ప్రపంచంలోనే అతి భారీ సంఖ్యలో మనుషులు ఒక చోటికి చేర్చే కార్యక్రమంగా ప్రసిద్ధి పొందిన అలహాబాద్ కుంభమేళా ఆదివారం తొక్కిసలాటకు సాక్షిగా నిలిచింది. అలహాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 36 మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది. ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటకు ఫుట్-ఓవర్-బ్రిడ్జి కూలిపోవడం ముఖ్య కారణం. రైల్వే అధికారులు, పోలీసులు, ప్రజలు చెప్పిన వివిధ అంశాలను బట్టి ‘ఒక ప్లాట్ ఫారం మీదికి వస్తుందని ప్రకటించిన రైలు చివరి నిమిషంలో మరొక ప్లాట్ ఫారం మీదికి వస్తుందని’ ప్రకటించడం, ఆ రైలుకోసం ప్రయాణీకులు ఒకరినొకరు నెట్టుకుంటూ ‘ఫుట్-ఓవర్-బ్రిడ్జి’ మీదుగా వేగంగా వెళ్ళే ప్రయత్నం చేయడం, వారిని వరుసలో వెళ్ళే విధంగా చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జి చెయ్యడం, ఈ హడావుడిలో ఒక వ్యక్తి కింద పడిపోవడం, కిందపడిన వ్యక్తి కాలుకి తగిలి కొందరు పడిపోవడం, వారు తగిలి మరికొందరు పడిపోవడం, ఈ తొక్కిడి ధాటికి ఫుట్-ఓవర్-బ్రిడ్జి రెయిలింగ్ కూలిపోవడంతో ఊపిరాడక కొందరు, గాయాల పాలై కొందరు చనిపోయారు.
ఆదివారం హిందూ భక్తులు పుణ్య దినంగా భావించే మౌని అమావాస్య రోజు. ఆ రోజు స్నానం చేస్తే పాప పరిహారం ఇతర రోజుల కంటే ఎక్కువ గ్యారంటీ అని భక్తులు నమ్ముతారని తెలుస్తోంది. దానితో ఒకే రోజు సంగం స్నాన ఘట్టానికి 3 కోట్ల మందికి పైగా చేరుకుని స్నానం చేశారని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. బహుశా ప్రపంచంలో మరే ఇతర ఘట్టంలో ఒకే రోజు ఇంత భారీ సంఖ్యలో ఒకే చోటికి చేరడం జరిగి ఉంటుందా అన్నది అనుమానమే. ఎంతమంది భద్రతా బలగాలను నియమిస్తే అంత మందిని నియంత్రించడం సాధ్యపడుతుంది? స్నాన ఘట్టాల వద్ద తొక్కిసలాట జరగకుండా ఇంతవరకు నివారించ గలిగినందుకు బహుశా సంతోషపడాలేమో.
లాఠీ ఛార్జి చెయ్యడం వల్ల ప్రయాణీకుల్లో అయోమయం ఏర్పడి తొక్కిసలాటకు దారి తీసిందని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. ముందు చెప్పిన ప్లాట్ ఫారం కాకుండా 6 వ నంబర్ ప్లాట్ ఫారం పైకి రైలు వస్తుందని చెప్పడంతో ప్రయాణీకులు పరుగులు పెట్టారని వారిపైన పోలీసులు లాఠీ ఛార్జీ చేశారని వారు తెలిపారు. అయితే ప్రయాణీకులను నియంత్రించడానికి, వరుసలో పంపడానికి పోలీసులు ప్రయత్నించారని రైల్వే అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారు 6 వ ప్లాట్ ఫారం పైనే ఎక్కువమంది పడి ఉండడం గమనార్హం. అప్పటికే 6 వ నెంబర్ ప్లాట్ ఫారంకి ఇరువైపులా రైళ్లు నిలిచి ఉండడంతో ప్రయాణీకుల సంఖ్య అలవికాని స్థాయికి చేరుకుంది. నిజానికి ఆదివారం సాయంత్రం రెండుసార్లు తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. 6 గంటలకు జరిగిన తొక్కిసలాట నుండి ఎలాగో బయటపడిన పోలీసులు మరోసారి ప్రయాణీకులు పరుగులు పెట్టడంతో లాఠీలకు పని పెట్టారు.
చనిపోయినవారిలో అత్యధికులు మహిళలే. 26 మంది మహిళలు చనిపోగా, 8 సంవత్సరాల బాలిక కూడా చనిపోయినవారిలో ఉన్నది. తొక్కిసలాట జరిగిన 2 గంటల వరకు వైద్య సహాయం అందలేదని ప్రజలు ఆరోపించారు. భద్రతా బలగాలు రెండు గంటలు ఆలస్యంగా స్టేషన్ వద్దకు చేరుకున్నారనీ, వారు వచ్చిన తర్వాతే శవాలను, గాయపడిన వారినీ ఆసుపత్రికి తరలించారని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ భారీగా ఉండడం వల్ల భద్రతా బలగాల రాక ఆలస్యం అయిందని అధికారులు కారణం చెబుతున్నారు. సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చనిపోయినవారికి 5 లక్షలు పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా, కేంద్ర ప్రభుత్వం కూడా చనిపోయినవారికి 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష సహాయం ప్రకటించింది.
తొక్కిసలాట పైన ది హిందూ పత్రిక అందించిన ఫొటోలు కింద చూడవచ్చు.
- కుంభ మేళా తొక్కిసలాట 50
- కుంభ మేళా తొక్కిసలాట 57
- కుంభ మేళా తొక్కిసలాట 51
- కుంభ మేళా తొక్కిసలాట 52
- కుంభ మేళా తొక్కిసలాట 53
- కుంభ మేళా తొక్కిసలాట 54
- కుంభ మేళా తొక్కిసలాట 55
- కుంభ మేళా తొక్కిసలాట 56
12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా వార్తలను, ఫొటోలను అంతర్జాతీయ వార్తా సంస్థలు కవర్ చేస్తున్నాయి. యాత్రీకుల కోసం 4000 ఎకరాల స్థలంలో ఒక గుడారాల నగరాన్నే ప్రభుత్వం నిర్మించిందని పత్రికలు తెలిపాయి. మహిళలు, పిల్లలు, పురుషులతో జన సముద్రంగా మారిన అలహాబాద్ గంగా తీరం అంతర్జాతీయ భక్తులను కూడా ఆకర్షిస్తోంది. వారందరి కోసం 18,000 అడుగుల పొడవునా నదీ తీరం వెంబడి 22 స్నాన ఘట్టాలను నిర్మించారు. 13 తరగతులకు చెందిన అఘోరాలకు మాత్రమే కొన్ని స్నాన ఘట్టాలను కేటాయించినట్లు తెలుస్తోంది. ఎవరు ముందు స్నానం చేయాలన్న విషయంలో వీరి మధ్య గతంలో హింసాత్మక ఘర్షణలు జరిగాయి. తాజా కుంభమేళా ఏర్పాట్లు జరుగుతుండగానే ఈ అఘోరాలు పత్రికల్లో ప్రకటనల యుద్ధం సాగించడం, చీలికకు గురయిన ఒక తరగతి అఘోరాలు పరస్పరం జగడం ఆడుకుని కుంభమేళాను బహిష్కరిస్తామని కూడా హెచ్చరించడం కొద్ది వారాల క్రితం నాటి మాట. బోస్టన్ పత్రిక అందజేసిన కుంభమేళా ఫొటోలను కింద చూడవచ్చు.