అద్భుత విజయం సాధించిన ఇరాన్ ప్రతిఘటన!


Commuters ride past a digital screen as the US and Iran hold peace talks in Islamabad on April 11, 2026. American and Iranian officials were holding face-to-face talks in Pakistan on April 11, the most significant since the 1979 Islamic revolution as the foes try to end a war that plunged the Middle East into violence and rocked the world economy. (Photo by Farooq NAEEM / AFP)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలలో ఉన్నది మెదడా లేక ఇంకేమన్నా పదార్ధం పెట్టుకున్నాడా అన్నది తెలియక ప్రపంచం సతమతం అవాల్సిన పరిస్ధితి దాపురించింది. ట్రంప్ లాంటి మనిషి ఇంకోసారి ఏ దేశానికైనా అధ్యక్షుడుగా ఎన్నిక కాకుండా అన్ని దేశాల ప్రజలు శపధం చేయాల్సిన అత్యవసర పరిస్ధితి వచ్చి పడింది.

హోర్ముజ్ జలసంధి ని తెరిచే విషయంలో నిన్నటి వరకు ఇరాన్ ని బెదిరిస్తూ వచ్చాడు డొనాల్డ్ ట్రంప్! “ఓపెన్ ద ఫ_ _ హోర్ముజ్ యూ బాస్తర్డ్స్!” అని బూతులకు సైతం లంకించుకున్నాడు. ఈ రోజేమో హోర్ముజ్ జలసంధి గుండా చమురు, గ్యాస్ రవాణా కాకుండా మే అడ్డుకుంటాం” అని ప్రకటించాడు. ప్రకటించటమే కాకుండా హోర్ముజ్ రవాణా పైన బ్లాకేడ్ విధించాల్సిందిగా తన మిలటరీకి ఆదేశాలు సైతం ఇచ్చేశాడు.

డొనాల్డ్ ట్రంప్ సొంత సామాజిక మాధ్యమం ఐన “ట్రూత్ సోషల్” లో తన ఆదేశాలను, వాగుడును పోస్ట్ చేస్తుంటాడు. అవటానికి దాని పేరు “ట్రూత్” సోషల్ అయినప్పటికీ పొద్దున లేచింది మొదలు పచ్చి అబద్ధాలను అందులో రాస్తుంటాడు. ట్రంప్.

“హోర్ముజ్ జల సంధి ని తెరుస్తానని ఇరాన్ ఒట్టు వేసింది. కానీ తెరవటంలో ఉద్దేశ పూర్వకంగా విఫలం అయింది. తద్వారా ప్రపంచం అంతా అనేక మంది ప్రజలకు, దేశాలకు ఆందోళన, స్థాన భ్రంశం, బాధ కలుగ జేస్తున్నది…

“…వారు హామీ ఇచ్చినట్లుగా ఈ అంతర్జాతీయ సముద్ర జలాలను వేగంగా ట్రాఫిక్ కోసం తెరవాలి. పుస్తకంలో ప్రతి ఒక్క (అంతర్జాతీయ) చట్టాన్ని వారు ఉల్లంఘిస్తున్నారు….

“…ఇస్లామాబాద్ చర్చల్లో ఏం జరిగిందో మా ప్రతినిధులు ఉపాధ్యక్షుడు జె డి వాన్స్, స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ప్రధాని షెహ బాజ్ షరీఫ్ లు నాకు చెప్పారు. వాళ్లు అత్యంత ప్రముఖమైన వ్యక్తులు.

“ఇండియాతో జరిగిన భయంకరమైన యుద్ధంలో కనీసం 30 నుండి 50 మిలియన్ల మంది ప్రాణాలను నేను కాపాడినందుకు వాళ్లు నాకు ప్రతి రోజూ కృతజ్ఞతలు చెబుతూనే ఉంటారు. వారి మాటలు వినటం నాకు చాలా ఇష్టం. వారి ద్వారా ఎంతటి భారీ మానవత గురించి నాకు తెలిసిందో మాటల్లో చెప్పటం చాలా కష్టం!

“… ఇరాన్ తన అణు ఆశయాలను వదులుకోవటానికి సిద్ధంగా లేదు. ఎన్ని విధాలుగా చూసినా, మా మిలటరీ ఆపరేషన్ ని కొనసాగించటం కంటే మేము అంగీకరించిన అంశాలు ఎంతో ఉత్తమమైనవి, మెరుగైనవి. మా ముగ్గురు ప్రతినిధులు ఈ చర్చల సందర్భంగా ఇరాన్ ప్రతినిధులు మహమ్మద్-బఘర్ ఘలీబాఫ్, విదేశీ మంత్రి అబ్బాస్ ఆరాఘ్చి, ఆలీ బాఘెరీ లు మంచి స్నేహితులుగా మారారు…

“… అయినా అదేమీ లెక్కలోకి రాదు. ఎందుకంటే నేను మొదటి నుండి చెబుతున్నట్లు ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం నిర్మించటానికి వీలు లేదు.

“… అనేక అంశాల్లో అంగీకారానికి వచ్చాము. కానీ ఒక్క అంశం లోనే వారు మొండి పట్టు పట్టారు, అది న్యూక్లియర్ అంశం.

“ఇక హోర్ముజ్ జలసంధి లోనికి ప్రవేశించే, లేదా బైటికి వచ్చే అన్ని నౌకల పైనా తక్షణమే అమలులోకి వచ్చే విధంగా బ్లాకేడ్ (దిగ్బంధనం) విధిస్తున్నాం. ప్రపంచంలో అత్యంత నైపుణ్యం కలిగిన అమెరికా నావికా బలగాలు ఈ బ్లాకేడ్ ను అమలు చేస్తాయి…

“అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఎలాంటి నౌక ఐనా సరే, ఇరాన్ కి టోల్ ట్యాక్స్ కట్టి ఉంటే గనక ఆ నౌక సముద్ర జలాల్లో ప్రయాణించ కుండా అడ్డుకోవాలని నేను మా నావికా బలగాలకు ఆదేశాలిచ్చాను. ఇరాన్ కు చట్ట విరుద్ధంగా టోల్ చెల్లించిన ఏ నావ ఐనా సరే అంతర్జాతీయ సముద్ర జలాల్లో ప్రయాణించటానికి వీలు లేదు…

“మా పైన కాల్పులు జరిపే, లేదా శాంతియుతంగా ప్రయాణించే నౌకలపై కాల్పులు జరిపే ఇరానియన్లను ఎగిరి వెళ్ళి నరకంలో పడే విధంగా పేల్చివేస్తాము. వారి నేవీ ని నాశనం చేశాం. వారి వాయు బలగాలను నాశనం చేశాం. వారి విమాన విధ్వంసక మిసైళ్లు గానీ, రాడార్లు గానీ ఎందుకు పనికి రావు. వారి నాయకుల్ని చంపేశాం. వారి న్యూక్లియర్ యాంబిషన్ వల్లనే ఇదంతా జరిగింది…

“2:00 PM GMT నుండి బ్లాకేడ్ ప్రారంభం అవుతుంది. మేము లక్ష్యాన్ని లాక్ చేసి ఉంచాం, తుపాకుల్ని పూర్తిగా లోడ్ చేసి ఉంచాం. సమయం వచ్చినపుడు మా మిలటరీ, ఇరాన్ లో ఏ కొంచెం మిగిలి ఉన్నా దాన్ని కూడా పూర్తిగా అంతమొందించేస్తాం!”

అని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశాడు.

ఇందులో అబద్ధాలను ఒక్కొక్కటి పరిశీలిద్దాం.

  1. హోర్ముజ్ జలసంధిని ఎకాఎకిన తెరుస్తాం అని ఇరాన్ హామీ ఇవ్వలేదు. చర్చలకు లోబడి, అన్ని వైపులా కాల్పుల విరమణ జరగాలన్న నిబంధనకు లోబడి, అమెరికా-ఇజ్రాయెల్ లు ఇరాన్ లో సాగించిన విధ్వంసానికి నష్ట పరిహారం నిమిత్తం హోర్ముజ్ జలసంధి లో టోల్ వసూలు చేసే హక్కు ఇరాన్ కలిగి ఉంటుందన్న నిబంధనకు లోబడి హోర్ముజ్ జలసంధిని దశల వారీగా తెరుస్తామని ఇరాన్ చెప్పింది. కానీ జారిగింది ఏమిటంటే ఇజ్రాయెల్ లెబనాన్ పైన మిసైల్ దాడులు కొనసాగించి వందల మంది స్త్రీలు, పిల్లలు, పౌరులను చంపేసింది. లెబనాన్ సీజ్ ఫైర్ పరిధిలోకి రాదని వాదించింది. అయితే ఇజ్రాయెల్ కూడా సీజ్ ఫైర్ పరిధిలో లేదని ఇరాన్ ప్రకటించింది. పైగా కాల్పులు కొనసాగుతున్నందున ఇస్లామాబాద్ కు తమ ప్రతినిధి బృందం రాబోవటం లేదని పాక్ ప్రధాన మంత్రికి కబురు కూడా పంపింది.
  2. ముఖ్య విషయం ఏమిటంటే సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిందని ఇస్లామాబాద్ లో ఏప్రిల్ 10 నుండి చర్చలు జరుగుతాయని పాకిస్తాన్ చేసిన ప్రకటనను డ్రాఫ్ట్ చేసింది అమెరికాయే అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడి చేసింది. ఆ సంగతి బైట పెట్టినందుకు టైమ్స్ పత్రికను తిడుతూ ట్రంప్ ఒక పోస్ట్ కూడా పెట్టాడు.
  3. ఇరాన్, పాకిస్తాన్ ద్వారా అమెరికాకు అందజేసిన 10 అంశాల పత్రం “అంగీకార యోగ్యమైన, చర్చలకు ప్రాతిపదికగా ఉపయోగపడగల పత్రం” అని స్వయంగా డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ లో ప్రకటించాడు. అందులో హోర్ముజ్ జలసంధి ఇరాన్ సార్వహౌమాధికార పరిధిలోకి వస్తుంది అన్నది ఒక అంశం. అలాగే అమెరికా, ఇజ్రాయెల్ తమ దాడుల్లో ఇరాన్ కు కలగజేసిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరటం కూడా 10 అంశాల్లో ఒకటి. అందులో భాగంగానే హోర్ముజ్ గుండా ప్రయాణించే నౌకల నుండి మిలియన్/2 మిలియన్ డాలర్లు టోల్ వసూలుకు అంగీకరిస్తున్నట్లు ట్రంప్ చెప్పాడు. పైగా వసూలైన టోల్ ను అమెరికా, ఇరాన్ లు పంచుకుంటాయని కూడా ట్రంప్ ప్రకటించాడు. ఇప్పుడేమో ఇరాన్ కు టోల్ చెల్లించిన ఏ నౌక నైనా దిగ్బంధిస్తామని ప్రకటిస్తున్నాడు. కనుక అబద్ధం ఆడింది ఇరాన్ కాదు, అమెరికా అధ్యక్షుడే అబద్ధం చెబుతున్నాడు.
  4. టోల్ వసూలు ద్వారా తమకు బాధ, నెప్పి కలుగుతోందని ఏ దేశమూ చెప్పలేదు. పైగా ఇరాన్ కి టోల్ కట్టి మరీ అనేక ఆసియా దేశాలు హోర్ముజ్ గుండా చమురు, గ్యాస్ తెప్పించుకుంటున్నాయి. ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలు అందులో ఉన్నాయి. హోర్ముజ్ ద్వారా ముఖ్యంగా ఆసియా దేశాలకే చమురు, గ్యాస్ లు రవాణా అవుతాయి. “మాకు హోర్ముజ్ తో అవసరం లేదు” అని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా -యుద్ధం జరుగుతున్నప్పుడు- ప్రకటించాడు కూడాను.
  5. అంతర్జాతీయ చట్టాల్లో ప్రతి ఒక్క చట్టాన్ని ఉల్లంఘిస్తున్నది ఇరాన్ కాదు, అమెరికాయే. అమెరికా లాగా మరే దేశమూ -ఒక్క ఇజ్రాయెల్ తప్ప- అంత నడమంత్రంగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించటం లేదు. ఇంటర్నేషనల్ న్యాయస్థానం ఏర్పాటు లో అమెరికా సంతకం చేయలేదు. రష్యాతో జరిగిన మీడియం రేంజ్ క్షిపణి తయారీ నిషేధ ఒప్పందం నుండి ట్రంప్ బైటికి వచ్చాడు. ఐరాస తో సంబంధం లేకుండా అన్ని దేశాల పైనా ఆంక్షలు విధించేది అమెరికాయే. చివరికి ఇండియా పైన కూడా. ఎన్.పి.టి (న్యాక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ) ని ఇరాన్ అక్షరాల అమలు చేస్తుంటే, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అడ్డంగా ఉల్లంఘిస్తున్నాయి. అంతర్జాతీయ సముద్ర జలాల్లో రవాణా ను అడ్డుకునే హక్కు ఏ ఒక్క దేశానికీ లేదు. ఇప్పుడు అదే అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఇరాన్ చమురు రవాణాని అడ్డుకుంటున్నది ఎవరు? అమెరికాయే కదా?
  6. తానే ఇండియా-పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చాను అని ట్రంప్ ఇప్పటికీ అనేక సార్లు చెప్పాడు. ట్రంప్ చేసింది ఏమీ లేదని తామే ఒకరినొకరం మాట్లాడుకుని యుద్ధం విరమించామని ఇండియా ప్రధాని పార్లమెంటులో నేరుగా కాకపోయినా పరోక్షంగా చెప్పాడు. ఐనా ట్రంప్ ఇప్పుడు కూడా తానే చర్చలు జరిపి ఇండియా, పాకిస్తాన్ లు కాల్పులు విరమించేలా చేశానని చెబుతున్నాడు.
  7. “ఇరాన్ అణ్వాయుధం నిర్మించేందుకు అంగీకరించేది లేదు” అని ట్రంప్ ట్రూత్ సోషల్ లో మళ్ళీ రాశాడు. “అణ్వాయుధాన్ని తయారు చేసే లక్ష్యం గానీ, అవసరం గానీ, ఆశయం గాని మాకు లేదు మొర్రో” అని ఇరాన్ ఎన్నో ఏళ్ల నుండి చెవిన ఇల్లు కట్టుకుని మరీ చెబుతున్నది. ఇరాన్ మాజీ సుప్రీం నాయకుడు అయితుల్లా ఖమెనీ అణ్వాయుధ తయారీకి వ్యతిరేకంగా ఫత్వా కూడా జారీ చేశాడు. అలాంటి ఇరాన్ పైన అణ్వాయుధం తయారు చేస్తుందని తప్పుడు ఆరోపణ చేయటం అమెరికా కు తగదు. ఇరాన్ పైన చేస్తున్న ఆరోపణ పచ్చి అబద్ధం.
  8. హోర్ముజ్ పైన బ్లాకేడ్ ఎత్తివేయాలని ట్రంప్ నిన్నటి వరకు డిమాండ్ చేశాడు. ఇరాన్ విధించిన బ్లాకేడ్ వల్ల ప్రపంచ దేశాలు బాధ, నెప్పి ఎదుర్కొంటున్నాయని ఒక పక్క ఆరోపిస్తూ, అదే బాధ, నెప్పి కలిగే విధంగా అమెరికా తాను కూడా బ్లాకేడ్ విధించటం చట్ట సమ్మతం ఎలా అవుతుంది? అమెరికా, ఇజ్రాయెల్ దేశాల నరహంతక దాడులను ఎదుర్కొనే చర్యలో భాగంగా, తన వాణిజ్య ప్రయోజనాలను అమెరికా, ఐరోపా, ఇజ్రాయెల్ దేశాల ఉడుం పట్టు నుండి విడిపించుకుని స్వతంత్రంగా వాణిజ్యం చేసుకుని తమ ప్రజల కష్టాలను తప్పించే కృషిలో భాగంగానే ఇరాన్ హోర్ముజ్ జలసంధి లో టోల్ వసూలు చేసేందుకు నిర్ణయించింది. అమెరికా, ఇజ్రాయెల్ లు యుద్ధం మొదలు పెట్టకపోతే టోల్ వసూలు చేసే పరిస్ధితి ఇరాన్ కు వచ్చేదేనా? అసలు 40 యేళ్లుగా ఇరాన్ పైన రాజకీయ, వాణిజ్య, ఆర్ధిక ఆంక్షలు విధిస్తే ఏ దేశం ఐనా, ఏ అంతర్జాతీయ సంస్థ అయినా కనీసం ఖండించిందా? ఆంక్షల నుండి బైట పడేందుకు ఇరాన్ స్వయంగా ఆయుధాలు తయారు చేసుకుని పెత్తందారు అమెరికా, జాత్యహంకార ఇజ్రాయెల్ లను 40 రోజుల యుద్ధంలో ముప్పు తిప్పలు పెట్టి ఓడించింది. స్వయంగా ధన, మాన, ప్రాణ నష్టాలను ఎదుర్కొంది. అలాంటి ఇరాన్ కి చెందిన సముద్ర జలాల లో నౌకల ట్రాఫిక్ నుండి టోల్ వసూలు చేసే సర్వ హక్కులూ ఇరాన్ కు ఉన్నాయి. అక్కడ వేలు పెట్టే హక్కు అమెరికాకు ఏ విధంగానూ లేదు.
  9. ఇరాన్ నౌకా, వాయు, భూతల బలగాలను అమెరికా సర్వ నాశనం చేసినట్లయితే అమెరికా యుద్ధం ఆపేద్దామని రహస్యంగా ఇరాన్ ను ఎందుకు బ్రతిమాలింది? తానే ఇరాన్ ను బ్రతిమాలి, ఇరానే సీజ్ ఫైర్ కోసం అడుక్కుందని ట్రంప్, అమెరికా యుద్ధ మంత్రి పీటర్ హేగ్ సెత్ లు ఎందుకు ప్రకటిస్తున్నారు? నిర్భయంగా హోర్ముజ్ జలసంధి ని తెరిపించ వచ్చు గదా? జలసంధి తెరవమని ఇరాన్ ని ఎందుకు అడుగుతున్నారు?
  10. హోర్ముజ్ ట్రాఫిక్ నుండి టోల్ వసూలు చేస్తానని ఇరాన్, సీజ్ ఫైర్ ఒప్పందంలో భాగంగా తెలియజేసింది. ఒప్పందానికి ఇరాన్ అంగీకరించే వరకు ఒక మాటా, అంగీకరించిన తర్వాత, కాల్పుల విరమణ జరిగాక ఇంకొక మాట చెబుతున్న అమెరికా పచ్చి అబద్ధాల పుట్ట,
  11. ఇరాన్, హోర్ముజ్ బ్లాకేడ్ చేయటం వలన ప్రపంచ దేశాలు బాధ, నెప్పి ఎదుర్కొంటున్నాయని ఒక పక్క చెబుతూ అమెరికా తాను కూడా బ్లాకేడ్ ఎందుకు విధిస్తున్నది? ఇరాన్ బ్లాకేడ్ వల్ల నెప్పి కలిగితే, అమెరికా బ్లాకేడ్ వల్ల ప్రపంచ దేశాలకు హాయి కలుగుతుందా? ట్రంప్ తలలో మెదడు ఉన్నట్లా లేక మట్టి ఉన్నట్లా?

అసలు సంగతి ఇరాన్ సాధించిన విజయం!

అసలు విషయం ఏమిటంటే హోర్ముజ్ జలసంధి లో ఇరాన్ టోల్ వసూలు చేస్తే, ఆ దేశం పైన అమెరికా, పశ్చిమ ఐరోపా, ఇజ్రాయెల్ దేశాలు అన్యాయంగా 40 సంవత్సరాలకు పైగా అమలు చేస్తున్న ఆంక్షలు, అష్ట దిగ్బంధనం, చుట్టి వేత… ఇలా అన్నీ ఒక్క పెట్టున కూలిపోతాయి. ఇక వాటికి అర్ధం ఉండదు. ఎలాగంటే…

బ్రిటన్ మాజీ రాయబారి, అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుడు అలీస్టర్ కుక్ అంచనా ప్రకారం టోల్ ట్యాక్స్ ద్వారా ఇరాన్ కనీసం సంవత్సరానికి దగ్గర దగ్గర ట్రిలియన్ డాలర్ల వరకు సంపాదించ గలుగుతుంది.

ఇప్పటి దాకా అమెరికా, పశ్చిమ ఐరోపా, ఇజ్రాయెల్ దేశాలు ఒక జైలు లో బంధించినట్లుగా బంధించి ఉంచారు. టోల్ ట్యాక్స్ వలన ఈ బంధనాలు తెగిపోతాయి. ఇరాన్ అభివృద్ధి కాకుండా అమలు చేసిన రాజకీయ, వాణిజ్య, ఆర్ధిక అణచివేత బద్దలై పోతుంది.

యుద్ధంలో ఇరాన్ బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఇరాన్ నాయకత్వం లోని అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక, జాత్యహంకార ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రతిఘటనా కూటమి ఐన ఇరాన్, పాలస్తీనా (హమాస్), లెబనీస్ హిజ్బొల్లా, యెమెన్ (అన్సర్ అల్లా / హుతీ), ఇరాక్ (పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్) దుష్ట కూటమి అమెరికా-పశ్చిమ ఐరోపా-ఇజ్రాయెల్ పైన అద్భుతమైన, చరిత్ర ఎన్నడూ చూసి ఎరుగని విజయం సాధించింది.

ఇరాన్ విజయాన్ని, యుద్ధ కౌశల్యాన్ని, ఎత్తుగడలను చూసి చైనా, రష్యా దేశాలు సైతం ఖంగు తిన్నాయి. ఇరాన్ ఎలాగోలా నిలదొక్కుంటుందని ఆ దేశాలు అంచనా వేశాయి గాని, నిలదొక్కుకోవటమే కాకుండా తమ చుట్టూ అల్లిన విష వలయాన్ని, చుట్టివేత-అణచివేత లాంటి బంధనాన్ని తెంచుకుని బైట పడే పరిస్ధితి సాధిస్తుందని రష్యా, చైనాలు సైతం ఊహించలేదు. దానితో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.

ఇరాన్ తో ఒప్పందానికి రావటం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇరాన్ ను రెండు మూడు రోజుల్లో, మహా అయితే ఒక వారంలో మట్టి కరిపించ వచ్చని, ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చివేసి శాశ్వతంగా తమ పాదాక్రాంతం చేసుకోవచ్చన్న అంచనాతో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టాయి. ఆ మేరకు అమెరికాను నమ్మించటంలో ఇజ్రాయెల్ సఫలం అయింది.

తమ అంచనాలను తారుమారు చేస్తూ 40 రోజుల ఎడతెగని దాడుల తర్వాత కూడా ఇరాన్ నిలబడటమే కాకుండా అమెరికా, ఇజ్రాయెల్ దేశాల పైన మిసైల్, డ్రోన్ లతో దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. అమెరికా దగ్గర ఉన్న మిసైళ్లు, డ్రోన్ లు, మిసైల్ రక్షణ వ్యవస్థలు అన్నీ ఖాళీ అవుతున్నప్పటికీ ఇరాన్ ఇంకా యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నది. చివరికి కాల్పుల విరమణ కోసం అమెరికాయే పాకిస్తాన్ ద్వారా ఇరాన్ ని బ్రతిమాలుకునే పరిస్ధితి వచ్చింది.

పెట్రో డాలర్ అంతానికి ఆరంభం!

అత్యంత ముఖ్యమైన అంశం: డాలర్ ఆధిపత్యానికి నిర్ణయాత్మకంగా గండి కొట్టగల శక్తిని ఇరాన్ సంతరించుకుంది. హోర్ముజ్ జలసంధిని మూసివేసింది అంటే పూర్తిగా మూసివేయలేదు. హోర్ముజ్ గుండా వెళ్ళే రవాణా నౌకలు మిలియన్ డాలర్లను (అలిస్టర్ కుక్ ప్రకారం 2 మిలియన్ డాలర్లు) చెల్లిస్తే వాటికి రక్షణ కల్పించి మరీ సాగనంపింది. అయితే ఈ టోల్ ను యువాన్ లలో చెల్లించాలని ఇరాన్ షరతు విధించటం అమెరికాకు తీవ్రమైన నొప్పి కలిగించే సంగతి.

ఏడాదికి చమురు, గ్యాస్ వాణిజ్యంలో ట్రిలియన్ డాలర్ల మేరకు చెల్లింపులు జరిపితే అది మొత్తం ప్రపంచ చమురు వాణిజ్యంలో నాలుగో వంతుతో సమానం (2024 లో ప్రపంచ చమురు, గ్యాస్ వాణిజ్యం విలువ 4.44 ట్రిలియన్ డాలర్లు). పెట్రో డాలర్ల వల్లనే డాలర్ ఆధిపత్యం సాధ్యపడిందన్న సంగతి గుర్తిస్తే ఇరాన్ వలన డాలర్ పెత్తనం కూలిపోయే పరిస్ధితి ఏర్పడింది. డాలర్ పెత్తనం నశిస్తే ఇక అమెరికా పెత్తనం నశించినట్లే. ఇరాన్ పుణ్యాన ప్రపంచం కాస్త హాయిగా ఊపిరి పీల్చగల పరిస్ధితి దగ్గరయింది.

మరో ముఖ్యాంశం ఏమిటంటే జర్మనీ సెంట్రల్ బ్యాంకు సైతం యువాన్ లలో అంతర్జాతీయ చెల్లింపులు చేసేందుకు సిద్ధపడింది. డాలర్ చెల్లింపులను క్రమంగా తగ్గిస్తోంది. డాలర్ చెల్లింపులను నిరాకరించటం క్రమ క్రమంగా పెంచుతోంది. జర్మనీ ఐరోపా ఆర్ధిక వ్యవస్థకు ప్రధాన ఇంజన్ లాంటిది. ఆర్ధికంగా జర్మనీ ఎటు వైపు వెళ్తే మిగిలిన ఐరోపా దేశాలు మెల్లగా అటే వెళ్తాయి. పైగా నాటో నుండి బైటకు వచ్చేస్తానని అమెరికా ఇప్పటికే చెబుతోంది. ఐరోపా దేశాల పైన కూడా భారీ టారిఫ్ లు విధిస్తూ వారి ముక్కు పిండి వసూలు చేస్తోంది. ప్రపంచ వాణిజ్య బ్యాంకు, దాని సూత్రాలను పక్కన పెట్టి ద్వైపాక్షిక ఒప్పందాలను అమెరికా ముమ్మరం చేసింది. ఫలితంగా జర్మనీ కూడా అందుకు తగిన చర్యలు చేపడుతోంది. అందులో ఒకటి యువాన్ చెల్లింపులను క్రమబద్ధీకరిస్తూ డాలర్ చెల్లింపులను తగ్గించటం!

ఇరాన్ ప్రజల తెగింపు!

ఇరాన్ పైన ఎడతెగకుండా దాడులు చేస్తే ముఖ్యంగా, నాయకులను చంపేసి, మిలటరీ నాయకత్వాన్ని మట్టుపెట్టి ఇరాన్ ప్రజల నివాసాలను (ఇళ్లను) ధ్వంసం చేసి, వారిలో వీలైనంత మందిని మిసైల్ దాడుల్లో చంపేసి, ప్రజా నిర్మాణాలైన రోడ్లు, వంతెనలు, విద్యుత్ ఫ్యాక్టరీలు, నీటి పంపిణీ వ్యవస్థలు, విద్యా-విజ్ఞాన నిర్మాణాలు ఇలా సమస్తాన్ని నామరూపాలు లేకుండా చేస్తే ఇరాన్ ప్రజలు భయపడి పోయి, నీరసించి, శక్తులు కోల్పోయి కాళ్ళబేరానికి వస్తారని, ఇక జరిగింది చాలంటూ షియా ధియాలాజికల్ ప్రభుత్వాన్ని అధికారం నుండి కూల్చివేస్తారని, అమెరికా-ఐరోపా-యూదు రాజ్యాల సో-కాల్డ్ ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణానికి స్వాగతం పలుకుతారని అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ ఐరోపా దేశాలు ఆశించాయి.

ఇది నిజానికి యూదు జాత్యహంకార ఇజ్రాయెల్ పాలకవర్గాలు, అమెరికాలోని జియోనిస్టు సూపర్ ధనిక స్వాములు తయారు చేసిన సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారమే ఇజ్రాయెల్ గాజా లోని సమస్త నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఐనా గాని అక్కడ ప్రజలు హమాస్ నే ఇప్పటికీ నమ్ముకుని ఉన్నారు. ఈ సిద్ధాంతం తోనే దక్షిణ లెబనాన్ లో ప్రజల పైనా, ప్రజా నిర్మాణాల పైనా ఇంకా దాడులు చేస్తున్నది ఇజ్రాయెల్. కానీ దక్షిణ లెబనాన్ లో ప్రజలే హిజ్బొల్లా! ప్రతి ఒక్క యువకుడు ఉర్రూతలూగే ఉత్సాహంతో హిజ్బొల్లా సైనికుడుగా అవతరిస్తాడు. ఒక నాయకుడు హత్యకు గురి అయితే ఆయనకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు చేసి మళ్ళీ యుద్ధానికి సిద్ధం అవుతారు. మరో యువకుడు నాయకత్వ స్థానాన్ని భర్తీ చేయటమే కాకుండా సరికొత్త యుద్ధ ఎత్తుగడలు, వ్యూహాలతో ఇజ్రాయెల్ తో తలపడేందుకు సిద్ధం అవుతాడు.

ఇరాన్ లోనూ అదే జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “ఇక రెండు రోజులు గడువు విధిస్తున్నాం. హోర్ముజ్ జలసంధి తెరిచారా సరే. లేకుంటే ఇరాన్ లోని విద్యా సంస్థలు, విద్యుత్ ఫ్యాక్టరీలను కూల్చేస్తాం, రోడ్లు ధ్వంసం చేస్తాం. రెడీగా ఉండండి. ఇరాన్ నాగరికతను శాశ్వతంగా భూమిపై నుండి తుడిచేస్తాం” అని హెచ్చరిక జారీ చేశాడు. ఆ హెచ్చరిక విని ఇరాన్ ప్రజలు భయపడక పోగా ఇరాన్ లోని అన్ని నగరాలు, గ్రామాలలో జనం వేలు, లక్షలుగా వీధుల్లోకి వచ్చారు.

వీధుల్లోకి రావటమే కాదు, వారి దేశం లోని నగరాల్లో ప్రధాన రోడ్లను నింపేశారు. విద్యుత్ ఫ్యాక్టరీల భవనాల పైనా విద్యా సంస్థల భవనాల పైనా రోడ్ల పైనా నిలబడి అమెరికాకు సవాలు విసిరారు. “రండి! మేము సిద్ధంగా ఉన్నాం! మా పైన బాంబులు వేయండి. మా నాగరికతని అంతం చేస్తారా, చేయండి” అంటూ పెద్ద పెట్టున నినాదాలు ఇచ్చారు. ఈ దృశ్యాలను ట్రంప్, ఆయన అధికార గణం చూసిందో లేదో తెలియదు గానీ ట్రంప్ విధించిన గడువుకు రెండు గంటల ముందే అమెరికా తోక ముడిచింది. పాకిస్తాన్ నేతలకు కబురు పంపాడు ట్రంప్. సంధి ప్రతిపాదనను డ్రాఫ్ట్ చేసి దానిని ఉన్నది ఉన్నట్టు ఇరాన్ కి పంపాలని కోరాడు.

పాకిస్తాన్ ఆ పనే చేసింది. అదే డ్రాఫ్ట్ ని ట్విట్టర్ (ఎక్స్) లోనూ పాకిస్తాన్ పోస్ట్ చేసింది. ఎలాంటి సవరణలు లేకుండా పోస్ట్ చేసింది. దానితో ఆ సందేశం అమెరికా నుండి పాకిస్తాన్ కు పంపినది అని తెలియజేసేలా పై భాగంలో ఉన్న హెడర్ ను తొలగించటంలో పాకిస్తాన్ అధికారులు విఫలం అయ్యారు. దానితో ఈ డ్రాఫ్టింగ్ అంతా అమెరికాదే అని ప్రపంచానికి అర్ధం అయింది. అమెరికాయే ఇరాన్ కాళ్ళబేరానికి వచ్చింది తప్ప సీజ్ ఫైర్ ని ఇరాన్ అడుక్కుంది అన్న అమెరికా వార్ మంత్రి హెగ్ సెత్ ప్రకటన ఒట్టి అబద్ధం అని తేలిపోయింది.

ఈ అంశాల ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే ఇరాన్ ప్రజలే ఇరాన్ ప్రభుత్వానికి బలం. ఏ ప్రజల పైనేతే అమెరికా, ఇజ్రాయెల్ లు నమ్మకం పెట్టాయో, ఆ ఇరాన్ ప్రజలు తమ దేశ నాయకత్వానికి, అమెరికా-ఇజ్రాయెల్ దేశాల 40 యేళ్ళ అణచివేత రాజకీయాలకు లొంగకుండా ఎదిరించి నిలబడ్డ నాయకత్వానికి విబేధాలు పక్కన పెట్టి తమ సంపూర్ణ మద్దతు అందజేశారు.

ఆ విధంగా ఇరాన్, ఇరాన్ ప్రజలు అనే డేవిడ్, అమెరికా-ఇజ్రాయెల్-పశ్చిమ ఐరోపా అనే ఉన్మత్త మదగజం అనే గొలియాత్ తో తలపడి విజయం సాధించారు. ఇప్పటి వరకు సాధించిన విజయం ఒక ఎత్తు అయితే, ఆ విజయాన్ని నిలుపుకోవటం మరొక ఎత్తు. తమ విజయాన్ని నిలుపుకునే క్రమం లోనే ఇరాన్ ప్రభుత్వం ఎత్తులు వేస్తున్నారు. వారి ఎత్తులను ఓడించేందుకు, ఓటమి చివరి అంచు నుండి బైట పడేందుకు అమెరికా-ఇజ్రాయెల్-పశ్చిమ ఐరోపా దుష్ట కూటమి ఇప్పుడు హోర్ముజ్ పైన ఇరాన్ విధించిన బ్లాకేడ్ పైన మరో బ్లాకేడ్ విధించానని చెబుతున్నది.

ఇది ఏ విధంగా పరిణమించనున్నదో పరిశీలించాల్సిన అంశం!

వ్యాఖ్యానించండి