
–
—–మనోజ్ఞ, 28-07-2026
జనరేషన్ Z (జెన్ జి) ఆందోళన విజయవంతం కావడం పట్ల ఆర్ఎస్ఎస్, బిజెపి, ఇతర హిందూత్వ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు కడవల కొద్దీ కన్నీళ్లు కార్చుతున్నారు. వారి కన్నీటి ప్రవాహానికి “నేనూ సమిధ నొక్కటి ఆహొతిస్తాను” అంటూ ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ కూడా జత కలిశారు.
విద్యార్ధులు, యువకులు నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావటానికి నిరసనగా, పనిలో పనిగా బిజెపి ప్రభుత్వం విద్యార్ధులు, యువకుల పట్ల అనుసరిస్తున్న అణచివేత విధానాలకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవధిక ఆందోళన ప్రారంభించిన నాటి నుండి వారి పైన హిందూత్వ దళాలు చేయని ఆరోపణ లేదు, తిట్టని తిట్టు లేదు.
ఆరంభంలో ‘ఆఁ పిల్ల చేష్టలు’ అని కొట్టి పారేసిన బొద్దింకల జనతా పార్టీ ఆందోళన చివరికి ‘ఏకు మేకైంది’ అన్నట్టుగా మారటంతో మొండి, అహంకార నేతలుగా పేరు పడ్డ ప్రధాన మంత్రి, హోమ్ మంత్రిలు దిగిరాక తప్ప లేదు. రాజీనామా చేసింది విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయినప్పటికీ వాస్తవంలో మెట్టు దిగింది, విద్యార్ధుల ముందు తల వంచింది మాత్రం నరేంద్ర మోడి, అమిత్ షా గార్లే అని అందరికీ తెలుసు.
ప్రధాన మంత్రి, హోమ్ మంత్రి గార్లు విద్యార్ధుల ముందు తల వంచ వలసి రావటం అంటే తాను కూడా తల వంచినట్లే అని ఆర్ఎస్ఎస్ అధినేత (సర్ సంఘ్ చాలక్) మోహన్ భగవత్ గారు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఐతే మోహన్ భగవత్ గారికి నేరుగా విద్యార్ధులను, యువకులను తప్పు పట్టటానికి ధైర్యం సరిపోయినట్లు లేదు, ఆయన వారి తల్లి దండ్రులను తప్పు పడుతున్నారు. పెద్దలు తిన్నగా ఉంటే పిల్లలు ఎందుకు చెడిపోతారు? అన్నది ఆయన ప్రశ్న! ‘పిల్లలు చెడిపోతారు’ అని ఆయన నేరుగా అనలేదు గాని, ఆయన అంతరార్ధం అదే అని ఆయన మాటలు విన్న వారికి ఇట్టే అర్ధం అవుతుంది. ఓ పక్క పిల్లలను పొగుడుతున్నట్లు కనిపిస్తూనే వారిని పరోక్షంగా తప్పు పట్టారాయన.
ఆయన ఏమన్నారో చూడండి ఓ సారి!
“సోషల్ మీడియాను లేదా ఫోన్ లను అతుక్కు పోవద్దని మనం యువ తరాన్ని ఎలా అడగ్గలం, పెద్దలం మనమే వాటికి (ఫోన్లకు) ఆంటి పెట్టుకుని ఉన్నప్పుడు?” అని ఆయన భారతదేశ తల్లి దండ్రులను ఆవేదనతో ప్రశ్నించారు. వారికి మనం సరైన ఉదాహరణలుగా ఉన్నప్పుడే వారితో అర్ధవంతమైన సంభాషణ చేయగలుగుతాము. ప్రస్తుత సమస్యలకు అదే ఏకైక పరిష్కారం” అని మోహన్ భగవత్ గారు వాకృచ్చారు.
నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం పరీక్షకు ముందే వెల్లడి కావటానికి, విద్యార్ధుల తల్లి దండ్రులు మొబైల్ ఫోన్ల కు అతుక్కు పోవటమే కారణం అని మోహన్ భగవత్ గారు సెలవిస్తున్నారు. దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టెయ్యండి అన్నాడట వెనకటికొకడు!
మోహన్ భగవత్ ఉద్భోధ!
విశ్వ మాంగల్య సభ అనే సంస్థ “యుగానుకూల్ మాతృత్వ్” అన్న అంశం పైన జంతర్ మంతర్ కు సరిగ్గా కిలో మీటర్ దూరంలో ఉన్న ‘అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్’ వేదిక పైన నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్పారు.
ఆయన ఇంకా ఇలా చెప్పారు, “విధేయత సహజంగానే అబ్బిన కాలం ఒకటి ఉండేది. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మన అమ్మ నాన్న ఏది చెబితే అది వినేవాళ్లం, వాదనలు ఏవీ ఉండేవి కావు. వాళ్లు ఒక మాట చెబితే చర్చ అంతటితో ముగిసినట్టే. వారి పట్ల మనకు లోతైన నమ్మకం ఉండేది. మనకంటే ఎక్కువ జీవితాన్ని వాళ్లు చూశారాణి మనం నమ్మే వాళ్లం. వాళ్ల అనుభవం మనల్ని సరైన దిశలో నడిపిస్తుందని మనం నమ్మే వాళ్లం.
“యువ తరం ఇప్పుడు ప్రశ్నిస్తోంది, అది సరైనదే. వారికి కారణాలు, వివరణలు కావాలి. ఆధునిక మాధ్యమాలు వస్తు వినిమయ సంస్కృతి (materialistic culture) ద్వారా వాళ్లు నిరంతరం లెక్కలేనన్ని ప్రభావాలకు గురవుతున్న కారణంగా అయోమయానికి గురవుతున్నారు. వారికి స్పష్టత ఇవ్వటం మన బాధ్యత.
“ఈ రోజుల్లో పెంపకం అంటే డిక్టేషన్ కాదు, చర్చించాలి. ఆజ్ఞాపించటం కాదు, ఏకాభిప్రాయానికి కృషి చేయాలి… ప్రతి ఒక్కరూ తన సొంత స్క్రీన్ లో మునిగిపోయి ఉంటున్నారు.. ఇది మారాలి. అందరం కలిసి సమయం గడిపితే సంభాషణ జరుగుతుంది, అప్పుడు అందరం రిలాక్స్ అవుతాము, పిల్లలు సౌకర్యవంతంగా ఉండి వాళ్ల మదిలో ఏముందో పంచుకుంటారు.
“దేవుళ్లకు కోతి తల లేదా ఏనుగు తల ఎందుకుంది? అది దేనికి సంకేతం? లాంటి ప్రశ్నలను పిల్లలు విదేశాల్లో కూడా అడుగుతున్నారు. చాలా మంది తల్లి దండ్రులకు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం తెలియదు. ఈ సింబల్స్ వెనుక ఉన్న లోతైన అర్ధం ఏమిటో వారికి కూడా ఎవరూ చెప్పలేదు. నిజానికి ఇలాంటి అంశాలను స్కూల్ పాఠ్య పుస్తకాలలో చేర్చాలి. అది ఖచ్చితంగా సాయపడుతుంది. కానీ పిల్లలని ఎడ్యుకేట్ చేసే బాధ్యతను మొత్తం పాఠ్య పుస్తకాలకే వదిలి పెట్టగలమా?”
యువతరం గతంలో వలే పెద్దలు చెప్పింది చెప్పినట్లు విని నడుచుకునే విధంగా లేరు అని ఆర్ఎస్ఎస్ నేత చెప్పింది అక్షరాలా నిజం. వారి పైన లెక్కలేనన్ని ప్రభావాలు ఉన్న మాటా నిజమే. కానీ యువ తరం అలా ఉండటం ఇదేమీ కొత్త కాదు. ప్రతి తరం లోనూ యువ తరం అలాగే ఉంటుంది, ఉన్నది కూడా.
వ్యవస్థ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఆర్ఎస్ఎస్, సనాతన ధర్మాన్ని నమ్ముతుంది. శతాబ్దాలుగా సనాతన ధర్మం లోనే భారత ప్రజలు ఉన్నారని, వారు మారలేదని, మార కూడదని దాని కోరిక. కానీ మానవ సమాజం దశల వారీగా అభివృద్ధి చెందుతున్నది తప్ప ఒకే విధంగా లేదు, భారత సమాజం విషయం లోనూ అదే నిజం. గతంలో, గుప్తుల కాలం లోనో లేదా పీష్వాల కాలం లోనో భారత సమాజం నిలబడి ఆగిపోలేదు.
బ్రిటిష్ వలస పాలనలో మగ్గకపోయి ఉన్నట్లయితే, తెల్లవాడు వచ్చి భారత సామాజిక పరిణామాలను బల ప్రయోగంతో ఆపి ఉండకపోతే, భారత సమాజం మరింత విప్లవకరంగా అభివృద్ధి చెంది ఉండొచ్చు. కానీ గతంలో అలా జరిగి ఉండకపోతే ఇప్పుడు ఇలా ఉండేది కాదు, అన్న ఊహాగానాలు చేసి ఉపయోగం లేదు.
మొబైల్ ఫోన్లే సమస్యా?
ఆర్ఎస్ఎస్ అధినేత యువ తరం ప్రశ్నించే స్వభావాన్ని ఒక తప్పుగా ఎంచుతున్నట్లు కనిపిస్తున్నది. పెద్ద అంగలతో అభివృద్ధి మార్గంలో వేగంగా దూసుకు వెళుతున్న సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) ప్రస్తుతం మొబైల్ ఫోన్ లాంటి అత్యంత సూక్ష్మ స్థాయి (నానో టెక్నాలజీ) వరకు అభివృద్ధి సాధించిన దశలో యువ తరం పాత భావాలను అంటి పెట్టుకుని ఉండగలదా?
టెక్నాలజీ ప్రపంచాన్ని మన అర చేతిలోకి తెచ్చి చూపిస్తోందని తరచూ చెప్పుకుంటాం. అలాంటి మొబైల్ ఫోన్లను యువ తరం నుండి దూరం చేయాలన్న ఆలోచన సరైనదేనా? పాఠశాల బోధన ఆన్ లైన్ పద్ధతిలో సాగించటం మొదలు పెట్టింది మోడి ప్రభుత్వమే కదా? మొబైల్ ఫోన్లు లేకపోతే కరోనా వైరస్ మానవ జీవితంలోని సమస్త ముఖాలను అతలాకుతలం చేస్తున్న వేల పిల్లలకు, ఉపాధ్యాయులకు మధ్య వర్చువల్ తరగతి గదులను సృష్టించింది మొబైల్ ఫోన్లే కదా మరి? అవి లేకుంటే పిల్లలు రెండు విద్యా సంవత్సరాలను నష్టపోయి ఉండేవారు కదా? ప్రతిష్టాత్మక ఐఐఏం, ఐఐటి ల నుండి ప్రాధమిక పాఠశాలల వరకు మొబైల్ ఫోన్ ల ఆధారంగా నడిచాయి కదా? వాటిని పిల్లల నుంచి ఎలా దూరం చేయగలం?
నిజమే ఇంటర్నెట్ లో పిల్లలకు అవసరం లేనివి కూడా చూసే అవకాశం ఉంటోంది. అవసరం లేని వాటిని నిరోధించగల వనరులు, బాధ్యత ప్రభుత్వానిది కాదా? మద్య పానం, ధూమ పానం, బూతు దృశ్యాలు… వీటన్నింటినీ పిల్లలకు చేరకుండా నిరోధించగల శక్తి, వనరులు ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ అవి ఆ పని ఎందుకు చేయవు? ప్రభుత్వాల ఖజానా నింపుకునేందుకు వీటన్నింటినీ పోషిస్తున్న ప్రభుత్వాలను వదిలి పెట్టి చీఫ్ జస్టిస్ గారు విద్యార్ధులు, యువకులను నిందిస్తుంటే మీరేమో వారి తల్లి దండ్రులను నిందించటం సరైన పరిశీలనేనా భగవత్ గారూ?
నిజానికి ఆధార్ కార్డు దగ్గర నుండి బ్యాంకింగ్ సేవల మీదుగా ప్రభుత్వ పధకాల వితరణ వరకు పని గట్టుకుని మరీ ప్రోత్సహించింది మోడి-షా లేదా ఆర్ఎస్ఎస్-బిజెపి ప్రభుత్వమే. డిజిటల్ సేవల వలన ప్రభుత్వం ప్రజలకు అత్యంత చేరువ అవుతుందని చెబుతూ సమస్త సేవలను డిజిటలైజ్ చేసింది మోడి ప్రభుత్వమే. కాయకష్టం చేయటం వలన వేళ్ళ గీతలు అరిగిపోయిన కూలి నాలి జనానికి ప్రభుత్వాలు విదిలించే కాసింత సాయానికి కూడా మొబైల్ ఫోన్ ల ద్వారా, బయోమెట్రిక్ స్కానర్ల ద్వారా డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని బలవంతంగా రుద్దిన ఘనత మోడి ప్రభుత్వానిదే. కనెక్టివిటీ లేక గంటల తరబడి బఫర్ అవుతున్న మొబైల్ ఫోన్ లకు తల్లిదండ్రులు అతుక్కు పోవలసిన దుర్గతి పట్టింది మోడి వల్లనే. ప్రజల రోజువారీ సాధారణ జీవనానికి, పిల్లల చదువులకు మొబైల్ టెక్నాలజీని తప్పనిసరి చేసిన మోడి ప్రభుత్వాన్ని అడగటం మానేసి మోహన్ భగవత్ గారు పిల్లల తల్లిదండ్రులను తప్పు పట్టడం చూస్తే ఆయన ఉద్దేశంలోనే లోపం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
సనాతనమా, ఆధునికమా? ఏది నిజం?
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందటం చాలా సహజమైన పరిణామం. జ్ఞానం, పరిజ్ఞానం అభివృద్ధి అయ్యే కొద్దీ పాత జ్ఞానంపై కొత్త జ్ఞానం వచ్చి చేరుతుంది. కొత్త విజ్ఞానం అభివృద్ధి అయ్యే కొద్దీ, దాని అభివృద్ధి వేగం కూడా పెరుగుతూ పోతుంది. కేవలం ‘స్పీడ్’ గా మాత్రమే విజ్ఞానం అభివృద్ధి చెందటం కాదు; ‘యాక్సలరేషన్’ తో అభివృద్ధి చెందుతుంది. సనాతన ధర్మం సూత్రాలు చెప్పి దానిని ఆపుదాం అనుకుంటే శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి ఆగదు. మా హిందూ ధర్మ సూత్రాల పరిధిలో మాత్రమే నువ్వు అభివృద్ధి చెందాలి అని ఆదేశిస్తే అది వినదు.
విశాలమైన ప్రపంచంలో భారతీయులకు మాత్రమే ధర్మం పరిమితం కాలేదు. ఇండియాకు సమాంతరంగా విశ్వం నలుమూలలా అనేక ధర్మాలు ఉనికిలోకి వచ్చాయి. ఆ మాటకొస్తే జంబూ ద్వీపం అనబడే ఉపఖండం లోనే అనేక ధర్మాలు ఉనికిలోకి వచ్చాయి. చార్వాక/లోకాయత, సృష్టికర్త ఉనికి నిరాకరించిన బౌద్ధ మరియు జైన ధర్మాలు, నాస్తిక వాదం, సాంఖ్య మరియు మీమాంస, సిక్కు ధర్మం… ఇవన్నీ ఈ గడ్డపై పుట్టినవే కాదా?
నిజం మాట్లాడితే భారత ఉపఖండంలో విలసిల్లిన తత్వ శాస్త్ర చరిత్రలో సనాతన ధర్మం అన్నది లేనే లేదు. ఆ మాటకొస్తే ఏ చోటా సనాతనం లేదు. సనాతనం అంటే “ఆరంభం మరియు అంతం లేనిది” (శాశ్వతమైనది ఎప్పటికీ నిలిచి ఉండేది) అన్న అర్ధాన్ని అనుసరించినట్లయితే సనాతనం అనేదాని ఉనికిని ఊహించటం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రకృతి, సమాజం, ఆలోచన నిరంతరం మార్పు చెందుతూ అభివృద్ధి అవుతూ ఉన్నాయి తప్ప మార్పు చెందనిది ఎప్పుడూ ఏదీ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ లోకంలో స్థిరమైనది ఏమన్నా ఉన్నది అంటే అది ‘మార్పు’ మాత్రమే (Change is constant). లేదంటే యుపిఏ ప్రభుత్వం కూలి ఎన్.డి.ఏ ప్రభుత్వం ఏర్పడి ఉండేదా? కాంగ్రెస్ బలహీనపడి బిజెపి బలం పుంజుకునేదా? (యుపిఏ, ఎన్.డి.ఏ లు రెండూ ‘స్టేటస్ కో’ కు ఉన్న రెండు ముఖాలు అన్న సంగతి కాసేపు పక్కన పెడదాం.)
కానీ మోహన్ భగవత్ గారు, ఆయన ప్రబోధిస్తున్న సనాతన ధర్మం, ఆ ధర్మాన్ని ప్రచారం చేస్తున్న ఆర్ఎస్ఎస్-బిజెపి శాశ్వతం కాజాలని సనాతనాన్ని శాశ్వతీకరించటానికి నడుం కట్టాయి. అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నాయి. ప్రగతి గమనాన్ని వెనక్కి తిప్పాలని ప్రయత్నిస్తున్నాయి. ముందుకు పోయే కాలాన్ని వెనక్కి మళ్లించాలని కంకణం కట్టుకున్నాయి. ప్రకృతి సహజ శక్తులైన శాస్త్ర విజ్ఞానాన్ని సమాధి చేయాలని చూస్తున్నాయి. శాస్త్ర విజ్ఞానం సమకూర్చిన సమస్త లగ్జరీలను అనుభవిస్తూనే వాటిని ప్రజా సామాన్యానికి దూరం చేయాలని చూస్తున్నాయి.
అంతకంటే ఘోరంగా శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఫలితంగా అందుబాటులోకి వచ్చిన డిజిటల్ పరిజ్ఞాన పరికరాలు ఉపయోగించి ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు, స్వతంత్ర ప్రజాస్వామిక జీవనానికి బంధనాలు వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓ వైపు ఇన్^స్టా గ్రామ్ వీడియోలో ప్రత్యక్షమై పరీక్ష పేపర్లు లీక్ కాకుండా నిరోధించేందుకు చర్యలను ప్రకటిస్తున్న ప్రధాన మంత్రి, అదే ఇన్^స్టా గ్రామ్ లో ప్రభుత్వ మతి మాలిన చర్యలను, బోధనలను, భావాలను హేతుబద్ధంగా తప్పు పడుతున్న యువకులపై టెర్రరిస్టు నిరోధక చట్టాన్ని ప్రయోగిస్తున్నాడు.
ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ కంపెనీలు ఇండియాలో చొరబడేందుకు, తద్వారా 140 కోట్ల ప్రజల దైనందిన జీవన అలవాట్లను, వ్యక్తిగత వివరాలను (డేటా) దొంగిలించేందుకు అనుమతి ఇచ్చారు. వాట్సప్ ద్వారా పెగాసస్ స్పై వేర్ ను ప్రజా ఉద్యమ కార్యకర్తల ఫోన్ లలో దొంగ చాటుగా ప్రవేశపెట్టిన డాక్యుమెంట్ ద్వారా వారిపైన ‘ఉపా’ కేసు బనాయించారు. మరో పక్క అదే వాట్సప్-ఇన్^స్టా గ్రాం-ఫేస్ బుక్ జోలికి వెళ్లొద్దని, విద్యార్ధులు-యువకులు మొబైల్ ఫోన్ల స్క్రీన్ లకు అతుక్కు పోవద్దని కోరుతున్నాడు. దేశభక్తులమని ఛాతీ గుద్దుకునే సంఘీయులకు ఈ ద్వంద్వ నీతి తగునా?
ఓ పక్క ఐ ఫోన్ మాన్యుఫాక్చరింగ్ మా దేశంలో చేస్తామంటూ యాపిల్ కంపెనీని దేబిరిస్తారు, మరో పక్క అదే ఐ ఫోన్ నుంచి దూరంగా ఉండమని వారి బాస్ ప్రబోధిస్తాడు. దేశంలో వంద స్మార్ట్ సిటీలు నిర్మిస్తామని ప్రగల్భాలు పలుకుతారు; స్మార్ట్ సిటీలను ఉపయోగ పెట్టుకునే సాధనాలైన డిజిటల్ డివైజ్ ల నుండి దూరంగా ఉండమని చెబుతారు. స్మార్ట్ సిటీలను నిర్మించి ఎవరికి ఇస్తారు? కొండలు, గుట్టలకు, మట్టి మశానానికి ఇస్తారా? మనుషులకే గదా ఇవ్వాల్సింది?! స్మార్ట్ సిటీల్లో నివసించేది ఈ దేశ పౌరులేనా లేక బిజెపి భక్తికి మెచ్చి స్మార్ట్ సిటీల్లో విడిది చేసేందుకు దేవుళ్లు దిగి వస్తారా?
శాస్త్రాల విస్తరిలో మూఢత్వం విందు
మోహన్ భగవత్ గారి లాజిక్ ను పట్టుకుని పోతే ఇలాగే జవాబులు లేని ప్రశ్నలు అనేకం తలెత్తుతాయి. పరిష్కారం లేని సమస్య, అసలు సమస్యే కాదు అని నానుడి. అంటే సమస్య లేని చోట సమస్యను సృష్టించి పరిష్కారం కోసం దేవులాడటం అన్నమాట! నిజంగానే అమాయకంగా సమస్య లేని చోట ఉన్నట్లు నమ్మి పరిష్కారం కోసం నిజాయితీగా వెతికితే త్వరలోనే అక్కడ సమస్య లేదని గ్రహిస్తాం. కానీ ఇక్కడ కుట్ర ఏమిటంటే ఈ పెద్ద మనిషి తనకు కోసం కాకుండా ప్రజల కోసం సమస్య సృష్టించి దానికి పరిష్కారం కూడా తానే చెబుతాను అంటున్నాడు.
సైన్స్ ని దాని మానాన దానిని వదిలేసి అభివృద్ధి చెందనిస్తే దానిని ఎలా ఉపయోగ పెట్టుకోవాలో ప్రజలకు బాగానే తెలుసు. ఎటొచ్చీ సైన్స్ ఫలాలను తమకు మాత్రమే పరిమితం చేసుకుని ప్రజలను మాత్రం మూఢత్వంలో ముంచే భక్తి, సాంప్రదాయాలు, కుల-మత కట్టుబాట్లు, అవతారాలు, పెద్ద-చిన్న అంతరాలు పంచి పెడతానంటే అదే ప్రజలకు నిజమైన సమస్య. సైన్స్, ప్రజల సమస్యలకు పరిష్కారాలు అందిస్తుంది. సో-కాల్డ్ సనాతన సంప్రదాయం, ప్రజలకు సమస్య అయి కూర్చుంటుంది. ఎద్దు పుండు కాకికి ముద్దు అన్నట్లు, ప్రజల మూఢత్వం సనాతన వాదులకు కాసులు కురిపిస్తాయి.
ఒక్క కాసులే కాదు, మూఢత్వంలో మునిగిన ప్రజల దైనందిన జీవనం పైన వారికి కంట్రోల్ లభిస్తుంది. ఆ కంట్రోల్ వారికి కావాలి. హిందూ సమాజం అంటూ తామే సూత్రీకరించిన భారత దేశ సమాజం పైన వారికి నియంత్రణ కావాలి. దేశ సామాజిక గతి పైనా, సాంస్కృతిక సంబంధాల పైనా కంట్రోల్ (నియంత్రణ లేదా అదుపు) సంపాదిస్తే రాజకీయ నియంత్రణ చేజిక్కుతుంది; రాజకీయ నియంత్రణ, ఆర్ధిక నియంత్రణ మరియు ఆర్ధిక దోపిడీలను సుస్థిరం అయేందుకు దోహదం చేస్తుంది. రాజకీయ-సామాజిక నియంత్రణలు అనివార్యంగా ప్రజల మెదళ్లను మొద్దుబార్చి ప్రశ్నలను, అనుమానాలను తొక్కేస్తాయి.
కానీ బొద్దింకల జనతా పార్టీ తలవని తలంపుగా, ఉరుము లేని పిడుగు లాగా కన్ను మూసి తెరిచే లోపు ఒక్క ఉదుటున వారి ముందు ప్రత్యక్షం అయింది. సనాతనం మూఢత్వం గురించి ఏ ప్రశ్నలు అనుమానాల రూపంలో ఉండే చైతన్యాన్ని నిద్రపుచ్చి తొక్కేయాలని వాళ్ళు ఆశించారో, దానిని వాళ్లు తట్టి లేపారు. కనపడీ కనపడని ఒక సన్నని తీగను పట్టుకుని వెలుతురు వైపు ప్రయాణాన్ని మొదలు పెట్టారు. మి లార్డ్ చీఫ్ జస్టిస్ గారు యధాలాంపంగా చేసిన ఒక చిన్న దూషణను ఆయుధంగా మలుచుకున్నారు. గడ్డి పరకలు పేని పెద్ద మోకును తయారు చేశారు. ఇంకేం, ఏలిన వారికి పట్టు సడలుతున్న ఛాయలు కనిపించాయి. కట్టు తప్పుతున్న భయం పట్టుకుంది. సామ, దాన, భేద, దండోపాయాల వరస తప్పి మొదట దండ ప్రయోగం చేశారు, లొంగలేదు. తర్వాత సామోపాయానికి పదును పెట్టారు. యువ తరం చైతన్యాన్ని గుర్తించి భుజం తడుతున్నట్లు నటిస్తూ “పెద్ద వాళ్ల మాట వినక పోతే మీకు దారెలా తెలుస్తుంది?” అని మేలు కోరుతున్నట్లు నటిస్తూ “ఐనా పెద్ద వాళ్లకెలా బుద్ధి లేదు?” అని తల్లిదండ్రుల్ని ప్రశ్నిస్తున్నాడు పెద్దాయన!
ఐనా పిల్లలు వినే ఉద్దేశంలో లేరు. ఎందుకంటే వారి తల్లిదండ్రులే వారి భుజం తట్టి సాగనంపారు. తల్లులు తండ్రులు అనేక మంది బొద్దింకలతో కలిసి నడిచి మేమూ బొద్దింకలమే అని చాటారు. బొద్దింకలు కాని తల్లిదండ్రులను వారి పిల్లలు ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా తిరస్కరించారు. హైదరాబాద్ లో ఓ 19 యేళ్ల ఆడపిల్ల, సహ నిరసనకారుల సమూహాన్ని ఉద్దేశిస్తూ “మా ఇంట్లో అమ్మా, నాన్న ఇంకా అందరూ బిజెపి కి ఓటేశారు. అయితే ఏం? నాకసలు లెక్కే లేదు. మీరేమన్నారు? అవినీతిని నిర్మూలిస్తాం, స్విస్ బ్యాంక్ డబ్బు వెనక్కి తెస్తాం అన్నారు. మరి ఇప్పుడేమయింది?” అని ప్రధాన మంత్రిని నేరుగా ప్రశ్నించింది? “ఏమైంది, పేపర్ లీకయింది” అని బొద్దింకల గుంపు నుండి ఒక బొద్దింక తన మీసాన్ని పైకి లేపి అరిచింది. గుమి కూడిన యువ చైతన్యం హర్షధ్వానాలతో వంత పాడింది.
వంట గదిలో, పడక గదిలో నాలుగు గోడల మధ్య మగాళ్ల కాపలా వెనుక మగ్గిన సగం ప్రపంచం గడప దాటటమే కాదు, గొంతెత్తి ప్రశ్నలు సంధిస్తుంటే ఇన్నాళ్లు ఆ సగం ప్రపంచం భుజాల మీదే ఎక్కి పెత్తనం సాగించిన సంప్రదాయం, కట్టుబాటు ఇప్పుడు ఉలిక్కి పడుతున్నాయి. గీత దాటుతున్న సీతమ్మలు పురుష స్వామ్యాన్ని ధిక్కరించటమే కాదు నాయకులై సమూహాల్ని శాసిస్తుంటే ఆడ పిల్లల పైనే పూర్తిగా ఆధార పడ్డ కుల ప్రతిష్ట, వంశ గౌరవం, సనాతన ధర్మం ఆందోళనలో మునిగిపోయాయి. అందుకే మోహన్ భగవత్ గారు ధర్మ సూత్రాలను, కుటుంబ కట్టుబాట్లను, కుల-మత సాంప్రదాయాలను గుర్తు చేసేందుకు ఆగమేఘాలపై విచ్చేశారు. భగవత్ బోధిస్తున్న పాఠాల అంతరార్ధం గ్రహించకపోతే స్నేహం రూపంలోని శత్రువును, పెద్దరికం రూపం లోని మూఢత్వాన్ని పసిగట్టటంలో విఫలం అవుతాము. బొద్దింకలూ, తస్మాత్ జాగ్రత్త!


