అమెరికాను చుట్టుముట్టిన యుద్ధ వ్యతిరేకత


సిరియాపై దాడికి సిద్ధపడుతున్న ఒబామా ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా అమెరికా ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు. దేశాన్ని తీవ్ర ఆర్ధిక సంక్షోభం లోకి నెట్టిన ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధాలనుండి పాఠాలు నేర్వని పాలకులపై అమెరికా ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజాభీష్టాన్ని గమనించిన అనేకమంది కాంగ్రెస్ సభ్యులు ఒబామా దాడి నిర్ణయానికి మద్దతు ఇవ్వాలా లేదా అన్న విషయంలో ఊగిసలాటలో పడిపోయారు. కాంగ్రెస్ సభ్యుల ఊగిసలాట వైఖరిని గుర్తించిన ఒబామా ప్రభుత్వం సిరియాలో రసాయన దాడి జరిగిందనడానికి రుజువు చేసే వీడియోలను వారికి చూపిస్తున్నారు. అయితే జరిగిన దాడికి సిరియా ప్రభుత్వం కాకుండా సిరియా కిరాయి తిరుగుబాటుదారులే బాధ్యులన్న ముఖ్యమైన అంశాన్ని వారు ఉద్దేశ్యపూర్వకంగా విస్మరిస్తున్నారు.

“ప్రతినిధుల సభ (కాంగ్రెస్), సెనేట్ లలోని అత్యధిక సభ్యులు ఇంకా ఎటూ తేల్చుకోలేదు. అందుకే వారికి మేము వీడియోలు చూపిస్తున్నాము. వారికి అవసరమైన సమాచారం ఇస్తున్నాము” అని అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ ఆదివారం విలేఖరులకు తెలిపాడు. సిరియా దాడికి భారీ వ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో ఒబామా ప్రభుత్వ నాయకులు పెద్ద ఎత్తున పి.ఆర్ కేంపయినింగ్ కి దిగారు. వివిధ వార్తా సంస్ధలకు, టి.వి ఛానెళ్లకు ఒబామా, జాన్ కేర్రీ, చక్ హేగెల్ లు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తద్వారా దాడికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు.

ఐరోపా దేశాల మద్దతు సంపాదించే పనిలో కూడా ఒబామా ప్రభుత్వం నిమగ్నం అయింది. రష్యాలో జరిగిన జి20 సమావేశాల్లో ఇండియాతో సహా అనేక దేశాల నుండి తీవ్ర వ్యతిరేకతను చవి చూచిన ఒబామా/అమెరికా ఐరోపా దేశాలకు నచ్చజెప్పడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అందులో భాగంగా విదేశీ మంత్రి జాన్ కేర్రీ ఐరోపా పర్యటిస్తున్నాడు. ప్యారిస్ లో అరబ్ లీగ్ ప్రతినిధులను కూడా కెర్రీ కలిశాడు. సిరియా దాడికి ఇప్పటివరకు సౌదీ అరేబియా గట్టి మద్దతు ఇస్తున్నట్లు తెలిపిందని ఆయన విలేఖరులకు తెలిపాడు. అయితే ఫ్రాన్సు తప్ప ఐరోపాలోని మరే దేశమూ సిరియా దాడి విషయంలో అమెరికాకు క్రియాశీలక మద్దతు ఇవ్వడానికి ముందుకు రాలేదు. బ్రిటన్ పార్లమెంటు దాడిని తిరస్కరించగా, జర్మనీ తదితర దేశాలు రాజకీయ మద్దతు మాత్రమే ప్రకటించాయి.

సిరియా దాడి విషయమై సోమవారం అమెరికన్ కాంగ్రెస్ లో చర్చ ప్రారంభం కానున్నది. ఈ నేపధ్యంలో అమెరికాలో ప్రజల నిరసనలు ఊపందుకున్నాయి. శనివారం పెద్ద సంఖ్యలో అధ్యక్ష భవనం ముందు వారు నిరసన ప్రదర్శన నిర్వహించారు. న్యూయార్క్, ఇండియానాపొలిస్, లూసియానా, మిచిగాన్ తదితర నగరాల్లోనూ పెద్ద ఎత్తున దాడి వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. కెనడాలోని టొరంటో, ఒట్టావా నగరాల్లోనూ నిరసనలు జరిగాయి. అబద్ధం పునాదిపై నిలబడి అమెరికా ప్రభుత్వం దాడికి దిగుతోందని వాషింగ్టన్ లో పలువురు ప్రదర్శకులు నిందించారు.

“కార్పొరేట్ లాభాల కోసం ఇక యుద్ధాలు వద్దు!”, “పెంటగాన్ (బడ్జెట్) పై కోత పెట్టండి, ఆహార సబ్సిడీలపై కాదు!” అంటూ అమెరికా వ్యాపితంగా జరిగిన ప్రదర్శనల్లో నిరసనకారులు నినాదాలు చేశారు.

కేధలిక్ చర్చి కూడా యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పింది. సిరియాలో ఒక కేధలిక్ నగరంపై ఇస్లామిక్ టెర్రరిస్టులు విరుచుకుపడ్డారన్న వార్తల నేపధ్యంలో చర్చి తన వ్యతిరేకతను తీవ్రం చేసింది. వాటికన్ లో ప్రత్యేక ప్రార్ధనలను పోప్ జాన్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో పదుల వేల పౌరులు పాల్గొన్నారు. “ప్రేమాయుతమైన సిరియాలో, మధ్య ప్రాచ్యంలో, మొత్తం ప్రపంచంలో సమాధానం కోసం, శాంతి కోసం మనమందరం ప్రార్ధనలు చేద్దాం. సమాధానం కోసం, శాంతి కోసం మనమందరం కృషి చేద్దాం” అని పోప్ ప్రకటించాడు.

ప్రజాభిప్రాయం తీవ్ర స్ధాయిలో యుద్ధానికి వ్యతిరేకంగా వ్యక్తం అవుతుండడంతో దాని ప్రభావం కాంగ్రెస్ ఓటింగుపై పడుతుందని ఒబామా ప్రభుత్వం భయపడుతోంది. సిరియా దాడికి మద్దతు కోరుతూ బారక్ ఒబామా మంగళవారం ప్రజలను ఊదేశించి ప్రసంగాస్తారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఎ.బి.సి, సి.బి.ఎస్, ఎన్.బి.సి, ఫాక్స్, పి.బి.ఎస్, సి.ఎన్.ఎన్ తదితర చానెళ్లకు ఆయన ఇంటర్వ్యూ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇవన్నీ కాక అమెరికాలో శక్తివంతమైన ఇజ్రాయెలీ లాబీ కూడా రంగంలోకి దిగుతోంది. ‘అమెరికన్ ఇజ్రాయెలి పోలిటికల్ ఎఫయిర్స్ కమిటీ’ (ఎ.ఐ.పి.ఎ.సి) పేరుతో వ్యవహరించే ఇజ్రాయెలీ లాబీ కాంగ్రెస్, సెనేట్ సభ్యులను కలిసి యుద్ధానికి అనుకూలంగా ఓటు వేయాలని నచ్చజెప్పనున్నారు. ఎ.ఐ.పి.ఎ.సి కి చెందిన కనీసం 250 మంది లాబీయిస్టులు ఈ పనిలో నిమగ్నం అయినట్లు తెలుస్తోంది. ఒబామా అధ్యక్ష ప్రసంగం సైతం ఇజ్రాయెలీ లాబీయే రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇన్ని జరుగుతున్నప్పటికీ సిరియా దాడికి తగిన మద్దతు రావడం ఒకింత కష్టమేనని పత్రికలు చెబుతున్నాయి. అమెరికా పాలకవర్గాలలోని ఒక బలమైన సెక్షన్ యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో యుద్ధంలో కూరుకుపోవడం వలన రష్యా, చైనాలకు బలం పెంచుతూ అమెరికా బలహీనపడడమే తప్ప ప్రయోజనం ఉండదని వారు వాదిస్తున్నారు. ఒబామా, కాంగ్రెస్ లో చారిత్రక ఓటమిని చవి చూడవచ్చని కాంగ్రెస్ మాజీ సభ్యుడు రాన్ పాల్ (ఈయనకే తాను ఓటు వేశానని ఎడ్వర్డ్ స్నోడెన్ తెలిపాడు) జోస్యం చెప్పాడు. కాంగ్రెస్ లో ఈయనకు మంచి పలుకుబడి ఉందని చెబుతారు.

“ఇక్కడ ఒక చారిత్రక ఘటన జరగనున్నదని నేను భావిస్తున్నాను. ఈ ఓటులో (జనం) గెలిచినట్లయితే అనగా సిరియా విషయంలో మిలట్రీ జోక్యానికి అనుకూలంగా ప్రవేశపెట్టే తీర్మానం ఓడినట్లయితే అది చారిత్రకం అవుతుంది. లిబర్టేరియన్ రిపబ్లిక్కులు మరియు డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ల మహా కూటమి ఆవిర్భావం జరిగినట్లవుతుంది” అని రాన్ పాల్ వ్యాఖ్యానించాడని ది హిందు తెలిపింది.

సిరియా పార్లమెంటేరియన్లు అమెరికా చట్ట సభల సభ్యులకు ఒక బహిరంగ విజ్ఞాపన జారీ చేశారు. తమ దేశంపై అమెరికా దాడి చేయకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలని వారు కోరారు. “యుద్ధ పంధా నుండి రాయబార పంధాకు అమెరికాను మళ్లించే శక్తి మీకు ఉంది. కావున నిర్లక్ష్యపూరిత చర్యలకు పాల్పడవద్దని మిమ్మల్ని కోరుతున్నాము” అని వారు తమ విజ్ఞాపనలో కోరారు. ఇరాన్ కూడా తన స్ధాయిలో రాయబార ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి రష్యాతో చర్చలు జరపడానికి సోమవారం మాస్కో బయలుదేరి వెళ్లారు.

వ్యాఖ్యానించండి