సీజ్ ఫైర్ చర్చలు ఇక అర్ధ రహితం -ఇరాన్


Iran Parliament Speaker Mohammad Bagher Ghalibaf

చర్చలు మొదలు కాకముందే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా, ఇజ్రాయెల్ లు రెండూ అడ్డంగా ఉల్లంఘించిన నేపధ్యంలో ఇక “సీజ్ ఫైర్ చర్చలకు అర్ధం లేదు” అని ఇరాన్ ప్రకటించింది.

ఏ అంశాల పునాదిగా అయితే చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు అన్నాడో ఆ పునాది అంశాలనే అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ఉల్లంఘించాయని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్-బఘర్ ఘాలీబాఫ్ ట్విట్టర్ లో చేసిన ప్రకటనలో ఆరోపించాడు.

“ఇరాన్ అందజేసిన 10 అంశాల డాక్యుమెంట్ ఆధారంగా పరిష్కారం సాధ్యం అవుతుంది” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్ సీజ్ ఫైర్ కు అంగీకారం ప్రకటిస్తూ అన్నాడు. ఆ ప్రకటన దరిమిలా ట్రంప్ తన ప్రకటనను తాను కూడా గౌరవించడం మానేశాడు. ఇరు దేశాలు చర్చలు జరపబోతున్న సంగతే గాలికి వదిలేసి బుర్రకు తోచినట్లు మాట్లాడటం మొదలు పెట్టాడు.

మరో పక్క ఇజ్రాయెల్ లెబనాన్ పై తాను చేస్తున్న దాడులు సీజ్ ఫైర్ పరిధిలోకి రావని ప్రకటించటమే కాకుండా నిన్న లెబనాన్ జనావాసాలపై మిసైళ్లతో విస్తృతంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో 250 మందికి పైగా సాధారణ పౌరులు, స్త్రీలు పిల్లలతో సహా, ప్రాణాలు కోల్పోయారు. మరో 1160 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు.

Israeli attack on Beirut in a densely populated area on April 8

ఈ దాడులను ఫ్రాన్స్, యు.కె, చైనా దేశాలతో పాటు అనేక దేశాలు లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులను ఖండించాయి. యు.కె, బ్రెజిల్, కొలంబియా, ఇండోనేషియా, జోర్డాన్, సియర్రా లియోన్, ఆస్ట్రేలియా దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ సీజ్ ఫైర్ లో లెబనాన్ కు కూడా వర్తింపజేయాలని కోరాయి.

ఇరాన్ విదేశీ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఆరాఘ్చి ఇజ్రాయెల్ దాడుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. “ఇరాన్-అమెరికా సీజ్ ఫైర్ అంశాలు స్పష్టంగా ఉన్నాయి. కాల్పుల విరమణ కావాలా లేక యుద్ధం కొనసాగిద్దామా? ఏది కావాలో అమెరికా ఎంచుకోవాలి. ఒకేసారి రెండూ సాధ్యం కాదని అమెరికా గ్రహించాలి” అని ఆరాఘ్చి తీవ్రంగా హెచ్చరించాడు.

“బంతి ఇప్పుడు అమెరికా కోర్టులో ఉన్నది. అమెరికా తన హామీలకు కట్టుబడి ఉన్నదా లేదా అని ప్రపంచం పరిశీలంగా చూస్తోంది” అని ఆరాఘ్చి గుర్తు చేశాడు. “లెబనాన్ పై దాడులు తక్షణమే ఆపకపోతే ఇజ్రాయెల్ చింతించే విధంగా గట్టి చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ హెచ్చరిక జారీ చేసింది.

మూడు ఉల్లంఘనలు

ఇరాన్ ప్రతిపాదనలోని 3 అంశాలను చర్చలు ప్రారంభం కాక మునుపే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఉల్లంఘించాయని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఎం బి ఘాలీబాఫ్ ట్విట్టర్ లో వివరించాడు. అవి:

  1. 10 అంశాల ప్రతిపాదన లో లెబనాన్ లో సీజ్ ఫైర్ కి సంబంధించిన మొదటి క్లాజ్ ని ఉల్లంఘించారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహ్ బాజ్ షరీఫ్ “లెబనాన్ తో సహా అన్ని ప్రాంతాల్లో తక్షణమే అమలులోకి వచ్చేలా సీజ్ ఫైర్ ని అమలు చేయాలి” అని స్పష్టంగా ప్రకటించాడు. (కానీ లెబనాన్ పైన తీవ్ర స్థాయిలో ఇజ్రాయెల్ తన దాడుల్ని కొనసాగిస్తున్నది.)
  2. ఫార్స్ రాష్ట్రం లో ఇరాన్ గగనతలం లోకి డ్రోన్ చొచ్చుకుని వచ్చింది. దీన్ని మేము అడ్డుకుని నాశనం చేశాము. ఇరాన్ గగనతలాన్ని మునుముందు ఏ విధంగానూ ఉల్లంఘించరాదన్న క్లాజ్ ని ఈ చొరబాటు ద్వారా ఉల్లంఘించారు.
  3. అణు ఇంధనం (యురేనియం) శుద్ధి చేసేందుకు (enrichment) ఇరాన్ కి ఉన్న హక్కుని నిరాకరిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేశాడు. 10 అంశాల ఫ్రేమ్ వర్క్ లో ఆరవ అంశానికి ఇది ఉల్లంఘన.

“చర్చలు జరిపేందుకు ప్రాతిపదికగా పని చేస్తుంది అని చెప్పిన ఫ్రేమ్ వర్క్ ని ఇలా బహిరంగంగా స్పష్టంగా, చర్చలు ప్రారంభం కాక ముందే, ఉల్లంఘించారు. ఇటువంటి పరిస్ధితిలో ద్వైపాక్షిక కాల్పుల విరమణ లేదా చర్చలకు అర్ధం లేదు” అని ఎం బి ఘాలిబాఫ్ ప్రకటించాడు.

అయితే ఉల్లంఘనలు జరిగినప్పటికీ ఇరాన్ తరపున చర్చల ప్రతినిధులు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కు బయలుదేరుతున్నారని ఇరాన్ ప్రకటించింది. ఆ విధంగా చర్చలకు ఇరాన్ కట్టుబడి ఉంటుందన్న విషయాన్ని ఆ దేశం సూచించింది. కానీ తప్పనిసరి పరిస్ధితులు ఏర్పడితే చర్చల నుండి వైదొలగేందుకు సిద్ధంగా ఉన్నామని తమ ప్రకటన ద్వారా ఇరాన్ స్పష్టం చేస్తోంది.

నిజానికి అమెరికా అంతర్జాతీయ ఒప్పందాలను ఏనాడూ గౌరవించిన దాఖలాలు లేని నేపధ్యంలో అమెరికా పట్ల తమకు ప్రధానంగా అపనమ్మకమే ఉన్నదని ఇరాన్ స్పష్టం చేసింది.

“అమెరికా పట్ల మాకున్న లోతైన చారిత్రక అపనమ్మకం, గతంలో అనేక ఒప్పందాలను అన్ని రూపాల లోనూ పదే పదే ఉల్లంఘించిన ఆ దేశ చరిత్ర నుండే ఉత్పన్నం అయింది. అదే తరహా ఉల్లంఘన ఇప్పుడూ జరుగుతున్నది. తన ట్రూత్ (సోషల్) లో అమెరికా అధ్యక్షుడు ‘ఇస్లామిక్ రిపబ్లిక్ చేసిన 10 పాయింట్ల ప్రతిపాదన చర్చలు జరిపేందుకు ఆధారపడ దగిన ప్రధాన ఫ్రేమ్ వర్క్’ అని స్పష్టంగా పేర్కొన్నాడు. కానీ అందులో మూడు క్లాజ్ లను ఇప్పటి వరకూ ఉల్లంఘించారు” అని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఎం బి ఘాలిబాఫ్ ఆందోళన వ్యక్తం చేశాడు.

Israli attack on Beirut in a densely populated area on April 8

సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కొన్ని గంటల్లోనే డొనాల్డ్ ట్రంప్ “ఇరాన్ లో ఇక అణు శుద్ధి అన్నది ఇక ఉండదు” అని ప్రకటించాడు. ఆ ప్రకటననే మళ్ళీ మళ్ళీ ఉల్లేఖించాడు.

ట్రంప్ ప్రకటనకి స్పందిస్తూ ఇరాన్ న్యూక్లియర్ ఏజన్సీ అధిపతి “యురేనియం శుద్ధి చేసే హక్కు ఇరాన్ కలిగి ఉండటం, సీజ్ ఫైర్ చర్చలకు అత్యవసర షరతు” అని స్పష్టం చేశాడు.

సీజ్ ఫైర్ ప్రకటించే ముందు తమతో చర్చించలేదని ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. చివరి నిమిషంలో తమకు సమాచారం అందిందని తమతో కో-ఆర్డినేషన్ జరగలేదని తెలిపింది. అయితే ఇజ్రాయెల్ కి సమాచారం ఇచ్చే బాధ్యత, కో-ఆర్డినేట్ చేసుకునే బాధ్యత అమెరికాదే తప్ప ఇరాన్ ది కాదు.

అమెరికాను యుద్ధం లాగింది ఇజ్రాయెల్ దేశమే అన్న అభిప్రాయం ఎల్లెడలా వ్యాపించి ఉంది. అమెరికా ఆధిపత్య ప్రయోజనాలను నెరవేర్చేందుకే ఇజ్రాయెల్, పశ్చిమాసియా లో అస్థిరత్వాన్ని, ఘర్షణలను సృష్టిస్తూ పాలస్తీనా ప్రజలపై దారుణ మారణకాండ అమలు చేస్తుందన్నది వేరే సంగతి! అమెరికా ఉపగ్రహంగా పశ్చిమాసియాలో ఆ దేశ వ్యూహాత్మక, ఆధిపత్య ప్రయోజనాలను నెరవేర్చడంతో పాటు ప్రాంతీయంగా పెత్తందారుగా అవతరించే లక్ష్యాన్ని కూడా ఇజ్రాయెల్ కలిగి ఉన్నదని ఆ దేశ చర్యల ద్వారా అర్ధం చేసుకోవచ్చు.

2 thoughts on “సీజ్ ఫైర్ చర్చలు ఇక అర్ధ రహితం -ఇరాన్

వ్యాఖ్యానించండి