గల్ఫ్ (ఇరాన్) యుద్ధం -నోట్స్ అండ్ అప్ డేట్స్ 11


US’ troops tried to steal 60% refined Uranium from Isfahan nuclear facility, but utterly failed

30-04-2026

చమురు అంతర్జాతీయ ధర అధికారికంగా బ్యారెల్ 115 డాలర్లు గా కనిపిస్తున్నప్పటికీ వాస్తవ ధర బ్యారెల్ 200 డాలర్లు పలుకుతున్నట్లు వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. శ్రీలంక ఐతే బ్యారెల్ 248 డాలర్లు ధరకు కొనుగోలు చేసిందని ఆ దేశ అధికారులు ప్రైవేటుగా చెబుతున్నారు.

షేర్ మార్కెట్లు పతనం కాకుండా ఉండేందుకు చమురు ధరలు తక్కువ కనబడేట్లు మ్యానిపులేట్ చేస్తున్నారు. తద్వారా ఇరాన్ యుద్ధ ప్రభావం ఏమీ లేదని అమెరికా ప్రజలకు సూచించే ప్రయత్నం జరుగుతోంది. నవంబర్ నెలలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ లకు మిడ్ టర్మ్ ఎన్నికలు జరగనున్నందున ఈ మ్యానిపులేషన్ జరుగుతున్నది.

ఇస్లామాబాద్ చర్చలు విఫలం కావటం కేవలం చర్చలు విఫలం కావటం గానే చూడకూడదు. అది ప్రధానంగా అమెరికా ఇన్నాళ్ళూ అవలంబించిన ఆధిపత్య పూర్వక చర్చల నిర్మాణ ప్రక్రియ వైఫల్యం గా చూడాల్సి ఉంటుంది. ఈ వైఫల్యం చర్చల వైఫల్యంగానే కాకుండా అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్య వైఫల్యం లో భాగంగా ప్రపంచ దేశాల ముందు కనపడుతుంది. అందుకే అమెరికా ఏదో రూపంలో చర్చలు జరుగుతున్నట్లు అందులో అమెరికా పై చేయిగా ఉన్నట్లు, ఇరాన్ లొంగుబాటులో ఉన్నట్లు ఒక అబద్ధపు దృశ్యాన్ని పశ్చిమ పత్రికలు ప్రచారంలో పెడుతున్నాయి.

ఇస్లామాబాద్ లో అమెరికా, ఇరాన్ బృందాల మధ్య చర్చలు జరుగుతున్నపుడు అమెరికా వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుజి వైల్డ్స్ కనీసం 11 సార్లు ఉపాధ్యక్షుడు జె డి వాన్స్ కి ఫోన్ చేసి సూచనలు చేసింది. మరో పక్క ఇజ్రాయిల్ నుండి ఆ దేశ ప్రధాన మంత్రి నెతన్యాహు, అమెరికా తరపున చర్చల్లో ఉన్న ట్రంప్ అల్లుడు జెర్డ్ కృష్ణర్, ట్రంప్ అధికారిక ప్రతినిధి విట్ కాఫ్ వీళ్ళంతా జె డి వాన్స్ చర్చలు జరుపుతున్న తీరు పైన ఒక కన్నేసి ఉంచారు. చర్చల్లో వాస్తవిక దృక్పధంతో (అనగా ఇరాన్ శక్తివంతం అయిన వాస్తవాన్ని గుర్తించి తదనుగుణంగా చర్చలలో ఇచ్చి పుచ్చుకునే ధోరణిని అవలంబించటం) చర్చలు జరపకుండా నిరోధించారు. మరో విధంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ప్రాంతీయ ఆధిపత్య ప్రయోజనాలకు ప్రాధాన్యం ఉండేలా చర్చలను నియంత్రించారు.

ఈ పరిస్థితిలో చర్చలలో అమెరికా ప్రతినిధి బృందానికి ఉపాధ్యక్షుడు నాయకత్వం వహించినప్పటికీ అమెరికా తరపున నిర్ణయాలు చేసేందుకు జె డి వాన్స్ చేతుల్లో ఎలాంటి అధికారం లేదని, అంతా ఇజ్రాయెల్ ప్రయోజనాలే చర్చలను నిర్ణయిస్తున్నాయని ఇరాన్ కి అర్థమయింది. ఆ సంగతి ఇరాన్ అధికారులే చర్చల అనంతరం వెల్లడి చేశారు.

దానితో ఇరాన్ తన వ్యూహాన్ని మార్చుకుని చర్చల నుండి వెళ్లిపోయేందుకు నిర్ణయించుకుంది. విట్ కాఫ్, కృష్ణర్ లతో రెండో సారి చర్చలకు ఇరాన్ విజ్ఞప్తి చేసినట్లు ట్రంప్ ప్రచారం చేసినప్పటికీ, వాస్తవం లో అప్పటికే ఇస్లామాబాద్ నుంచి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు. అయినా సరే, ఇరాన్ లొంగిందని, అమెరికా బెదిరింపులకు భయపడిందని, 60 శాతం వరకు శుద్ధి చేయబడిన 430 కిలోల యురేనియం ను అమెరికాకు అప్పగిస్తోందని ట్రంప్ ప్రకటించుకున్నాడు.

ఇదే తరహా ప్రచారాన్ని ట్రంప్ మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నాడు. నిజం ఏమిటంటే ఇరాన్ తన పాలసీని మార్చుకుంది. నూతన పాలసీ ప్రకారం అణు పరిజ్ఞానం, అణు శుద్ధి గురించి ఇక చర్చించేందుకు ఇరాన్ సుముఖంగా లేదు. ఇప్పటికి కేవలం హార్ముజ్ జలసంధిని తెరవటం గురించి మాత్రమే ఇరాన్ చర్చిస్తుంది.

ఒక క్రమ పద్ధతిలో దశల వారీగా చర్చలు జరపాలని, ఇరాన్ ప్రతిపాదించింది. ఇరాన్ ప్రతిపాదన ప్రకారం మొదటి దశలో హార్ముజ్ జలసంధి గురించి చర్చ జరగాలి. అది కూడా కేవలం ఇరాన్ షరతుల ప్రకారమే చర్చలు జరగాలి. ఇరాన్ పై యుద్ధానికి ఏయే దేశాలు మద్దతు ఇచ్చాయో ఆ దేశాల నౌకలు హార్ముజ్ జలసంధి గుండా సరుకు రవాణాకు అనుమతి ఉండదు. నౌకల రవాణా కోసం ఇరాన్ ఫీజు (టోల్) వసూలు చేస్తుంది. ఏయే నౌకలు హార్ముజ్ గుండా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి అన్నది ఐ.ఆర్.జి.సి నిర్ణయిస్తుంది.

ఇరాన్ ప్రకారం ఈ అంశాలను మాత్రమే మొదట చర్చించాలి. తద్వారా క్రమంగా హోర్ముజ్ లో మరింత రవాణా పెంచేందుకు అవకాశం వస్తుంది. ఇరాన్ చమురు తో పాటు ఇతర దేశాల చమురును కూడా అనుమతించ వచ్చు. అలాగని అన్ని దేశాల చమురు కు అనుమతి లభిస్తుందని గ్యారంటీ లేదు. చమురు రవాణా పెంచటం ద్వారా ట్రంప్ పాక్షిక విజయం అయినా సాధించినట్లు అవకాశం ఉంటుందని ఇరాన్ ఆశ చూపింది. అలాగే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు సమస్యలు ఎదుర్కోకుండా తప్పించ వచ్చు అన్నది ఇరాన్ ప్రతిపాదన. తరిచి చూస్తే ఇందులో పర్షియన్ అఖాతంలో అమెరికా పెత్తనాన్ని రూపుమాపే లక్ష్యం ఉన్నట్లు గ్రహించవచ్చు. ఇంకా చెప్పాలంటే పశ్చిమాసియా నుండి జరిగే చమురు రవాణా పైన అమెరికా పెత్తనాన్ని రద్దు చేసే వ్యూహాన్ని ఇరాన్ రచించింది. ఈ లక్ష్యాన్ని ఇరాన్ రహస్యంగా ఉంచలేదు కూడా. ఇరాన్ చేసిన 10 డిమాండ్లలో పశ్చిమాసియా నుండి అమెరికా వెళ్లిపోవాలన్నది ఒకటి.

ఇక ఇరాన్ అణు విధానం అంశాన్ని భవిష్యత్తులో చర్చించ వచ్చు అన్నది ఇరాన్ అవగాహన. ఆ మాటకొస్తే అణు సమస్య గురించిన చర్చ అసలు జరగకపోనూ వచ్చు. అంటే ఇరాన్ సార్వభౌమాధికారం విషయంలో చొరబడే అవకాశాన్ని అమెరికా కు ఇచ్చేందుకు ఇరాన్ ఇక ఎంత మాత్రం అంగీకరించబోదన్న సందేశాన్ని ఇరాన్ ఇస్తున్నది. ఇరాన్ చెప్పేదానికి అంగీకరించకపోతే చమురు, గ్యాస్ రవాణా ఆగిపోతుంది అన్నది ఇప్పటికే స్పష్టం అయింది. ఒమన్, ఇస్లామాబాద్, మాస్కో కు వెళ్లినపుడు ఇదే అంశాన్ని ఇరాన్ విదేశీ మంత్రి అక్కడి ప్రభుత్వాలకు స్పష్టం చేశాడు.

ఇటీవలి రోజుల్లో ఓ వైపు చర్చలు అంటూనే పశ్చిమాసియా లో అమెరికా తన బలగాల్ని భారీగా పెంచుకోవటాన్ని ఇరాన్ గమనిస్తున్నది. ట్రూప్స్, మందుగుండు, ఫైటర్ జెట్ విమానాలను తరలిస్తున్నది అమెరికా. అంటే అమెరికా మరో భారీ దాడికి సిద్ధం అవుతున్నట్లు ఇరాన్ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో అమెరికా కు తాము పెద్ద సర్ ప్రైజ్ సిద్ధం చేశామని, ఇంతవరకు చూడని పరిణామాలు అమెరికా ఎదుర్కోనున్నదని ఇరాన్ హెచ్చరించింది. మరో యుద్ధం ఎదురు కానున్నట్లు ఇరాన్ గట్టిగా నమ్ముతున్నది. కాబట్టి ట్రంప్ చెబుతున్న చర్చలు కేవలం తమను మరోసారి మోసగించేందుకే అని ఇరాన్ భావిస్తున్నది. ఇరాన్ ను లొంగదీసే లక్ష్యంతో భారీ అంతిమ దాడి అమెరికా, ఇజ్రాయెల్ చేయొచ్చని ఇరాన్ భావిస్తున్నది.

గత అంతర్గత వార్ రూం సమావేశాల్లో ట్రంప్ న్యూక్లియర్ బాంబు ప్రయోగించేందుకు గల అవకాశాల గురించి చర్చించినట్లు వార్తలు వచ్చాయి. జనరల్ కెయిన్ అందుకు నిరాకరించినట్లు ఈ వార్తలు తెలిపాయి. ఇప్పుడు అణు బాంబులు కాకపోయినా ఇరాన్ లోని నీరు, విద్యుత్ ప్లాంట్ లను, రోడ్లు, రైల్వేలు, వంతెనలు మున్నగు పౌర నిర్మాణాలను భారీ దాడులతో నాశనం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే ఇది యుద్ధ నేరం అవుతుందని, పౌర నిర్మాణాల వినాశనాన్ని జెనీవా ఒప్పందాలు అంగీకరించవని కొందరు వైట్ హౌస్ అధికారులు ట్రంప్ ను హెచ్చరించినట్లు, ఇది జీనోసైడ్ కూడా అవుతుందని దాదాపు అధికారులు అందరు, ఒక్క పీట్ హెగ్సెత్ తప్ప హెచ్చరించినట్లు తెలుస్తున్నది.

ఇలాంటి దాడులు చేస్తే యుద్ధం అనంతరం తాము అంతర్జాతీయ కోర్టులో యుద్ధ నేరాలకు గాను ప్రాసిక్యూషన్ కి గురి కావలసి ఉంటుందని పెంటగాన్ (అమెరికన్ మిలటరీ) అధికారులు భయపడుతున్నారు. తాను అధికారులకు క్షమాభిక్ష ప్రసాదిస్తానని ట్రంప్ హామీ ఇస్తున్నాడు. కానీ రెండో ప్రపంచ యుద్ధం అనంతరం జరిగిన న్యూరెంబర్గ్ ట్రయల్స్ ప్రకారం చూస్తే, “మేము కేవలం పై అధికారుల ఆర్డర్స్ మాత్రమే అమలు చేస్తున్నాము” అని చెబితే అది వ్యాలిడ్ డిఫెన్స్ కాజాలదు. అందుకే పెంటగాన్ అధికారులు ట్రంప్ ఇస్తున్న ఆదేశాల పట్ల ఇబ్బందిగా ఉన్నారు.

ఇరాన్ మాత్రం ధైర్యంగా విశ్వాసంగా ఉన్నది. కొండలతో, లోయలతో నిండిన ఇరాన్ జాగ్రఫీ ఇరాన్ కి పెట్టని కోట. సాలీడు తన గూడును అల్లి కీటకాలను తన పై దాడికి ఆహ్వానిస్తున్నట్లుగా అమెరికాను “మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం” అని ఆహ్వానిస్తోంది.

విఫలమైన ఇస్ఫాహన్ రహస్య ఆపరేషన్

ఇరాన్ లో అమెరికా సైనికుడు ఒకరు ఎఫ్ 15 జెట్ కూల్చివేత వలన ఇరాన్ లో పడిపోయిన తర్వాత అతన్ని రక్షించే పేరుతో అమెరికా పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాల్లో సైనికుల్ని పంపిన సంగతి తెలిసిందే. అప్పుడు వాస్తవానికి అమెరికా ఇస్ఫహాన్ (ఇరాన్ లోని పెద్ద నగరాల్లో ఒకటి) అణు స్థావరం నుండి శుద్ధి చేసిన యురేనియం ను దొంగిలించేందుకు భారీ ఆపరేషన్ ను అమెరికా నిర్వహించింది. ఆ ఆపరేషన్ దారుణంగా విఫలం అయింది. ఆపరేషన్ సందర్భంగా అమెరికా మిలటరీ ఘోరంగా దెబ్బ తిని యుద్ధ విమానాలు, జెట్ లు, సైనికుల్ని కోల్పోయింది. అప్పుడే ట్రంప్ తీవ్ర ఫ్రస్ట్రేషన్ కి లోనై ఇరాన్ నాయకుల్ని బూతులు తిట్టడం మొదలు పెట్టాడు. ట్రంప్ పరిస్థితి పట్ల ఆందోళన చెందిన అమెరికా అత్యున్నత మిలటరీ అధికారులు ట్రంప్ ను వార్ రూం నుండి బయటికి పంపేసి ఆయన మళ్లీ రాకుండా తాళం వేసుకున్నారని బ్రిటన్ మాజీ రాయబారి అలిస్టర్ క్రుక్ చానల్ వెల్లడించింది.

ఒక విధంగా ట్రంప్ ప్రమాదకరంగా మారాడని పరిశీలకులు భావిస్తున్నారు. జరగని విషయాలని జరిగినట్లు ఊహిస్తూ ట్రూత్ సోషల్ లో రాస్తుండటం, ఒక లక్ష్యంతో అబద్ధాలు చెప్పటం కాకుండా, వాటిని నమ్ముతూ అబద్ధాలు రాస్తున్నాడని వారు అంచనా వేస్తున్నారు.

ఇరాన్, సీజ్ ఫైర్ ఒప్పందం కోసం బ్రతిమలాడుతోందని, ఇరాన్ అధికార వ్యవస్థ చీలిపోయిందని, ఐ.ఆర్.జి.సి మరియు ప్రభుత్వం ఒకదానినొకటి ఘర్షణ పడుతున్నాయని ట్రంప్ ప్రచారం చేయటమే కాకుండా దాన్ని ట్రంప్ నమ్ముతున్నట్లు అనుమానిస్తున్నారు. హార్ముజ్ జలసంధి ని తెరవటానికి ఇరాన్ స్వయంగా అమెరికాను సాయం చేయాలని అర్థిస్తున్నదని రెండు రోజుల క్రితం ప్రకటించి ట్రంప్ అందరినీ ఆశ్చర్య పరిచాడు. ట్రంప్ మానసిక పరిస్ధితి పట్ల అందుకే కొందరు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికాతో చర్చలు జరపటం, ఒక ఒప్పందానికి రావటం అసాధ్యంగా మారింది. ఏ పునాది పై ఆధారపడి చర్చలు జరపాలి అన్నది అగమ్య గోచరం అయింది. ఇరాన్ మొదటి నుండి 10 అంశాల ప్రాతిపదికన చర్చలు చేయాలని చెబుతూ వచ్చింది. అది అంగీకార యోగ్యమైన ప్రతిపాదన అని ట్రంప్ కూడా ఆమోదించాడు. ఆ మేరకు ట్రూత్ సోషల్ లో ప్రకటన చేశాడు. ఇరాన్ ఇప్పటికీ ఆ 10 అంశాలకు కట్టుబడి ఉన్నది. కానీ ట్రంప్ / అమెరికా రోజూ, ఒక్కోసారి పూట పూటకూ మాట మార్చుతూ వస్తోంది.

ఇంకో పక్క ఇజ్రాయెల్ ఇదే పరిస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రమే కాకుండా 93 శాతం ఇజ్రాయెల్ ప్రజలు ఇరాన్ నాశనం కావాలని కోరుతున్నారు. ఇరాన్ నాశనం అవుతుందని అమెరికా, ఇజ్రాయెల్ మిలటరీలు ఆ దేశాన్ని తుడిచి పెట్టేస్తాయని నమ్మారు. కానీ అదేమీ జరగక పోవటంతో ఇజ్రాయెల్ లోని ప్రముఖులు సైతం తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇరాన్ ఒక దేశంగా, ఒక ఆచరణాత్మక రాజ్యంగా మనటానికి వీలు లేదని వారు కోరుకోగా అది జరగలేదు. కనుక ఇరాన్ పైన యుద్ధాన్ని కొనసాగించాలని వారు ట్రంప్ పైన గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. ఇరాన్ తో ఎలాంటి ఒప్పందం చేసుకున్నా అది ఇజ్రాయెల్ కు అంగీకారం కాదని ఎలాంటి రాజీ అయినా చెడ్డదే అవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఆ విధంగా ప్రస్తుత పరిస్థితి ఇజ్రాయెల్ ఉనికికి సంబంధించిన (existential crisis) సమస్యగా రూపాంతరం చెందింది. ఇరాన్ విజయవంతమైన ప్రతిఘటన తో అటు లెబనాన్, ఇటు సిరియా మరియు జోర్డాన్ లతో పాటు గాజా, వెస్ట్ బ్యాంక్ లను పూర్తిగా కబళించి గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పాటు చేయాలన్న ఇజ్రాయెల్ కలలు కల్లగా మిగిలిపోనున్నాయి.

ఇంకో భారీ దాడి ప్రయత్నాలతో పాటు ఇరాన్ పైన బ్లాకెడ్ ను మరింత కఠినం చేస్తే ఇరాన్ లొంగి వస్తుందని కూడా ట్రంప్ ప్రకటిస్తున్నాడు. సంపూర్ణమైన ఆర్థిక ప్రతిష్టంభన అమలు చేస్తే, అనగా ఇరాన్ చమురు రవాణాను పూర్తిగా అడ్డుకుంటే ఇరాన్ పాలకులు లొంగుతారని ఆయన ప్రకటిస్తున్నాడు.

ఇరాన్ చమురు నిల్వలు ఆ దేశ పూర్తి సామర్థ్యానికి సమీపంగా వచ్చాయని కాబట్టి కొద్ది రోజుల్లో ఇరాన్ చమురు ఉత్పత్తి నిలిపేయాల్సి ఉంటుందని అమెరికా అంచనా వేస్తున్నది. ఇరాన్ చమురు ఎప్పటికప్పుడు ఎగుమతి అవుతుంటే ఇరాన్ స్టోరేజ్ ఖాళీ అవుతుంది. ఎప్పటికప్పుడు ఉత్పత్తి చేస్తూ స్టోరేజ్ ను మళ్ళీ నింపుతూ ఉంటారు. అమెరికా బ్లాకెడ్ వల్ల ఎగుమతి నిలిచిపోతే స్టోరేజీ ఖాళీ కాకుండా పోతుంది. దాంతో స్టోరేజీ నిండిపోయి కొత్త ఉత్పత్తి నిలిపేయాల్సి ఉంటుంది. ఇది అమెరికా బ్లాకేడ్ వలన ఇరాన్ ఎదుర్కొనే సంక్షోభ పరిస్థితి.

అమెరికా, ఇతర ప్రపంచ దేశాల విషయానికి వస్తె అమెరికా బ్లాకేడ్ వలన చమురు సరఫరా ఇతర దేశాలకు ఆగిపోతుంది. ఫలితంగా పెట్రోలియం, డీజిల్, జెట్ ఫ్యూయల్ ధరలు పెరుగుతాయి. (క్రూడాయిల్ ధరలు వాస్తవంలో బ్యారెల్ 200 డాలర్లు పైనే ఉన్నట్టు ముందు చూశాం) అమెరికా, ఇతర దేశాల్లో రవాణా ధరలు పెరిగి సకల సరుకుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పరిమితి దాటి పోతుంది. ఇది అమెరికా బ్లాకేడ్ వల్ల అమెరికా, ఇతర దేశాలు ఎదుర్కొనే సంక్షోభం.

నిపుణుల అంచనా ప్రకారం ఇరాన్ ఎదుర్కొన గల సంక్షోభం సంభవించేందుకు అధిక కాలం అందుబాటులో ఉండగా, అమెరికా ఇతర దేశాలు ఎదుర్కొనే సంక్షోభం సంభవించేందుకు అట్టే కాలం అందుబాటులో లేదు. ఇరాన్ కంటే ముందే అమెరికా, ఇతర దేశాలు సంక్షోభం ఎదుర్కోవలసి వస్తుంది. పైగా ఇరాన్ చమురు ఎగుమతి గతంలో కంటే తగ్గినప్పటికీ పూర్తిగా ఆగిపోవటం మాత్రం జరగలేదు. తగ్గిన మొత్తాన్ని టోల్ ఫీజు ద్వారా ఇరాన్ పూడ్చుకుంటోంది.

అమెరికా వద్ద భారీ పెట్రోలియం ఉత్పత్తి జరుగుతోందని, అది ప్రపంచ దేశాలకు సరఫరా అవుతోందని, అమెరికాకు లాబాలు వస్తున్నాయని, ఇరాన్ పెట్రోలియం అందకపోయినా అమెరికా సరఫరా చేస్తున్నది కనుక సంక్షోభం ఉండదని కొన్ని భారత పత్రికలు అంచనా వేస్తున్నాయి. కానీ ఇది వాస్తవదూరం అని నిపుణులు తేల్చేస్తున్నారు. అమెరికా చమురు (స్వీట్ క్రూడాయిల్) ను శుద్ధి చేసే రిఫైనరీలు చాలా తక్కువ. ఇండియా లాంటి దేశాలతో పాటు అమెరికాలో కూడా హార్డ్ క్రూడాయిల్ ను శుద్ధి చేసే రిఫైనరీ లే అధికంగా ఉన్నాయి. అందుకే అమెరికా కూడా హార్డ్ క్రూడాయిల్ ను దిగుమతి చేసుకుని తన దేశంలో వాడుతుంది. హార్ముజ్ ద్వారా సరఫరా అయ్యే క్రూడాయిల్, గ్యాస్, హీలియం, ఫెర్టిలైజర్స్ ప్రపంచానికి తప్పనిసరి అవసరం. కాబట్టి ఇరాన్ విధించిన షరతుల గురించి, చర్చల ద్వారా ఇరాన్ తో రాజీ కి రావటం గురించి అమెరికా తప్పనిసరిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది.

అంతే కాకుండా ఇరాన్ కొత్త రవాణా కారిడార్లను తెలుస్తున్నది. పాకిస్తాన్ గుండా 6 చమురు రవాణా భూతల కారిడార్లను ఇరాన్ తెరిచినట్లు వార్తలు చెబుతున్నాయి. ఈ సంగతి అమెరికా కార్పొరేట్ పత్రికలే చెబుతున్నాయి.

అంతే కాక అమెరికాలో ఎన్నికల తుఫాను ప్రారంభమయింది. ప్రైమరీల్లో రిపబ్లికన్ పార్టీ ఘోరంగా దెబ్బ తింటోంది. ట్రంప్ పాపులారిటీ బాగా పడిపోయింది. పశ్చిమాసియాలో హార్ముజ్ తుఫాను, అమెరికాలో ట్రంప్ వ్యతిరేక ఎన్నికల తుఫాను ట్రంప్ కి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్నందున ఇరాన్ సంగతి మర్చిపోయి ఎన్నికల పైన కేంద్రీకరించాలని ట్రంప్ సలహాదారులు సూచిస్తున్నారు. అమెరికాలో గ్యాసోలిన్ ధరలు లీటర్ 4 డాలర్లు చెల్లిస్తున్నారని ఎరువులు రైతులకు అందుబాటులో లేవని గుర్తు చేస్తున్నారు. రైతులు దివాళా తీస్తున్నందున ఆహార ధరలు పెరగనున్నాయని సూచిస్తున్నారు. ఇరాన్ అణు బాంబు నిర్మించటానికి వీల్లేదని పైకి పెద్ద చప్పుడు చేస్తూ హార్ముజ్ పైన ఇరాన్ నియంత్రణ ను అనుమతించాలని సూచిస్తున్నారు. ట్రంప్ ఇందుకు అంగీకరిస్తే అమెరికాని నమ్ముకున్న గల్ఫ్ దేశాలు తీవ్ర ప్రతికూల ప్రభావం ఎదుర్కొంటాయి. ఇది ఇరాన్ వ్యూహంలో భాగం.

ఇరాన్ 47 సంవత్సరాలుగా ఒక బందిఖానాలో మగ్గింది. ఈ బందిఖానా కేవలం ఇరాన్ చుట్టూ ఉన్న అమెరికన్ మిలట్రీ స్థావరాలకు సంబంధించినది మాత్రమే కాదు, అది పెట్రో డాలర్ కు కూడా సంబంధించినది. గల్ఫ్ దేశాలలో స్థాపించబడిన నయా ఉదారవాద, తీవ్ర స్థాయిలో ద్రవ్యీకరించబడిన (higjly financialized) నిర్మాణానికి సంబంధించినది. ఈ నిర్మాణాన్ని పశ్చిమాసియా ప్రాంతంలో విడదీయరాని అంతర్భాగంగా అమెరికా మార్చింది. 1973 లో డాలర్ – గోల్డ్ ల లింక్ తెంచేసి, పెట్రోలియం ను కేవలం డాలర్లలోనే అమ్మాలని సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకుని, గల్ఫ్ దేశాల డాలర్ లాభాలను అమెరికా ట్రెజరీలలో మదుపు చేసేందుకు అంగీకరింపజేసి సదరు అరువు అప్పుతో అమెరికా ఆర్థిక శక్తిని ఇనుమడింప జేసుకుంది అమెరికా.

పెట్రోడాలర్, డాలర్ ఆధిపత్యం, అమెరికా మిలటరీ ఫైనాన్షియలైజ్డ్ కంట్రోల్, ఐ.ఎం.ఎఫ్, వరల్డ్ బ్యాంకుల కంట్రోల్ ఇవన్నీ ఇరాన్ ను బందిఖానాలో బంధించి ఉంచాయి. ఇరాన్ ప్రజలను నిరంతర ప్రయాసలకు గురి చేశారు. ఇదే పద్ధతిలో నియంత్రణను అమెరికా కాస్త అటు ఇటుగా ప్రపంచం అంతటా అమలు చేసింది.

ఈ వ్యవస్థను ప్రతిఘటించి చివరికి ప్రస్తుతం హార్ముజ్ సంక్షోభం వరకు తీసుకు రావటం ద్వారా అమెరికా, పశ్చిమ రాజ్యాలు, గల్ఫ్ రాజ్యాలు, ఇజ్రాయెల్… ఈ దేశాల దుష్ట కూటమిని శాసించే పరిస్థితికి ఇరాన్ చేరింది. ఇరాన్ లో మళ్ళీ విప్లవ గాలులు వీస్తున్నాయి. సామ్రాజ్యవాద అమెరికా, జాత్యహంకార ఇజ్రాయెల్ లను 6 వారాల యుద్ధంలో ఎటూ పాలుపోని స్థితికి తీసుకు రావటం ద్వారా ఇరాన్ ప్రభుత్వం తమ ప్రజలను తిరిగి ఏక తాటి పైకి తెచ్చింది. జరుగుతున్న పరిణామాలతో ఇరాన్ యువత ద్విగుణీకృత ఉత్సాహంతో ఇరాన్ విప్లవ భావజాలంలో ఉరకలు వేస్తున్నారు. “అసలు అమెరికాతో మీరు ఎందుకు చర్చిస్తున్నారు? అమెరికాతో చర్చల వలన ఏ ఫలితం ఉండదని తెలిసే ఎందుకు చర్చిస్తున్నారు?” అని వారు తమ నాయకత్వాన్ని, పెద్దల్ని ప్రశ్నిస్తున్నారు.

ఇరాన్ ప్రభావం గ్లోబల్ సౌత్ దేశాలపై పడుతున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ ప్రజల పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని తమ తమ దేశాల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రతిఘటన తీవ్రం చేయాలని సౌత్ దేశాల కార్మికవర్గం భావిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ఇరాన్ చమురు, వెనిజులా చమురు చైనా కు తీసుకెళ్తున్న కొన్ని ట్యాంకర్లను అమెరికా మిలటరీ ఆటకాయించి స్వాధీనం లోకి తెచ్చుకుంది. ఈ పరిణామం చైనాకు ఆగ్రహం తెప్పించింది. చైనా సప్లై లైన్ల పైన అమెరికా దాడి చేయటం సమ్మతం కాదని సూచించింది. తమ ట్యాంకర్ల సీజ్ ను తమ అంతర్జాతీయ వాణిజ్యం పైన అమెరికా చేస్తున్న అగ్రెసివ్ ఎటాక్ గా చైనా పరిగణిస్తున్నది

వ్యాఖ్యానించండి