పొరుగు దేశమే మమ్మల్ని కాపాడుతోంది! -కాశ్మీర్ నేత ఫరూక్

–

జమ్ము & కాశ్మీర్ ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రి, పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన వృద్ధ నేత, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నాయకుడు అయిన ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద ప్రకటన చేశాడు. అంతర్జాతీయంగా మన పొరుగు దేశమే కాశ్మీర్ ప్రజల బాగోగుల గురించి మాట్లాడుతోందని తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ అన్నాడు. తన వ్యాఖ్యల ద్వారా బి‌జే‌పి నుండి ఖండన మండనలు ఎదుర్కొన్నాడు.

“పొరుగు దేశం అంతర్జాతీయంగా అనేక చోట్లకు వెళ్ళి కాశ్మీరీ ప్రజల గురించి మాట్లాడుతోంది. అందువల్లనే జమ్ము & కాశ్మీర్ ప్రజలు రక్షణ పొందుతున్నారు. అది లేకుంటే, కాశ్మీరీ ప్రజల పట్ల భారత దేశ ఉద్దేశ్యాలు సరిగ్గా లేవు” అని ఫరూక్ అబ్దుల్లా బారాముల్లా లో జరిగిన పార్టీ సదస్సులో వ్యాఖ్యానించాడు. ప్రపంచ వ్యాపితంగా ఎదురవుతున్న ఒత్తిడి వల్లనే కేంద్ర ప్రభుత్వం “మౌనంగా” ఉంటున్నది. అంతర్జాతీయ ఒత్తిడి లేకపోతే బి‌జే‌పి ప్రభుత్వం కాశ్మీరీ ప్రజలపై మరిన్ని నిర్బంధ చర్యలకు పాల్పడి ఉండేదని ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయంగా కనిపిస్తోంది.

పాకిస్తాన్ పేరు నేరుగా చెప్పనప్పటికీ ఫరూక్ అబ్దుల్లా ఉద్దేశంలో పొరుగు దేశం అంటే పాకిస్తాన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇన్నాళ్లూ కాశ్మీర్ ప్రజలు అనుభవిస్తున్న ప్రత్యేక హక్కులు రద్దయ్యాయన్న అభిప్రాయం ఇండియా అంతటా ఒక అభిప్రాయం వ్యాపించి ఉన్నది. కానీ వాస్తవ పరిస్ధితులను క్షుణ్ణంగా గమనిస్తే ఈ అభిప్రాయంలో నిజం లేదని అర్ధం అవుతుంది.

ఆర్టికల్ 370 ద్వారా జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి, తద్వారా ప్రత్యేక రాజ్యాంగం మరియు ప్రధాన మంత్రి, రాష్ట్రపతి పదవులు ఇవ్వబడ్డాయి. కానీ ఈ ప్రత్యేక హక్కులు సమస్తం కాంగ్రెస్ పార్టీ పాలనలోనే, ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ పాలనలోనే నీరు గార్చబడ్డాయి. ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హక్కులను జమ్ము & కాశ్మీర్ ప్రజలు ఏనాడూ అనుభవించింది లేదు. నెహ్రూ పాలన అనంతరం ఇందిరా గాంధీ హయాంలో కూడా ఆర్టికల్ 370 ని సంపూర్ణంగా నామమాత్రం చేసేశారు. ఆర్టికల్ 370 నిజానికి ఒక మృత ఆర్టికల్ గా నే ఉనికిని కలిగి ఉన్నది తప్ప అది సజీవంగా లేదు.

ఆర్టికల్ 370 ని నిజమైన అర్ధంలో అమలు చేయమని కోరినప్పుడల్లా నెహ్రూ ప్రభుత్వం ఆయనను జైలులో నిర్బంధించింది. ఆ విధంగా ఆయన 17 సంవత్సరాలకు పైగా జైలు నిర్బంధంలోనే గడిపాడు. దరిమిలా ఆయన కాశ్మీర్ సింహంగా పేరు సంపాదించాడు.

కాబట్టి ఎన్‌డి‌ఏ/బి‌జే‌పి/నరేంద్ర మోడి హయాంలో ఆర్టికల్ 370 రద్దు పేరుతో జరిగిన తతంగం అంతా కేవలం ఫార్మల్ గా జరిగిన ప్రక్రియ మాత్రమే. అప్పటికే 99 శాత చచ్చిపోయి కోన ఊపిరితో ఉన్న ఆర్టికల్ 370 ని వెంటిలేషన్ ను తొలగించటం ద్వారా ఆ చివరి కార్యక్రమాన్ని బి‌జే‌పి పూర్తి చేసింది. ఆర్టికల్ 370 రద్దు కాకుండా ఉంటే కనీసం సదరు ఆర్టికల్ కల్పించిన హక్కులను అమలు చేయండి అని డిమాండ్ చేసే అవకాశం కాశ్మీర్ కు ఉండేది. ఇప్పుడు అది లేకుండా పోయింది.

కనుక ఆర్టికల్ 370 ని రద్దు చేయక మునుపే వరుస కాంగ్రెస్ ప్రభుత్వాలు దానిని నామమాత్రమైన అవశేషంగా మార్చి వేశారు. బి‌జే‌పి, ఆర్టికల్ ను రద్దు చేయటం ద్వారా చివరి అంకాన్ని మాత్రమే పూర్తి చేసింది. ఆర్టికల్ 370 ని నీరు గార్చటం లోనూ, కాశ్మీర్ ప్రజలను తప్పు దోవ పట్టించటం లోనూ నెహ్రూ, కాంగ్రెస్ లకు ఎంత పాత్ర ఉన్నదో నేషనల్ కాన్ఫరెన్స్ మరియు ఫరూక్ అబ్దుల్లా లకు కూడా అంతే పాత్ర ఉన్నది. ఫరూక్ కుటుంబం మరియు ఆయన కేంద్రంగా ఉన్న కాశ్మీర్ శిబిరం ఇండియా పాలకులకు అనుకూలమైన శిబిరం. కాశ్మీర్ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు వారు నిజమైన ప్రతినిధులు కారు.

అందుకే నేషనల్ కాన్ఫరెన్స్ మరియు కాంగ్రెస్ పార్టీల మోసాలను ఎండగడుతూ కాశ్మీర్ లో జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ లాంటి అనేక సంస్థలు కాశ్మీర్ స్వంత్రాన్ని కోరుతూ వెలిశాయి. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆధీన రేఖకు రెండు పక్కలా 1990 ప్రాంతాల్లో ఉవ్వెత్తున ఉద్యమాలు, సాయుధ ఘర్షణలు తలెత్తాయి. జే‌కే‌ఎల్‌ఎఫ్ సంస్థ సాయుధ ఘర్షణలకు దిగనప్పటికీ, పాకిస్తాన్ సహాయంతో అనేక సాయుధ సంస్థలు, టెర్రరిస్టు సంస్థలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో పని చేశాయి.

ఇవి అడపా దడపా ఆధీన రేఖను దాటి ఇండియా ఆధీనం లోని కాశ్మీర్ లో టెర్రరిస్టు చర్యలకు పాల్పడ్డాయి. వారికి సహకరిస్తున్నారన్న అనుమానంతో కాశ్మీర్ లోయలో భారత ప్రభుత్వం లక్షల సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించి కనీస ప్రజాస్వామిక హక్కులు లేకుండా చేశాయి. ఈ అణచివేత కాంగ్రెస్ హయాంలో ప్రారంభం కాగా బి‌జే‌పి హయాంలో అది తీవ్రం అయింది. కాశ్మీర్ ప్రజల హక్కులను అణచివేయటంలో కాంగ్రెస్, బి‌జే‌పి లు ఒకటే అనటంలో సందేహం లేదు. తీవ్రతలో తేడా ఉండవచ్చు. నిజానికి సుదీర్ఘకాలం పాటు కాశ్మీర్ ప్రజలపై అణచివేతకు పాల్పడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం.

కాంగ్రెస్ సాగించిన అణచివేతలో ఫరూక్ అబ్దుల్లా, ఆయన నేతృత్వం లోని నేషనల్ కాన్ఫరెన్స్ లు సహకార పాత్ర పోషించాయి. జే‌కే‌ఎల్‌ఎఫ్ అణచివేతలో అబ్దుల్లా ప్రభుత్వం చురుకైన పాత్ర పోషించింది. అందుకే కాశ్మీర్ ప్రజల్లో నేషనల్ కాన్ఫరెన్స్ మరియు అబ్దుల్లా కుటుంబం పట్ల గౌరవాభిమానాలు పెద్దగా లేవు. ఈ నేపధ్యంలో ప్రజల నుండి మెప్పు పొందేందుకు అప్పుడప్పుడూ ఫరూక్ అబ్దుల్లా ఇలా ప్రజల తరపున మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉంటాడు. ఆ నటనలో భాగంగానే ప్రస్తుతం అబ్దుల్లా చెబుతున్న మాటలను పరిగణించవచ్చు.

“ఢిల్లీ నుండి మీరు ఏమి ఆశించగలరు? వాళ్ళు మీకు న్యాయం చేస్తారని ఆశించగలరా? పోరాడేందుకు ధైర్యం తెచ్చుకోండి లేకపోతే మిమ్మల్ని తుడిచి పెట్టేస్తారు, మీ ఐడెంటిటీ అదృశ్యం అయిపోతుంది. ఈ రోజు భారత ప్రభుత్వం మౌనంగా ఉందంటే కారణం ప్రపంచం నుండి వారికి ఎదురవుతున్న ఒత్తిడే. మన పౌరుగు దేశం ప్రతి ఛోటా ‘కాశ్మీర్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు’ అని చెప్పటం వల్లనే వాళ్లు మౌనంగా ఉన్నారు” అని ఫరూక్ అన్నాడు. ప్రజలను పోరాడమని కోరుతున్న ఫరూక్ అబ్దుల్లా, నిజానికి కాశ్మీర్ ప్రజల పోరాటాలను కాంగ్రెస్ తో కలిసి ఉక్కు పాదంతో అణచివేసిన చరిత్ర కలిగి ఉన్నాడు. తమ కుటుంబ ఆస్తులను కాపాడుకోవటం కోసం కాంగ్రెస్, బి‌జే‌పి లలో దేనితోనైనా పొత్తు పెట్టుకునేందుకు ఆయన సిద్ధం. ప్రజల మూడ్ ని బట్టి ఆయన విధేయత మారుతూ ఉంటుంది. ప్రజల్లో వ్యతిరేకత ప్రబలినప్పుడల్లా లండన్ వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవటం వారి కుటుంబానికి ఉన్న అలవాటు.

సహజంగానే బి‌జే‌పి, ఫరూక్ ప్రకటనను ఖండించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కంటే ఇండియా వైపు ఉన్న కాశ్మీర్ లోనే అభివృద్ధి ఎక్కువగా జరిగిందని ఎత్తి చూపింది. ఆర్టికల్ 370 ని రద్దు చేయటమే బి‌జే‌పి చేసిన అతి పెద్ద అభివృద్ధికర చర్య అని పార్టీ ప్రతినిధి ఆర్ పి సింగ్ చెప్పటం విశేషం. ఆర్టికల్ 370 ని రద్దు చేయటం వలనే ఇండియన్ కాశ్మీర్ లో కాశ్మీరీలు అభివృద్ధి బాటలో నడుస్తున్నారని కూడా ఆయన ప్రకటించాడు.

అబ్దుల్లా చెప్పినట్టు పాకిస్తాన్ అవకాశం వచ్చినప్పుడు వివిధ అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ సమస్యను ప్రస్తావిస్తున్నది. ఐక్యరాజ్య సమితి, ముస్లిం దేశాల అంతర్జాతీయ సంస్థ అయిన ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ (ఓ‌ఐ‌సి) మొదలైన సంస్థల సమావేశాల్లో కాశ్మీర్ సమస్యను ప్రస్తావించింది. ఈ కారణం వల్లనే కాశ్మీర్ లో అణచివేత చర్యలను భారత ప్రభుత్వం నెమ్మదింపజేసిందని అబ్దుల్లా అభిప్రాయం. వాస్తవం ఏమిటన్నది కాశ్మీర్ ప్రజలే చెప్పాలి తప్ప ఇంకెవరూ కాదు.

నిజానికి కాశ్మీర్ ప్రజల్లో అటు ఇండియా పట్ల గానీ, పాకిస్తాన్ పట్ల గానీ సానుకూలత లేని సంగతి అనేకసార్లు వెల్లడి అయింది. ఇటీవల కాలంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు పెరిగాయి. పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టు సంస్థలు తప్ప ఇతర సంస్థలు ముఖ్యంగా కాశ్మీర్ ప్రజలు ఇండియా, పాకిస్తాన్ రెండు దేశాలను తమ దేశాన్ని ఆక్రమించిన దేశాలుగా పరిగణిస్తున్నారని వివిధ కాశ్మీరీ స్కాలర్లు, పరిశోధకులు చెప్పి ఉన్నారు. కాశ్మీర్ ను ఆర్ధిక వనరులు అందించే భూభాగంగానో లేదా మతపరమైన సెంటిమెంట్ గానో కాకుండా ప్రజాస్వామిక ఆకాంక్షలు కలిగిన ప్రజా సమూహం నివసిస్తున్న ప్రజల నేల గా చూసినట్లయితే కాశ్మీర్ సమస్యను ప్రజల సమస్యగా చూస్తేనే శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఆస్కారం ఉంటుంది. అంతవరకు కాశ్మీర్ అన్నది “నెత్తురోడుతున్న గాయం” గానే మిగిలి ఉంటుంది.

స్పందించండి