
–
పార్లెమెంటు వద్దకు నిరసనకారులు, కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో వేల సంఖ్యలో పార్లమెంటు వద్దకు తరలి వచ్చిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం పార్టీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ప్రభుత్వ ప్రతినిధిగా కేంద్ర మంత్రి జె పి నడ్డా, సిజెపి పార్టీ ప్రతినిధులైన సౌరవ్ దాస్, అశుతోష్ రంకా లతో చర్చలు జరిపారు.
చర్చలలో సిజెపి ప్రతినిధులు మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. కాగా సిజిపి డిమాండ్ల గురించి ప్రభుత్వంతో చర్చించేందుకు తమకు గడువు కావాలని జె పి నడ్డా కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి, నిరసనకారుల డిమాండ్లకు ఏ విధంగా స్పందించినదీ వివరాలు తెలియలేదు.
సిజిపి పార్టీ నాయకత్వంలో మెడికల్ కాలేజీలలో ప్రవేశం కోసం జరిగిన ఎంట్రన్స్ పరీక్షలు ఎన్.ఇ.ఇ.టి (నీట్) ప్రశ్న పత్రాల లీకేజి ప్రతియేటా జరుగుతున్న పరిస్ధితుల్లో కేంద్ర ప్రభుత్వం, మరియు విద్యా మంత్రి లీకేజీ లకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ భారత దేశంలోని వివిధ రాష్ట్రాలలో విద్యార్ధులు, యువకులతో పాటు అనేక మంది పౌరులు జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిన విషయమే.
బిజెపి/కేంద్ర ప్రభుత్వం స్వయంకృతం?
విద్యార్ధులు, యువకుల ఆందోళన లోకి అవాంఛనీయ శక్తులు చొరబడరాదన్న లక్ష్యంతో లడక్ కు చెందిన పర్యావరణ కార్యకర్త, లడక్ లో విద్యా విధానంలో పలు వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టిన నేత సోనమ్ వాంగ్ చుక్ గత 21 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నేపధ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు ప్రాచుర్యం, ప్రాధాన్యం ఇవ్వక పత్రికలకు తప్పలేదు.
సిజిపి ఆందోళనను ఆరంభంలో పేరు గొప్ప పత్రికలు, విజువల్ మీడియా ఛానళ్లు ఏ మాత్రం పట్టించుకోలేదు. తద్వారా తమ ప్రభుత్వ విధేయతను అవి ఘనంగా చాటుకున్నాయి. ఉత్త పుణ్యానికి, ఎలాంటి కారణం లేకుండా సోనమ్ వాంగ్ చుక్ ను అర్ధ సంవత్సరం పాటు ఉపా చట్టం కింద జైలు లో నిర్బంధించటం ద్వారా ఆయనకు ఎన్.డి.ఏ/బి.జె.పి/మోడి-షా ప్రభుత్వం బహుళ ప్రచారం కల్పించింది. ఆయన సిజెపి ఆందోళనకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం, దీక్ష 21 రోజుల తర్వాత కూడా కొనసాగడంతో సిజెపి ఆందోళనకు జవాసత్వాలు వచ్చి చేరాయి.
సిజెపి ఆందోళనను ప్రధాన స్రవంతి మీడియా పట్టించుకోక పోయినప్పటికీ ట్విట్టర్, ఫేస్ బుక్, Instagram లాంటి సోషల్ మీడియా లో ఆందోళన విస్తృత ప్రచారం పొందింది. సిజెపి కి చెందిన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయించటం ద్వారా సిజెపి ఆందోళనకు ఆరంభ వెలుగును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఉపా చట్టం ద్వారా సోనమ్ వాంగ్ చుక్ కు ఇంకో వెలుగును (ఫోకస్) కేంద్ర ప్రభుత్వం ప్రసాదించింది. ఈ రెండు వెలుగుల్లో సిజెపి ఆందోళన మరింత ప్రస్ఫుటంగా దేశ ప్రజలకు కనిపించింది.
కేంద్ర ప్రభుత్వంతో పాటు సిజెపి ఆవిర్భావానికి దోహదం చేసిన మరో ప్రముఖ వ్యక్తి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్! భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా దేశం లోని నిరుద్యోగులు, విద్యార్ధులను బొద్దింకలు, పరాన్నజీవులు అంటూ ఈసడించుకోవటంతో అమెరికాలో ఉన్న అభిజిత్ దిప్కే అనే ఐ.టి నిపుణుడు ఉన్నపాటుగా స్పందించి “అవును! మేము బొద్దింకలమే” అని అరిచినట్టుగా ‘బొద్దింకల జనతా పార్టీ’ పేరును ట్విట్టర్ లో ప్రకటించటం కాకతాళీయంగా జరిగిన పరిణామం.
“నేను కేవలం బూటకపు లా పట్టాలతో కోర్టులను ముంచెత్తుతున్న నిరుద్యోగులను ఉద్దేశించి మాత్రమే వ్యాఖ్యలు చేశాను” అని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్, తన వ్యాఖ్యలకు సంజాయిషీ ఇచ్చుకున్నప్పటికీ దానిని ఎవరూ నమ్మలేదు. నిజానికి ఆయన ఏమని వ్యాఖ్యానం చేశాడో వెనక్కి తిరిగి వెతికితే ఆయన సంజాయిషీ వివరణలో వాస్తవం లేదని తెలుస్తుంది.
నిరుద్యోగ యువత పట్ల బాధ్యతతో, సానుభూతితో, అంతకుమించి వాస్తవాలను గ్రహించి తదనుగుణంగా స్పందించి చర్యలు చేపట్టవలసిన స్థానంలో ఉన్న ఈ దేశ అత్యున్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి, అందుకు విరుద్ధంగా నిరుద్యోగులను అవాంఛనీయ పదజాలంతో దూషించటం, ఈసడించుకోవటం గతంలో కనీ వినీ ఎరుగని సంగతి. దేశంలో నిరుద్యోగం, దారిద్ర్యం లాంటి సమస్యల పట్ల నైతికంగా, బాధ్యతాయుతంగా స్పందించటమే కాకుండా ఈ సమస్యలను పరిష్కరించటానికి కృషి చేయని ప్రభుత్వాలకు మొట్టికాయలు వేసిన ప్రధాన న్యాయమూర్తుల గురించి వినటం చూడటమే కానీ, తన పదవి నిర్దేశిస్తున్న బాధ్యతకు విరుద్ధంగా ప్రభుత్వ విధానాల బాధితులనే తప్పు పట్టిన మొదటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.
వేలాదిగా కదిలిన విద్యార్ధి, యువత!
సోనమ్ వాంగ్ చుక్, ఆమనర నిరాహార దీక్ష చేస్తున్న నేపధ్యంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఢిల్లీ హై కోర్టులో ఒక పిటిషన్ దాఖలు కావటం, ఢిల్లీ హై కోర్టుకు చెందిన సింగిల్ జడ్జ్ బెంచి ఒకటి ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సదరు జడ్జి ఆదేశాలు ఇవ్వటంతో కేంద్ర ప్రభుత్వానికి దీక్షను విరమింపజేసేందుకు అవకాశం కలిసి వచ్చింది. సోనమ్ వాంగ్ చుక్ చుట్టూ తెరలు కప్పి ఏం జరుగుతున్నది కనపడకుండా చేస్తూ ఆందోళనకారులు తెప్పరిల్లే లోపు ఆయనను ఆసుపత్రికి తరలించటంలో పోలీసులు సఫలం అయ్యారు.
సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని మాత్రమే కోర్టు చెప్పింది. పోలీసులు కోర్టు ఆదేశాలకు తమ సొంత అర్ధాలు ఇచ్చుకున్నారు. వాంగ్ చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న రీత్యా ఆయన ఆరోగ్య పర్యవేక్షణకు ఆసుపత్రికి తరలించమని కోర్టు చెప్పిందని వాళ్ళు చెప్పారు. ఆసుపత్రిలో వాంగ్ చుక్ భార్యకు వివరాలు చెప్పటం లేదని వార్తలు రావటం, ఆసుపత్రి వర్గాలు ఆ వార్తను ఖండించటం కూడా జరిగిపోయింది.
అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ తదితర గాంధియన్ సిద్ధాంత అనుచర గణాలకు ఈ తరహా పరిణామాలు యధావిధి స్క్రిప్ట్ తరహాలో జరిగిపోతూ ఉంటాయి. ఆమరణ దీక్ష ప్రకటించటం, రెండు మూడు వారాలు దీక్షలో కూర్చోవటం, కోర్టులో పిటిషన్ దాఖలు కావటం, కోర్టులు అటూ ఇటూ తేల్చకుండా, చెప్పీ చెప్పకుండా చెప్పటం, ప్రభుత్వం-పోలీసులు కోర్టు అంతరార్ధాన్ని గ్రహించినట్లుగా దీక్షలో కూర్చున్న పెద్దాయనను హాస్పిటల్ లో బలవంతంగా చేర్చటం, అక్కడ డాక్టర్లకు-ఆందోళనకారులకు, లేదా పోలీసులు-ఆందోళనకారులకు ఘర్షణ జరగటం… ఆరోపణలు, వివరణలు… ఇవన్నీ మామూలుగా ఉంటాయి.
సోనమ్ వాంగ్ చుక్ విషయంలో కూడా అదే జరిగిందా అన్నది తెలియదు. తెలిసినా ఇప్పుడే ఎవరూ ఆ విషయాల జోలికి వెళ్లరు. అనవసరంగా కెలికి తిట్టించుకోవటం ఎందుకు? ఐతే బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ రాజకీయాలను ఆది నుండి దృఢంగా వ్యతిరేకిస్తున్న ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఆందోళన కారులతో కలిసి వేదిక పంచుకుంటున్న నేపధ్యంలో ఆందోళన లక్ష్యాలలో నిజాయితీ ఆశించవచ్చని భావించవచ్చా?
ముఖ్యంగా సిజెపి ఆందోళనకు వస్తున్న స్పందన నిస్సందేహంగా నిజాయితీతో కూడుకున్నది. సిజెపి నాయకుల నుండి ఫౌల్ ప్లే కి సంబంధించిన సూచనలు ఏమీ లేవు. ఆది నుండి వారి ప్రకటనలలో నిజాయితీ వ్యక్తం అవుతూ వచ్చింది. ఆర్భాట పూరిత ప్రకటనలు ఇవ్వటం లేదు. ఏదో చించేస్తాం అంటూ షో చేయటం లేదు. మొదటి నుండి విద్యా మంత్రి రాజీనామా డిమాండ్ నుండి వెనక్కి తగ్గలేదు. జనాన్ని చూసి డిమాండ్లను పెంచలేదు. ఇవన్నీ సానుకూల పరిణామాలు.
సోనమ్ వాంగ్ చుక్ ని అరెస్ట్ చేసిన నేపధ్యంలో జులై 20 తేదీ సోమవారం పార్లమెంటుకు తరలి రావాలని వాంగ్ చుక్, సిజెపి లు పిలుపు ఇవ్వటంతో ఆందోళన వాతావరణ కాస్త పదునెక్కింది. భారీగా తరలి రావాలని సిజెపి, వాంగ్ చుక్ పదే పదే పిలుపు ఇవ్వటంతో ప్రదర్శన ను నివారించటానికి పోలీసులు ఏర్పాట్లు చేసుకున్నారు.
ప్రదర్శన, ఆందోళనలకు స్పందన కాస్త భారీగా వచ్చింది. మీదు మిక్కిలి పోలీసులు కూడా ప్రదర్శనను విఫలం చేసేందుకు ఇంకా భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఆందోళనను అడ్డుకునేందుకు ఏకంగా సి.ఏ.ఎస్.ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) ను దింపారు. ఒక సిఐఎఫ్ అధికారి ప్రకారం పోలీసులు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఆందోళన కారులు ప్రదర్శనకు కదిలి వచ్చారు.
ప్రదర్శనకు 5,000 మంది వస్తారని పోలీసులు అంచనా వేయగా, అనూహ్యంగా 12,000 మందికి పైగా ఆందోళనకారులు ప్రదర్శనలో పాల్గొన్నారని సిఐఎస్ఎఫ్ సీనియర్ అధికారిని ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక చెప్పింది. పత్రిక ప్రకారం పోలీసులు లాఠీ చార్జి చేయగా అనేక మంది గాయాల పాలయ్యారు.
ఢిల్లీ పోలీసులు నిర్బంధ చర్యల్లో భాగంగా ఢిల్లీ రాష్ట్రం లోని 14 జిల్లాల నుండి బలగాలను రప్పించారు. జిల్లా నుండి ఒక డెప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్ నాయకత్వంలో 100 మంది పోలీసులను పిలిపించారు. అంతకుముందే 2,000 మందితో కూడిన 32 కంపెనీల పారా మిలటరీ బలగాలను రప్పించినప్పటికీ వారు సరిపోరని ఢిల్లీ పోలీసు విభాగం భావించిందట.
అక్కడితో ఆగకుండా ఆదివారం నాడే 15 జిల్లాలకు ఒక వర్తమానం పంపారు. ఆయా జిల్లాల నుండి రాజకీయ నాయకులు, ఆందోళన మద్దతుదారులు జంతర్ మంతర్ కు రాకుండా అడ్డుకోవాలని ఆ వర్తమానం సారాంశం. ఆ ప్రకారమే పోలీసు అధికారులు ఉదయం 5 గంటలకే వివిధ నాయకుల ఇళ్లకు చేరుకుని వారు ఇంటి నుండి బైటికి రాకుండా అడ్డుకున్నారు.

పోలీసులు పార్లమెంటు కు వెళ్ళే రోడ్లన్నింటినీ మూసేశారు. ఎవరూ బయిటకు రావద్దని ప్రొహిబిషన్ ఆదేశాలు జారీ చేశారు. రోడ్ల పైన అనేక చోట్ల కొత్తగా సిసిటివి లను పోలీసులు ఏర్పాటు చేశారు. న్యూ ఢిల్లీ జిల్లాలో 12 జోన్ లు ఉండగా ప్రతి జోన్ కు డిసిపి ర్యాంకు పోలీసు అధికారిని పరిస్ధితి పర్యవేక్షించటానికి నియమించారు. జాయింట్ కమిషనర్ ర్యాంక్ లేదా అడిషనల్ కమిషనర్ ర్యాంక్ అధికారిని ప్రతి రెండు జోన్ లకు పర్యవేశకునిగా నియమించారు. మోడి ప్రభుత్వం ఆందోళనకారులకు జాస్తిగానే భయపడినట్లు కనిపిస్తోంది.
ఉదయం నుండే జంతర్ మంతర్ ను ఎవరూ చొరకుండా బారికేడ్లతో పోలీసులు నింపేశారు. టియర్ గ్యాస్, యాంటీ-రైట్ ఆయుధ సామాగ్రి భారీ సంఖ్యలో అక్కడికి తరలించారు. సోమవారం ఉదయం సిజెపి నాయకుడు అభిజిత్ దిప్కే పార్లమెంట్ మార్చ్ లో చేరాడు. వాంగ్ చుక్ ను ఆసుపత్రికి తరలించాక అభిజిత్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు. ఆయన ఉద్యమ నాయకత్వానికి అవసరం కనుక దీక్ష విరమించాలని వాంగ్ చుక్ కోరడంతో సోమవారం సాయంత్రం దిప్కే దీక్ష విరమించాడు.
పార్లమెంటు కు మార్చ్ లో నీట్ రద్దు దరిమిలా ఆత్మహత్య చేసుకున్నా రియా కోమారి తండ్రి కూడా పాల్గొన్నారు.
చర్చలకు పిలుపు!
పార్లమెంటుకు మార్చి ప్రారంభం అవుతుండగా సిజెపి నాయకత్వానికి కేంద్ర ప్రభుత్వం నుండి కబురు వచ్చింది. ప్రభుత్వంతో చర్చలకు రావాలని కబురు సారాంశం. సిజెపి నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా లు కేంద్ర మంత్రి జె పి నడ్డా తో చర్చలకు వెళ్లారు.
ఆందోళనకారులు ప్రధానంగా మూడు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. అవి:
- సోనమ్ వాంగ్ చుక్ ను వెంటనే విడుదల చేయాలి.
- యూనియన్ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి లేదా తొలగించాలి.
- నీట్ రద్దు వలన ఆత్మహత్య చేసుకున్న మెడికల్ అభ్యర్ధులకు ఒక్కొక్కరికి రు కోటి చొప్పున పరిహారం చెల్లించాలి.
విచిత్రం ఏమిటంటే సిజెపి డిమాండ్లను బిజెపి పార్టీతో చర్చించేందుకు గడువు కావాలని కేంద్ర మంత్రి కోరారట. ఆందోళనకారుల డిమాండ్లు ఒప్పుకోవలసింది కేంద్ర ప్రభుత్వం కదా! అధికార స్థానంలో ఉన్న మంత్రి గారు ప్రధాన మంత్రి తోనో లేదా కేబినెట్ సహచరులతోనో చర్చలు చేయాలి గానీ రాజకీయ పార్టీ అయిన బిజెపి తో చర్చలు జరపటం ఏమిటి? దానికి సిజెపి ఎందుకు అంగీకరించినట్లు?
ఆందోళనకారులను చర్చలకు ప్రభుత్వం (లేక బిజెపి యా?) ఆహ్వానించిన నేపధ్యంలో ప్రభుత్వం విధానంలో మార్పు ఉండొచ్చన్న ఊహాగానాలు బయలుదేరాయి. బహుశా ఆందోనకారుల డిమాండ్ మేరకు విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సమర్పించవచ్చని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మోడి ప్రభుత్వం మొండితనానికి పేరు పెట్టింది కనుక ఈ ఊహాగానాలు నిజరూపం దాల్చటం అనుమానమే. రాజీనామా డిమాండ్ ను తిరస్కరించి ఇంకేవేవో చేస్తానని చెబుతూ విచారణ కమిటీ లు వేస్తానని చెప్పేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది.
ఏమో గుర్రం ఎగరా వచ్చు!