
–
“అమెరికా హామీల పట్ల, అది చేసే ఒప్పందాల పట్ల ఇరాన్ దేశానికి ఏ మాత్రం నమ్మకం లేని పరిస్ధితుల్లో” పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో శనివారం (ఏప్రిల్ 11) జరిగిన చర్చలు అనుకున్నట్లే విఫలం అయ్యాయి.
అమెరికా చేస్తున్న అతి డిమాండ్లు (excessive demands) తమకు సమ్మతం కాదని ఇరాన్ ప్రతినిధులు ప్రకటించారు. “మా నిబంధనలను (terms) తిరస్కరించటాన్నే వారు ఎంచుకున్నారు” అని అమెరికా ఉపాధ్యక్షుడు జె డి వాన్స్ చర్చల అనంతరం చెప్పాడు.
అసలు అమెరికా, ఇరాన్ దేశాల నుండి అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందం సావధానంగా చర్చలకు కూర్చోవటమే ఒక అద్భుతం అని పత్రికలన్నీ పొగుడుతున్నాయి. నిజమే కావచ్చు. కానీ ఆ అద్భుతం కేవలం ఇరాన్ ధైర్య సాహసాలతో అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ ఐరోపాలు 6 వారాల పాటు సాగించిన నరహంతక, మానవీయతా వ్యతిరేక యుద్ధాన్ని ప్రతిఘటించటం వల్లనే సాధ్యపడింది.
ఇరాన్ లో ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, భవంతులు, వంతెనలు, రోడ్లు ఇలా ప్రజలకు ఉపయోగపడే సమస్త నిర్మాణాలను అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు మిసైల్, బాంబు దాడులతో నేలమట్టం చేశాయి. ఇరాన్ ప్రధాన రాజకీయ, మత నాయకత్వాన్ని చర్చల పేరుతో నమ్మించి హత్య కావించాయి. శాస్త్రవేత్తలను, విద్యా సంస్థల నేతలను, నాయకుల కుటుంబాలను బాంబు దాడులతో హత్య చేశాయి.
ఈ హత్యల ద్వారా, మౌలిక పౌర నిర్మాణాలను నాశనం చేయటం ద్వారా ఇరాన్ లొంగి పోతుందని అమెరికా, ఇజ్రాయెల్ ఆశించాయి. కానీ సర్వ వినాశనం అనంతరం శిధిలాల మధ్యనే నిలబడి అమెరికా, ఇజ్రాయెల్ లను ఎదుర్కొని నిలబడటమే కాదు. ఇరాన్ చుట్టూ మోహరించిన అమెరికా సైనిక స్థావరాలను సొంతగా తయారు చేసుకున్న మిసైళ్లు, బాంబులతో నాశనం చేసింది.
ఇరాన్ దాడుల దెబ్బకు అమెరికా సైనిక స్థావరాలు కూలిపోగా దాని సైనికులు స్థావరాలను ఖాళీ చేసి ఐరోపా లోని స్ధావరాలకు తరలించక తప్పలేదు. గల్ఫ్ దేశాల హోటళ్లలో తలదాచుకుంటూ కొందరు సైనికులు యుద్ధం కొనసాగించగా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాల లోని తన ఆర్మీ బేస్ ల నుండి అమెరికా దాడులు చేసింది.
అమెరికాకు బహ్రెయిన్ లో అతి పెద్ద నావల్ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ తో కూడిన సైనిక స్ధావరం ఉన్నది. అది నాశనం అయింది. కతార్ లో అతి పెద్ద మిలటరీ స్ధావరం ఆల్-ఉదీద్ ఎయిర్ బేస్ (వైమానిక స్థావరం) ఉన్నది. అది కూడా నాశనం అయింది. ఇవి కాకుండా గల్ఫ్ దేశాలలో మరిన్ని చిన్నా పెద్దా అమెరికా స్థావరాలను ఇరాన్ కుళ్ళ బొడిచింది.
ఇరాన్ గగనతలం పైన సంపూర్ణ ఆధిపత్యం సాధించినని యుద్ధం జరుగుతుండగా అమెరికా గొప్పలు చాటింది. కానీ అమెరికా ప్రయోగించిన అత్యాధునిక జెట్ ఫైటర్ ఎఫ్-35 లను రెండింటినీ ఇరాన్ కూల్చేసింది. ఎఫ్-15, ఎఫ్-10, ఏ-10 లాంటి జెట్ ఫైటర్ లతో పాటు అత్యాధునిక డ్రోన్ విమానాలను, నిఘా డ్రోన్ లను ఇరాన్ కూల్చి వేసింది. బిలియన్ల డాలర్ల మేరకు అమెరికాకు నష్టం రుచి చూపించింది.
ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసి వేసింది. జలసంధిని మూసివేయటం అంటే భారీ గేటు పెట్టి మూసివేయటం కాదు. జలసంధి గుండా నౌకలు ప్రయాణించకుండా దాడులు చెయ్యటమే ఆ జలసంధిని మూసివేయటం. దాడులు జరిగితే తమ ట్యాంకర్లతో రవాణా చేసేందుకు కంపెనీలు అంగీకరించవు. ఇన్సూరెన్స్ కంపెనీలు ట్యాంకర్లకు ఇన్సూరెన్స్ నిరాకరిస్తాయి. ఫలితంగా రవాణా ఆవిపోతుంది.
ఇండియా, చైనా లాంటి దేశాల చమురు, గ్యాస్ రవాణా నౌకలను అనుమతించిన ఇరాన్ అమెరికా, ఐరోపా, ఇజ్రాయెల్ మరియు వాటి మిత్ర దేశాలకు రవాణా చేసే నౌకలను హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించటానికి ఇరాన్ నిరాకరించింది. దానితో చమురు రేట్లు బ్యారేల్ కు 60 డాలర్ల నుండి 110 డాలర్ల వరకు పెరిగిపోయింది.
చమురు ధరలు పెరిగిపోతే దాని ప్రభావం ఒక్క చమురు దిగుమతి చేసుకునే దేశాలోనే కాకుండా అమెరికా లాంటి చమురు ఎగుమతి చేసే దేశాలలో కూడా ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ప్రపంచ వాణిజ్యం ఒకదాని కొకటి ముడి పడి ఉంటుంది. అమెరికా స్వయంగా చమురు ఎగుమతి చేస్తున్నప్పటికీ ఆ దేశం లోని రిఫైనరీ ఫ్యాక్టరీలు ప్రధానంగా దిగుమతి చేసుకునే చమురు ని శుభ్రం చేసేందుకే ఉద్దేశించినవి. అంటే గల్ఫ్ నుండి చమురు దిగుమతి చేసుకుని దాని శుభ్రం చేసి ఎగుమతి చేస్తుంది. కనుక అమెరికా ఎగుమతి చేసే చమురు ధర పెరిగిపోతుంది.

అలాగే హోర్ముజ్ జలసంధి గుండా ఒక్క చమురు మాత్రమే కాకుండా హీలియం లాంటి వాయువులు, వ్యవసాయ ఎరువులు తయారు చేసేందుకు ముడి పదార్ధాలు, పెట్రోలియం ఉప ఉత్పత్తులు రవాణా అవుతాయి. ఎం ఆర్ ఐ స్కానింగ్ లాంటి వైద్య ప్రయోజనాలకు, సైంటిఫిక్ రీసర్చ్, మాన్యుఫాక్చరింగ్, సెమీ కండక్టర్ ఉత్పత్తి, రాకెట్ ఇంధన ట్యాంకులు, క్రయోజనిక్ కూలింగ్ మొదలైన వాటికి హీలియం అవసరం. ఇక ఎరువుల అవసరం గురించి చెప్పనవసరం లేదు.
హోర్ముజ్ గుండా ప్రపంచ ఇంధనం అవసరాల్లో 20 శాతం రవాణా అవుతుంది. ప్రపంచ ఉత్పత్తిలో 20 శాతం ఆగిపోతే అనివార్యంగా చమురు తో పాటు సకల ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. కనుక ద్రవ్యోల్బణం పెరిగి ఉత్పత్తి పడిపోయి, రిసెషన్ (ఆర్ధిక మాంద్యం) సంభవిస్తుంది. ఇది కొనసాగితే ఆర్ధిక సంక్షోభం అనివార్యం.
దానితో యుద్ధం కొనసాగించలేని పరిస్ధితిలో అమెరికా పడిపోయింది. ఒక పక్క యుద్ధంలో నష్టాలు, మరో పక్క ఆర్ధిక మాంద్యం.. ఇలా ముందు నుయ్యి వెనక గొయ్యి ఎదుర్కొన్న పరిస్ధితిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్తాన్ ని అడ్డం పెట్టుకుని తెరవెనుక కాళ్ళ బేరానికి వచ్చాడు. తెర ముందు మాత్రం “ఇరాన్ ని ఓడించేశాం. ఇరాన్ మిసైళ్లు అన్నింటినీ ధ్వంసం చేసేశామ్. యుద్ధ లక్ష్యాలన్నీ నెరవేరాయి అని చెబుతూ బింకం ప్రదర్శించాడు.
ఇరాన్ డిమాండ్లకు అంగీకరించటం అంటే ఇరాన్ ని తన మానాన తనను వదిలెయ్యటమే. అలా వదిలేస్తే ఏమి జరుగుతుంది? ఇరాన్, పశ్చిమాసియాలో హమాస్, హుతీ, హిజ్బొల్లా లాంటి టెర్రరిస్టు సంస్థలకు మద్దతు ఇస్తోందని, పెంచి పోషిస్తున్నదని అమెరికా, ఐరోపా, ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నాయి. అందువల్ల ఇరాన్ కు అణు ఇంధన శుద్ధి సామర్ధ్యం, మిసైల్ తయారీ సామర్ధ్యం ఉండకూడదని చెబుతున్నాయి. నిజానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే అతి పెద్ద రోగ్, టెర్రరిస్టు దేశాలని చెప్పాల్సి ఉంటుంది.
ఎవరు టెర్రరిస్టులు?
చర్చల వైఫల్యం ఊహించనిదేమీ కాదు. ఇరాన్ మొదటి నుండీ చెపుతున్నట్లే ఇరాన్ తో చర్చలు జరపటానికి, ఇరాన్ తన మానాన తాను సొంత బ్రతుకుని, స్వతంత్ర పంధాలో, ఎవరి దయా దాక్షిణ్యాలకు లొంగకుండా బ్రతకటం అమెరికా, ఇజ్రాయెల్ లకు ఎన్నడూ ఇష్టం లేదు.
సవా లక్షా ఆంక్షలను ఇరాన్ రోజు వారీ జీవనం పైన అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు వాటి తోక దేశాలు విధించి అమలు చేస్తుండగానే ఇరాన్ స్వయంగా విద్యా, శాస్త్ర, సాంకేతిక రంగాలలో పశ్చిమ దేశాలు అసూయ పడే అభివృద్ధిని సాధించింది. అలాంటిది ఆంక్షలు ఎత్తేస్తే, ఇరాన్ సంపాదించుకున్న డబ్బుని ఇరాన్ కు అందజేస్తే ఇక ఇరాన్ ను పట్ట గలమా? అన్నది అమెరికా, ఇజ్రాయెల్ దేశాల భయం.
ప్రపంచంలో ఏ దేశం అయినా తన అదుపాజ్ఞలను దాటి అభివృద్ధి సాధించటం అమెరికా దేశానికి సుతరామూ ఇష్టం ఉండదు. అలా అభివృద్ధి సాధించిన ఏ దేశమైనా అనివార్యంగా సరికొత్త శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేసుకుంటుంది. ఆ పరిజ్ఞానం సహాయంతో అమెరికా కంటే చౌకగా, నాణ్యంగా సరుకులను ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు అందించ గలుగుతుంది.
అప్పుడు జరిగేదేమిటి? సహజంగానే ప్రపంచ దేశాలు చౌకగా లభించే నాణ్యమైన సరుకలను కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతారు. అంటే ప్రపంచ మార్కెట్లు మెల్లగా అమెరికా, పశ్చిమ ఐరోపా చేతుల్లో నుంచి జారిపోతాయి. దరిమిలా అమెరికా నేతృత్వం లోని పశ్చిమ దేశాల ఆర్ధిక, వాణిజ్య, సైనిక, రాజకీయ ఆధిపత్యం తగ్గిపోయి, అంతర్ధానం అవుతుంది.
కాబట్టి అమెరికా తప్ప మరే దేశమూ అమెరికాను దాటి అభివృద్ధి సాధించకూడదు. అందుకోసం రకరకాల సాకులు చూపి ఆ దేశానికి అవసరమైన సరుకులు అందకుండా చేయాలి. ఇతర దేశాల నుండి ముడి సరుకులు అండకూడదు. ఇరాన్ వద్ద చమురు సంపద ఉన్నది కాబట్టి ఆ చమురు ఎవరూ కొనకుండా వివిధ రకాల అడ్డంకులు సృష్టించాలి.
అమెరికా ఇలా నిర్ణయించుకున్న తర్వాత ఇరాన్ తో ఏ ఒప్పందం ఐనా ఎలా సాధ్య పడుతుంది. “అమెరికా పట్ల అపనమ్మకం తోనే మేమీ చర్చల్లో పాల్గొంటున్నాము” అని ఇరాన్ పార్లమెంటు స్పీకర్, ఉపాధ్యక్షుడు అంటున్నది ఈ అవగాహన తోనే.
ఇరాన్ సాధించిన అభివృద్ధిని నాశనం చేసేందుకే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పైన దాడికి ఉపక్రమించాయి. ఇరాన్ టెర్రరిస్టు దేశం అనీ, టెర్రరిస్టులను పెంచి పోషిస్తుందనీ… ఇలాంటి ఆరోపణలన్నీ శుద్ధ అబద్ధం! ఇరాన్ టెర్రరిస్టు చర్యలకు పాల్పడుతున్నదని చెప్పేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవు.
హమాస్ సంస్థ గాజా ప్రాంత ప్రజలు ఎన్నుకున్న పార్టీ. ఫతా పార్టీని ఓడించి గాజా ఎన్నికల్లో గెలిచి గాజాను హమాస్ పాలిస్తున్నది. ఇజ్రాయెల్, గాజా ను ఆక్రమించాలని చేస్తున్న ప్రయత్నాలను, ఇజ్రాయెల్ యూదు పాలకులు సాగిస్తున్న జాత్యహంకార పాలనను, సైనిక దాడులను హమాస్ తనకి ఉన్న పరిమిత పరిమితుల్లో కొద్ది పాటి ఆయుధాలతో ఎదుర్కొంటున్నది. ఇజ్రాయెల్ ఆధిపత్య దాడులను, తద్వారా అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని హమాస్ ఎదుర్కొంటున్నది కనుక ఆ సంస్థ పైన ‘టెర్రరిస్టు’ అని అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు ఒక ముద్ర వేశాయి. అది ఐక్య రాజ్య సమితి వేసిన ముద్ర కాదు.
అలాగే లెబనాన్ దేశం ప్రభుత్వాన్ని పాలిస్తున్న కూటమిలో హిజ్బొల్లా ఒక భాగస్వామి. ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ పేరుతో ఇజ్రాయెల్, దక్షిణ లెబనాన్ ను ఆక్రమించుకోవాలని 1980 ల నుండి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నది. దఫ దఫాలుగా లెబనాన్ పైన హంతక దాడులు చేస్తున్నది. ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనేందుకు లెబనాన్ ప్రజల నుండి కొద్ది మంది యువకులు ప్రతిఘటన ప్రారంభించారు. వారే తర్వాత హిజ్బొల్లా గా అవతరించారు. లెబనాన్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఎదిగారు. ప్రభుత్వ భాగస్వామి అయిన హిజ్బొల్లా టెర్రరిస్టు పార్టీ ఎలా అవుతుంది?

యెమెన్ ప్రభుత్వ నేతలు, అధికార వర్గం సౌదీ అరేబియా, అమెరికా దేశాలకు సేవలు చేస్తూ యెమెన్ ప్రజలను దోపిడీ పీడనలకు గురి చేస్తున్న పరిస్ధితిలో అన్సర్ అల్లా పేరుతో ఒక సంస్థ వెలిసి వారిపై పోరాటం చేస్తున్నది. ఈ అన్సర్ అల్లా సంస్థ సభ్యులను హుతీ లు అని కూడా పిలుస్తున్నారు. యెమెన్ ప్రజల ప్రతినిధిగా ప్రజల విశ్వాసం చూరగొన్న అన్సర్ అల్లా / హుతీ టెర్రరిస్టు సంస్థ ఎలా అవుతుంది?
హమాస్, హిజ్బొల్లా, అన్సర్ అల్లా పార్టీలను టెర్రరిస్టు లు గా ఐక్య రాజ్య సంస్థ ఏనాడూ ప్రకటించలేదు, గుర్తించలేదు. పైగా దోపిడీ పీడనలను ప్రతిఘటించే హక్కు ప్రజలకు, వారి ప్రతినిధులకు ఉన్నదని ఐక్య రాజ్య సమితి గుర్తించింది.
ఆ మాటకొస్తే ప్రపంచంలో టెర్రరిస్టు సంస్థలను పోషిస్తున్నది, మద్దతు ఇస్తున్నది, వాటిని వాణిజ్య శత్రువులకు, రాజకీయ, సైద్ధాంతిక శత్రువులకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నది అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలే. టెర్రరిస్టు సంస్థలకు కావలసిన సాహిత్యం అమెరికా లోనే ప్రింట్ అయి ప్రపంచం నలుమూలలకు సరఫరా అవుతాయి.
సాక్ష్యం కావాలా? ఆల్ ఖైదా టెర్రరిస్టు సంస్థ అని అమెరికా, ఐరోపా లతో పాటు ఐరాస కూడా గుర్తించింది. దానికి ఆఫ్ఘనిస్తాన్ లో జన్మనిచ్చి ఆయుధాలు, నిధులు సరఫరా చేసింది అమెరికాయే.
అలాగే ఇరాక్ లో పుట్టిన “ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా” (ఐఎస్ఐఎస్/ఐఎస్) కు జన్మనిచ్చింది అమెరికాయే. దానిని సిరియా లోని సెక్యులర్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయోగించింది. ఇప్పుడు అదే ఐఎస్ అనే టెర్రరిస్టు సంస్థ లో భాగస్వామి ఐన అహ్రర్ ఆల్-షామ్ నాయకుడు అబ్దుల్ జొలాని ని సిరియా అధ్యక్షుడుగా అమెరికా ప్రతిష్టించింది. అప్పటి వరకు అమెరికా టెర్రరిస్టు జాబితాలో ఉన్న జొలాని సిరియా ప్రభుత్వాన్ని కూల్చేశాక ఆ జాబితా నుండి అతని పేరు తొలగించబడింది.
కనుక నిజమైన టెర్రరిస్టులు ఎవరో, వారికి ధన, ఆయుధ, వస్తు సహాయం చేస్తున్నది ఎవరో తెలుసుకోవటం కష్టమైన విషయం కాదు. నిజమైన టెర్రరిస్టులను తయారు చేసి తన ఆధిపత్యాన్ని ఎదిరిస్తున్న ప్రజా సంస్థల పైకి ఉసి గొల్పి, అలా ఎదిరిస్తున్న వారిని “టెర్రరిస్టులు” అని అమెరికా, పశ్చిమ ఐరోపా, ఇజ్రాయెల్ దేశాలు ముద్ర వేస్తే వారు టెర్రరిస్టులు అయిపోతారా? ప్రజా ప్రతినిధులను ప్రజల తరపున పోరాడుతున్న సంస్థలను టెర్రరిస్టులుగా అమెరికా, పశ్చిమ ఐరోపా, ఇజ్రాయెల్ దేశాలు ముద్ర వేయటం తోనే ప్రపంచం ఎందుకు నమ్మాలి?
మూడు ప్రధాన అంశాలు
ఇరాన్ 10 అంశాలను శాంతి, సీజ్ ఫైర్ చర్చలకు ప్రాతిపదికగా అమెరికా ముందు ఉంచింది. చర్చలు మొదలు కావటానికి ఈ 10 అంశాలు చర్చించ వచ్చని అమెరికా ఆమోదించి చర్చలకు ఉపక్రమించింది. కానీ చర్చలు మొదలు కాకుండానే ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ని ఉల్లంఘించి లెబనాన్ పైన దాడులు కొనసాగించి 800 మందికి పైగా ప్రజలను చంపేసింది. మరో 1100 మందికి పైగా ప్రజలను గాయపరిచింది. అనేక జన నివాసాలను కూల్చివేసింది. అది కూడా లెబనాన్ రాజధాని బీరూట్ లో.
సీజ్ ఫైర్ పరిధిలోకి లెబనాన్ రానట్లయితే ఇజ్రాయెల్ కూడా సీజ్ ఫైర్ పరిధిలోకి రాదని, ఇజ్రాయెల్ పైన దాడులు కొనసాగిస్తానని ఇరాన్ ప్రకటించింది. ఓ పక్క దాడులు కొనసాగుతుంటే చర్చలు కొనసాగించలేని చెబుతూ ఇరాన్ బృందం ఇస్లామాబాద్ కి రావటం లేదని పాకిస్తాన్ కి కబురు చేసింది.
ఏమి జరిగిందో తెలియదు. ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానికి ఫోన్ చేసి హెచ్చరించాడో గడ్డి పెట్టాడో వెల్లడి కాలేదు గానీ అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు ఇస్లామాబాద్ కు వచ్చాయి. 21 గంటల పాటు చర్చలు జరిపాయి. అమెరికా అతిగా డిమాండ్లు చేసిందని ఇరాన్ ప్రకటించింది. తమ నిబంధనలను తిరస్కరించేందుకే ఇరాన్ నిర్ణయించిదని అమెరికా ఉపాధ్యక్షుడు జె డి వాన్స్ ప్రకటించాడు. అయితే ఒక ప్రతిపాదన ఇరాన్ ముందు ఉంచామని వాన్స్ ప్రకటించాడు.
జె డి వాన్స్ ప్రతిపాదనతో ఇరాన్ బృందం తిరుగు ప్రయాణం అయింది. అమెరికా బృందం కూడా వెనక్కి మళ్ళింది. పత్రికల ప్రకారం మూడు ప్రధాన అంశాలు చర్చలకు ఆటంకంగా ఉన్నాయి.
ఒకటి:
హోర్ముజ్ జలసంధి తెరవటం. హోర్ముజ్ జలసంధిని షరతులతో తెరిచేందుకు అమెరికా మొదట అంగీకరించింది. హోర్ముజ్ గుండా అయే రవాణా నౌకల నుండి టోల్ వసూలు చేయటానికి, తద్వారా యుద్ధం ఖర్చులను పూడ్చుకుని పునర్మిర్మాణం చేయటానికి ఇరాన్ ప్రతిపాదించింది. ఇప్పటికే టోల్ వసూలు జరుగుతోంది కూడా. కానీ ఇజ్రాయెల్ మెలిక పెట్టినట్లు వార్తల ద్వారా తెలుస్తున్నది. ఇజ్రాయెల్ అభ్యంతరం తో హోర్ముజ్ జలసంధి ని ఇరాన్ నియంత్రణకు వదిలి పెట్టాలన్న నిబంధన పీట ముడి గా మారింది.
హోర్ముజ్ జలసంది ఒక్కటే తమ వద్ద ఉన్న పెద్ద ఆయుధమని ఇరాన్ భావిస్తోంది. హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ జలాల కిందికి వస్తుందని అమెరికా వాదిస్తోంది. కానీ అది నిజం కాదు. హోర్ముజ్ జలసంధి వెడల్పు 33 నుండి 39 కి.మీ వరకు ఉంటుంది. జలసంధి ఉత్తరం వైపు ఇరాన్ తీరం, దక్షిణం వైపు ఒమన్ తీరం ఉంటుంది.
అంతర్జాతీయ నిబంధనల ప్రకారం సముద్ర తీరం కలిగి ఉన్న దేశాలు తమ తీరం నుండి 12 నాటికల్ మైళ్ళ (22.2 కి.మీ) దూరం వరకు “టెరిటోరియల్ సీ (ప్రాదేశిక సముద్రం)” పేరుతో ఆ దేశ సార్వభౌమాధికారం కిందకు వస్తుంది. టెరిటోరియల్ సీ సరిహద్దు నుండి 200 నాటికల్ మైళ్ళ వరకు ఆ దేశానికి ఎక్స్-క్లూజివ్ ఎకనమిక్ జోన్ గా పరిగణిస్తారు. అనగా తీరానికి 200 మైళ్ళ వరకు ఉన్న సముద్ర సంపద ఆ దేశానికే చెందుతుంది.
కాబట్టి గరిష్ణం 39 కి.మీ వెడల్పు ఉన్న హోర్ముజ్ జలసంధిలో చెరి సగం ఇరాన్, ఒమన్ దేశాల సార్వభౌమాధికారం కిందకు వస్తాయి. ఏ విధంగానూ అంతర్జాతీయ జలాల కిందకు రాదు. కాబట్టి ఈ జలసంధి గుండా వెళ్లాలంటే ఇరాన్, ఒమన్ దేశాలు విధించే నిబంధనలకు లోబడి వెళ్లాల్సి ఉంటుంది. ఇరాన్ ప్రతిపాదన ఏమిటంటే రవాణా నౌకల నుండి వసూలు చేసే టోల్ ను ఇరాన్, ఒమన్ దేశాలు పంచుకోవాలని.
రెండు:
ఇరాన్ అణు శుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలన్నది అమెరికా డిమాండ్. ఈ అంశం విషయంలో అమెరికా రెండు నాల్కలతో మాట్లాడుతుంది. “ఇరాన్ అణు బాంబు తయారు చేసుకోవటానికి వీలు లేదు” అని అమెరికా పైకి చెబుతుంది. అణు బాంబు తయారు చేసే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ ఎన్నోసార్లు స్పష్టం చేసింది. అణు బాంబు నిర్మించే వైపుగా ఇరాన్ ఎలాంటి కార్యక్రమం ఇంతవరకు చేపట్టలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ), సి.ఐ.ఐ లు ఇప్పటికీ ఎన్నోసార్లు ధృవీకరించాయి.
ఇప్పటి యుద్ధానికి ముందు కూడా అణు బాంబును ఇరాన్ తయారు చేయటం లేదని ఐఏఈఏ, సిఐఏ స్పష్టం చేశాయి. అమెరికన్ ఎన్.ఐ.ఏ కూడా ధృవీకరించాయి. అయినా గానీ ఇరాన్ అణుబాంబు సామర్ధ్యం నాశనం చేసేందుకు అని చెబుతూ అమెరికా, ఇజ్రాయెల్ లు యుద్ధం మొదలు పెట్టాయి. ఇరాన్ ని లొంగదీయ లేక తోక ముడిచాయి.
మళ్ళీ అదే పాటని అమెరికా ఎత్తుకుంది. పైకి అణు బాంబు అని చెబుతూ చర్చల్లో “ఇరాన్ అణు శుద్ధి కార్యక్రమం రద్దు చేసుకోవాలి” అని డిమాండ్ చేస్తున్నది. అణు శుద్ధి ద్వారా బాంబు తో పాటు అనేక శాంతియుత ప్రయోజనాలు ఉన్నాయి. వైద్యంలో వేల కొద్దీ రోగ నిర్ధారణ పరీక్షల్లో శుద్ధి చేసిన యురేనియం ని ఉపయోగిస్తారు. అణు రియాక్టర్లతో అనేక దేశాలు విద్యుత్ ఉత్పత్తి చేయటం తెలిసిందే. ఇలా వైద్య, విద్యుత్ ప్రయోజనాలను కూడా ఇరాన్ కలిగి ఉండేందుకు అమెరికా, ఇజ్రాయెల్ నిరాకరిస్తున్నాయి. ఐఏఈఏ పర్యవేక్షణలో ఇంధన శుద్ధి చేస్తున్నా, అమెరికా, యూదు దేశాలు ఇరాన్ పట్ల అణచివేత ధోరణితో ఉన్నాయి.
అసలు యురేనియం శుద్ధి చేయాలా లేక ఎంత వరకు శుద్ధి చేయాలి అన్నది ఏ దేశానికైనా సొంత విషయం. సొంత రక్షణ కోసం అణు బాంబు నిర్మించుకునే హక్కు కూడా స్వతంత్ర దేశాలకు హక్కు. ఈ హక్కుని ఇరాన్ కు అమెరికా వ్యతిరేకించటం అంటే ఇరాన్ సార్వభౌమాధికార హక్కుని నిరాకరించటమే. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల నుండి ఇరాన్ భద్రతకు ప్రమాదం పొంచి ఉన్నదని యుద్ధం నిరూపించింది. ఐనా, అణు బాంబు నిర్మాణానికి ఇరాన్ పూనుకోవటం లేదు.
మూడు:
ఇరాన్ ఆస్తుల స్తంభన. ఇరాన్ అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా ఆర్జించిన నిధులు వివిధ దేశాల బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. ఈ నిధులను సొంత అవసరాలకు ఉపయోగించకుండా అమెరికా, ఐరోపా దేశాలు స్తంభింపజేశాయి. ఒక్క కతార్ బ్యాంకులోనే 7 బిలియన్ల నిధులను బ్లాక్ చేశారు. ఈ నిధులను సొంత ప్రజలకు ఉపయోగించకుండా అమెరికా, ఇజ్రాయెల్ లు అడ్డు పడుతున్నాయి. అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ ఉపకరణాలను, వ్యవస్థలను తన చేతుల్లో ఉంచుకోవటం ద్వారా ఈ ఆంక్షలను అమెరికా అమలు చేస్తున్నది.
ఒబామా అధ్యక్షుడుగా ఉన్న కాలంలో ఇరాన్ తో శాంతి ఒప్పందం చేసుకున్నాడు. దీని ప్రకారం పరిమిత స్థాయిలో యురేనియం శుద్ధికి అమెరికా అంగీకరించింది. పరిమిత స్థాయిలో చమురు వాణిజ్యానికి అమెరికా ఒప్పుకుంది. ఈ ఒప్పందం మేరకు ఇరాన్ చమురు వాణిజ్యం ద్వారా సంపాదించిన ఆదాయాన్ని ఇరాన్ సౌత్ కొరియా, కతార్ లాంటి దేశాల బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. డొనాల్డ్ ట్రంప్ మొదటి విడత అధ్యక్షుడు ఐన వెంటనే ఇరాన్ తో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసేశాడు.
ఫలితంగా ఇరాన్ కు కల్పించబడ్డ కొద్ది పాటి వాణిజ్య సదుపాయం రద్దు చేయబడింది. ఒక దేశాన్ని నిరంతరాయంగా ఎలాంటి వాణిజ్య అవకాశాలు లేకుండా దౌత్య సంబంధాలు లేకుండా వేధించటం నాగరిక ప్రపంచంలో ఊహించరానిది. కానీ అమెరికా, ఐరోపా, ఇజ్రాయెల్ ఆ పని చేస్తున్నాయి. ఇరాన్ లోని 10 కోట్ల మంది ప్రజలను ఆకలికి మాడ్చి, వైద్య సౌకర్యాలు లేకుండా చేసి, చివరికి పసి పిల్లలకు పాలాడబ్బా లు కూడా అందకుండా దిగ్బంధనం చేయటం ద్వారా ఇరాన్ ను లొంగదీసుకోవాలని, తమకు దాస్యం చేసే దేశంగా మార్చాలని చూస్తున్నాయి.
ఈ అన్యాయాన్ని స్వతంత్రాన్ని కాంక్షించే ఏ ప్రజాలైనా ప్రతిఘటిస్తారు. అందుకే ఇరాన్ ప్రతిఘటిస్తున్నది. తనలాగే అమెరికా, ఇజ్రాయెల్ పెత్తనాన్ని ప్రతిఘటిస్తున్న యెమెన్, పాలస్తీనా దేశాలకు మద్దతు ఇస్తున్నది. కనుక న్యాయం పక్షం వహించే ఏ వ్యక్తి, జాతి, దేశం ఐనా ఇరాన్ దేశానికి, ఆ దేశ ప్రజలకు సంపూర్ణ మద్దతు అందజేస్తారు.
మూడు ప్రధాన అంశాలు
ఇరాన్ 10 అంశాలను శాంతి, సీజ్ ఫైర్ చర్చలకు ప్రాతిపదికగా అమెరికా ముందు ఉంచింది. చర్చలు మొదలు కావటానికి ఈ 10 అంశాలు చర్చించ వచ్చని అమెరికా ఆమోదించి చర్చలకు ఉపక్రమించింది. కానీ చర్చలు మొదలు కాకుండానే ఇరాన్ సీజ్ ఫైర్ ని ఉల్లంఘించి లెబనాన్ పైన దాడులు కొనసాగించి 800 మందికి పైగా ప్రజలను చంపేసింది.
ఇరాన్ సీజ్ ఫైర్ అని రాశారు, ఇజ్రాయిల్ అని సవరించండి.
Right. Thanks