
–
08/06/2026
యుద్ధం సరికొత్త దశలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోంది. లెబనాన్, ఇజ్రాయిల్ ల మధ్య ఏప్రిల్ 8 తేదీన కుదిరిన సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మరుసటి రోజు నుండి ఉల్లంఘిస్తూనే ఉంది. ఉల్లంఘన కొనసాగిస్తే తాము ఇజ్రాయెల్ పైన దాడి చేయక తప్పదని ఇరాన్ కూడా హెచ్చరిస్తూనే ఉంది. కానీ అప్పటి నుండి ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి.
లెబనాన్ రాజధాని బీరూట్ లో హిజ్బోల్లా కి పట్టు ఉన్న దక్షిణ ప్రాంతాలపై కూడా ఇజ్రాయెల్ పౌర హంతక దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ వారం రోజుల క్రితం అమెరికాతో పరోక్ష చర్చల నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. దాంతో ట్రంప్, ఇజ్రాయెల్ ను కట్టడి చేయటానికి రంగం లోకి దిగినట్లు పత్రికలు చెప్పాయి. ట్రంప్, నేతన్యాహు కి ఫోన్ చేసినట్టు, ఫోన్ లో ఆయన్ని తిట్టి పోసినట్టు పశ్చిమ పత్రికలు ప్రచారం చేశాయి. ఆ సంగతి నిజమే అన్నట్టుగా ట్రంప్ కూడా ట్రూత్ సోషల్ లో పోస్టు పెట్టాడు. నేతన్యాహు వల్లనే ఘర్షణ కొనసాగుతున్నట్టు, నేతన్యాహు చర్యల్ని అందరూ ఖండిస్తున్నారని తన వల్లనే నేతన్యాహు బ్రతికి బట్ట కడుతున్నాడని ట్రంప్ తీవ్ర స్వరంతో హెచ్చరించినట్టు పత్రికలు రాశాయి.
కానీ ఇదంతా ఒట్టి ట్రాష్ అని ఇరాన్ కొట్టిపారేసింది. అమెరికా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ దాడులు చేయదని ఇరాన్ నమ్ముతోంది. ఇరాన్ కి ఓపిక నశించిందని ఇరాన్ పాలకుల మాటలను బట్టి స్పష్టం అవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ లు ఇంకోసారి ఇరాన్ పైన దాడి చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసినట్లు కూడా ఇరాన్ భావించింది. అడపా దడపా అమెరికా, ఇరాన్ ల మధ్య మిసైల్ దాడులు కూడా జరిగాయి. రెండు రోజుల క్రితం అమెరికా, ఇరాన్ కి చెందిన ఒక ట్యాంకర్ ఇంజన్ ను ధ్వంసం చేసింది. ప్రతీకారంగా ఇరాన్, కువైట్ లోని అమెరికా స్థావరం పైన డ్రోన్ లతో దాడి చేసి భారీ నష్టం కలిగించింది. యుద్ధం మళ్ళీ మొదలైనట్టు విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ట్రంప్ ఆదివారం, ఇక దాడులు ఆపేద్దామని, ఇరాన్ తో ఒప్పందం దాదాపు ముగింపుకు వచ్చిందని ప్రకటన చేస్తూనే ఒప్పందానికి ఒప్పుకోక పోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ ను హెచ్చరించాడు.
ఈ పరిస్థితిలో ఈ రోజు (జూన్ 8) ఉదయాన్నే ఇజ్రాయెల్ మళ్ళీ దక్షిణ బీరూట్ పైన దాడులు చేసింది. దాడుల్లో పౌరులు చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. దానితో ఇరాన్, ఇజ్రాయెల్ పైన మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ లో మిలట్రీ లక్ష్యాలు గురి పెట్టీ 11 మిస్సైల్స్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ నగరాల్లో మిస్సైల్స్ రాకను ప్రకటిస్తూ సైరన్ లు మోగాయి మిస్సైల్స్ అన్నింటినీ గాల్లోనే చేయించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. కానీ ఎప్పటి లాగే ఇజ్రాయెల్ లక్ష్యాలు ఎంత తీవ్రంగా దెబ్బ తిన్నాయి అన్నది త్వరలో అమెరికా పత్రికలే చెబుతాయి.
అమెరికా – ఇరాన్ సీజ్ ఫైర్ తర్వాత కూడా దక్షిణ లెబనాన్ పైన ఇజ్రాయిల్ దాడులు చేస్తూ 3000 మంది కి పైగా ప్రజల్ని చంపేసింది. అయినా కూడా లెబనాన్ గురించి ఇరాన్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఇరాన్ విశ్లేషకులు, ఇతర దేశాల్లో ఇరాన్ పక్షం వహిస్తున్నారు విమర్శిస్తున్నారు. వీరు గతంలో సిరియా లోని అస్సాద్ ప్రభుత్వం కూలినా కూడా ఇరాన్ పట్టించుకోలేదని ఇరాన్ ను విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పైన ఇరాన్ మిసైల్ దాడికి దిగటం ప్రాధాన్యత సంతరించుకుంది.
యుద్ధానికి ముందు సెప్టెంబర్ 27, 2024 తేదీన దక్షిణ బీరూట్ (దహియే) లోని అండర్ గ్రౌండ్ హెడ్ క్వార్టర్ పైన సెకన్ల వ్యవధిలో ఒకదాని వెంట ఒకటిగా బాంబు దాడులు చేసి హిజ్బోల్లా సెక్రటరీ జనరల్ హసన్ నసరల్లా ను ఇజ్రాయెల్ హత్య చేసిన సంగతి తెలిసిందే. నసరల్లా షియా ప్రజలు అందరికీ ఆరాధ్యుడు. ఇరాన్ కి హిజ్బోల్లా ప్రాక్సీ గా అందరూ భావిస్తారు. అంటే ఇరాన్ చెప్పినట్టు హిజ్బోల్లా నడుచుకుంటుందని, హిజ్బోల్లా ను ఇరాన్ డైరెక్ట్ చేస్తుందని అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే నసరల్లా ఉన్నంత కాలం ఇరాన్ ప్రభుత్వం ఎలాంటి గడ్డు సమస్య వచ్చినా ఆయననే సంప్రతించేది. నసరల్లా డైరెక్షన్ లో ఇరాన్ విధానాలు చాలా రూపొందాయని చెప్పొచ్చు. ఇరాన్ సుప్రీం లీడర్ కూడా నసరల్లా ను సంప్రదించేవాడు. ఇరాన్ లో ప్రజలంతా, నాయకులతో సహా నసరల్లా ను ఆరాధిస్తారు.
అందుకే హిజ్బోల్లా ( దక్షిణ లెబనాన్) పైన ఇజ్రాయిల్ దాడులు చేసి జనాన్ని చంపేస్తూ, వారి ఇళ్లను నేలమట్టం చేస్తున్నా ఇరాన్ పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి.
రెండో విడత కూడా ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. రెండో దాడులను ఇజ్రాయెల్ కూడా ధృవీకరించింది. ఐతే దాడుల వివరాలు ఇరు దేశాలు చెప్పలేదు. లెబనాన్ పైన దాడులు చేయటం విరమించుకోవాలని ఐ.ఆర్.జి.సి ఇజ్రాయిల్ ను హెచ్చరించింది. లేకుంటే మరిన్ని దాడులు తప్పవని ప్రకటించింది.
ఈ రోజు ఉదయం దక్షిణ బీరూట్ పైన ఇజ్రాయెల్ దాడులు చేసినందుకు ప్రతీకారం గానే ఇరాన్ దాడి చేసిందని ఇరాన్ విదేశీ మంత్రి అబ్బాస్ అరాగ్చి ప్రకటించాడు. ఈ దాడులతో మధ్య ప్రాచ్యం లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి.
ఉద్రిక్తతల నేపథ్యంలో తమ గగనతలాన్ని మూసేస్తున్నట్టు ఇరాక్ ప్రకటించింది. ఇరాక్ గగనతలం పైన ఎలాంటి ప్రయాణ, వాణిజ్య విమానాలు ఎగర కూడదు. ఈ నిషేధం ఎన్నాళ్లు ఉంటుందో ఇరాక్ చెప్పలేదు.
ఇజ్రాయెల్ పైన దాడి చేసి ఇరాన్ తప్పు చేసిందని, ప్రతిఫలం అనుభవిస్తుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రతినిధి హెచ్చరించాడు.
ఇజ్రాయిల్ పైన మిసైల్ దాడి తర్వాత ఇరాన్ విదేశీ మంత్రి అరాగ్చి వివిధ దేశాల విదేశీ మంత్రులకు ఫోన్ చేసి ఏ పరిస్థితిలో ఇజ్రాయెల్ పైన దాడి చేయాల్సి వచ్చిందో వివరించాడు.
ఫ్రాన్స్, యుకె, కతార్, టర్కియే, పాకిస్తాన్ దేశాల విదేశీ మంత్రులతో ఆయన మాట్లాడాడు.
ఉత్తర ఇజ్రాయెల్ లోని మిలట్రీ టార్గెట్ పైన దాడి చేశామని, ఐరాస ఆర్టికల్ 51 కింద ఆత్మ రక్షణ కోసం దాడులు చేశామని ఇరాన్ ప్రకటించింది. అనేకసార్లు హెచ్చరించినప్పటికీ ఇరాన్ నౌకల పైనా, దక్షిణ లెబనాన్ పౌర ఆవాసాల పైనా ఇజ్రాయెల్ హంతక దాడులు చేస్తున్నదని ఇరాన్ వివరించింది. మళ్ళీ మళ్ళీ సీజ్ ఫైర్ ఒప్పందం ను ఉల్లంఘించింది అని గుర్తు చేసింది.
“లెబనాన్ పైన గాని, ఇరాన్ పైన గాని మళ్ళీ దాడులు చేసే సాహసానికి ఇజ్రాయెల్ పూనుకుంటే ఆ దేశం ఈ సారి సంపూర్ణ దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని హెచ్చరించింది. తాము ఆత్మ రక్షణ నిమిత్తం మాత్రమే దాడి చేశామని చెప్పింది.
లెబనాన్ తో సీజ్ ఫైర్ ను ఉల్లంఘించటంతో పాటు అమెరికాతో కలిసి ఉమ్మడిగా దక్షిణ ఇరాన్ లోని లక్ష్యాల పైన గత వారాల్లో దాడులు చేసిందని ఇరాన్ ప్రకటించింది.
అమెరికా, ఇరాన్ ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆమోదించి అమలు చేయటం తప్ప మరో ఆప్షన్ ఇజ్రాయిల్ కి లేదని ఫాక్స్ న్యూస్ తో మాట్లాడుతూ ట్రంప్ అన్నాడు. ఇజ్రాయెల్ చేతిలో ఏమీ లేదని తానే సుప్రీం అని చెప్పాడు. (కానీ అప్పటికే ఇరాన్ కి గట్టి సమాధానం ఇస్తానని ఐ.డి.ఎఫ్ ప్రతినిధి హెచ్చరించి ఉన్నాడు.) ఇరాన్ మిసైల్ దాడులు ప్రభావం సీజ్ ఫైర్ ఒప్పందం పైన ఉండదని హామీ ఇచ్చాడు. ఇరాన్ తో ఒప్పందం దాదాపు కుదురుతున్నందున తొందరపడి ప్రతీకార దాడులు చేయొద్దని ఇజ్రాయెల్ ను కోరాడు. ఇద్దరూ చెరోసారి ప్రత్యర్థి పైన దాడి చేశారు కనక ఇక సంయమనం పాటించడం మంచిదని కోరాడు. ఇరాన్ దాడి వెంటనే ట్రంప్ ఫోన్ లో నేతన్యాహు తో మాట్లాడాడు గాని వాళ్ళు ఏం మాట్లాడారో చెప్పలేదు. ఇజ్రాయెల్ దాడుల విషయంలో జరిగేది ఒకటి ట్రంప్ చెప్పింది ఒకటిగా ఇప్పటి వరకు జరిగింది. కాబట్టి ఇజ్రాయెల్ దాడుల గురించి ట్రంప్ ఆగ్రహంగా ఉన్నాడని చెప్పటం సత్య దూరం. ఎందుకంటే అమెరికా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ దాడి చేయటం జరగదు. పశ్చిమాసియా లో అమెరికా ప్రయోజనాలు చూడటమే ఇజ్రాయెల్ విధి.
ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో ఇరు దేశాలు సంయమనం పాటించాలని యుకె విదేశీ మంత్రి యేవేట్ కూపర్ కోరింది.
కాగా ఇరాన్ తో అణు ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ పైన ప్రతి దాడి ని వాయిదా వేసేందుకు నేతన్యాహు అంగీకరించాడని పశ్చిమ పత్రికలు అదేదో గొప్ప విషయంగా రాశాయి. ఫోన్ కాల్ సందర్భంగా ఇరాన్ పైన ప్రతి దాడి చేసేందుకు ట్రంప్ నీ ఒప్పించటానికి నేతన్యాహు ప్రయత్నించాడని కానీ ట్రంప్ ససేమిరా అనటంతో అయిష్టంగా అంగీకరించాడని ఆక్సియోస్ పత్రిక చెప్పింది. ఇది ట్రంప్ విజయం అన్నట్టుగా పత్రిక రాసింది. ఇలాంటి నాటకాలు ఇరాన్ ఇప్పటికే చాలా చూసింది.

ఇరాన్ పై దాడిని వాయిదా వేస్తానని నేతన్యాహు చెప్పిన గంటకే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్, పశ్చిమ, మధ్య ఇరాన్ లలో లక్ష్యాల పైన దాడులు చేసింది. పశ్చిమ ఇరాన్ లోని కరాజ్ పట్టణం, తదితర లక్ష్యాల పైన దాడి జరిగిందని ఇరాన్ పత్రికలు చెప్పాయి. ట్రంప్, నేతన్యాహు ల నాటకం మరోసారి బట్టబయలు అయింది.
ఇజ్రాయెల్ దాడి తర్వాత టెహ్రాన్ ఎయిర్ పోర్ట్ చుట్టు పక్కల గగన తలాన్ని మూసినట్లు ఇరాన్ తెలియజేసింది.
తాజా దాడుల నేపథ్యంలో చమురు ధర 2 శాతం పెరిగి బ్యారెల్ కు 95 డాలర్లకు చేరింది. కాగా తమ దాడి వివరాలు ఐ.ఆర్.జి.సి వెల్లడి చేసింది. ఇజ్రాయెల్ లో నజరేత్ వద్ద ఉన్న రమాత్ డేవిడ్ ఎయిర్ బేస్ లక్ష్యంగా మిసైల్ దాడి చేశామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది.
ఇజ్రాయెల్ దాడి వివరాలు కూడా ఐ.ఆర్.జి.సి వెల్లడించింది. ఆకాశం గుండా ప్రయోగించే బాలిస్టిక్ మిస్సైల్స్ ను ఇజ్రాయెల్ ప్రయోగించిందని చెప్పింది.
ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు ఇరాన్ తో తమ చర్చలను ప్రభావితం చేయవని ట్రంప్ ఇంకోసారి ఫైనాన్షియల్ టైమ్స్ తో మాట్లాడుతూ చెప్పాడు. ఈ సంగతి పదే పదే ట్రంప్ చెప్పటం బట్టి ఒప్పందం కోసం ట్రంప్ పాకులాట వెల్లడి అవుతోంది. నవంబర్ లో పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నందున ఇరాన్ తో సంధి ట్రంప్ కి అవసరం అయింది. ట్రంప్ పాపులారిటీ పడిపోవడంతో రిపబ్లికన్ పార్టీ నుండి ట్రంప్ పైన వత్తిడి వస్తోంది.
ఇంకో పక్క ఇజ్రాయెల్ దాడితో సంబంధం లేదని చెప్పటం ద్వారా ఆ దాడులకు ట్రంప్ పరోక్ష అనుమతి ఇచ్చేశాడు.
ఇరాన్ పైన ఇజ్రాయిల్ మళ్ళీ దాడులు చేసింది టెహ్రాన్ లో రెండు శక్తివంతమైన పేలుళ్లు జరిగాయని ఇరాన్ పత్రికలు చెప్పాయి. ఇస్ఫాహన్ పట్టణంలో మూడు చోట్ల ఇజ్రాయెల్ దాడులు చేసిందని తెలిపాయి. అలాగే తబ్రిజ్ పట్టణం పైనా దాడులు జరిగినట్లు తెలుస్తున్నది.
ఇజ్రాయెల్ మంత్రులు దూకుడుగా విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారు. టెహ్రాన్ నగరం మంటల్లో మాడి మసి కావాలని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి బెన్ గువిర్ శపించాడు. ఇజ్రాయెల్ పై దాడి చేసి ఇరాన్ తప్పు చేసిందని ఫలితం అనుభవిస్తుందని హెచ్చరించాడు.
ఇరాన్ కూడా మరో విడత మిసైల్ దాడులను ఇజ్రాయెల్ పైన ఎక్కుపెట్టడంతో పౌరులంతా వెంటనే బంకర్లలో దాక్కోవాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) ఇజ్రాయెల్ పౌరులను కోరింది. ఇరాన్, లెబనాన్ లకు మద్దతుగా యెమెన్ కూడా రంగం లోకి దిగినట్లు ఐడిఎఫ్ తమ పౌరులకు చేసిన హెచ్చరికలను బట్టి తెలుస్తున్నది. యెమెన్ వైపు నుండి మిసైల్ దాడి గురించి ఐడిఎఫ్ హెచ్చరిక విడుదల చేసింది. ఇరాన్ లోని రాడార్ లను ఇజ్రాయెల్ టార్గెట్ చేసి దాడులు చేయగా, ఇజ్రాయెల్ లోని నెవాటిమ్ మరియు టెల్ నాఫ్ వైమానిక స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసి దాడులు చేసిందని ఇరాన్ కి చెందిన ఫార్స్ న్యూస్ ఏజన్సీ తెలియజేసింది.
కతార్ ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ ఆల్ ధాని, ఇరాన్ విదేశీ మంత్రి అబ్బాస్ ఆరాఘ్చి కి ఫోన్ చేసి చర్చలు జరిపాడు. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల గురించి, లెబనాన్ లో తాజా పరిణామాల గురించి కతార్ ప్రధాని చర్చించినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతలు మళ్ళీ చెలరేగటంతో గల్ఫ్ దేశాలు, మళ్ళీ ఇరాన్ నుండి దాడులు ఎదుర్కోవలసి ఉంటుందని ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తున్నది. ఇన్నాళ్లు అమెరికా సైనిక స్థావరాలు తమకు రక్షణ కల్పిస్తాయని గల్ఫ్ దేశాలు భావించగా, ఇరాన్ యుద్ధం ద్వారా అమెరికా స్థావరాల వల్లనే తమకు అభద్రత పొంచి ఉందని గ్రహిస్తున్నాయి.
ఇజ్రాయెల్ లక్ష్యాలపై మిసైల్స్ తో దాడి చేశామని యెమెన్ ప్రకటించింది. లక్ష్యాలను ఛేదించామని ఇరాన్ మిలటరీ ప్రతినిధి ప్రకటించాడు. కాగా ఇరాన్ నుండి ఏ మార్గం వీలుగా ఉన్నా సరే వెంటనే బైటకి వెళ్లిపోవాలని ఇరాన్ లోని ఇండియన్ ఎంబసీ ఇరాన్ లోని భారత పౌరులను కోరింది.
ఇరాన్ నుండి మూడో విడత మిసైల్స్ ఇజ్రాయెల్ మీదికి దండుగా వస్తున్నాయని ఇజ్రాయెల్ తన పౌరులను హెచ్చరించింది. వెంటనే బంకర్ షెల్టర్ల లోకి వెళ్లాలని కోరింది.
ఎర్ర సముద్రం లో ఇజ్రాయెల్ కి సంబంధించిన రవాణా నౌకలు ఏవీ ప్రయాణించటానికి వీలు లేదని యెమెన్ లోని హుతి గ్రూపు (అన్సర్ అల్లా) ప్రకటించింది. తమ నిషేధాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్ నౌకలు ఎర్ర సముద్రం లోకి వస్తే దాడి చేస్తామని హెచ్చరించింది. సూయజ్ కెనాల్ ద్వారా మధ్యధరా సముద్రం లోకి వెళ్ళే వాణిజ్య, ప్రయాణ నౌకలు తప్పనిసరిగా ఎర్ర సముద్రం గుండానే వెళ్ళాలి. ఆసియా నుండి ఐరోపాకు వెళ్లే వాణిజ్య నౌకలు ప్రధానంగా ఈ మార్గంలోనే వెళ్లాలి. లేదా ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.
లెబనాన్ రాజధాని బీరుట్ పైన ఇజ్రాయెల్ గత నెల రోజుల నుండి చేస్తున్న హంతక దాడులకు ప్రతీకారంగా తాము ప్రారంభించిన మిసైల్స్ దాడులకు ఇరాన్, ‘ఆపరేషన్ నసర్’ అని పేరు పెట్టింది. దీని అర్ధం “విజయం” అని తెలుస్తున్నది. ఫిబ్రవరి 28 తేదీన ఇరాన్ పైన అమెరికా-ఇజ్రాయెల్ దేశాల సంయుక్త దాడులు ప్రారంభమై జూన్ 8 తేదీతో 100 రోజులు పూర్తయ్యాయి. యుద్ధం పూర్తి స్థాయిలో జరగనుందన్న ఆందోళనతో ఈజిప్టు, సౌదీ అరేబియా, పాకిస్తాన్, కతార్, టర్కీ దేశాలు అమెరికాకు విజ్ఞప్తి చేశాయి. ఇరాన్, బీరుట్ లపై దాడి చేయకుండా ఇజ్రాయెల్ ను కట్టడి చేయాలని ఆ దేశాలు అమెరికాను గట్టిగా కోరాయి.
ఇజ్రాయెల్ తాజాగా దక్షిణ బీరుట్ పై దాడులు చేయటం పట్ల పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నదట. లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడుల నేపధ్యంలో అమెరికాతో చర్చలకు ఇరాన్ నిరాకరించటంతో చర్చలు నిలిచిపోయాయి. చర్చల కోసం మరోసారి ప్రయత్నాలు చేసేందుకు పాక్ ప్రతినిధులు ఇరాన్ రాజధాని టెహరాన్ లో ఉన్న సమయం లోనే ఇజ్రాయెల్, బీరుట్ పైన దాడులు జరిపింది. అమెరికా-ఇరాన్ చర్చలు జరగకుండా నిలువరించేందుకే ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని పాక్ ప్రతినిధులు అమెరికాకు ఫిర్యాదు చేశారు. ఇజ్రాయెల్ ని కట్టడి చేయాలని కోరింది. ట్రంప్ మాత్రం చర్చల నిర్ణయం తమదే తప్ప ఇజ్రాయెల్ ది కాదని స్పష్టం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ దాడుల గురించి ప్రశ్నించేందుకు రాయిటర్స్ వైట్ హౌస్ ను సంప్రదించగా సమాధానం రాలేదట.
ఇజ్రాయెల్ లోని నెవాటిమ్ టెల్ నాఫ్ వైమానిక స్థావరాలు ఇజ్రాయెల్ కు అతి ముఖ్యమైన మిలటరీ స్థావరాలు అని తెలుస్తోంది. కాగా ఇరానియన్ పట్టణం మహాషహార్ పట్టణం లోని పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్ ను లక్ష్యం చేసుకుని ఇజ్రాయెల్ పలు దాడులు చేసింది. కాగా తాజా ఘర్షణలో అమెరికా జోక్యం చేసుకున్నట్లయితే, ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాల పైన తాము దాడులు చేస్తామని ఇరాక్ లోని షియా మిలీషియా ‘ఖతిబ్ హిజ్బొల్లా’ హెచ్చరించింది.
టెహరాన్ చుట్టూ ఉన్న ఎయిర్ డిఫెన్స్ (శత్రు దేశాల మిసైల్ దాడులను గమనించి ఆటోమేటిక్ గా సొంత మిసైల్ ని ప్రయోగించటం ద్వారా శత్రు మిసైల్ ను గాలి లోనే అడ్డుకుని ఛేదించే వ్యవస్థ) వ్యవస్థను తమ దాడులతో నాశనం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఐతే ఇలాంటి విక్టరీ ప్రకటనలు అమెరికా, ఇజ్రాయెల్ లో గతంలో చాలానే చేశాయి. తీరా చూస్తే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కాకుండా డీకాయ్ (ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ లాగా కనిపించే బొమ్మలు గాని లేదా చౌక మెటీరియల్ తో తయారు చేసిన మిసైల్, రాడార్ ల బొమ్మలు గానీ) లను మాత్రమే అమెరికా, ఇజ్రాయెల్ లు నాశనం చేసినట్లు బైట పడింది.
ఇజ్రాయెల్ నుండి తాజాగా ఎదురవుతున్న సీజ్ ఫైర్ ఉల్లంఘనలకు అమెరికాయే బాధ్యత వహించాలని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘీ స్పష్టం చేశాడు. ఇజ్రాయెల్ దాడులు ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న సీజ్ ఫైర్ చర్చలు మరింత క్షీణిస్తాయని, ఈ దాడులతో అమెరికా ఉద్దేశాల పట్ల ఇరాన్ కి ఉన్న అనుమానాలు మరింత బలపడతాయని హెచ్చరించాడు. అమెరికా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నదంటే తాము నమ్మలేమని ఇజ్రాయెల్ సొంతగా ఎలాంటి చర్య తీసుకోదని ఆయన స్పష్టం చేశాడు.
ఇండియాకు చెందిన సముద్ర ప్రయాణీకులు 24 మంది ప్రయాణిస్తున్న నౌక హోర్ముజ్ జలసంధి వద్ద దాడికి గురయింది. ఈ మేరకు నౌకలో ఉన్న భారత నావికులు ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. ఒమన్ తీరానికి తాము ఎంత దూరంలో ఉన్నది తెలియజేస్తూ వాళ్ళు ఒమన్ కు వర్తమానం పంపారు. ఇరాన్ – అమెరికా యుద్ధంలో ఇండియా పాలకులు పూర్తిగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాల పక్షం వహించిన ఫలితాన్ని భారతీయులు అనుభవిస్తున్నట్లు కనిపిస్తున్నది.
ఇజ్రాయెల్ కు చెందిన పెట్రో కెమికల్స్ ఫ్యాక్టరీ పైన తాజాగా దాడి చేశామని ఐ.ఆర్.జి.సి ప్రకటించింది. ఇరాన్ లోని పెట్రో కెమికల్ కాంప్లెక్స్ పైన దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడి చేసినట్లు భావించవచ్చు.
ఇరాన్ కు చెందిన అనేక మంది వ్యక్తుల (అధికారులు, రాజకీయ నాయకులు మొ.) పైన సరికొత్తగా ఆంక్షలు విధించామని యూరోపియన్ యూనియన్ విదేశాంగ శాఖ చీఫ్ కాజా కల్లాస్ ప్రకటించింది. 40 యేళ్ల నుండి అమెరికా, ఐరోపాలు ఇరాన్ పైన ఇలాంటి ఆంక్షలను అనేక డజన్ల సార్లు ప్రకటించి అమలు చేశాయి. ఐనా ఇరాన్ మిలటరీ అభివృద్ధిని, అణు సామర్ధ్యం అభివృద్ధిని ఆపలేకపోయాయి.

పశ్చిమాసియాలో హింస పేట్రేగటం పట్ల ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సమాజానికి ఇది అత్యంత ఆందోళనకరమని, వంద రోజుల ఘర్షణ ఇప్పటికే ప్రజలకు కష్ట నష్టాలకు గురి చేసిందని, గ్లోబల్ ఆర్ధిక వ్యవస్థ, ఇంధన సరఫరా దెబ్బతిన్నాయని గుర్తు చేసింది. యుద్ధంలో ఉన్న అన్ని పక్షాలు శాంతం వహించి ఉద్రిక్తతలు తగ్గించాలని కోరింది. బీరుట్ పైన ఇజ్రాయెల్ చేస్తున్న హంతక దాడుల్లో 3000 మందికి పైగా చనిపోవటం గురించి గానీ, సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించటం గురించి గానీ ఒక్క ముక్కా భారత విదేశాంగ శాఖ ప్రకటన చెప్పకపోవటమే విడ్డూరం.
ట్రంప్ స్ట్రైక్స్ ఎగైన్! ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు తక్షణం సీజ్ ఫైర్ ఒప్పందం దిశగా కదులుతున్నాయని ట్రంప్ ప్రకటించాడు. అమెరికా-ఇరాన్ మధ్య అంతిమ ఒప్పందం కుదిరే వరకు అమెరికా విధించిన హోర్ముజ్ బ్లాకేడ్ కొనసాగుతుందని కూడా ప్రకటించాడు. ఇజ్రాయెల్-ఇరాన్ సీజ్ ఫైర్ గురించి చెబుతూ హోర్ముజ్ జలసంధి పైన అమెరికా బ్లాకేడ్ కొనసాగుతుందని ట్రంప్ చెప్పాడంటే అర్ధం ఏమిటి? అమెరికా ఆదేశాలతోనే ఇజ్రాయెల్, ఇరాన్ టార్గెట్ ల పైన దాడులు చేసిందని ఇది తెలియజేస్తున్నది. బీరుట్ పైన ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా చర్చలను ఇరాన్ నిలిపివేయటంతో ఇరాన్ ని మళ్ళీ చర్చల బల్ల వద్దకు రప్పించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ చేత ట్రంప్ దాడులు చేయించినట్లు కనిపిస్తున్నది. వాస్తవం ఏమిటన్నది త్వరలోనే వెల్లడి కాక మానదు.
కాగా పశ్చిమ మీడియా కంపెనీలు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఎంత తీవ్రంగా నష్ట పోయినదీ, ఈ దెబ్బతో ఇరాన్ రాడార్, మిసైల్స్ శక్తి ఎంతగా క్షీణించిందీ తెలియజేస్తూ కధలు కధలుగా విశ్లేషణలు రాస్తున్నాయి. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్ కు జరిగిన నష్టం గురించి మాత్రం ఏమీ చెప్పటం లేదు.
తాజాగా ప్రారంభించిన మిలటరీ ఆపరేషన్ ఇక ముగిస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ కు చెందిన సెమీ-అఫిషియల్ వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ తెలిపింది. లెబనాన్ పైన (అనగా హిజ్బొల్లా పైన) ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు చేస్తే గనక తాము మళ్ళీ ఇజ్రాయెల్ పైన దాడుల్ని పునఃప్రారంభిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.
ట్రంప్, నెతన్యాహు ల మధ్య విభేదాలు బలపడ్డాయని పశ్చిమ పత్రికలు తాజా కధలు ప్రచారం చేస్తున్నాయి. ఈ కధల ద్వారా ట్రంప్ కి లేదా అమెరికాకి సంబంధం లేకుండా, అమెరికాని సంప్రదించకుండా ఇజ్రాయెల్ దేశం లెబనాన్, ఇరాన్ ల పైన దాడులు చేస్తున్నదని అమెరికాకి ఏ పాపం తెలియదని చెప్పేందుకు ఉద్దేశించినవిగా భావించవచ్చు. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పినట్లు అమెరికా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ ఏ చర్యా చేపట్టదు. నెతన్యాహు కు ఫోన్ చేసి ట్రంప్ తిట్టి పోసినట్లు, ఇరువురి మధ్య విభేదాలు తీవ్రం అయినట్లు వస్తున్న వార్తలు అమెరికా సామ్రాజ్యవాదం యొక్క ప్రయోజనాలను, అమెరికా పట్ల కలిగే భావనలను కృత్రిమంగా అనుకూలంగా మలుచుకోవటానికి ఉద్దేశించినవి మాత్రమే.
యుద్ధరంగాన్ని వదిలిపెట్టడం గానీ, శాంతి చర్చల బల్ల నుండి వైదొలగడం గానీ ఇరాన్ చేయలేదని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్పష్టం చేశాడు. యుద్ధరంగాన్ని విడవలేదని ఇరాన్ ప్రజలకు, చర్చల బల్ల వదలలేదని ప్రపంచ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు చెప్పినట్లుగా భావించవచ్చు.
ట్రంప్, నెతన్యాహు ల మధ్య ఫోన్ సంభాషణ ముగిసిందని ఇజ్రాయెల్ లోని హీబ్రూ పత్రికలు చెబుతున్నాయి. వారిద్దరు ఏ మాట్లాడుకున్నారో వివరం లేదు. ఐతే దాడులు ఆపటం గురించి ఇజ్రాయెల్ ప్రతినిధి ఇంతవరకు ఏ ప్రకటనా చేయలేదు. లెబనాన్ లోని హిజ్బొల్లా పైన దాడులు చేయనంత వరకు తమ నుండి దాడులు జరగబోవని ఇరాన్ ప్రకటించింది గాని అలాంటి ప్రకటన ఇజ్రాయెల్ చేయలేదు. ఇజ్రాయెల్ ప్రభుత్వం నుండి ఆదేశాల కోసం ఐడిఎఫ్ ఎదురు చూస్తున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు హీబ్రూ పత్రికలు రాశాయి.
ఇరాన్ పైన దాడులను ప్రస్తుతానికి ముగిస్తున్నట్లు ఇజ్రాయెల్ కూడా ప్రకటించినట్లు ఇజ్రాయెల్ లోని చానల్ 12 తెలిపింది. ఇజ్రాయెల్ పట్టణాలపై హిజ్బొల్లా దాడులు చేసినట్లయితే బీరుట్ శివారు ప్రాంతాలపై మళ్ళీ దాడులు చేస్తామని ఇజ్రాయెల్ కు చెందిన సీనియర్ అధికారి చెప్పినట్లు చానల్ 12 తెలియజేసింది. కానీ దక్షిణ లెబనాన్ పైన మాత్రం ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మళ్ళీ మెలిక పెట్టింది. లేదా దాడులు కొనసాగించే అవకాశాన్ని అమెరికా అట్టి పెట్టుకుంది. దీనికి ఇరాన్ స్పందన ఏమిటో చూడాల్సి ఉన్నది.
అమెరికా-ఇరాన్ లు సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత అంటే ఏప్రిల్ 8 తర్వాత లెబనాన్ భూభాగాల పైన ఇజ్రాయెల్ 3,500 సార్లు మిసైల్, బాంబు దాడులు చేసింది. ఈ సంగతి ఇజ్రాయెల్ మంత్రి మెనస్సా స్వయంగా చెప్పాడు. 407 సార్లు కంట్రోల్డ్ డిమాలిషన్లు చేశామని 6 సార్లు భారీ స్థాయి కూల్చివేత ఆపరేషన్లు నిర్వహించామని ఆయన వెల్లడి చేశాడు. కంట్రోల్డ్ డిమాలిషన్లు, భారీ కూల్చివేతలు… ఈ రెండూ దక్షిణ లెబనాన్ లో షియా ప్రజల కాలనీల వినాశనంకు సంబంధించినవి. గ్రేటర్ ఇజ్రాయెల్ స్థాపన, ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న దేశాల లోని నీటి వనరులను ఒక పద్ధతి ప్రకారం స్వాధీనం చేసుకోవటం లో భాగంగా ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్ పైన దాడులు చేస్తూ వీలైనంత ఎక్కువమంది ప్రజలను చంపేస్తున్నది. ఈ పధకంలో ఇజ్రాయెల్ బూట్లు నాకుతున్న అరబ్ దేశం జోర్డాన్, ఈజిప్టులు కూడా ఉన్నాయి. ఈ సంగతి ఇజ్రాయెల్ దాచుకోవటం లేదు. గ్రేటర్ ఇజ్రాయెల్ లో ఏయే దేశాల భూభాగాలు భాగంగా ఉన్నాయో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, నేరుగా ఐరాస సమావేశం లోనే మ్యాప్ చూపిస్తూ ప్రకటించాడు. ఐనా అరబ్ దేశాలు మిన్నకున్నాయి.