స్వతంత్ర దేశంపై పెత్తందారీ, జాత్యహంకారుల యుద్ధం! -2


Damage in Tel Aviv (Israel Capital) caused by Iran Attacks

07/03/2026

ఈ ఏక పక్ష యుద్ధం ఇండియాకూ హెచ్చరికే!

  • కొలంబియా యూనివర్సిటీ సుప్రసిద్ధ ఎకనామిక్స్ ప్రొఫెసర్ జెఫ్రీ షాక్స్ సబ్ స్టాక్ బ్లాగ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి ఒక విధంగా ఇండియాకు కూడా చేసిన హెచ్చరిక!” అని వివరించాడు.
  • “అమెరికా ప్రయోజనాలకు లొంగిపోయి నడుచుకుంటారా లేక తన స్వతంత్రత ని సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటారా అన్న సంగతిని భారత పాలకులు తేల్చుకోవాలని ఇండియాను ఈ యుద్ధం ద్వారా అమెరికా హెచ్చరిస్తోంది” అని ఇండియాకు కర్తవ్యాన్ని గుర్తు చేశాడు.
  • ఇండియా నుండి అమెరికాకు జరిగే ఎగుమతుల పైన జనరల్ టారిఫ్ (సాధారణ సుంకం) అంటూ 25% సుంకాలు బాదిన డొనాల్డ్ ట్రంప్, రష్యా నుండి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు మరో 25% టారిఫ్ ను పనిష్మెంట్ గా ఇండియా పైన రుద్దటం, “ఇండియన్లు మంచి వాళ్ళు చెప్పిన మాట వింటారు” అంటూ బుజ్జగిస్తూనే “ఈ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి అని చైనాకు అనుమతించినట్లుగా ఇండియాను అనుమతించబోము. ఎందుకంటే మిమ్మల్ని అభివృద్ధి చెందేందుకు అనుమతీస్తే, చివరికి మీరు మమ్మల్ని ఓడించి ఇంకా పైకి ఎదిగిపోతారు” అని అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టఫర్ లాండూ, ఇండియా లోనే మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైజీనా డైలాగ్ వేదిక పైనే నిలబడి ఇండియాను అవమానించటం వరకు అమెరికా వెళ్ళటం బట్టి ఆర్టికవేత్త జెఫ్రీ షాక్స్ (ఈయనా అమెరికా పౌరుడే) చెప్పిన చేదు నిజాన్ని రుజువు చేస్తున్నాయి.
  • ఇండియా దాదాపు 40 ఏళ్ల చర్చోప చర్చల తర్వాత యూరోపియన్ యూనియన్ తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే అమెరికా తో వాణిజ్య ఒప్పందం అయింది. అమెరికాతో ఒప్పందం విషయమై చర్చలు జరిగేటప్పుడే భారతదేశ రైతు సంఘాలు భారత రైతుల ప్రయోజనాలను అమెరికా ఒత్తిడికి లొంగి తాకట్టు పెట్టవద్దని విజ్ఞప్తుల పైన విజ్ఞప్తులు చేశారు.
  • కానీ అమెరికాతో జరిగిన వాణిజ్య చర్చల్లో భారత ప్రభుత్వం అమెరికాకి ఇబ్బడి ముబ్బడిగా రాయితీలు ఇచ్చేశారు. అమెరికా నుండి దిగుమతి అయ్యే సకల పారిశ్రామిక సరుకుల పైనా, విస్తారమైన ఆహార, వ్యవసాయ సరుకుల పైనా ఇండియా టారిఫ్ లు పూర్తిగా ఎత్తి వేయడమో లేదా బాగా తగ్గించటానికో ఒప్పుకున్నారు. డ్రై ఫ్రూట్స్, పశు గ్రాసానికి వాడే ఎర్ర జొన్నలు, తాజా & ప్రాసెస్డ్ పళ్ళు, సోయాబీన్స్ నూనె, వైన్, స్పిరిట్, పట్టి, యాపిల్, ఇతర పళ్ళు, నట్స్… ఇంకా అనేక వ్యవసాయ ఉత్పత్తులపై భారత రైతుల నడ్డి విరుస్తూ అమెరికా దిగుమతులకు రాయితీ ఇచ్చేశారు. ఫలితంగా చౌకగా దొరికే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్ లను ముంచేసి భారత రైతుల నోట్లో మట్టి కొట్టబోతున్నారు.
  • అక్కడితో అగారా? అబ్బే లేదు. వచ్చే 5 యేళ్లలో 500 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటామని హామీ ఇచ్చేశారు. 2024-25 లో అమెరికా నుండి ఇండియా వచ్చే దిగుమతులు 50 బిలియన్ డాలర్ల లోపే. అంటే ఇండియా ఇతర దేశాల నుండి దిగుమతులు ఆపేసి ఖరీదైన అమెరికా సరుకులు కొనబోతోంది. తద్వారా అమెరికా కోసం రష్యా లాంటి అనేక మండి మిత్ర దేశాలను దూరం చేసుకోబోతుంది.
  • ఇండియాకి రష్యాకి మధ్య 2021 నుండి 2031 వరకు పదేళ్ల మిలటరీ-టెక్నికల్ కో ఆపరేషన్ ఒప్పందం ఉంది. అత్యాధునిక ఎస్ – 400 మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలు, టి – 90 ట్యాంకులు ఇండియాలో తయారు చేసేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఎస్ – 400 సిస్టమ్ లు అమెరికా టాప్ ఫైటర్ జెట్ ఎఫ్ – 35 టెక్నాలజీని కనిపెట్టి నాశనం చేస్తాయి. అందుకని ఎస్ – 400 లు ఉన్న దేశానికి ఎఫ్ – 35 ఫైటర్ జెట్ లు అమ్మదు. కనుక ఇండియా ఎఫ్-35 ల కోసం రష్యా ఎస్-400 సిస్టమ్ లను వదులుకోనున్నదా? అమెరికాతో వాణిజ్య ఒప్పందం, ఇతర దేశాలతో ఇండియా వాణిజ్య సంబంధాలను నాశనం చేసేసి వారిని మనకు శత్రువులుగా మార్చబోతోందా?
  • ఇండియా పరిస్ధితి అలా ఉంటే ఇరాన్ తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ రాజకీయాలకు, ఆధిపత్య-పరాధీన సంబంధాలకు, వివిధ అధికార కేంద్రాల (ధృవాల) బలాబలాల మార్పులకు ఒక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంత నష్టపోయినా ఇరాన్ అమెరికాకు లొంగకుండా నిలబడి ఉంటే చాలు ఇరాన్ గెలిచినట్లే! యుద్ధం ఎంత కాలం సాగితే అమెరికాకు అంత నష్టం మరియు ఇరాన్ గెలుపుకు అంత సమీపంగా వెళ్ళినట్లు!
  • అమెరికా బైట పడే అవకాశం ప్రస్తుతానికి తక్కువ కనిపిస్తోంది. దాని దగ్గర ఆయుధ నిల్వలు సరిపోయినన్ని లేవు. వేగంగా ఆయుధాలు తయారు చేయగల ఇండస్ట్రియల్ బేస్ బలహీన పడింది. ( ఫైనాన్షియలైజేషన్ వలన). పైగా అమెరికా ఆయుధ కంపెనీల యుద్ధ సామాగ్రి ఖరీదైనవి. సంక్లిష్ట ఎలక్ట్రానిక్ సిస్టమ్ లతో కూడినందున ఉత్పాదకత తక్కువ. ఇరాన్, రష్యాలు తమ ఆయుధాలు ఉత్పత్తి చేసేంత వేగంగా అమెరికా ఆయుధాల ఉత్పత్తి జరగదు.
  • ఇరాన్ వద్ద ఆయుధాల నిల్వలు భారీగా ఉన్నాయి. అండర్ గ్రౌండ్ లో దాచింది. కనుక ఇరాన్ ఆయుధ నిల్వలను ఒక్కటీ మిగలకుండా నాశనం చేశామన్న అమెరికా మాటల్ని ఎవరూ నమ్మటం లేదు.
  • భూతల యుద్ధానికి ఇరాన్ “మేము వెయిట్ చేస్తున్నాం” అని ఇరాన్ సవాలు చేసింది. చర్చలు జరిపేది లేదు పొమ్మంది. ఇజ్రాయెల్, లెబనాన్ లో హిజ్బోల్లా చేతుల్లో గట్టి నష్టాలు ఎదుర్కొంటోంది. సౌత్ లెబనాన్ ని పూర్తిగా ఆక్రమిస్తానని చెబుతూ లెబనాన్ పై దాడులు మొదలు పెట్టిన ఇజ్రాయెల్ అక్కడ పెద్ద సంఖ్యలో యుద్ధ సామాగ్రి కోల్పోతున్నది.
  • ఈ విషయాలను వెల్లడి చేస్తున్నది ఎవరో కాదు. అమెరికా మాజీ సి ఐ ఏ ఎనలిస్టులు, మిలట్రీ అధికారులు, ఎకనమిస్టులు, బ్రిటన్ మాజీ రాయబారులు తమ తమ యూ ట్యూబ్ చానెళ్లలో, బ్లాగ్ లలో చెబుతున్నారు. ఉదాహరణకి బ్రిటన్ మాజీ రాయబారి, MI6 ఎనలిస్టు ఐన అలెస్టర్ క్రూక్, బ్రిటన్ మాజీ రాయబారి కూతురు మరియు విలేఖరి ఐన వెనెస్సా బీలే, అమెరికా సి.ఐ.ఏ మాజీ ఎనలిస్టు ల్యారీ సి జాన్సన్ ఈ జాబితాలో ఉన్నారు.

08/03/2026

  • గాజా పునర్నిర్మాణం పేరుతో ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ కమిటీ నుండి తప్పుకున్నట్లు ఇండోనేషియా ప్రకటించింది. ట్రంప్ బెదిరింపులకు బి ఓ పి లో చేరిన ఇండోనేషియా ఇరాన్ పై దాడిని వ్యతిరేకిస్తూ కమిటీ నుండి తప్పుకున్నట్లు ఈ రోజు ప్రకటించింది.
  • బహ్రెయిన్ లో అమెరికాకి అతి పెద్ద సైనిక, నావికా స్థావరం ఉంది. ఇది అమెరికా నేవీ 5వ ఫ్లీట్ కు హెడ్ క్వార్టర్స్ గా పని చేస్తుంది. దీనిపైన ఇరాన్ మరోసారి జరిపిన దాడిలో 21 మంది అమెరికా సైనికులు చనిపోయారు. ఇప్పటికే ఈ స్థావరం నుండి తన సైనికులలో మెజారిటీ మందిని ఐరోపా దేశాల్లో ఉన్న మిలటరీ బేస్ లకు తరలించగా ఇక మిగిలిన వారిని కూడా ఖాళీ చేసే పనిలో అమెరికా పడింది.
  • ఇరాన్ పైన భారీ స్థాయి దాడి చేసినప్పటికీ అక్కడి ప్రభుత్వం, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, సైన్యాన్ని ఓడించటం సాధ్యం కాదని అమెరికా నేషనల్ ఇంటలిజెన్స్ కౌన్సిల్, దాడికి ముందే ఒక నివేదికలో అమెరికా అధ్యక్షుడికి తెగేసి చెప్పింది. ఈ సంగతి లీక్ అయిన పత్రాల ద్వారా వెల్లడి అయిందని సి ఐ ఏ మాజీ ఎనలిస్టు ల్యారీ జాన్సన్ తన వీడియో బ్లాగ్ లో చెప్పాడు.

వ్యాఖ్యానించండి