
–
పహల్గాం ఉగ్రవాద దాడుల దరిమిలా ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్తాన్ పైన నాలుగు రోజుల పాటు ఇండియా మిసైల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పాకిస్తాన్ లోపలికి చొచ్చుకు వెళ్ళిన భారత ఫైటర్ జెట్ లు పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసినట్లు ప్రకటించింది. అనంతరం పాకిస్తాన్ సైన్యాధికారులు కోరటంతో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత సైన్యం ప్రకటించింది.
‘ఆపరేషన్ సింధూర్’ సందర్భంగా పాకిస్తాన్ సైన్యానికి చైనా సైన్యం ప్రత్యక్ష సాంకేతిక మద్దతు అందజేసినట్లు వెల్లడి అయింది. ఈ మేరకు చైనా ఏవియేషన్ ఇంజనీర్ ఒకరు ఆ దేశ ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ సిసిటివి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పరోక్షంగా వెల్లడి చేశాడు. ఈ సంగతి నిజానికి బహిరంగ రహస్యమే. కానీ చైనా సైన్యాధికారుల నోటి నుండి నేరుగా ఇందుకు సంబంధించిన సాక్ష్యం వెలువడటం ఇదే మొదటి సారి.
ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ సంస్థలో ఇంజనీర్ ఐనా ఝాంగ్ హెంగ్ సిసిటివి నెట్వర్క్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాము పాకిస్తాన్ బలగాలతో కలిసి ఆపరేషన్ సింధూర్ ను ఎలా ప్రతిఘటించిందీ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ సపోర్ట్ బేస్ లో చైనా మిలటరీ టెక్నికల్ అధికార్లు నేరుగా పాల్గొన్నారని హెంగ్ ఇంటర్వ్యూలో స్పష్టం అయింది. చైనా నుండి కొనుగోలు చేసిన ఫైటర్ జెట్ జె-10సిఇ లతో భారత్ భూభాగం పైన పాకిస్తాన్ దాడులు చేసిన దృష్ట్యా చైనా ఇంజనీర్ల సహాయం పాకిస్తాన్ కు అనివార్యం.
ఒక దేశం తన ఫైటర్ జెట్ లను మరో దేశానికి అమ్మకం చేస్తే, ఆ కొనుగోలు చేసిన దేశం యుద్ధంలో సదరు ఫైటర్ జెట్ లను వినియోగించిన పక్షంలో అనివార్యంగా జెట్ ల తయారీ దేశ టెక్నికల్ సిబ్బంది కొనుగోలు చేసిన దేశం తరపున యుద్ధంలో సహకరించాల్సి ఉంటుంది. ఇక్కడ రెండు అవకాశాలు ఉన్నాయి.
- ఫైటర్ జెట్ ల వినియోగానికి సంబంధించి సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కొనుగోలు దేశానికి సరఫరా చేయటం. మరియు సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో సంపూర్ణ శిక్షణను కొనుగోలు దేశ సైనికులకు లేదా సాంకేతిక సిబ్బందికి శిక్షణ ఇవ్వటం.
- లేదా ఫైటర్ జెట్ లను అమ్మకం చేసిన దేశానికి చెందిన టెక్నికల్ సిబ్బంది యుద్ధం సమయంలో నేరుగా కొనుగోలు దేశానికి యుద్ధరంగంలో సహకరించటం. సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయనప్పుడు ఈ తరహా ప్రత్యక్ష సహకారం తప్పనిసరి అవుతుంది.
ఫైటర్ జెట్ లు అమ్మకం చేసిన దేశం సాధారణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసేందుకు సుముఖంగా ఉండదు. రష్యా లాంటి దేశాలు పూర్తిగా కాకపోయినా మెజారిటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేస్తాయి. చైనా పరిస్ధితి ఏమిటి అన్నది పూర్తిగా వెల్లడి కాలేదు. చైనా ఇంజనీర్లు ప్రత్యక్షంగా ఆపరేషన్ సిధూర్ లో పాల్గొన్నందున జె-10సిఇ ఫైటర్ జెట్ లకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, వాడుక పరిజ్ఞానాన్ని చైనా, పాకిస్తాన్ కు పూర్తిగా బదిలీ చేయలేదని భావించాల్సి ఉంటుంది. లేదా పాకిస్తాన్ సిబ్బందికి శిక్షణ ఇవ్వటం పూర్తి కాలేదనైనా భావించాలి.
“సపోర్ట్ బేస్ వద్ద ఫైటర్ జెట్ ఇంజన్ల గర్జన శబ్దం, వాయు దాడుల సైరన్ లు నిరంతరం ధ్వనిస్తూ ఉంటాయి. ఉదయానికల్లా టెంపరేచర్ 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది. అది మానసికంగా, భౌతికంగా చాలా కష్టతరమైన అనుభవం” అని చైనా ఇంజనీర్ తన ఇంటర్వ్యూలో వివరించాడు.

యుద్ధానంతరం, యుద్ధ సమయంలో సైనిక సిబ్బంది ఇలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వటం ఫైటర్ జెట్ ల మార్కెటింగ్ వ్యూహంలో ఒక భాగం. అమెరికా తరచుగా తన యుద్ధ పరికరాల సామర్ధ్యాన్ని ప్రచారం చేసుకోవటానికి ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా చిలవలు పలవలు చేసిన కధలను ప్రచారంలో పెడుతుంది. ఈ పద్ధతిని చైనా కూడా అనుసరిస్తున్నదని ఇంటర్వ్యూ తెలియజేస్తోంది.
“ఆపరేషన్ సింధూర్ సమయంలో మేము ప్రత్యక్షంగా పాకిస్తాన్ తరపున యుద్ధరంగంలో ఉన్నాము” అని చైనా సైనిక సిబ్బంది చెప్పలేదు. అలా ఏ దేశమూ చెప్పుకోదు, ఒక్క అమెరికా తప్ప. అమెరికా కూడా సిఐఏ చేత గానీ, పేరు చెప్పని మిలటరీ అధికారుల ద్వారా గానీ చెప్పిస్తుంది. కానీ ఈ ఇంటర్వ్యూలో చైనా ఇంజనీర్ చెప్పిన మాటలు ఆపరేషన్ సింధూర్ కు ఇచ్చిన ప్రతిస్పందనలో పాల్గొన్న విషయాన్ని పరోక్షంగా తెలియజేస్తాయి.
“మాము తయారు చేసిన ఎయిర్ క్రాఫ్ట్, దాని అనుబంధ వ్యవస్థలు తమ పూర్తి సామర్ధ్యంతో పని చేసేలా చూడటం మా పైన ఉన్న గురుతర బాధ్యత. కాబట్టి మేము అక్కడ ఉండక తప్పదు” అని ఝాంగ్ హెంగ్ చెప్పాడు. “ఇది జె-10సిఇ ఫైటర్ జెట్ కు వచ్చిన గుర్తింపు మాత్రమే కాదు. పక్క పక్కనే ఉండి పని చేయటం ద్వారా ఆ దేశంతో మేము లోతైన సంబంధాలు కలిగి ఉన్నామని చెప్పేందుకు సాక్ష్యం కూడా” అని హెంగ్ చెప్పాడు. పాకిస్తాన్, చైనా మధ్య లోతైన రక్షణ సంబంధాలు ఉన్నాయని ఆయన స్పష్టంగా చెబుతున్నాడు.
“అది మాము దగ్గర ఉండి పెంచి పోషించిన పసి ప్రాణంతో సమానం. మేమే దాన్ని పోషించాము, ఆలనా పాలనా చూశాము, అంతిమంగా కస్టమర్ చేతులకు అందజేశాము. ఇప్పుడు అది ప్రధాన పరీక్ష ఎదుర్కొంటోంది” అని మరో ఇంజనీర్ షు దా చెప్పాడు.
“జె-10సిఇ వినియోగ ఫలితాలు మాకేమీ ఆశ్చర్యకరం కాలేదు. అద్బుతమైన దాని ఫలితాలు అనివార్యం అని మాకు ముందే తెలుసు. మా ఎయిర్ క్రాఫ్ట్ కి కేవలం సరైన అవకాశం వస్తే చాలు, తన శక్తి నిరూపించుకుంటుంది. అవకాశం వచ్చాక అది మా ఊహలకు తగ్గ ఫలితాలను అందించింది” అని చైనా ఇంజనీర్ తమ ఫైటర్ జెట్ ల సామర్ధ్యం ఎంతో గొప్పగా ఉందని చెప్పుకున్నాడు.
పాకిస్తాన్ రక్షణ విషయంలో చైనా వ్యూహాత్మక పాత్ర నిర్వహిస్తుందన్న సంగతిని ఈ ఇంటర్వ్యూలు స్పష్టం చేస్తున్నాయి. చైనా ఫైటర్ జెట్ జె-10సి ని విదేశాలకు అమ్మితే దాని పేరు జె-సిఇ గా మారుతుంది. దీనిని వినియోగిస్తున్న ఏకైక చైనాయేతర దేశం పాకిస్తాన్ ఒక్కటే. 2020 లో పాకిస్తాన్ 36 జె-10సిఇలను కొనుగోలు చేసింది. 2021-25 మధ్యలో పాకిస్తాన్ మిలటరీ దిగుమతుల్లో 80 శాతం చైనా యే తీర్చింది.
రష్యా, ఇండియా లు ఉమ్మడిగా మిలటరీ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లే పాకిస్తాన్, చైనా లు కూడా ఉమ్మడిగా జెఎఫ్-17 ఫైటర్ జెట్ లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇండియాకు వచ్చిన అనుభవం ఏమిటంటే ఇండియాకు ఒకే ఒక్క సరిహద్దు ఉన్నా కూడా ప్రత్యర్ధులు మాత్రమే ముగ్గురు ఉన్నారని స్పష్టం అయిందని భారత సైన్యాధికారులు చెప్పారు. ముగ్గురిలో పాకిస్తాన్, చైనా దేశాలు ఇండియాకు ప్రత్యర్ధులు అని గ్రహించవచ్చు. కానీ మూడవ ప్రత్యర్ధి ఎవరన్నది తెలియలేదు.
బంగ్లా దేశ్ దేశాన్ని కూడా ప్రత్యర్ధిగా ఇండియా భావిస్తున్నాదా?