ఇరాన్ పై మరో తీవ్ర దాడికి అమెరికా ఆయుధాల మోహరింపు!


Israeli strike on Lebanon town Tyre 01-06-2026

ఇరాన్ దేశంతో చర్చలు జరుపుతున్నట్లు, చర్చలు విజయవంతం అయ్యే దిశలో పరిణామాలు జరుగుతున్నాయని అమెరికా ఒక వైపు చెబుతుండగానే, మరో వైపు ఇరాన్ పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పూటకో మాట రోజుకో పాట పాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దిక్కు దరీ లేని ప్రకటనలతో స్టాక్ మార్కెట్ ను కుదిపేయటం ద్వారా అక్రమంగా మార్కెట్ లాభాలు ఆర్జించే కుట్రలను అమలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

యుద్ధం ముగించేందుకు అమెరికా – ఇరాన్ దేశాల మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయని అవి విజయవంతమై యుద్ధం ముగిసే సమయం ఎంతో దూరంలో లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ పక్క ప్రకటిస్తున్నప్పటికీ, అమెరికా, ఇరాన్ లక్ష్యాలపై మిసైల్ దాడులు చెయ్యటం, అమెరికా దాడులకు ఇరాన్ ప్రతి దాడులు చేయటం కొనసాగుతున్నది. దాడులు జరుగుతున్నా సరే, చర్చలు ఫలప్రదం కావటం తధ్యం అని అమెరికా విదేశీ కార్యదర్శి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) మరియు జాతీయ భద్రతా సలహాదారు ఐన మార్కో రుబియో ప్రకటిస్తున్నాడు.

ఇంకో పక్క అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్ సెత్ అమెరికా దాడుల్లో ఇరాన్ లక్ష్యాలు ఎంత తీవ్రంగా నష్ట పోయిందీ, ఇరాన్ రక్షణ శక్తి ఎన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళినదీ వివరించేందుకు నోటికి వచ్చిన లెక్కలు చెబుతూ కాకి పాండిత్యం ప్రదర్శిస్తున్నాడు.

పోస్ట్-మ్యాన్, పాకిస్తాన్!

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి అంటే అర్ధం బల్లకు ఓ పక్క అమెరికా ప్రతినిధి బృందం, మరో పక్క ఇరాన్ ప్రతినిధి బృందం కూర్చొని చర్చలు చేస్తున్నారని అర్ధం కాదు. జరిగేదంతా లేఖలు లేదా పత్రాలు ఇచ్చి పుచ్చుకోవటం ద్వారానే జరుగుతున్నాయి. ఇరాన్ ఒక ప్రతిపాదన తయారు చేసి పాకిస్తాన్ ప్రతినిధులకు అందజేస్తుంది. ఇరాన్ లేఖ అందుకున్న కొద్ది రోజుల తర్వాత అమెరికా తన సొంత ప్రతిపాదనలతో పాకిస్తాన్ ప్రతినిధులకు ఇంకొక లేఖ అందిస్తుంది. పాకిస్తాన్ ప్రతినిధి ఇరాన్ వెళ్ళి దాన్ని ఇరాన్ లో అందజేస్తాడు. ఆ తర్వాత మరొక ప్రతిపాదన ఇరాన్ ఇవ్వటం, దానికి ప్రతిగా మరో ప్రతిపాదన అమెరికా ఇవ్వటం…., ఇదీ జరుగుతున్న తంతు!

ఇరాన్, అమెరికా దేశాలు ఒకరికొకరు తమ తమ సొంత ప్రతిపాదనలతో లేఖలు ఇస్తుంటే ఆ లేఖలని రెండు దేశాల మధ్య మోస్తూ తిరిగే పనిని పాకిస్తాన్ చేపట్టింది. పాకిస్తాన్ చేస్తున్న మధ్యవర్తిత్వం ఇదే. ఇది కాకుండా చర్చల గురించి, ఇరాన్ ప్రభుత్వంలో వివిధ ఫ్యాక్షన్ల మధ్య చెలరేగిన తగవుల గురించి, తగవుల వల్ల చర్చల పైన పడుతున్న ప్రభావం గురించి పశ్చిమ పత్రికలు రాస్తున్నదంతా ఒట్టి చెత్త! అవన్నీ పశ్చిమ పత్రికల స్వకపోల కల్పితాలు మాత్రమే.

దాడుల ద్వారా చర్చలు?!

యుద్ధ విరమణ కోసం చర్చలు జరపటం అంటే ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం వహిస్తుండగా వైరి పక్షాలు చెరో పక్కా, లేదా చేరో గదిలో కూర్చొని ప్రతిపాదనలు ఇచ్చి పుచ్చుకోవటం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న గల్ఫ్ యుద్ధం గతంలో ఎన్నడూ లేని విధంగా పరస్పరం దాడులు చేసుకోవటం ద్వారా చర్చలు జరుపుతున్నట్లుగా భావించ వలసి వస్తున్నది.

మే 25, 26 తేదీల్లో అమెరికా, ఇరాన్ ల మధ్య ఒకింత తీవ్ర స్థాయి ఘర్షణ చోటు చేసుకుంది. పర్షియన్ అఖాతంలో భాగమైన హోర్ముజ్ జలసంధి లోని ఇరానియన్ ద్వీపం లారక్ ఐల్యాండ్ కు దక్షిణంగా లంగరు వేసిన ఇరానియన్ చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలు మిసైల్ దాడులు చేశాయి. ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్ కార్ప్స్ (ఐ.ఆర్.జి.సి) కు చెందిన పలువురు సైనికులు ఈ దాడుల్లో చనిపోయారని ఇరాన్ పత్రికలు వెల్లడించాయి.

ఇరాన్ పత్రికల వార్తలను ధృవీకరిస్తూ అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది. దక్షిణ ఇరాన్ లోని లక్ష్యాలపై తాము దాడులు నిర్వహించామని, పర్షియన్ అఖాతంలో మైన్ లను అమర్చుతున్న బోట్లను, మిసైళ్లు ప్రయోగించే లాంచ్ సైట్ లను లక్ష్యం చేసుకుని దాడులు చేశామని, ఈ దాడులు కేవలం ఆత్మ రక్షణార్ధం చేసినవే అని సెంట్రల్ కమాండ్ ప్రకటన వివరించింది.

అమెరికా దాడులకు ఇరాన్ ప్రతి దాడి చేసింది. పర్షియన్ అఖాతం పైన ఎగురుతున్న అమెరికన్ డ్రోన్ MQ-9 రీపర్ డ్రోన్ ను లక్ష్యం చేసుకుని దాడి చేసి డ్రోన్ ను కూల్చేసింది. అలాగే ఇరాన్ మిసైల్ డిఫెన్స్ ప్రతి దాడుల ధాటికి ఇరాన్ సమీపంలో ఎగురుతున్న హై ఆల్టిట్యూడ్ నిఘా డ్రోన్ విమానం -RQ-4 గ్లోబల్ హాక్, అత్యంత ఖరీదైన, అత్యంత ఆధునికం అని అమెరికా గొప్పలు చెప్పుకునే ఎఫ్-35 లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్ జెట్ (శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా అత్యంత రహస్యంగా దాడులు చేయగల ఆధునిక ఫైటర్ విమానం) లు అక్కడి నుండి పలాయనం చిత్తగించాయి.

ఖరీదైన MQ-9 రీపర్ డ్రోన్ ను నష్టపోవటమే కాకుండా అత్యంత ఆధునికమైన ఎఫ్-35 ఫైటర్ జెట్ కూడా ఇరాన్ దెబ్బకు పారిపోవలసి వచ్చినా కూడా అమెరికా మళ్ళీ చర్చలు విజయవంతం కావటం సాధ్యమే అంటూ ప్రకటన జారీ చేసింది. ఇరాన్ చాచి పెట్టి కొట్టిన లెంపకాయ వల్ల తన మొఖానికేమీ నష్టం జరగలేదని బింకం ప్రదర్శించటం అన్నమాట!

మే 27 తేదీన అమెరికా మళ్ళీ ఘర్షణకు తెర తీసింది. హోర్ముజ్ జలసంధి లో తాము మోహరించిన సెంట్ కామ్ సైనిక బలగాలకు, జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకల ప్రయాణానికి ప్రమాదకరంగా పరిణమించిన ఇరాన్ మిలటరీ బలగాలు మోహరించిన స్థలాలను లక్ష్యం చేసుకుని దాడి చేశామని తన దాడులను సమర్ధించుకుంటూ అమెరికా ప్రకటించింది. తమ బలగాలకు ప్రమాదంగా మారిన పలు ఇరాన్ డ్రోన్ లను ఈ దాడుల్లో కూల్చేశామని ప్రకటించుకుంది. ఇరానియన్ పోర్టు బందర్ అబ్బాస్ పైన అమెరికా దాడి చేసిందని పత్రికల ద్వారా తెలిసింది.

Gulf War Field

వాస్తవం ఏమిటంటే హోర్ముజ్ జల సంధి లో అమెరికాకు చెందిన ఒక్క చిన్న తెప్ప పడవ కూడా లేదు. ఇరాన్ తీరానికి కనీసం 300 కి.మీ దూరం లోపల ఎలాంటి అమెరికా యుద్ధ నౌక గానీ, వాణిజ్య నౌక గానీ వచ్చినా అవి ఇరాన్ దాడుల్లో నాశనం కావటం తధ్యం అని అమెరికా సెంట్రల్ కమాండ్ కు బాగానే తెలుసు. అందుకే అమెరికా యుద్ధ నౌకలు, డిస్ట్రాయర్ లు, ట్యాంకర్లు… ఇలా ఎన్ని పేర్లతో ఉన్నా కూడా అవన్నీ ఇరాన్ మిసైల్ దాడులకు అందకుండా దూరంగానే ఉన్నాయి. అలాంటిది కేవలం 60 కిలో మీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న హోర్ముజ్ జలసంధి లో అమెరికా బలగాలు, నౌకలు ఉండడం అన్నది లేనే లేదు. ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేసిన మాట నిజమే గానీ అవి కేవలం ఇరాన్ రిజాల్వ్ ని, మూడ్ ని పరీక్షించేందుకు ఉద్దేశించిన దాడులు మాత్రమే.

అసలు జరిగింది ఏమిటో ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ న్యూస్ ఏజన్సీ తెలియజేసింది. అమెరికాకు చెందిన చమురు ట్యాంకర్ ఒకటి హోర్ముజ్ జలసంధి దాటడానికి ప్రయత్నించింది. ట్యాంకర్ వస్తున్నట్లు తెలియకుండా ట్రాన్స్ పాండర్ ని ఆఫ్ చేసి హోర్ముజ్ దాటేందుకు అది ప్రయత్నించింది. కానీ ఇరాన్ డేగ కన్ను దానిని పసిగట్టింది. వెంటనే హెచ్చరిస్తూ ఐ.ఆర్.జి.సి, ట్యాంకర్ పైకి కాల్పులు జరిపింది. వెనుదిరగక పోతే ట్యాంకర్ నాశనం అవుతుందని హెచ్చరించింది. దానితో అమెరికన్ ట్యాంకర్ తోక ముడిచి వెనక్కి వెళ్లిపోయింది.

ఐతే బందర్ అబ్బాస్ పోర్ట్ పైన అమెరికా మిసైల్ దాడి చేసిన సంగతి నిజమే. కానీ బందర్ అబ్బాస్ పోర్ట్ కి సమీపంలో అప్పటికే కాలి బూడిదై పోయిన కొండ ప్రాంతాన్ని మాత్రమే అమెరికా దాడి చేయగలిగిందని ఇరాన్ వర్గాలు తెలియజేశాయి.

ఇరాన్ కళ్ళు గప్పి అమెరికా చమురు ట్యాంకర్ హోర్ముజ్ ని దాటి ఉంటే డొనాల్డ్ ట్రంప్, అమెరికా మరియు ఐరోపా పత్రికలు పెద్ద ఎత్తున తాటికాయంత అక్షరాలతో “ఇరాన్ పై గొప్ప విజయం”, “ఇరాన్ బ్లాకేడ్ ని ఛేదించేశాం” అంటూ ప్రకటనలు, వార్తలు వెలువడి ఉండేవి. నిజానికి అలాంటి ఒక, ఒకే ఒక్క చిన్న విజయం కోసం అమెరికా అధ్యక్షుడు ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. హోర్ముజ్ జలసంధి పై విధించిన దిగ్బంధనాన్ని ఛేదిస్తాం అని చెప్పినప్పటికీ అమెరికా ఆ పని చేయలేకపోతున్నది. కనీసం ఒక్క ట్యాంకర్ ఐనా హోర్ముజ్ ని దాటించి, ఇరాన్ పై గెలిచామని చెప్పుకుందామని ట్రంప్ ఆశ పడుతున్నాడు. ఇరాన్ అందుకు అవకాశం ఇవ్వటం లేదు.

యుద్ధానికి ముందు హోర్ముజ్ జలసంధి చక్కగా తెరుచుకునే ఉన్నది. అంతర్జాతీయ ట్రాఫిక్ చక్కగా సాగిపోతూనే ఉన్నది. ఇరాన్ తో యుద్ధం లేకుండా చర్చలు జరుపుతామ్ అని చెప్పి ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు మొదలయ్యాయి. అనేక రోజుల పాటు చర్చలు జరిగాక దాదాపు చివరి ఒప్పందం ఖాయం అయినట్లే అని ఒమన్ చెప్పిన మరుసటి రోజే అమెరికా, ఇజ్రాయెల్ లు ఒమన్, ఇరాన్ లతో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ దగా చేస్తూ అత్యంత క్రూరంగా ఫిబ్రవరి 28 తేదీన దాడులు చేసి ఇరాన్ సుప్రీం నేతతో పాటు 34 మంధి ప్రభుత్వాధినేతలు, మిలట్రీ ఉన్నతాధికారులను హత్య చేశాయి. స్కూల్ పై దాడి చేసి 160 మందికి పైగా చిన్నారులను చంపేశాయి.

అలా పశ్చిమ పత్రికల వంది మాగధులతో డప్పుల చప్పుళ్లతో ఇరాన్ పై యుద్ధం ప్రారంభించిన అమెరికా, ఇజ్రాయెల్ లు తీవ్ర నష్టాలు ఎదుర్కొని, ఆయుధ నిల్వలు తగ్గిపోయి ఇప్పుడు యుద్ధాన్ని ఎలా ముగించాలా అని జుట్టు పీక్కుంటున్నాయి.

బందర్ అబ్బాస్ పోర్ట్ పై దాడికి ప్రతి సమాధానం ఇవ్వకుండా ఇరాన్ ఊరుకోలేదు. మే 28 తేదీన అమెరికా యుద్ధ విమాన స్థావరాన్ని లక్ష్యం చేసుకుని దాడులు చేసింది. ఈ యుద్ధ స్థావరం ఎక్కడ ఉన్నదో ఇరాన్ చెప్పలేదు. కానీ వివిధ జియో పొజిషనింగ్ కంపెనీలు, కువైట్ లోని అమెరికన్ విమాన స్థావరం “ఆలీ ఆల్ సలేం ఎయిర్ బేస్” ను ఇరాన్ దాడులకు లక్ష్యం అని వెల్లడి చేశాయి. అదే సమయంలో కువైట్ సైన్యం “శత్రువుల డ్రోన్ తదితర దాడులను మేము తిప్పి కొడుతున్నాము” అని ప్రకటించటం గమనార్హం.

“ఈ దాడి అమెరికా మోసపూరిత ప్రవర్తనకు గట్టి హెచ్చరికగా అమెరికా గ్రహించాలి. మళ్ళీ ఇలాంటి పొరపాటు కు పాల్పడరాదని హెచ్చరిస్తున్నాం” అని దాడి అనంతరం ఐ.ఆర్.జి.సి ప్రకటించింది.

ఈ తరహా బ్యాక్ అండ్ ఫోర్త్ దాడులు చర్చలలో పురోగతి లేకుండా పోవటాన్ని మాత్రమే సూచిస్తున్నాయి. చర్చల్లో ఎలాంటి పురోగతి లేనప్పుడు వైరి పక్షాలు సహజంగా యుద్ధ రంగంలో పై చేయి సాధించటానికి తద్వారా చర్చలలో తమ చేయి పైన ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తాయి. ఇరాన్ వరకు చూస్తే అది తన స్టాండ్ నుండి ఒక్క అడుగు కూడా వెనక్కి జరగలేదు. కొత్త ప్రతిపాదన పేరుతో ఇరాన్ ఎన్నిసార్లు లేఖలు పంపినా కూడా అవి సారాంశంలో చివరికి మొదటి ప్రతిపాదననే మళ్ళీ మళ్ళీ ప్రతిపాదిస్తూ తాము ఒక్క అంగుళం కూడా వెనక్కి వెళ్లబోము అని చాటుతోంది.

చర్చల సస్పెన్షన్ -జూన్ 1

ఇరాన్ మరియు ఇరాన్ నేతృత్వం లోని రెసిస్టెన్స్ ఫ్రంట్ (యెమెన్, లెబనాన్, ఇరాక్ దేశాల్లోని షియా మిలీషియా బలగాలు మరియు గాజా లోని హమాస్ ప్రతిఘటనా సంస్థ) చివరికి అమెరికా ప్రవర్తనతో విసిగిపోయినట్లు పరిణామాలు తెలియజేస్తున్నాయి. లెబనాన్ లో వందలాది మంది పౌరులను చంపేస్తూ, వారి ఇళ్లను బుల్ డోజర్లతో కూల్చివేస్తూ వినాశనం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ నీతి మాలిన యుద్ధాన్ని ఆపకుండా తాము ఇక చర్చల్లో పాల్గొనేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. లెబనాన్ లో ఇజ్రాయెల్ మారణహోమం ఆగే వరకు ఇక ఏ విధంగానూ చర్చలు జరిపేది లేదని ఇరాన్ ప్రకటించింది. ఐతే ఇరాన్ ప్రకటనను అంతర్జాతీయ వార్తా సంస్థ సిఎన్ఎన్ కూడా విడుదల చేసింది. ది హిందూ, ఇరాన్ ప్రకటనను ప్రచురించింది.

ప్రాధమిక ఒప్పందం నిమిత్తం అమెరికాతో లేఖలు ఇచ్చి పుచ్చుకునే పనికి ఇంతటితో స్వస్తి పలుకుతున్నామని ఇరాన్ తెలియజేసింది. లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు నానాటికీ తీవ్రం అవుతున్నాయని, లెబనాన్ ప్రజలు నిలువ నీడ లేకుండా, తలదాచుకునేందుకు చోటు లేకుండా లెబనాన్ ను దురాక్రమించే ఏకైక లక్ష్యంతో ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాడని ఆరోపించింది. లెబనాన్ లో ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆగిపోవాలని ఇరాన్ షరతు విధించింది.

ఇరాన్ ప్రకటన వెలువడ్డ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రకటన వెలువడింది. తాను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యాహు తో మాట్లాడానని, హిజ్బొల్లా తో కూడా మాట్లాడానని ఆయన చెప్పాడు. ఒకరి పైన మరొకరు దాడులు చేయటం నిలిపేస్తామని వారు తనకు హామీ ఇచ్చారని ప్రకటించాడు. “టెహ్రాన్ తో చర్చలు కొనసాగుతాయి” అని కూడా ప్రకటించాడు.

సమస్య ఏమిటంటే ట్రంప్ మాటలను నమ్మే పరిస్ధితిలో ఎవరూ లేరు. ఇలాంటి ప్రకటనలని ఆయన గత 3 నెలల కాలంలో లెక్కలేనన్ని సార్లు చేశాడు. అవన్నింటినీ తానే పదే పదే ఉల్లంఘిస్తూ వచ్చాడు. చర్చల పేరుతో నిలువు మోసానికి తెగించాడు. ఇజ్రాయెల్ అనుమతి లేనిదే ఏ నిర్ణయం తీసుకునే పరిస్ధితిలో అమెరికా ఉన్నదని లోకానికి చాటాడు.

“లెబనాన్ లో జియోనిస్టు రెజిమ్ నేరాలు కొనసాగుతున్నందున, కాల్పుల విరమణ కు ప్రతిపాదించిన షరతులలో లెబనాన్ పై దాడులను విరమించటం కూడా ఒక షరతు అయినందున, ఈ సీజ్ ఫైర్ షరతులను లెబనాన్ తో సహా అన్ని రంగాలలో ఉల్లంఘిస్తున్నందున ఇరానియన్ చర్చల బృందం “మధ్యవర్తుల ద్వారా చర్చలను, పాఠ్య లేఖా పత్రాలను ఇచ్చి పుచ్చుకునే ప్రక్రియను నిలిపివేస్తున్నాము” అని ఇరాన్ విడుదల చేసిన ప్రకటన స్పష్టం చేసింది.

అంతకు ముందే ఇరాన్ విదేశీ మంత్రి అబ్బాస్ ఆరాఘ్చి, పార్లమెంటు స్పీకర్ ఘాలీబాఫ్ లు లెబనాన్ పైన ఇరాన్ చేస్తున్న దాడులకు తగిన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించాయి. “అమెరికా, ఇరాన్ ల మధ్య కుదిరిన సీజ్ ఫైర్ ఒప్పందం, ఎలాంటి పరిమితి లేకుండా లెబనాన్ తో సహా అన్ని ఫ్రంట్ లలో సీజ్ ఫైర్ కు కట్టుబడి ఉండేందుకు ఉద్దేశించినది. ఒక ఫ్రంట్ లో ఉల్లంఘన జరిగితే అది అన్ని ఇతర ఫ్రంట్ లలో కూడా ఉల్లంఘించిన దానితో సమానం. ఈ ఉల్లంఘనలకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సి ఉంది” అని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

లెబనాన్ లో సీజ్ ఫైర్ షరతుల ప్రకారం ఇజ్రాయెల్ చేస్తున్న క్రూరమైన అమానవీయమైన దాడులను నిలిపివేయటం, ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ ను పూర్తిగా ఖాళీ చేసి వెనక్కి వెళ్లిపోవటం, గాజా నుండి జియోనిస్టు పాలకుల సైన్యం ఉపసంహరించటం… ఇవి వెంటనే అమలు జరగాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇవి అమలు జరిగే వరకు చర్చలను సస్పెండ్ చేస్తున్నామని తెలియజేసింది.

ఇరాన్ వ్యూహం ‘అష్ట దిగ్బంధనం’

ఇరాన్, ఆ దేశంతో పాటు యెమెన్, లెబనాన్, ఇరాక్ లలోని షియా ప్రతిఘటనా బలగాలతో కూడిన రెసిస్టెన్స్ ఫ్రంట్, సామ్రాజ్యవాద శత్రువుకు ఊపిరి ఆడకుండా చేసేందుకు శక్తివంతమైన వ్యూహం రచించినట్లు కనిపిస్తున్నది. దీని ప్రకారం ఇటు హోర్ముజ్ జలసంధి తో పాటు బాబ్-ఆల్ మందాబ్ జలసంధిని కూడా దిగ్బంధించాలని కూటమి నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అదే జరిగితే ప్రపంచ దేశాలకు ముఖ్యంగా ఆసియా దేశాలకు, అందులోనూ ముఖ్యంగా భారత దేశానికి తీవ్ర ఇబ్బందులు ఎదురు కానున్నాయి. ఇండియాకు, ఇండియా నుండి ఐరోపా దేశాలకు జరిగే దిగుమతి, ఎగుమతుల రవాణాకు బాల్ ఆల్ మందాబ్ జలసంధి ప్రధాన సముద్ర మార్గం.

అమెరికా శిబిరంలో చెరీ జాత్యహంకార ఇజ్రాయెల్ తో చెలిమి చేస్తూ అరబ్ గల్ఫ్ దేశాల ప్రజలకు తీవ్ర ద్రోహం చేస్తూ ఇజ్రాయెల్-అమెరికా కూటమికి పూర్తి సహకారం అందజేస్తున్న యుఏఇ కి సంపూర్ణ మద్దతు అంటూ ప్రకటనలు విడుదల చేస్తున్న భారత ప్రభుత్వం, ఇరాన్ తాజా ఎత్తుగడతో ఇరకాటంలో పడిపోయే అవకాశం కనిపిస్తున్నది.

బాబ్ ఎల్ మందేబ్ జలసంధి పశ్చిమాన ఎర్ర సముద్రం, తూర్పున హిందూ మహా సముద్రం లను కలిపే సన్నటి నీటి రవాణా మార్గం. దీని గుండా అంతర్జాతీయ సరుకు వాణిజ్యంలో 12 శాతం రవాణా అవుతుంది. హోర్ముజ్ జలసంధి తో పాటు దీన్ని కూడా దిగ్బంధిస్తే సకల దేశాలు ఆర్ధికంగా తీవ్ర కష్టాలు ఎదుర్కోవటం ఖాయం. ఇప్పటికీ ఆయిల్, గ్యాస్ కొరతతో అల్లాడుతూ చమురుకు అత్యధిక ధరలు చెల్లిస్తున్న అనేక మూడో ప్రపంచ దేశాలతో పాటు ఐరోపా దేశాలు సైతం అధిక ద్రవ్యోల్బణం సమస్య ఎదుర్కొంటాయి.

చర్చల పునః ప్రాంభానికి ఇరాన్ విధించిన డిమాండ్లు ఇవి:

  • గాజా, లెబనాన్ లలో ఇజ్రాయెల్ దుర్మార్గమైన, దురాక్రమణపూరిత దాడులు వెంటనే నిలిపివేయాలి
  • లెబనాన్ లోని ఆక్రమిత ప్రాంతాల నుండి ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరించాలి
  • అంతవరకు అమెరికాతో సందేశాలు ఇచ్చి పుచ్చుకోవటం జరగదు.

గల్ఫ్ లో రెండో ఇరాన్ యుద్ధం తప్పదు

ఇరాన్ పైన మరోసారి దాడి చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు పధకాలు రచిస్తున్నాయని ఇరాన్ ప్రభుత్వం గట్టిగా భావిస్తున్నది. సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా అమెరికా బలగాలు మరిన్నింటిని ఐరోపా, ఇజ్రాయెల్ ల లోని వివిధ అమెరికా స్థావరాలకు చేర్చారు. వీరి సంఖ్య సీజ్ ఫైర్ ప్రకటించిన నాటికంటే పెరిగింది తప్ప తగ్గలేదు.

పైగా ఇరాన్ సమీపంలో వివిధ రకాల యుద్ధ నౌకలను పెద్ద సంఖ్యలో అమెరికా మోహరించింది. ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ ఎయిర్ పోర్ట్ వద్ద అమెరికాకు చెందిన KC-135 స్ట్రాటో ట్యాంకర్ లను, KC-46 పెగాసస్ ఏరియల్ రీఫ్యూయెలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ (గాలిలో ఇంధనం నింపే ఎయిర్ ట్యాంకర్లు), మొత్తం 60 వరకు మోహరించినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అలాగే సదరన్ ఇజ్రాయెల్ లోని రామన్ ఎయిర్ పోర్ట్ వద్ద అదనంగా 16 అమెరికన్ ట్యాంకర్లను మోహరించారు.

జూన్ 2025 లో ఇలాగే చర్చల నాటకాన్ని ఇజ్రాయెల్, అమెరికా లు ఆడాయి. ఒమన్ మధ్యవర్తిత్వంలో జరిగిన చర్చల్లో చిత్తశుద్ధిగా పాల్గొంటున్నట్లు నటించాయి. చివరి క్షణం వరకు చర్చల్లో ఆసక్తి ప్రదర్శించాయి. చర్చలు జరుగుతున్నాయి గనుక దాడులకు, యుద్ధానికి వైరి పక్షం దిగుతుందని ఎవరూ ఊహించరు. దాదాపు అన్ని అంశాలు, సమస్యలు పరిష్కారం అయ్యాయి, ఒక అంశం మాత్రమే మిగిలి ఉంది. అది కూడా దాదాపు ఒప్పందంలో భాగం అయినట్లే అని ఒమన్ ప్రతినిధులు ఆశాభావంతో ప్రకటిస్తుండగానే, ఇరాన్ ఏమరుపాటుతో ఉన్న సమశ్యంలో, అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు అనూహ్యంగా ఇరాన్ పైన దాడికి తెగబడ్డాయి.

ఫిబ్రవరి 28 తేదీన జరిగిన దాడికి ముందు కూడా ఇదే పరిస్ధితి నెలకొని ఉన్నది. నమ్మకంగా చర్చలలో పాల్గొంటున్నట్లు అమెరికా, ఇజ్రాయెల్ లు మళ్ళీ నటించాయి. ఒకసారి మోసపోయినప్పటికీ జూన్ 2025 యుద్ధంలో గట్టి ప్రతిఘటన ఇచ్చినందున ఇజ్రాయెల్, అమెరికా లు తమ పంతం గురించి ఒక అవగాహనకు వచ్చి ఉండొచ్చని ఇరాన్ ఆశపడి ఉండవచ్చు. వారి ఆశ వమ్ము చేస్తూ ఇజ్రాయెల్, అమెరికా దేశాలు 39 రోజుల పాటు ఇరాన్ దేశం పైన, జనావాసాలు, ఫ్యాక్టరీలు, రోడ్లు, వంతెనలు, గ్యాస్ ఫీల్డ్ లు, చమురు బావులు ఇలా అన్నింటిపైన దాడులు చేసి వినాశనం సృష్టించారు.

ఈ నేపధ్యంలో అమెరికా చెప్పే శాంతి కబుర్లను నమ్మటం అంటే, నమ్మే వాడే తీవ్రమైన తప్పిదానికి పాల్పడుతున్నట్లే! ఈ సంగతి గ్రహించే ఇరాన్ తమ ప్రతిపాదనలలో ఏ ఒక్కదాన్ని సవరించుకోవటానికి గానీ, ఉపసంహరించుకోవటానికి గానీ సిద్ధంగా లేరు. అయితే ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్, ఎరువులు, హీలియం గ్యాస్ తదితర సరుకుల కొరత వలన ఎదురయ్యే ఆర్ధిక నస్తాలు, ఆర్ధిక వ్యవస్థ సమస్యలను తప్పించుకునేందుకు చర్చాంశాలను రెండు భాగాలుగా విభజించింది ఇరాన్.

దీని ప్రకారం మొదటి విడత ఇరాన్ షరతులకు లోబడి హోర్ముజ్ జలసంధి తెరవటం గురించి చర్చించటం, రెండవ విడత ఇరాన్ అణు కార్యక్రమం గురించి చర్చించటం. హోర్ముజ్ జలసంధి సమస్య అంతర్జాతీయ రవాణా సమస్య. ప్రపంచ దేశాలన్నీ ప్రభావితం అవుతున్న సమస్య. కనుక దానిని మొదట పరిష్కారం చేసుకోవాలని ఇరాన్ ప్రతిపాదించగా అమెరికా అందుకు ససేమిరా అంటున్నది. ఇరాన్ కు ఇది చావు బ్రతుకుల సమస్య. ఇక్కడ ఏ మాత్రం పట్టు విడిచినా ఆ దేశం తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. అమెరికాకు ఇది ఆధిపత్య సమస్యం. పెత్తనం జారిపోతున్న సమస్య. జారిపోతున్న పెత్తనాన్ని తిరిగి నిలబెట్టుకోవాలన్న సమస్య.

ఈ సమస్య అమెరికాకు అనువుగా పరిష్కారం అయితే ప్రపంచ దేశాలు ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలు మరిన్ని దశాబ్దాల పాటు పశ్చిమ పెత్తందారుల చేతుల్లో నలిగిపోవాల్సి ఉంటుంది. సౌత్ దేశాల విముక్తి మరింత దూరం జరుగుతుంది. అంటే ఇరాన్ చేస్తున్న యుద్ధం నిజానికి పరోక్షంగా దక్షిణార్ధ గోళం లోని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల లోని 150 వరకు ఉన్న పేద, అణచివేయబడ్డ దేశాల విముక్తికి సమబంధించిన సమస్య. ఇరాన్ గెలిస్తే గ్లోబల్ సౌత్ మొత్తం విముక్తి అవుతుందన్నది ఇక్కడ అర్ధం కాదు. గ్లోబల్ సౌత్ విముక్తి దిశలో ఒక నిర్ణయాత్మక అడుగు పడినట్లు అర్ధం.

వ్యాఖ్యానించండి