ట్రంప్ మానసిక ఆరోగ్యం పైన అనుమానాలు!


ఇరాన్ పైన సామ్రాజ్యవాద హంతక దాడుల నేపధ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన, చేస్తున్న ప్రకటనలు ఆయన మానసిక ఆరోగ్యం పైన అనుమానాలు కలిగిస్తున్నాయి. అనేక మంది మానసిక వైద్యులు, రాజకీయ-ఆర్ధిక విశ్లేషకులతో పాటు మెజారిటీ అమెరికా ప్రజలు కూడా ఈ అంశంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నట్లు అమెరికా పత్రికలు తెలియజేస్తున్నాయి.

అమెరికాలో విశ్లేషకులు మరియు ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయగల న్యూయార్క్స్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ లాంటి ప్రముఖ పత్రికలు కూడా అధ్యక్షుడు ట్రంప్ మానసిక ఆరోగ్య సామర్ధ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విశ్లేషణలు ప్రచురించాయి.

ముఖ్యంగా ఇరాన్ తో యుద్ధం సందర్భంగా అమెరికా సర్వ సైన్యాధ్యక్షుడు హోదా లో డొనాల్డ్ ట్రంప్ చేసిన వెర్రి మొర్రి ప్రకటనలు ఆయన మానసిక ఆరోగ్యం లేదా అనారోగ్యం పైన ఏర్పడిన అనుమానాలను మరింత బలపరిచాయి. నిన్న చేసిన ప్రకటనకు విరుద్ధంగా నేడు మరో ప్రకటన చేయటం, అంత లోనే తన ప్రకటనను తానే ఖండిస్తూ ఇంకో ప్రకటన చేయటం, తనను తానే జీసస్ గా ప్రకటించుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో తయారు చేసిన మార్ఫ్ ఫోటో ప్రచురించటం మొ.న అంశాలు రాజకీయ విశ్లేషకులు, ప్రజానీకంలో భయాందోళనలు కలిగించాయి.

డొనాల్డ్ ట్రంప్ ధోరణి వలన రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖ ట్రంప్ మద్దతుదారులు ఆయనకు దూరం అయ్యారు. ముఖ్యంగా ఆయన ప్రారంభించిన “మాగా” (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) ఉద్యమం లోని సెలబ్రిటీ సభ్యులు తామే స్వయంగా ట్రంప్ కి మద్దతు ఉపసంహరించుకోవటం గానీ, లేదా ట్రంప్ వారిని బహిరంగంగా దూషించటం గానీ జరిగింది.

డొనాల్డ్ ట్రంప్ కు ప్రముఖ మద్దతుదారుడు అయిన ఫాక్స్ న్యూస్ చానెల్ విలేఖరి టకర్ కారల్సన్ డొనాల్డ్ ట్రంప్ నుండి విడిపోయిన ప్రముఖ మద్దతుదారుల్లో ఒకరు. మరో ప్రముఖ విలేఖరి క్యాండిస్ ఓవెన్స్ కూడా ట్రంప్ సామర్ధ్యం పైన అనుమానాలు వ్యక్తం చేసింది. కొంతమంది మానసిక వైద్యులు సైతం ట్రంప్ మానసిక ఆరోగ్యం గురించి అనుమానాత్మక విశ్లేషణలతో పత్రికల్లో ఆర్టికల్స్ ప్రచురించారు.

డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ను ప్రశ్నార్ధకం చేసిన అంశాల్లో కొన్ని:

  • ఇరాన్ నాగరికతను భూగోళం గురించి అంతర్ధానం అయ్యేలా బాంబు, మిసైళ్లతో దాడి చేస్తానంటూ ప్రమాదకరంగా ప్రకటించటం.
  • తనను తాను జీసస్ గా గుర్తిస్తూ తాను దేవదూతగా వెలిశాను గనుక తన ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించలేరన్న అర్ధంలో సోషల్ మీడియా (ట్రూత్ సోషల్) లో పోస్ట్ పెట్టడం
  • తాను జీసస్ తో పోల్చుకోవటాన్ని విమర్శించిన పోప్ లియో XIV తో పోట్లాటకు దిగటం (ఆ తర్వాత ఈ పోస్ట్ తొలగించబడింది); “నేరాలను అరికట్టడంలో బలహీనుడు, విదేశీ విధానంలో విఫలుడు” అని పోట్ ని తిట్టిపోయటం
  • మార్చి 26, 2026 తేదీన జరిగిన కేబినెట్ మీటింగ్ లో ట్రంప్ ఉన్నట్లుండి చర్చను షార్పీ పెన్నుల మీదికి మళ్లించి వైట్ హౌస్ లో 1000 డాలర్ల పెన్నుల స్థానంలో షార్పీ పెన్నుల ఖరీదుపై బేరాలాడి వెల తగ్గించి ప్రవేశ పెట్టడం ద్వారా వైట్ హౌస్ ఖర్చుల్ని తగ్గించానని గొప్పలు చెప్పటం, ఆ తర్వాత తమకు, ట్రంప్ కు మధ్య అలాంటి చర్చ జరగలేదని షార్పీ కంపెనీ యజమాని స్పష్టం చెయ్యటం
  • మెడల్ ఆఫ్ ఆనర్ సమావేశం జరుగుతుండగా “నేను వైట్ హౌస్ ను అత్యంత అందమైన సరికొత్త బంగారం కర్టెన్లతో అలంకరించాను. వైట్ హౌస్ ఇప్పుడు ఎంతో అందంగా ఉంది, మీరు గమనించారా?” అని చెప్పటం మొదలు పెట్టాడు.

డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తనను ఒక్క డెమొక్రాట్ రాజకీయ నాయకులే కాకుండా సొంత పార్టీ వారు, మాగా అనుచరులు సైతం తప్పు పట్టడం ఇటీవల కాలంలో పెరిగింది. రిటైర్ అయిన మిలటరీ జనరల్స్, రాయబారులు, విదేశీ అధికారులు అందరూ ట్రంప్ కు పిచ్చి పట్టిందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఉదాహరణకి జార్జియా మాజీ హౌస్ సభ్యులు మెర్జోరీ టేలర్ గ్రీన్ 25వ రాజ్యాంగ సవరణను ప్రయోగించి డొనాల్డ్ ట్రంప్ ను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేసింది. ఇరాన్ నాగరికతను భూమి నుండి తుడిచేస్తానని చెప్పటం కేవలం అలంకారప్రాయ ప్రసంగం కాదని, అది మతి భ్రమించి చేసిన ప్రకటన అని స్పష్టం చేసిందామె.

Marjorie Taylor Grene, Tucker Carson and Donald Trump in 2022

మరో ప్రఖ్యాత మితవాద రాజకీయ విలేఖరి క్యాండీస్ ఓవెన్ ట్రంప్ ను “సామూహిక హత్యాకాండను ప్రబోధిస్తున్న పిచ్చివాడు” గా అభివర్ణించింది. ఇన్ఫో వార్స్ వెబ్ పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ అలెక్స్ జోన్స్ ఐతే “పిచ్చి వాగుడు చూస్తే ఆయన మెదడు పని చేయటం మానేసినట్లు అర్ధం చేసుకోవచ్చు” అని తేల్చేశాడు. వీళ్ళంతా నిన్నటి వరకు ట్రంప్ మద్దతుదారులే కావటం గమనార్హం.

ట్రంప్ మొదటి అధ్యక్ష పదవి కాలంలో (2016-20) వైట్ హౌస్ లాయర్ గా పని చేసిన జిమ్ ఏకోస్టా, “ట్రంప్ అర్ధరాత్రి సోషల్ మీడియాలో చేసే పోస్టులు, ఉన్నట్టుండి చేసే వ్యాఖ్యలను బట్టి ఆయన మతి భ్రమణ స్థాయిని తెలియజేస్తాయి” అని వ్యాఖ్యానించగా, వైట్ హౌస్ మాజీ ప్రెస్ సెక్రటరీ స్టెఫనీ గ్రిషమ్ “ఆయన ఆరోగ్యం క్షీణించిందని స్పష్టంగా తెలుస్తున్నది” అని వ్యాఖ్యానించింది.

“వీళ్ళందరికి ఒకటే కామన్ లక్షణం ఉన్నది, అది ‘అతి తక్కువ ఐ.క్యూ'” అని తన విమర్శకులను సుదీర్ఘ పోస్ట్ ద్వారా ట్రంప్ తిట్టి పోశాడు. వాళ్ళంతా స్టుపిడ్ జనం. ఆ సంగతి వాళ్ళ కుటుంబాలకి కూడా తెలుసు. ఇంకా అందరికీ తెలుసు… వాళ్ళు నట్ జాబ్స్, ట్రబుల్ మేకర్స్. ఫ్రీ పబ్లిసిటీ కోసం ఏమైనా అంటారు” అని వాళ్ళని దూషించాడు తప్ప వాళ్ల ఆరోపణలు ఎలా తప్పో స్థిరమైన ధోరణితో చెప్పలేకపోయాడు.

80 సంవత్సరాల వయసుకు చేరువౌతున్న ట్రంప్, తన ముందరి అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ ను ఎప్పుడూ దూషించే వాడు. బైడెన్, డిమెన్షియా తో బాధపడుతున్నట్లు ఆయన మాటలు కాకుండా ఆయన ప్రవర్తనే తెలియజేసింది. విలేఖరుల సమావేశంలో మాటలు ఆపేసి శూన్యం లోకి చూడటం, వెళ్లవలసిన దారిలో కాకుండా వ్యతిరేక దిశలో శూన్యంలో నడుస్తున్నట్లు నడవటం, చెప్పాల్సిన మాటలు మర్చిపోవటం, అర్ధం కానీ మాటలతో సణుగుతూ ఉండటం… ఇవన్నీ ఆయన వృద్ధాప్యపు డిమెన్షియాతో బాధపడుతున్నట్లు స్పష్టం చేసినప్పటికీ రెండో సారి అధ్యక్ష పదవి పోటీ నుండి వైదొలిగేందుకు తిరస్కరించాడు. చివరికి బారక్ ఒబామా లాంటి వాళ్ళు ‘పోటీ నుండి తప్పుకోవటం ఉత్తమం’ అని సలహా ఇచ్చారు కూడా. డెమోక్రటిక్ పార్టీ పెద్దలు ఆయన్ను బలవంతంగా పోటీ నుండి తప్పించాల్సి వచ్చింది.

ట్రంప్ ప్రవర్తన, ఆయన ప్రకటనలు బైడెన్ తరహాలో కాకున్నా మెంటల్ బ్యాలన్స్ తప్పిన వ్యక్తిగా పలువురు పరిగణిస్తున్నారు. ట్రంప్ కాగ్నిటివ్ డిక్లైన్ తో ఉన్నాడని, డిమెన్షియా తో బాధపడుతున్నాడని డెమోక్రటిక్ పార్టీ ఆయన్ను తీవ్రంగా విమర్శిస్తున్నది. సెనేట్ మైనారిటీ నాయకుడు చక్ షూమన్ ట్రంప్ ను “తీవ్ర స్థాయిలో జబ్బు పడ్డ మనిషి” అని అభివర్ణించాడు.

ఇరాన్ విషయంలో ట్రంప్ చేసిన ప్రకటనలు వాస్తవ విరుద్ధంగా ఉంటూ వచ్చాయి. జరగని ఘటనలు జరిగినట్లుగా, జరిగినవి జరగనట్టుగా చెప్పటంతో ఆయన ఏం చెబుతున్నాడో ఎవరికీ తెలియని పరిస్ధితి ఏర్పడింది. ఉదాహరణకి “ఇరాన్ నూతన అధ్యక్షుడు గత అధ్యక్షుడి కంటే తక్కువ తీవ్రవాది, మెరుగైన ఇంటలిజెంట్” అని ఓసారి చెప్పుకొచ్చాడు. కానీ విషయం ఏమిటంటే యుద్ధం మొదలైనప్పుడు, ఇప్పుడు అదే అధ్యక్షుడు ‘మసౌద్ పెజెష్కియాన్’ కొనసాగాడు.

బహుశా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయితోల్లా మొజ్తాబా ఖమెనీ గురించి మాట్లాడుతున్నాడేమో కొందరు చెప్పబోయారు. అదే నిజం అనుకుంటే పాత సుప్రీం లీడర్ కుమారుడే కొత్త సుప్రీం లీడర్ గా ఎంపిక కావటం ఒక విషయం అయితే ఆయన తన తండ్రి తో పోల్చితే గట్టి హార్డ్-లైనర్ అని అందరికీ తెలిసిన విషయం. అంటే ఆయన తండ్రి పశ్చిమ దేశాలతో చర్చలకు, సర్దుకు పోయే ధోరణికి ప్రాధాన్యం ఇచ్చాడు. ఆయన కుమారుడు అమెరికా, పశ్చిమ దేశాలతో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలన్న ధోరణిని కనబరుస్తున్నాడు.

2017 సం లో 27 మంది సైకియాట్రిస్టులు ట్రంప్ మానసిక ఆరోగ్యాన్ని విశ్లేషిస్తూ ఒక పుస్తకాన్ని ప్రచురించారు. దాని పేరు, “The Dangerous Case of Donald Trump”. ఆ 27 మందిలో కొందరు సైకియాట్రిస్టులు కాగా కొందరు సైకాలజిస్టులు, ఇంకొందరు ఇతర తరహా మానసిక ఆరోగ్య నిపుణులు. ట్రంప్ మానసిక అనారోగ్యం అమెరికాకు తీవ్ర నష్టం తెస్తుందని ఆ పుస్తకంలో వాళ్ళు హెచ్చరించారు.

2025 లో ఈసారి 50 మంది మానసిక ఆరోగ్య నిపుణులు అదే పుస్తకాన్ని కొత్త వివరాలు, పరిణామాలతో అప్ డేట్ చేసి పునః ప్రచురించారు. “The Much More Dangerous Case of Donald Trump: 50 Psychiatrists and Mental Health Experts Warn Anew” అన్న టైటిల్ తో కొత్త పుస్తకం వెలువడింది. ట్రంప్ వంశంలో డిమెన్షియా వ్యాధి వంశపారంపర్యంగా వస్తున్నదని, డొనాల్డ్ ట్రంప్ లో ఆ లక్షణాలు ప్రస్ఫుటంగా ఉన్నాయని కొత్త పుస్తకంలో వారు తేల్చారు. “వ్యాధి మరింత ముదిరినట్లుగా కనిపిస్తున్నది” అని వారు హెచ్చృంచారు.

ఒక్క రాజకీయ నాయకులు, డాక్టర్లు మాత్రమే కాదు, అమెరికా ప్రజలు కూడా ట్రంప్ సామర్ధ్యం పైన అనుమానాలు కలిగి ఉన్నారు. “ఒక అధ్యక్షుడుగా దేశాన్ని సమర్ధవంతంగా పాలించగల మానసిక సామర్ధ్యం ట్రంప్ కి లోపించింది అని మెజారిటీ అమెరికా ప్రజలు భావిస్తున్నట్లు ఒక సర్వేలో తేలింది.

ట్రంప్ సైకోసిస్ మన అతి పెద్ద జాతీయ ఎగుమతి అని న్యూయార్కర్, డైలీ బీస్ట్ పత్రికలు అభివర్ణించటం బట్టి ట్రంప్ పైన అమెరికా అవగాహన ఏమిటో తెలుస్తున్నది.

అమెరికా ఇప్పటికీ ప్రపంచ రాజకీయ, ఆర్ధిక, వాణిజ్య పరిణామాలను ప్రభావితం చేస్తున్నది. కనుక అమెరికా అధ్యక్షుడి పనితనం, సామర్ధ్యం తప్పనిసరిగా ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే వ్యవహారం. ఇరాన్ లాంటి శక్తివంతమైన దేశంతో వ్యవహరించే విషయంలో తెలివిగా ఉండనట్లయితే ఏ దేశానికైనా నష్టకరమే.

వ్యాఖ్యానించండి