“నీచ అమెరికా…” చర్చలపై ఇరాన్ ప్రకటన!


అమెరికా, ఇరాన్ దేశాల ప్రతినిధి బృంధాల మధ్య పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో చర్చలు విఫలం అయ్యాయి. చర్చలు ముగిసిన తర్వాత ఇరాన్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన సారాంశం ఇది:

“అత్యంత నీచ, దుర్మార్గ మరియు కపట బుద్ధితో కూడిన శత్రు అమెరికా – తాను యుద్ధం ద్వారా సాధించ లేని దానిని చర్చల బల్ల వద్ద సాధించాలని ప్రయత్నించింది.

“అమెరికా చేసిన డిమాండ్లలో, ఇరాన్ ఇప్పటి వరకు శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించటం, హోర్ముజ్ జలసంధి పైన ఇరాన్ సార్వభౌమాధికారం గురించి ఏమీ తేలకుండానే బేషరతుగా తెరవటం లాంటివి ఉన్నాయి.

“ఈ షరతులను తిరస్కరించేందుకు ఇరాన్ నిర్ణయించింది. మిలటరీ చర్యల ద్వారా గానీ లేదా దౌత్య చర్చల ద్వారా గానీ ఏది అవసరమైతే ఆ మార్గంలో తన పితృ భూమిని రక్షించుకోవటం పవిత్ర కర్తవ్యంగా పరిగణించటం ఇరాన్ కొనసాగిస్తుంది.”

ఇక ముందు కూడా చర్చించటానికి సిద్ధం అని చెబుతూనే దేశ రక్షణ కోసం యుద్ధానికి సైతం సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పై ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.

అమెరికా అత్యంత నీచమైనది, దుర్మార్గమైనది, కపట బుద్ధి కలిగినది అని ఇరాన్ ప్రభుత్వం అభివర్ణించటం లేశ మాత్రం ఐనా అనుమానం అనవసరం!

ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా, సిరియా, ఇరాన్, వెనిజులా, క్యూబా, మొదలైన దేశాల పైకి కుంటి సాకులతో కేవలం సామ్రాజ్యవాద ఆధిపత్య ప్రయోజనాల కోసం ఆయా దేశాల లోని చమురు సంపదల స్వాయత్తం కోసం, ఆ దేశాల సార్వభౌమాధికారాన్ని హరించివేయటమే లక్ష్యంగా ఆ దేశాల ప్రజల జీవితాలను, జీవనాలను భగ్నం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల ప్రాణాలను బలి గొంటున్న అమెరికా దుష్ట నీతిని అభివర్ణించటానికి ఎన్ని భాషలు కలిపినా సరిపోకపోవచ్చు.

హోర్ముజ్ జలసంధి గుండా అమెరికాకు చెందిన రెండు డిస్ట్రాయర్ నౌకలు విజయవంతంగా ప్రయాణించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు గొప్పలు చెప్పుకున్న నిమిషాల్లోనే ఇరాన్ అసలు నిజాన్ని వెల్లడి చేసింది. అమెరికా నౌకలు హోర్ముజ్ దాటేందుకు ప్రయత్నించాయని, ఇరాన్ హెచ్చరికలతో వెనక్కి మళ్ళాయని ఇరాన్ తెలియజేసింది.

సోమవారం రోజు మళ్ళీ పరిస్ధితి వేడెక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ చర్చలు నిలువునా కూలిపోయిన నేపధ్యంలో సోమవారం మళ్ళీ స్టాక్ మార్కెట్లు దభెల్ అంటూ కూలిపోతాయి. అమెరికా ట్రెజరీల యీల్డ్ లు కొండెక్కుతాయి. ద్రవ్యోల్బణం భయాలు మిన్నంటుతాయి. ఈ రంధిలో స్టాక్ మార్కెట్లను షార్ట్ చేసి లబ్ది పొందటం లో నిష్ణాతులైన సొర చేపలు మరోసారి పెద్ద మొత్తంలో లాభాలు జేబులో వేసుకుంటాయి.

ఈ సారి అమెరికా ఏ విధంగా ఇరాన్ తో కాళ్ళ బేరానికి వస్తుందో తెలుసుకోవటం ఆసక్తిగా మారనుంది.

వ్యాఖ్యానించండి