ప్లుటోనియమ్ నిల్వలు ఉన్న సంగతి నిర్ధారణగా చెబుతూ మరో 170 కిలోలు ఉండవచ్చన్నది అనిర్ధిష్ట అంచనా. ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ ఫిస్సైల్ మెటీరియల్స్ సంస్థ 2026 లో ఈ అంచనాలతో నివేదిక ప్రచురించింది.

ఒక్కొక్క అణ్వాయుధానికి 4 కిలోల ప్లుటోనియమ్ అవసరం అవుతుందన్న లెక్క ప్రకారం ఇండియా వద్ద ప్రస్తుతం ఉన్న అణు ఇంధన నిల్వలతో మరో 140 నుండి 225 వరకు అణ్వాయుధాలు నిర్మించగల సామర్ధ్యం ఇండియాకు ఉన్నది. దీని అర్ధం అన్ని అణ్వాయుధాలను ఇండియా తయారు చేస్తుందన్న సంగతి నిర్ధారణగా చెప్పటం కాదు. అణు విద్యుత్ ఉత్పత్తికి కూడా ప్లుటోనియమ్ ను ఉపయోగించవచ్చు.

అణ్వాయుధ విధానం

ఇండియా, పాకిస్తాన్ లు విరుద్ధమైన అణ్వాయుధ ప్రయోగ విధానాలు కలిగి ఉన్నాయి. ఇండియా విధానం ‘నో-ఫస్ట్-యూజ్’. అంటే యుద్ధం అంటూ జరిగితే ఏ దేశం పైన అయిన మొదటి సారి అణ్వాయుధాన్ని ఇండియా ప్రయోగించదు. అవతలి దేశం ఇండియా పైన అణ్వాయుధం ప్రయోగిస్తే అందుకు ప్రతీకారంగా మాత్రమే ఇండియా అణ్వాయుధం ప్రయోగిస్తుంది. ఈ విధానం వల్ల అణ్వాయుధాన్ని మొదట ప్రయోగించే అప్రమత్తతను కలిగి ఉండాల్సిన అవసరం ఇండియాకు ఉండదు. సముద్రంలో అణ్వాయుధాలను కలిగి ఉండటం సాపేక్షికంగా ఉపయోగకరం. తద్వారా భూ ఆధారిత అణ్వాయుధాలు ఉన్నత స్థాయి అప్రమత్తత కలిగి ఉండాల్సిన అవసరం ఉండదు.

అయితే ఇండియా విధానానికి ఒక మినహాయింపు ఉన్నది. జీవ ఆయుధాలతో (వైరస్ లు, క్రిములతో కూడిన ఆయుధాలు) గానీ లేదా రసాయన ఆయుధాలతో గాని ఇండియా దాడిని ఎదుర్కొంటే గనక, ఇండియా అణ్వాయుధాలను ప్రయోగిస్తుంది. రసాయన, క్రిమి ఆయుధాలకు విస్తారమైన విధ్వంసాన్ని, ప్రాణ నష్టాన్ని కలిగించే సామర్ధ్యం ఉంటుంది గనుక ఈ మినహాయింపును ఇండియా తన విధానంలో చొప్పించింది. వాజ్ పేయి ప్రభుత్వం మొదటి సారి ఇండియా అణ్వాయుధ విధానానికి రూప కల్పనా చేసింది.

పాకిస్తాన్ విధానం ఇందుకు భిన్నం. ఆ దేశానికి నో-ఫస్ట్-యూజ్ నిబంధన లేదు. అవసరం అయితే మొదటి సారి అణ్వాయుధాన్ని ప్రయోగించే అవకాశాన్ని పాకిస్తాన్ రిజర్వ్ చేసుకుంది. ఇండియా సాంప్రదాయక ఆయుధాలతో యుద్ధం చేయగల సామర్ధ్యం పాకిస్తాన్ కంటే ఎక్కువ కలిగి ఉందన్న కారణంతో ఈ విధానాన్ని పాకిస్తాన్ రూపొందించుకుంది. ఇండియా సాంప్రదాయక యుద్ధ సామర్ధ్యాన్ని అధిగమించాలంటే అణ్వాయుధాన్ని మొదట ప్రయోగించే విధానం ఉండాలని పాకిస్తాన్ అధికారిక విధానం.

ఒక వేళ యుద్ధం సంభవిస్తే, చావో రేవో తేల్చుకోవలసిన పరిస్ధితి ఏర్పడితే, సాంప్రదాయ యుద్ధంలో తీవ్రంగా దెబ్బ తిని ఇక తప్పదు అనే పరిస్ధితి వస్తే, తన ఉనికే ప్రశ్నార్ధకంగా మారితే, అణ్వాయుధం ప్రయోగించ వలసి ఉంటుందని పాకిస్తాన్ విధానకర్తల ఆలోచన.

ఈ విరుద్ధమైన అణ్వాయుధ విధానాలు ఇండియా, పాకిస్తాన్ ల అణ్వాయుధాల అభివృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రతీకార సామర్ధ్యాన్ని ఇండియా అభివృద్ధి చేసుకుంటుంటే, ఫస్ట్-యూజ్ సామర్ధ్యాన్ని పాకిస్తాన్ అభివృద్ధి చేసుకుంటోంది.

బిజెపి/ఎన్.డి.ఏ అధికారం లోకి వచ్చిన తర్వాత ఇండియా కూడా తన విధానం మార్చుకుని ఫస్ట్-యూజ్ విధానాన్ని అనుసరిస్తుందా అన్న అనుమానాలు రెండు సంవత్సరాల క్రితం తలెత్తింది. బిజెపి ప్రభుత్వం ఈ వైపుగా ఆలోచిస్తున్నదని పత్రికలు ఊహాగానాలు చేశాయి. ప్రభుత్వం మాత్రం అదేమీ లేదని చెప్పింది.

Leave a Reply