భారత ఇస్లాంను దురాక్రమిస్తున్న వహాబీయిజం


Anti-Wahhabi rally -Delhi

Anti-Wahhabi rally -Delhi

భారత ముస్లిం మత వ్యవస్ధ క్రమంగా వహాబీయిజం చేతుల్లోకి వెళ్తోందని, దీనిని అరికట్టకపోతే విపరిణామాలు తప్పవని ముస్లిం పెద్దలు స్పష్టం చేస్తున్నారు. భారతీయ సంస్కృతిలో భాగంగా కొనసాగుతూ వచ్చిన భారత ఇస్లాం ను వహాబీయిజం దురాక్రమిస్తోందని, తద్వారా విద్వేష బీజాలు నాటుతూ ఉగ్రవాద భావాలను పెంపొందిస్తున్నదని ఉత్తర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ సూఫీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సౌదీ అరేబియా పెంచి పోషిస్తున్న వహాబీ ముస్లిం టెర్రరిజం ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాల్లో విధ్వంసం సృష్టిస్తున్న నేపధ్యంలో వారి ఆందోళన ఆధారహితం ఏమీ కాదు.

ఆల్ ఇండియా ఉలేమా అండ్ మాషేఖ్ బోర్డ్ (AIUMB) జాతీయ ప్రధాని కార్యదర్శి సయ్యద్ బాబర్ అష్రాఫ్ ప్రకారం వహాబీయిజం క్రమంగా భారత ఇస్లాంను తన చేతుల్లోకి తీసుకుంటోంది. సంఖ్యాపరంగా అతి తక్కువగానే ఉన్నప్పటికీ వివిధ ముస్లిం మతాధికార వ్యవస్ధలను ఆక్రమించడం ద్వారా దేశంలోని ముస్లిం మత వ్యవహారాలలో పైచేయి సాధిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత ముస్లింల సమస్యలను వహాబీ శక్తులు హైజాక్ చేశాయని, పరిస్ధితి తీవ్రతను గుర్తించని వరుస కేంద్ర ప్రభుత్వాలు వారికే మద్దతు ఇస్తుండడంతో సమస్య తీవ్రం అవుతోందని ఆయన చెప్పారు.

“వక్ఫ్ బోర్డ్ లాంటి ముస్లిం సంస్ధలు వహాబీయిజాన్ని ప్రోత్సహించే అతి పెద్ద ఉపకరణాలుగా మారిపోయాయి. భారత ప్రభుత్వం ఈ సంగతిని అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రపంచవ్యాపితంగా చెలరేగిన ఉగ్రవాదానికి వహాబీయిజమే కారణం అన్న సంగతిని వారు మర్చిపోతున్నారు” అని సయ్యద్ బాబర్ అన్నారని ది హిందు తెలిపింది. తాను అనేక సంవత్సరాలుగా వహాబీ దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్నాననీ కానీ తమకు మద్దతు ఇచ్చేవారే లేకపోయారని సయ్యద్ బాబర్ వాపోయారు.

Syed Babar Asraf

Syed Babar Asraf

వహాబీ శక్తులకు సౌదీ అరేబియా నుండి పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని సయ్యద్ బాబర్ చెప్పడం గమనార్హం. సౌదీ పెట్రో డాలర్లను భోంచేసిన వహాబీ శక్తులు సహజంగానే తమ యజమానుల లక్ష్యాలను నెరవేర్చడానికే కృషి చేస్తున్నారని బాబర్ తెలిపారు. “భారతీయ ఇస్లాం ఐడెంటిటీని వహాబీలు లాగేసుకున్నారు. దేశంలోని ముస్లిం వ్యవహారాలను వారి చేతికి అప్పగించేశారు. ఈ శక్తులకు దేశంలోని 90 శాతం ముస్లింలతో ఎటువంటి సంబంధమూ లేదు” అని బాబర్ స్పష్టం చేశారు.

మహమ్మద్ ఇబ్న్ అబ్ద్ ఆల్-వహాబ్ (18వ శతాబ్దం) అనే ముస్లిం బోధకుడి పేరుమీద పుట్టినదే వహాబీయిజం. సౌదీ రాజుల మద్దతుతో ప్రతిపాదించబడిన వహాబీయిజం పరిశుద్ధమైన ఇస్లాంను ప్రబోధిస్తుంది. ఒరిజినల్ ఇస్లాం లోకి అనేక వైకల్యాలను జోడించారని, వాటిని తొలగించి ఇస్లాంను పరిశుద్ధం చేయాలని ఇది ప్రబోధిస్తుంది. విగ్రహారాధన (మసీదుల నిర్మాణం లాంటివి)కు వీరు వ్యతిరేకం. (కానీ ఇండియాలో మసీదుల ఆదాయం నుండే వీరు బతుకుతున్నారని సయ్యద్ బాబర్ ఆరోపణ.) సలాఫిజం అన్నా వహాబీయిజం అన్నా దాదాపు ఒకటే. కాకపోతే సలాఫీయిజం కంటే వహాబీయిజం మరింత కఠోరమైన ఇస్లాం ఆచరణను ప్రబోధిస్తుందని చెబుతారు. అరేబియా రాజ్యాల్లో ఇస్లాంను సంస్కరించడానికి బయలుదేరిన వహాబీయిజం ఆ పేరుతో మరింత కరకు పద్ధతులను, ఆచరణను అమలు చేయడానికి పూనుకుంది. సున్నీ-షియా పరంగా చూస్తే వహాబీయిజం సున్నీ తెగ కిందికి వస్తుంది. వహాబీయిజంలో సంగీతం, నాట్యం, చదరంగం, పేకాట, చిత్రకళ, నాటకాలు వేయడం, మద్యం, పొగ ఇత్యాదివన్నీ నిషిద్ధం. స్త్రీల విషయంలో అయితే మరింత కఠినంగా వ్యవహరిస్తారు. వాళ్లు వాహనాలు కూడా నడపకూడదు. ఇలాంటి సూత్రాలతో నడిచే మతాచరణ ప్రజలను ఎంతగా హింసిస్తుందో వేరే చెప్పనవసరం లేదు. భారత దేశంలో హిందూ సంస్కృతీ పరిరక్షకులకు చట్టపరమైన ఆమోదం లేదు గానీ సౌదీలో ఇస్లాం పరిరక్షకులకు చట్టం ఆమోదం ఉంది.

సీమాంతర ఉగ్రవాదం పేరుతో ఎప్పుడూ పాకిస్ధాన్ ను తిట్టిపోసే భారత పాలకులు పాకిస్ధాన్ కు కూడా ప్రధాన మద్దతుదారు, నిధుల సరఫరాదారు సౌదీ అరేబియాయే అన్న సంగతిని విస్మరిస్తారు. ప్రపంచంలో ఏ మూల ముస్లిం ఉగ్రవాదం చెలరేగినా వారికి సౌదీ అరేబియా మద్దతు తప్పనిసరి. రష్యాలో చెచెన్ ఉగ్రవాదం దగ్గరి నుండి ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, అమెరికా తదితర అన్నీ ఖండాలలోనూ వహాబీ ఉగ్రవాదం అడుగు పెట్టని చోటు లేదు. అలాంటి వహాబీ ప్రోత్సాహక దేశం అయిన సౌదీ అరేబియా, అమెరికాకు అత్యంత నమ్మకమైన మిత్రుడు అన్న సంగతిని విస్మరించలేము.

ముస్లిం ఉగ్రవాదంపై ప్రపంచ యుద్ధం పేరుతో ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లపై దురాక్రమణ దాడులకు తెగబడిన అమెరికా ఉగ్రవాద పోషకులయిన సౌదీ అరేబియా జోలికి మాత్రం వెళ్ళదు. నిజానికి ఇస్లామిక్ టెర్రరిజం అమెరికాకు బద్ధ శత్రువు అన్న ప్రచారమే ఒక మోసం. ఉగ్రవాద కేడర్లు పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా అమెరికాకు వ్యతిరేకంగా సెంటిమెంట్లు కలిగి ఉన్నప్పటికీ వారికి నిధులు అందించే సౌదీ అరేబియా మాత్రం అమెరికాకు అనుంగు మిత్రుడు కావడంలోనే అసలు పరమార్ధాన్ని గ్రహించాలి.

ఇస్లాం టెర్రరిజం అనేది అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలను నెరవేర్చే ఒక ఉపకరణం. ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ నిర్వహించే సాధనం. ఆ విధంగా అది అమెరికాకు వ్యూహాత్మక మిత్రుడు. పైకి కనబడడానికి అమెరికా లక్ష్యాలపై ముస్లిం టెర్రరిస్టులు దాడులు చేస్తున్నట్లు కనిపించినప్పటికీ వారి నిర్వాహకుల అసలు లక్ష్యం ఆ పేరుతో అమెరికా రాయబార, ఆర్ధిక, సైనిక జోక్యానికి తగిన భూమికను ఏర్పాటు చేయడమే. అయితే పులి మీద స్వారీ చేసే అమెరికా ఒక్కోసారి ఆ పులి పంజా దెబ్బలనే తింటుంది. అది అనివార్యం. అప్పుడప్పుడూ అమెరికాపై పంజా విసిరినట్లు కనిపించే ముస్లిం ఉగ్రవాద పులి వాస్తవానికి తన ఉనికి కోసం కూడా ఘర్షణ పడుతున్న క్రమంలోనే ఆ విధంగా చేస్తుందన్న సంగతిని గుర్తించాల్సి ఉంటుంది. 

లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా, మాలి, అల్జీరియా, చెచెన్యా, ఆఫ్ఘనిస్ధాన్ తదితర దేశాల్లో ఆల్-ఖైదా తదితర టెర్రరిస్టు సంస్ధలు నిర్వహించిన, నిర్వహిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలు అంతిమంగా అమెరికా ప్రయోజనాలనే నెరవేర్చిన సంగతిని మరువరాదు. చివరికి న్యూయార్క్ లోని డబ్ల్యూ.టి.సి జంట టవర్లపై జరిగిన దాడులు సైతం అమెరికాకు సరికొత్త ప్రపంచ శత్రువును సృష్టించి పెట్టాయి. జంట టవర్లపై దాడులు జరగడానికి కొద్ది గంటల ముందు సదరు భవనాల నుండి పని చేసే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకుల ఉన్నత స్ధాయి సిబ్బంది హుటా హుటిన ఖాళీ చేసిన సంగతిని పరిశోధనాత్మక జర్నలిస్టులు గతంలో వెల్లడించారు. ఉగ్రవాద దాడుల పర్యవసానంగా ఏర్పడగల షేర్ మార్కెట్ కదలికలను ముందే ఊహించి తదనుగుణంగా కొద్దిమంది ధనిక ట్రేడర్లు పొజిషన్లు తీసుకున్న సంగతిని కూడా వారు వెల్లడి చేశారు. ‘టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం’ పేరుతో అమెరికా తన ప్రపంచాధిపత్య దాహాన్ని తీర్చుకోవడానికి మరో సాకును WTC దాడులు అందజేశాయి.

లేదంటే ముస్లిం ఉగ్రవాదంపై ప్రపంచ యుద్ధం ప్రకటించిన అమెరికా అదే ఆల్-ఖైదా టెర్రరిస్టులతో కలిసి లిబియాలో సెక్యులర్ ప్రభుత్వాన్ని ఎందుకు కూలదోస్తుంది? ఒకవైపు ఆఫ్ఘనిస్ధాన్ లో ఆల్-ఖైదా నేత ఒసామా బిన్ లాడేన్ ను చంపడానికి అర్ధరాత్రి కమెండోల దాడి జరిపించిన అమెరికా మరోవైపు అదే ఆల్-ఖైదాకు ధన, ఆయుధ సాయం అందజేసి సిరియాలో ఎలా మద్దతు ఇస్తుంది. మంచి ఉగ్రవాదులు అని చెబుతూ సిరియా సెక్యులర్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు పోరాడుతున్న ఆల్-నుస్రా ఫ్రంట్ (ఆల్-ఖైదా బ్రాంచి) కు మరిన్ని అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేసేందుకు ఇప్పటికీ అమెరికా పధక రచనా చేస్తోంది. టెర్రరిస్టు బలగాలపై ప్రభుత్వ బలగాలు క్రమంగా పైచేయి సాధిస్తున్న నేపధ్యంలో ట్యాంకు వ్యతిరేక, విమాన వ్యతిరేక రాకెట్ లను సైతం ఆల్-నుస్రాకు సరఫరా చేయడానికి వాషింగ్టన్ లో మంతనాలు సాగుతున్నాయి.

ఈ నేపధ్యంలో AIUMB నేత సయ్యద్ బాబర్ చెప్పిన అంశాల లోతును అవగాహన చేసుకున్నట్లయితే వెన్నులో చలి పుట్టక మానదు. వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు పశ్చిమ బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను నెరవేర్చడానికి మొరాయిస్తే వారిపై వెనువెంటనే ఆందోళనలు, తిరుగుబాట్లు జరగడం, ప్రజాభిప్రాయం పేరుతో అమెరికా, ఐరోపాలు వారికి పూర్తి మద్దతు, అండదండలు అందించడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈజిప్టు, లిబియా, ట్యునీషియా, సిరియా, ఉక్రెయిన్ తదితర ఉదాహరణలు ఆ కోవలోనివే. భారత దేశంలో వహాబిల అనుచరగణం పెరిగితే వాళ్ళు నేరుగా సౌదీ చెప్పుచేతల్లో నడుస్తారు. సౌదీ అరేబియాయేమో అమెరికా ప్రయోజనాలు నెరవేర్చడంలో ముందుంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో నరేంద్ర మోడి/బి.జె.పి ప్రభుత్వం ‘హిందూ జాతీయవాదం’ పేరుతో ఏ మాత్రం తోక ఝాడించినా (అలాంటి అవకాశాలు దాదాపు లేవనుకోండి!) వహాబీలు ఆటోమేటిక్ గా క్రియాశీలకం అవుతారనడంలో సందేహం లేదు. లేదా రానున్న కొత్త ప్రభుత్వం అమెరికాకు అనుకూలంగా దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే, వాటికి ప్రజా వ్యతిరేకత ప్రబలినట్లయితే అలాంటి ప్రజాందోళనలను పక్కదారి పట్టించడానికి కూడా వహాబీ టెర్రరిజం అక్కరకు వస్తుంది.

ముస్లిం టెర్రరిజం ప్రధాన పోషకులు పశ్చిమ సామ్రాజ్యవాద రాజ్యాలే. కాబట్టి దేశంలో వహాబీ టెర్రరిజం కొత్త చిగురు తొడిగితే దానికి మూలాలు పశ్చిమ సామ్రాజ్యవాద ప్రయోజనాలలో మాత్రమే దొరుకుతాయి. అందుకు భిన్నంగా సీమాంతర ఉగ్రవాదం అంటూ చీకట్లో తవుళ్లాడితే మనకు మిగిలేది పొరుగు దేశాలతో అనవసర శత్రుత్వమే.

6 thoughts on “భారత ఇస్లాంను దురాక్రమిస్తున్న వహాబీయిజం

  1. wahabis are those who strictly follows quran, hadiths but strictly opposes any deviation from it, they have long run enmity with shias, ahmadiyas etc sects because they dont follow quran straightly but considers quran as sacred. wahabis = perfected sunnis = genuine muslims. all other muslims are perverted

  2. yes there is no doubt , if bjp tries to establish hindu rashtra wahabis will start civil wars in india. they occupied many influential positions in political arena, haj houses, SIMI, PFI like organizations, they have direct links with saudi , isi. They are prime force behind fake currency rotation, illegal arms (recently in meerut riots few muslim youngsters attacked with guns but not routine stone pelting in riots), they are economically sound due to funds acquired from saudi and fake currency. moreover they hate indian muslims (excluding strict sunnis) because indian muslims often resembles infidels because they goto durgas and worships idols where few hindus (infidels) too comes , that is shirk (polytheism) to wahabis, shirk of any form is offence to islam and particularly wahabis cant bear such things. yes wahabis (genuine muslims) are very cruel and dangerous.

    according to wahabis their allegiance is to caliphate / muslim nations i.e dar-ul-islam (abode of islam) but not dar-ul-harb (abode of war). their agenda is to convert abode of war (like india, usa, london etc) to abode of islam (saudi, pakistan etc ). they can easily influence fellow muslims to instigate war on nation!!!, to do civil wars, to do genocide, to kill kafirs…..

    next coming govt should atleast stop fake currency and grab illegal arms from wahabis, and their associated branches like pfi

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s